నేనూ శ్రీమంతుణ్ణే

0
2

[dropcap]రో[/dropcap]డ్డు మీద రయ్యిన దూసుకుంటు వెళుతోంది  నా కారు. కారులో కూర్చున్న నేను ఒక్కసారి ఠీవిగా నా వంక, నా కారు వంక పరిశీలించి చూసుకున్నాను. చాలా గర్వంగా, మరింత గొప్పగా అనిపించింది. ఇదంతా కేవలం నా గొప్పతనమే. నా తెలివితేటలు, ప్రతిభకు నిదర్శనంగా ఈ దర్జా, దర్పం నాకు దక్కాయి. ఒక గొప్ప ‘బిజినెస్‌మాన్‌’గా నన్ను నిలిపాయి. ఒక పల్లెటూళ్లో పుట్టి, పెరిగిన నాకు ఇంత గౌరవం, పేరు ప్రతిష్ఠలు దక్కాయంటే అదంతా కేవలం నా స్వయంకృషి. రెండు రోజుల క్రితం నా కొడుకు పుట్టిన రోజు ఎంతో ఘనంగా జరిగింది. ఎంత ఆర్భాటంగా నేను ఏర్పాటు చేసిన పార్టీకి పెద్ద పెద్ద ప్రముఖులంతా హజరయ్యారు. వచ్చిన వాళ్ళంతా నా గొప్పతనాన్ని ప్రశంసించడం చూసి నా గర్వం మరింత  రెట్టింపయింది. నగరంలోకెల్లా ఖరీదైన హోటల్లో, అత్యంత ఖరీదైన బట్టలు, నగలతో నా భార్య, పిల్లలు మిలమిల మెరిసిపోతూ ఉంటే, అందరూ వాళ్ళ వంక ఈర్ష్యగా చూస్తూ ఉంటే నాకు కలిగన ఆనందం చెప్పలేను. నా ఆనందానికి భంగం కలిగిస్తూ గతుకుల రోడ్డులో కారు ఒక్కసారిగా అటు, ఇటు ఊగింది.

నా ఆనందాన్ని కాసేపు ప్రక్కన పెట్టి, “డ్రైవర్ కారాపు ఎక్కడన్నా, కాఫీ తాగుదాం” అన్నాను.

ఒక చిన్న టీస్టాల్ ముందు కారు ఆపాడు డ్రైవర్.

“ఇక్కడ ఆపావే? పెద్ద హోటల్ ఏం లేదా?” అడిగాను.

“లేదు సార్, ఈ  రోడ్డులో అన్నీ చిన్న టీస్టాల్సే.”

ఇక తప్పదన్నట్లు క్రిందికి దిగాను. డ్రైవరే కాఫీ తెచ్చిచ్చాడు. ఆ పరిసరాలేవీ నా స్టేటస్‌కి తగ్గట్లుగా లేవు. నాలుగు రోజులకొకసారన్నా పెద్ద పెద్ద హోటల్సలో పార్టీలకు అటెండయ్యే నేను ఇక్కడ టీ తాగడం ఏంటి నాన్సెన్స్. సిటీలో పెద్ద ఇల్లు, డబ్బు, చిటిక వేస్తే పలికే నౌకర్లు, కోట్లలో ఆస్తి. ఇంత గొప్ప స్థితిలో ఉన్న నేను, ఇలా ఇక్కడ కాఫీ తాగడం, ఛీ, ఛీ అనుకున్నాను. ఇదంతా ఆ సుధాకర్ వల్లే. నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది నాకు.

