[జయంతి శివరాం ఇంటికి వెళ్ళి తమ వ్యాపారాల గురించి మాట్లాడుతాడు. అతనితో చర్చలు పూర్తయ్యాక క్లబ్బుకి బయలుదేరుతాడు. దారిలో సికందర్ ఎదురవుతాడు. అతన్ని తీసుకుని క్లబ్‌కి వెడతాడు. సికందర్ ఏదో బాధలో ఉన్నట్టు గమనించి వివరాలు అడుగుతాడు జయంతి. తన కూతురు మీరా ఎవరినో పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిందని చెప్తాడు. సికందర్ గతం తలచుకుంటాడు. ఆర్కియాలజీ విభాగంలో సికందర్ చేసిన ఉద్యోగం, అది మానేయడం, సొంతంగా రహస్యంగా ఓ చోట దిబ్బని తవ్వి, అంతులేని సంపదని దక్కించుకోడం, పెద్ద వ్యాపారవేత్తగా ఎదగడం అన్నీ గుర్తు చేసుకుంటాడు జయంతి. అతనితో పాటు అతని ఇంటికి వెళ్ళి అతని భార్యని ఓదారుస్తాడు. వాళ్ళకి ధైర్యం చెప్పి, కూతుర్ని అల్లుడిని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళతో మామూలుగా ఉండమని నచ్చజెప్తాడు జయంతి. అక్కడ్నించి తిరిగి వస్తూ డా. పాండేని కలిసి భద్ర గురించి అడుగుతాడు. అతను బానే ఉన్నాడనీ, త్వరలోనీ కోలుకుంటాడని డాక్టర్ చెప్తాడు. అక్కడ్నించి శంకర శాస్త్రి ఇంటికి వెళ్ళి తనకి చేసి పెట్టాల్సిన పని గురించి గుర్తు చేస్తాడు జయంతి. దారిలో శాలిని ఎదురవుతుంది. ఆమెను కారులో ఎక్కించుకుని బయల్దేరుతాడు. ఆమె తనకు చేయాల్సిన పని చేయలేదు కాబట్టి, ఆమె తండ్రిని కనిపించకుండా చేయగలనని బెదిరిస్తాడు. ఇక చదవండి.]
[dropcap]శా[/dropcap]లిని ఒళ్లంతా చమటతో తడిసింది. కొద్దిగా ఒణుకుతున్నది కూడా.
“దుబైలో ఉన్న మా యూనిట్‌కు తోల్తున్నాను. అక్కడ మనుషులు కావాలి. మీ నాయన ఆరోగ్యంగానే ఉన్నాడు గదా. నమ్మకం కుదరకపోతే మూగవానిగా వెళ్తాడు.”
శాలిని స్పృహ తప్పి సీటుపై వాలింది. ప్రక్కకు జరిపాడు.
ఆవిడను జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపి పని పిల్లకు అప్పగించి, కారు స్టార్టు చేసాడు. కారు స్లోగా నడుస్తున్నది. దూరంగా ‘రాంజీ’ ఎదురు వస్తూ కనిపించాడు.
కారు ఆపి “వస్తావా?” అడిగాడు
‘ఆఁ’ అన్నాడు చూసి.
డోర్ తెరిచాడు. ఎక్కాక కారు స్టార్ట్ అయింది. “ఏం చేశావు?” అడిగాడు.
“పూర్తయింది.”
“నాల్గు రోజుల ఆలస్యంగా పూర్తయింది. Am I correct?”
“నా ప్రయత్నంలో లోపం లేదు.”
“నువ్వు నీకు సర్టిఫికెటు ఇచ్చుకుంటే సరిపోతుందా?”
బిక్క మొఖం వేసాడు రాంజీ, క్షమిచమన్నట్టుగా చూసి.
“ఇది మొదటి సారి గనుక” అని నవ్వి “సంజాయిషీలు వినడం నాకు కుదరదు” అని ఆపాడు జయంతి.
కారు దిగాడు రాంజీ. కారు కదిలింది. వెళ్తున్న కారు వైపు చూస్తూనే నమస్కరం చెప్పాడు. కారు ఇంటికి చేరాక పోర్టికోలో పెట్టి లోనికొస్తూ ‘టైం’ చూసుకున్నాడు. ‘శారద’ లాన్‌లో కూర్చుని పుస్తకం చదువుకుంటూ కనిపించింది.
