నియో రిచ్-10

0
2

[శారద అడిగితే మొదట రావు గారి గురించి చెప్పడం మొదలుపెడతాడు జయంతి. రావు రిటైరయ్యాకా, కొడుకులు పట్టించుకోలేదని చెప్తాడు. ఉన్నదంతా అమ్మేసుకుని ఓ హోటల్‌లో మకాం పెడతాడు రావు. ఒకరోజు వాంఛ తీర్చుకోడానికి అమ్మాయిని తెస్తాడో బ్రోకరు. ఆ అమ్మాయి తన కోడలని గుర్తించి, ఏం జరిగిందో అడుగుతాడు రావు. భర్త ఇల్లు వదిలిపోయాడాని, మరో మార్గం లేక ఈ పనికి వచ్చానని చెబుతుందామె. ఆమెకు కొంత డబ్బిచ్చి జాగ్రత్తలు చెప్పి పంపుతాడు రావు.  ఆ సమయంలో తనింట్లో రైడ్ జరగడం, ఆస్తులు పోవడం గుర్తొస్తుంది. తనని వరదాజు మోసం చేశాడని గ్రహిస్తాడు. గుండెపోటుతో చనిపోయాడు రావు అని చెప్తాడు జయంతి. తనకు తెల్సిన వరదరాజు గతం శారదకు చెప్తాడు జయంతి. తల్లీతండ్రీ లేని వరదరాజును ఓ కాటికాపరి పెంచాడనీ, జాన్ అనే వ్యక్తి సహాయంతో చిట్‍ఫండ్ వ్యాపారంలో రాణించి, ఒక్కో మెట్టు ఎదుగుతూ వెళ్ళాడని చెప్తాడు. కూతురు సినిమాల్లో హీరోయిన్‍గా సెటిల్ అయి తల్లిని తనతో మద్రాసు తీసుకువెళ్ళిపోతుంది. ఆ పిల్ల తనకు పుట్టినది కాదేమోనన్న అనుమానం వరదరాజులో ఉంటుంది. భార్యాకూతురు తనని విడిచి వెళ్ళడంతో ఒంటరి, అశాంతి జీవితం గడుపుతున్నాడు వరదరాజులు అని చెప్తాడు. శారద వెళ్ళిపోతుంది. కాసేపయ్యాకా, జయంతి కూడా బయటకు వెళ్ళబోతుంటే రవి వస్తాడు. ఏవేవో ప్రశ్నలు వేస్తాడు జయంతిని. తన తల్లీదండ్రీ – శారద జయంతిల పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారనీ, తేదీ నిర్ణయం కాగానే చెప్తాననీ అంటాడు రవి. ఇక చదవండి.]

[dropcap]ర [/dropcap]వి బయలుదేరాడు.

జయంతి కూడా బయటకి కదిలాడు.

తోవలో నళిని రెడ్డి కల్సింది. విష్ చేసింది. కానీ ఆగలేదు. పెంచలయ్య మూలంగానే దీనికి గీర అనుకున్నాడు. పెంచలయ్య తలలోకొచ్చాడు. నాల్గుగోడల మధ్య భర్త తోడిదే దైవంగా ఉండాల్సిన దాన్ని రాజకీయాలలోకి లాక్కొచ్చాడు. ఇలా చేసాడు. దానికితోడు వాడు మంత్రి అవడంతో –

అసలు పెంచలయ్యదే గమ్మత్తైన జీవితం. వెనక్కొచ్చి కారు ఇంటి వద్ద పార్కు చేసి మంచంపై నడుము వాల్చాక భూతంలా వాని గతం తలలో మెదుల్తూనే ఉంది. వాడు మంత్రి అయ్యాక కూడా వానికి తల్లిదండ్రు లెవ్వరో తెలవని స్థితి.

కన్న తల్లి – నేనేరా నీ తల్లిననీ, నీ తండ్రి ఫలానా అని కనపడి చెప్పలేదు.

