నియో రిచ్-7

0
2

[పెళ్ళి గురించి ఇప్పటికిప్పుడు చెప్పమంటే ఎలా అని శారద అడిగితే, ఆలోచించుకునే చెప్పమంటుంది పార్వతి. కాసేపటికి జయంతిని పెళ్ళి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకుంటుంది శారద. ఈ నిర్ణయాన్ని జయంతికి తెలిపి, పెళ్ళి గడువు వరకు శారద తమ ఇంట్లోనే ఉంటుందని చెప్పి, శారదని తమ ఇంటికి తీసుకువెళ్తుంది పార్వతి. అక్కడ శివరాం – శారద ఎవరని అడిగితే, చెబుతుంది పార్వతి. వివరాలు విన్న శివరాం, జయంతి అదృష్టవంతుడు అని అనుకుంటాడు. శారద తన గది అడ్రస్సు చెప్పి, తాళాలు ఇస్తే, ఇల్లు ఖాళీ చేయించే పనిని మగవాళ్లు చూసుకుంటారని చెప్తుంది పార్వతి. తన ఇంట్లో ఆలోచనల్లో ఉన్న జయంతికి చిదరంబరం గుర్తొస్తాడు. అతని గతాన్ని తలచుకుంటాడు. తొలుత రాజోలులో చేపల వ్యాపారం చేసే చిదంబరం – తర్వాత పూల వ్యాపారం చేస్తాడు. ఏదీ కలిసిరాదు. ఆ సమయంలో పరిచయమైన సాయిబు చిదంబరాన్ని మరో ఊరిలో ఓ వ్యభిచార ముఠాలో చేరుస్తాడు. వాళ్లు చెప్పిన పనులు చేయడం అతని పని. అక్కడ జరుగుతున్న వ్యవహారాలని గ్రహిస్తాడు చిదంబరం. ఇక చదవండి.]

[dropcap]గో[/dropcap]డకున్న నిచ్చెన పయిన కూర్చుని కనిపించాడు రాజన్న. దగ్గరకు రాగానే భుజంపై చెయ్య వేసి క్రిందకు దిగి “భలే లొంగదీసినవు గుంటని. దానికి మంచి బేరమొచ్చింది. రేపో మాపో పంపుతారు” అన్నాడు.

“తాతా ఒక్క మాట అడగనానె” అన్నాడు చిదంబరం.

‘తాత, తాత’ అని ఆగి సణుక్కుని చిదంబరం వైపు తిరిగాడు. తాత కళ్లలో నీరుబికి కనిపించింది. చిదంబరం భుజంపై చెయ్యి బలంగా వేసి “నువు నన్ను తాత అన్నావు గదా” అన్నాడు జీరగొంతున.

“అన్న”.

“నిజంగా నా మనవడు బ్రతికుంటే నీ అంత ఉండేటోడు. ఆమ్మోరు పోసి అరబ్రతుకున చచ్చిండు. మందు లేని రోగమది. వాడు చావబోయే ముందు కూడా ‘తాతా నాకు బతకాలని ఉన్నదే’ అంటానే ఉన్నాడు. మనం ఎవణ్ణి బతికించగలం? మన చావు మనకు తెలీనోళ్లం” అని నవ్వి “ఆనక దేశాలు పట్టి తిరిగిన. చాలాకాలం తిరుగతానే ఉన్నా, పిచ్చోడి లెక్కన. ఇప్పుడు ‘పిడచ’ కోసం ఇట్లా గుంటన్నా.” అని కళ్లు తుడుచుకొని “అరే  చిదంబరం నా మాట ఇంటావా?” అనడిగాడు.

తల ఊపాడు వింటానన్నట్లు.

“అట్టకాదు, మనసుతో చెప్పు. నౌకర్ పద్ధతొద్దు”

“ఇంటలేవే, నాకు మాత్రం ఎవరున్నారు.”

“నన్ను తాతా అనే పిలుస్తుండరా” అన్నాడు పసోడిలెక్క.

రాజన్న ప్రవర్తన అదోలా జాలిగా బాధగా కూడా అనిపించింది.

“అలాగే అట్లానే తాతా అని పిలుస్తా” అన్నాడు మనస్ఫూర్తిగా.

చాలా సంతోషంగా తృప్తిగా ముందుకు నడచాడు ముసలోడు.

