[భోంచేసి పడుకున్న జయంతికి, ఇంటికి శారద రావడంతో మెలకువ వస్తుంది. ఎందుకొచ్చావని అడిగితే, జయంతి ఉండడనుకుని వచ్చానంటుంది. జయంతి ఎత్తి మంచం మీద పడుకోబెట్టబోతాడు. ఇంతలో పార్వతి లోపలికి వస్తుంది. కాసేపుండి, తాను వెళ్తూ – శారదని కాసేపయ్యాకా ఇంటి దగ్గర దింపమని చెప్తుంది పార్వతి. టీ త్రాగాక, చనిపోయిన ఆర్.కె. రావు గురించి, వరదరాజు గురించి అడుగుతుంది శారద. చెప్పడానికి అభ్యంతరం లేకపోతే వారి గురించి చెప్పమంటుంది. మొదట రావు గారి గురించి చెప్పడం మొదలుపెడతాడు జయంతి. చిన్న ఇంజనీరుగా ప్రారంభించి, అక్కడ్నించి పెద్ద పెద్ద వాళ్ళతో స్నేహాలు కలుపుకుని రావు ఎదిగిన వైనాన్ని జయంతి చెప్తుంటాడు. తన ఇంట్లో పని చేసే అక్షరం ముక్క రాని మంగ్యా అనే అతనికి కష్టపడి అక్షరాల్ని నేర్పించి, లైసెన్స్ ఇప్పించి కాంట్రాక్టరుని చేసాడు రావు. బిజిలీ అనే అమ్మాయినిచ్చి పెళ్ళి చేస్తాడు. రావు ఇద్దరి కొడుకులు చదువు అబ్బక, జులాయిలవుతారు. పెళ్ళి చేయక తప్పదు కాబట్టి, వాళ్ళిద్దరికీ పెళ్ళి చేస్తాడు. వాళ్ళు వేరేగా ఉంటుంటారు. భార్య శకుంతల ఓ యువకుడితో పారిపోతూ, నగలు, డబ్బు తీసుకెళ్ళిపోతుంది. రావు కొన్నాళ్ళకి బిజిలీని లొంగదీసుకుంటాడు. ఒకరోజు రావుని బిజిలీనీ సన్నిహితంగా చూసిన మంగ్యా, భార్యని హత్య చేసి పోలీసులకి లొంగిపోతాడు. ఉద్యోగం నుంచి రిటైరవుతాడు రావు. ఇక చదవండి.]
[dropcap]ఇం[/dropcap]త జరుగుతున్నా ఇద్దరు కొడుకులూ తండ్రి ‘అజ’ కనుక్కోనలేదు. కనీసం పరామర్శించిన వారు లేరు. వారికిగా డబ్బు కావాల్సి వస్తేనో, వారికి వ్రాసి ఇచ్చిన దాంట్లో ఎక్కడైనా పేచీలు లాంటివి వస్తేనో వచ్చేవారు వెళ్లిపోయేవారు.
“మేం మీతోనే ఉంటాం నాన్నగారూ” అని ఎప్పుడూ అనలేదు. రావు దాని గురించి ఆలోచించనూ లేదు. కాని వారి కోసం మాత్రం బాగా ఎదురు చూసాడు. శకుంతల జ్ఞాపకాలు ఆ ఇంట్లో ఉండాలన్నా భయమయ్యేలా చేసినాయి. శకుంతల ఆ ఇంటిని చాలా ఇష్టంగా ఓ చిన్నపాటి మ్యూజియంలా తీర్చిదిద్దింది. అదే వెళ్లిపోయింది. పిచ్చి పిచ్చిగా అనిపించడం ప్రాణభయంతో ఒకనాడు వరదరాజుని పిలిచి ఉంటున్న ఇంటిని అమ్మేయమని చెప్పాడు.
