Site icon Sanchika

నియో రిచ్-5

[శివరాం ఇంట్లో పార్టీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాకా, డా. హర్ష గురించి ఆలోచిస్తూ, తనకు తెలిసిన అతని గతాన్ని గుర్తు చేసుకుంటాడు జయంతీలాల్. డా. హర్ష ఎంపిగా పోటీ చేసి, ఓడిపోయి, తనను ప్రతిపాదించిన పార్టీకే ముఖ్య నేతగా ఎదుగుతాడు. హర్ష గతం గుర్తు చేసుకోడం పూర్తయి, జయంతి నిద్రపోతుండగా, ఫోన్ మోగుతుంది. ఫోన్ చేసింది సింహాద్రినాయుడు. ఏదో ప్రోగ్రాం గురించి అడిగి ఫోన్ పెట్టేస్తాడు. ఇక సింహాద్రి నాయుడి గురించి ఆలోచిస్తాడు జయంతి. తనకు తెలిసిన అతని గతాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మధ్యలో చిదంబరం అనే వ్యక్తి శారద అనే అమ్మాయిని తీసుకుని జయంతి ఇంటికి వస్తాడు. ఆ అమ్మాయికి ఏదైనా ఉద్యోగం ఇప్పించమని కోరి, అతను వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆలోచనలలో లీనమవుతాడు జయంతి. ఏదో చప్పుడయినట్లనిపించి వర్తమానంలోకి వచ్చి ఎదురుగా చూస్తాడు జయంతి. ఇక చదవండి.]

[dropcap]ఓ[/dropcap] బంగారు తీగ కూర్చుని కనిపించింది.

ఉలిక్కిపడ్డట్టు అయి “మీరు పిలిచారా?” అడిగాడు సర్దుకుంటూ.

లేదనట్లు తల అడ్డంగా తిప్పింది.

అలా తిప్పినప్పుడు అందంగానే అనిపించింది. “మరి” అన్నాడు.

“మిమ్మల్ని పరధ్యానం వదలదా? కొంచెం ముఖాన చల్లటి నీళ్లు చల్లుకొని గట్టిగా తుడుచుకొని రండి” అంది నెమ్మదిగా నవ్వుతూ.

“ఏం పని మీద వచ్చారు?” అడిగాడు ఆవిడ చెప్పిందాన్ని పట్టించుకోకుండా.

“మీ దగ్గర P.A. పోస్టు ఉందనీ, మీకు కావాలని చిదంబరం చెపితే వచ్చాను. నా పేరు శారద. B.Sc. First Class అన్నామలై. టైపూ షార్ట్‌హ్యాండూ వచ్చు. నా వయస్సు ఇరవై. పెళ్లి కాలేదు. నేను ఒక్కదాన్ని… ఒంటరిదాన్ని. నడుస్తున్న సమాజంపై భయం ఉన్న దాన్ని” అంది.

“అంటే?”

“అంతా పోయారు” అంది. శారద కళ్లలో నీరుబకడం కనిపించింది.

“గతం గుర్తులు బాధ పెడతున్నాయి. భవిష్యత్తు అగమ్యంగా ఉంది. ఎటూ తోచట్లేదు. ఆడపిల్లను.”

“అంటే?”

“It is my present position. చెప్పాను.” అంది కళ్లు తుడుచుకుంటూ.

“వివరంగా చెప్పగలరా? Or any objection?”

“No. అదేది లేదు. చెప్తాను. నేను అమ్మమ్మ చూపిన ఫోటోలో మాత్రమే నా అమానాన్నలను చూసాను. నాకు అన్నీ మా అమ్మమ్మే. ఆవిడే నాకు చదువు చెప్పించింది. సాకింది. లోకం గురించి చెప్పింది. చూపింది. నా చదువు పూర్తయ్యాక నెల తిరగకుండానే తన బాధ్యత పూర్తయినట్టు కన్ను మూసింది.” అని ఓ క్షణం ఆగి, “అప్పటిదాకా రోగం రొష్టు ఆమె దాపుకే వచ్చి ఎరుగవు. రాయిలా ఉంది. రివటలా చురుగ్గా అనిపించేది. అలసట దాదాపు ఆవిడకు తెలీదు. కష్టాన్ని చాలా తేలికగా తీసుకొనేది. భయం, పిరికితనం ఆవిడ దాపుకు వచ్చేవికావు. అసలావిడను చూస్తేనే నాకెంతో గర్వంగా ఉండేది. ఎప్పుడూ కూర్చునే వాలు కుర్చీలో నా కోసం ఎదురు చూస్తున్నట్టుగానే ఉంది. దగ్గరికెళ్ళాక అక్కున చేర్చుకుంటుందనుకున్నాను. కట్టెలా కనిపించింది. కూలబడిపోయాను. నా ప్రాణమే పోయినంత బాధపడిపోయాను. నేను లేచేసరికి నా ప్రక్కన ఓ కవరు ఉంది. దాని ప్రక్కన చీటీ.

