నియో రిచ్-4

0
2

[తన గతం పార్వతికి చెబుతుంటాడు జయంతీలాల్. అమ్మానాన్న, అక్కల అంత్యక్రియలు జరిపించి తాతయ్యతో సహా లక్నోని వీడతాడు జయంతి. కొన్నాళ్ళకి తాతయ్య కూడా చనిపోతాడు. ఒంటరిగా మిగిలిన జయంతీ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. కానీ తాతయ్య రాసిన ఓ ఉత్తరం అతనికి బ్రతుకు మీద ఆశ కల్పిస్తుంది. తన గతం గురించి చెప్పడం పూర్తి చేస్తాడు. పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అని పార్వతి అడిగితే, శారీరక సుఖం కోసం పెళ్ళే ఎందుకు అని అంటాడు. కానీ పార్వతితో అలా అన్నందుకు బాధపడతాడు. ఆ సాయంత్రం శివరాం ఇంట్లో చిన్న పార్టీ జరుగుతుంది. డా. హర్ష, సింహాద్రినాయుడు, జయంతీలాల్ వస్తారు. శివరాం కొడుకు రవి ఆ ముగ్గురిని ఒక ప్రశ్న అడుగుతాడు. ముగ్గురినీ బాగా ఆలోచించి చెప్పమంటాడు రవి. ఇంటికి వచ్చాకా డా. హర్ష గురించి ఆలోచిస్తాడు జయంతి. తనకి తెలిసిన డా. హర్ష గతాన్ని మననం చేసుకుంటాడు. ఇక చదవండి.]

[dropcap]‘వై[/dropcap]ద్యం’ సేవా భావనలో నెలవై ఉండాల్సింది. ‘వైద్యోనారాయణో హరి’ అని మన వాళ్లు చెప్పారు. మరి అట్లాంటి దాన్నే వ్యాపారంగా మలచగల్గిన మన వాళ్లు రాజకీయాన్నీ వ్యాపారంగా చేయడంలో సిగ్గెందుకు పడతారు. ఇది చిత్తము కాదు. అయితే తను ఉండి… అనుభవంలో తెల్సుకున్న వ్యాపార వైద్యాన్ని సంస్కరించే ప్రయత్నం వదిలేసి (అది ప్రజాసేవ డైరక్ట్‌గా కాదనో ఏమో) రాజకీయాలలోకి రావడం కొంచెం తల కల్గిన వాళ్లకు అంతుపట్టలేదు.

ఎన్నికలొచ్చినయి. డాక్టరును అప్పటిదాకా మోసిన పార్టీయే M.P.గా నిలబెట్టింది. జనానికున్న అన్ని రోగాలనూ పైసలుగా మార్చగల వైద్యుడు, జనం మనసులను అవలీలగా చూరగొన గలడని వారి అభిప్రాయం కావచ్చు. అంచేత డాక్టరు మంచితనాల పైన కథలు అల్లి చెప్పడం ప్రారంభించి ‘ఔరా! ఇంతటి గొప్ప భడవా! ఈ డాక్టరు?’ అనేంత కల్పితాల వరకూ వెళ్తారు.

