Site icon Sanchika

నియో రిచ్-31

[ప్రసిద్ధ రచయిత చావా శివకోటి గారి చివరి నవల ‘నియో రిచ్’‍ను ధారావాహికంగా అందిస్తున్నాము.]

[భయంతో జయంతి ఇంటికి వచ్చిన రామలింగం తాను కాశీలో చేసిన దుర్గార్మమైన వ్యాపారం గురించి చెప్తాడు. అది బయటపడిందనీ, స్థానికులు తన భార్యాపిల్లలపై దాడి చేసారనీ, తాను తప్పించుకుని వచ్చానని చెప్తాడు. జయంతి ఒక్కడే తనని కాపాడగలడని అంటాడు. తనని అండమాన్ దీవులకు పంపేయమని అడుగుతాడు. తనకీ లాయర్ ముకుందానికి ఉన్న బంధుత్వం గురించి చెప్తాడు. ఈ వ్యాపారంలో ముకుందానికీ వాటా ఉందని అంటాడు. కానీ జయంతి రామలింగాన్ని పోలీసులకు అప్పజెప్తాడు. ముకుందానికి తెలియజేస్తాడు. శారదతో కలిసి బీచ్‍కి వెళ్తాడు జయంతి. సముద్రాన్ని చూస్తూ ఉద్వేగానికి లోనవుతాడు జయంతి. ఎన్నో ఆలోచనలు కలుగుతాయి. ప్రకృతి అందాల గురించి శారదతో సంభాషిస్తాడు. మెల్లగా ఇంటికి చేరుతారు. ఆ రాత్రి ఎంతకీ నిద్రరాకపోతే, రెండు నిద్రమాత్రలు వేసుకుని పడుకుంటాడు. పొద్దున్న శారద లేచేసరికి జయంతి ఇంట్లో కనబడడు. ఇక చదవండి.]

[dropcap]పో[/dropcap]స్టుమాన్ వచ్చి టపా పడేసి వెళ్ళాడు. ఉత్తరాల్ని చూసి తన కొచ్చిన దాన్ని తీసుకొని మిగిలిన వాటిని జయంతి రూంలో వేసి వచ్చి విప్పింది.

“శారదకు నమస్తే. నా పేరు ‘ఉమ’. నీకు అయిదో తరగతిన క్లాస్‍మేట్‌ను, స్నేహితురాలిని. పదో తరగతిన వివాహితనయ్యాను. ఆనకే నిన్ను గురించి తెలుసుకొనే అవకాశం నాకు దొరికింది. ఈ మధ్యన బాబ్ హోటలులో ‘ఈవిడ జయంతి గారి భార్య’ అంటుంటే తల తిప్పాను. నువ్వు. ఈ లోపు నీ పేరు ‘శారద’ అని కూడా వాళ్ల మాటల్లో అర్థమైంది. అయినా నిన్ను పరిశీలనగా చూసాను. నీ కొస ముక్కున వున్న పిసరంత పుట్టు మచ్చ నువ్వు నా శారదవే అనేది దృవపరిచింది. ‘అయితే ఆ శారద ఏమిటి? జయంతి భార్యేమిటి?’ అన్నది తెగని ఫజిల్ అయికూర్చుంది. ఇప్పటికి నేనెవరో నీకు గుర్తులోకి వచ్చి ఉండను. నేను చిన్నప్పుడు పటికి బెల్లం తెచ్చి నీ కొక్కదానికే ఇస్తే రుక్మిణి అధి భరించలేక మాస్టారికి చెప్పడం, ఆవిడ మనిద్దరిని బెత్తంతో దండిచండం; మనం ఆ రోజు పీరియడ్ అయిపోగానే ఇంటికి వెళ్తిపోవడం. ఆ ఉమని నేను.

ఇక పోతే ఇప్పుడు నేనేమిటి?

