[పార్వతిని పెళ్ళి చేసుకుని సాంఘికంగా స్థిరపడతాడు శివరాం. పలు రకాల వ్యాపారాలున్న జయంతీలాల్‌తో స్నేహం కలుస్తుంది. కుటుంబ మిత్రుడవుతాడతను. శివరాంకి అన్ని రకాలుగా ఆప్తుడవుతాడు. జయంతి అవివాహితుడు. పెళ్ళి చేసుకోమని పార్వతి, శివరాంలు చెప్పినా పట్టించుకోడు. ఒకరోజు ఎందుకో పార్వతి దగ్గర ఏడుస్తాడు జయంతి. కారణం చెప్పమంటే తన గతం తెలుసుకోవాలని, రాత్రికి వచ్చి చెప్తానని అంటాడు. రాత్రి భోం చేశాకా తన గతం చెప్తాడు. లక్నోలో అమ్మానాన్న, అక్క, తాతయ్యలతో ఉండే తన జీవితం గురించి చెప్పి, కొన్నేళ్ళ తరువాత మత కలహాల వల్ల తల్లీదండ్రిని, అక్కని కోల్పోయానని వివరిస్తాడు. ఇక చదవండి.]
[dropcap]“ప[/dropcap]గలు పోలీసు బందోబస్తుతో మూడు శవాలను ఖననం చేసి వచ్చాడు తాతయ్య.
నన్ను వెంట తీసుకెళ్లలేదు. ఆ తరువాత రెండు వారాల వరకూ లక్నో అల్లకల్లోలంగానే ఉంది. నెమ్మది నెమ్మదిగా నిమ్మళపడ్డది. ఈలోపు ప్రభుత్వం అంగవైకల్యం పొందిన వారికి ఎక్స్‌గ్రేషియాలను ప్రకటించింది. ఇక్కడ మనిషి విలువ ఇంత తక్కువా? అనిపించింది. తాతయ్య పది దినాలదాకా భోం చేయలేకపోయాడు. ఇల్లంతా తిరుగుతూ ఏవేవో గుర్తు చేసుకుంటూ ఎంత ఏడ్చాడో? నేను తాతయ్యను సముదాయించాల్సిన స్థితి. తడి గుడ్డతో నేనే తాతయ్య ముఖం తుడిచి ఆయన ఒళ్లోనే కూర్చుని రొట్టెను బలవంతాన తినిపించి కొద్దిగా నీళ్లు త్రాగించాను. నన్ను అలాగే వాటేసుకుని ఎంత ఏడ్చాడో? ఆయన స్థితి చూసాక నేనిచ్చిన మంచినీళ్ళే తులసి నీళ్ళవుతాయని భయపడ్డాను. కానీ నా భయం తప్పే అయింది.
తాతయ్య మళ్లా మనుషులలో పడ్డాడు. కానీ ఎక్కువ భాగం పరధ్యానంలో ఉండేవాడు. నాల్గు అయిదు సార్లు పిలిస్తే కాని ఆఁ! అంటూ మన వైపుకు మళ్ళేవాడు కాదు.
ఓ రోజు ప్రొద్దుట మా నౌకరు రాంధున్ – ఖాశిం మళ్లా కబేళా ప్రారంభించాడని చెప్పాడు. తాతయ్యలో వణుకు వస్తుందీ మాట వినగానే. కుర్చీ నుంచి లేవలేకపోయాడు. లేచినా అడుగు పడదనిపించింది. ఆ తరువాత ఏమయిందో తెలీదు కానీ అది మొదలు తాతయ్య చరాచరాస్తులనన్నింటినీ బేరం పెట్టి వచ్చిన కాడికి అమ్మకాలు చేసేశాడు. ఉంటున్న ఒక ఇల్లు తప్ప అంతా అంతా సర్వం అమ్మాడు. ఓ రోజు నాల్గు సూటుకేసులు తెచ్చాడు తాతయ్య. వాటిల్లో బంగారం, పైసలు, పత్రాలు, అమ్మానాన్న, చెల్లి ఫోటోలు, బట్టలూ సర్దాడు. దగ్గర కూర్చుని నాకు రొట్టె తినిపించాడు. నిద్రపోయిందాకా నా దగ్గరే ఉన్నాడు. అపరాత్రి దాటాక నిద్ర లేపాడు. సామానుతో బయటకొచ్చి ఇంటికి తాళం వేసాడు. రైల్వే స్టేషన్‌కు చేరాం తెల్లవారునే. రైలులోనే ‘మనం హైద్రాబాదు వెళ్తున్నాం’ అని చెప్పాడు. కాని అక్కడ ఆగలేదు. ఇక్కడ దిగాం.