ఆ రోజు సుధాకర్ ఉన్నట్లుండి ఆఫీసుకొచ్చాడు. వాడలా  ఆఫీసుకి, ఇంటికి రావడం నాకు ఇష్టం ఉండదు. అసలు ఆ పల్లెటూరు మనుషులెవరు నాకు నచ్చరు. అందుకే ఐదారేళ్ళుగా ఆ ఊరి ముఖమైనా చూడలేదు నేను. అమ్మ నాన్న ఉన్నంత కాలం రమ్మని పిలిచినా వెళ్ళలేదు. మట్టి రోడ్లు, మురికి కాలవలు, నాగరికత తెలీని ఆ ప్రపంచం అంటేనే చిరాకు నాకు. అందుకే ఆ ప్రపంచం నుండి దూరంగా వచ్చేశాను. అనుకున్నది సాధించాను. నా వల్ల ఆ ఊరికి గొప్ప పేరు. ‘మన ఊరి వాడే’ అంటూ ఊరందరి దృష్టిలో ఆకాశమంత ఎత్తకు ఎదిగాను. నన్ను పలకరించే ధైర్యం కూడా ఆ ఊరి వాళ్ళేవరికీ లేదు. ఆ సుధాకరే అప్పుడప్పుడు ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటాడు. ఇప్పుడూ, ఆ పల్లెటూళ్ళో ఏదో వాటర్ ట్యాంక్ కట్టాడట. దాని ఓపెనింగ్‌కి నేను రావాలట. రానని ఎంత చెప్పినా, కుదరదని వాదించినా వినిపించుకోలేదు. ఆఫీసు కొచ్చి మరీ వెంటపడ్డాడు. ‘సరే ఒకసారి వెళ్తే పోయ్యదేముంది, మన హోదాని కూడా అందరికీ చూపించనట్లవుతుంది’. అందుకే ఇలా బయలుదేరాను. ఆ ఊళ్ళోనే సుధాకర్ స్నేహితుడు గోవిందు ఉండేవాడు. వాడు కూడా ఇలాగే విసిగిస్తూ ఉంటాడు. అప్పుడెప్పుడో ఒసారి హస్పిటల్ కట్టిస్తున్నాం, చందా కావాలంటు నలుగురు ఊరి వాళ్ళను వెంటేసుకొచ్చాడు. నా ఇల్లు, హోదా చూసేసరికి అందరికీ కళ్ళు తిరిగిపోయాయి. ఇదంతా సొంతదేనా అంటూ యక్ష ప్రశ్నలు. ఆ గోవిందుగాడేదో సూపర్ బజార్ నడుపుతున్నాట్ట. ‘వెధవ చాలీ చాలని బ్రతుకులు’. తలచుకుంటుంటేనే ఈసడింపు కలిగింది నాకు. గతుకుల రోడ్డులో కారు కుదుపులకు ఆలోచనలోంచి బయటపడ్డాను.

“జాగ్రత్తగా చూసి నడపు కారు రిపేరు కొచ్చేలా ఉంది” అన్నాను.

“వచ్చేశాం సార్. ఇంకెంత ఐదు నిముషాల్లో ఊళ్ళో ఉంటాం” అన్నాడు డ్రైవర్. దూరం నుండే పెద్ద పెద్ద అక్షరాలతో, పెద్ద బ్యానర్ కనపడుతోంది. ‘ప్రముఖ వ్యాపారవేత్త రామకృష్ణ బాబుకి స్వాగతం’ అంటు నా గర్వం మరింత రెట్టింపయింది. ఈ అదృష్టం ఎవరికీ రాదేమో. పుట్టి పెరిగిన ఊరికే అతిథిగా రావడం. కారు ఊళ్ళోకి ప్రవేశించింది. సుధాకర్, గోవిందు మరో పది మంది అక్కడే నిలబడి ఉన్నారు, నాకు స్వాగతం పలుకుతూ కారు దిగగానే ‘వెల్‌కమ్’ అంటు సుధాకర్ నా మెడలో దండ వేశాడు. “రా రా” అంటు గోవిందు నా చేయి పట్టుకున్నాడు.