నెలలో అమ్మి పెట్టాడు వరదరాజు. “ఎందుకు అమ్ముతున్నావు?” అని మాత్రం అడగలేదు. బయటపడి ఓ లాడ్జీలో కాటేజ్ లాంటి దాన్ని పర్మినెంటుగా తీసుకున్నాడు. ఆకలనిపిస్తే తినడం, త్రాగాలనిపిస్తే త్రాగడం. కోరిక అనిపిస్తే అందుబాటులో దొరికిన దానితో కులకడం. బయట ప్రపంచాన్ని దాదాపు వదిలేసి ఈ రొటీన్‍లో పడిపోయాడు. సంవత్సరం గడిచింది. ఇంకా నడుస్తున్నది. కానీ రావు మాత్రం అక్కడే వున్నాడు. ఇచ్చినదంతా కొడుకులు రకరకాల వ్యాపారాలలో తగలేసారని కర్ణాకర్ణిగా తెలిసింది. వస్తే మళ్లా ఎంతో కొంత ఇద్దామనుకున్నాడు. కాని వారు రాలేదు. కాలం కటువుగా మారి నడుస్తుందనిపించింది రావుకి. మనస్సే విశ్రాంతి లేకుండా పరిపరి విధాల నడక ప్రారంభించింది. ఆగక పిచ్చిలోకి దింపుతుందోమోనని భయము కలిగింది.
ఒకనాడు ఆడపిల్లల్ని పంపే బ్రోకరు వచ్చి “మంచి కుటుంబపు అమ్మాయి వుంది. చాలా బావుంది. పంపిస్తాను” అని చెప్పి వెళ్లాడు.
మాటాడలేదు రావు. మాటడకున్నా పంపడం అతని అలవాటు.
జానీవాకర్ విప్పి త్రాగడం ప్రారంభించాడు. నాల్గో రౌండ్‍కు సీసా ఖాళీ అయింది. మరొకటి విప్పాడు. గ్లాసులో పోస్తుండగా తలుపు తీసుకొని ఓ అమ్మాయి వచ్చింది. బాగా తలదించుకొని బెరుకుగా వచ్చి ప్రక్కనున్న కుర్చీపై ముడుచుకొని కూర్చుంది. ఈ వృత్తి లోని పిల్లగాడు అక్కడున్నాడు. గ్లాసులో పోసుకున్నది గుటుక్కున మ్రింగి “ఇట్టా చూడు” అన్నాడు. సిగ్గుతో భయంతో అవమానంతో చితికి పోతూనే తల ఎత్తింది.
కళ్లు చికిలించి చూసాడు అంతే.
త్రాగిందంతా నీరయిపోయింది. మంచం నుంచి అదాటుగా క్రిందకు దుమికి తలుపుకు గెడి వేసి దగ్గరికొచ్చాడు. “సుమిత్రా, నువ్వు నువ్వు” అని ఆ పిల్ల ముందే క్రిందపడి పిచ్చివానిలా ఏడ్చాడు. అప్పుడే గుర్తించిందా పిల్ల. కాళ్ల పై పడి కన్నీళ్లతోనే ఆయన పాదాల్ని కడిగింది. నెమ్మదిగా సుమిత్రను లేపి కూర్చోబెట్టి “ఏమిటమ్మా ఇదీ, చిన్నాడు చచ్చిపోయాడా తల్లీ. నేనింకా బ్రతికే వున్నట్లు తెలీదా?” అడిగాడు పగలుతున్న గుండెలు అదుముకొని పిచ్చివానిలా.
“లేదు మామయ్యగారు, బాంబే అని వెళ్లాడు. ఇప్పుడు కాదు మూడు నెలలయింది. ఇంట్లో సామాన్లును ఒక్కొక్కటి అమ్ముకుంటూ వచ్చాను. పదిహేను రోజులుగా చనిపోవాలనిపించింది. ఎందుకో తెలీదుగానీ చావలేకపోయాను. ఎలా బ్రతకాలో అర్థంగాని స్థితి. మా ఇంటికీ పోలేక ‘తాళి’ అమ్మడం కంటే ఇదే నయమని పించింది. నేను అందగత్తెనే గదా, అందుకేగా మీవానికిచ్చి చేసుకున్నారు. బాగా పైసలిచ్చే వానితో ఓ రాత్రి గడిపి మీవాని భార్యగానే గౌరవం చెడకుండానే బ్రతుకుదామనుకున్నాను” అంది ఏడుస్తూ.
