Site icon Sanchika

నేను – నా సాహిత్యం: ఇందూ రమణ

[dropcap]వి[/dropcap]శాఖ సాహితి ఆధ్వర్యంలో 05.07.2018 నాడు విశాఖపట్నం ద్వారకానగర్ లోని బి.వి.కె.కళాశాలలో ప్రముఖ రచయిత  శ్రీ ఇందూ రమణ గారి “నేను – నా సాహిత్యం” అనే అంశంపై ప్రసంగ కార్యక్రమం జరిగింది. సభకు విశాఖ సాహితి అధ్యక్షులు డా. కోలవెన్ను మలయవాసిని గారు అధ్యక్షత వహించగా, ప్రముఖ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు విశిష్ఠ అతిథిగా వ్యవహరించారు.

శ్రీ ఇందూ రమణ గారిని సభకు పరిచయం చేస్తూ, శ్రీ రాజేశ్వరరావు గారు, విశాఖపట్నంలో రెండు వందలకు పైగా కథానికలు వ్రాసి వాసికెక్కిన అతి తక్కువ మంది రచయితలలో శ్రీ ఇందూ రమణ ఒకరని ప్రశంసించారు. వారి కథానికల మీద ప్రముఖ సాహితీవేత్త  డా. డి.వి.సూర్యారావు గారి సూచన మేరకు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొ. సిమ్మన్న గారి ఆధ్వర్యంలో ఒక విద్యార్థి పి.హెచ్.డి. చేస్తున్నట్లు కూడ శ్రీ రాజేశ్వరరావు గారు సభకు తెలియజేశారు.

తమ అధ్యక్షోపన్యాసంలో డా.మలయవాసిని గారు, ఇంత ప్రతిభగల రచయిత ఉండడం విశాఖవాసులకి గర్వకారణమని, వారు విశాఖ సాహితి సభ్యులు అయినందువలన విశాఖ సాహితి ప్రతిష్ట ఇనుమడించిందని అన్నారు.

తమ సాహితీ ప్రస్థానం గురించి మాట్లాడుతూ, శ్రీ రమణ గారు, చిన్నప్పుడే తనలో రచానాసక్తి కలగడానికి వారి అమ్మగారు కారణభూతులని అన్నారు. తన పదహారవ ఏట మొదలయిన సాహితీ ప్రస్థానంలో తనను ప్రభావితం చేసిన రచనలు, రచయితల గురించి, ‘ఉషాకిరణ్ మూవీస్ ‘ సంస్థలో అనుభవాలు, ఇందూ రమణగారు కూలంకషంగా వివరించారు.

విశాఖ సాహితి తరఫున శ్రీ రాజేశ్వరరావు గారు శ్రీ ఇందూ రమణ గారిని శాలువతో సత్కరించారు. సభకు ప్రముఖ సాహితీ వేత్తలు, సాహిత్యాభిమానులు హాజరయ్యారు. విశాఖ సాహితి కార్యదర్శి శ్రీ ఘండికోట విశ్వనాధం స్వాగత వచనాలు పలుకగా, విశాఖ సాహితి ఉపాధ్యక్షులు డా. కందాళ కనకమహాలక్ష్మి గారు వందన సమర్పణ గావించారు.

Exit mobile version