Site icon Sanchika

నియో రిచ్-13

[నళినీ రెడ్డిని ఛైర్‌పర్సన్‌గా ప్రకటించడాన్ని కొంతమందిలో అసంతృప్తి ఉన్నా బయటపడలేదు. పెంచలయ్య తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ హర్షించారు. ఈ సందర్భంలో నళినీ రెడ్డి గురించి గుర్తు చేసుకుంటాడు జయంతి. మధ్య తరగతి కుటుంబానికి చెందిన నళినీ డా. శ్రీధర్ రెడ్డిని వివాహం చేసుకుంటుంది. డాక్టరు గారికి ప్రమాదం జరిగి కాళ్ళు చచ్చుబడిపోతాయి. తనకి విడాకులిచ్చి వేరే వివాహం చేసుకోమన్నా నళినీ చేసుకోదు. ఇంతలో సాధారణ ఎన్నికలు వస్తాయి. పెంచలయ్య పార్టీ తరఫున అందరి అభిప్రాయాలు తెలుసుకుంటాడు. మునిసిపాలిటీ పరిధిలో ఉన్న నియోజకవర్గం కోసం ఇద్దరు సీనియర్ నేతలు పోటీపడతారు. ఉపాయంతో పెంచలయ్య వారిద్దరిని తప్పించి ఆ స్థానాన్ని తనకి ఇప్పించుకుంటాడు. ఆ ఇద్దరు నాయకులను మంచి చేసుకుంటాడు. ఎన్నికల్లో పెంచలయ్య పార్టీ గెలుస్తుంది. జిల్లా నుంచి మంత్రిగా ఎంపికవుతాడు పెంచలయ్య. పెంచలయ్యకు అభినందన సభ జరుగుతుంది. సభలో మాట్లాడుతాడు పెంచలయ్య. ఇక చదవండి.]

[dropcap]“నే[/dropcap]ను కర్తవ్యాన్ని మరచినప్పుడు నిష్కర్షగా మందలించండి. తప్పు జరిగిందనిపిస్తే దండించండి. నాతో ‘మంచి’ని చేయించుకొని మీ బిడ్డగా నన్ను కడుపున దాచుకోండి”. అని అందరినీ మరొక్కసారి చూసి “నిజంగా నా గొంతు తడి ఆరిపోతున్నది” అని (తన ఎదుగుదలకు మొదట పనికి వచ్చిన మనిషి స్టేజ్ పైననే ఉండడాన్ని గమనించి) అటుగా నడిచి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించాడు.

సభ మొదట ఆశ్చర్యపడి, పెద్దల ఎడ పెంచలయ్యకున్న అభిమానానికి, గౌరవానికి చాలా ముచ్చట పడిపోయారు. ఔరా అని ముక్కున వేలేసుకున్నారు (‘రెండో పెద్దమనిషి కూడా స్టేజ్ పైననే ఉంటే ఇరుకునపడే చచ్చేవాడ్ని, గాన అదృష్టవశాత్తు అనారోగ్య కారణాన రాలేకపోవడంతో బతికిపోయాను’ అనుకుంటూ) అందరికీ నమస్కరించి “ఇక నాకు మాటలు రావటం లేదు. పెద్దలు మాట్లాడుతారు” అని నమస్కరించి కూర్చున్నాడు పెంచలయ్య.

మొదటి పెద్దమనిషి ఆనందబాష్పాలను తుడుచుకుంటూ మైకు దగ్గరకు వచ్చి “నా జిల్లా ప్రజలకు నమస్తే. ఈ అదృష్టాన్ని నేను ఉహించలేదు. నేనుండగా ఈ జిల్లాకు మంత్రి పదవి దొరుకుతుందనే ఆశనూ వదిలేసాను. ఆ అదృష్టం మన పెంచలయ్యను వరించింది. నా ఆశీర్వాదానికి ఇంతటి బలం ఉందా అని ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాను. నేను పోటీలో ఉండాల్సిన ఈ నియోజకవర్గంలో పెంచలయ్యకు అవకాశం ఇచ్చి చాలా మంచి పని చేశాను అని ఇప్పుడు మీరంతా నన్ను అభినందిస్తున్నారు. నేను ముప్ఫై ఏళ్లుగా చేస్తున్న దానిని, సాధించలేని దానికి పెంచలయ్య వారసుడు కావడం చాలా ఆనందంగా ఉంది. అతి త్వరలో రాష్ట్ర నాయకత్వాన్ని కూడా చేపట్టాలని నా ఆకాంక్ష” అని కూర్చున్నాడు.

ఆనక నళినీ రెడ్డి మాటాడింది.