ఆ మర్నాడు మాపటేళ పిలిచి “ఇంకో పోరి ఉండది. ఈ పూట దాని పని చూడు” అన్నాడు

లింగాన్ని పిలిచి “పదకొండు నెంబరులోకి పంపు వీణ్ణి” అని పురమాయించాడు.

లింగం వెంట నడచాడు చిదంబరం. “పదకొండిదే” అన్నాడు లింగం. నడుస్తుండగానే ఆగి తలుపు తోసి “ఇక పో” అన్నాడు. తలుపు దాటంగనె బయట గొళ్ళెం వేసిన చప్పుడు వినపడ్డది. అడుగులో అడుగు వేసుకుంటూ  నడిచాడు చిదంబరం. మంచం నానుకుని క్రింద కూర్చుని ఉందో అమ్మాయి. పసుపు కొమ్ములో ఉంది. ఎదురుగా రెండు కుర్చీలున్నాయి. ఫ్యాను తిరుగుతున్నది. అసలిట్టాటి మనుషుల్ని వీళ్లేడ ఎత్తుకొస్తారు? అన్నది చిదంబరం తలచాడు. అర్థమవలేదు. చిదంబరం నెమ్మదిగా వెళ్లి కుర్చీని ఎడంగా జరుపుకొని కూర్చున్నాడు ఆ పిల్లనే గమనిస్తూ. కోల ముఖం, ఉద్రేకం కల్గించే అవయవ సౌష్టవం కనిపించింది. వయస్సు పదహారు పద్దెనిమిదికి మించి ఉండవు. పసితనం పూర్తిగా వదలని అదో రకమైన అందం. ఆ పిల్ల శరీరానికి చీరా రవికా అద్బుతంగా అమరినవి. ఆ పిల్ల కళ్లు, కూర్చున్న తీరు అదీ బాగా చూసిన మీదట ముత్యాలమ్మ తల్లి బొమ్మ గబుక్కున తలలో మెదిలింది. ఆ బాటన పోతూనప్పుడల్లా గుడి లోనికి వంగి ఆ తల్లికి దండం పెట్టి మరీ వెళ్లేవాడు. అంతే ఆ పిల్లకు రెండు చేతులూ ఎత్తి నమస్కారం చేసి సాష్టంగపడ్డాడు. ఆ పిల్లకు అట్టా దండం ఎందుకు పెట్టాను? అన్నది మనస్సులోకి రాగానే చచ్చేంత సిగ్గయింది. లేచి కుర్చీలో ఒదుక్కుని కూర్చున్నాడు. మళ్లా ఆవిడను చూసేందుకు పది నిముషాలు పట్టింది. చూసాడు. కాలి వేళ్లను సర్దుకుంటూ కనిపించింది.

“నన్ను చిదంబరం అంటారు” అన్నాడు తనను తాను పరిచయం చేసుకుంటూ.

మాటాడలేదావిడ. కనీసం చిదంబరం వైపు తలెత్తి చూడలేదు.

“నీ పేరేమిటో?” అడిగాడు కాసేపు ఆగి.

“మాకు పేర్లెందుకు? ఒళ్లు ఉంటే చాలు. గిరాకీ ఒళ్లు. వేగంగా బేరం పలికేబట్టి”

“ఆగు ఆగు. ఇక ఎక్కువ మాడొద్దు” అని బిగ్గరగా అన్నాడు చిదంబరం. నరాలు ఉబ్బి అదోలా గయ్యాడు రెండు నిముషాలు.

“నేను బయటపడాలి. నువ్వా పని చేయగలవా?” అందా పిల్ల ఏడ్చిన కళ్లతో.

అప్పటిగా “నేనెందుకొచ్చాననుకుంటున్నావు?” అన్నాడు కఠినంగా.

తెల్సునన్నట్టు చూసింది.

“నా డ్యూటీ నేను చేయాలి. నేనిక్కడ యజమానిని కాదు. నౌకరును. పూట మెతుకుల కోసం పనికి కుదిరిన జవాన్ను.”

“No కుదరదు.  No no” అని అరిచింది.

“కుక్క ఇంత తిని విశ్వాసంగా ఉంటది” అన్నాడు నవ్వి.

“చిదంబరం, నువ్వు చేసే పని కుక్కలు చెయ్యవు. ఎదురు తిరిగి చీల్చిపారేస్తాయి” అంది.

చిదంబరం నోట మాట పెగల్లేదు. మరు నిముషాన తేరుకొని ఎదురుగ నడుస్తూ “నువ్వే మనుకున్నా నా పని నేను చేసి పోతా” అన్నాడు.

