నేపథ్య రాగం – నాటకం – పరిచయం

0
2

[box type=’note’ fontsize=’16’] యుగ-యుగాల నుండి ఈ సంఘమనే రంగస్థలంపైకి వచ్చి కనబడాలని, వినబడాలని నిరంతరం సంఘర్షణ చేస్తున్న ఒక సన్నని రాగం కథే ఈ ‘నేపథ్య రాగం’.. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]

నేపథ్య రాగం – కథను గురించి….

[dropcap]యు[/dropcap]గ-యుగాల నుండి ఈ సంఘమనే రంగస్థలంపైకి వచ్చి కనబడాలని, వినబడాలని నిరంతరం సంఘర్షణ చేస్తున్న ఒక సన్నని రాగం కథే ఈ ‘నేపథ్య రాగం’. ఇతిహాస పురాణ ఆఖ్యానాల ద్వారంపైన దేదీప్యమానంగా ప్రజ్వరిల్లే ఒక దీపశిఖను మాధ్యమంగా తీసుకుని ఈ సంఘర్షణకు ఒక నాటక రూపం ఇవ్వటం జరిగింది. ఆ దీపశిఖ పేరు – ‘ఖనా’.

ఈ నాటకారంభం ప్రస్తుత కాలమాన పరిస్థితులలో మన ముందుకు వస్తుంది. ‘మేధ’ అనే యువతి, కార్యాలయంలో తన తోటి ఉద్యోగస్తులయిన మగవారినుండి కావల్సిన సహాయ-సహకారాలు లభించక బాధపడుతూ ఉంటుంది. యువతి ఈ పరిస్థితులను సమీక్షించుకుందామనుకుంటున్న సమయంలో, పెద్ద అధికారిగా ఉద్యోగస్తురాలైన ఆమె తల్లి ‘ఖనా’ అనే స్త్రీ కథను వినిపిస్తుంది. మేధ వ్యథకు ఈ ఖనా కథ మరింత వైశాల్యాన్నిస్తుంది.

మేధ, ఆమె తల్లి మధ్యన జరిగిన సంభాషణల సూత్రంతో ‘ఖనా’ అనే ప్రతిభావంతురాలైన, ఉత్సాహం ఉరకలు వేసే స్త్రీ పడిన వేదనను, ఆమె ఎదుర్కొన్న వ్యథను చిత్రించటం జరిగింది.

నాలుగు – ఐదు శతాబ్దాలనాటి చంద్రగుప్త విక్రమాదిత్యుడి (మాళవగణ నాయకుడు) పరిపాలనా కాలం నాటి ఉజ్జయిని నగరం ఈ కథకు కేంద్రం. ఆ సమయంలో ఖనా అనే గ్రామీణ యువతి, జ్ఞానాన్ని మరింత సముపార్జించుకునే తృష్ణతో, కళా-సాహిత్యాల నిలయమైన ఉజ్జయినీ నగరం చేరుకుటుంది. తన విలక్షణమైన మేథస్సుతో బాటు అంతులేని జిజ్ఞాస వలన ఆనాటి ప్రఖ్యాత జ్యోతిష్యాచార్యుడైన వరాహమిహిరుడి శిష్యురాలవగలుగుతుంది. కొద్ది సమయం గడిచే సరికే ఆమె వరాహమిహిరుడి ఇంటి కోడలవుతుంది. వరాహమిహిరుడి కుమారుడైన పృథు యశస్సు, ఖనా జ్ఞానంతో బాటు ఆమె అపారమైన సౌందర్యం పట్ల ఆకర్షింపబడటమే దానికి కారణం. గురువు గారైన ఆచార్య వరాహమిహిరుడు, ఇప్పుడామెకు మామగారు!