“కృషితోనాస్తి దుర్భిక్షం – అన్న ఆర్యోక్తిని పూర్తిగా నమ్మిన వ్యక్తి పెంచలయ్య, మనను ఆ బాటను నడిపినవాడు. అందుకే ఎన్ని అవాంతరాలు వచ్చినా, అన్ని ‘గళ్ళనూ’ జాగ్రత్తగా దాటి ఈ ఆటలో నెగ్గాడు. ఇంతెందుకు అసలు టికెట్టు కోసం దరఖాస్తు పెట్టినప్పుడే all out అయిన పెద్ద తలలెన్ని లేవు? జరుగుతున్న పరిస్థితులపై పూర్తి అవగాహన కల్గి ‘టైమ్లీగా’ (సమయానుగుణంగా) వ్యవహరించలగ దక్షత ఆయనలో మనకు స్పష్టంగా కనిపించింది. అదే మనని ఇప్పటిదాక సజావుగా నడిపించిందని గర్వంగా చెపుతున్నాను.

ఇంతెందుకు ఈయన లేకుంటే మనం మున్సిపాలిటీని సాధించ గలిగేవారమా? ఆయన రాకతోనే యువత పార్టీలోకి వచ్చి జవసత్వాలునిచ్చింది. యువతనే కార్యకలాపాలకు బాధ్యత వహించింది. అదే పార్టీకీ కొత్త ఊపిరినిచ్చింది. పార్టీ పైన దాని నడక పైన మనందరికీ విశ్వాసాన్ని పెంచేలా చేసింది. ఇది మనందరకూ తెల్సు. మహిళలను ఆకర్షించగల్గిన, అభిమానించ గల్గిన పార్టీయే ఎప్పుడూ విజయం సాధిస్తుంది. మన గత ఎన్నికల చరిత్ర చెప్పింది. తెలుగుదేశాన మొట్టమొదటి చైర్‌పర్సన్‌గా నన్ను ఎన్నిక చేసి చరిత్ర సృష్టించారు జిల్లాలో.

జిల్లాలో మన మున్సిపల్ ఏరియా పట్ల శ్రద్ధ కనపరచిన పెంచలయ్య గార్కి రాష్ట్రాన్ని చూడాల్సినదని పార్టీ భావించింది. ఇది మన మొత్తం జిల్లాకి మంచి జరిగేందుకు అవకాశం ఇచ్చింది. ఇతోధికంగా జిల్లా అభివృద్ధికి శాయశక్తులా పాటుపడి, అభివృద్ధి పథకాలను నడుపుతారని ఆశిస్తున్నాను…” అని ముగించింది.

ఆనక ఇద్దరు ముగ్గురు మాట్లాడారు. సభ ముగిసింది.

టౌను మున్సిపాలిటీ వారు విందు ఏర్పాట్లు చేశారు.

అది మొదలు మూడు రోజులు జిల్లా అంతా పర్యటించాడు పెంచలయ్య. వెంట నళినీ రెడ్డి వుంది. పార్టీ కార్యదర్శి శివరావు మొదటి పెద్దమనిషి చాలా వరకు సభల్ని కవర్ చేశారు. వెళ్తూ వెళ్తూ నళినీ రెడ్డి ఇంట్లో రెండు ఘడియలు ఆగాడు.

అది మొదలు జిల్లా రాజకీయాల చర్చ ఎప్పుడూ హైద్రాబాదులోనే తప్ప ఇక్కడ జరగలేదు. అంత తీరుబాటు దొరకలేదు.

అయితే నళినీ రెడ్డి భర్తకు విడాకులిచ్చి పెంచలయ్యతో ఉండిపోతుందట అన్న నీలి నీలి వార్తలు బయటకొచ్చాయి.

‘ఇలాంటి ఆలోచన నీకు వచ్చినా తప్పే’ అని మందలించాడు నళినీ రెడ్డిని. డాక్టరుగారు మాత్రం లోకం ఏమనుకున్నా పట్టించుకోలేదు. నళినీ ఏమిటో ఆయనకు పూర్తిగా తెల్సుగనుక.

కానీ నళినీ రెడ్డి లోకల్‌గా మంత్రిలా ప్రవర్తించి జిల్లా యంత్రాంగాన్ని కదిలించేది. ఉద్యోగుల్లో మార్పు వచ్చింది. దాన్ని వారు జనం మీదకు మోపారు.

జనందేముంది ఏమనరు, చూస్తూనే ఉంటారు. అవకాశం దొరికనప్పుడు నిర్ణయం నిర్దాక్షిణ్యంగా చూపుతారు.

పెంచలయ్య మంత్రి అయ్యాక సంపాదించుకున్న ఆస్తుల వివరాలను అనుకోకుండా ప్రకటించాడు. పార్డీ వాటిని వినీ వినట్టుగా చూస్తూ ఊరుకుంది తప్ప సమాధానం కాని ఖండనగానీ చేయలేదు.

