Site icon Sanchika

నియో రిచ్-30

[జయంతి ఇంటికొచ్చిన హరేరామ్ ఎంతకీ నిద్రలేవడు. మధ్యాహ్నం నిద్ర లేచి స్నానం చేసి, అన్నం తినేసి మళ్ళీ పడుకుంటాడు. ఇంతలో ఎవరో ఫోన్ చేస్తారు. ‘హనుమంతప్ప’ని చంపేశారు, జయంతికి చెప్పండి అని చెబుతారు, ఎవరు మాట్లాడుతున్నరని శారద అడిగితే, స్నేహితుడిని అంటాడా వ్యక్తి. జయంతి రాగానే చెబుతుంది. బయల్దేరుతాడు. రెండు గంటల తర్వాత ఆసుపత్రిలో అతని శవం దొరుకుతుంది. పోస్టుమార్టం తరువాత దహనం పూర్తి చేయించి ఇంటికి చేరుతాడు జయంతి. అంతకుముందు హనుమంతప్ప తెచ్చి ఇచ్చిన ఓ సూట్ కేస్‍ని రహస్య ప్రదేశంలో దాచి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి తెల్లవారి మూడు గంటలవుతుంది. పదింటికి నిద్ర లేస్తాడు జయంతి. హరేరామ్ కనబడగా, నువ్వింకా వెళ్ళలేదా అని అడిగితే, రాత్రికి వెళ్తున్నా అంటాడు హరేరామ్. చెప్పకుండా వెళ్ళిపోయిన హరేరామ్ గురించి శారద కంగారు పడుతుంది. అతను పోలీసా అని జయంతిని అడుగుతుంది. నవ్వుకుంటాడు జయంతి. మర్నాడు ఉదయం టిఫిన్ తిని బయటకి వస్తాడు. సారంగపాణి వద్ద భానుమూర్తి కలిస్తే అతనితో వ్యాపారం గురించి, అతని కుటుంబ వివరాల గురించి మాట్లాడతాడు. తర్వాత ఇంటికి చేరుతాడు జయంతి. నడుం వాలుస్తుండగా కాలింగ్ బెల్ మ్రోగుతుంది. రామలింగం లోపలికి వస్తాడు. తనని పోలీసులు వెంటాడుతున్నారనీ, తన ఆస్తులని స్వాధీనం చేసుకున్నారని అంటాడు. లోపలికి రమ్మని, స్తిమితంగా కూర్చుని అసలేం జరిగిందో చెప్పమని అంటాడు జయంతి. ఇక చదవండి.]

[dropcap]“చె[/dropcap]ప్తాను” అంటూ కూర్చున్నాడు.

“నేను కాశీలో కటికి దుకాణాలు రెండు ప్రారంభించాను గదా! అవి నత్త నడకన ప్రారంభమైనా త్వరలోనే ఫర్వాలేదు అనిపించేలా ఎదిగినయి. ఇక కాశీలో చనిపోతే పుణ్యం వస్తుందని మన వాళ్లకు పెద్ద నమ్మకం గదా. అంచేత చివరి రోజులలో అక్కడకు వచ్చి చావు కోసం ఎదురు చూసే వాళ్లు అనేకులు కాశీలో బస చేసి ఉంటుంటారు. ఆ పద్ధతిన హరిశ్చంద్ర ఘాట్ (శ్మశానం) చాలా బిజీగా ఉంటుంది. కనుక చనిపోయిన వార్ని అక్కడ తల పండు పగలగానే గంగలోకి నెడుతుంటారు. అది నాకంట పడింది. ఒకనాడు నాకో ఆలోచన కల్గింది. నేను చేసేది వేట మాంసం, గొడ్డు మాంసం వ్యాపారం గదా; అందులో కలిపేందుకు ఇది పనికి వస్తుందేమో! అని. ఈ ఆలోచనకి నేను తెగ సతమతమతుతుంటే నా మిత్రుడొకడు ‘స్కెలెటన్లు’ కావాలి, వాటికి బాగా గిరాకీ ఉంది అని యాధృచ్చికంగా చెప్పాడు. అప్పుడు నా తలలో లైటు వెలిగింది. దాని ప్రకారం అలా వచ్చే శవాలను, చనిపోయి కొట్టుకొని వచ్చే వాటినీ చివరి ఘాటు దాటిన తరువాత ఉన్న మలుపులో ‘మరుగు’ చూసి పట్టుకొన ప్రారంభించాను. దాంతో ఇటు ‘స్కెలెటన్లు’ (అస్తిపంజరాలు), పని కొచ్చే మేర మాంసమూ దొరకసాగింది. ఈ మాంసాన్ని (పనికొచ్చే మేర) నాకున్న దుకాణాలకు పంపేవాటిల్లో కలిపి పంపడం ప్రారంభించాను. పది రోజులు ఏదైనా మార్పుగానీ ఎవరైనా మాట గానీ వస్తుందేమోనని బాగా కనిపెట్టి చూసాను. అంలాటిదేమీ లేదు. దాంతో అట్టాగే నడుపుతూ వచ్చాను. ఇది మొదలు పెట్టి కూడా దాదాపు పదేళ్లు దాటింది. దట్టాలు (అస్తిపంజరాలు), దానితో పాటు ఇదీ నిర్విఘ్నంగా సాగింది. ఇప్పుడు దొరికిపోయాను, నా దగ్గర నమ్మకస్థుడిలా ఉన్న ఓ నౌకరు ద్వారా. ఆ తరువాత నీకు తెల్సు. పేపర్లలో పెద్ద హెడ్డింగులు చూసే ఉంటావు. నేను జనానికి దొరికినా అక్కడ బ్రతకనిచ్చే స్థితి లేదు. నా భార్యా పిల్లలను వాళ్లే (జనం) బంధించారు. పోలీసులకు వాళ్లు ఆచూకీ తెలియనవ్వటం లేదు. ఆవేశంతో అసహ్యంతో, అసహనంగా ఊగిపోతున్నారు. ఇక పోలీసులు సంగతి సరేసరి. నా దుకాణాల్ని రెండింటిని తగలెట్టారు. అక్కడ పని చేస్తున్నవారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. నేను జనానికి దొరికితే చంపేస్తారు. పోలీసులకు దొరికితే ‘ఉరి’ వేయిస్తారు. ఏదైనా ఒక్కటిగానే ఉంది. నాకు ఏమీ తోచడం లేదు. బ్రతకాలని ఉంది.” అని గజగజా వణుకుతూ పెద్దగా ఏడ్చాడు.

