నేను ఏ నేరం చేయలేదు

2
1

[డా. రాయపెద్ది వివేకానంద్ రచించిన ‘నేను ఏ నేరం చేయలేదు’ అనే థ్రిల్లర్ కథని పాఠకులకు అందిస్తున్నాము.]

 

[dropcap]నా[/dropcap]న్ బెయిలబల్ కేసు కింద బుక్ చేసి నన్ను బంధించటానికి పోలీసులు వస్తున్నారు అన్న ఊహనే నన్ను వణికించింది.

“ఈ రోజు సాయంత్రం లోగా మిమ్మల్ని అరెస్టు చేయటానికి పోలీసులు వస్తున్నారు. మీరు ఎక్కడికి పారిపోకుండా వాళ్ళకి లొంగిపోండి, లేదంటే మీ మీద నేరారోపణలకి బలం చేకూరినట్టు అవుతుంది” ఫోన్‌లో అవతలి నుంచి వినిపిస్తున్న మాటలలతో అయోమయంలో మునిగిపోవటం నా వంతయ్యింది

నాకు ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు.

నేనొక పేరుమోసిన గూండానో, డాన్‌నో, రౌడీ షీటర్‌నో అయుంటే మీరు పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

నేను ఒక సామాన్యుడిని. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్కలు చెప్పుకునే లెక్చరర్‌ని.

నాకు పోలీసులంటేనే భయం. ఎక్కడో దూరంగా ట్రాఫిక్ పోలీసు కనపడితేనే ఒకటికి రెండు సార్లు మోటారు సైకిల్ లైసెన్సు ఉందో లేదో అని జేబు తడుముకుని, హెల్మెట్ స్ట్రాఫ్ గట్టిగా బిగించుకుని మరీ ముందుకు వెళతాను.

అలాంటి నాకు ఇది ఖచ్చితంగా చాలా పెద్ద షాకింగ్ విషయమే కద.

నేను సెల్ ఫోన్‍ని గట్టిగా పట్టుకుని ఊపిరి బిగబట్టి అవతల వైపు నుంచి వచ్చే మాటలని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను.

గొంతు పెగల్చుకుని ఎలాగో అడిగాను

“హలో మీరు నాతోనే మాట్లాడుతున్నారా, అసలు మీరెవరు?”

ఒక క్షణం నిశ్శబ్దం తరువాత అవతలి వ్యక్తి అడిగాడు “మీ పేరు రాజశేఖరమే కద”

“అవును”

“మీ ఆధార్ కార్డ్ నెంబర్ మీ చిరునామా చెబుతాను. అవి సరి అయినవో కాదో చెప్పండి “

కార్డ్ నెంబర్, నా చిరునామా ఫోన్‌లో అవతలి వ్యక్తి చెబుతున్న వివరాలతో సరిగ్గా సరిపోయాయి. నా పై ప్రాణాలు పైనే పోయాయి

***

అసలేమి జరిగిందో తెలుసుకోవాలంటే కొన్ని గంటలు వెనక్కి వెళ్ళాలి. రండి మీకు అన్నీ వివరంగా చెబుతాను.

మధ్యాహ్నం భోంచేసి కాసేపు కునుకు తీద్దామని అలా మంచం మీద వాలానో లేదో ఫోన్ మోగింది. ఏదో కొత్త నెంబర్ నుండి కాల్. తీద్దామనే లోగానే కట్ అయింది. ఇక నేనే రింగ్ చేశాను. నాకా క్షణంలో తెలియదు, ఒక గొప్ప ఆపదకి అత్యంత సామిప్యానికి వెళుతున్నానని.

అవతల రింగ్ అవటం తెలుస్తోంది. ఏదో పాశ్చాత్య వాద్య సంగీతం వినిపిస్తోంది. మధ్య మధ్యలో వారి కంపెనీకి కాల్ చేసినందుకు ధన్యవాదములు తెలుపుతూ ‘వేచి ఉండమని’ ఒక కంప్యూటరైజ్డ్ వాయిస్ ఇంగ్లీష్‌లో, హిందీలో తెలియజేస్తోంది.

అది ఒక పెద్ద అంతర్జాతీయ కొరియర్ కంపెనీ అని అర్థం అయింది. వాళ్ళ నుంచి నాకు కాల్ ఎందుకొచ్చిందబ్బా? వాళ్ళ కంపెనీలో నేను పార్సెల్ గానీ కొరియర్ గానీ ఏదీ బుక్ చేయలేదు.