రాను రానూ జిల్లాలో అనాకారిగా ఉంటున్న పెద్ద మనుషులందరూ పెంచలయ్యకు వ్యతిరేకంగా ఏకమయ్యారు.

డా. శ్రీధర్ రెడ్డితో నళినీకి శారీరికంగా సంబంధం ఎలాగు లేదు, సంవత్సరన్నర నుండి మాటామంతీ కూడా మానుకుంది.

దాంతో డాక్టరుగారు త్రాగుడికి అలవాటు పడ్డారు. ఇద్దరు నౌకర్లను చికాకులో దెబ్బలు కూడా కొట్టడంతో వాళ్లు కూడా మానుకున్నారు. నళినీ రెడ్డి మానసిక వ్యాధుల స్పెషలిస్టు డా. పింటోను పిలుచుకుని వచ్చి డాక్టరుగారిని చూపించింది. పూర్తి బాధ్యతలు ఆయనకే అప్పగించింది.

వీరి సంసారానికి గుర్తుగా కల్గిన కూమారుడు ‘నైనిటాల్’లో చదువుకుంటున్నాడు. ఈవిడే వెళ్లి చూసి వస్తూవుంటుంది. బాబు ఇక్కడికి రాడు.

నళినీ రెడ్డి అహంకారిగా కనిపిస్తుందే తప్ప దోషిలా జయంతికి ఎన్నడూ అనిపించలేదు. పైగా డాక్టరుగారంటే నళినీకి అంతులేని ప్రేమ. శారీరిక కలయికకు ఆయన అనర్హుడైనా విధిని నిందించుకుందే తప్ప ఆయనపై నున్న ప్రేమను వదులుకోలేదు.

ఈ ట్రాక్ నుంచి బయటపడడానికి అంత టైం పట్టలేదు గాని జయంతి మనసంతా అదోలా అయింది. శివరాం ఇంటికి వెళ్దామనుకున్నాడు. అటు మలిపాడు కారును.

శారదా పార్వతీ మాటాడుకుంటూ హాలులో కనిపించారు.

“రా అన్నాయ్యా నీ కోసమే చూస్తున్నాను” అంది పార్వతి దగ్గరికొస్తూ. ‘చెప్పు’ అన్నట్లు చూసి కూర్చున్నాడు.

“పెళ్లి తేదీ కుదిరింది అన్నయ్యా” అన్నది.

శారద వైపు చూసాడు ఒకసారి. వాయిదా దాటిందో లేదో ఆవిడకు గదా తెలిసేది.

“పది రోజులే ఉంది.”

“శివరాం రాగానే నా దగ్గరికి రమ్మను” అని లేచాడు.

శారద లేచి తన గదిలోకి వెళ్లింది.

“కాఫీ త్రాగి వెళ్దువుగాని” అంటున్నా వినిపించుకోలేదు జయంతి. కారు స్టార్టు అయింది.

జయంతి ఇంటి లాన్‌లో ఆగింది.

కారు దిగుతుండగానే ఆకలినిపించింది. ఫ్రిజ్ తెరిచి నీళ్ళు త్రాగాడు.

పక్క మీదకెక్కాడు.

కళ్లు మలిగినయ్.

కళ్లు తెరిచే సరికి నాల్గు కావస్తూ కనిపించింది.

రవి కనిపించాడు, బుద్ధిగా కూర్చుని.

లేచి ముఖం కడుక్కుని వెళ్లి రవి ముందు కూర్చున్నాడు.

నౌకరు బిస్కట్లూ టీ తెచ్చి పెట్టాడు.

తింటూ “రవీ ఏంటి సంగతి?’ అనడిగాడు.

“ఆఁ ఆ ప్రశ్న” అని నసిగాడు.

“ఏది?”

“రామాయణం”

“చెప్తాను”

“అమ్మ రమ్మన్నది.”

“నాన్న ఏడి?”

“ఇంకా రాలేదు.”

“అయితే పద” అని బయలుదేరాడు.

శివరాం ఇంటికి చేరారు. శారదా పార్వతి గడపలోనే ఎదురయ్యారు.

“రమ్మన్నావట?”

“నేనా?” అంది పార్వతి ఆశ్చర్యపోతూ.

“అవునమ్మా నా వాయిదా పోయి నెల అయింది. నేనడిగిన రామాయణం ప్రశ్నలు తప్పుకుంటున్నారు. నువ్వు రమ్మన్నట్లుగా చెప్పాను.” అన్నాడు రవి.

శారద నవ్వుతూ లోనికెళ్లింది.

“పెళ్లి ఇక్కడే ఈ ఇంటనే చేయమన్నారు” అంది పార్వతి.

తల ఊపాడు జయంతి.

“పెళ్లి టైంకయనా గుర్తుంచుకొని వచ్చేయ్. ఇది శారద పెళ్లి కాదు నీది కూడా” అని నవ్వింది పార్వతి.