ఈయనకు వైట్ కాలర్ ప్రముఖులు, పార్టీ వాళ్ళంతా వత్తాసు పలికారు. వారికి ఉన్న అనుబంధంతో మీటింగులకు జనం బాగా వచ్చారు. ఆయన చెప్పింది చాలా శ్రద్ధగా విన్నారు. చాలా సార్లు చప్పట్లు కొట్టారు. నడుస్తున్న ప్రభుత్వం పైన వేసిన విసుర్లకు చాలా సార్లు తలలూపారు బాగుందని. కానీ ఓట్ల సరళి అలా చెప్పలేదు. మధ్య తరగతి, క్రింది మధ్య తరగతి వాళ్లు (వచ్చీ రాని చదువరులు) ఈయన మాటలకు మొగ్గారే తప్ప  పై, క్రింది తరగతుల జనం డాక్టరుకు ఓటు వేయలేదు. ఓడిపోయాడు. ‘ఎందుకు ఓడిపోయాను?’ అని ప్రశ్నించుకున్నాడు హర్ష. అంత టైము ఆగక అసలు ‘తనకీ రాజకీయాలు అవసరమా?’ అన్న ప్రశ్నా మెదిలింది. దీనికి సరయిన సమాధానం దొరకలేదు. శివరాం మాత్రం స్నేహితునిగా వృత్తినీ – వ్యాపారాన్నీ వాటి మధ్య ఉన్న అంతరాన్ని అనేక సార్లు డాక్టరుతో చర్చించాడు. విషయం అర్థమయినా, డాక్టరుకు పెరిగిన ‘అహం’ విననీయ లేదు. దానికి తోడు ఈ ఓటమి కసిని పెంచింది. తక్కువగా మాటాడతాడు గనుక బయటపడలేదు. అసలు ఓటరుకు ఏం కావాలి? ఏది నమ్ముతాడు? ఎందుకు నమ్ముతాడు? అనేది తెల్సుకునే ప్రయత్నం చేసాడు, భవిష్యత్ రాజకీయస్థులని సమీపించుకుంటూ. ఈ ప్రయత్నంలో పార్టీని నడిపే సూత్రధారునిగా రూపాంతరం చెందాడు. అసలీ దేశంలో పుట్టిన అనేక పార్టీలకు పుట్టిన కొద్ది కాలానికే వాటి అస్తిత్వాన్ని  కోల్పోవడం, దాన్ని నడిపేవాని impact క్రిందన పార్టీ రావడం మూల సిద్ధాంతానికీ ఆచరణకీ పొంతన కుదరకపోవడం, దాంతో అదో ప్రహసనంగా మారి అనుయాయులు గందరగోళంలో పడడంతో కథ కంచికి చేరుతుంది.

ఈ డాక్టరు – రవికి ఏం సమాధానం ఇస్తాడో చూడాలి అనుకున్నాడు జయంతి. తలనొప్పిగా ఉండడంతో కళ్లు మూసుకున్నాడు. డాక్టరు గతం గుర్తులోకొచ్చాక సమాజంపై జాలి, దిగులు మనస్సున చేరి భయమైంది. ఆ భయంతో నొప్పి నిద్రాభంగాన్ని కల్గించింది. కళ్లు మూసుకోగనే నిద్ర రాదు గదా. నిద్ర వచ్చేందుకు సహకరిస్తుంది. అందుకు మనస్సు, శరీరమూ అనుకూలించాలి.

ఎలాగైతే చాలా సేపటికి నిద్రలో కెళ్లాడు.

***

ఫోను మోగుతుంటే లేచాడు జయంతి. రిసీవర్ ఎత్తాడు. సింహాద్రినాయుడు. ప్రోగ్రాం గురించి అతనికి తెలియనివేవో అడిగాడు. చెప్పి ఫోను పెట్టేసాడు. కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ త్రాగుతుండగా ఎదురుగా వేలాడుతున్న క్యాలెండరు కనిపించింది. చాలా రోజులయింది అది అక్కడ ఉండి. శ్రద్ధగా చూడలేదెప్పుడూ. అందంగా ఉంది దాని మీద వున్న రంగుల బొమ్మ. ‘పొద్దుపొడుపు’ సింహాద్రినాయుడి ట్రాన్సుపోర్టు సంస్థ కట్టించినది – తల వరకు సింహాద్రి ఫోటో కూడా వేయించుకున్నాడు. నవ్వొచ్చింది. పెద్దగానే నవ్వుకున్నాడు.

సింహాత్రి గతమూ తలలో మెదిలింది.

సింహద్రి చిన్నతనాన వ్యవసాయకుడు. తండ్రి అప్పికొండ. కరణంగారి దగ్గర గొడ్లు కాచేందుకూ, ఇంట్లో పిల్లని నెత్తుకునేందుకు జీతం కుదిర్చాడు తండ్రి.

సంక్రాంతి పండగ వచ్చింది. కరణంగారి భార్య చిన్న పిల్లకు గొలుసు వేసి, చేతులకు మురుగులు తొడిగింది. నిద్రపోయేదాకా ఆడించి పండబెట్టాడు సింహాద్రి.

