నేను నవల ఎలా వ్రాస్తాను?

3
2

[dropcap]‘న[/dropcap]వల’ అంటే సంస్కృతంలో ‘స్త్రీ’ అని అర్థం. ఆ పదంలోనే ‘కొత్తదనం’ (నవ) ఉంది. నా ఉద్దేశం, నవల కంటే కథ రాయడమే కష్టం. కథకు పరిధి తక్కువ. కానీ నవల విస్తృతి ఎక్కువ. ఈ మధ్య పేజీల పరిమితి, ఇన్ని వేల పదాలుండాలి, పేజీకి ఇన్ని లైన్లు ఉండాలి, ఇలాంటి నియమాలను రచయితలకు విధిస్తున్నారు. కానీ ‘సంచిక’ వారు మాత్రం రచయితలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, కథకైనా, నవలకైనా, కవితకైనా, వ్యాసానికినా, నిడివితో సంబంధం లేకుండా, సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ సందర్భంగా ‘సంచిక’ సంపాదకులు, సోదరులు శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారిని హృదయపూర్వకంగా ప్రశంసిస్తున్నాను. దీనికి ఉదాహరణ, ‘సంచిక’లో ధారావాహికంగా ప్రచురింపబడుతూన్న నా నవల ‘సాఫల్యం’! దాదాపు 650 పేజీల బృహన్నవల అది. ఇప్పటికి 34 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఇంకా సగం కూడా అవలేదు. “పాఠకులకు dragging గా అనిపిస్తుందేమో” అని ఎడిటర్ గారితో అంటే, “అదేం లేదు, ఎవ్వరూ అలా అనుకోవడం లేదు. వీలుంటే ఇంకా expand చేయండి” అని చెప్పారు!

నేను తెలుగు సాహిత్యంలో చాలా నవలలు చదివాను. నేను రాసింది నాలుగు నవలలు. నవలా రచనలో నన్ను ప్రభావితం చేసిన వారు – తెలుగులో కొమ్మూరి వేణుగోపాల రావు గారు, ఇంగ్లీషులో అలివర్ గోల్డ్‌స్మిత్. కొమ్మూరి వారి నవలల్లో నాకెంతో ఇష్టమైనది వారి ‘వ్యక్తిత్వం లేని మనిషి’. Personality Development అనేది ఈ రోజు హాట్ టాపిక్. దాన్ని ఆనాడే ఫిక్షన్ రూపంలో మనకందించారాయన. హీరో వ్యక్తిత్వం లోని బలహీనతలను ఎత్తి చూపిస్తూ, మనం అలా ఉండకూడదన్న సందేశాన్ని ఇచ్చారు. గోల్డ్‌స్మిత్ గారి Vicar of Wakefield కూడా నాకెంతో ఇష్టమైన నవల. తెలుగులో తొలి నవల అని చెప్పబడే, కందుకూరి వీరేశలింగం గారి ‘రాజశేఖర చరిత్రము’నకు అది ప్రేరణ అంటారు. అందులో రాజశేఖరుడు గారు బంగారాన్ని తయారు చేయాలనే obsession కు లోనయి సర్వమూ పోగొట్టుకుంటాడు. అది Vicar of Wakefield లో లేదు. అందుకే ‘ప్రేరణ’ అన్నాను. ‘రాజశేఖర చరిత్రము’ వీరేశలింగం గారి narrative skills కు దర్పణం పడుతుంది. కథనం సాఫీగా సాగిపోతుంది. పాఠకుడు మధ్యలో ఆగి, ఆలోచించే పని ఉండదు. తర్కాలు, వాదాలు ఉండవు. సుదీర్ఘ విశ్లేషణలుండవు. గోల్డ్‌స్మిత్ గారి Vicar of Wakefield లో కూడా అంతే. నవలలో ఒక Protagonist (ముఖ్య పాత్ర) ఉంటాడు. అతడే కేంద్ర బిందువు. కథంతా అతని చుట్టూనే తిరుగుతుంది. అతని బలాలు, బలహీనతలతో నిమిత్తం లేకుండా పాఠకులు అతన్ని ఇష్టపడతారు.