“నాకు తెలపొచ్చు గద తల్లీ.”
“మీ దగ్గర కొచ్చినట్టు తెలిస్తే బ్రతకనిస్తాడా? మాకు ఆయన చచ్చాడు. ఆయనకు మేము చచ్చాం. ఇక పైన ఎప్పుడూ మా అమ్మానాన్నల పేరు గాని ప్రస్తావన రాకూడదు అని చెప్పాడు గదా.”
“మరి ఈ స్థితిని ఒప్పుకుంటాడంటవా?”
“తెలీదు. బహుశా ఆయన తప్పు వల్లనే ఇలా గయ్యానని అర్థం చేసుకుంటే ఏమో?”
“భగవంతుడా నేనింకా ఎందుకు బ్రతికి ఉన్నాను. ఈ డబ్బు ఎందుకు పనికి వచ్చేటట్టు” అని కళ్లు తుడుచుకుంటూ నాల్గడుగులు వేసి తలగడ కింద దిండు గలేబు కింద పెట్టిన డబ్బు చేతికి దొరికినంత తీసి ఆవిడ చేతిలో పెట్టి “అమ్మా నేను బతికి ఉన్నంత వరకైనా ఇట్టా అడుగు కదపకు. మీకు చెడ్డ స్థితి వస్తే చనిపో. అలా నాకు మాట ఇచ్చిపో” అన్నాడు.
సుమిత్ర ఏడుస్తూనే వెళ్లిపోయింది.
రావుగారి కళ్ల నుండి నీరు ఆగలేదు.
మూలిగే నక్క పైన తాటిపండు పడ్డ చందాన ఇలా ఉన్న రాపుగారి పైన ఐటి వాళ్ళ రైడు. దొరికిపోయాడు. ఏవైతే తనకు మాత్రమే తెల్సు అనుకున్నాడో అవన్నీ దాదాపు దొరికినయి. ప్లాట్లు, కాగితాలు, బంగారం, వెండి, వజ్రాలు వరదరాజుతో లావాదేవీలు, బినామీ పెట్టుబడులూ ఇంకా ఇంకా, అంతా. ఎంత పెద్ద ఆడిటర్లు రంగం లోకి దిగినా పొంతన కుదరని స్థితి. చివరకు భ్రష్టులని తెల్సినా వాళ్లకు తెలవకుండా వారి పేరు నుంచిన ఆస్తి మాత్రం మిగిలింది.
ఎంత ఎలా మిగిలినా జైలు మాత్రం తప్పదనేది తెలుస్తున్న నిజం. కస్టడీలోకి వెళ్లాడు.
ఈ స్థితికి ఇలా రావడానికి వరదరాజుతో జరిగిన లావాదేవీలే కారణమని అర్థమైంది. వరదరాజుపై అంత మాలిన కోపం వచ్చింది. తెలవని వానిలా అంతా తెలివి ప్రదర్శించి ఇలా అయ్యాడనే భావనే వచ్చింది. ఏది ఏమైనా ఇది నమ్మకద్రోహమనుకున్నాడు.
భరించరాని బాధ గుండెను నులిమింది. గుడ్ల నీరు గుండెను నింపుకున్నాడు.
చివరకు పేపర్లలోనే ఎక్కాల్సి వచ్చింది. పేపరు వాళ్లు కథ కథలుగా ఆయిదారు రోజులు వ్రాసుకున్నారు. అంతే బైయిలుపై బయటకొచ్చినా మొఖం చాట చేసుకోవాలిసిన స్థితి. నేరస్థుడిగా ముద్ర.
“వరదరాజు నువ్వూ” అని పెద్దగా అంటూనే స్పృహ తప్పాడు
***
అసెలెవడు వాడు?
వానితో చేసిన వ్యాపారమేంటి?