మేం వచ్చిన నాల్గు దినాలకు లక్నోలోని ఓ ఫాక్షన్ లీడర్ ఖాశిం ఆత్మహత్య చేసుకున్నాడని పేపరులో వచ్చింది. తాతయ్య లక్నోని ఎందుకు వదిలి పెట్టాడో అర్థమైంది. మా మొత్తం కుటుంబాన్ని నిష్కారణంగా నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్న హంతకుడు చనిపోయినందుకు మంచిగా అనిపించింది. గుండెలపై నున్న బరువు దిగిపోయిన భావన. అయితే ఈ సంతోషం ఓ నెలయినా నిలువక ముందే తాతయ్యకు పక్షవాతం వచ్చింది. కాలు, చెయ్యి, నోరు పడిపోయింది. చిన్నవాడినైన నేను ఎంత ఖరీదైన వైద్యం చేయించినా ఆయన దక్కలేదు. చివరి క్షణాన కూడా నా చేతిని పట్టుకొనే ఉన్నాడు. పట్టుకున్న చెయ్యి బిగుసుకోవడంతో నాకు అర్థమైంది. దహనసంస్కారం చాలా సజావుగా పూర్తి చేసాను. అప్పటి నుంచి ప్రారంభమైంది నా ఒంటరితనం. అలక్ నిరంజన్.
చాలా సార్లు చనిపోతే బాగు అనుకున్నాను. ఆ దిశగా ప్రయత్నించే ధైర్యం చాలలేదు. ఆ రాత్రి మొదటి సారి తాతయ్య సూట్‌కేసు తేరిచి చూసాను. డైరీ కనిపించింది. చదివాను. ఆనక నాకు చావాలని అనిపించలేదు. నేనిక్కడ కొంత పూర్తి చేయాల్సింది ఉంది అనిపించింది బాధ్యత గానూ. ‘చావడం పిరివాడి లక్షణం. దరికి రానీకు’ అని తాతయ్య చెవిన చెప్పినట్లు అనిపించంది. సూట్‌కేస్ చివరిన ఓ కాగితం దొరికింది. ‘బాబూ జయంతి, ఒంటరివానిగా మిగిలావని భయపడకు. బాధపడకు. మేం నిన్ను వెన్నంటే ఉంటాం. పిరికి పారి బ్రతుకున వెనక్కు తిరగద్దు. నా కన్న కూతురును, అల్లుణ్ణి, మనవరాల్ని అకారణంగా చంపినా బ్రతికాను. నువ్వు నాకు మనవడివి. మన కుటుంబానికి మిగిలిన దీపానివి. చావుతో పోరాడతావు తప్ప చావును ఆహ్వానించవు, నాకు తెలుసు. ఒకే ఒక్క విషయం. ఖాశింది ఆత్మహత్య కాదు. ఇతనికి అమర్ అనే కొడుకున్నాడు. అతన ఈ కిరాతకంలో భాగస్వామే. అయితే నువ్వు నేరస్థుడిగా ఉరికంబమెక్కినా పర్వాలేదు. అతన్ని మాత్రం మిగల్చకు’ అని ఉంది. అయితే తాతయ్య డైరీలో ఇంకా చాలా ఆసక్తిని కల్గించే సంగతులున్నాయి. ఆనక నేను అమర్ విషయం తెలుసకున్నాను. మాకు జరిగిన అన్యాయంలో అతని పాత్ర లేదు అని అర్థమైంది. అయితే నాకిది తెలిసే వరకే అమర్ సకుటుంబంగా కారు యాక్సిడెంటులో చనిపోయాడు. అదీ లోయన పడి. మాంస ఖండాలు కూడా దొరకని స్థితిలోన. ఈ విషయం తెలిసి నా మనసులో ఎలాగో అయింది. శిక్ష నేరస్థునికి తప్ప నిర్దోషికి కాదు కదా. నేను ప్రత్యేకంగా లక్నో వెళ్లి సానుభూతి తెలిపి వచ్చాను” అని ఆగాడు.
