Site icon Sanchika

నియో రిచ్-24

[సారంగపాణి కట్టిన హోటల్ ప్రారంభోత్సవానికి వెళ్తాడు జయంతి. జనం గుమిగూడి ఉన్నారు. సారంగపాణి పరుగున వచ్చి జయంతిని ఆహ్వానించి మర్యాదలు చేస్తాడు. టూరిజం మంత్రి ప్రారంభోత్సవానికి వస్తూండడంతో ఎస్.పి. అర్జున్ అందరినీ జాగ్రత్తగా గమనిస్తూంటాడు. మంత్రి శకుంతలా రాణి వచ్చి ప్రారంభించి సెలవు తీసుకుంటుంది. ఓ ప్రత్యేకమైన గదిలో సారంగపాణి, జయంతి మాట్లాడుకుంటారు. తనకి డబ్బు సంపాదన పట్ల వైరాగ్యం కలిగిందని అంటాడు సారంగపాణి. తనకున్న సమస్యలను ప్రస్తావించగా, తగిన సూచనలు చేస్తాడు జయంతి. మరికొంత సేపు ఉండమన్నా ఉండకుండా, ఇంటికి చేరి మంచం మీద విశ్రాంతిగా పడుకుంటాడు జయంతి. సారంగపాణిని తలచుకుని అతని గతాన్ని గుర్తు చేసుకుంటాడు. మర్నాడు ఉదయం టేబుల్ పై ఉన్న ఉత్తరాలను చూస్తాడు. మొదటిది నర్తకి శ్రీలక్ష్మి నుంచి – ఒక నృత్య ప్రదర్శనకు ఆహ్వానం. రెండోది హరే రామ్ నుంచి. హరే రామ్ తాను వచ్చి కలుస్తానని రాస్తాడు. తనతో మాట్లాడే ప్రయత్నం చేయవద్దంటాడు. ఇక చదవండి.]

[dropcap]రెం[/dropcap]డు సార్లు చదివాడా ఉత్తరాన్ని.

మొదట హరేరామ్‌ను తను అనుమానించాడు. అనుమానంతో వదలక పరిశీలిస్తే ఎడతెగని మొండి పట్టుదల అతనిలో కనిపించింది. ఇది ఉన్నవానికి ఏదో ఒక దారి దొరకుతుంది అనిపించింది. అందుకే అభయమిచ్చి ప్రోత్సహించాడు. అండగా నిలిచాడు.

దాని ఫలితం.

‘దొరికిన అమృత కలశాన్ని చేత పట్టుకొని ఇదిగో ‘ఇది నీకే’ అంటూ బయలుదేరాడు. సాగించమన్నాడు. He reached his goal.’ అనుకున్నాడు ఆనందంగా.

మరో ఉత్తరం విప్పాడు.

శ్రీలక్ష్మి వ్రాసింది.

“అన్నయ్యకు నమస్తే. నేను లక్ష్మిని. నీ దగ్గరకు వస్తున్నాను.

మీ ప్రసక్తి లేకుండా మన ఊరు నుంచి నాకు ఆహ్వనం అందింది. కేవలం మిమ్మల్ని చూద్దామనే, మీతో ఒకటి రెండు రోజులు గడుపుదామనీ మాత్రమే నేను ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాను. టిక్కెట్టు పంపుతున్నాను. మీరు వదినా తప్పని సరిగా వస్తారని ఆశిస్తున్నాను. మనం కలసి ఇంటికి వెళ్ధాం. అందుకే నీకు ‘బస’ను ఏర్పాటు చేయొద్దని వారితో చెప్పాను. అమ్మ ఆరోగ్యంగానే ఉంది. నిన్ను తలవని రోజు వుండదు. నీ అభిమానం ఆదరణలే ధైర్యంగా, ఆ ధైర్యమే శ్రీరామ రక్షగా అడుగులు ముందుకు కదుపుతున్నాను. ఉంటాను. వదినకు నమస్కారం చెప్పు. ఎప్పుడు వదినని చూస్తానా అని ఆతృతగా ఉంది. ఉంటాను. మీ శ్రీలక్ష్మి.”

Note – వదిన ఎలా ఉంటుందోనని ఊహాల్లో రూపం అందక ఇదయిపోతున్నాను. చాలా బావుంటుంది గదూ. Beauty Queen కాకున్నా నీకు తగినదిగా అనిపిస్తే చాలు గదా. భగవంతుడు దయామయుడు. నీకు అలాగే ఒనకూర్చి ఉంటాడు, నేను నమ్మతున్నాను. నా నమ్మకం వృథా కాదు. ఉంటాను నీ లక్ష్మి.

ఉత్తరం మడచి శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి అని సణుగుతున్నాడు జయంతి.

మనస్సంతా సంతోషంతో నిండిపోయింది. బాత్ రూమ్ లోకి నడిచాడు.