వరదరాజు బ్రతుకు తెల్సిన వాళ్లు చెప్పగా విన్నది, పరిచయం తరువాత మనస్సున మెదిలింది. సుందర్ టాకీస్ సినిమా హాలు దగ్గర పేరమ్మ అనే ఆవిడ చెనక్కాయలూ, సెనగలూ అమ్మకుంటుండేది. రెండో సినిమా ఇంటర్వెల్ అయ్యాక జంగిడి తీసుకుని గుడిసికొస్తుంటే మురిక్కాలువ ప్రక్కన దొరికాడట వాడు. వీడి తల్లితండ్రి ఎవరో ఇప్పటికీ తెలీదు. వీడి తండ్రి పేరు దగ్గర రాసి లేదు. ఆవిడ దగ్గర ఏడేళ్లు పెరిగాడు. ఆవిడ చచ్చాక ఉన్న డబ్బుతో కాటి దగ్గర కట్టెలు పెట్టి అమ్ముతుండేవాడు. అది బాగా లాభసాటి వ్యాపారంగానే కనిపించింది. కాటి కాపరులకు కాపు సారా, వేరు సెనగలు, ఉప్పు కారం కలిపి అమ్మేవాడు. సారా పుణ్యాన కాటికి మిగిలిపోయిన కట్టెలను కూడా ఇక్కడే వేస్తూ ఉండేవాడు. ఆనక ఉడికిన గుడ్లూ అమ్మాడు. గంగులు అనే కాటికాపరికి సంతానం లేదు. భార్య పోయింది. వానికి వరదరాజు పైన అభిమానం కూడా ఏర్పడింది. దాంతో పాటు కొడుకా అని పిలిచేవాడు. వరదరాజు పలుకుతుండేవాడు. ఈ వ్యాపారంలో మిగిలిన పైసలు వరదరాజు దగ్గరే దాచి అక్కడే పడుకునేవాడు. అట్టా వారి అనుబంధం బాగా బలపడింది.
ఒకనాడు జాన్ అనేవాడు “రోజు ‘అయిదు’ చిట్ కట్టు, నూరు రోజుల చిట్టి ఇది. నీకు ఇప్పుడు డబ్బు కావాలంటే నాలుగు వందల యైభై ఇస్తాను. మొత్తం అయిందాకా ఉండి తీనుకుంటే అయిదు వందలు పాతిక ఇస్తాను” అని చెప్పాడు. అప్పుడు గంగులు అక్కడే వున్నాడు. “నేను కడతాను రాసుకో” అన్నాడు. అది చూసి వరదరాజు కట్టాడు. ఇలా జాన్‍తో కూడా సంబందం పెరిగింది. రెండోసారి కూడా చిటీలు అయిపోయాక పైసలు తీసుకున్నాడు వరదరాజు. అప్పుడడిగాడు జాన్ “ఇద్దరం కలిసి చేసుకుందామా?” అని
వాణ్ణి విచిత్రంగా చూచి “నీతాన పదివేలున్నాయా? నా ద్దగర ఉన్నాయి. కలిపితే మొదలెడదాం” అన్నాడు. “రేపు చెప్తాను.” అన్నాడు జాన్. ఆ తర్వాత ఇలా గంగులుతో ఆలోచించి పైసలు కట్టి వ్యాపారంలోకి దిగాడు. ఆనక కట్టెలూ గట్రా గంగులు ఎక్కువగా చూసుకున్నాడు. ఇలా బ్రతుకున కాలు జాపి నడక ప్రారంభించాడు.
వరదరాజు మెట్టెక్కుతూ పోయాడు. మూడో మెట్టున జాన్‌ని తప్పించాడు. మొదటి మొట్టులోనే గంగులు చచ్చాడు. అయిదో మెట్టున అనసూయను అనే ఆవిడను వెనక్కనెట్టాడు. ఈ అనసూయ విధవరాలు. శారీరక అవసరాల గోల పడలేక గుట్టుగా వరదరాజుతో కాలం గడిపింది. అయితే దాన్ని వరదరాజు అనుకూలంగా మార్చుకున్నాడు. ఆవిడ ఒకందుకు దగ్గరికి వస్తే ఇతను ఒకందుకు సరే నన్నాడు. ఎవరి అక్కర వారిదే. కాని వరదరాజు అనసూయ నెత్తిన గుడ్డేసిందాకా, ఆ పిచ్చి తల్లికి అంతుపట్టలేదు.