ఇంతలో కాల్ లిఫ్ట్ అయిన ధ్వని వినిపించింది.

నేను ‘హలో’ అనగానే అవతల నుండి ఒక సూచన వినిపించింది. అది కూడా కంప్యూటర్ వాయిసే.

“మీరు పంపిన పార్సెల్ వెనక్కి తిరిగి వచ్చింది. మీరు దాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఒకటి నొక్కండి, లేదా మా ఆఫీసర్‌తో మాట్లాడలనుకుంటే రెండు నొక్కండి” అని ఆ సందేశం యొక్క సారాంశం.

హాయిగా కునుకు తీద్దామంటే లేకుండా ఇదెక్కడి గోలరా నాయనా! నేను ఆ కొరియర్ కంపెనీలో ఏ పార్సెల్ బుక్ చేయనే లేదు. అసలా కొరియర్ కంపెనీ చార్జెస్ సామాన్యుడికి అందుబాటులో ఉండవు. వాళ్ళు ప్రపంచంలోని ఏ దేశానికైనా పార్సెల్ స్వీకరిస్తారు. ఆ కంపెనీకే స్వంత విమానాలు, స్వంత విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. ఇక నౌకలకి, ట్రక్కులకి కొదవే లేదు.

అప్పుడప్పుడు క్రెడిట్ కార్డ్ కంపెనీ వారు ఆ కొరియర్ ద్వారా నాకు ఉత్తరాలు రెన్యూ అయిన క్రెడిట్ కార్డ్ బట్వాడా చేయటం వల్ల నాకు ఆ కంపెనీ పేరు ఎరుక.

రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఆ కొరియర్ కంపెనీ తాలూకు వ్యానులు పసుపు పచ్చ రంగులో చూడ ముచ్చటగా కనిపిస్తుంటాయి.

అంతే తప్పనిచ్చి ఆ కంపెనీకి నాకు అంతకు మించి వేరే ఏ ఇతర అనుబంధం లేదు.

ఆ కంపెనీ పేరు మీద ఉన్న గౌరవం వల్ల నాకు తెలియకుండానే రెండు నొక్కాను.

‘మీ కాల్ ట్రాన్స్ఫర్ అవుతోంది. వేచి ఉండండి’ అని సందేశం వినిపించింది.

కొన్ని రింగుల తర్వాత అటు వైపు నుండి ఒక మగ గొంతు వినిపించింది

“హలో మీ పేరు రాజ శేఖరం గారేనా?” అని

సంభాషణ యావత్తు ఇంగ్లీష్‌లో జరుగుతోంది.

అతని ఇంగ్లీష్‌లో వ్యాకరణ దోషాలు లేవు గానీ ఉచ్చారణ కాస్త నేలబారుగా ఉంది. ఉత్తర భారతదేశానికి చెందిన వాడు అని అతని యాస ద్వారా తెలుస్తోంది.

నేను అవునని చెప్పిన తరువాత అతను చెప్పటం కొనసాగించాడు

“రాజశేఖరం గారూ ఈ నెల పద్దెనిమిదవ తేది మలేషియాకి మీరు బుక్ చేసిన పార్సెల్ విమానశ్రయ కష్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. అది మలేషియాకి వెళ్ళలేదు”

“నేను ఏ పార్సెల్ బుక్ చేయలేదండి” ఎలాగో గొంతు పెగల్చుకుని చెప్పాను

“ఏమిటీ మీరు పార్సెల్ బుక్ చేయలేదా?” అవతలి వ్యక్తి కంఠంలో కాసింత ఆశ్చర్యం.

“మీరు కాసేపు లైన్‌లో వేచి ఉండండి” అని నన్ను అభ్యర్థించి నా కాల్‌ని హోల్డ్‌లో పెట్టాడు.