ఇప్పటిదాకా ఇక్కడ DSPగా చేసిన చంద్ర (చంద్రకుమార్) నా భర్త. మాకిద్దరు పిల్లలు. కాన్వెంట్ చదువులో ఉన్నారు. అయితే ఆవేళే నేను నీ దగ్గరరకు కొచ్చి పలకరించి జ్ఞాపకాలతోనే వెళ్లిపోవాలనిపించింది. కానీ ఒక వేళ నువ్వు గుర్తు పట్టలేకపోతేనో? అందుకే నిగ్రహించుకుని ఉత్తరం వ్రాస్తున్నాను. నేను గుర్తులోకి వస్తే నా అడ్రసు వ్రాస్తున్నాను. ఓ కార్డు ఖర్చు చెయ్యి. నేనే నీ ముందు వాలిపోతాను. లేదా!

ఇక ‘జయంతిలాల్’ అంటే ఇక్కడి జనానికో ఫజిల్. నీకు అతనేమిటో ఎంతో కొంత అర్థమై ఉంటాడు. లేకుంటే పెళ్లాడే దానవు కాదు గాదా! అయినా ఒక్కమాట పోలీసులు ఈయన్ని అనేక కళ్లలో నిత్యం గమనిస్తుంటారు. ఎందుకో తెలుసా? అతను చేస్తున్న వ్యాపారం చిన్నది. మరి అతని రాబడి.. వారి ఊహల్ని చెరిపేస్తున్నదట. ఎక్కడ నుంచి వస్తున్నది? అనే దాన్ని చాలా చాలా సీరియస్‍గా అర్థం చేసుకొనే యత్నంలో తల మునకలై ఉన్నారు. ఓ చిన్న విషయం. మావారు అదే చంద్ర DSP రెండేళ్ల క్రితం ‘తివారి’ అనే నగల వ్యాపారిని అరస్ట్ చేసారు. (క్యారెట్ల తేడా దొంగ బంగారం కల్గి ఉండడాన) ఆ తరువాత వారికి అతనే జాలింసింగ్ అనే బొందిపోటు అని అర్థమైంది. పాము పుట్టలో ఉన్నదని తెలిసాక పోలీసులు పులుల్లా వ్యవహరిస్తారు. నువ్వు నా చిన్ననాటి నేస్తానివి గనుక ఇది చెపుతున్నాను. మీవార్ని కొంచెం జాగ్రత్తగా మెలగమని చెప్పు. పోలీసులలో కూడా అనేక మంది దొంగలతో పని తీసుకొని సంపాదించుకునే వారున్నారు. మా వారు ‘రూరల్’ DSPగా ఉన్న రోజులలో ఓ పెద్ద దొంగతనం జరిగింది. నూట నలభై తులాల బంగారం ఎనభై వేలదాక నగదు, వంద తులాల వెండి బాగా వెనకటి నుంచి స్థితిపరుల ఇల్లది. ఇది తెల్లవారి పేపర్లలో వచ్చింది. అయితే ఈ దొంగతనం జరిగిన ఏరియా పోలీసు స్టేషన్ ఉన్న ఊరిలో అయిదుగురు దొంగతనాలు చేసే వారున్నారు. పేపరు చూసాక అక్కడి వారు ఊళ్లో ఉన్నారా లేదా ఎన్ని రోజులుగా లేరు అని తెల్సుకున్నాడు. వాళ్లను కాపేసి పట్టుకున్నాడు. యస్.ఐ. అనుమానం నిజం అయింది. ఆ దొంగతనం చేసింనదెవరో సొమ్ము, నగదూ దాదాపు దొరికింది. కానీ దాన్ని అప్పగించలేదు.

నేరం జరిగిన రెండు రోజుల ముందు నుంచీ మరో కేసు పైన అనుమానితులుగా వీర్ని పట్టుకొచ్చారు. స్టేషనులో విచారణ నిమిత్తం ఉంచినట్టు రికార్డ్సు మార్చారు. CI ని కలుపుకొని దొంగలూ ఈ మొత్తాన్ని వాటాలుగా పంచేసుకున్నారు. ఇది చాలా రోజులు తర్వాత మావారి దృష్టికి వచ్చింది. దీన్ని బయటపెట్టేందుకు చాలా ప్రయత్నం కూడా చేసారు. తగిన ఆధారాలు దొరక్క దొరికిన ఇద్దరు పోలీసుసులే అవడాన వారు చెపితే సాక్షులుగా బయటకొచ్చి వారి ఉద్యోగాలుండవు గనుక ఆగిపోయారు. ఇప్పుడు ఈయనా ఆ బాపతులోకి కలిసాడనుకొనేది నిజం. ఇప్పుడు మనముంటున్న సమాజం ‘కరెన్సీ’ సమాజం. నీతి, జాతి ఇక్కడ అవతరించదు. సంపాదించగల్గిన వాడు గౌరవనీయుడు. ఎలా సంపాదించావు? అన్న ప్రశ్న వేయడాన్ని ఈ సమాజం మరిచిపోయి ఎంత సంపాదించాడు అని మాత్రం చూసి ఆగుతుంది.