ఇలా బుట్టలో పడినన్ని చేపల్ని, పెద్ద చేపల్ని మింగుతూ తిరిగి చిట్ ఫండ్స్ అంట్ ఫైనాన్స్ పెట్టిన దాకా ఎదిగాడు. ఆనక రావుగారితో పరిచయం వగైరా తెల్సిందేగదా!
అయితే వరదరాజు పెళ్ళీడు దాటుతుండగా రంగవల్లి పెళ్లాడాడు. ఆవిడకి లాయరు ముకుందంతో దగ్గర సంబంధం ఉందని లోకులు అనుకుంటుంటారు. వరదరాజు చెవిన ఇది పడ్డా, నమ్మనే లేదు. ఏది ఏమైనా వరదరాజు పిల్లల అదృష్టమో రంగవల్లి అదృష్టమో గాని వరదరాజు బురదపట్టుకున్నా బంగారంగానే మారిందనేది అమిత సత్యం. దీన్ని భద్రంగా కాపాడుకునేందుకు జనం పేచీలు రాకుండా వుండేందుకు ఓ రాజకీయ పార్టీ (భుజబలం కల్గిన) తో సరసంగా ఉన్నాడు. కింది చెమ్చాలకు చిల్లర విదిలించి వెంట ఉండేలా చేసుకుని నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు. అయితే వరదరాజు కూతురు సినిమాలల్లో నటించాలనే వ్యామోహంతో మద్రాసు వెళ్లింది. దాన్ని వెంటనే తీసకురమ్మనమని రంగవల్లి పోరినా వినలేదు. ఆ పిల్ల రంగవల్లి కూతురే అయినా ముకుందం బిడ్డగా అతనిలో బలమైన అనుమానముంది. ఎదిగాక పోలికలలో స్పష్టపడింది. అయినా పెదవి విప్పలేదు వరదరాజు. కానీ మద్రాసు వెళ్లలేదు. అయినా ఆ పిల్ల తారగా సినిమాలో కనిపించింది. సినిమా వాళ్ల హద్దులు అవగాహన చేసుకొని మెలిగి తార అయింది. నాల్గో సినిమాలో ‘తెరరాణి’ అన్నారు. అది సూపర్ డూపర్ హిట్ కొట్టింది. కుర్ర డైరక్టరు తెల్సినదంతా ఈ సినిమాలోనే చెప్పేసాడు. తల్లిని తోడు కోసం తీసుకెళ్లింది. వరదరాజును రమ్మనమని మాట వరసకు అనలేదు. ఆ రాత్రి చాలా బాధనిపించి త్రాగాడు. తాగుతూ కూడా ఏడ్చాడు. ఏడుస్తూ త్రాగుతూనే ఉన్నాడు. అసలు నేనెందుకు ఏడిస్తున్నాను? ఈ కన్నీరేమిటి? నేనసలు ఎవరికి కోసం బాధపడాలి? ఎందుకు బాధ? తను యాక్సిడెంటులో పోయి నాల్గు వేలు ఇచ్చిపోయిన మొదటి తల్లి, తనకు కల్లు కొని చస్తూ కూడా చీటీలో దాచిన డబ్బంతా అప్పగించి వెళ్లిన గంగులు అప్పుడు గుర్తులోకొచ్చారు. నిజంగా వారు మాత్రమే తన క్షేమం కోరుకున్నది. తనను కావాలనుకున్నది. మరి వారికి తనిచ్చిందేమింటి? ఏమీ ఇవ్వకున్నా ప్రేమ పంచారు. ‘నేను నా కూతురుని ప్రేమిస్తున్నాను. నా బంగారు కొండ అనుకున్నాను. కాని కాని..’ ఆ రోజల్లా ఏడుస్తూనే ఉన్నాడు. ఏడుస్తూనే నిద్రపోయడట. ఏడ్పులోనే లేచాడు. నిద్రలో ములుగులు. మళ్లీ కునుకులో కూడా అశాంతే. ఆగని అశాంతి. భరించలేని అశాంతి.