ఒక బిక్షగాడు ఉండేవాడు. వాని పేరు ముసలయ్య. అలా ఎందుకు పెట్టారో ఎవరికి తెలియదు. వాడు బ్రహ్మచారి కాదు. పెళ్లీ పెళ్లామూ లేదు. వాడు తిరిగే రోజులలో రాజమ్మ అనే పనిపిల్లతో సంబంధం ఉండేది. రాజమ్మ పనిపిల్లే గాని కన్నెపిల్ల గాదు. అప్పటికి మూడు మనువుల్ని కాదని ఉంటున్న మనిషి. ఈ ముగ్గరి పొత్తున ఇద్దర్ని కన్నది. ఒకడు పురిట్లోనే పోయిండు. రెండోవాణ్ణి అక్కరున్నోడికి డెబ్బయి రూపాయలకి అమ్మేసుకున్నది. ఆనక పాచిపని చేసుకుంటూ కాలం గడిపింది. అట్టాంటి రోజుల్లో ముసలయ్యకు సంబంధం. పని చేసిన కాడ దొరికిన దాన్ని తను ఇంత తిని కొంత వానికోసం ఉంచేది. అలా నాలుగేళ్లు ముసలయ్యకు తోడిచ్చింది. ఆనక ఓసారి జవాన్ను లేపుకొని నెల్లూరి వైపు వెళ్లింది. ముసలయ్య రాజమ్మ కోసం వెతకలేదు కానీ రాత్రిళ్లు దాని లోటు గుర్తుకొచ్చి తలపునకొచ్చేది. నిద్ర పట్టక అపరాత్రి దాకా తిరిగేవాడు. ఆ తిరుగులాటలో రెండు నెలల తరువాత రాములమ్మ అనేది కనపడ్డది. దానెంట నాలుగేళ్ల పొరడున్నాడు. మాట కల్సినాక వివరాలు అడిగినాడు. స్థూలంగా మగడు పోయాడని చెప్పింది. తల దాచుకునేందుకు ఠికానా గూడా లేదని చెప్పింది. ఆ రోజే రాములమ్మను గుడిసెకు రమ్మన్నాడు. నీడనిచ్చాడు, గనుక తోడియ్యడానికి అభ్యంతరం చెప్పలేదు రాములమ్మ. అయితే ఇది మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. దానికీ ఓ కారణం ఉంది. పాచిపనికి కుదిరిన ఇళ్లల్లో పెళ్లాం చచ్చిన ఓ రసికుడు పరిమినెంటుగా ఉంచుకునేందుకు స్థిరాస్తి కొంత ఈవిడ పేర వ్రాసేందుకు ఇష్టపడడంతో ముసలయ్య మళ్లా ఒంటరి వాడయ్యాడు. అసలు మనిషి జన్మే ఒంటిది. ఒంటరిగా పుట్టి ఒంటరిగా పోవడమే విధాయకం. మధ్య మాత్రం తోడు లేంది బ్రతకలేడు. దాంతోనే సంతోషాలూ, కష్టాలూ. నెల తిరగుతుండగా సత్తెమ్మ అనే ఆవిడ కల్సింది. తాగుబోతు మొగుడి బాధలు తట్టుకోలేక పారిపోయి ఇట్టా వచ్చిందిట. దాన్ని గుడిసెకు వచ్చి ఉండమంటే ఉండనన్నది. గుడిసె అమ్మి పక్కాగా పెండ్లాడితే గని తోడు రానన్నది. గుడిసెను అమ్మేసాడు ముసలయ్య. తొమ్మిదొందలు చేతికొచ్చినాయి కాని సత్తెమ్మ జాడ దొరక లేదు. రెండూ చెడినట్లనిపించింది.

ఆడాళ్లంటే చికాకు కల్గింది.

అయితే ఎవరో ఒకరు, చిన్న పోరడైనా తోడుంటే బాగు అన్నదానికొచ్చాడు. అప్పుడు కొండయ్య గుర్తులోకొచ్చాడు. వాని అడ్డాలో చిన్నా చితక నూటఏబై మంది దాకా బిక్షగాళ్లుంటారు. వాళ్లందరికీ పక్కా ఠికానా ఏర్పాటు చేసాడు. పొద్దు పొడుపుతో వాళ్లను అడుక్కునే అడ్డాలలో వదిలి అర్ధరాత్రి అవుతుండగా తీసుకొస్తాడు. నడవగల్గిన వాళ్లు వాళ్లే చేరిపోతారు. వారి దగ్గరి పోగైన పైసలన్నీ ఇతనుంచుకుంటాడు. దీన్నో యాపారంగా మొదలెట్టి పదేళ్లలో మంచి లాభసాటి యాపారంగా తీర్చిదిద్దాడు. ఓ స్వంత ఇల్లు, పెళ్లాం, ఇద్దరు పిల్లలు. వాళ్లు కాన్వెంటున చదవడం. బ్యాంకు బ్యాలెన్సు. బాగా స్థిరపడ్డాడు కొండయ్య. అయితే కొండయ్య చేతి క్రిందకొచ్చిన ఎంత లక్షణమైన పోరడైనా అంగవైకల్యం పొంది జాలిగొలిపేలా కనిపించాల్సిందే. అట్టా చేసే అడ్డా ఎక్కించి వాళ్ళకు తిండి పెడతుంటాడు. వాని దగ్గరి కెళ్ళి “కొండయ్యా నాకో పోరడ్ని తోడియ్యి” అని అడిగాడు. పెద్దగా నవ్వాడు కొండయ్య. ఆనక తల ఊపి “వచ్చింది చెరి సెగం ఇమానంగ ఇస్తావేంది” అన్నాడు. “అట్టా కాదు. యాపారనికొద్దు. నాకు తోడు. నా ఒళ్లు మంచిగ ఉండడం లేదు. మళ్లా నీ ‘జరూరు’ లేకుండా ఒకణ్ణియ్యి” అని జాలిగ అడిగాడు.

