నేపథ్య రాగం – నాటకం – దృశ్యం1

1
3

[box type=’note’ fontsize=’16’] యుగ-యుగాల నుండి ఈ సంఘమనే రంగస్థలంపైకి వచ్చి కనబడాలని, వినబడాలని నిరంతరం సంఘర్షణ చేస్తున్న ఒక సన్నని రాగం కథే ఈ ‘నేపథ్య రాగం’.. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]

దృశ్యం-1

(ఆధునిక గృహంలో ఒక గది. ఒక ఉన్నతాధికారి హోదాను స్పష్టంగా, దర్పంగా ప్రతిబింబించే ఈ గదిలో వీస్తున్న గాలిలో ఒక విధమైన ఒక విధమైన వత్తిడిని గమనించవచ్చు. తల్లి, మేధల మధ్య ఏదో విషయం గురించి చర్చ గంభీరంగా నడుస్తూండగా హఠాత్తుగా తెరలేస్తుంది. తల్లి ఒక కుర్చీలో కూర్చుంది; మేధ నిల్చుని ఉంది. తల్లి ప్రౌఢ వయస్సు ఛాయలు ఆమె వెండి తీగల్లాంటి కేశాలలో కానవస్తున్నాయి. తల్లి చేనేత (హేండ్లూమ్) చీర కట్టుకుంది. చురుకుగా కనిపిస్తున్న మేధ తల్లికి ప్రతిరూపంలా అనిపిస్తుంది. పేంటు-టీషర్టు వేసుకుంది. టీపాయ్ మీద రెండు టీకప్పులున్నాయి.)

మేధ : అమ్మా! నువ్వు నా ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకోవటం లేదు…. (స్వగతం)… లేదా అర్థం చేసుకోలేవేమో… (పైకి) నువ్వు దీనిని నీ జమానాతో ఈక్వేట్ చేస్తున్నావు…. థింగ్స్ ఆర్ వెరీ డిఫరెంట్ నౌ…

తల్లి : (నియంత్రించుకుంటున్న ధోరణిలో) నాకు తెలుసు… ఐ నో మేధా… కాని…

మేధ : (ఉద్విగ్నత కూడిన గొంతుకతో) కాదమ్మా… నో…….

తల్లి : ఇలా ఉద్రేకపడితే… నా ఉద్దేశం… నువ్వూ అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు…. ఆఫీసుల్లో ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి.

మేధ : అమ్మా! నువ్వు నా సమస్యని జనరలైజ్ చేస్తున్నావు…. మా ఆఫీసు…

తల్లి : ఏం? ఎందుకు? నీ ఆఫీసు అంటే ఏమైనా ప్రత్యేకమైనదా? దీనిని నువ్వు ఈనాటి పరిస్థితులలో కొత్త సమస్య అనుకుంటున్నావా? సరే, చెప్పు నువ్వు చెప్పినట్లే… ఏంటా పోస్ట్ మోడరన్ ప్రాబ్లమ్?

(అదే సమయంలో నాయనమ్మ ప్రవేశం, ఆవిడ చేతిలో మడిచిన చీర. దానిని టీపాయ్ మీద పెట్టి టీ కప్పుల్ని చూసి ఆగి)

నాయనమ్మ : అరే! (టీ కప్పుల్లోకి వంగి చూసి) పోసిన టీ, కప్పుల్లో అలానే పడి ఉంది…. చప్పగా చల్లారిపోయి ఉంటుంది.

(తల్లి, మేధ ఇద్దరూ నాయనమ్మ వంక చూస్తూ ఉండగా, నాయనమ్మ తల్లి వైపుకి అడుగులు వేస్తూ) ఇస్త్రీకి ఈ చీర కూడా పంపించెయ్యమ్మా… ఈ వేసంగిలో ఈ చీర కట్టుకుందామనుకుంటున్నాను.

(తల్లి లేచి చేతుల్లోకి చీరనైతే తీసుకుందిగాని, ఆలోచన మాత్రం పూర్తిగా మధ్యలోనే ఆగిపోయిన విషయం గురించి, తన కూతురు మేధ చుట్టూనే తిరుగుతోంది)

తల్లి : అలాగే అత్తయ్యా….. పంపిస్తాను.