జయంతి ముఖాన ఏ భావనా లేదు.
కొంతసేపు ఆగి, “జయంతీ, నువ్వు పెళ్లి ఎందుకు మానుకున్నట్టు?” అని అడిగింది పార్వతి.
“వద్దనిపించింది.”
“కారణం?”
“పార్వతీ, ఇక్కడి మనిషిని ఎంత చౌకగా కొనవచ్చునో అర్థమయ్యాక ఇంటి కొక దాన్ని తెచ్చి బంధాలనీ, బాధ్యతలనీ, బాధలనీ పెంచుకోవడం వివేకం కాదేమో అనిపించింది నాకు.” అన్నాడు నవ్వుతూ.
“అంటే?” అంది సీరియస్‌గా.
“అసలు పెండ్లి ఎందుకు? నువ్వు చెప్పు?” అని తనే ప్రశ్నించాడు పార్వతిని నిశితంగా చూస్తూ…
బిత్తరపోయింది పార్వతి. ఈ ఎదురుదాడిని నిగ్రహించుకొని సమాధానం చెప్పింది .
“అకారణంగానే లోకంలో పెండ్లిడ్లు అవుతున్నాయంటావా?” అంది.
“నేనీ ఈ విషయం పైన అంతగా మనస్సు పెట్టి ఆలోచించలేదెప్పుడూ. కానీ పెండ్లి అవసరం ఎంత? అనేదాని పైన నాకున్న అభిప్రాయం వేరు. అయినా నాకు తెలీకడుగుతానూ పెండ్లి తంతు పుట్టక ముందు ఈ భూమ్మిద మనిషి కూడా సంతానం కనలేదా? తిని తిరుగాడుతూ బ్రతకలేదా?” అని నవ్వి “పార్వతీ ముఖ్యంగా నా బోటి వాడు పెండ్లి ఎందుకు చేసుకోడో చెప్పనా? మనస్సు కలసిన మనస్సెరిగిన మనిషి తటస్థపడక. That all. ఇక వట్టి శరీరాల కలయికకు మనస్సు అవసరం లేదు. పెండ్లి అక్కరలేదు. కోరిక, అవకాశం ఉంటే చాలు. ఇక ఇప్పటి ఈ సమాజాన వయస్సు ఆటుపోట్లు కాచుకునేందుకు తక్కువ ఖర్చులో చాలా ఎక్కువ అణుకువగా ఉండి అలరించగల్గిన అనేకులు మనకు ఉన్నారు” అన్నాడు.
పార్వతి మొఖం ఎఱ్ఱబడింది. లేచి లోనికెళ్లింది. అప్పుడే అర్థమయింది జయంత్‌కి తాను పార్వతితో మాటాడుతున్నాని. బాధనిపించింది. తాను లేచి పార్వతికి చెప్పకనే కారెక్కాడు. ఇంటికే వచ్చి హాలున ఉన్న వాలుకుర్చీలో కూర్చున్నాడు. మంచిగ అనిపించలేదు. కునుకూ రాలేదు. తల దయ్యాల కొంపలా మారింది. విస్కీ త్రాగితే అనిపించింది. బయటకు వెళ్లాలనిపించింది. ఎవడైనా వచ్చి మాటాడితే బాగు అని కూడా అనుకున్నాడు. కాని ఏదీ జరగలేదు. ఫ్రిజ్ దగ్గర కెళ్లి పొట్ట నిండా చల్లటి మంచి నీళ్లు త్రాగాడు. కొంచెం అలస్యంగానైనా నిద్ర మాత్రం పట్టింది. పిచ్చి పిచ్చ కలలు వచ్చాయి. ఆలస్యంగా మెలకువ వచ్చింది. బాత్ రూంలో జొరబడి, బయటకొచ్చి కాఫీ త్రాగి శివరాం ఇంటికే బయలుదేరాడు. కారు ఇంటి ముందు వెళ్లగానే రవి మూడు గిఱ్ఱల సైకిలుతో కుస్తీ పడుతూ కనిపించాడు.