ఆ పిల్ల గబుక్కున లేచి మంచం దాటబోయి క్రింద పడింది. దాన్నే అదనుగ తీసుకొని అమ్మాయిని భుజం పైకి ఎత్తుకొన్నాడు. ఆ పిల్ల కోపంతో రక్కుతూ కరుస్తానే ఉన్నది.

దాన్ని భరిస్తూ ఇంకొంచెం పైకెత్తి నేల పైకి వెల్లికిల్లా పడేసాడు. క్రిందపడిన పిల్ల నడుం గరుక్కమనడంతో లేచి పరుగెత్తబోయిందల్లా అలాగే ఉండిపోయింది బాధతో విలవిలలాడిపోతూ. ఆ పిల్ల కళ్లు జ్యోతుల్లా రక్తాన్ని చిమ్ముతున్నాయి. వంగి మీద పడబోయాడు. కాని చిదంబరం ఒళ్లు వణికింది. చెమటతో తడిచి చల్లకట్టె లాగయింది. వెనక్కొచ్చి కుర్చీన కూర్చున్నడు. ఆ పిల్ల అలాగే పడి ఉన్నది. లేచి మళ్లా ప్రయత్నించబోయాడు. ముత్యాలమ్మ తల్లి కనిపించింది. అంతే గౌరి దగ్గరికి నెమ్మదిగా వెళ్లి చేతులు పట్టుకుని వాటితో ముఖం దాచుకుని ఏడ్చాడు. చాలా సేపు అలా  ఏడుస్తూనే ఉన్నాడు. ఆనక లేచి ప్రక్కన కూర్చున్నాడు. తెల్లారగట్ల తిరిగి వెడుతూ “అమ్మా నువ్వు లొంగావని చెప్తా” అని దండం పెట్టి నడిచాడు. తలుపు దగ్గర కెళ్ళి తట్టాడు. తలుపు తెరచిన లింగం “గెలిచావా” అడిగాడు.

తల ఊపాడు.

“అయితే నేను” అని… లోనకు నడవబోయాడు.

“అసలే చావుబతుకుల్లో ఉండాది. ఇప్పుడు నువ్వు తలపడితే చస్తుంది. ఆనక నా చావుకొస్తదిగాన పద” అని మలిపాడు.

మొదటి గండం గడచినందుకు మనసంతా హాయిగా అనిపించింది చిదంబరానికి.

మరో రోజు గడచింది. అసలిన్ని దినాలు… రాజన్న తాత, లింగం తప్ప మరో నరపురుగు కనపడడం లేదు. అసలిది జైలా, భూగృహమా ఇంకా ఏమన్నానా అనేది అర్థం కాలేదు.

అసలు బైటకు తోవ ఎటో కూడా అంతు బట్టకుండా పోయింది. ఊరిన ఉన్న పెళ్లాం, తల్లి గుర్తొచ్చింది. రెండో నాడే వస్తానని వచ్చాడు. పది దినాలు కావస్తున్నది. ఇంటికాడ ఎట్ల ఉన్నారో, ఏందో. ఒక్కసారి ఇల్లు చూసుకొని రావాల అనుకొని తాత దగ్గరకు నడిచాడు.

వరి గడ్డిపై వెల్లకితలా పడుకొని కూనిరాగాలు తీస్తూ చుట్ట కాలుస్తున్నాడు తాత.

“నువ్వా మనవడా, రా కూర్చో” అన్నాడు.

“కూర్చోటానికేముంది గాని తాతా, నేను మా ఇంటికాడ తెల్లారి వస్తానని చెప్పి వచ్చా. ఈడ ఇట్టా ఇరుక్కునిపోయను. వాళ్లు నా కోసం ఎంత గాబరా పడుతున్నారో ఏందో. భయంగా ఉంది. ఒక్కసారి వాళ్ల కళ్లబడి పని దొరికిందిని భయం లేదని చెప్పి వస్తా.”

“అట్టనే చేద్దువుగానిలే. ఈ పొద్దే అడిగి చెపుతా. రాత్రికి కలువు” అన్నడు తాత.