జయంతిని చూసి చదివే పుస్తకం అక్కడే వదిలి “భోం చేద్దురుగాని” అంటూ డైనింగ్ టేబులు దగ్గరకెళ్లింది.
తల ఊపి చేతులు కడుక్కొని బట్టలు మార్చుకుని బుద్ధిమంతుడైన బాబులా వచ్చి కూర్చున్నాడు.
వడ్డించింది.
శారద పెట్టిందల్లా తినేసి బెడ్ రూం చేరి ఫోను ముందు ఓ అరగంట ఉండి మంచమెక్కాడు.
శారద తీరుబాటుగా వచ్చే సరికి నిద్రలో ఉన్నాడు.
పుస్తకం తెచ్చుకొని అక్కడే కూర్చుంది శారద.
గంట తరువాత ఫోను రింగయింది.
“ఎవరు?” అడిగింది.
“సికిందర్‌ను. ఎవరు ‘శారదా బెహినే’ గదా! అన్నాడు ఆప్యాయంగా.
“నిద్రలో ఉన్నాడు. లేవగానే చెప్పనా?”
“అలాగే.”
జయంతి పరిచయస్థుల్ని చూస్తుంటే ‘శారద’కు రాను రాను భయం పెరుగుతున్నది. ఒక్కొక్కడు అసలేం చేస్తాడో బొత్తిగా అంతు పట్టదు.
ప్రతివాడు ఓ కుబేరుడు, ఒక్క శివరాం తప్ప. శివరాంకు లేదని కాదు. వారితో పోల్చితే. ఈ ఆలోచనలను సాగనివ్వక పుస్తకం తెరిచింది.
జయంతి మెలుకునే సరికి రాత్రి ఎనిమిదయింది. స్నానం చేసి బయటకు రాగానే చంద్రశేఖర్ ఇచ్చిన ఆహ్వానం చేతికిచ్చి, సికిందర్ ఫోను చేసినట్లుగ చెప్పింది.
“సికిందరా! లేపకపోయావా” అన్నాడు.
“మీరు కొన్ని పేర్లు నాకివ్వండి వాటిని బట్టి ఫాలో అవుతాను” అంది.
“సారీ, సారీ నొచ్చుకోకు” అంటుండగానే లోనకెళ్లింది.
ఆహ్వానం చూసాడు. చంద్రశేఖర్ బంగారం కొట్టు పెడ్తున్నాడన్నమాట అనుకున్నాడు. అతని గతం తెల్సిన మట్టుకు తలలోకొచ్చింది.
దిగువ మధ్య తరగతివాడు చంద్రశేఖర్. అతని చదువే అత్తెసరుగ నడచింది. ‘లంచం’ దొరక్క S.I. సెలక్షన్స్‌లో వెనక్కువచ్చాడు. చివరి ప్రయత్నాన రాజకీయ పార్టీ కాళ్లా వేళ్లా పడి గట్టెక్కాడు. ట్రైనింగ్ పూర్తియ్యాక అన్నదమ్ముల పంపకాలయ్యాయి. ఉద్యోగంలోకి చేరుతూనే పెళ్లాడాడు. పెళ్లితో పాటు కొంత నగదు కూడా చేతికొచ్చింది. ఏడాది తిరగకుండానే యాత్రకు పంపిన తల్లిదండ్రులు బస్సు బోల్తాపడి ఇహాన్ని వదిలారు.
చంద్రశేఖర్ ఇల్లాలు ‘రత్న’ అంత రూపసి కాకున్నా పద్ధతి తెల్సిన మనిషి. భర్తతో ఆత్మీయంగా మెలిగేది. ఇద్దరు మగపిల్లలు కలిగారు.
పోలీసు ఉద్యోగం పైన ఉన్న భ్రమ నాలుగేండ్లలో తేటతెల్లంగా తెల్సింది. ఇక్కడ సిన్సియారిటీ ఎంతో, సిన్సియర్‌గా కనిపించే ప్రయత్నంలో అర్థమైంది. అది అర్థమైయ్యాక తను ఒంటరి వాడనిపించింది. మడి దడి తెలివితక్కువ పనులు అని చాలా ఆలస్యంగా తెల్సుకున్నాడు. జాగ్రత్తగా గాట్లో కొచ్చాడు.