“అయేతే ఈ పోరళ్లలో ఎవడు కావాల్నో ఏరుకో” అని పాతికి మంది పోరళ్లను చూపాడు. అందులో సరింగ ఉన్నోడు ఒక్కడు కళ్లబడలేదు. చూడగ చూడగా ఓ పోరడు పర్లేదేమో అనిపించాడు. వానికి ఎడం కన్ను లేదు. కాలు వంకరే కానీ మరీ అంత అవిటోనిలా కనపడం లేదు. మోఖాన పని ముఖం లచ్చణాలున్నాయి. “ఇగో వీణ్ణి నాకు వదులు” అని చెప్పాడు.

“ఓర్ని భలే ఏర్నివు ముసలోడా. తీస్కపో. కానీ నేను వాణ్ణి నూటా ఏభైకి కొన్నా. అదీ నాల్గు నెలల కితం. వాణ్ణి పనికి పనికొచ్చేట్లు చేసేసరికి సరిపోయింది. ఇప్పటికి వాని మీద ‘ఏగానీ’ అదాయం లేదు. నూటా ఏభై గాక నాల్గు నెలల పిడచలేసినా గదా. దాని కంత అని ఇచ్చి తీస్కుపో” అన్నడు.

“నేనంత ఇచ్చోకోలేను రా.”

“అయితే ఈడ నీకేం పని, బయటకు నడువు” అన్నాడు.

“ఇంకో మాట చెప్పు” బతిమాలిండు.

“ఇన్నూరిచ్చి తీస్కుపో అన్నాడు ముసలోడి మీద జాలి పడి.

రొండి నున్న పైసలు తీసి కొండయ్య చేతి నుంచి పోరణ్ణి తీసుకొని నడిచిండు. నడవబోతూ ఆగి “కొండయ్య వీని పేరేందన్నావు?” అడిగిండు. “వీని పేరా!” అని ఆలోచనలో పడి “ఆఁ కొన్నప్పుడు వీని పేరు అడగడం మరచిపోయాను” అని, “ఇగో! పెంచలయ్య అని ఒకడు – ఈడోచ్చే ముందే పారిపోయిండు. గా పేరుతోనే వీణ్ణిక్కడ పిలుస్తున్నది. నువ్వూ అట్టానే పిలువు” అన్నాడు. కొండయ్య పెదాలమీద అంతు మాలిన అపహాస్యం కనిపించిందా క్షణాన.

మారు మాటడక గుడిసికొచ్చాడు.

బొంత మీద కూర్చున్నాక “బిడ్డా నేను నీతో యాపారం చేయించను. నాకు తోడుగా ఉందువుగాని. నీ అయ్య లెక్క చూసుకో. కొడుకు లెక్క నేను చూసుకుంటాను. ఆఁ” అని చెప్పాడు.

“నీ పేరేంది రా?” అనడిగాడు.

మాటడలేదు. కాని వాడి కళ్లనుండి నీరుబికి క్రిందికి జారినయి.

పెదవి మాత్రం విప్పలేదు. కొండయ్య జైలు నుంచి బయటకు తెచ్చినందుకు కృతజ్ఞతగా చూసాడు.

“పెంచలయ్య అనే పిలవమంటావా మరి?” అనడిగాడు సముదాయించి.

తల ఊపాడు నీయిష్టం అన్నట్లు.

అంచేత పెంచలయ్య గానే పిలువబడతున్నాడు.

ఆనక వారం తిరగక్కుండానే సాంబయ్య అనేటోడి పాన్ కొట్టులో పెంచలయ్యను పనికి కుదిర్చాడు. కానీ అక్కడ అంతగా పని లేదు. ఆనక పెంచలయ్య బాగా బిజీగా ఉన్న జానయ్య కొట్లో కుదిరాడు. పని బాగా ఉండేది. దాన్ని చేసుకుంటూ వచ్చే పోయే వాళ్లను గమనిస్తూ దాన్ని ఒక బడిలా బ్రతుకుతున్నాడు.