‘సాఫల్యం’ నవలలో నేననుసరించిన విధానం అదే. ఒక ఆరు దశాబ్దాల కాలాన్ని chronicalise చేయడానికి ప్రయత్నించాను. ఆ క్రమంలో, సమాజంలో వచ్చిన మార్పులు, వ్యక్తుల స్వభావాల్లో వచ్చిన మార్పులు, ముఖ్యంగా నేను పని చేసిన ఇంటర్మీడియట్ విద్యారంగంలోని మార్పులను అక్షరీకరించాను. ఎక్కడా నెరేషన్‍లో ఒక ‘social document’ అనే భావన రానీయకుండా అవన్నీ కథలోనే ఒదిగిపోయేట్లు జాగ్రత్తపడ్డాను. మొదటి నుంచి నాకు సానుకూల దృక్పథం అంటే ఇష్టం. అదే కదా ఈ ప్రపంచాన్ని నడిపించేది! నవల ఆద్యంతమూ, ఈ సానుకూల దృక్పథమే తొణికిసలాడేలా ‘సాఫల్యాన్ని’ తీర్చిదిద్దాను. ప్రతి వారం పాఠకుల స్పందనలు చూస్తుంటే కొంతవరకు సఫలీకృతుడయ్యాననే అనిపిస్తుంది.

‘సాఫల్యం’ మీ జీవిత చరిత్రా? అని కొందరు అడుగుతూంటారు. Autobiography కి, నవలకు చాలా తేడా ఉంటుంది. కొంత వరకు నా వ్యక్తిగత జీవితం నవలకు బేస్. అంతే గాని, అది నా జీవిత చరిత్ర కాదని సవినయంగా మనవి చేసుకుంటుననను. ఏ రచయితా, నేనే కాదు, తన జీవితానికి సంబంధం లేకుండా, రచనలు చేయలేడు.

“No writer can escape from his life” అన్నారు ఛార్లెస్ డికెన్స్. ఆయన ‘అలివర్ ట్విస్ట్’ రాసినపుడు అది ఆయన జీవితమే అన్న వారికి ఆయన చెప్పిన సమాధానం అది. డి. హెచ్. లారెన్స్ రాసిన ‘సన్స్ అండ్ లవర్స్’ కూడా autobiography నే అని అన్నారు. దానికాయన ఇచ్చిన సమాధానం

“From subjective to objective, literature transcendents itself to enlighten people”.

Subjective element లేని రచనలు చాలా తక్కువ. అసలు రచయిత రాసేదే తన భావాలను, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, పాఠకుల ముందు ఆవిష్కరింప చేయడానికి. ‘From particular to general’  అనేది సాహిత్యానికి మూల సూత్రం. మనకు తెలుగులో ఉన్న ‘అర్థాంతరన్యాసాలంకారం’ అదే.

మా తండ్రిగారు బ్రహ్మశ్రీ, పౌరాణిక రత్న, శతావధాని పాణ్యం లక్ష్మీ నరసింహ శాస్త్రి గారి వద్ద సంస్కృత కావ్యాలు చదువుకున్నాను. ఇంగ్లీషులో చాలా గొప్ప పుస్తకాలు, సాహిత్య విమర్శలు మాకు ఎమ్.ఎ.లో పాఠ్య గ్రంథాలుగా ఉండేవి. తెలుగు ప్రబంధాలు, కావ్యాలతో పాటు నవలలు కథలు విపరీతంగా చదివాను. ఇప్పటికీ చదువుతున్నాను. ఇప్పటికీ చదువుతూ ఉన్నాను. సాహిత్యం ద్వారా నేను పొందిన అవగాహనను, జ్ఞానాన్ని పాఠకులకు అందివ్వాలనేది నా తపన. అదంతా Abstract గా కాకుండా, fiction గా, జనరంజకంగా మలచి, పాఠకులను educate చేస్తునే, వారికి మానసికోల్లాసం కలిగించాలని అనుకున్నాను. ఇదేదో నా ఘనత కాదు. ఆనందవర్ధనుడు తన  ‘ధ్వన్యాలోకము’లో ‘కావ్యమ్ యశసే, అర్థకృతే, వ్యవహారవిదే, కాంతాసమ్మితయోపదేశ యుజే’ అని కావ్యప్రయోజనాన్ని చెప్పాడు. కావ్యము అంతే రచన కవికి కీర్తిని, పరమార్థాన్ని (డబ్బును కాదు) తెచ్చి, పాఠకులకు వ్యవహార జ్ఞానాన్ని కలిగించాలి. ఇదంతా ఎలా జరగాలి? ఒక ప్రియురాలు తన ప్రియునికి ఎంతో మురిపెంగా చెప్పి ఒప్పించినట్లుండాలన్నాడు ఆయన. ఇంగ్లీషు సాహిత్య విమర్శలో కూడా జాన్సన్, హాజ్లిత్, ఆర్నాల్డ్ లాంటి వారు ‘pleasure aspect’ ను glorify చేశారు. “Poesy instructs as it delights”. ఇదే సూత్రాన్ని నేను నవలా రచనలో అనుసరిస్తాను.