అప్పుడే గౌరవంగా అనిపించింది.
కాని చిత్రంగానూ అనిపించి నవ్వుకున్నాడు. నియమంగా ఉంటే రాని గౌరవం కరప్షన్‌గా అన్యాయంగా ఉంటే దొరకడం ఎంత సమాజపు స్థితి చెప్పినా సిగ్గుగానే అనిపించింది. ఇట్టాటి టైంలో ‘గార్ల్’ ఏరియాకు ట్రాన్స్‌ఫర్ అయింది.
వెళ్లి జాయిన్ అయ్యాడు. రెండు నెలలు సజావుగానే నడచినయి.
ఆ రోజు సాయంత్రం ఇక ఇంటికెళ్దాం అని బయలు దేరుతుండగా ఓ పెద్దమనిషి స్టేషన్ లోకొచ్చాడు. నమస్కారం చెప్పాడు. కూర్చోమన్నాడు శేఖర్. అతగాడు తన వివరాలు చెప్పుకొని ఓ ఉత్తరం చంద్రశేఖర్‌కు ఇచ్చాడు. చదివాడు. దాని సారంశమేమంటే ఇప్పటికి ఇరవై ఏళ్ల నుంచీ అక్కడ తండాలను పీడిస్తున్నాడట. అందుకు పరిహారంగా మొదటి విడత ఏభై వేలు పంపాలన్నాడు.
“నన్ను ఏం చేయమంటారు. నాకు కాలూ చేయి ఆడడం లేదు. నిద్రపోలేకపోతున్నాను. ఇంట ఉండలేకపోతున్నాను. నా తలంతా భయం, పిచ్చాసుపత్రిలా తయారువుతున్నది” అన్నాడు.
తల ఉపాడు చంద్రశేఖర్.
“నాకు మీ రక్షణ కావాలి. వారం దాటాక పైకం వారి చేరకపోతే వాళ్లు నన్ను ఎక్కడున్నా వేటాడి చంపేస్తారు” అన్నాడు భయపడుతూ.
“మీ పేరు.. అదే పూర్తి పేరు?”
“గంగిరెడ్డి రామనుజం.”
“ఇది బెదిరింపు. దానికింత భయపడుతున్నారా?”
“లోగడ ఇద్దర్ని చంపారు గదా!”
“కారణం ఉండొచ్చు!”
“వాళ్ల కున్న కారణం వాళ్లకుంటుంది.”
“మీ అభిప్రాయం చెప్పండి” అడిగాడు చంద్రశేఖర్.
“మీ తీరు అర్థం కానిది నేనేం చెప్పగలను. మీరు వాళ్లను నిలువరించగలరు అనుకుంటే నాకు డబ్బు చేదుగాదు గదా, మీరు ఏమీ చేయలేరు అనిపించాక పైకం పంపుతాను” అన్నాడు.
“నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను. పరిస్థితి ఏ మేర అదుపులో ఉన్నది నాకింకా అవగతం కాలేదు. మా S.I, హెడ్డు ఉన్నారు గదా. నేను మాటాడుతాను. మీరు నాకు ఎల్లుండి వచ్చి కనిపించండి” అన్నాడు.
“అలానే” అని చెప్పి నమస్కారం చెప్పి వెళ్లిపోయాడు.
హెడ్ రాజీవ్‍ను పిలిపించి మొదట రామానుజం సంగతేంటని అడిగాడు.
‘ఇతడు జనాన్ని ఏడ్పించుకు తినే బాపతే’ నని చెప్పాడు.
“అయితే డబ్బు పంపాలంటావా?”
“పంపకుంటే కష్టం సార్” అని తల గోక్కున్నాడు.
“వాళ్లు నీకు తెలుసా?”
“ఒక్కడు తెలుసు సార్. చానా మంచి పోరడు. అన్యాయం అంటే కుదరదనే బాపతు. వాళ్లే ఈడ లేకుంటే బీదా బిక్కిని ఇట్టాటి రామానుజాలు పీక్కుతింటారు సార్” అన్నాడు.