అయిదు సంవత్సరాలు అక్కడే వ్యాపారం నేర్చుకుంటూ మనుషులను చదువుకుంటూ నౌకరీ చేసాడు. స్నేహితులూ కొందరు దొరికారు. అనేక మంది అనేక రకాల వ్యాసంగాల వారు గమనంలోకి వచ్చారు. వారిని గమనించి మెసలడమూ అవగతమైంది.

ఇక్కడ ఉంటుండగనే ముసలయ్య చనిపోయాడు. ఆ రాత్రి మాటాడాడు. మంచి నీళ్లు అడిగితే ఇచ్చాడు. త్రాగాక “ఇక పడుకో, పనికి పోయేటోడివి” అని నిద్రపోయాడు.

ప్రొదుట లేవలేదు. కట్టెగా కనిపించాడు.

ఎంత సుఖమైన చావు అనుకన్నారంతా.

గుడిసెవాసుల తోడుతో ముసలయ్యను మంచిగనే తగలెట్టాడు.

ఓ బాల బ్రాహ్మణ్ణి చూసి ఆవుదూడనొకదాన్ని ముసలయ్య పేర మీద దానం చేసాడు. అస్థికలు ఏరి గోదారిలోనూ కలిపాడు. ఈ తంతు ముగిసేప్పటికి ఇంకా ఆరు వందలు మిగిలినయి. ఇంత ఉడకేసుకొని తిని గుడిసెనే వెల్లకిలగా పడుకున్నాడు. పాక నడికొప్పున ప్లాస్టిక్ కాగితంలా కనిపించింది. అట్టాగే పడుకుని పాక మొత్తం చూసాడు. మరో రెండు పొట్లాలు చూర్లలో కనిపించనయి.

మూడింటిని తీసి పడుకున్న చాప మీద విప్పాడు. మొదటిది బాగా బరువు ఉన్నది. పావలాలూ, అర్ధలూ, పది పైసలూ ఉన్నయి. రెండోది బాగా తేలికగా ఉన్నది. అందులో రెండు వంద రూపాయల నోట్లు, రూపాయి కాగితాలూ ఉన్నాయి. మొత్తం అవి మూడు వందల ఎనభై. తనకు కూడా తెలీకుండా ఇలా దాచడం చిత్రంగా అనిపించింది. నడి కొప్పున మొదట కనపడిన మూట విప్పాడు. ముడి మీది ముడి ఇరవై ముళ్ల తరవాత నాల్గు బంగారు బిస్కెట్లు కనిపించి ఒంటిని వణికించినయి. అసలివి బంగారపువేనా అన్న అనుమానం వచ్చింది. ముసలయ్యకి ఎలా వచ్చినయి అన్నది అర్థం కాలేదు. అది బంగారమే అన్నది అర్థమయ్యాక అమ్మో నలభై తులాల బంగారం అనిపించి ఎలాగో అయ్యాడు.

కాసేపటికి నెమ్మళపడి పద్ధతిగా బంగారాన్ని పొయ్యిలో గుంత తీసి పాతిపెట్టి బయటకు నడిచాడు. ఉన్న చిల్లరా నోట్లూ షావుకారు కాలయ్య దగ్గర ఉంచమని ఇచ్చాడు.

“ముసలయ్య దాచుకున్నాడా?” అనడిగాడు తాను.

తలూపి జగన్నాధం కొట్టు కెళ్లాడు. పనిలో చేరాడు. కొట్టు కట్టేసాక ఇంటికొస్తుండగా “బంగారం ఉంది అమ్మి పెట్టాల” అనడిగాడు.

‘వీని దగ్గర బంగారమేంటి?’ అనుకొని “పట్రా రేపు అమ్ముతాను” అన్నాడు.

పెంచలయ్య బంగారం నడుంకు కట్టుకొనే వచ్చాడు. జగన్నాధానికి చూపాడు. అది నిజం బంగారమని అర్థమైంది. అంతా ఒకసారి అమ్మడం మంచిది కాదని పది సార్లు నెల రోజులలో అమ్మాడు.

నలభై వేలు వచ్చినయి. వేయి తీసి జగన్నాధానికి ఇచ్చి గుడిసెకొచ్చాడు.

ఇక అక్కడ ఉండడమే తప్పుగా అనిపించింది.

తెల్లారేప్పటికి మకాం మార్చాడు. అప్పటికి పెంచలయ్య వయస్సు పద్ధెనిమిది.