శారద కాఫీ కలుపుకొని వచ్చింది

“నేను కాఫీ త్రాగను” అన్నాడు రవి.

“కాఫీ తింటావా?” అన్నాడు నవ్వుతూ జయంతి.

“రవీ నా కోసం ఈ సారికి త్రాగు” అంది శారద.

 “O.K కాఫీ తీసుకుంటాను, కాని ఓ కండీషన్” అన్నాడు రవి.

‘మళ్లీ వీడు రామాయణాన్ని రంగంలోకి తీసుకొచ్చేలా ఉంది’ అనిపించింది జయంతికి.

“రామాయణాన్ని వాల్మీకి వ్రాసాడంటారు. చెప్పాడంటారు. ఏది నిజం?” అన్నాడు.

‘వచ్చేసాడురా బాబోయ్’ అనుకొని అంతగా కాలుతున్న కాఫీని రెండు గుటకల్లో ముగించేసి బయల్దేరేందుకు రడీ అయ్యాడు జయంతి.

“నాకు తెల్సిన మేరకు చెప్తాను. బహుశా ఇది తప్పు కూడా కావచ్చు”. అని “రామభద్రుడు వాల్మీకీ సమకాలీనులై ఉండొచ్చు, కురు పాండవులకు వ్యాస ఋషిలా. ఇక అప్పడు వాడుక భాష సంస్కృతం. భాష ఉచ్చారణ వరకే ఉన్నట్లు అనిపిస్తుంది. లిపి అప్పటికి ఉన్నట్లు అనిపించదు. రామాయణాన అనేక సందర్భాలలో లేఖలు పంపే అవకాశం ఉంది. కాన గుర్తుగా ఏవో వస్తువులను మాత్రమే పంపినట్లుగా ఉంది. అందుకే అక్షర క్రమం లిపి రూపేణా లేదనేగదా! అంచేతనే వాల్మీకి రామాయణ గాథను మెరికల్లాంటి శిష్యులతో కంఠస్థం చేయించాడు. వినసొంపుగా పాటలా ఆటకు అనుగుణంగా ఉంది కనుకనే ధర్మనిరతని బోధించేదిగా ఉంది కనుక రామాయణాన్ని అక్షరబద్ధమైయే దాకా జానపదుల నోళ్లల్లో నిలచిపోయింది. ఆనక తాళపత్రాలపై కెక్కి మనకి దక్కింది” అని ఆగింది శారద.

సరస్వతీ దేవిని వింటున్నట్లు శారదనే చూస్తూ విన్నారిద్దరూ.

“రామ కథ ఎంత గొప్పదంటే ఇవ్వాళ్టికీ మంచి రాజు లేదా పాలకుడు కనిపిస్తే రాముడంటుంటారు. మంచి రాజ్యాన్ని రామరాజ్యం అంటారు. మంచి దంపతులు కళ్లు బడితే సీతారాములులా ఉన్నారని అంటారు.

మంచి పెళ్లి జరిగితే సీతాకల్యాణంలా జరిగిందనడం వింటాం. శ్రీరామచంద్రుడు తరువాత ఈ నేలను ఎందరు రాజులు, ధీరాధిపతులు ఏలలేదు. ఎందరు పుట్టలేదు, అయినా రాముణ్ణే మరవలేదు. ఆయన ముద్ర మనకు దిక్చూచి అయింది. అంతటి మహనీయ కథ రామాయణం.

ఇంతెందుకు రవీ, ఆయన పాదుకలు సుభిక్షమైన పాలననిచ్చాయి. ఆయన్ను నమ్మిన సుగ్రీవుడు కిష్కిందకు రాజయ్యాడు.

ఆయన్ను ఆరాధించిన ఆంజనేయుడు మనకు ఆరాధ్యుడయ్యాడు. చివరకు సేతువు కట్టేప్పుడు సాయపడ్డ ఉడత కూడా పునీతమైంది.

అడవికెళ్లెప్పుడు పడవ వేసిన గుహుడు, పళ్లు రుచి చూసి పెట్టిన శబరి. అన్ననే సర్వస్వంగా ఎంచిన భరతుడు…. ఇలా ఎందరో…” అని ఓ క్షణం ఆగి,

“రవీ ఈ సృష్టికే మొదట కావ్యం రామాయణం. దాని సృష్టికర్త వాల్మీకి” అని ఆగింది రవినే చూస్తూ.

“ఆంటీ ఇది నా ప్రశ్నకైతే జవాబు కాదు. కానీ నీకు రామాయణం పైన మంచి అవగాహన ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఇక నుంచి మనం తరుచూ రామాయణం గురించి మాట్లాడుకుంటూ ఉండవచ్చు” అన్నాడు రవి.

టైం చూసుకొని లేచాడు రవి.

(ఇంకా ఉంది)

Exit mobile version