అవతల నుంచి నాకు లీలగా వారి మాటల వినిపిస్తున్నాయి

‘ఇదిగో మళ్ళీ ఇంకో అమాయకుడు మోసపోయాడు. డ్రగ్ మాఫియా వారు ఇంకో వ్యక్తిని బలి చేస్తున్నారు. ఇతను కూడా పార్సెల్ బుక్ చేయలేదట. ఇతని వివరాలు వాడుకుంటూ ఎవరో డ్రగ్ రాకెట్ వాళ్ళు పార్సెల్ బుక్ చేసినట్టు ఉన్నారు. హే భగవాన్ ఈ వారంలో ఇది పదో కేసు’

నాకు లీలగా వినిపిస్తున్నప్పటికి వాళ్ళ మాటల్ని అర్థం చేసుకోగలిగాను. నాకు వెన్నులో ఏదో జర జరా పాకినట్టయింది.

ఆ వ్యక్తి మళ్ళీ లైన్లోకి వచ్చాడు.

“వేచి ఉండినందుకు ధన్యవాదములు. మీరు ఇటీవల ఎక్కడైనా మీ ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నారా?” ఈ విడత మరొక కొత్త ప్రశ్న నా మీదకి సంధించాడు.

“ఒక్క నిమిషం” అని చెప్పి నేను వెంటనే మంచం మీద నుండి దిగి, కప్ బోర్డులో ఉన్న నా పర్స్ అందుకుని అందులో క్షేమంగా ఉన్న నా ఆధార్ కార్డ్ చూస్తూ అతనికి చెప్పాను

“లేదండి నా ఆధార్ కార్డ్ క్షేమంగా ఉంది”

“అయితే మీరు ఎక్కడన్న మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ ఇచ్చారా?”

అవతలి వ్యక్తి అడిగాడు

“ఇస్తూ ఉంటాము కదండీ, ఈ వేళ-రేపు, ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డ్ కాపీ అడుగుతుంటారు కద అడ్రస్ ప్రూఫ్ కోసం” నేను ఒకింత భయంగా అడిగాను.

ఈ సంభాషణ ఎక్కడికి దారి తీస్తోందో నాకు అర్థం కావటం లేదు.

“ఇంకో ప్రశ్న. మీరు మాస్క్‌డ్ ఆధార్ కార్డ్ ఇవ్వటం లేదా ఇలాంటి సందర్భాలలో?”

“నాకు మీ ప్రశ్న అర్థం కావటం లేదు. మాస్క్‌డ్ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి?” ఆశ్చర్యంగా అడగటం నా వంతు అయింది.

“హే భగవాన్! మీకు మాస్క్‌డ్ ఆధార్ కార్డ్ అంటే తెలియదా? ప్రభుత్వం వారు అన్ని ప్రచార సాధానాల ద్వారా అవగాహన కల్పిస్తూనే ఉన్నారు కద, అయిన మీకు అదేంటో తెలియదంటే ఎలా?”

“చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించేలా ఇవ్వాలి మీ ఆధార్ కార్డ్. అలా ఇచ్చే కార్డుని మాస్క్‌డ్ ఆధార్ కార్డు అంటారు. మీకు అలా ఇచ్చే అలవాటు లేకుంటే మీరు ప్రమాదాలని ఆహ్వానించినట్టే” అని కాసేపు ఆగి “అయాం సారీ రాజశేఖరం గారు. మీరు మీ ప్రమేయం లేకుండానే అంతర్జాతీయ డ్రగ్ రాకెట్‌లో ఇరుక్కున్నారు”

నాకు ఒక్కసారిగా నిద్ర మబ్బు ఎగిరిపోయింది. ఫోన్ చేతిలో పట్టుకుని స్థాణువులా కూర్చుండి పోయాను.

అదీ ప్రారంభం.

ఇక ఆ మధ్యాహ్నం నాకు నిద్ర లేదు అని అర్థం అయిపోయింది. నా బుర్ర మొత్తం శూన్యం ఆవరించింది.

అనేక సినిమాలలో అమాయకుడైన హీరోనో అతని స్నేహితులో ఇలా చేయని నేరంలో ఇరుక్కుని నానా కష్టాలు పడ్డ దృశ్యాలు అన్నీ వరుసగా సినిమా రీలులాగా నా కళ్ళ ముందర గిర్రున తిరుగుతున్నాయి.

అవతల వైపు నుంచి “హలో హలో” అని వినిపిస్తూనే ఉంది.

“రాజశేఖరం గారు మాకు ముంబాయి పోలీసులు అందించిన వివరాల ప్రకారం మీ క్రెడిట్ కార్డ్ నెంబర్లు చెబుతాను, అవి మీవో కావో సరి చూసి చెప్పండి”

కార్డ్ నెంబర్లు, ఆయా క్రెడిట్ కార్డులు జారీ చేసిన బ్యాంకుల పేర్లు సరిగ్గానే చెప్పాడు అతను.