‘అమ్మా ఇరవై ఒక్కటి సంవత్సరం నీకు వచ్చాక దాన్ని విప్పు. ఇది నీ పెళ్ళి కని మీ నాన్న ఇచ్చాడు. నీ వివాహం ఇరవై ఒక్కటి వచ్చాకనే చేయమన్నాడు. నాకా అదృష్టం లేదు’ అని ఉంది. అది మొదలు ఒంటరిదాన్ని. నాకు ఇంకా ఎనిమిది నెలలు టైముంది, ఇరవై ఒక్కటి వచ్చేందుకు. ఆ తరువాతే నేను ఏ నిర్ణయానికి వచ్చినా. అయితే అప్పటిదాకా మాములుగా బ్రతికేందుకు కూడా నా ఆర్థిక స్థితి పర్మిట్ చేసేట్టులేదు. నౌకరీ కోసం ప్రయత్నిస్తున్నాను. మీకు P.A. కావాలని నిన్న తెలిసింది. క్లబ్బు దగ్గరికి వచ్చాను ధైర్యంగా. మీరు అక్కడ నుంచి వెళ్లిపోయారట. మీ అడ్రసు తెల్సుకొని నేరుగా ఇప్పుడు వచ్చాను. చిదంబరమట, మీ స్నేహితుడనని బయటనే చెప్పి పరిచయం చేస్తానని వచ్చాడు. నా మాట వినిపించుకోలేదు. పైగా నేనెవ్వరో అతనికి తెలీదు. పేరు తప్ప. అందుకే ‘శారద’గా చెప్పి వెళ్లాడు. ఇప్పుడు మీరు కలిసారు. నా విషయం పూర్తిగా విన్నారు.” అని కళ్లు దస్తీతో తుడుచుకుని నెమ్మదిగా లేచి నిలబడింది.

శారద మాటలాడు పద్ధతి చాలా బాగా నచ్చింది. మొదటిసారి ఎందుకో గాని అంతగా impress అయ్యాడు జయంతి. చాలా గౌరవకరమైన కుటుంబం నుంచి వచ్చిన స్నేహితురాలిలా అనిపించింది.

“శారదా నాకు P.A. అవసరం లేదు. నేను కావాలని ఎవ్వరితోనూ అననూ లేదు.”

అలా అనగానే నెమ్మదిగా తనున్న చోటు నుంచి కదిలే ప్రయత్నంలో పడింది. రెండు చేతులతో నమస్కరించబోయింది Thanks అంటూ.

“నా దగ్గర ఉద్యోగం లేదన్నాను గదా ఇంకా thanks ఎందుకు?” అన్నాడు నవ్వుతూ.

“వెంటనే result చెప్పినందుకు. రేపు రా మాపు రా అని తిప్పి ఆడుకోనందుకు” అని వెనక్కు మళ్లీ అడుగు కదిపింది.

“శారదా” అని పిలిచాడు జయంతి.

శారద ఆగి వెనక్క తిరిగి “పిలిచారా” అంది.

“నాకు P.A. అవసరం ఉంది” అన్నాడు.

“నాతో హాస్యలాడాలనిపిస్తున్నదా? ఇప్పుడే కదా అక్కర్లేదన్నారు?”

“మిమ్మల్ని చూసాక అనుకున్నాను.”

“P.A. ఉద్యోగానికి అంతేగదా.”

“మీరే కావాలంటేనో?”

“No. Sorry. మరొకర్ని ఇలా ప్రశ్నించకండి” అంది సీరియస్‌గా

“మీరు మరో విధంగా అనుకోవద్దు. నాకు P.A. గానే మీరు కావాలి అంటున్నాను.”

అనుమానంగా చూసింది.

“మీరు ఇలా వచ్చి కూర్చోండి” అన్నాడు.

వచ్చి కూర్చుంది.

“You are appointed” అన్నాడు.

“అది సరే నేనేం చేయ్యాల్సి ఉంటుంది?”

“ఉదయం రండి చెప్తాను” అని లేచాడు జయంతి.

“Thanks. మరి ఆఫీసెక్కడ?”

“రేపు ఉదయం ఇక్కడికే రండి. మీ ప్రశ్నలకు సమాధానం దొరుకుంది.”