ఇక్కడే ఓ మామూలు సెంటరు చూసి పచారీ కొట్టును ప్రారంభించాడు.

వెనక ఆడోళ్లను పెట్టి సరుకు మంచిగ ఉండేటట్లు చూసాడు.

ఉద్యోగులను, పెద్దలను కలిసాడు. ఒకసారి చూడమని పిలిచాడు.

మంచి మన్నికయిన సరుకు దొరుకుతుందని భావన నాల్గో నెలలోనే వచ్చింది.

బ్యాంకు వ్యాపారంలో హోల్‌సేల్ మాదిరిగా చేసి ఓ ఆటో కొని హోమ్ డెలివరీ పెట్టాడు.

ఆర్డర్లు తెచ్చేందుకు ఇద్దర్ని పెట్టాడు. ఇది ఉద్యోగం చేస్తున్న ఆడవారికి బాగా అనిపించింది. దీనికి తోడు క్వాలిటీ పడనివ్వలేదు.

రెండు సంవత్సరాలు తిరుగుతుండగానే వటవృక్షం లాగా ఎదిగాడు. కలక్షను కుర్రాళ్ళకు స్కూటరు కొని పెట్టే స్థాయికొచ్చాడు. కొన్ని సిగరెట్లకు జిల్లా డీలరు అయ్యాడు. తను కారు కొనుక్కున్నాడు.

నాలుగో సంవత్సరం గడిచాక పెళ్లి చేసుకుంటే అనుకున్నాడు. సిగ్గు పడ్డాడు, ఒళ్ళంతా ఎలాగో అయింది. కాని ఏ కులపు పిల్లను చేసుకోవాలో అంతుచిక్కలేదు. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి చేస్తున్నది వ్యాపారం కనుక షావుకారుగానే ఉండాలనుకున్నాడు. బ్రాహ్మడితో మంతనాలు జరిపి ఇంటి పేరు, గోత్ర నిర్ణయం చేసుకున్నాడు బౌనామాగా.

డబ్బూ దస్కం తెలివి అదృష్టాన్ని చూసాక పెంచలయ్యకు పిల్లనిచ్చారు.

మంచిగా పెళ్లాడాడు.

ఇల్లాలయ్యాక సుశీల బోలెడు కట్నాన్ని తెచ్చింది. కనుక అంతగా దాని అందం చూడలేదు. కార్యం గదిలో అర్థమయ్యింది. ఇంత అదృష్టవంతుణ్ణి అని దిమ్మదిరిగిపోయాడు.

కాపురం సజావుగా సాగింది. రెండో ఏడు నిండే సరికి కొడుకు పుట్టాడు.

ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సినిమాహాలు కట్టడానికి శంఖుస్థాపన చేసాడు.

అలా ప్రారంభమైన పెంచలయ్య అదృష్టం వెనక్కి తిరిగి చూడాల్సిన పనిలేకుండా జెర్రిపోతు అంత వడిగా నడిచింది బెదరక చెదరక.

ఒకనాడు వ్యాపార లావాదేవీలను చూసుకుంటున్న తరుణాన ఈ ఎదుగుదలకు రక్షణ అవసరం అనిపించింది. పరిమితులు దాటిందని తెల్సినాక లోకానికి దృష్టి అంతా ఇటే ఉంటుందనేది అర్థమైంది. అందుకుగాను ఏదో ఒకటి చేస్తే తప్ప వ్యాపారాన్ని ఇంత ‘ఉసి’గా నడపడం కూడా అనవసరం అనిపించింది.

ఓ మంచి సందర్భం చూసుకుని రాజకీయ రంగప్రవేశం చేసాడు. టౌనులో ఉన్న పేదోళ్లందరికీ అన్నదానం చేసాడు. రిక్షాలాగేటోళ్లకు తడవకుండా ప్లాస్టిక్ కోట్లూ టోపీలూ కొనిచ్చాడు. మున్సిపాలిటీలో బజారు ఊడ్చే వారికి చెప్పులు కొనిపించాడు. మురికివాడలో తాటాకు కూడా వేసుకోనలేని కుటుంబీకులకు తాటాకు ఇప్పించాడు. అక్కడ శంభులింగం అనే పూజారి కం ఆయిర్వేద వైద్యుడుంటాడు. అతగాణ్ణి పిలిచి “నీకు మందుల కెంత పైకం అయితే అంత నెలకోసారి వచ్చి నా దగ్గర పట్టుకెళ్ళు. చిన్న చితక జ్వరాలకు, వగైరాలకు ఉచితంగా వైద్యం చేయ్” అని పురమాయించాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here