అంతే కాదు, గత నెల రోజులగా నేను కార్డులు ఉపయోగించి చేసిన లావాదేవీల వివరాలు అణా పైసలతో సహా కరెక్టుగా చెప్పాడు.

“ఇది నేను పొరపాటుగా చేస్తున్న కాల్ కాదు రాజశేఖరం గారు. మీరే మా కొరియర్ కంపెనీ ద్వారా పార్సెల్ బుక్ చేసిన వ్యక్తి అని నిర్ధారణ చేసుకోవడానికి నాకు పోలీసులు అందించిన వివరాలు అన్నీ సరిఫొతున్నాయి.

మీరు ఈ కేసులోంచి తప్పించుకోలేరు. ఇది చాలా పెద్ద నేరం. మీరు ఇరుక్కోవడమే కాక ఎంతో పేరు ప్రఖ్యాతులున్న మా కొరియర్ కంపెనీనీ కూడా మీరు అప్రదిష్ట పాలు చేస్తున్నారు.”

“రాజశేఖరం గారూ! ఇది మీకు ఎంత షాకింగ్‌గా ఉంటుందో మేము ఊహించగలం. పైకి కనిపిస్తున్న ఆధారాల ప్రకారం అయితే మీరు ఈ నేరం చేశారు. అందులో సందేహం లేదు. కానీ నాకు తెలుసు ఇందులో మీరు అమాయకంగా కూరుకుపోయారు అని. ఇలాంటి సమయాల్లోనే మీరు నిబ్బరంగా ఉండాలి. ఇటీవల ఇలాంటి నేరాలు ఎక్కువ అవుతున్నాయని మాకు సైబర్ క్రైం పోలీసుల ద్వారా తెలిసింది.”

“ఇటీవలి కాలంలో ఇది పదో కేసు మా కొరియర్ కంపెనీ ద్వారా బుక్ అయిన పార్సెల్స్‌లో. ఈ దుండగులు మా కొరియర్ కంపెనీకి కూడా చెడ్డపేరు తెచ్చి పెడుతున్నారు. ఇది మాకు పెద్ద తలకాయ నొప్పిగా మారింది. చేయని నేరానికి మీరు, మా కంపెనీ కూడా ఇరుక్కున్నట్టు అయింది. మీకు పడే శిక్షతో పోలిస్తే మాకు పెద్ద శిక్ష పడకపోవచ్చు. కానీ పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ మేము కూడా తిరగాలి. మీకు సాయం చేయటానికి మా కంపెనీ నన్ను నియమించింది.”

“మీరు తప్పక ఈ కేసు నుంచి బయట పడగలరు. డోంట్ వర్రీ. మేము మీకు తోడుగా ఉన్నాం.”

అతని మాటలు నాకు కొండంత భరోసానిచ్చాయి.

అతను చెప్పటం కొనసాగించాడు

“మీ ఇంటికి హైదరాబాద్ క్రైం బ్రాంచి పోలీసులు వచ్చే లోగా ఒక పని చేయాలి, మీరు సైబర్ క్రైం పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి, మీ ఆధార్ కార్డ్ దుర్వినియోగానికి గురి అయ్యిందని. మీరు ఆన్‍లైన్ ద్వారా సులభంగా ఈ కంఫ్లైంట్ బుక్ చేయవచ్చు. నేను మళ్ళీ అరగంట ఆగి చేస్తాను. మీ కంప్లైంట్ నెంబర్ నాకు ఇవ్వండి. నేను ఇక్కడ ముంబై పోలీసులకి అప్డేట్స్ ఇస్తాను.” అతను చక చకా చెప్పుకుపోతున్నాడు.

“ఆ కంప్లైంట్‌లో మీరు స్పష్టంగా పేర్కొనాలి, మీ ఆధార్ కార్డ్ వివరాలు ఎవరో తప్పుడు ఉద్దేశాలతో వినియోగించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని. హైదరాబాద్ పోలీసులకి కంప్లైంట్ నెంబర్ చూపించి మీరు అరెస్టు కాకుండా చూచుకోగలరు. ఆ తరువాత మీరు వ్యక్తిగతంగా ముంబాయికి వచ్చి ఇక్కడి పోలీసులకి యావత్తు విషయం చెప్పాల్సి ఉంటుంది. నాకు తెలిసి ఒక అయిదారు నెలలలో మీరు ఈ కేసు నుండి పూర్తిగా బయట పడగలరు.”