గాని మూడు దినాలు గడచినయి. కలవలేదు. అడగలేదు. ఇవ్వాళ్ల చెపుతా అనడమే తప్ప ఇవ్వాళ పోదువులే అని అనలేదు. పైగా “మనవడా ఒద్దికగా నడుచుకుంటే బాగా పైకొస్తువు” అని హితబోధ మొదలెట్టాడు. అంటే చిదంబరాన్ని బయటకు పంపేందుకు అనుమతి ముసలోడు ఇప్పించలేడు అని అర్థమయింది. కనుక సందు చూసి తప్పించుకొని పారిపోయేందుకు మార్గం చూడాలి అనుకున్నాడు. దానిలోని భాగంగా లింగాన్ని బాగా ఉబ్బేసి ఒక గంట తిరిగి వద్దామని చెప్పి ఒప్పించి ఊళ్లోకి వచ్చాడు. దాంతో బయటకు వచ్చే మార్గం అర్థమైంది. ఆ తెల్లవారే ముహూర్తం పెట్టుకున్నాడు. “గౌరమ్మ గదిలోకి వెళ్తున్నా” అని చెప్పి  బయటపడ్డాడు. పరుగున బస్సు స్టాండు చేరాడు. వాళ్ల ఊరు కెళ్లే బస్సు కోసం చూస్తూ ఉండగా సాయిబు కనిపించాడు. వాడి కంటపడకుండా తప్పుకొని బస్సెక్కి ఊరికి చేరుకునే సరికి తల ప్రాణం తోక కొచ్చింది. ఇంటికాడకెళ్తే పెళ్లాం లేదు. తాళం వేసి ఉంది. తల్లిదండ్రుల దగ్గరకెళ్లాడు. అక్కడా లేదు. పైగా “కోడలు పిల్లేదిరా, ఒంటరిగ వచ్చినవు” అన్నారు. “అదేందే దాన్నిడనే ఉంచిపోతి…” అన్నాడు చిదంబరం గాబరాగా. “మల్లెపూల సాయిబు అయిదు దినాల క్రితం వచ్చి నీకు  నౌకరీ దొరికిందనీ దాన్ని వెంట పెట్టుకొని తీసుకరమ్మన్నావని చెపితే బూరీలూ, పూసా వండి కట్టీ మరీ పంపామురా” అని లబోమన్నారు వాళ్లు. ఈ మాట వినగానే కాళ్లు చేతులు చల్లబడ్డాయి చిదంబరానికి. మాట పలుకూ లేకుండా పిచ్చోడి లెక్క బస్సు స్టాండుకు వచ్చిన దానికంటే వేగంగా పరుగెత్తాడు. బస్సెక్కాడు. టౌనులో దిగాడు. సాయిబు కోసం గాలించాడు. మాపటేళకు వాడు కళ్లబడ్డాడు. వాడే ఎదురొచ్చి “నౌకరీ చేసేటోడివి నిన్న వచ్చిపోలేదట, అట్ట చేస్తే ఉండే నౌకరీ కాదు, వెళ్ళు” అని దబాయించాడు. “మా ‘రమణ’ ఏదిరా?” అని గల్లా పట్టుకున్నాడు. చిదంబరం తన ఇంటికి పోయి వచ్చానన్నది వాడికి అర్థమై గాబరాపడి “ఏ రమణమ్మ, నాకేం తెల్సు” అని బుకాయించాడు. “నా పెళ్లాన్ని వెంట పెట్టుకొచ్చావుటగదరా! ఏది?” అని మెడ బిగించాడు చేతులతో చిదంబరం.

ఒడుపుగా విడిపించుకుని పురుగు లంకించుకున్నాడు సాయిబు. ఎంత దూరం వెంట పడ్డా అందడం లేదు. ఇక దిక్కు తోచక “దొంగ దొంగ పట్టుకోండి” అని మొత్తకుంటూ వాడి వెంటపరుగెత్తాడు చిదంబరం. అంత పరుగులోనూ ఏడుపు ఆగడం లేదు. ముందున్న జనం దొంగ దొంగ అన్న అరుపులు విని సాయిబును పట్టుకున్నారు.