తనకెంత ఆతృత ఉన్నా ఇంకా విసిగించడం బాగనిపించక thanks చెప్పి వెనుతిరిగింది.

ఆ తరువాత ఆలోచనలో పడ్డాడు జయంతి. అది తెగిందో లేదో తెలీదు గానీ ఓ గంట తరువాత బయటకొచ్చి కారెక్కాడు.

శారద శారద అని రెండు మూడు సార్లు అనుకున్నాడు. మనస్సంతా ‘శారద’ నిండి ప్రశాంతంగా నిర్మలంగా అనిపించింది. అంతటి శాంతి, హాయి లోగడ అతని మనస్సుకు దొరికిన దాఖలాలు కనిపించలేదు. శారదను చూడడం ఇదే. కళ్లు చూడగానే ఇలాంటి పిల్ల ఇల్లాలిగా బావుటుంది అనిపించింది. శారద అవివాహితను అని చెప్పాక బ్రతుకులో పెళ్లి అంటూ చేసుకోవడం తటస్థపడితే పిల్ల ఇలానే ఉండాలనే ఈ భావనే మనస్సును సంతోషంలో ఓలలాడించింది. ఇట్టాంటి టైంలో ముల్లు లాంటి అనుమానము వచ్చి ఎదురు నిలచింది. తను బాలా కుమారుడు కాదు. పెళ్లీడు బాగా దాటినవాడు. ముప్ఫై ఏడు నలభై సంవత్సరాల వయస్సున్నవాడు. ఇట్టాంటి వానితో శారద గానీ అలాంటి ఎవరినైనా కానీ వివాహానికి అంగీకరిస్తారా? న్యాయానికి దాదాపు వాళ్లకు ఇబ్బడి వయస్సు కదా. ఇట్టా ఆలోచనలు నెగిటివ్‌గా ముసురుతుంటే ఆపాడు. మనస్సంతా భయం నిండింది. చేతి కంది వచ్చాక అదృష్టమేదో అందినట్టే అంది జారిపోయిన భావన మనస్సున బాధను నింపింది. అసలు ఎన్నో సంబంధాలు ఎడతెరిపి లేకుండా వచ్చినప్పుడు పెళ్లాడాలనిపించ లేదు. కనీసం ఏ పిల్లనూ పెళ్లి దృష్టిలో చూడనూ లేదు. ఈ శారద… ఇప్పడు మొదటిసారి కళ్లబడటమేగాక పెళ్లాడితే బాగు అనిపించేంతగా మనస్సును లాగేసింది.

కారు శివరాం ఇంటి ముందు ఆగింది. దిగి లోనికి నడిచాడు. శివరాం లేడు.

రవీ కనిపించలేదు. పార్వతి రమ్మని తీసుకెళ్లి కూర్చోబెట్టి మంచి కాఫీ కలిపి ఇచ్చింది. త్రాగాడు. రెండు మూడుసార్లు పార్వతితో ఏదో మాటాడబోయాడు. కాని ఏమీ మాటాడలేదు. ఎదురుగా ఉన్న పేపరును తిరగేయాలనిపించినట్లుంది “ఇక వెళ్తాను” అని లేచాడు.

“వచ్చి ఏం చెప్పవు?” అంది పార్వతి.

“ఏం లేదు. ఉర్కే వచ్చాను. ఎందుకో ఇలా వెళ్లాలనిపించింది” అన్నాడు నవ్వుతూ.

“నన్ను చూడాలని అనిపించలేదా?” అంది నిష్ఠూరంగా పార్వతి.

“అలా అనుకోనే వద్దు పార్వతి. నాకు తోబుట్టువు లేని కొరత నీతోనే తీరింది. నువ్వూ నిష్ఠూరాలాడితే…”

“ఊళ్లోనే ఉన్నావా?”

తల ఊపాడు.

“బాబూ నేనూ శివాలయానికి వెళ్తూ రెండు పర్యాయాలు వచ్చాం. కనీసం ఎవరైనా చెప్పారా?”

“చెప్పారు.”