నాయనమ్మ : (ప్రేక్షకులని సంబోధిస్తూ, స్వగతం లాగ) అసుర సంధ్య వేళ దీపాలు వెలిగించే సమయంలో ఏంటో ఇద్దరికిద్దరూ పాత విషయాలను పట్టుకుని వాదులాట!

(అంటూ-అంటూ రంగస్థలంపై నుండి నిష్క్రమిస్తుంది.)

మేధ : (ఆర్ద్రత నిండిన గొంతుకతో) అమ్మా…. ఏంటో మనసులో ఒక రకమైన నిస్పృహగా అనిపిస్తుంది… ఏం చెయ్యాలో తోచడం లేదమ్మా….

తల్లి : (దగ్గర కొచ్చి భుజంపైన చేతులు వేసి ఉదాసీనంగా మృదువైన కంఠంతో) నాకర్థమవుతుంది మేధా… అర్థం చేసుకోగలను కాని… (కాస్త పక్కకి జరిగి, నిరాశా భావంలో నుండి బైటపడేందుకు ప్రయత్నిస్తూ), పద! వాకింగుకు వెళ్తామా?

మేధ : (ఉలిక్కిపడి) వాకింగుకా?

తల్లి : ఔను… వాకింగుకే! పద…. నీకు నేనొక కథ వినిపించాలనుకుంటున్నాను.

మేధ : (విసుగ్గా) అబ్బా! అమ్మా… ప్లీజ్… నేను నా ప్రాబ్లమ్స్ తో…

తల్లి : (స్థిరమైన గొంతుకతో) తెలుసు…. అందుకే కదా… ఏంటి అందుకే? అందుకే నీకొక కథని వినిపిస్తానంటున్నాను. (రంగస్థలం మీద ముందుకు వస్తూ)…. యుగయుగాలుగా వస్తున్న కథ…… నడుస్తున్న కథ….. వాకింగు చేసుకుంటూ! (కొస్త ఆగి, ఆలోచిస్తున్నట్లుగా) కాదు, ‘ఆగిపోయిన పరిస్థితుల కథ….!

మేధ : ఏం కథ? ఎవరి కథ?

తల్లి : స్త్రీ కథ…. చదువుకున్న ప్రతిభావంతురాలైన ఒక స్త్రీ కథ…. ‘ఖనా’ కథ!

మేధ : (తల్లి దగ్గరికి వచ్చి) ఖనా? ఎవరు ఈ ఖనా?

తల్లి : మొట్ట మొదటి జ్యోతిష్కురాలు…. ఈ రోజుకీ జ్యోతిష్యం గురించి చెప్పిన ఆవిడ మాటలు చలామణిలో ఉన్నాయి.

మేధ : నువ్వు హిస్టరీ గురించి మాట్లాడుతున్నావా? లేక మైథాలజీ గురించా?

తల్లి : (టీపాయ్ మీద ఉన్న కప్పులోంచి ఒక గుక్కతాగి, కప్పు పెట్టి) అదే ఈ దేశంలో ఉన్న ఇబ్బంది…. కాలం నడిచిపోతోంది. నిరంతరం వలయంలాగ… ఎక్కడ ఎప్పుడు మైథాలజీ పూర్తయి, హిస్టరీ మొదలవుతుందో… అంతా కలిసిపోయి పాలలో నీళ్లలా… ఒకసారి ఇవి పాలు కాదు, నీళ్లు అనిపిస్తుంది…. ఊహూ! మరోసారి? నీళ్లు కాదు పాలే అనిపిస్తుంది. ఎందుకు? మర్చిపోయేవా? ఒక ఇంగ్లీషు ఆఫీసరు తన యజమానికి ఇక్కడి పరిస్థితులను గురించి వివరిస్తూ రాసిన ఉత్తరం… (గుర్తు తెచ్చుకుంటున్నట్లు)

మేధ : ఔను… బహుశా ‘దే హేవ్ నో సెన్స్ ఆఫ్ హిస్టరీ’… అంటే చరిత్ర గురించి అవగాహన లేదు అన్న మాటేకదా?