టేబులు దగ్గరికి వచ్చేసరికి శారద మాములు టిఫెను కాక బొబ్బట్లు  కూడా చేసి ఎదురు చూస్తూ కనిపించి, మాటాడుతూ కొంచెం ఎక్కువగానే తినిపించింది.

కాఫీ ఇచ్చింది. త్రాగుతూ “శారదా మా చెల్లెలు వస్తున్నది” అన్నాడు.

“చెల్లెలా?” అని ఆశ్చర్యపోయి “ఎప్పుడూ అనలేదు” అంది ఆశ్చర్యపోతూ.

“ఇదిగో ఉత్తరం చదువు. దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా ఆలోచించుకో. ఏం” అని నడిచాడు.

శారద ఉత్తరం చదివి బయటకొచ్చే సరికి పోర్టికో ఖాళీగా ఉంది.

జయంతి నేరుగా శివరాం ఇంటికెళ్లాడు.

“రా జయంతీ నీకోసమే చూస్తున్నాను” అని ‘blank cheque’ చేతికిచ్చి “నీ యిష్టమొచ్చిన అంకె వేసుకో. కాకుంటే ఆ అంకెను ఎమౌంటు కోసం మాత్రం పంపు” అన్నాడు.

“అయితే..” అంటూ లేచాడు లోనికి చూస్తూ.

పార్వతి వస్తూ కనిపించింది.

మంచి నీళ్ళు గ్లాసు చేతిలో ఉంది.

తీసుకోని త్రాగాడు.

“కాఫీ త్రాగి వెళ్లకూడదా?” అంది చెయ్యి పట్టుకొని.

“అమ్మో. నేను ఏడో నెలకే ఏదో మునిగిపోయినట్లు భూమ్మీద పడ్డాను. అప్పటి నుంచీ పరుగే. ఇక మిగిలింది చావు. అది ఎంత వేగంగా ఏ రూపాన వస్తుందో..” అన్నాడు.

“ఏమిటా మాటలు?” అని జయంతి నోటికి చేతిని అడ్డం పెట్టింది పార్వతి.

పార్వతి కళ్ళల్లో నీరు కదిలింది.

“ఏమిటమ్మా పని.. నాకేమైందనీ. నేనింకా అదృష్టవంతుణ్ణే తెలుసా? ఇందరు నన్ను అభిమానించే వాళ్ళుండగా నాకేం కాదు.. కాదు..” అన్నాడు నవ్వుతూనే..

పార్వతితో వంటింటిగది కెళ్లి కాఫీ కాయించుకుని త్రాగి బయటకొచ్చి కారెక్కాడు.

రామాలయం వీధిలో కొచ్చాడు. ఏదో గుర్తుకొచ్చి వెనక్కు మళ్లి రామానుజం వీధికి మలిపాడు. మార్బుల్ రాళ్ల వ్యాపారి దగ్గర కారు ఆపాడు. సేటును కలిసాడు. అతనితో నాల్గు నిముషాలు మాటాడి కారెక్కి సీదా ఇంటికి చేరాడు. బీరువా తెరిచి వెతికి ఏదో రెండు డాక్యుమెంట్లును తీసుకొని వచ్చి మళ్లా కారెక్కాడు. ఈసారి కోర్టు ఆవరణలో ఆగిందా కారు. లాయరు ముకుందాన్ని వెదికి పట్టుకొని  కాగితాల్ని అప్పగించి అరగంట మాటాడి వెనక్కి మళ్లి సారంగపాణి హోటల్ దగ్గర ఆగి ఫోను చేసి తిరిగి ఇంటికి చేరి శారదతో భోం చేసాడు. చేయి కడుకుంటూ “రవి రాలేదు కదా” అడిగాడు.

ఫోను చేసాడు.

“మళ్లా ఫోను వస్తే ఉన్నానని చెప్పు” అని గదిలోకెళ్తాడు.

గంట తరువాత గదిలోకి వెళ్తుంది శారద.

జయంతి నిద్రపోలేదు. కళ్లు తెరిచి సీలింగ్ వైపు చూస్తూ కనిపించాడు.

శారద రాకను గమనించి “ఇలా వచ్చి కూర్చో” అన్నాడు ప్రక్కన చోటు చూపి.

కూర్చున్న తరువాత అలవోకగా భుజంపై చేయి వేసాడు.

“ఒంట్లో నలతగా ఉంటోంది. లేడీ డాక్టరును కలవాలి” అంది.

గబుక్కున లేచి కూర్చుని “ఎప్పటి నుంచి, చెప్పలేదెందుకు?” అడిగాడు ఆతృతగా.

“ఇది నాలుగో రాజు.”

“నేను లేననుకున్నావా, చెప్తే ఏం పోతుంది” అన్నాడు కోపంగా.

“వదిన్ని వెంట పెట్టుకొని వెళ్దామనుకున్నాను.”

“నేను అక్కరలేదు?”

“వస్తారా?” అంది కళ్లలోకి అదోలా చూసి.

“వస్తానా” అని గుంజుకొని ఫోను డయల్ చేసి డా. శ్వేతకు కలిపి “నేను ఇప్పుడే వస్తున్నాను  ఉండండి” అని పెట్టేసి “పద” అన్నాడు లేచి.