“అన్నయ్యా” అని దగ్గరకొచ్చి భుజాన చేయి వేసి “నేను అదృష్టవంతురాల్ని. నాకు అన్న లేని లోటును నీతో తీర్చుకొన్నాను. మాకు కష్టంలో ఏ అన్నా చేయనంత సహాయమూ చేసావు. మమ్మల్ని నిజంగా ఈ స్థితిన ఉంచింది నువ్వే. మా కాళ్లపైన మేము నిల్చున్నాక నువ్వు మరచినా నేనెలా మరచిపోగలను? నిన్న రోజు ఒక్కసారైనా నా ఇంట చూడాలనే స్వార్థం ఉన్నదాన్ని. వారానికోసారయినా కనీసం కనిపించాలని కోరుకుని ఎదురు చూస్తుంటాను కానీ…”

“లేదు పార్వతీ నాకు మనసు ఇటే ఉన్నా, కుదరడం లేదు. నువ్వు బాగున్నావు. మీ స్థితి సవ్యంగా ఉంది. శివరాం అన్ని పనులూ చక్కగా planned గా నిర్వహించగల సమర్థుడు. మీరు సంతోషంగానే ఉన్నారు. సంతోషంలో నాకు భాగస్వామ్యం ఎందుకు? అనిపిస్తుంది” అని నవ్వి, “పార్వతి వస్తాను. నువ్వు మనస్సును ఎప్పుడూ కష్టపెట్టుకోకు. ఇక నుంచి సాధ్యమైనంత మేర నీ దగ్గరే ఉండే ప్రయత్నం చేస్తాను. సరేనా!” అని నడిచాడు.

“అన్నయ్యా” పార్వతి పిలుపు.

నడచేవాడల్లా ఆగాడు.

దగ్గరగా వచ్చి “ఏదో చెప్పాలని వచ్చినట్టు అనిపించింది” అంది.

ఉలిక్కిపడ్డాడు జయంతి. పార్వతి తన మనస్సుకున్న మాటను పసిగట్టే ఇలా అన్నదా, ఏదోలా అని ఉండవచ్చా అన్నది అర్థం కాలేదు.

పార్వతిని మాత్రం నిశితంగా చూసాడు. తనకు సమాధానం దొరుకుతుందేమోనని. కాని ఏమీ అర్థం కాలేదు.

“పార్వతీ, నాకు గృహస్థు అయ్యే వీలు ఉందంటావా?” అని కళ్లలోకి చూసి

“నేను గృహస్థు కాగలనా?” అన్నాడు.

“వదిన ఎవరు?” అంది పార్వతి సంతోషంగా.

“వదినేమిటి?”

“ఏముంది వదినే. ఎవరు? ఎక్కడుంటుంది. నువ్వెప్పుడు చూసి వచ్చావు?” ఇలా అనేక ప్రశ్నలు వేసింది.

“రేపు ఉదయం నువ్వు ఇంటికి వస్తే చూసి చెపుదువు గాని.”

“మీ ఇంటికే ఎందుకు? అక్కడ ఎవరున్నారు?” అడిగింది ఆతృతగా.

“అక్కడికి ఓ అమ్మాయి ఉద్యోగం కోసం వస్తుంది” అని కారు వైపు నడిచాడు.

పార్వతి జయంతి మానసిక స్థితిని అవగతం చేసుకునేందుకు ప్రయత్నించింది.

‘అసలు నేనేమిటి ఇలా నిర్ణయం ఎందుకు తీసుకున్నాను. ఇది ఫలానా అని పార్వతికీ ఎలా చెప్పగలిగాను అన్నది అర్థమూ కాలేదు’ జయంతికి.

తెల్లవారింది.

ఆనందంగా తెల్లారినట్లు, ప్రకృతీ ప్రపంచం అంతా ఆనందమయంగా ఉన్నట్టూ అనిపించింది పిచ్చ మనసుకు.

పార్వతి అక్కడకు చేరేసరికి ఉదయం తొమ్మిదయింది.

వస్తూనే ఇంటి లోపలికి నడిచింది.

శారద అక్కడికి వచ్చే సరికి వాచ్‌మాన్ ఘూర్గా తప్ప ఎట్టాటి అలికిడీ లేదు.

కొంచెం భయం కలిగింది. లేచి వెళ్లి బజర్ నొక్కింది ధైర్యం చేసి. పార్వతే బయటకు తొంగిచూసింది.

శారద పార్వతిని చూసి జయంతీలాల్ గారి తాలూకానేమో ననుకొని నమస్తే చెప్పింది వినయంగా. ప్రతి నమస్కారం చేసి ఎదురుగా కూర్చుంది పార్వతి, శారదనే చూస్తూ.

శారదను కుర్చోమని సైగ చేసింది.

ఎంత హోమ్లీగా ఉందీ పిల్ల. ఈ పిల్లతో పెళ్లి జరిగితే జయంతి ఎంత అదృష్టవంతుడో. శారద సోఫా చివరన ఒదుగుకొని కూర్చున్నది.

“మీ పేరు శారదా?” అడిగింది.

తల ఊపింది, మీకెలా తెల్సు అన్నట్టుగా చూసి.

“నీ తరపున ఎవరైనా వచ్చారా?” అడిగింది.