అప్పికొండ ఇంటికి తెల్లారగట్ట కరణంగారి మనిషి వచ్చాడు, వెంట పెట్టుకొని రమ్మన్నారని.

“మా బుడ్డోన్ని పండగ పూట కూడా పంపలేదేంది?” అని బయలుదేరి వచ్చాడు.

కాంపౌండులోకి అడు పెట్టగానే – “సింహాద్రి ఏడిరా?” అనడిగాడు కరణం.

“గుడిసెకు రాలేదు బాబుగారు. ఈడనే ఉన్నడనుకుంటుండ.” అన్నాడు తెల్లబోయి.

కరణం గబగబా మెట్లు దిగొచ్చి అప్పికొండను వంగ బెట్టి నాల్గు చరిచాడు. కరణం కొట్టింది అర్థమైంది అప్పికొండకు. ఎందుకు కొట్టాడో మాత్రం తెలీలేదు.

“పండగ పూట కొడుతున్నరేంది?” అడిగిండు వెనక్కి జరిగి.

“మీ పోరడు రాత్రి మురుగులూ గొలుసూ కాజేసిండురా, ఏడదాచినవు, తే” అనె.

“వాడసలు గుడిసెకే రాలేదయ్యా” అన్నాడు మొక్కేసి.

ఎవ్వరూ అప్పికొండ మాట వినలేదు. పోలీసు పటేల్ని పిలిపించి రిపోర్టు రాసి స్టేషన్‌కి పంపినారు. అక్కడ హెడ్డూ, యస్.ఐ. వారం దినాలు వంతుల వారీగా కొట్టారు. నేరం ఒప్పించలేకపోయారు. రోగ నిర్ణయం చేయలేని డాక్టరులా – అప్పికొండని వదిలేసి – పిలిచినప్పుడల్లా స్టేషన్‌కు రావాలని సంతకం చేయించుకున్నారు. అప్పికొండ కోసం తల్లి, ఏడుగురు పిల్లలు ఎదురు చూస్తూ గుడిసెనే ఉన్నారు. పొయ్యిల పిల్లి లేవక అప్పటికే మూడో రోజు. అప్పికొండ కనపడ్డాకనే జొన్నగటిక పొయ్యి మీదకెక్కింది.

అలా కనిపించకుండా పోయిన సింహాద్రి  రోడ్డున వెళ్తున్న లారీ నాపి ఎక్కాడు. లారీ కొంత దూరం నడిచాక క్లీనరు పైసలడిగాడు. తల అడ్డంగా ఊపాడు. “మరెందుకెక్కావురా బాడఖవ్?” అని లారీ ఆపాడు. “ఏంట్రా” అడిగాడు లారీ ఆగాక డ్రైవరు.

“బేవార్సు చాలూ, పైసలు లెవ్వట.”

“పోలీసు జాతా?”

“కాదు”

“అయితే దింపెయి” అన్నాడు డ్రైవరు.

దింపగానే లారీ డ్రైవరు కాళ్లు పుచ్చుకున్నాడు సింహాద్రి. జాలి అనిపించినట్లుంది. “సరే ఎక్కు” అని ఎక్కాక లారీ స్టార్ట్ చేసాడు.

“ఎక్కడిదాకా పోతున్నావు?” అడిగాడు.

బావురుమన్నాడు సింహాద్రి.

“ఏడవకు” అని లారీ అడ్డాకు చేరాక వెంట పెట్టుకొని ఇంటికే తీసుకోపోయాడు డ్రైవరు రామస్వామి.

ఇల్లాలు సావిత్రి వచ్చిన కొత్త శాల్తీని చూసి “వీడెవరు” అడిగింది. “ఇంకా పూర్తిగా తెలీదు” అన్నాడు.

“పిల్లడు బాగా ఉన్నడయ్యా” అంది ముచ్చటగా చూస్తూ. మరే ప్రశ్నా వేయకుండానే భోజనం పెట్టింది మగనితోపాటు. తెల్లవారి రామస్వామి వెళ్ళిపోయాక సింహాద్రిని అడిగింది “మీదే ఊరు” అని. ఊరు పేరు చెపితే పంపేస్తారేమోనని భయమేసింది. గొలుసు మురుగులూ దగ్గరే ఉన్నయి. చావబాదుతారు అనుకుని ఏడ్చాడు.