తల్లి : (ఉద్వేగం నిండిన స్వరంతో) ఔనమ్మా… ఆయన గారి మాటల్లో చెప్పాలంటే…. ‘దీజ్ ఇండియన్స్ ఆర్ సచ్ ఈడియట్స్ దట్ దే యూజ్ సేమ్ వర్డ్ ఫర్ యస్టర్డ్ ఎండ్ టుమారో’!

మేధ : ఏంటీ…..?

తల్లి : మనం యస్టర్ డే ఎండ్ టుమారో, రెండింటికీ ఒకే పదాన్ని ఉపయోగిస్తాము కదా…. ‘కల్….. అంటే ఒకటి గడచిపోయిన ‘కల్’, మరొకటి రాబోయే ‘కల్’! (హిందీలో)

మేధ :  నిజమేగాని… ఎందుకిలా?

తల్లి : ఎందుకా? ఎందుకంటే మనకి అనుభవాలన్నవి కాలం కన్న అతీతమైనవి… కాలాతీత అనుభవాలను మనం విశ్వసిస్తాం! అందుకే మన దగ్గర మిథ్‌కీ – చరిత్రకీ మధ్య నున్న గీత అప్పుడప్పుడు అంత స్పష్టంగా ఉండదు…. పద నడుస్తూ చెప్తాను.

మేధ : (ఒక్కసారి తనని తను చూసుకుని) డ్రెస్ మార్చుకునేదా?

తల్లి : (ఫర్వాలేదన్న ధోరణిలో)  అక్కరలేదు. బాగానే ఉంది.

(ఇద్దరూ నడుస్తూ)

‘ఖనా’ అని చెప్పాను కదా! మైథాలజీ ప్రకారం సింహళద్వీపపు మయుడు అనే దానవుడి కుమార్తె! కాని మనకి దీనితో సంబంధం లేదు! నేను చెప్పబోయే కథ చంద్రగుప్త విక్రమాదిత్యుని యుగానికి సంబంధించిన కథ…. బహుశా నాలుగు ఐదు శతాబ్దాల నాటి ఉజ్జయిని…. దాదాపు పదిహేను వందల సంవత్సరాల పూర్వం… ఏమో ఖనా ఏ ప్రదేశానికి చెందినదో తెలియదు…. పోనీ ఉజ్జయినీకి చుట్టు పక్కలనున్న ఏదో ఒక చిన్న ఊరిలో ఉండేదనుకో! జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్న ఆమె తహ తహ నగరానికి లాక్కొచ్చిందేమో! ఆ కాలంలో ఆమె ఏ హాస్టలులోనో ఉండేదనుకోలేము కదా! బహుశా తన బంధువులెవరింటిలోనో ఉండేది అనుకోవచ్చు. ఆ బంధువు ఆమెకి వరసకి మామయ్యో, బాబయ్యో అవుతాడేమో! కాని విద్వాంసుడు అవి తెలుస్తోంది! సరే బాబాయే అనుకుందాం… మేధ : (విసిగినట్లు) అబ్బా! ఇకనైనా అసలు విషయానికి రా అమ్మా!

తల్లి : (చిరునవ్వుతో) అబ్బో! అటు-ఇటు పోకుండానే? ఇంత త్వరగా ఫాస్ట్ ఫుడ్ లాగా?

మేధ : (చిరాకుతో) అమ్మా! ప్లీజ్!

తల్లి : (గతకాలపు కథలో మునిగిపోయినట్లు) సరే, ఖనా, తన బంధువైన సుబంధుభట్టు బాబాయ్ గారింట ఉండడానికి వచ్చింది. ఆమె అతన్ని ఆప్యాయంగా ‘బంధు బాబాయ్’ అని పిల్చుకునేది.

మేధ : (తల్లి ఆనాటి కథలో మునిగిపోతూండడం చూసిన మేధ, స్వయంగా తను కూడా కథాకాలం నాటి వాతావరణం లోకి పయనిస్తూ) బంధు బాబాయ్!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here