జయంతి కూడా అసహనంగా ఊగిపోతూ కనిపించాడు.

“నువ్వు ఒక్కడివే నన్ను కాపాడగలవు, ఎట్టాగైనా అండమాను దీవులకు పంపే ఏర్పాట్లు చెయ్యి. అక్కడ నాకు ఉన్న అండతో మారు పేరుతో బతకగలను.”

“లాయర్ దగ్గరికి వెళ్లక, నా దగ్గరకెందుకు వచ్చావు?” అడిగాడు జయంతి.

“ముకుందం ఎవరో కాదు. స్వయంగా నా తోడల్లుడు. అంతే కాదు బినామీగా నా వ్యాపారంలో పావలా వాటాదారు. నిన్ను ఒక్కసారి కలిసి విషయం చెప్పి రమ్మన్నాడు. తరువాత తను చూస్తాన్నాడు. అయినా నాకెందుకో అతనిపై నమ్మకం కల్గడం లేదు. నా ఆస్తులు కొన్ని అయన పేర ఉన్నాయి. నేను పోతే అడ్డంగా కూడా బాగుపడేవాడు వాడు మాత్రమే. నాకు ఏమీ తోచడం లేదు. పిచ్చి లేస్తుందేమోననిపిస్తున్నది.” అని నేలపై పడి వల వల ఏడ్వసాగాడు.

“ఛ ఏడ్వకూ ఊర్కో” అని అరిచాడు జయంతి.

ముకుందం ఇందులో భాగస్వామి అన్న దాన్ని జీర్ణం చేసుకోలేకపోయాడు జయంతి.

ఈ రామలింగం అతనితో రెండు మూడు సార్లు కనపడడం మినహా అంత పరిచయమూ లేదు. ఇతనేం చేస్తాడని ఎన్నడూ అడగనూ లేదు. ఇలాంటి వాడ్ని ఇక్కడికి పంపడంలో అతని ఉద్దేశం? అని ఆలోచనలో పడ్డాడు జయంతి. రామలింగాన్ని చూస్తుంటేనే ఒళ్ళంతా కంపరం మొదలయింది.

తనే చంపేస్తే ఏం అని కూడా అనిపించింది కాని విశ్రమించుకున్నాడు.

“ఏం మాత్రం సంపాదించావు?” అడిగాడు ఏం మాట్లాడాలో తోచక.

“ముకుందానికిచ్చింది పోను కోటిన్నర దాకా ఉంటుంది. అయితే అందులో దాదాపు సగం ముకుందం అతని భార్యా, చెల్లెలి పేర్లపైన ఉంది.” అని ఓ క్షణం తల దించుకొని “నా బార్య ఎక్కడుందో, అసలు దానేటి చేసారో” అన్నాడు కళ్లు తుడుచుకుంటూ.

వీడి కళ్ల నుంచి కూడా నీరు వస్తున్నది అనిపించింది జయంతికి.