అందుచేత ఇప్పుడు మాకు అన్నీ హంగులూ ఉన్నాయి.

ప్రభుత్వం ఇచ్చే జీతం కోసమే అయితే ఈ చాకిరీ శుద్ధ దండగ.

డబ్బును సంపాదించి నిజాయితీని అవహేళన చేయడమే ఇప్పుడు నియోరిచ్ సమాజం చేస్తున్నది. ఇది అనాదిగా ఉన్నదే. మంచి వ్యవస్థను నిరంకుశంగా చిద్రం చేస్తున్నది. మంచి మనిషిని క్షోభకు గురి చేస్తున్నది. మంచితనం అశక్తతగా ఎలివేటు అవుతున్నది. దీని ఫలితం మనకు చానా చేరువనే ఉంది. అయినా ఇది మాత్రం ఆగటం లేదు. వేగంగా రేసులో ఉన్నది. ఇక ఉంటాను.

నేను నేనే అని నీకు అనిపిస్తే నా శారదవు నువ్వే అయితే ఓ కార్డు రాయి. అప్పటి నుంచీ మన బ్రతుకుల్ని సమీక్షించుకుందాం.

ఉంటాను.

‘ఉమ’”

ఈ ‘ఉమ’ తన చిన్నప్పటి ఉమేననేది రూఢిగా అర్థమైంది. కానీ జయంతిని గురిచింన మాటలే అంతు పట్టలేదు.

రచయిత స్వర్గీయ చావా శివకోటి గారు

జయంతికీ ఉత్తరం చూపితే..

నానారకాల ఆలోచనలు తలలో మెదిలినయి. బాధ అనిపించింది.

ఉమ కల్సిన సంతోషం అడుగంటింది. జయంతి విషయం నమ్మాలనిపించలేదు. అనుమానమూ వదలలేదు. ఉమ ఉత్తరాన్ని ప్రక్కనుంచుతుంటే మిగిలిన ఉత్తరాలు మనస్సున మెదిలినయి. వాటినీ చూడాలనిపించింది. అక్కడి దాకా నడచింది. ధైర్యం చాలలేదు. బాగనిపించనూ లేదు. కొద్ది సేపయ్యాక అంటిచిన వైపే విప్పి మళ్లా అంటించవచ్చు అనిపించింది.

విప్పింది.

My dear great Jayanthi,

విజయం, దిగ్విజయం.

ప్రపంచం దీన్ని అనుమానించలేదు. అసాధ్యం. అనుమానం కల్గితే original పైననే కల్గుతుంది. వంద కేసులు వేసి మార్కెటున వదిలాను. బ్యాంకుకు పంపాను. చివరగా జారీనోట్లు విప్పద్దు. ‘పింటో’ దగ్గరకూ పంపాను.

అనుమానించలేకపోయాడు.

అందుకే ఈ శుభవార్త నీకు తెలుపుకుంటున్నాను.

హరే రామ్.

ఈ ఉత్తరంతో అనుమానానికి బలం వచ్చింది. మనస్సంతా ముద్దయింది. భయంకరమైన ఆలోచనలతో అది కరగసాగింది. మొత్తం కరిగింది. బాధ పెరిగింది.

నేనొక నేరస్థుడి భార్యనా..

ఉమ మాటల్లో చెబితే ఇక్కడి గౌరవనీయులలో అత్యధికులు ఏ రీతినైనా చట్టానికి నేరస్థులే.

అంటే నేను తినే నాల్గు మెతుకులూ న్యాయబద్ధం కాదు.

