Site icon Sanchika

నియో రిచ్-25

[హారేరామ్ రాసిన ఉత్తరాన్ని చదివి తను సాధించిన విజయాలను తలచుకుంటాడు జయంతి. తరువాత శ్రీలక్ష్మి రాసిన ఉత్తరం చదువుతాడు. ఒక నృత్య ప్రదర్శన కోసం ఆమె తమ ఊరు వస్తోందని తెలుస్తుంది. టిఫిన్ తిని కాఫీ త్రాగుతూ, తన చెల్లెలు వస్తోందని శారదతో అంటాడు. చెల్లెలా అని శారద ఆశ్చర్యపోతే, ఉత్తరం ఇచ్చి చదవమంటాడు. అక్కడ్నించి శివరాం ఇంటికి వెళ్లి అతనితో మాట్లాడుతాడు. పార్వతి ఇచ్చిన కాఫీ తాగి బయల్దేరి – మార్గమధ్యంలో అన్ని పనులు చూసుకుని ఇంటికి వెళ్తాడు. ఏవో కొన్ని డాక్యుమెంట్లు తీసుకుని కోర్టుకు వెళ్ళి లాయర్ ముకుందాన్ని కలిసి ఆ కాగితాలని ఆయనకి అందజేస్తాడు. ఇంటికి వచ్చిన జయంతికి – తనకి ఒంట్లో బాలేదని, లేడీ డాక్టర్‍ని కలవాలని శారద చెబుతుంది. ఇద్దరూ కలిసి డా. శ్వేత క్లినిక్‌కి వెళ్తారు. ఆమె శారదను పరీక్షించి – తల్లి కాబోతోందని చెబుతుంది. ఇద్దరూ ఎంతో సంతోషిస్తారు. ఇంటి వద్ద ఒక నర్సును ఏర్పాటు చేస్తానంటాడు. జయంతి బయటకు వెళ్తుంటే, సాయంత్రం శ్రీలక్ష్మి డాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళాలి, తొందరగా వచ్చెయమని శారద గుర్తు చేస్తుంది. డాన్స్ ప్రోగ్రామ్ అయ్యాకా, శ్రీలక్ష్మిని ఇంటికి పిల్చుకుని వద్దాం అనుకుంటారు. ఇక చదవండి.]

[dropcap]జ[/dropcap]యంతి కారు అశోక హోటల్ దగ్గర ఆగింది. సిద్ధార్థ్ కనిపించాడక్కడ. ఇక్కడ వీడు పెద్ద కెమెరామేన్. బాగా బిజీ. ఆప్యాయంగా దగ్గరకొచ్చాడు. పది నిముషాలు మాటాడుకుని విడిపోయారు. అక్కడ నుంచి రైల్వే స్టేషన్ కెళ్లాడు జయంతి. అక్కడ పని చూసుకొని ఇంటికి చేరి భోంచేసాడు.

అప్పుడు కనిపించాడు రవి.

రవి “ఎప్పుడొచ్చావు మావయ్యా?” అని అడిగాడు.

“ఇప్పుడే”

“నాన్నగారు నువ్వు ఉన్నావేమో చూడమని చెప్పారు.”

“ఉన్నాను. నువ్వు చూసావు. ఇక చెప్పు” అన్నాడు నవ్వుతూ.

“మన పురాణాలు ఊహాజనితమైనవి. మనకు కావాల్సిన హితవులు వాటి ద్వారా చెప్పారు. అలా చెపితే చదువరుల మనసుకు బాగా హత్తుకుంటుందని వారి భావన. అయితే చరిత్ర అలా కాదు” అని రవి అంటుండగా వేడి గారెలు తెచ్చి ముందుంచింది శారద.

తింటూనే రవిని తీసుకోమని ఆవులించాడు జయంతి. నిద్ర వస్తుందని అని చెప్పడం కావచ్చు.

అది గమనించిన రవి “మనం రామాయణం గురించి తరువాత మాటాడుకుందాం..” అన్నాడు.

“రవీ, మంచి డాన్సు ప్రోగ్రాంకు వెళుతున్నాము, నువ్వు ఉండు” అన్నాడు జయంతి.

తల ఊపాడు రవి.

“అయితే ఇక పడుకుదాం” అని “నువ్వు కొంచెం సేపు” అన్నాడు.