“నా జేబులో డబ్బు వీడే కొట్టేసాడు. ఈడ్చుకొని పోలీసుస్టేషన్ లాక్కెళ్తాను” అన్నాడు చిదంబరం. జనమూ సహకరించారు బేషరతుగా. స్టేషనుకు చేరాక యస్సైతో గారితో జరిగింది జరిగినట్టు చెప్పి కాళ్లు పట్టుకొని ఏడ్చాడు. సాయిబును లాకప్ లోన వేసి రైడు పెట్టారు పోలీసులు. ఒకరొక్కరు అడ్డాకు చేరారు. చిదంబరం తోవ చూపాడు. రాజన్న, కొండచిలువ లింగంగాడు, అన్ని రోజులున్నా కనపడని పని పోరగాళ్లూ ఇరవై మంది దాకా ఆడపిల్లలూ స్పాట్‌లో దొరికారు. చిదంబరం వారిలో రమణ ఉందేమోనని వెతికాడు. లేదు. స్టేషన్ కొచ్చాక సాయిబుకు ‘కడ్డీ’ తెక్కిస్తే రాకెట్టు మొత్తాన్ని చెప్పాడు. చూపాడు. అయినా రమణమ్మ లేదు. రమణమ్మ కోసం యస్.ఐ. సాయిబును ఎన్ని చిత్రహింసలు పెట్టినా పెదవి విప్పలేదు. చాలా మంది గౌరవనీయులు కటకటాల వెనక్కు వెళ్ళారు. పేపరోళ్లకిదో పెద్ద సెన్సేషనల్ వార్తయింది. ‘రాకెట్ మొత్తం దొరికినా రమణమ్మ కానరాని వైనం’. ‘పెదవి విప్పని ఖాసిం’ ఇలా అనేక పతాక శీర్షికలు. నెలకు ఖాశింకు బెయిలు దొరికి బయటకొచ్చాడు. చిదంబరం వెంటబడి రమణమ్మేది అని అడిగాడు. ఆనందంగా నవ్వాడు తప్ప చెప్పలేదు. భరించలేకపోయాడు. దొరికిన రాడు కర్రతో తలపై బలంగా వేసాడు గుండెకోత భరించడం చేతకాక. అరక్షణంలో క్రిందపడి ఊపిరి విడిచాడు తప్ప, రమణమ్మ జాడ చెప్పలేదు. చిదంబరం అక్కడ నుంచి పారిపోయాడు. పద్నాలుగేళ్లు తరువాత ఇట్టా ఓ హోదా గల మనిషిలా పుష్కలంగా డబ్బు పట్టుకొని ఇక్కడకు చేరాడు.

చిదంబరాన్ని గుర్తించిన వాళ్లిక్కడ లేరు. పైగా బాగా మీసాలు పెంచాడు. జులపాల జుత్తేమో చాలా భాగం ఊడిపోయింది. అప్పుడు చూసిన వారే ఇప్పుడు గుర్తించలేని విధంగా అయ్యాడు. అయితే రమణమ్మ ఏమైందో అసలుందో లేదో కూడా ఇప్పటికి తెలీదు.

సాయిబు చచ్చాడు గనుక ఆ మిష్టరీ వీడేది కాదు.

ఇప్పుడు చిదంబరం గృహస్థు. ఇద్దరు పిల్లలు. ఇప్పటి భార్య పేరు సత్యవతి.

బాగా చదువరట. నాల్గు భాషలు తెల్సునట. మర్యాదగా మెలగడం ఆవిడ దగ్గరే నేర్చుకోవాలంటారు. మనిషి కూడా ఫర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది.

చిదంబరంగాడి చిదంబరం రహస్యమిది. ఇతను గుర్తులో కొస్తే చాలు రమణిని మరిచాడనిపిస్తది. డ్రస్సైనా విప్పకనే మంచానికి అడ్డంగా పడుకొని కళ్లు మూసుకున్నాడు జయంతి. ఏ ఆలోచనలు తలలోనికి రానివ్వలేదు.

***

జయంతికి మెలకువ రాగానే నౌకరు వచ్చి “సార్, R.K రావుగారినీ, వరదరాజుగారినీ పోలీసులు అరెస్టు చేసారట. తమకు రెండు సార్లు ఫోనులో చెప్పారు” అన్నాడు.

“ఎవరు చెప్పారు?” అడిగాడు లేచి.

“తెలియదు సార్!” అన్నాడు తల దించుకొని.

“ఎవరు చేస్తున్నారో మొదట తెల్సుకోవాలి.”

“తెల్సుకునే అవకాశమే ఇవ్వకుండా పెట్టేసారు సార్. నన్ను మాటడనివ్వలేదు.”

“All right” అని కాలకృత్యాలు తీర్చుకొని కారెక్కాడు.