అతను ఎంత నెమ్మదిగా చెప్పినా కూడా విషయం తాలూకు తీవ్రత నాకు అర్థం అవుతోంది. అయిపోయింది. అంతా అయిపోయింది. నేను ఇందులో పూర్తిగా కూరుకుపోయాను అని అర్థం అవుతోంది

ఏదో అద్భుతం జరిగితే తప్ప నేను ఇందులోంచి బయటపడలేను అని అర్థం అవుతోంది.

అతనే చెప్పాడు నా చెవుల్లో అమృతం పోసినట్టుగా

“మనం సైబర్ క్రైం పోలీసులకి మీ ఆధార్ కార్డ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దుర్వినియోగ పరుస్తున్నట్టు ఇచ్చే కంప్లైంట్ లోనే మీరు ముంబాయికి రానవసరం లేకుండా కూడా అభ్యర్థన చేద్దాం. కానీ డ్రగ్ రాకెట్ కేసులో క్రైం పోలీసులు గట్టిగా పట్టుపడితే మనం ఏమీ చేయలేము, మన ప్రయత్నం మనం చేద్దాం” అని అన్నాడు అతను.

“సరే నేను ఫోన్ పెట్టేస్తున్నాను. మీరు ఆన్‌లైన్‌లో కంప్లైంట్ ఇచ్చి ఆ నెంబర్ నాకు ఇవ్వండి అరగంట తరువాత” అంటూ ఆ వ్యక్తి ఫోన్ పెట్టేయ్యబోయాడు.

“హలో హలో! ఒక్క నిమిషం. నాకు వాళ్ళ వెబ్‍సైట్ వివరాలు తెలియవు, పైగా నాకున్న కంప్యూటర్ పరిజ్ఞానం శూన్యం. నేనేమి చేయాలి. మా ఇంటికి దగ్గరలో ఉన్న మీ సేవా కౌంటర్‌కి వెళ్ళి బుక్ చేయనా?” అమాయకంగా అడిగాను.

“పొరపాటున కూడా అలా చేయకండి. ఈ విషయాన్ని ఎంత గోప్యంగా వీలయితే అంత గోప్యంగా చేసుకోవాలి. ఈ డ్రగ్ మాఫియా చాలా భయంకరమైనది. మీ మీద వారు నిఘా పెట్టి ఉంటారు. మీరు అరెస్టు అయ్యేవరకు వారు మీ కదలికల మీద డేగ కన్ను వేసి ఉంటారు. మీకు విషయం తెలిసి పోయిందని, మా కొరియర్ సంస్థ మీకు సాయం చేస్తోందని తెలిసిన తక్షణం మీ ప్రాణాలు తీయటానికి కూడా వారు వెనుకాడరు. ఇటీవలి కాలంలో గుర్తు తెలియని అనేక మరణాలకి ఈ మాఫియానే కారణం. ఇంత మంచి వ్యక్తి ఎందుకు చనిపోయాడబ్బా అని మీరు అనుకున్న ప్రతి అనుమానాస్పద మరణం వెనుకా ఈ మాఫియా హస్తం ఉంటుంది.”

నాకు గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం ప్రారంభం అయింది.

“నేను ఉన్నదే మీకు సాయపడటానికి కద. ఉండండి ఆన్‌లైన్‍లో మీరు సైబర్ క్రైం పోలీసులకి కంప్లైంట్ ఇవ్వటానికి నేను సాయపడతాను.”

ఆపద్బాంధవుడిలా అతను ఆపన్నహస్తం అందివ్వటానికి సిద్ధపడ్డాడు.

“అలాగే” చిన్నగా మూలిగినట్టు అన్నాను నేను.

“‘వెబ్‍సైట్ ద్వారా కంప్లైంట్ ఇవ్వనక్కరలేదు. మరొక మార్గం ఉంది. వాళ్ళకి ఫోన్ చేసి మౌఖికంగా కూడా కంప్లైంట్ ఇవ్వవచ్చు. నేను వాళ్ళకి కాల్ చేసి మిమ్మల్ని కాన్ఫరెన్స్ కాల్లోకి తీసుకుంటాను” అని చెప్పాడు అతనే.

