[dropcap]ఆ[/dropcap]లోచనల సీతాకోక చిలుకలు ఎగిరెను
అనుక్షణం మది పుస్తకంలో
నన్ను నన్నుగా నిలువ నీయకుండా
సమయం సందర్భంతో పనిలేదు
ఎవరు ఉన్నారా అని సంశయం అసలే లేదు
మనస్సు గదిలోకి జబర్దస్తీగా ప్రవేశించడం
అనుమతి అవసరమా అని దబాయింపు
నిజమే అడ్డుకునే శక్తి నాకు లేదే
బ్రతికేదే ఆ ఊపిరితో
ఎలా కాదనగలను?
శ్వాస లేని జీవిని కాలేనుగా
ఏదైనా రాస్తేనే తృప్తి పల్లకి ఎక్కటం
సంతోషం ఊరేగింపు
ఆనందాన్ని ఆస్వాదించటం
అదే లేని రోజు రోజు కాదే
కవులందరూ ఇంతేనేమో?
ఏదో లోకంలో పయనించే సాహిత్య పుంగవులని
కొందరు దూరంగా
మరికొందరు దగ్గిరగా
ఎవరి ప్రవర్తన ఎలా ఉన్నా
సమాజానికి మంచి చేసే దిశలో
సైనికుడిలా ఎప్పుడూ
కలం ఆయుధంతో నిటారుగానే!