“అలాగే” అంటూ పక్కనే పడుకున్నాడు రవి.

అది గమనించిన శారద నవ్వుకుంది.

అయిదు అవుతుండగా ఇద్దరూ లేచారు. ఒకర్నొకరు చూసుకొని నవ్వుకున్నారు.

“డాన్సు ప్రోగ్రాం అన్నావు గదా, ఎప్పుడు?” అడిగాడు రవి.

“అమ్మకు ఫోను చేసి చెబుతాను, నువ్వూ మాతో ఈ పూట ఉంటున్నావని” అన్నాడు జయంతి.

“ఆంటీ, నువ్వు మావయ్యతో ఎలా నెగ్గుకొస్తున్నావో గాని నాకయితే అంతు పట్టడంలేదు” అన్నాడు రవి.

“వేలడంత లేని వాళ్లు కూడా నన్ను అంటుంటే నీకు ఆనందంగా ఉందా?” అన్నాడు జయంతి చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ.

శారద వారిని చూసి నవ్వుకుంటూ వెళ్లింది.

జయంతి బయటకు వెళ్లేందుకు లేచాడు. కారు దగ్గరకు వెళ్ళాడు “నేను వెంటనే వస్తాను రడీగా ఉండండి” అంటూ.

“ఆంటీ ఈయన అబద్దాలకోరు. నిజం మాటాడడు. ఎదురుగా అదురు బెదురు లేని వాడిలా అబద్దాలాడడం. పెద్ద మనిషి గదా” అన్నాడు ముద్దు ముద్దుగా, అంతమాలిన కోపంతో.

పసివాళ్ల కీచులాటలా అనిపించి బాగా ఎంజాయ్ చేసింది శారద.

***

Red House కి వెళ్లి సామంత్‌ని కలిసాడు జయంతి. ఇద్దరూ లాన్‍లో కూర్చున్నారు.

“అనుకున్న ప్రకారం నూరు కిలోలు పూర్తి అయింది. ఇది మర్చిపోయే మేలు కాదు. మాట ప్రకారం బంగారాన్ని replace చెయాలి. కానీ కరెన్సీని చేస్తున్నాం” అన్నాడు సామంత్.

“నేనిచ్చిన మాట పూర్తి చేసాను. దీని వేనక ఎంత శ్రమ ఉండనీ. నూరు కిలోలు అంటే ఆరు నెలలు నిర్విరామ కృషి, విషయ సేకరణ. అదీ విష కీటకాల నుంచి. ఈ యజ్ఞంలో చాలా మంది చనిపోయారు. వాళ్లకి promise చేసినట్టు పరిహారమే చాలా ఉంది.

నేను మాట తప్పేవాణ్ణి కాదు. కానీ పరిస్థితి అలా వచ్చింది. అందు చేతనే కరెన్సీ తయారు చేయమంటున్నది” అన్నాడు అనునయంగా సామంత్.

“దీన్ని మాట నిలుపుకోవడంగా భావించడం లేదు. I want gold only. I dislike to take even dollars, you know” అన్నాడు కటువుగా. జయంతి మొఖం కంద గడ్డలాగయింది.

“అలా అంటే ఎలా? మా బాధను అర్థం చేసుకోవాలి.”

“సామంత్, తెల్సి మాట తప్పిన వాణ్ణి క్షమించడం నేరం అవుతంది, ఏం అనుకుంటామో ఎలా అనుకుంటామో అలాగే నడిచిపోవాలి. భిన్నంగా కనిపిస్తే నాకంటే శతృవు మీకు ఉండడు సామంత్. ఇప్పటికే నీ వాయిదా దాటిపోయింది.” అని లేచి “చివరి అవకాశం ఇస్తున్నాను. నిన్ను మూడోనాడు కలుస్తాను. బంగారం మాత్రమే నీ నుంచి తీసుకుంటాను, that all” అని లేచి నడిచాడు జయంతి.

సామంత్ వెంబడి వచ్చి ఏదో చెప్పతూనే ఉన్నాడు. కానీ వినిపించుకోలేదు.