“ఇదిగో నేను ఏమీ అడగను, ఏడ్వమాకు” అంది సావిత్రి.

కొద్ది సేపయ్యాక “మాతో ఉంటావా?” అని అడిగింది.

తల ఊపాడు అనుమానంగానే చూస్తూ. అయితే సావిత్రి ముఖంలో సంతోషం కనిపించింది. అలా అక్కడ తిష్ట వేసి రామస్వామి సావిత్రిల పెంపుడు కొడుకయ్యాడు. రామస్వామి ఆస్తి ఇల్లే. వృత్తిని నమ్మి నిజాయితీగా బ్రతుకుతున్నవాడు. తోటివారిలో బాగా గౌరవమున్నవాడు. ఇక సావిత్రి మొగుడి తోటిదే లోకంగా భావించే మనిషి. వారికి ఉన్న ఒకే ఒక్క లోటు సంతానం లేకపోవటం. సింహాద్రి వారికా లోటు తీర్చాడు. ప్రేమగా చూసుకుంటూ బడికి పంపారు కూడా. వానికి ఎంత తిప్పలు పడ్డా చదువు అబ్బలేదు. సింహాద్రి ఇంట తిరుగాడుతుండగానే సావిత్రి నెల తప్పింది. అయిన సింహద్రి పైన మమకారం తగ్గలేదు. సావిత్రికి పెద్ద బిడ్డలాగానే మిగిలాడు. సావిత్రిని ఆసుపత్రిలో ఉంచాడు ప్రసవానికని. సింహాద్రి ఉన్నాడక్కడ ఆవిడ కనుసన్నలలో మెలుగుతూ.

పురిటిరోజు వచ్చింది. రామస్వామి డ్యూటీలో ఉన్నాడు.