నేను జయంతి ఇల్లాలినెందుకు అయ్యను?

శివరాం కూడా ఈ రాకెట్టున భాగస్థుడా?

తను మోస్తున్న పిండం కూడా నేరస్థునిదే.

ఈ భావన అసహ్యాన్ని కల్గిచింది. చికాకు వచ్చింది. మోకాళ్లలో తల ఉంచుకొని కన్నీరు అయిపోయిందాకా ఏడ్చింది. అలా ఏడుస్తూ నిద్రపోయింది. జయంతి భజం తడుతూ లేపేదాకా ఒంటి పై సోయ లేదు.

ఉలిక్కి పడ్డట్లు లేచింది. జయంతి చేతులను విదిలించుకుంది.

“ఏమయింది నీకు?” అరిచాడు జయంతి

“నన్ను తాకొద్దు. తాకొద్దు. Please don’t touch me” అంటూ గజగజా వణుకుతూ పులిని చూసినట్లు భయపడితూ స్పృహ కోల్పోయింది.

క్రింద పడతున్న శారదను పట్టుకునే ప్రయత్నం చేసాడుగానీ జారి క్రింద పడింది. నడుం భాగం సోఫాకు తగిలి.. అడ్డదిడ్డంగా పడింది. నొప్పితో బాధగా అరుస్తోంది. “శారదా శారదా” అంటూ చేతుల్లోకి తీసుకొని ఎంత పిలిచినా సోయిలో లేదు. కారు దగ్గరకు అలాగే పరుగెత్తి వెళ్ళి నెమ్మదిగా కూర్చుండబెట్టి కారెక్కాడు. హాస్పటలుకు చేర్చాడు. సాయంత్రం దాకా స్పృహ రాలేదు. రాత్రి తొమ్మిది గంటలకి కదిలింది. డాక్టరు పర్వాలేదన్నది. ఏదో ‘షాక్’ తిన్నది అని మాత్రం చెప్పగల్గింది.

“No no, ఇది నిజం కాదు. నేను నేరస్థుడి భార్యను కాదు” అన్న శారద మాటలు పెద్దగా వినిపించనయి.

మళ్లా స్పృహ పోయింది.

ఆ తెల్లవార్లు జయంతి శారద ప్రక్కనే ఉన్నాడు.

శారదకు జరిగిందేటో సూచనగా అర్ధమైంది. కానీ వివరం తెలీలేదు. పిచ్చెక్కినట్లయింది.

తెల్లవారింది.

వెలుగు రేఖలతో పాటు శారదా నెమ్మదిగా కళ్లు తెరచింది.

జయంతిని చూసింది.

“ఇంకా నేనేమైపోవాలిని వచ్చారు. నాకు కనిపించవద్దు please” అంటూనే తిరిగి కోమాలోకి వెళ్లింది. డాక్టరు వచ్చి చూసింది. జయంతితో “మీరు ఇంటికి వెళ్లిరండి” అన్నది. తల ఊపి వెళ్తున్నపుడు మాత్రం “శారదకు స్పృహ వచ్చినప్పుడు మీరు కనిపించవద్దు” అని చెప్పింది.

“మంచిది” అని ఇంటికెళ్లాడు.

గదిలోకెళ్లే సరికి ఉత్తరాలు కనిపించనయి. చదివాడు. పరిస్థితి అర్థమైంది. శారద కెలా నచ్చచెప్పాలి. ఒట్టిమనిషి కూడా కాదు. ఎలా అనుకుంటూ లేచి, రాక్ నుంచి విస్కా తీసాడు. బిస్లరీ వాటర్ ప్రక్కనుంచుకున్నాడు. త్రాగడం ప్రారంభించాడు. నాలుగో గంటకు బాటిల్ పూర్తి అయింది. అన్ని తలుపులూ బార్లా తెరచే ఉన్నాయి. ఉన్న ఒకరిద్దరు పనిమనుషులు out house లో ఉండి ఉంటారు. అలాగే కూర్చీలోనే సోలిపోయాడు. ఎలా ఎలా అని మాత్రం పలవరిస్తూనే ఉన్నాడు.