వరాహమిహిరుడు విక్రమాదిత్యుని నవరత్నాలలో ఒకరు. ఆయనకు రాజాస్థానంతో గల సాన్నిహిత్యం వలన ఖనాదేవి యొక్క పెరుగుతున్న జ్ఞాన-కీర్తి ప్రతిష్ఠలు అక్కడకు చేరుకుంటాయి. విక్రమాదిత్యుడు జ్ఞానమనే దీప్తితో ప్రకాశించే ఈ వ్యక్తిత్వం వైపు త్వరగానే ఆకర్షింపబడతాడు. ఆయన ఖనాదేవిని తన ఆస్థానంలో ఒక సదస్యురాలిగా అలంకరించాలని తలపోస్తాడు. ఇక్కడే పురుష ప్రధాన సమాజానికి ప్రతినిధుల్లాంటి ‘నవరత్నాలు’, తమ కుటిల చాతుర్యంతో దానిని ధ్వంసం చేస్తారు. అన్నిటికన్న దౌర్భాగ్యమేమిటంటే ‘ఖనా’ గురువు – మామగారుయైన వరాహమిహిరుడే తటస్థంగా ఉండిపోయి ఈ కుటిల పన్నాగానికి ఒక విధంగా కారణమవుతాడు. విక్రమాదిత్యుని ఆస్థానంలోని నవరత్నాలు ఆమెను కేవలం ఒక మూగ బొమ్మలా కూర్చునే సభాసదురాలిగా మాత్రమే ప్రవేశించటానికి తమ అనుమతినిస్తారు. ఒక విధంగా ఈ ప్రవేశం ఖనా యొక్క విద్వత్తును, ఆమె విదుషీ రూపాన్ని నిషేధించటమే!

నాటకం చివరన ఖనా ఏమయిందో తెలుసుకోవాలన్న కుతూహలం మేధకు కలగటం సహజం. వాస్తవంగా ఏం జరిగి ఉంటుందో అన్నది ఎవరికీ తెలియదని చెప్తూ, ఆమె తల్లి, “ఆమె నాలుకను కోసివేశారన్నమాట ప్రచారంలో ఉందని చెప్తుంది. మరికొంత మంది తన అత్తవారింటికీ, మరీ ముఖ్యంగా మామగారికి తలవంపులు కాకుండా, అవమానాల నుండి తప్పించటానికి ఆమె స్వయంగా తన నాలుకను కోసుకున్నదంటారని” చెప్తున్న తరుణంలో మేధ నాయనమ్మ మరో పార్శ్వాన్ని జోడిస్తుంది. ఆమె తన నాయనమ్మ (అంటే మేధ నాయనమ్మకు నాయనమ్మ) ఖనా నాలుకను స్వయంగా వరాహమిహిరుడే కోసివేశాడని చెప్తూండేదని తెలియచేస్తుంది.

నాయనమ్మ చెప్పిన ఈ కథనంతో ఈ నాటకం ముగియటమన్నది (సింబాలిక్) ఒక లాక్షణికతను ప్రతిబింబిస్తుంది, ఎందుకంటే తన ఆలోచనలను వెలిబుచ్చని స్త్రీనే సంఘం స్వీకరించి, గౌరవిస్తుంది. ఈ ఆలోచనా విధానమే తరతరాలనుండి సమాజంలో ఆమోదింపబడి, లోకుల మనస్సులలో పాతుకుపోయింది; పరిపాటిగా మారిపోయింది. అలాంటి సంఘం – లోకం తీరు అనే భూమిలో అక్కడక్కడా, అప్పుడు-అప్పుడూ, ఉండీ – ఉండి, వేదన-బాధ అనే చిన్ని – చిన్ని బీజాలు అంకురిస్తూ ఉంటాయి. శతాబ్దాల పూర్వం ఖనా కేవలం నేపథ్యరాగంగా ఉండి పోయిందనీ, నిజం చెప్పాలంటే ఈనాడూ ఆమె నేపథ్యంలోనే ఉండిపోయిందన్న కఠోర సత్యాన్ని ఈ మొలకలు తెలియచేస్తూనే ఉంటాయి.

***

దేశకాల వాతావరణం : 4-5 శతాబ్దాల నాటి మాళవగణనాయకుడైన చంద్రగుప్త విక్రమాదిత్యుని ఉజ్జయిని. ఆచార్య వరాహమిహిరుడి కాపత్థిక గ్రామ నేపథ్యంలో కూర్చిన దృశ్యాలతోబాటు వర్తమానంలో ఏదో ఒక నగర వాతావరణాన్ని ప్రతిబింబించే దృశ్యాల సమాహారం.

