[box type=’note’ fontsize=’16’] యుగ-యుగాల నుండి ఈ సంఘమనే రంగస్థలంపైకి వచ్చి కనబడాలని, వినబడాలని నిరంతరం సంఘర్షణ చేస్తున్న ఒక సన్నని రాగం కథే ఈ ‘నేపథ్య రాగం’.. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]
దృశ్యం-10
[dropcap](సు[/dropcap]బంధు భట్టు నివాసం. ఒకవైపు కట్టితో చేసిన చిన్న బల్ల దాని కెదురుగా దర్భాసనాలు ఉన్నాయి. ఒక ఆసనంపైన కొన్ని తాళపత్రాలు కట్టలుగా ఉన్నాయి. గోడకున్న గూట్లో కూడా తాళ పత్రాలు వరుసలుగా పేర్చబడి ఉన్నాయి. బల్లపైన కొన్ని బట్టలు పరుచుకుని కానవస్తున్నాయి. సుబంధు భట్టు తన గదిని సర్దుకోవడంలో మునిగిపోయిన సమయంలో ఖనా ప్రవేశిస్తుంది.)
ఖనా : (ఒక క్షణకాలంపాటు పనిలో మునిగిపోయిన ఆయనను ఆగి చూస్తుంది. ఆపైన ముందుకు వెళ్లి) చాలా సర్దుకున్నారు. కూర్చోండి!
సుబంధు భట్టు : (పని ఆపి) అరే, నువ్వా? ఎప్పుడొచ్చేవు?
ఖనా : (సుబంధు భట్టు చేతిలోనుండి దుప్పటి తీసుకుని) తెండి! నేను మడుస్తాను.
(అంటూ మడుస్తూ ఉంటుంది.)
సుబంధు భట్టు : (ఉత్సాహంగా) నువ్వెప్పుడు వచ్చేవమ్మా?
ఖనా : ఇప్పుడేగా వచ్చింది!
సుబంధు భట్టు :- (కూర్చుంటూ) అంటే నా ఉద్దేశం రాజభవనం నుండి ఎప్పుడు తిరిగి వచ్చావు అని?
ఖనా : (ఉత్సాహంగా) అది చెప్పడానికే నేనొచ్చింది! నిన్ననే తిరిగి వచ్చేను.
సుబంధు భట్టు : రాజభవనంలో ఆతిథ్యం ఎలా ఉంది?
ఖనా : (ఉత్సాహంగానే) బంధు బాబాయ్! మాళవ గణరాజ్యాధిపతిగారి దర్శన భాగ్యం దక్కింది…. మీకు తెలుసా? మహారాణిగారు తన ఆభ్యంతర మందిరంలోకి తీసుకువెళ్లారు. ఆవిడతో మనసు విప్పి చాలా యధాలాపంగా సంభాషించడమూ జరిగింది.
సుబంధు భట్టు : (చిరునవ్వుతో) చాలా ప్రసన్నంగా ఉన్నావు!
ఖనా :- ఔను… (నిట్టూర్చి కూర్చుంటూ) జీవితంలో మొదటిసారి రాజప్రాసాదంలోకి అడుగుపెట్టే యోగమూ దక్కింది.
సుబంధు భట్టు : మొదటిసారే గాని, ఆఖరుసారి కాదుగా!
ఖనా : మహారాజుల వారికి దేశం అంతటిని గురించి చింత ఎల్లప్పుడూ ఉంటుంది! నన్ను ప్రతిదినమూ ఇలా రాజభవనానికి పిలుస్తారా చెప్పండి?
సుబంధు భట్టు : బహుశా వచ్చేసారి, రాజసభ నుండే ఆహ్వానం రావచ్చేమో!
ఖనా :- (నవ్వేసి) రాజసభ… అక్కడ నాకేం పని?
సుబంధు భట్టు : ఎందుకు కాకూడదు? నీ భవిష్యవాణితో స్వయంగా సామ్రాట్టుల వారే ప్రభావితులయేరుగా!
ఖనా : (కాస్తంత విచారంగా) ఏం భవిష్యవాణా! ఏం జ్యోతిష్యమో!
(సుబంధు భట్టు ఆమెవంక తేరపారి చూస్తాడు.)
బాబాయ్! నేననుకున్నదేమిటి, కాని… ..
సుబంధు భట్టు : (కుతూహలంగా) నువ్వేం అనుకున్నావు?
ఖనా : జ్యోతిష్య విద్యా పారంగతుల పరివారంలోకి అడుగుపెడుతున్నాను కదా.. నిరంతరం నవగ్రహాల సాన్నిధ్యంలో ఉంటానని భావించేను… నక్షత్రాలతో సంభాషిస్తాననుకున్నాను. భూమ్యాకాశాల అంతరాళాన్ని కొలవగలననుకున్నాను. కాని…
సుబంధు భట్టు :- (లేచి దగ్గరకొచ్చి) ఏమయింది తల్లీ? సుఖంగానే ఉన్నావు కదా?