ఫోను మ్రోగుతుంటే కళ్లు తెరిచాడు. సాయంత్రమైనట్టుగా అనిపించింది.

బాగా ఆకలిగానూ అనిపించింది. హస్పటలు నుంచి నర్సు మాటాడుతున్నది.

శారదకు స్పృహ వచ్చిందని, రేపు ప్రొద్దుటే మీరు వస్తే సరిపోతుంది అని చెప్పింది.

స్పృహ రావడం కొంత మనసుకు ఊరటనిచ్చింది. కానీ శారదను చూడకుండా ఉండాలంటే పిచ్చి లేస్తుందేమోనన్నంత టెన్షను మొదలయింది.

‘శారదా శారదా నన్ను మన్నించు’ అనుకున్నాడు తనలో తానే.

“జయంతీ” అంటూ లాయరు ముకుదం గదిలోకొచ్చాడు అకస్మాత్తుగా

“ఆఁ ఆఁ” అన్నాడు పెద్దగా.

“శారదకు ఏమయింది ఆస్పత్రికి తీసుకెళ్లారట?”

“Please come to the point. అనవసర విషయాలలోకి వెళ్లకు” అన్నాడు జయంతి.

“అలాగే” అని, “రామలింగాన్నలా చేసావేంటయ్యా?” అన్నాడు.

“మీకు మంచిదే గదా” అన్నాడు.

నిర్ఘాంతపోయాడు ముకుందం.

“అంతకంటే నువ్వు మాత్రం ఏం చేయగలవు?”

“అంటే?”

“నాకంటే నీకు బాగా తెలుసు అతగాడు. నీకు బంధువు”

“ఒక్కమాట”

“Please ఇక నాతో మాటాడకు.”

“అంతదాకా వచ్చావన్నమాట” అన్నాడు ముకుందం కోపం పట్టలేక.

అంతే. ముకుందాన్ని గల్లా పట్టుకొని లేపి మెడ పుచ్చుకొని లాన్ దాకా నెట్టాడు పిచ్చి వానిలా. లోనకొచ్చి క్రింద చతికిలపడ్డాడు. బాగా చీకటి పడింది. లైటయినా వెలిగించాలనిపించలేదు. నౌకర్లున్నారు కావచ్చు. అప్పుడు వస్తున్నారు.

ఫోను రింగయింది. నెమ్మదిగా లేపాడు.

“నేను డాక్టర్‍ని”

“చెప్పండి”

“సారీ నేనేమీ చేయలేకపోయాను. Sad news” అని ఓ క్షణం అగి “శారద గర్భం పోయింది” అంది.

“ఎలా ఎలా?” అరిచాడు, అది ఫోనని మరిచిపోయి.

“కంట్రోలు కండి. డిస్టర్బ్ అవద్దు. శారదా బాగానే ఉంది” అని పెట్టేసింది.

జయంతి కళ్ల నీళ్లు కారుతున్నాయి.

‘మనకు బాబు పుడతాడు’ అని ఎంత సంతోషంగా చెప్పింది, చేతిలో చెయ్యి వేసి.

మరి ఏడి? ఎందుకిలా జరుగుతున్నది? నేనేమైపోతున్నాను అని ఏడ్చాడు మోకాళ్ల పై తల ఉంచుకొని.

ఇక అక్కడ ఉండబుద్ది కాలేదు.

లేచాడు.

దుఃఖం ఆగడం లేదు. నడవాలనిపించడం లేదు.

నాల్గు అడుగులు వేయలేకపోయాడు. శరీరమంతా సన్నని వణుకు.

అట్లాగే కూర్చుండిపోయాడు. అక్కడే మొదట మగతలోకి ఆనక నిద్రలోకి జారుకున్నాడు.

మెలకువ వచ్చే సరికి సూర్యుడు కనిపిస్తున్నాడు. ‘అరే ఓ రోజు గడిచింది’ అనుకొని ఉలిక్కిపడి లేచి ‘శారద దగ్గరకెళ్లాలి’ అనుకున్నాడు.

డాక్టరు వద్దన్నది గుర్తుకువచ్చింది.

(ఇంకా ఉంది)

Exit mobile version