కారు స్టార్టయింది. పాణి హోటలు ముందాగింది. కాఫీ త్రాగి బయలుదేరి చెట్టియార్ కలిస్తే రెండు మూడు నిముషాలు మాటాడి టైం చూసుకొని బయలుదేరాడు. క్లబ్బు దగ్గర ఆగాడు. డా.శ్రీధర్ రెడ్డి స్నేహితుడు రాజారాం కనిపించాడు. దగ్గరకొచ్చి పలకరించాడు.

“కలకత్తా నుంచేనా?” అని అడిగాడు జయంతి.

“అవును. రాత్రి వచ్చాను.”

“డాక్టరు అంత్యక్రియలకు మీరు తప్పక వస్తారని చూసాను.”

“నాకు తెలీదు” అని ఓ క్షణం ఆగి “డాక్టర్‌ది బలవన్మరణం అంటున్నారంట?”

“విన్నాను. పోలీసులూ విని వదిలేసారులా ఉంది” అని నవ్వాడు.

“అంటే పొగే కదా నిప్పు ఉండదనా?”

“ఉండదమో. లేకపోవచ్చునూ, తేల్చకున్నారెవరు.”

ఇంతలో లాయర్ ముకుందం అక్కడకొచ్చి “పెంచలయ్య చేయించాడంటున్నారంతా?”

“ఆయన చేయించింది కేసు మూయించడమా? హత్యా?”

“రెండును.”

“God knows what is what.”

“ఇక నేను వెడతాను. పని ఉంది” అని బయలుదేరాడు జయంతి.

ఇంటికొచ్చి రవినీ శారదనూ తీసుకొని డాన్స్ ప్రోగ్రాంకెళ్ళాడు.

రిజర్వ్ చేసినవి గనుక వీళ్లు కూర్చున్నారు. వీరు వెళ్లి కూర్చున్నాక కూడా ప్రదర్శన ప్రారంభించలేదు, కాని హాలు బాగా నిండి వెనక నిలబడి కూడా జనం కనిపించారు. ఇంతలో టౌను నాటక ముఖ్య కార్యదర్శి బుచ్చిబాబు స్టేజీ పైకి వచ్చి దాన్ని పరికించి జనం వైపు తిరిగి హడావిడి పడుతూ కనిపించాడు. ఈ బుచ్చిబాబుదొక చిత్రమైన మనస్తత్వం. ‘నువ్వు తప్ప నీటుగా నాటకాన్ని గానీ మరే ప్రదర్శనను గానీ నిర్వహించగల్గిన వాడు ఈ టౌనులో లేడు.. నిర్వహణ అంటే మొదట గుర్తొచ్చేది బుచ్చిబ్బాయే కదా అని ఉబ్బేస్తే చాలు, పాపం అంతా తానే అయి విరగబడి మరీ మోస్తాడు’. ఉబ్బేసి మోత మొదలు పెట్టాక ఇక్కడి వారు అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వరు. పైగా అంతగా గుర్తించరు.

అదంతా అతనికి అర్థమౌవుతున్నా మధ్యన చేసేది మానుకొని ఎటూ పోడు. అలా నిర్వికారంగా చేసుకుంటూ వెళ్లడమే అతని హాబీ. అతనికి తృప్తి కూడాను. పది నిముషాల తరువాత గంట మ్రోగింది. తెర లేచింది. ప్రదర్శన ప్రారంభమైంది. ఒకటితో ప్రారంభించి చాలా నృత్యరీతులను శ్రీలక్ష్మి అలవోకగానే ప్రదర్శించింది.

అందాల బొమ్మగా లోగడకంటే అందంగా చలాకీగా నృత్యంలో ఈజ్‍గా అనిపించింది. ‘శివ తాండవం’ ప్రత్యేకంగా జనంతో కరతాళ ధ్వనులు చేయించింది.

మరో నృత్య తీరు ప్రారంభంచేదాకా ఆగలేదు చప్పట్లు. ఆనక పేరిణీ నృత్యరీతిని నేర్పుగా ఓర్పుగా ప్రదర్శించింది. పండితుల ప్రసంశలకు పాత్రురాలయింది.

ఇంత వరకు పేరిణిని అంత సమగ్రంగా చేసిన వారు లేరని అభినందించారు.

ప్రముఖ నాట్యాచార్యుడు ‘వర్మ’ గారు శ్రీలక్ష్మి ప్రదర్శించిన నృత్యరీతులపై మాటాడాడు. ఆయన ఆనందం అంతా ఇంతా కాదు.