వెలుగు రేఖలు కనిపించని అశాంతి.
అవును ఇందర్ని ఇబ్బంది పెట్టి వాడు సుఖపడిందేమిటి? అనిపించినప్పుడు మాత్రం కొంచెం సంతోషమనిపించింది.
‘ఛ వెధవ జీవితాలు. వెధవ మృత్యువు. బ్రతుకు తెరలు’ అనిపించి అట్టాగే కూర్చుండిపోయాడు.
***
జయంతి బయలుదేరబోతుంటే రవి వచ్చాడు “నమస్తే అంకుల్” అంటూ…
“రవీ రా, నాన్న ఉన్నాడా, అమ్మేం చేస్తున్నది?” అడిగాడు.
“శారద ఆంటీ కూడా అమ్మతో కూర్చుని మాటాడతుంది” అన్నాడు.
“నేనడిగానా?”
“నాకు చెప్పాలనిపించింది. అదీగాక శారద ఆంటీ పెళ్లి నిర్ణయం గురించి మాటాడుతున్నట్లుంది. ఆవిడేమో ఏదో తేదీ దాకా ఆగక తప్పదంటుంది” అన్నాడు.
“ఎందుకు?”
“నాకు తెలీదు. ఆవిడ చెపితే గదా తెలిసేది” అని “ఆఁ మరచాను శ్రీరామచంద్రుని లాంటి భర్తను ఇక్కడ వాళ్లు ఇష్టపడతారు. ఒక మాట ఒక బాణం ఒక భార్య అనేదో చెపుతుంటారు గదా. మరి మనలో అలాంటి పోలికలు ఉన్నాయో లేవో పెళ్లాడదల్చుకున్న వాళ్లు చూసుకోడం మంచిది కదా. త్రేతాయుగం నాటి మనిషిలా ఇప్పుడెందుకుంటారట. ఇదెక్కడి కోరికరా బాబూ?” అన్నాడు రవి.
“నన్ను పెళ్లి చేసుకుంటానని ఇలాంటివి మనస్సున ఉంచుకోనడం అంత బాగోలేదు. శివధనస్సు విరవడం రాముడికి కష్టం కాలేదేమో గానీ ఇలాంటివి తలచుకొని వెతికితే మాత్రం చాలా కష్టమవుతది గదా.”
“అయితే సీత మనకు దక్కదంటావా?” అన్నాడు అదోలా చూస్తూ.
“నేను వెళ్లి తేల్చేస్తాను. ఆలస్యం అమృతం విషం అన్నారు గదా” అని లేచాడు జయంతి.
“ఆవేశం ఎప్పుడూ అనర్థాన్ని తెస్తుందనీ అంటారు.”
“మరి ఏం చేస్తే బాగు?”
మౌనం పాటించాడు రవి.
“రవి నేను రాముడ్ని కాకున్నా అలా లేనంటావా?”
“నేను అసలు రాముణ్ణి చూడలేదుగదా.”
“అంటే నేను నేను ఆయన్ను చూపితేగానీ..”
“అంకుల్ నేను శ్రీరాముని గురించి ప్రశ్న వేసాను గుర్తుందా?”
“ఆఁ గుర్తుంది.”
“సమాధానమూ ఆలోచించే ఉంటారు.”
‘ఇల్లు కాలి ఒకడేస్తుంటే ఏదో అయి ఒకడేడ్చాడట’ అనుకొని “తరువాత నీ విషయం లోకి వద్దాం ఇప్పటికి.”
“మంచిది”
“రవీ శారద సంగతి?”
“నాన్న అమ్మా ఆలోచిస్తున్నారు. తేదీ నిర్ణయం కాగానే చెప్తాను.”
(ఇంకా ఉంది)