డా. హర్ష ఇంటి దగ్గర కారాపాడు. ఆయన రోగుల మధ్యన బిజీగా ఉన్నాడు. అయనా లోనకు జొరబడి విషయం చెప్పి వెనక్కి మళ్లాడు. ఆనక కారు లాయరు ముకుందం ఇంటి ముందాగింది. తలుపులు తీసే ఉన్నాయి. బజ్జర్ నొక్కాడు. ముకుందం చెల్లెలు సత్యవతి వచ్చి ఎదురుగా ఉన్న జయంతిని చూసి ఒద్దికగా నిల్చుని లోనకు రమ్మన్నది, “బయటకెళ్లారు. పది నిముషాలలో వస్తానన్నారు” అంటూ. వచ్చి అతిథుల గదిలో సుఖాశీనడయ్యాడు. రెండు నిముషాలలో కూల్ డ్రింకుతో సత్యవతి గదిలో కొచ్చింది. “అక్కర్లేదు. టీ తీసుకుని బయలుదేరి పది నిముషాలు కూడా కాలేదు” అన్నాడు. “పరవాలేదు. నా తృప్తి కోసం” అని ముందుంచింది కావాలనే ముందుకు వంగి. ఆ వంగడంలో పైట క్రిందకు జారిపడింది. “సారీ” అంటూ పైటను పరువాలపైన సుతారంగా కప్పుకుంది, కప్పుకున్నా బయటకు కనిపించే పద్ధతిన. జయంతి డ్రింక్ తాగుతూ సత్యవతిని చూసాడు. ముప్పై వసంతాలలోపు వయస్సు. తెల్లటి మెరుపు. చూపరే అనిపించే అంత అవయవ సౌష్టవం. కోల మొఖం. ఒత్తైన జుత్తు. రంభ కాదు గానీ వయస్సుకున్న ఏ మగాడ్నయినా కాసేపు ఆపగలదు. అట్టాగే చూసేలా చేసుకోగలదు. దానికి తోడు చాల నీటుగా, fresh గా ఉంది. జయంతి కూడా ఓక్షణం చూపును అక్కడే ఆపాడు. కూల్ డ్రింక్ పూర్తి చేసి టైం చూసుకున్నాడు. పది నిముషాలు గడిచిపోయినయి. సత్యవతి ఎదురుగా కూర్చుంది. లాయరు ముకుందం జాడ లేదు. అసహనంగా లేచాడు. వచ్చిన తలుపు మూసి ఉంది. వెనక్కు చూసాడు. అటు తెరిచి ఉంది. ‘నేను గాని అటు నుంచి రాలేదు కదా…’ అనుకుంటూ నడచాడు. గది దాటుతుండగా సత్యవతి ఎదురుగా వచ్చి అడ్డం నిల్చుని “వస్తారు కూర్చోండి” అంది.

ఆగాడు జయంతి. కన్ను చెదరే అందం కనిపించింది ఎదురుగా.

“తలుపు నువ్వు మూసావా?” అడిగాడు జయంతి.

మాటాడక ముందుకు జరిగింది. కోపం నషాలానికి కెక్కింది జయంతికి.

“అసలు నీ ఉద్దశమేమిటి?” అంటూండగనే, సత్యవతి అకస్మాత్తుగా జయంతిని కావలించుకొని తన బలమైన గుండెలను అంతకన్నా బలంగా అదిమింది. అంతే, జయంతి మనసు పని చేయడం మానేసింది. అట్టాగే నిలబడిపోయడు. నిల్చుకుని ఎగబడి ఇస్తున్న ముద్దులు వెచ్చగా అనిపించాయి. మనసున వికారంతో పాటూ చికాకు అసహ్యమూ కల్గి బలంగా విసురుగా విదిలించుకొని గబగబా క్రిందికి నడచి కారెక్కాడు. కారు సీదా కోర్టు కెళ్లి ఆగింది. అక్కడ వెతకగా ‘సెషన్స్’లో దొరికాడు ముకుందం. జయంతితో మాటాడుతూ బయలుదేరాడు. ఇంటికి చేరాక గంటకు పైగా మాటాడుకునని జయంతి బయటపడ్డాడు. సత్యవతి జాడలేదు.

ఆదే రోజు రాత్రికి  RK రావు, వరదరాజు బెయిలుపై విడుదలయ్యారు. RK రావు ఇంటికెళ్లి పిస్తోలుతో కాల్చుకుని చనిపోయాడు. ఈ వార్త తెల్సిన వరదరాజుకు, జైలున కూడా గుండె చెదరని వరదరాజుకు, జోకులేస్తూ నిర్వికారంగా బయటకొచ్చిన వరదరాజుకు రావుగారి మరణవార్త గండెపోటు కలిగేలా చేసింది. ఆయన్ను వెంటనే పెద్ద ఆసుపత్రికి తరలించారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here