సావిత్రి కనలేక ఓ దినమంతా బాధపడ్డది. పెద్ద డాక్టరమ్మ వచ్చి చూసి పిండం అడ్డం తిరిగిందన్నది. కొద్ది సేపాగాక పిండం లోపల పోయిందన్నారు. దాన్ని తీసేందుకు ఆపరేషన్ చేసారు. వారు తమ వంతు ప్రయత్నం ఎంత చేసినా నాల్గో నాటికి సావిత్రీ దక్కలేదు. తెల్ల ముసుగు కప్పారు. రామస్వామి లారీ ఓనర్ ఇంటికి పరుగున వచ్చి జరిగింది చెప్పాడు సింహాద్రి ఏడుస్తూ. పోన్ల పై ప్రయత్నించి కబురు చేర్చారు. ఎంత కబురు చేరినా తెల్లారి పొద్దుట గానీ రామస్వామి అందుకోలేదు. అప్పటిదాకా అక్కడే కూర్చున్నాడు సింహాద్రి. సావిత్రి పైబడి గుండెలవిసిపోయేలా ఏడ్చాడు రామస్వామి. కావాల్సిన క్రతువును పూర్తి చేసారు, సావిత్రి చావు రామస్వామిని బాగా క్రుంగదీసింది. బాగా చిక్కాడు. వేళకు తినడం మానేసాడు. పరధ్యానమూ ఎక్కువైంది. బ్రతుకు తెరువు కోసం నెల తరువాత డ్యూటీ ఎక్కాడు. ఇంటికి వస్తే చాలు, సింహద్రిని ప్రక్కనుంచుకునేవాడు. పక్కలోనే పడుకోబెట్టుకునేవాడు. అయితే ఆరు నెలలయినా గడవకముందే సావిత్రిని పూర్తిగా మరచిపోకముందే లారీ ఏక్సిడెంట్‌లో అక్కడే మరణించాడు రామస్వామి. శవాన్ని పోస్టుమార్టం తరువాత తీసుకొచ్చారు. దాన్ని చూడగానే సింహాద్రి దుఃఖం కట్టలు తెంచుకుంది. “అయ్యా నువ్వు” అంటూ కుప్పకూలిపోయాడు. డ్రైవర్లు యూనియన్ వాళ్ళు, ఓనరు సహకరించి అంత్యక్రియలు జరిపారు. ఆనక ఇంటి కొచ్చి ఒంటరిగా కూర్చుని తెల్లవార్లూ ఏడ్చాడు. సావిత్రి రామస్వామి కళ్ల ముందు తిరగాడినట్టే అనిపించడంతో మరీ బెంబేలు పడ్డాడు. ‘అమ్మా, అయ్యా’ అని నిద్రన కూడా పలకరించడం అనేకులు చూసారు. ఎంత ఏడ్చినా బాధ తరగటం లేదు. నాల్గోనాడు మొఖం కడుక్కొని ధైర్యంతో అత్తెసరు పెట్టుకుని అన్నం వండుకుని ఇంత ఏడుస్తూనే తిని – ఏదో ఒకటి చేసి డొక్క నింపుకోవాలి కదా అన్న నిర్ణయానికి వచ్చాడు. అప్పుడు గొలుసు మురుగులూ గుర్తులోకొచ్చినయి. దానిమ్మ చెట్టు క్రింద వచ్చిన తెల్లారి దాచినవి బైటకు తీసాడు. అమ్మాడు. అరవై అయిదు వందలు వచ్చినయి. ఆ రాత్రి ఇంట్లో పెట్టెలూ గూళ్లూ వెతికాడు. ముక్కుపుడకా, నాగరం – సావిత్రిదే బొందు తాడు కనిపించినయి. ముప్పైయి అయిదువందలు వచ్చినయి. సావిత్రి – రామస్వామిల బట్టలన్నింటనీ కూడా పాత బట్టలు కొనేటోళ్లకు అమ్మేసాడు. పదివేలు దాచుకుని నాల్గు వందలు జేబులో వుంచుకున్నాడు. ఇంటికి తాళం వేసి బయటకు నడిచాడు. ఒకరిద్దరు ఉన్న ఇంటికి వారసులమని వచ్చే ప్రయత్నం చేయబోయారు గానీ కుదరలేదు. పైగా లారీ ఫీల్డు మనుషులనే భయం కనుక ఆగిపోయారు. సింహాద్రికి బడిలో చేరినపుడు చదువు అబ్బకపోయినా రామశాస్త్రి గారబ్బాయి సత్యంతో స్నేహం కుదిరింది. చదువును వదిలేసినా, స్నేహాన్ని వదలలేదు. అతని సహకారంతో లారీ పై క్లీనరుగా ఎక్కాడు. రెండు నెలల్లో ఆ వాతావరణంలో కలిసాడు. డ్రైవరు రాములుతో మంచిగా ఉండి, అతని పనుల్ని చేసి పెట్టి అభిమానం సంపాదించుకొని డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అలా రామస్వామి ఫీల్డలోనే తను fix అయిపోయాడు. ఉన్న పదివేలను ఇంటి దగ్గరే ఉన్న చిల్లరకొట్టు అప్పలస్వామికి వడ్డీకిచ్చాడు. అప్పలస్వామికి భార్యగా చుక్కమ్మ వచ్చాక బాగా కలిసొచ్చిందంటారు. ఎంత కలిసొచ్చినా చాలా పద్ధతిగా వ్యాపారం చేసేవాడు.

సింహాద్రి నూనుగు మీసాలలోకి వచ్చేనాటికి ఫీల్డులో మంచి డ్రైవరుగా ఎదిగాడు. ఓపికస్థుడిగా. పద్ధతయిన వానిగా మెదలడమే కాక, తోటివారికి చేయగల్గినంత ఆదుకునే స్వభావము ఉండడాన మంచి పేరు సంపాదించుకున్నాడు. అయిదు నేషనల్ బండ్లు (లారీలు) ఉన్న సన్యాసిరావు దృష్టిలో పడి అక్కడ డ్రైవరుగా చేరాడు.