లోనికి చూచాడు. శివరాం వెనక నిల్చుని ఏదో చెప్పుతుంది పార్వతి. శివరాం ఆప్యాయంగా జయంత్‍ని పలకరించి గదిలోకి తీసుకునిపోయి కూర్చోబెట్టాడు. పార్వతి రాలేదు. ఇద్దరూ పిచ్చాపాటీలో పడిపోయారు. మధ్యలో “శివరాం, నాకివాళ్ల రెండున్నర లక్షలు కావాలి” అనడిగాడు జయంతీ.
“యూనియన్ బ్యాంక్ చెక్కు ఇస్తాను. తీసుకొని వెళ్లు” అన్నాడు చెక్ పై సంతకం చేసి ఇస్తూ.
తీసుకొని పర్సులో పెట్టుకొని వంటింటి వైపు నడిచాడు.
ఎదురైంది పార్వతి.
“దాహంగా ఉందోయ్” అన్నాడు.
మంచి నీళ్లిచ్చింది. తాగి “చల్లగా లెవ్వు. బహుశా ఫ్రిజ్‌లో చల్లబడినవే అయి ఉండాలి. నీళ్లు ఇచ్చిన చెయ్యి వేడిగా ఉన్నా ఇలా అవుతాయి” అని వెనక్కి మళ్లాడు.
వెనక నుంచి కాలర్ పట్టుకొని ఆపింది పార్వతి.
“నీకు కోపం పోలేదు కదా వెళ్తాను” అన్నాడు.
“అట్లాగే ఉంది, సాయంత్రం నువ్వు వస్తున్నావు” అంది.
“ఎందుకో?”
“చూద్దుగాని నీకు దగ్గర వాండ్లున్నా తీసుకొనిరా” అంది.
“All right. అలాగే” అని కారు దగ్గరకెళ్లి చాలా speed గా వెళ్లిపోయాడు.
మాట ప్రకారం జయంతీ, సింహాద్రి నాయుడు, Dr.హర్ష, శివరాం ఇంటికి చేరారు.
పార్వతి, రవి, బ్రహ్మం అతిథుల కోసం ఎదురు చూస్తూ కనిపించారు. అంతా లోనకెళ్తూ సుఖాసీనులయ్యారు. జయంతి పార్వతిని పిలిచి సింహాద్రి నాయుడ్ని, Dr. హర్షనూ పరిచయం చేసాడు. Dr.హర్ష నలభై అయిదు ఏభై మధ్య ఉంటాడు. కానీ కుర్రాడిలా కనిపించడమే కాని కుఱ్ఱకారు sprit ఉన్నవాడు. మితభాషి, మంచి చదువరి. హుందాతనం అన్నది ఆయన దగ్గరే నేర్చుకోవాలి అన్నట్టుంటాడు. సింహాద్రి age group ఇదే అయినా 60 పైబడినవాడిలా కనిపిస్తాడు. బట్టతల. సోడా గ్లాసు కళ్లద్దాలు. లాల్చీ పైజామా, భుజాన కండువాతో రఫ్‌గా అనిపిస్తాడు. బాగా స్థితిపరుడు. నడచే నేషనల్ లారీలే ఇరవై ఉన్నయి. పది మందికి ఏకకాలంలో సమాధానం చెప్పగల నేర్పరి. మాట తీరు బాగుండదు. రీజనింగ్ ఉంటుంది.