సైబర్ పోలీసులకి కాల్ ట్రాన్స్‌ఫర్ చేస్తానని చెప్పాడు. వాళ్ళకి కాల్ ట్రాన్స్‌ఫర్ చేసే లోగా అతను నాకు వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఎలా సమాధానం ఇవ్వాలో, అసలు కేసు ఏమిటో తదితర వివరాలు అన్నీ కూలకుషంగా ఇక అతను నాకు తర్ఫీదు ఇవ్వటం మొదలెట్టాడు.

మొదట పట్టుబడ్డ ఆ పార్సెల్‌లో ఏమేమి ఉన్నాయో అన్ని వివరాలు చెప్పాడు. ఆ వివరాలు అన్నీ నన్ను వ్రాసుకోమని చెప్పాడు.

డ్యూటీలో ఉన్న కష్టమ్స్ అధికారుల వివరాలు, వాళ్ళ ఐ.డీ నెంబర్లు చెప్పాడు. కేసు తాలుకు ఐడీ నెంబర్ చెప్పాడు. తన పేరు, తన ఐ.డీ నెంబర్ చెప్పాడు.

ఒకటికి రెండు సార్లు అవన్నీ నాతో చదివి వినిపించుకుని తృప్తి చెంది, ఇక ఆన్‌లైన్ సైబర్ క్రైం కంప్లైంట్ విభాగానికి కాల్ చేస్తానని చెప్పాడు.

వాళ్ళతో అతను మాట్లాడిన పిమ్మట నన్ను కాన్ఫరెన్సు కాల్ లోకి తీసుకుంటాను అని చెప్పాడు.

ఏవో కొన్ని మీటలు నొక్కిన శబ్దం తరువాత

“మీ కాల్ హోల్డులో ఉంచబడింది” అని హిందీలోనూ, ఇంగ్లీష్ లోనూ వినపడసాగింది.

అతను చెప్పటం ప్రకారం ముంబాయి నుంచి మాట్లాడుతున్నాడు, అలాగయితే మరాఠీలోనూ, హిందీలోనూ, ఇంగ్లీష్ లోనూ రావాలి. అలా కాకుండా హిందీలో రావడం నాకు కాస్త ఆశ్చర్యం కలిగించింది.

నేను ఐ.ఐ.టీ కోచింగ్ ఇవ్వటానికి కోటాలో పని చేసిన అనుభవం నాకు ఉపయోగపడింది ఇక్కడ. వారి యాసని వెంటనే పోల్చుకోగలిగాను. మన దేశంలో అధిక ఆన్‌లైన్ నేరాలు రాజస్థాన్ నుంచి జరుగుతున్నాయని విని ఉన్నాను.

కొన్ని నిమిషాల తరువాత మళ్ళీ అతను లైన్ లోకి వచ్చాడు.

“సర్! మీ గూర్చి అన్ని వివరాలు సైబర్ క్రైం పోలీసులకి చెప్పాను, మీరు ముంబాయికి రానవసరం లేదు, మీరు వారు అడిగే అన్ని ప్రశ్నలకి సరి అయిన సమాధానాలు చెబితే మీ కంప్లైంట్ ఆన్‌లైన్ లోనే నమోదు చేసుకుంటారు, మీరు అదృష్టవంతులు” అని ప్రకటించాడు.

ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోతోంది అతను రాజస్థానీ అని.

ఇప్పుడు లైన్ లోకి సైబర్ క్రైం ఆన్లైన్ కంప్లైంట్ విభాగం ఆఫీసర్‌గా చెప్పబడుతున్న వ్యక్తి వచ్చాడు. ఇతని భాష కూడా నేలబారుగా ఉంది.

అది పేరుకి ఇంగ్లీషే కానీ, చాలా తప్పులు ఉన్నాయి అతని వాక్య నిర్మాణంలో, ఉచ్చారణ కూడా చాలా నేలబారుగా ఉంది.

కొన్ని లాంఛనప్రాయమైన ప్రశ్నల తర్వాత అతను నేను ఊహించిన విషయమే చెప్పాడు.

“మీ ఫోన్‍కి ఓటీపీ వస్తుంది చెప్పండి. దాని తరువాత మీ కంప్లైంట్ ఆన్‌లైన్‌లో నమోదు అవుతుంది”

నేను అమాయకత్వం నటిస్తూ “అలాగేనండి” అన్నాను.