సన్యాసిరావు ఆఫీసులోనే యజమాని గానీ ఇంటి దగ్గర శాంతమ్మగారి మొగుడే. ఆవిడ సంతానాన్నివకనే చనిపోయింది. ఇక బ్రతుకులో పెళ్లి చేసుకోవద్దనుకున్నాడు సన్యాసిరావు. అంత ప్రభావితం చేసిందావిడ. అయితే ఏడాది తిరగకుండానే ఆడ అవసరం శరీరానికి ఇంకా ఉన్నట్టు అర్థమైంది. అర్థమయ్యాక మనస్సు ఆగలేదు. ఈ గజలక్ష్మి అనే  బాల వితంతువును పెళ్లాడాడు. గజలక్ష్మి చూసేందుకు పరవాలేదనిపించినా మంచి మాటకారి. నల్గురితో వ్యవహారించే తీరు తెల్సినది. ఇక్కడికొచ్చాకా సన్యాసిరావును సంబాళించుకొనడంతోపాటు వ్యాపారాన్నీ దాని పరిధినీ కూడా బాగా ఆకళింపు చేసుకున్నది. మరో ఏటికి సన్యాసిరావు సామ్రాజ్యానికి పట్టమహిషిగా ఎదిగింది. రెండోసారి సన్యాసిరావు గజలక్షి భర్తగానే మిగిలాడు. లారీలూ సంపాదిస్తున్నాయి. టైర్ల దుకాణమూ సంపాదిస్తున్నది. గజలక్ష్మి దగ్గర సుఖమూ శాంతి దొరికింది. పైగా అన్ని వ్యవహారాలనూ చక్కగా చూసుకోగల్గినదీ అవడాన తృప్తిగా పక్కకు తొలగి చూస్తుండిపోయాడు. అవసరమై గజలక్ష్మి పిలిస్తే తప్ప వ్యాపారంలో తలదూర్చడం మానేసాడు.

సింహాద్రి వయస్సు ఉరవడిని చూసి, ఓపికగా బండి తోలగలడా లేదా అన్ని పరీక్షించి చూసింది. నెగ్గాడు. రెండు సంవత్సరాలు కాలం గడిచింది. సంపాదనలో గజలక్ష్మి బాగా ముందుకు నడిచింది. ఇట్టాంటి సమయాన నిశ్చింతగా ఉంటున్న సన్యాసిరావుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. వచ్చాక తిరిగి స్పృహ రాలేదు. గజలక్ష్మి ధారాళంగా పైసలు ఖర్చు పెట్టింది. సింహాద్రి డ్యూటీ దిగిన కారణాన ఇక్కడే తోడుగా ఉన్నాడు. సన్యాసిరావుకు సకలోపచారాలు చేసాడు. ఆయన బ్రతకాలనీ, గజలక్ష్మి లక్ష్మీదేవిలా కాసంత బొట్టుతో కనపడాలనీ మనసారా కోరుకున్నాడు. వారం తరువాత సన్యాసిరావు కొంచెం తేరుకున్నట్టుగా అయి అందరినీ చూసి గుర్తుపట్టాడు. ఇక పరవాలేదు అనుకుంటుండగానే పదోనాడు మళ్లా తిరగబెట్టింది. డబ్బు పరిధి, డాక్టర్ల శక్తి సరిపోయినా సన్యాసిరావు బ్రతకలేదు. సింహాద్రి పసివానిలా అక్కడే పడి ఏడ్చాడు. క్రతువు అంతా తనే అయి చేసాడు. గజలక్ష్మి పాపం నెలరోజులు మనిషి కాలేకపోయింది. నిజాయితీగా సన్యాసిరావునే నమ్మి దైవంగా కొలిచింది. ఒంటరిదైంది. ఇది రెండో వైధవ్యం. ఈ స్థితిలో గజలక్ష్మికి మగ తోడుగా మిగిలాడు. ఆవిడ నమ్మకాన్ని అభిమానాన్ని దండిగా పొందాడు. ఇలా కాలం గడుస్తుండగా ఒక బలహీనమైన క్షణాన గజలక్ష్మి సింహాద్రిని తన బ్రతుకులోకి ఆహ్వానించింది. అది మొదలు ఆవిడని పూర్తిగా అర్థం చేసుకొని ఆసరాగా ఉండసాగాడు. ఆనక అతి తక్కువ కాలంలో సింహాద్రి వ్యాపారపు అన్ని బాధ్యతలనూ స్వీకరించాడు. గజలక్ష్మిని మంచి ఇల్లాలుగా మిగిల్చి ఇంటనే ఉంచాడు. గజలక్ష్మి పేరుతోనే ఇంకా రెండు సంస్థలను నెలకొల్పాడు. పెట్రోలు బంకు, చిన్న సినిమా హాలూ  వగైరాలూ కొన్నాడు.