“జయంతీ, ఇప్పుడు నేను ఎందుకు రమ్మన్నానో తెలుసా?” అంది పార్వతి.
“చెప్పందే తెలీడమెలా?” అంటూ ప్రశ్నార్థకంగా మెఖాలు పెట్టారు.
“మన రవి జిల్లా నున్న అన్ని స్కూళ్లకు కలిపి నిర్వహించిన వ్యాసరచన పోటీలో రామాయణం పైన వ్రాసిన దానికి మొదటి బహుమతి వచ్చింది.”
“Very good. చాలా మంచిది” అన్నారు సంతోషంగా.
“మరో సంగతి, మేం ఈ ఇంట్లో కొచ్చి సరిగ్గా మూడు సంవత్సరాలు” అంది.
“మూడు సంవత్సరాలుగా లేనిది, ఇవ్వాళ గుర్తు ఎందుకు చేసుకుంటున్నాట్టు?”
“కారణం ఉంది. మా కంపెనీ ఇన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాగా workout చేసింది వ్యాపారాన్ని” అంటుడగనే అడ్డొచ్చి, “రవి సంగతి ఉదయమే చెప్తే ఏదో ఒకటి తెద్దునుగదా” అన్నాడు జయంతీ.
“కానుకలు స్వీకరింపబడవు.”
“ఇదొకటుందన్న మాట…” అని “ఏర్పాట్లు?” అన్నాడు సింహాద్రి నాయుడు.
“అన్నీ రెండు నిముషాలలో మీ ముందుంటయి.” అని బ్రహ్మాన్ని పిలుచుకొని లోనికెళ్లింది.
అతను అన్నీ తెచ్చి గ్లాసులు నింపి ఇచ్చాడు. వారు సిప్ చేయబోతుండగా రవి కుర్చీ పైకెక్కి నిల్చుని “please wait a while” అన్నాడు.
రవిని చూస్తూ ముగ్గురు అగారు.
“నాకు మొదటి బహుమతి అయితే వచ్చింది గానీ రామాయణంలో కొన్ని సందేహాలు మాత్రం నన్ను వదలడంలేదు” అన్నాడు.
“ఏమిటో బహుమతి పొందిన నీకే అనుమాలొస్తే మాకెలా తెలుస్తుందనుకుంటున్నావు?” అన్నాడు డాక్టర్ నవ్వుతూ.
“చెప్తాను, కొంచెం శ్రద్ధగా మనసు పదును పెట్టండి. ఒకటి రామాయణం చరిత్రా, పురాణమా? ఒక వేళ చరిత్రే అయితే ఆధారాలేమైనా ఉన్నాయా? రెండు వాల్మీకి అంతా వ్రాసాడా? లేకుంటే ఆయన వ్రాసిందెంత? మూడు రామాయణం వ్రాసే నాటికి లిపి ఉన్నదా లేదా? వీటికి సమాదానం కావాలి. జయంతి అంకుల్ బాగా లోకజ్ఞానం ఉన్నవాడు. హర్ష అంకుల్ తాను మంచి చదవరిగా పేరే కాక బాగా తెల్సిన వ్యక్తిగా గౌరవమున్నది. నాయుడి గారికి చదువు తక్కువ గాని బ్రతుకు పుస్తకాన్ని బాగా అధ్యయనం చేసిన వాడని నాన్నగారు అనగా విన్నాను. ఇక మీరు ముగ్గురూ స్నేహితులే అయినా మీ ఆలోచన సరళి స్థాయి వేరు కనుక…” అని ఆగాడు.
“I will tell you my boy” అంటూ Dr.హర్ష లేచాడు.
“వద్దు సార్. అందరూ వినేలా మీరు ఒక్కరూ చెబితే చాలు.”
ఈ ప్రభావం, విశ్లేషణా వారి సమాధానాలపై పడింది.
“అంచేత ఈ వారం చివర ముగ్గురి మీ ముగ్గురు ఇళ్ళకి వస్తాను. అప్పుడు నాకు చెప్పాలి” అన్నాడు.