“ఎందుకు నేను ఉన్నాను గదా?” అంది.

“మాటాడాలి.”

“నాతోనా?”

“ఏంటో?”

“నీ ఉద్యోగ విషయం”

“నిజంగానే?”

“Yes”

“నాకు నేనుగానే ఉన్నాను. అడగండి. మీరు నన్ను interview చేయడానికి వచ్చారా?” అంది నవ్వి కుదురుగా కూర్చుంటూ.

“మా జయంతి మిమ్మల్ని పెళ్లాడాలనుకుంటున్నాడు. మీ అంగీకారంతో. మీరు సరే నంటే” అంది.

ఈ మాటకి నిజంగానే శారద షాక్ తిన్నది. కొద్ది క్షణాలు అయోమయం కలిగింది.

ఆనక కొంచెం తేరుకుని “నేను శారదను. నేను వచ్చింది జయంతీలాల్ గారి దగ్గర P.A. ఉద్యోగానికి. మీరు ఎదురు చూస్తున్నవారు మీకు కావాల్సిన వారు బహుశా ఇక రావచ్చునేమో” అంది.

ఈ సమాధానం పార్వతికి వింతగా అనిపించలేదు.

కానీ జయంతీలాల్ కోసం లోనకెళ్లింది. చేయి పుచ్చుకొని గబగబా జయంతిను లాక్కుని వచ్చింది. జయంతి కనిపించడంతో శారద లేచి నిల్చున్నది. విష్ చేసింది. “ఇతని కోసమేనా నువ్వు వచ్చింది” అని అడిగింది పార్వతి.

తలూపింది శారద.

“అయితే జయంతి, మొదట ఈ పిల్లకు ఉద్యోగమివ్వు” అంది.

“నేనొచ్చింది అందుకే. నే చేయాల్సిన డ్యూటీ ఏమిటో ఈ పొద్దుట చెప్తానన్నారు” అంది శారద. జయంతి లోపలికి వెళ్ళాడు.

“మా అన్నయ్యకు కావాల్సిందీ P.A. కాదు. Life Partner. ఉద్యోగమూ లేదు సద్యోగమూ లేదు. ఒక వేళ దాన్ని ఇంకా ఉద్యోగమనుకుంటే దాని పేరు పెళ్లాం ఉద్యోగం” అని నవ్వింది.

“పెళ్లేమిటి? నా పెళ్లికి ఇంకా టైముంది. అప్పటిదాకా ఆసరా కోసం ఉద్యోగం కావాలి. మీతో ఆయన అలా చెప్పారా? నాకేమీ అర్థం కావడం లేదు” అంది అయోమయంగా చూస్తూ.

“అర్థం కావడానికేమీ లేదు. Love at first sight అంటారే అది, నిన్న నువ్వు కనిపించగానే అయిపోయింది. అంతే నువ్వు ఇక్కడికొచ్చి వెళ్లావుటగదా. వెళ్లగానే నా దగ్గరకు పరుగున వచ్చాడు. చెప్పేసాడు” అని, “ఇప్పటికి పదేళ్ల నుండి ఎన్ని సంబంధాలను తిరగొట్టాడో. అసలు బ్రహ్మచారిగానే ఉండిపోవాలనుంది, ఇక పెళ్లి సంబంధాలు తంతు ఆపేయి అని అన్నాడు. ఏమీ తోచక ఆగాను. కానీ ఇదేం మాయ చేసావో అర్థం కాలేదు. ఇలా చేసావు మా అన్నయ్యని” అంది.

“నాకా ఆలోచన లేదండి” అంది శారద పార్వతితో.

“ఆ టైం జయంతికి తెల్సునా?”

“చెప్పాను.”

“చెప్పినా నువ్వే కావాలి అనడంలో అర్థమేమిటి?” అని దగ్గరకొచ్చి “శారదా బలవంతమేమీ లేదు. అంత సంస్కారం లేని వాళ్లమేం కాదు. బాగా ఆలోచించుకొని నీకు ఇష్టమైతేనే చెప్పు చాలు. మంచి రోజు చూసి మా యింటికే వచ్చేద్దువుగాని.”

శారదకిదంతా ఎలాగో అనిపించింది. ఏం చెప్పాలో తోచనూ లేదు. జయంతి బయటకొస్తే ‘ఇదేమిటి’ అని నిలదియ్యాలని అనుకుంది. దుఃఖం ముంచుకొచ్చింది. ఆ దుఃఖం లోనే జయంతిని పెళ్లాడితే అన్నది కూడా మనస్సున మెదిలింది.

(ఇంకా ఉంది)

Exit mobile version