Narrative మధ్యలో ఎన్నో ఇతర విషయాలు ప్రస్తావనకు వస్తూ ఉంటాయి. సాహిత్య విమర్శనా పరిభాషలో దీన్ని digression (విచలనం) అంటారు. ఇది రెండు రకాలు. 1. Constructive Digression 2. Unconstructive Digression. రెండవ దానిని Destructive Digression అనేవారు కూడా ఉన్నారు. ప్రతి రచయితతో ఎంతో కొంత digressive element ఉంటుంది. మల్లాది రామకృష్ణశాస్త్రి, కొడవటిగంటి, శ్రీపాద వారి రచనల్లో ఇది చాలా తక్కువ. విశ్వనాథ వారి రచనల్లో ఇది ఎక్కువ. కానీ అది constructive గా ఉండి మన విషయ పరిజ్ఞానానికి దోహదం చేస్తుంది. Unconstructive Digression కు ఉదాహరణ రంగనాయకమ్మ గారు. కథ ఒక పేరా, తర్వాతి పది పేరాలు కమ్యూనిస్టు దృక్పథంతో దాని విశ్లేషణ. అలా చేయడం వల్ల the very purpose of the work is defeated. ఆమె ‘జానకి విముక్తి’ నిస్సందేహంగా  గొప్ప నవలే. కానీ Unconstructive Digression వల్ల readability కి విఘాతం కలుగుతుంది. కొంచెం తగ్గించవమ్మా అని పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు అడిగితే, కుదరదు పొమ్మన్నారట ఆవిడ. విధి లేక నవల సీరియల్‍ను మధ్యలో ఆఫేశారట పురాణంవారు. ఇంగ్లీషులో Joseph Andrews, digression కు పేరు. Digression వేరు, retrospective narration వేరు.

నా నవలా రచనలో కూడా digression ఉంటుంది. కానీ కథలో భాగంగా ఉంటుంది. ‘సాఫల్యం’లో వంటకాలు, రుచులు, వండే విధానం అక్కడక్కడా ఉంటాయి. అవి నా కథల్లో కూడా ఉంటాయి. అవి కొంచెం తగ్గిస్తే మంచిదని గురుతుల్యులు సింహప్రసాద్ గారు అన్నారు. కానీ, తిండి కూడా మానవ జీవితంలో ఒక ముఖ్య భాగమే. రుచికరమైన వంటలను ఇష్టపడనివారెవరు? యూట్యూబ్‍లో ఇవి కూడా ఒక ముఖ్యమైన భాగమే. ‘సాఫల్యం’లో పట్టుపురుగుల పెంపకం గురించి కొంచెం lengthy గానే ఉంటుంది. పాఠకులు విసుగు పడతారేమో అనుకున్నా. ఎవరూ complain చేయలేదు. ఒక గ్రామీణ బ్యాంకు మేనేజరు గారు నాకు ఫోన్ చేసి “సెరికల్చర్ డిపార్టుమెంటు వారి ఓరియంటేషన్ ప్రోగ్రాంకు ఒక రోజంతా హాజరయ్యాను. దాని కంటే మన నవలలోనే బాగా వివరించారు సార్” అన్నారు.