O.k అన్నారు ముగ్గురూ. రవిని జయంతి ముద్దెట్టుకున్నాడు దగ్గరికి తీసుకొని. సింహాద్రికీ అలా చేయాలనిపించింది. భోజనాలు ప్రారంభమైనాయి. జయంతి శివరాం కోసం తొంగిచూడడం గమనించింది పార్వతి. ‘ఆలస్యంగా వస్తాడు’ అని దగ్గరకొచ్చి పార్వతి చెప్పాక నవ్వి మొదలెట్టాడు.
జయంతి ఇంటికి చేరే సరికి రాత్రి పన్నెండు అయింది.
రవి ఆటగోలుగా వేసిన ప్రశ్న అయినా జయంతి మనస్సును వదలలేదు. పసివాడు వేసే ప్రశ్నకాదిది. మా ముగ్గురి మానసిక స్థాయిని విశ్లేషించే ప్రశ్న అనుకుంటుండగా సింహాద్రి నాయుడూ, Dr.హర్ష గుర్తులోకొచ్చారు. ఈ హర్షది మామూలు కుటుంబం. నల్గురు సంతానంలో మూడోవాడు. పెద్దవాడు వ్యవసాయం. రెండోవాడు పది పాసయి బడిపంతులయ్యాడు. హర్ష పది చదువు పూర్తి కాగానే ప్రక్కనున్న టౌనుకు కాలేజీ వచ్చింది. చేరాడు. చదువు పై శ్రద్ధ ఉన్నవాడు గనుక మంచి మార్కులతో ప్యాసయి డాక్టరు చదువుకు అర్హత పొందాడు. రెండేళ్ళు సజావుగానే గడిచినయి. హర్ష తండ్రి అకస్మాత్తుగా పోయాడు. దాంతో చదువు ఆగే పరిస్థితి ఏర్పడింది. అప్పటికి మిగిలి ఉన్న అప్పును భరించేందుకు అన్నదమ్ములు అంత సుముఖత చూపలేదు. ఈ స్థితిలో ఆ ఊరి మునసబు హర్షపై వల విసిరాడు. లక్షలు కట్నం పోసి డాక్టరును కొనుక్కునే బదులు ఇట్లా అయితే బాగు అనిపించినట్లుంది. అలస్యం చేయక తను హర్షతో మాట్లాడాడు – ‘నాకు ఉన్నది ఒక్కతే ఆడపిల్ల. దానికిచ్చేది దాని పేర్నే ఉంది. దాని పై నీ చదువుకు సరిపడా కౌలు వస్తుంది. నీకు ఇష్టమయితే’ అని. ఊహించని అదృష్టానికి తలమునకలై తల ఊపాడు. ఆ మర్నాడి నుంచే మకాం మునసబింటికి మార్చాడు. నిశ్చింతగా చదివాడు. డాక్టరు పట్టా హర్ష చేతికొచ్చే నాటికి మున్సబూ గతించాడు. పెండ్లి జరిగిపోయింది. మున్సబు ఆస్తి దావాలలోకి వచ్చింది. దాయాదులు ఎదురుతిరిగారు. దాంతో డిగ్రీతో టౌనుకొచ్చాడు హర్ష. ప్రైవేటు ప్రాక్టీసు పెట్టాలనుకున్నాడు. మరి దీనికి అండా ఒకరు దొరకాలిగదా, పది బెడ్లు అయినా పట్టే ఇల్లు దొరకాలి. మందులకు పరీక్షకు గదులున్నదై ఉండాలి. ఈ ఆలోచనతో మొదటి నుంచీ వామపక్ష రాజకీయాలకు ఆకర్షితుటైన వాడుగనుక ఆ పెద్దలను కలిసాడు. వారి ధోరణి మరోరకంగా కనిపించింది. వారి పార్టీ ముద్ర వేయించుకుంటే జిల్లా పార్టీ పూర్తిగా వత్తాసు ఇస్తుందనీ, లేకుంటే లేదనీను. తనుగా చేయడం సాధ్యమనిపించక ఆలోచించి ఒప్పుకున్నాడు. వారి షరతులకు లోబడే ఆసుపత్రి ప్రారంభంచాడు. బంగారం తాకట్టు పెట్టాడు. కావాల్సినవి (అత్యవసరంగా) తీసుకొన్నాడు. వారి ఆదేశానుసారమే రెండు రూపాయల ఫీజు పెట్టాడు. పదిమంది R.M.P లను కలిసి మాటా మంతి చెప్పి వాళ్లతో కలసి పని చేయసాగాడు. పార్టీ అండా అతని ప్రవర్తనా వల్ల రెండు సంవత్సరాలలో హర్ష తిరుగులేని డాక్టరుగా మంచి పేరు సంపాదించాడు. అతన్ని చూసి పార్టీ గర్వపడేటంతగా కృషి జరిగింది. అప్పుడు స్వంతంగా ఆసుపత్రి నిర్మాణానికి గుట్టమీదున్న ఖాళీ స్థలాన్ని ఎంచుకున్నాడు. ఉండేటందుకు దానిలోనే విడిగా వేరే ఇల్లుకు ప్లాన్ చేసాడు. రోగులకు ఎప్పుడూ అందుబాటులో ఉండేందుకు మాత్రమే ఆయన ఇల్లు అక్కడ కట్టుకున్నాడని చెప్పుకున్నారు. మరో రెండు సంవత్సరాలు గడిచేసరికి ఇల్లూ ఆసుపత్రితోపాటు ప్రజా వైద్యుడిగా స్థిరపడ్డాడు. ఇప్పుడు జిల్లా పార్టీకీ సానుభూతిపరులకూ వైద్యుడు అంటే హర్షే. ఇతర పార్టీల వాళ్ళ వచ్చినా లౌక్యంగా వ్యవహరించి సౌమ్యునిగా పేరు తెచ్చుకున్నాడు. ఎవనికి ఏం కొంచెం అస్వస్థత వచ్చినా మన డాక్టరుగారి దగ్గరకెళ్తు అనేంతగా మామూలు జనం నోళ్లలో కొచ్చాడు. అంటే ఆసుపత్రి ఎంత రద్దీగా ఉంటుందో అర్థమవతున్నది గదా! ఇక వెళ్లిన రోగి తాను చెప్పుకునేది వింటూనే అతను పెదవి విప్పక పరిశీలించటం పూర్తి చేస్తాడు.
మరీ అవసరం అనిపిస్తే తప్ప ప్రశ్నవేయడు. చిట్టీ వ్రాసి ఎప్పుడూ చేతికిస్తాడు. ఆ చిట్టీ తీసుకున్న కాంపౌండరు ఓ సూది తప్పనిసరిగా వేసి (అది ఏ రోగమైనా) పైసలు తీసుకొని మందులు కొనిపించి పంపుతాడు. జనం తీర్థయాత్రలా సాగారు.
ఉదయం ఏడు గంటలకు సీటులో కూర్చుంటే సాయంత్రం మూడున్నర నాల్గు అయ్యేదాకా క్యూ ఉండేది. మళ్లా రాత్రి ఆరు గంటలకు కొచ్చి లోపలి రోగులను చూసి వచ్చి కూర్చుంటే మళ్లా జనం ఉంటేవారు. పదకొండు గంటలు కూడా అవుతుండేది. ఆ తరువాత పార్టీ వారొస్తే మాటామంతి కానిచ్చేవాడు. మన దేశాన వేసిన ఒక పంచవర్ష ప్రణాలిక కాలం మనని ఏ మేర బాగు చేసిందో తెలీదుగానీ మన డాక్టరు విషయంలో మాత్రం ఈ కాలం విశ్వరూపుణ్ణి చేసింది. ఆయన అన్న వ్యవసాయన్నొదిలి కాంట్రాక్టరుగా ఎదగడం, రెండో అన్న ఉద్యోగాన్ని వదలి ఎఱువుల దుకాణం – లారీలూ హోల్‌సేల్ ఎరువుల దుకాణం – వగైరాలలోకి అడుగు పెట్టడం; చివరాయన గ్రానైట్‌లో కెళ్లడం జరిగింది. ఇలా నడక ప్రారంభించిన వీరికీ ఓ పంచవర్ష ప్రణాళికా కాలాననే. ఇంక వాండ్లు ఉన్నా ఊడిపోయినా పోయేదేం లేదు, నాల్గు తరాలు నిశ్చింతగా బ్రతకొచ్చు అన్నంత ఇదిగా ఎదిగి పోయారు పార్టీ ప్రజా పేరున.