***

నేపథ్య రాగం పాత్రల పరిచయం

  1. ఖనా: సుమారు 20 సంవత్సరాల యువతి. వ్యక్తిత్వంలో ఆత్మ విశ్వాసం, ముఖంపైన తేజస్సుతో కూడిన కాంతి ప్రస్ఫుటిస్తూ ఉంటాయి. అందంతో బాటు వినయ విధేయతలున్న తరుణి.
  2. వరాహమిహిరుడు: సుమారు 60 సంవత్సరాలు. ప్రఖ్యాతి పొందిన జ్యోతిష్యాచార్యుడు; విద్వాంసుడు, చంద్రగుప్త విక్రమాదిత్యుని నవరత్నాలలోనివాడు. గణరాజ్యంలోని భౌతికశాస్త్రంతో బాటు ప్రజా సంక్షేమ విభాగానికి అధిపతి. పృథు యశస్సు తండ్రి, ఖనాకి గురువు, ఆపైన మామగారు.
  3. చంద్రగుప్త విక్రమాదిత్యుడు: సుమారు 50 సంవత్సరాల వయసు. మాళవరాజ్యాధిపతి. గొప్ప వ్యక్తిత్వంతో బాటు స్పందించే గుణం కల వ్యక్తి.
  4. సుబంధు భట్టు: వయసు సుమారు 40 సంవత్సరాలు. సామ్యత మూర్తీభవించే సాధారణంగా కనిపించే వ్యక్తి. అధ్యయనంలో ఆసక్తి, ఖనాకి బంధువు, వరసకి బాబాయి.
  5. మేధ: సుమారు 26 సంవత్సరాల ఆధునిక పాత్ర. కార్యాలయంలో తన శాఖకు ఇన్‌చార్జి; శక్తి నిండుగా ఉన్న మేధావి, కర్తవ్యనిష్ఠ గలది.
  6. అమ్మ: సుమారు 58 సంవత్సరాల ఆధునిక పాత్ర. మేధ తల్లి. గవర్నమెంటు ఆఫీసులో పెద్ద హోదాలో ఉన్న మహిళ.
  7. మహాదేవి: సుమారు 35 సంవత్సరాల అందమైన మహిళ. మాళవరాజు విక్రమాదిత్యుని రాజమహిషి, బుద్ధిమంతురాలు; వ్యవహార జ్ఞానం ఉన్న మహిళ.
  8. నాయనమ్మ: వయస్సు దాదాపు 75 సంవత్సరాలు. ఆధునిక పాత్ర. మేధ నాయనమ్మ.
  9. పృథు యశస్సు:- సుమారు 26 సంవత్సరాల వయసు గల వ్యక్తి. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న జ్యోతిష్యాచార్యుడు. అందగాడు; ప్రభావవంతమైన వ్యక్తిత్వం. వరాహమిహిరాచార్యుల వారి పుత్రుడు; ఖనా భర్త.
  10. ధన్వంతరి: సుమారు 80 ఏళ్ల వృద్ధులు. ఆయుర్వేదంలో ఘనాపాఠి. మంచి పొడగరి. తెల్లటి జుట్టు, తెల్లటి గడ్డం. విక్రమాదిత్యు నవరత్నాలలో ఒకరు. మాళవ రాజ్యంలోని ఆరోగ్య శాఖాధిపతి.
  11. వరరుచి: సుమారు 55 సంవత్సరాలు. సుప్రసిద్ధ ప్రాకృత భాషశాస్త్ర వైయాకరిణుకుడు. విక్రమాదిత్యుని నవరత్నాలలోని వారు. మాళవ రాజ్యంలోని విద్యాశాఖాధిపతి.
  12. క్షపణకుడు: సుమారు 60 ఏళ్లు. మాళవ గణరాజ్యంలోని ప్రసిద్ధ న్యాయశాస్త్రవేత్త: న్యాయశాఖాధిపతి. విక్రమాదిత్యుని నవరత్నాలలో ఒకరు.
  13. ఘటఖర్పరుడు: సుమారు 60 సంవత్సరాల వ్యక్తి. నవరత్నాలలో ఒకరు. పరిశోధనా శాఖాధిపతి.
  14. పేదపురుషుడు: (విక్రమాదిత్యుని మారువేషం) సుమారు 50 సంవత్సరాలు. పాతవి, చిరిగిన బట్టలు. భుజంపైన కంబళి. పొడవైన మాసిన గడ్డం. బాధలు – దుఃఖాలతో వంగిన నడుము.
  15. ద్వారపాలకుడు
  16. ప్రతీహారి.

***

హిందీలో డా. మీరాకాంత్ రాసిన ఈ నాటకానికి తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here