“మనమేం చేయాలంటావు?”
“మనదేముంది సార్ ఇందులో. వాడిష్టం.”
“అంటే”
“ఇక్కడ ఇట్టాటి ప్రతోడు వాళ్ళకు అంతో ఇంతో కడతానే ఉంటారు. రామానుజం నిరుడు కొంత పంపిండు. ఈ ఏడు వద్దనుకొని ఈడికి వచ్చి ఉంటాడు.”
“మన D.S.P.తో మాటాడుదాము!”
“దేన్ని గురించి సార్?”
“ఉత్తరం సంగతి”
“ఆయనకి తెల్సే ఉంటుంది సార్.”
“మనకు తెల్సింది చెప్తే తప్పేముండదు కదా”
“మీ యిష్టం సార్” అని వెళ్లిపోయాడు.
D.S.P.ని చంద్రషేఖర్ కలిసాడు గాని విషయం కదిలించలేదు.
రామానుజానికి మాత్రం ‘అవును, కాదు’ అని చెప్పలేను అన్నటు చెప్పాడు.
మీరే రక్షించాలన్న రామానుజం ప్రభుత్వాన్నీ, పాలకులనీ, పోలీసుశాఖనూ బండబూతులు కూస్తూనే వెళ్లిపోయాడు.
సరిగ్గా పదిహేనోనాడు రామానుజాన్ని ఆ ఊరి పటేలునూ నరికేసారని వార్త పోలీసు స్టేషనుకు వచ్చింది.
హుటాహుటిన spot కు వెళ్లాడు.
రామానుజం తల మొండం వేరుచేయబడి ఉన్నాయి. గోడల పైన ఎఱ్ఱగా రక్తంతో అద్దిన చేతి గుర్తులున్నాయి. పటేలునేమో కాల్చి చంపారు. శవాలు పోస్టుమార్టంకు పంపి కేసు నమోదు చేసాడు.
అది మొదలు వాళ్లు ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. ‘మున్నా’ అనే లంబాడీ అతను – వారు ఎక్కడెక్కడ, ఎలా ఆగేది కొంత తెలుపగలిగాడు. అంతటితో అతన్ని వదిలిస్తే బాగుండేది. అతన్నే వాళ్లను వెంబడించమని పంపడంతో సరేనని వెళ్లినవాడు మళ్లా తిరిగి రాలేదు. కొన్ని రోజులయ్యాక ఓ అనాథ శవం వాగు ఒడ్డున పొదల్లో దొరికింది. నక్కలూ, పక్షులు దాన్ని చాలా వరకూ తినేసినయి. బీభత్సంగా మారి ఉన్న స్థితి కనిపించడంతో గుర్తించడం కష్టమే అయింది. కానీ అది ‘మున్నా’దేనని చంద్రశేఖర్ గుర్తించి వెతుకులాటను ఆపాడు. నాల్గు నెలలు ప్రశాంతంగా నడిచింది.
అయితే ఊహ కందని రీతిన పోలీస్ స్టేషన్ ఉన్న ఊరి పట్వారీని ఓ అపరాత్రి తీసుకెళ్లి చంపేసారు. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం రాత్రి నాల్గు గంటలకు చంపబడితే తెల్లవారి ఏడింటి దాకా పోలీస్ స్టేషన్‌లో తెలీలేదు.. జనం వాళ్లంటే అంతగా భయడపతున్నపుడు ఏ పని ప్రారంభించినా తెలివితక్కువేనని స్పష్టపడింది చంద్రశేఖర్‌కి.
కేసు కట్టడం, జనం చూసేందుకు హడావిడి చేయడం మినహా అతడు చేసేందుకేమీ లేదు.
నెల తరువాత మరొకటి జరిగింది. మరో హత్యా ప్రయత్నమూ జరిగిందిగానీ వారికి కావాల్సిన ‘రామచంద్రుడు’ దొరక్కపోవడంతో ఆగింది.