వీడు పదేళ్లు నర మాంసం అమ్మాడు. అనుకుంటూ లేచి “ఇదిగో నువ్వు రా గదిలోకెళ్లు” అన్నాడు.

లేచి జయంచిని ఒకసారి చూసి గదిలోకెళ్లాడు దండం పెడుతూ.

తలుపు మూసి ఫోన్ ఎత్తాడు.

పది నిమిషాలలో – C.I., ఇద్దరు S.I.లూ నల్గురు పోలీసులూ వచ్చారు.

తలుపు తీసి రామలింగాన్ని వాళ్లకి అప్పగించాడు.

పోలీసుల్ని చూసి హతాశుడై నోరు మెదపక వాళ్ల వెంట వెళ్లిపోయాడు రామలింగం.

జరగినదాన్ని శారద గమనించింది. ఒణికిపోతున్నది. సరిగ్గా నిల్చోలేకపోయింది. జయంతి దగ్గరకు వెళ్ళాననుకున్నది. కానీ కదలలేకపోయింది. అలాగే కుర్చీన వాలిపోయింది. కళ్లు తిరిగినట్లయి, మూతలు పడినయి కళ్లు.

ముకందానికి ఫోను చేసాడు జయంతి.

వాని చెల్లెలు ఫోను ఎత్తింది “నేను” అంటూ.

“సరేలే కానీ ముకుందానికి ఇవ్వు” అన్నాడు.

“మీరూ రాకూడదా?” అంది. ఆవిడ కంఠంలోనే మత్తు కనిపించింది.

“మొదట ఫోనివ్వు” అన్నాడు గట్టిగా.

మాటాడలేదు కానీ మరునిముషంలో “హలో” అన్నాడు ముకుందం.

“రామలింగాన్ని పోలీసులు పట్టుకెళ్లారు” అన్నాడు.

“ఎప్పుడు, ఎక్కడ?”

“నా దగ్గరనుంచే.”

“ఇక్కడకు వచ్చాకే నేనే సరెండర్ చేద్దామనుకున్నాను” అన్నాడు.

ఫోను పెట్టేసాడు జయంతి.

తోడేళ్ళగుంపులా అనిపించింది. అలాగే తిరుగాడుతున్నాడు సమాజంలో.

“శారదా” పిలిచాడు.

పలకలేదు.

వెనక్కు నడిచాడు.

శారద కుర్చీలో కళ్లు మూసుకొని కనిపించింది.

భుజాలు పట్టుకొని “శారదా” అంటూ కుదిపాడు.

ఉలిక్కిపడ్డట్లుగా లేచి బలవంతంగా కళ్లు తెరిచి ‘మీరా’ అని, జయంతి భుజం పైన తల పెట్టుకుని గట్టిగా హత్తుకుంది.

“ఏమయింది?” అడిగాడు నెమ్మదిగా జుత్తు నిమురుతూ.

“చక్కర వచ్చినట్లయింది” అంది.

“కాఫీ ఇవ్వగలవా?” అడిగాడు.

“ఇస్తాను” అని విడివడింది. నెమ్మదిగా లోనికి నడిచింది.

ఇద్దరూ కాఫీ త్రాగారు. ఒక్క మాట మాటాడుకోలేదు.

“శారదా బయటకెళ్లి వద్దామా” అన్నాడు కప్పు టేబుల్ పైన పెట్టి.

‘మీ యిష్టం’ అన్నట్లు చూసింది.

ఇద్దరు బీచ్ కెళ్లారు.

సముద్రానికి ఎదురుగా కూర్చున్నారు.

సూర్యాస్తమయమై చాలా ఘడియలు గడిచింది.

ఆకాశం సంధ్య వెలుగులో సముద్రాన్ని అందుకుంటూ కనిపించింది.

ఇక్కడ సూర్యాస్తమయం అద్బుతంగా ఉంటుంది.

సూర్యుణ్ణి సముద్రం అరాటంగా మింగే ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.

అప్పుడు ఎగిసే అలలు అలాంటి భావనకు ప్రాణం పోస్తాయి.

సూర్యడేమో సుదీర్ఘయానాన అలసిపోయి సముద్రానికి లొంగిపోయినట్లుగా అనిపిస్తాడు. అదో అద్భుతమైన  దృశ్యం. చూడాల్సిందే.

సూర్యుని ఓటమీ, కృష్ణ పరమాత్మ చావూ అద్భుతంగా అనిపిస్తాయి జయంతికి.

మరో ప్రపంచపు దిశగా మనసు ప్రయాణం ప్రారంభించింది.

“ఎంతో నోము నోచినాము మేమనీ

మనుషుల కంటే తాము అంతో ఇంతో నయమనీ.