నేను మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి చూశాను, ఏదో నంబర్ నుంచి ఓటీపీ వచ్చింది. కానీ నేను “ఇంకా రాలేదండీ” అని బొంకాను.

పిల్ల పెళ్ళి కోసం అకౌంట్‌లో దాదాపు ఇరవై లక్షలు ఉంచుకున్నాను. బహుశా ఇలాంటి విషయాలు కూడా వాళ్ళకి తెలిసిపోతాయి అనుకుంటా.

కాకపోతే ఆ మొత్తాన్ని నేను కొత్తగా తెరచిన బాంక్ అకౌంట్లో ఉంచాను. దాని తాలూకు ఓటీపీ లన్నీ వేరే ఫోన్ నంబర్‌కి వస్తాయి.

ఏది ఏమైనా నాకు ఒక్కటే భరోసా, నేను ఓటీపీ చెబితే తప్ప వాడు నా అకౌంట్ నుండి డబ్బు డ్రా చేయలేడు.

వాడి కాల్‌ని మ్యూట్‍లో పెట్టి వేరే ఫోన్ నుంచి నా పాత మిత్రుడు ఒకతను పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పై స్థాయిలో ఉన్న వ్యక్తికి లైన్ కలిపాను వేగంగా.

దురదృష్టవశాత్తు లైన్ కలవలేదు.

నేను డెస్పరేట్‌గా రెండు మూడు తడవలు ప్రయత్నం చేశాను.

చేయగలిగిందేమీ లేక నా పోలీసు మిత్రుడికి విషయం మొత్తం ఆడియో మెసేజి ద్వారా వాట్సాప్‌లో పంపాను. ఈ నెంబర్ ని ట్రాక్ చేయండి, నేను వాడిని వీలయినంత సేపు మాటల్లో పెడతాను అని కూడా చెప్పాను, సినిమాల్లో హీరోలాగా ఫీల్ అవుతూ.

ఇక మళ్ళీ ఈ ఓటీపీ వ్యవహారానికి వస్తే, “ఏమిటి ఓటీపీ రాలేదా, ఉండండి” అని వినిపించింది అవతల నుంచి.

మా బాంకు వాడు పంపే ఓటీపీ ఆయుష్సు కేవలం తొంభై సెకన్లు మాత్రమే.

వాడు ఈలోగా మళ్ళీ మొదటి నుంచి వాడి కంప్యూటర్‌లో ప్రాసెసింగ్ చేసుకుంటూ రావాలి. అదీ నా పన్నాగం.

“ఈసారి వచ్చి ఉంటుంది చూడండి” మళ్ళీ ఓటీపీ పంపి చెప్పాడు వాడు.

నేను అదే పనిగా వేరే నాలుగంకెల ఓటీపీ చెప్పాను. వాడికి అది మ్యాచ్ కావట్లేదు.

వాడిలో ఉక్రోషం పెరిగి పోతోంది అనుకుంటా, విసురుగా చెప్పాడు, “మీరు ఏదో పాత ఓటీపీ చెబుతున్నట్టున్నారు. సరిగ్గా చెప్పండి” అన్నాడు కోపంగా.

వాడిని ఇలా దాదాపు అరగంట ఏడిపించాను.

ఈలోగా బాంకు నుండి నాకు మెసేజి వచ్చింది. “ఓటీపీ తప్పుగా కొట్టటంలో పరిమితిని మించి ప్రయత్నాలు చేయటం వల్ల తాత్కాలికంగా అకౌంట్‌కి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ సేవలు నిలిపి వేస్తున్నాము, వీలయినంత త్వరగా సమీపం లోని బ్రాంచికి వచ్చి అకౌంట్‌ని పునరుద్ధరించుకోవలసింది.” ఇది ఆ మెసేజి సారాంశం.

ఈ లోగా సైబర్ క్రైం డిపార్టుమెంట్ వాడిగా చెప్పుకుంటున్న రాజస్తానీ దుండగుడు ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ మన కొరియర్ వాడు లైన్ లోకి వచ్చాడు.

“మీకు మళ్ళీ సైబర్ క్రైం వాళ్ళతో కలుపుతాను ఉండండి” అంటున్నాడు వాడు.