“ఈ కన్నులెంత పుణ్యం చేసుకున్నాయో. అపురూపతను సంతరించుకున్న ప్రదర్శనను చూసే అదృష్టం నాకు కలిగింది. ఇంత ప్రావీణ్యతను సంపాదించిన చిరంజీవి శ్రీలక్ష్మిని మనసా వాచా అభినందిస్తున్నాను. అజరామరమైన అద్భుత నృత్యరీతులను మళ్లా జనం మందుంచే స్థితి ఉందా? అని అనుమానిస్తున్న నాబొంట్లకు ఇది కొండంత ఆశను పెంచింది. ఇది బతుకుతుంది. నాలాంటి వాడు దీన్ని గురించి మథన పడే పరిస్థితి తొలగిపోయింది” అన్నాడు.

బాగా విజయవంతమైంది ప్రదర్శన.

శారద లేచి స్టేజీ ముందుకు వెళ్లి ఆవిడ అమ్మమ్మ ఇచ్చిన రాళ్ళ గొలుసును తీసి వర్మగారి చేత ఉంచి దాన్ని తన చిరుకానుకగా శ్రీలక్ష్మికి ఇవ్వమని దిగి వచ్చింది.

వర్మగారు శ్రీలక్ష్మిని పిలిచి కానుకను ఆవిడకిస్తూ “ఓ అభిమాని పేరిణి నృత్యరీతులకు పరవశించి ఇచ్చిన కానుక. శాస్త్రీయ నృత్యం వెనుకబడుతున్న ఈ రోజులలో ఇలాంటి అనుభూతిని స్పందనను కల్గించిన చిరంజీవి శ్రీలక్ష్మిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ‘ధ్రువతారగా’ వెలుగొందాలని కోరుకుంటున్నాను” అన్నాడు.

ప్రదర్శనానంతరం గ్రీన్ రూం దగ్గరకెళ్లారు. శారద జయంతి రవి.

జయంతి తలుపు తట్టగానే, తలుపు తెరిచి, జయంతిని చేయి పట్టుకొని లోనికి తీసుకొనిపోయి ఎదురుగా కూర్చుండబెట్టుకుని.. “వదినేది?” అనడిగింది.

“నా వెంటనే ఉంది. నువ్వు నన్ను లాక్కొచ్చావు గదా, అక్కడే ఆగిపోయివుంటుంది.”

అనగానే పరుగున వెళ్లి శారదను రవినీ తీసుకొని వచ్చింది. జయంతి పక్కన శారదను నిలబెట్టి “నీ సెలక్షన్ సూపర్బ్” అంది.

“No. నా సెలక్షన్ కాదిది. ఆవిడే నన్ను..” అన్నాడు దూరం జరిగి.

“అక్కడ నుంచి పెళ్లి చేసుకున్నది, ప్రస్తుతం భార్యా భర్తలం” అన్నాడు శారదను చూస్తూ.

“‘శ్రీ’, నువ్వు ‘కళ’కే ‘ఆణిముత్యం’లా భాసించావు. నువ్వు మావారి చెల్లిగావడాన్ని నేను గర్వంగా భావిస్తున్నాను. ఇక నాకు నృత్యపు లోతు తెలీకున్నా నీ నృత్యం జనరంజకంగానే గాక సమ్మోహనంగా కూడా ఉంది. బాగా ఆనందించాం. నీకు దొరికిన గౌరవంలో భాగస్వామ్యం ఉందనిపించి మరచిపోలేని అనుభూతినిస్తుంది చాలు” అంది శారద.

ఆనక మరీ దగ్గరగా జరిగి “కొత్త అయినా ఇలా మాటాడుతుందేమిటి? అని అనుకున్నా పర్వాలేదు. మీ అన్నయ్య చెప్పేవి అన్నీ నిజాలు కావు. అలా అని అన్నీ అబద్ధాలు చెప్పడు. అయినా నేను నీకు చెప్పాల్సిన పని లేదు. నువ్వు స్వయానా చెల్లెవి గదా” అని నవ్వింది శారద.

శారద మాటాడుతుంటన్నంత సేపూ చిత్తరువులా చూస్తుండిపోయింది శ్రీలక్ష్మి.

జయంతి మాత్రం శ్రీ చేయి పట్టుకొని “అమ్మ ఎలా ఉంది?” అనడిగాడు.