పెదవి విప్పి పలికినవీ కొన్నీ.

తన మదిలోని మాటలనన్నీ” అంటూ సుశీల గొంతు శ్రావ్యంగా వినిపించుతున్నది. ఎక్కడ నుంచో మాత్రం అర్థం కాలేదు.

ఇక్కడ ఉదయం కూడా చాలా బావుంటుంది.

అయినా అదికాదు ఇదికాదు అనేం లేదు, దేని అందం దానిదే. కాకపోతే ఉవ్వెత్తున లేచే అలల్ని జలగర్జనకి నెట్టి సముద్ర గర్భాన్ని చీల్చుకొని ఎఱ్ఱ ముద్ద బయటకు వస్తున్నట్లుగా అనిపిస్తుంది.

ఓ అల ఉవ్వెత్తుగా లేచి ఒకింత నిలిచి నెమ్మదిగా నీళ్లలోకి జరిగింది. ఎంతటి అందమది చెప్పలేం.

ఈ సృష్టిన రెండు అంచులా ఆరంభానికి హేతువే.

కాకుంటే వెలుగు రాకను ఉదయం అనీ, చీకటి ప్రకాశాన్ని రాత్రి అనీ అంటాం. నిజానికి రెండూ ప్రారంభాలే.

నీటి అంచుననే ముగింపు.

మనం ప్రయాణం ప్రారంభించి చిట్ట చివరకు చేరుకుని, ఇది ప్రారంభం లాగుందేం అని అబ్బురపడడమే సృష్టి చిత్రం. ఇంతెందుకు..

తొలినాళ్లతో ‘కేర్’మనే ప్రాణి తులసి నీళ్లతో గాని ముగింపుకు రాడు.

ఇలా తిరుగుతున్నాయి ఆలోచనలు తల నిండా.

శారదా ఉన్నా మాటడలేదు. ఆవిడ చేతిని మాత్రం తన చేతిలో ఉంచుకున్నాడు. శారద మాత్రం కొంత సేపు సముద్రాన్ని, కొంత సేపు ఆకాశాన్ని, కొంత సేపు జయంతిని చూస్తూ ఉండిపోయింది. చేతిని దగ్గరకు జరుపుకున్నాడు జయంతి.

శారద దాపుకు చేరింది.

“శారదా ఈ సృష్టిలోని అందాలన్నింటినీ మనిషి చనిపోయేలోపు చూడగలడంటావా?” అడిగాడు ఆమెనే చూస్తూ.

“చూడగలడేమో కానీ చూసే మనస్సు ఉండాలి గదా?” అన్నది.

“స్పందన ఉండదంటావా?”

“ఉన్నా అది వారి మానసికపు స్థితిని బట్టి ఉంటుంది.”

“ఎందుకని.”

 “Receiving nature కున్న స్థాయిని బట్టే గదా కనిపించేది మనకు అర్ధమవుతుంది.”

“మనుషులని మనం అనగలం, మనస్సుల ననలేం” అని నవ్వింది.

సముద్రపు హోరు పెరిగినట్టు కనిపంచింది.

బాగా చీకటి పడింది. నక్షత్రాలు కాంతిగా అనిపించాయి.

అలలు  పెరిగి విరుగుతున్నయి.

“ఇక వెళ్దమా?” అంది.

తల ఊపి లేచి శారదను నెమ్మదిగా లేపి నడుం చుట్టూ చేయి వేసి నడిచాడు. కారు ఇంటికి చేరింది. మజ్జిగ త్రాగి మంచం ఎక్కాడు.

ఏదో కసి.

నిద్ర రానీయలేదు.

ఆవేదన.

ఆరాటం.

రెండు నిద్ర మాత్రలు మింగాడు. కాసేపటికి కళ్లు మలిగినయి.

అది నిద్ర కాదు మగత.

శారద అతని ప్రక్కనే పడుకుంది.

తెల్లవారింది.

జయంతి ముందుగానే లేచాడు. శారదను లేపక చూస్తున్నాడు. కొద్ది రోజులలో శారద తల్లి అవుతుంది. అంటే తను తండ్రి. ఈ భావన ఎందుకోగానీ ఉక్కిరిబిక్కిరి చేసింది.

“ఏమిటి, ఏం చూస్తున్నారు. కోతులాడుతున్నాయా?” అంటూ లేచింది, తొలగిన బట్టలను సర్దుకుంటూ. నవ్వి లేచి వెళ్లిపోయాడు.

శారద ఎంత తెలుముకుని వేగంగా టిఫిన్ చేసినా, జయంతి లేడు.

ఆవిడకూ తినబుద్ధి కాలేదు. పుస్తకం విప్పింది.

(ఇంకా ఉంది)

Exit mobile version