‘ఛీ. చీ అతిథికి గౌరవంగా నమస్కరించాలని ఒక్కడికీ తెలీదా? నాగరికత లేని మనుషులు’ అనిపించింది. ఎవరో ఒకాయిన ‘పద బాబూ’ అని దారి చూపించాడు. ఇంకొకాయన “బావున్నారా బాబు” అన్నాడు. వాళ్ళెవరు నాకు తెలీదు. అది నాకు తగ్గ గౌరవంలా అనిపించలేదు. కానీ ఆ సమయంలో ఏం చెయ్యలేను. అందుకే ఊరికున్నాను.

“మా ఇంటికి వెళదాం రా. కాసేపు విశ్రాంతి తీసుకుందువుగాని” అంటూ బయలుదేరదీశాడు సుధాకర్. ‘బాబోయ్ ఆ ఇరుకు గదుల్లోనా నా బస?’ అనుకుంటు బయలుదేరాను. దారి పొడవునా చెప్తూనే ఉన్నాడు ఊరి గురించి. “గుర్తు పట్టావా ఇదే మన స్కూల్. ఇప్పుడు బిల్డింగ్ కట్టారనుకో. ఇప్పుడు పెద్ద ఆట స్థలం కూడా ఏర్పాటు చేశాం. వర్షం వచ్చినా చదువుకెలాంటి ఇబ్బంది లేదు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్. ఇది అంజనేయస్వామి మండపం. మనం చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు పెద్ద గుడి కట్టారనుకో. మన చిన్నప్పుటిలా లేదు. ఊరంతా మారిపోయింది. నువ్వు గమనించావా” అన్నాడు. నేను తల ఊపి ఊరుకున్నాను. ఇంతలో సుధాకర్ ఇంటి ముందు కారు ఆపాడు. ఒకప్పటి పెంకుటిల్లు స్థానంలో డాబా ఉంది. ఇంటి ముందు కొద్దిగా గార్డెన్ పెంచాడు. వాళ్ళింట్లో విశాలంగా ఉండే గదిలోకి తీసుకెళ్ళాడు. ఏ.సి కూడా ఉంది. ‘అబ్బో నా కోసం ఏర్పాటు చేసి ఉంటాడు’ అనుకున్నాను. “రెస్ట్ తీసుకో అలసిపోయి ఉంటావు” అంటూ ఏ.సి ఆన్ చేసి వెళ్ళి పోయాడు. ఈ ఊరు నేను ఊహించిన దానికన్నా భిన్నంగా ఉందా అనిపించింది. ఆ ఏముంది మట్టి వాసన తప్ప. పూర్తి చెయ్యల్సిన బిజినెస్ పనులు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఇక్కడ ఈ పల్లెటూళ్ళో విసుగ్గా ఉన్నా అలుపు అనేది నన్ను ఓడించి నిద్రలోకి దింపింది.