“పరవాలేదు” అంది.

“డ్రస్సు మార్చుకున్నావు గదా! ఇక వెళ్దాం పద, నీ సామాను సర్దు” అంది శారద చనువుగా.

“అవును, ఇంటికి వెళ్దాం” అన్నాడు జయంతి లేచి.

శ్రీ బ్యాగ్ బ్యాగేజ్ సర్దుకొని మేనేజరుకు ఫోను చేసి శారద వెంట నడిచింది. “పద” అంటూ నడూస్తూ.

“అమ్మను కూడా తీసుకొస్తే బావుండేది కదా!” అన్నాడు.

“జర్వంతో ఉంది మూడు దినాల నుండి. ఇంత దూరం ఆ టెంపరేచర్‌లో రావడం మంచిది కాదనిపించింది నాకు. అమ్మ ఇక్కడికి అనగానే నేను వస్తాను అన్నట్లు చూసింది. నేనే వారించాను. అమ్మకు పూర్తిగా నయమయ్యాక తప్పక వెంటపెట్టుకుని వస్తాను. ఓ వారం రోజులన్నా మీతో గడపాలని ఉంది” అంది జయంతిని చూస్తూ.

“అది సరే, సినిమాలు ఎన్ని ఒప్పుకున్నావు?” అడిగాడు.

“అయిదారు. రెండు పూర్తి అయినయి. పోయిన నెలలో ఒక్కటి సగం అయింది. రెండు ప్రారంభంలో వున్నాయి.”

“మంచివేనా?”

“బ్యానర్లు మంచివే. కథలు నేను విన్నది రెండే. అవి బాగానే ఉన్నాయి. మిగిలినవి సెట్ మీద చెప్తారు.”

“అయినా ఒప్పుకున్నావు” అని నవ్వాడు.

“నృత్య ప్రధాన పాత్రలకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తున్నాను. అవి అలాంటివేనన్నారు.. చూద్దాం” అంది.

ఇంతలో కారు ఇంటి ముందుకొచ్చి ఆగింది. నల్గురు దిగి లోనికొచ్చారు.

“అదే ఇల్లు గదా?” అంది ఆనందంగా.

తల ఊపాడు జయంతి.

“ఇప్పుడు ఇది ఇల్లులా కళకాంతులతో ఉంది.”

“ఊఁ!”

“ఇల్లు చూసి ఇల్లాల్ని చూడమన్నారు మన వాళ్లు. నువ్వు ముందస్తే ఇల్లాల్ని చూపి ఇల్లును చూపిస్తున్నావు” అంది మారాం చేస్తున్నట్లు పసిదానిలా.

శ్రీలక్ష్మీ మాటలకు నవ్వుకుంది శారద.

శారద దగ్గరగా వెళ్లి వాటేసుకొని “వదినా ఆగు, అప్పుడు ఇదే ఇల్లు చెత్త కుండీలా ఉండేది. ఏ వస్తువు కావాల్సినా అన్ని వస్తువులూ ఇంటినే ఉండి దొరికే సరికి తలప్రాణం తోకకు వచ్చేది పో” అని ఆగి “ఓ విషయం చెప్పనా” అంది.

“చెప్పు ఇక్కడి దాకా వచ్చాక అగడమెందుకు?” అంది శారద.

చెవి దగ్గరకు వచ్చి “నే వెళ్లాక అన్నయ్యను ఆటపట్టించవు గదా, ప్రామిస్?” అంది.

“అదేం లేదు, చెప్పు” అంది.

“లుంగీ దొరక్క పాంటు పైననే పడుకొన్న రోజులూ ఉన్నాయి. తీరా ప్రొద్దుటే అది మంచంలోనే ఉండేది” అని నవ్వింది పెద్దగా.

శ్రీలక్ష్మి నవ్వు చాలా అందంగా ఉంది. అట్లాగే చూడాలనిపించింది.

‘సినిమా తార. నృత్యకళలో ఆరింద. అయిన ఈ పిల్ల ఎంత నిగర్వి. ఈమె మావారి చెల్లెలా?’ ఆశ్చర్యమనిపించింది శారదకి.

ఆనందం నిండిన కళ్లతో అపూరూపంగా చూసింది.

(ఇంకా ఉంది)

Exit mobile version