“మీరు ఇక ఓటీపీలు పంపలేరుగా. నా పన్నాగం వల్ల నా అకౌంట్‌కి ఆన్‌లైన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి, మీ తాతలు అందరూ దిగి వచ్చినా మీరు నా డబ్బుని తీసుకోలేరు” అన్నాను స్పష్టంగా రాజస్తానీ యాసలో

“మీరు పొరపడుతున్నారు రాజశేఖరం గారు, హైదరాబాద్ పోలీసులు వచ్చి మిమంల్ని అరెస్టు చేసేలోగా మీరు సైబర్ కంప్లైంట్ చేసుకోవాలి. లేకుంటే మీకు బెయిల్ కూడా దొరకని జైలు శిక్ష పడుతుంది” వాడు చివరిసారిగా బెదిరించాడు.

“పోరా మోసకారీ! నీ వ్యవహారం మొత్తం నాకు తెలిసిపోయింది” అని వాడికి చెప్పాను.

అప్పుడు వాడు హిందీలో నాలుగు బూతులు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. వాడి బాధ వాడిది, కళ్ళ ముందే వాడికి డబ్బులు చిక్కినట్టే చిక్కి అందకుండాపోయాయి.

***

ఈ లోగా నా పోలీసు మిత్రుడు ఫోన్ చేశాడు

“రాజా! మనది వృథా ప్రయత్నం. వాళ్ళు వాడుతున్న సిం కార్డులు రాజస్థానీవే. కానీ వాళ్ళు రాజస్థాన్ నుంచి ఫోన్ చేయటం లేదు. ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఇంటర్నెట్ సర్వీసుల ద్వారా ఇలా కాల్ చేయవచ్చు. ఇంకా ఘోరం ఏమంటే, నీకు నీ నెంబర్ నుంచే కూడా కాల్ చేయవచ్చు, అంటే నీ స్క్రీన్ మీద నీ నంబరే కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సాఫ్ట్‌వేర్లు కూడా ఉన్నాయి. మనం జాగ్రత్త పడటం మినహా వీటిని ఇప్పట్లో అరికట్టలేము. అయాం సారీ.”

***

కేవలం అత్యాశపరులనే సైబర్ నేరస్థులు వల వేసి మోసం చేస్తారు అనుకునే వాడిని. ఖర్చు లేకుండా డబ్బు సంపాయించాలనుకునే దురాశాపరులో, తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి త్వరగా కోటీశ్వరులైపోవాలనుకునే ఆశపోతులో సాధారణంగా ఇలాంటి సైబర్ నేరస్థుల వలలో పడుతుంటారు. పరస్త్రీ వ్యామోహానికి లోనయ్యేవారు, అడ్డదారిలో అయినా సరే రాత్రికి రాత్రికి మిలియనీర్లు అవుదామనుకునేవారు, గేముల బారిన పడిన చపలచిత్తులో ఈ ఆన్‌‍లైన్‌లో ప్రలోభాలకి గురయ్యి డబ్బు పోగొట్టుకుంటారు.

సైబర్ నేరస్తుల చేతిలో మోసపోయే నిజమైన అమాయకుల శాతం చాలా తక్కువ నిజానికి.

నేను చాలా గడుసుగా ఉంటాను అనే అభిప్రాయం ఉంది నాకు. ‘ఈ డ్రగ్ స్మగ్లింగ్ చేయటం అనే నేరంలో ఇరుక్కున్నానేమో’ అనే భయాన్ని కలిగించి నన్ను కూడా వీళ్ళు భయాందోళనలకి గురి చేశారంటే, సైబర్ నేరస్థులు ఎప్పటికప్పుడు ఎంత తెలివిగా పన్నాగాలు పన్నుతున్నారు కద అని అనిపించింది.

వీళ్ళు తెలివిగా మనలో భయాన్ని కలిగించి మనలో ఆలోచనా శక్తి నశించి పోయేలా చేసి మనం వివశులం అయ్యాక తమ పని తాము చక్కబెట్టుకునే వారిలాగా తోచారు.

ఓహ్ మై గాడ్, ఈ రోజు లేచిన వేళ మంచిది అయింది.

(తస్మాత్ జాగ్రత్త. ఇది నూటికి నూరు పాళ్ళు నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా వ్రాయబడ్డది. కథా సౌలభ్యం దృష్ట్యా కాస్తా నాటకీయత రంగరించటం జరిగిగింది.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here