తర్వాత కాసేపటికి ఓపెనింగ్‌కి వెళ్ళాను. అక్కడ స్టేజీ చాలా ఆర్భాటంగా అలంకరించబడి ఉంది. సుధాకర్, గోవింద్‌తో సహా చాలా మంది చేరారక్కడ. ముందుగా నా చేత ప్రారంభోత్సవం చేయించారు. తర్వాత నన్ను మాట్లాడమన్నారు. నేను మాట్లాడనన్నాను. అలవాటు లేదని తప్పుకున్నాను. ఊరి ప్రెసిడెంటు అనుకుంటా మాట్లాడటం మొదలు పెట్టాడు. “మనది మాములు కుగ్రామం. ఈ రోజు ఇంతలా అభివృద్ది చెందింది అంటే, ఆ గొప్పతనం అంతా ఈ ఊరి యువకులకే చెందుతుంది. ఊరంతా సిమెంటు రోడ్లు నిర్మించుకున్నాం. గవర్నమెంటు హాస్పిటల్, హైస్కూలు వరకు చదువు, ఈ సంవత్సరం కాలేజీ కూడా రాబోతోంది మన ఊరికి. మంచి నీటి సమస్యను అధిగమించడానికి నీళ్ళట్యాంక్‌ను నిర్మించుకున్నాం. మన గోవిందు సూపర్‌‌బజార్ ఏర్పాటు చేశాడు. దాని వల్ల హోల్ సేల్ రేట్లకే సరుకులన్నీ పొందగలుగుతున్నాం. ప్రభుత్వ సహకారంతో వ్యవసాయంలోని మెళుకువలు నేర్చుకుని అధిక ఫలసాయాన్ని పొందుతున్నాం. పశువైద్యశాల నిర్మించుకుని, పశువులను సంరక్షించుకుంటున్నాం. యువకులంతా తమ ఒక రోజు ఆదాయాన్ని ఊరి అభివృద్ధికి ఇవ్వాలని ప్రతిజ్ఞ చేయడంతో, మన ఊరి ఖజానా ఎప్పుడూ నిండుగా ఉంటుంది. ముఖ్యంగా గోవిందు, సుధాకార్ పెద్ద చదువులను చదివి కూడా సొంత ఊరు మీద మమకారంతో అభివృద్ధి చెయ్యడం హర్షించదగ్గ విషయం. ఇలాంటి ఆదర్శవంతమైన యువత దక్కడం మన ఊరికే సాధ్యమైంది. ఈ ఊరికి ఇంత ఇచ్చిన సుధాకర్, గోవిందులను మరో సారి అభినందిస్తున్నాను” అంటూ ముగించాడు. తర్వాత, మరో ఇద్దరు కూడా ఇవే మాటలు చాలా గొప్పగా, ఆ ఊరి యువత గురించి, ముఖ్యంగా నా స్నేహితుల గురించి చాలా గొప్పగా చెప్పారు. మన ఊరు ఆదర్శ గ్రామంగా రాష్ట్రపతి బహుమతి అందుకోవడం ఖాయం అంటు వాళ్లు వివరించారు. దాంతో ఆ ప్రదేశమంతా చప్పట్లతో మారు మ్రోగిపోయింది. ఆ చప్పట్లమోతకు, ఆకాశమంత ఎత్తలో నేను నిలబెట్టుకున్న నా కీర్తి పతాకం నేల వాలిపోయింది. ‘నేనేం సాధించాను’ అని ప్రశ్నించుకున్నాను. డబ్బు అని సమాధానమిచ్చింది నా అంతరాత్మ. అతిథిగా అక్కడ కూర్చునే అర్హత లేదని వెక్కిరించింది. అమ్మా, నాన్నా ఉండగా ఎన్నో సార్లు ఊరికి రమ్మని పిలిచారు. కాని నాలోని అహంకారం నన్ను అడుగు పెట్టనివ్వ లేదు. కానీ ఈ రోజు ఈ ఊరికి ఇంత చేసిన నా స్నేహితులు నాకన్నా గొప్పవాళ్లు, అని నా అంతరాత్మ నాకు వివరించింది. మరు క్షణం లేచి నిలబడి నా స్నేహితుల భుజాల చుట్టు చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాను. ఇక ముందు, ఊరి అభివృద్ధిలో నేనూ భాగస్వామినవుతానని, నా ఊరిలో నాకూ కొంత చోటిమ్మని కోరుతూ అందరినీ అర్థించాను. మరో సారి చప్పట్లు మారు మ్రోగాయి. ప్రెసిడెంటుగారు నన్ను అభినందిస్తూ నా చేతిలో చెయ్యివేశారు. నాన్న నా ఎదురుగా ఉండి నన్ను ఆశీర్వదించినట్లునిపించింది. సాయంత్రం వరకు స్నేహితులతో సరదాగా ఊరంతా తిరిగి, ఇదినా ఊరు, వీళ్ళంతా నా వాళ్ళు అనే భావాన్ని మనసునిండా నింపుకుని తిరుగు ప్రయాణమైనాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here