మౌనంగా వెంటనడిచింది.

సాదరంగా ఎదురొచ్చి దంపతులను లోనకు తీసుకెళ్తుంది డాక్టరు శ్వేత.

శారదను పరీక్షించింది.

“జయంతీ నువ్వు తండ్రివి కాబోతున్నావు” అని చెప్పింది వచ్చి.

అసలు ‘పెళ్లే వద్దు’ అనుకునే వాడికి తండ్రిగా ప్రమోషన్.

చిత్రంగా గర్వంగా చూసాడు శారదను. కళ్లనిండా నీరు నిండింది. దస్తీతో తుడుచుకున్నాడు. వ్రాసిచ్చిన మందు చీటీ తీసుకొని శ్వేతకు thanks చెప్పి కారెక్కాడు. ఇంటి కొచ్చి శారదను వాలు కుర్చీలో కూర్చుండబెట్టి పక్కెక్కాడు.

పడుకోలేదు. బాసాపెట్టేసుకొని కూర్చుని ఆలోచనల్లోకి వెళ్లిపోయాడు. నాల్గయిదుసార్లు నవ్వుకొని రెండుసార్లు కళ్లు తుడుచుకొని లేచి శారద దగ్గరకెళ్లి “శారదా వయస్సుడిగిన నర్సు నొకదాన్ని వెంట ఉంచుకో. మందులు జాగ్రత్తగా టైంకి వాడు. నీ ఆరోగ్యం జాగ్రత్త” అంటూ క్రింద కూర్చుని శారదను గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. కుర్చీ నుంచి లేచి లాన్ దాకా నడపించుకొచ్చి “ఇక వెళ్లొస్తాను” అన్నాడు.

జయంతి ప్రవర్తన చిత్రంగా అనిపించింది శారదకు.

తల్లి కాబోతున్న భావన చాలా సంతోషాన్నిచ్చింది. అప్పటిదాకా ఉన్న నలత పారిపోయింది. నెమ్మదిగా ఇంట్లోకి నడిచింది.

అర్ధరాత్రి దాటుతుండగా కాని జయంతి ఇంటికి రాలేదు. రాగానే శారదను చూసాడు.

మంచి నిద్రలో ఉన్నది. అయినా శారద ప్రక్కలోనే నెమ్మదిగా పడుకున్నాడు.

ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీలేదుగానీ శారద లేపితే లేచాడు. లేచి శారదను పైకి గుంజుకున్నాడు. వెలుగు రేఖలు పొద్దు పొడుపును సూచిస్తుండంతో ముద్దెట్టుకొని వదిలాడు.

డ్రస్సు చేసుకుంటూ క్యాలెండర్ చూసి ‘ఇవ్వాళే శ్రీలక్ష్మి డాన్సు ప్రోగ్రాం ఉంది’ అనుకున్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గరకెళ్లాడు. పూరీలూ వడలూ కనిపించాయి. శారద ఎదురు చూస్తూ కనిపించింది.

“శారదా నాపైన నీకు ప్రేమ ఉందా?” అడిగాడు కూర్చుంటూ.

“ఉన్నా చెప్పడమెలా?” అంది.

“చెప్పొచ్చు.”

“నాకు తెలీదు.”

“సర్లే కానీ నీ ప్రేమకు మరొక పార్టనర్ వస్తున్నాడు” అన్నాడు.

“Please shout your mouth” అంది పెద్దగా.

ముఖమంతా నెత్తురు కమ్మింది. శరీరం వణికింది.

“తప్పేమైనా మాటాడానా?” అన్నాడు నెమ్మదిగా, బిత్తరపోయి.

“ఇక మాటాడొద్దు. భరించడం నాకు చేతకాదు. Please” అని అక్కడ నుంచి నడవబోయింది.

కొంగు పుచ్చుకొని ఆపి  చెవిదాకా వంగి “మన బిడ్డకు సగం ప్రేమ పంచాలి గదా, నాతో ఇక అరకొరగానే మెదులుతావు గదా. అర్థం చేసుకోకుండా పోయి, పేద్ద కోపం. అమ్మో శంకరుడి మూడో కన్ను శక్తే నీకుంటే ఇంకేముంది?” అన్నాడు.

“సారీ సారీ” అంది సిగ్గుతో ముడుచుకుపోతూ.

జయంతి కారెక్కే డప్పుడు మాత్రం “కొంచెం పెందలాడే ఇంటికి రారాదా?” అడిగింది.

“వస్తాను. నువ్వు రడీ అయి ఉండు. మనం మా శ్రీలక్ష్మి ప్రోగ్రాంకు వెళ్తున్నాం. దాన్ని మనతోనే ఇక్కడకు తీసుకొని వద్దాం” అన్నాడు.

“అలాగే తప్పకుండా తీసుకొద్దాం” అంది సంతోషంగా.

(ఇంకా ఉంది)

Exit mobile version