రామచంద్రుడు ఓ రాజకీయ పార్టీలో చిన్న నాయకుడు. వస్తుతః మంచివాడే గానీ ఆడ పిచ్చి ఉన్నవాడు. ఈ బాపతు పంచాయతీలున్నయ్ ఇతని మీద. ఓ గిరిజన పిల్లను బలవంతంగా అనుభవిచడం, అది వాళ్ల దగ్గర పడ్డంతో మరీ చికాకుగా మారింది పరిస్థితి.
రామచంద్రుడిని ఎలాగు వాళ్లు లేపేస్తారని గమనించిన చంద్రశేఖర్ అతని చుట్టూ వల పన్నాడు. ఇతని ఆలోచన ఫలించింది. వలలో చిక్కాడు. ఎదురు కాల్పులు జరిగినయి. ఇద్దరు spot న చచ్చారు. ఒకడు దొరికాడు. దొరికిన వాడు బ్రతుకు పైన ఆశ చావక అడ్డాలు చూపాడు. డబ్బూ తుపాకులూ కొంత బంగారం, సాహిత్యం దొరికింది. దాన్ని తీసుకొని వస్తూనే ఇతన్ని చంపాడు, పారిపోతుంటే చంపినట్టు.
ప్రభుత్వానికి డబ్బూ దస్కం తక్కువ ఇచ్చి తుపాకులూ సాహిత్యం పూర్తిగా అందజేసి అనారోగ్య కారణంగా శెలవు పెట్టాడు. ఆ శెలవును పొడిగిస్తూ పోయాడు. ఈలోపు జరిగిన ఎంక్వైరీలో సస్పండ్ అయ్యిడు. ఇదీ మంచిదే అని కోర్టుకెక్కాడు. ఆరేళ్లు నడిచిందక్కడ. అనుకూలంగానే తీర్పు అయింది. ప్రమోషనూ వచ్చింది. అయినా రెండేళ్ల కంటే ఎక్కువ ఆ నౌకరీలో లేడు. రావాల్సిన వరకు పిండుకొని ఇట్టా వ్యాపారంలోకి దిగాడన్నమాట. అంటే అప్పటి బంగారం ఇప్పుడు మార్కెట్టు లోకి రాబోతుందన్న మాట. నవ్వొచ్చింది జయంతికి.
వెళ్లాడు. తోవలో A.S. వచ్చాడని తెలిసి, హోటల్ లోని అతడి కాటేజీకి వెళ్లాడు. A.S. ఎదురొచ్చి కౌగిలించుకొని తీసుకెళ్లాడు “నీ కోసమే చూస్తున్నా” అంటూ. జయంతి కూర్చున్న సోఫాకు అటు చివరన ఓ బంగారు తీగ లాంటి అమ్మాయి కూర్చుని ఉంది. ఆవిడను చూపుతూ “కంగారేం లేదు. నా సెకరట్రీ” అన్నాడు గార పళ్లను బయట పెట్టి నవ్వుతూ.
“టౌనుకో సెక్రటరీని గానీ మైన్‌టైన్ చేస్తున్నావేంటి కొంపదీసి” అని నవ్వాడు జయంతి.
“అట్ట అనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్టే” అని నవ్వి. “నీకు గానీ నచ్చితే ఒక్కసారన్నా సంతోషపరుద్దామని కలకత్తా నుంచి తీసుకొచ్చాను.”
“బాగా ఎదిగావు. సారా వ్యాపారంలో తృప్తిగా ఉన్నావనుకున్నాను. ఇదీ మొదలెట్టేశావన్నమాట!”
“ఇదేంది. నే చేసేది సారాయేగా.”
“మరి ఇదేంటి!” అని ఆ అమ్మాయిని చూపాడు.
“ఛ. ఛ మాకు కుదర్దు గానీ నే వచ్చిన పని ఇనిపో.”
“కానీయ్.”
“సారాపాటలు వస్తున్నాయి కద, పైకం అవసరమౌతుంది.”
“అలాగే.”
“షేరు అలాగే ఉంచేద్దామా.”
“నీ యిష్టం”
“నీ కోసమే కద ఈ ‘పోరి’ని విమానంలో తెస్తిని.”
“మొదట తీసుకెళ్లు” అని నవ్వి ‘ఇంటికెళ్తాన’ని బయటకొచ్చాడు.
ఇంటికి చేరాడు జయంతి.
(ఇంకా ఉంది)