‘గుండె తడి’ అనే నవల ఇటీవలే రాశాను. ‘తపస్వి మనోహరం’ వాళ్ళు దాన్ని డైరక్టుగా ప్రచురిస్తున్నారు. బహుశా ఆగస్టులో రావచ్చు. డి. హెచ్. లారెన్స్ ‘సన్స్ అండ్ లవర్స్’ లోని ‘Oedipus Complex’ ను ఇతివృత్తంగా తీసుకొన్నాను.

జాగృతి వారపత్రిక నవలల పోటీకీ ఒక నవల రాశాను. ‘జయభారత జనయిత్రీ’ దాని పేరు. మన దేశంలో మైనారిటీలు, రాజకీయ పార్టీలు ఓట్ల కోసం వారిని చేసే appeasement, హిందూ మతం ఎదుర్కుంటున్న సవాళ్ళు – ఇదీ ఇతివృత్తం. మరి సెలెక్ట్ అవుతుందో లేదో చూడాలి.

పూర్తిగా మా కర్నూలు జిల్లా మాండలీకంలో ‘మహా ప్రవాహం’ అనే నవల రాశాను. గ్లోబలైజేషన్ వల్ల గ్రామీణ జీవితం ఎన్ని మార్పులకు లోనైందనేది థీమ్. స్వాతి వారపత్రిక పరిశీలనలో ఉంది. వాళ్ళకు బిర్యానీలు కావాలి. నా నవల కర్డ్ రైస్ మరి. చూద్దాం, ఏమవుతుందో!

‘సాఫల్యం’ నవల ద్వారా నాకు మంచి పేరు వచ్చింది. దానికి ‘సంచిక’ సంపాదకులు కస్తూరి వారే కారణం. దాదాపు అర్ధ శతాబ్దం క్రిందటి జీవితాన్ని, అందులో తమను తాము ఐడింటిఫై చేసుకుంటూ, పాఠకులు మమేకమై పోతున్నారు. అసలు మానవ జీవితానికి సాఫల్యం ఏమిటి? ఆధ్యాత్మికత ద్వారా మాత్రమే అది సాధ్యమా? మామూలు మనిషి కూడా దాన్ని సాధించవచ్చా? అనే ప్రశ్నలకు జవాబులు నా నవలలో దొరుకుతాయి.

‘దవడ కండరం బిగుసుకోవడం’, ‘భృకుటి ముడి పడడం’ లాంటి stock పదబంధాలు నాకు నచ్చవు. చక్కని తెలుగును వ్రాయడం నాకిష్టం. ఇంగ్లీషు వాక్య నిర్మాణాన్ని తెలుగులోకి తీసుకురావడం ఎబ్బెట్టుగా ఉంటుంది నాకు. ‘అతడొక్కసారిగా ఎంత భావోద్వేగానికి లోనయ్యాడూ అంటే…’ ఇలా. ఇంగ్లీషులో so-that-not అనే complex sentence కు మక్కికి మక్కీ. ఇంకా ‘ఏదైతే ఉందో’ అని మాటిమాటికి చెప్పడం కూడా నాకు నచ్చదు. అవన్నీ మన తెలుగు వాక్య నిర్మాణాలు అనిపించుకోవు. అలాగే పాఠకుడిని ‘information’ అనే నీళ్ళ తొట్టిలో ముంచి ఉక్కిరిబిక్కిరి చేయడం నాకు రాదు. ఎన్నో సంస్కృత సూక్తులు, తెలుగు పద్యాలు, ఇంగ్లీషు నానుడులు నా నవలల్లో ఉంటాయి. కాని అవి కథాకథనంలో అంతర్భాగాలుగా ఉంటాయి. రచయిత ఒక పూర్తి entertainer కాదు, preacher కాదు. రెండూ క్లాష్ అవకుండా balance చేసుకునేవాడే మంచి రచయిత అని నా అభిప్రాయం.

***

ఈ రచనని రచయిత స్వరంలో వినవచ్చు:
https://youtu.be/DU4aDilQlIY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here