ఒక దాల్ మిల్ల, ఒక పారా బాయిల్డ్ మిల్లు, ఓ సినిమా హాలు, ఏభై ఎకరాల మాగాణి ఒకే చోట. రెండు బస్సులు. ఒ స్టారు హోటలు. ఇద్దరు కొడుకులూ. కూతురూ డాక్టర్లుగానే తయారవుతుండడం. ఇలా ఊడలమఱ్ఱిగా ఎదుగుతూనే ఉంది. ఇది కాక ఈయనకు ఫేక్ మనీతో కూడా సంబంధాలున్నాయంటారు గిట్టని వాళ్లు. ఇంకా ఇలాంటివే అవాకులూ చవాకులూ. ఏనుగు వెళ్తుంటే కుక్కలరచినట్లు… నిజానిజాలు దేవుడనే వాడుంటే వాడికే తెలుస్తది. పిల్లలకు మాత్రం డాక్టరు ఆదర్శ వివాహాలు చేసాడు. వాళ్లకు కోట్ల ఆస్తి ఉన్నా, ఆడపిల్లకు మగవారితో సమానంగా వాటా పంచి ఇచ్చి అట్లా కూడా కీర్తి గడించాడు. కట్నం అన్న ముక్కను వినపడనీయలేదు. ఈయన ఇచ్చిన పసుపూ కుంకం క్రిందనే పుచ్చుకన్నా, అలానే ఈ కలికాలాన ఆయన విశాల హృదయాన్ని సువిశాలమైన దృక్పథాన్ని ఎందరు గుర్తించగలరు. ఇలా మన డాక్టరు ఇరవై సంవత్సరాలు అవిశ్రాంతంగా రోజూ పద్దెనిమిది గంటలు ప్రజాసేవనే గడపి వైద్యవృత్తిని వారి వారసులకు అప్పగించి పూర్తి ప్రజాసేవ చేసేందుకు – సేవ అనేది ఎలా ఉంటుందో చేసి చూపేందుకు – ప్రజల కోరికపై రాజకీయంలోకి అడుగు పెట్టాడు. మదర్ థెరిస్సా లానో మరో లానో సేవ చేయవచ్చు అనేది అర్థమైనా రాజకీయంగా కూడా అంతటి సేవ చేయవచ్చును అనేది చూపేందుకే గావచ్చు. జన జీవనాన్ని మెరుగు పరచడం ఆయన ముఖ్యోద్దేశం. కనుక జనంలో కొచ్చి వారికి కష్టసుఖాలలో పంచుకునేందుకు సిద్ధపడ్డాడు. దీన్ని వారి పార్టీ బుజానేసుకొని చాలా ఘనంగా మోసింది. మీటింగులు పెట్టారు. ఉపన్యాసాలిప్పించారు. దాని సారాన్ని వీరు విశదీకరించారు. బుద్ధి కథలు చెప్పారు. నాటకాలాడారు. ప్రచారం చేసారు. పేపర్లకెక్కించారు. ఇలా నానా హైరానా పడి రాజకీయపు నాయకుడిగా చేసారు. ఇప్పుడు వాళ్ల పార్టీ డాక్టర్ కమ్ రాజకీయ నాయకుడు. బంగారు స్థితి కల్గిన వాడు గనుక దాదాపు ఆ పార్టీకి God Father లాంటి వాడుగా ఎదిగాడు.
(ఇంకా ఉంది)