సింహాద్రి గజలక్ష్మిలకు ఇప్పుడు ముగ్గురు సంతానం.

ఇప్పుడు సింహాద్రి గడపలోని కాలు కారులోనే పెడతాడు.

సన్యాసిరావు లారీని డ్రైవరుగా నెక్కి ఇలా ఎదిగాడు. గజలక్ష్మిని మెప్పించి ఊరుకు ఓ రకంగా ఊరేస్తున్నాడు. అనేక రంగాలలోకి విస్తరిస్తున్నాడు.

ఈ ఇద్దరి కలయిక ఓ మంచి స్థితిని ఏర్పాటు చేసింది.

“నమస్కారం” అంటూ చిదంబరం అనడంతో జయంతి ఆలోచన సరళికి బ్రేకొచ్చింది.

“ఏమిటి?” అన్నాడు.

“బెంగ్లూరు నుంచి వస్తుంటి. కూస్త పని ఉండాది.”

“చెప్పు.”

“చెప్తే ఇప్పుడు పూర్తి అవదుగానీ” అని, “శారదమ్మా” అని పిలిచాడు వెనక్కు చూసి.

ఇరవై సంవత్సరాలున్న అందమైన ఓ అమ్మాయి సాంప్రదాయబద్ధమైన కట్టూబొట్టూతో జయంతి ఎదురుగా వచ్చి వినయంగా నమస్కరించింది. ఆవిడ నున్న ఒద్దికనూ, ప్రశాంతతను చూస్తూ “కూర్చోండి” అన్నాడు.

“ఈ అమ్మడికి ఉద్యోగం కావాలి. నేను మళ్ళీ కలుస్తాను” అంటూ దండం పెట్టి వెళ్లిపోయాడు.

సింహాద్రి నాయుడి తలపు ఇంకా తల నుంచి పూర్తిగా పోలేదు జయంతికి. చివరలో ఈ మధ్యననే కోయంబత్తూరు నోట్ల చెలామణిలో పడ్డాడు. పోలీసు దృష్టి పడేసరికి తప్పుకోగలిగాడు. చిల్లరగాళ్లు బలయ్యారు పాపం. సింహాద్రినాయుడికి ‘మరక’ అంటలేదు. పులిలానే మిగిలాడు. గజలక్ష్మి గౌరవానికి భంగం రానివ్వలేదు.

అయినా సింహాద్రి ఎలా సంపాదించాడని అడగగలిగే వాడెవ్వడు? అమ్మో మహర్దశ ఉన్నవాడు. ఆయన అదృష్టంలో ఆవగింజంత తగిలితే చాలు మన బ్రతుకులు ట్యూబులైట్లులా వెలుగుతయి అనుకునేవాళ్లు. న్యాయానికి సింహాద్రినాయుడి అసలు రూపం గజలక్ష్మికీ ఇప్పటికి అర్థం గాలేదు. కానీ ‘ఎంతగానో ఎదిగాడు, తనవానిగా మిగిలాడు’ అన్న తృప్తి ఆవిడకు చాలు.

సింహాద్రినాయుడు కూడా గజలక్ష్మిని జీవితంలోకి ఆహ్వనించినప్పటి లానే ఇప్పుడూ ఉన్నాడు. ఆవిడా పిల్లలే అతనికి ప్రాణం.

స్థూలంగా అనుకోవాలంటే, గజలక్ష్మి దయతో వెలిగించిన దీపం సింహాద్రి.

ఏదో అలికిడి అనిపించి ఎదురుగా చూసాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here