ఖనా :- (లేచి నిల్చుని) పృథుయశస్సు భార్యగా ఆచార్య వరాహమిహిరులవారి కోడలుగా ఉన్నాను. కాని ఖనా…
సుబంధు భట్టు : (ఆందోళనగా) ఖనా! ఏమయింది ఖనాకు?
ఖనా : (నిర్లిప్తంగా) తెలియదు బాబాయ్….. అప్పుడప్పుడు ఖనా ఎక్కడికో కొట్టుకుపోతోంది అనిపిస్తూ ఉంటుంది….
సుబంధు భట్టు : పృథు యశస్సు దగ్గర లేనందువలనా?
ఖనా : (సిగ్గుపడుతూ) అబ్బే! అదేం కాదు!
సుబంధు భట్టు : మరి?
ఖనా : (గంభీరంగా ఆలోచిస్తున్న భంగిమలో ) అదే వ్యక్తి… కాని కోణం మారిపోయింది…. ఉదయిస్తున్న సూర్యుడే మునిగిపోతున్నట్లు!
సుబంధు భట్టు : అంటే?
ఖనా : ప్రస్తుతం గురుదేవులు ఇంట్లోనే…. ఉంటున్నారు. కాని నేను ముందులాగ…. కాదు-కాదు, నా ఉద్దేశం అది కాదు… ఆయన నన్నెప్పుడూ నిరుత్సాహపరచలేదు… ఏమయిందో నాకే తెలియదుగాని… నేనే ఆయనతో జ్ఞానానికి సంబంధించిన చర్చలు హెచ్చుగా చెయ్యలేకపోతున్నాను.
(ఒక్కసారి వెనక్కి తిరిగి) ఖనా తప్పిపోతుందా?
సుబంధు భట్టు : (మనసులోంచి వచ్చిన భావాలను ప్రతిబింబించే స్వరంతో) లేదు… ఖనా తప్పిపోవడానికి కాదు… (ఖనా వంక చూసి) మరి నీ స్వాధ్యాయనం?
ఖనా : నిజానికి హెచ్చు భాగం స్వాధ్యాయం మీదే ఆధారపడి ఉన్నాను.
సుబంధు భట్టు : (గంభీరంగా) హు…. ప్రతి ఏర్పాటు లోనూ ఒక కట్టుబాటు ఉంటూనే ఉంటుంది. (ఒక్కసారి చైతన్యం వచ్చినట్లు అయి) సరేలే! ఇక ఆ రెండో ఏర్పాటు విషయంలో ఏరకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి?
ఖనా : (ఆశ్చర్యంగా) రెండో ఏర్పాటా? రెండో ఏర్పాటు ఏమిటి?
సుబంధు భట్టు : ఏం? ఆచార్యులవారు నీతో ఏమీ చర్చించలేదా?
ఖనా : లేదే…. దేని గురించి చర్చించడం?
సుబంధు భట్టు : నువ్వు వెళ్లేవు చూడు, ఆ సమయంలో ఆచార్యులవారు నన్ను పిలిపించేరు!
ఖనా : (అప్రమత్తమయి) ఏదైనా ప్రత్యేకమైన విషయమా?
సుబంధు భట్టు : ఔను ప్రత్యేకమే… నాకు మరింత ప్రత్యేకమైన విషయం , అది నీతో ముడిపడింది గనక!
ఖనా :- (నిస్సత్తువగా) నాకు సంబంధించినదా? నేనేం చేసేను?
సుబంధు భట్టు : నీ మేధస్సు, సామ్రాట్టును ఆశ్చర్య పరచింది. నిన్ను తమ రాజభవనానికి పిలిపించుకున్న నాడే ఆచార్యుల వారి ముందు తమ ఆలోచనను ఉంచేరు. ఆయనను సంప్రదించేరు.
ఖనా : (కలవరపడుతూ) ఏ విషయంలో?
సుబంధు భట్టు : సామ్రాట్టు నిన్ను తమ రాజసభలో ఒక సదస్యురాలిగా చేర్చుకోవాలని అభిలషిస్తున్నారు.
ఖనా : (ఆశ్చర్యపోతూ) నన్నా? సభలో సదస్యురాలిగానా?
సుబంధు భట్టు : ఔను….. నీ బాబాయిగా వరాహమిహిరులవారు నా ఉద్దేశం తెలుసుకోవాలనుకున్నారు.
ఖనా : (ఊపిరి బిగబట్టి) అయితే మీరేం అన్నారు?
సుబంధు భట్టు : అక్కడ ఏం అనగలను? అంతా ఆయన మీదే వదిలి పెట్టి వచ్చేసాను. ఐతే ఒక్కమాట మాత్రం ఈనాడు నీతో అంటున్నాను… ఇదంతా అంత సులభమేమికాదు.
ఖనా : నేను స్త్రీని, అందుకే కదా?
(సుబంధు భట్టు ఖనావంక అర్థవంతంగా చూసినా ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యడు) మీరు నాకు జీవితంలో ఎల్లప్పుడూ ఆశావహ దృష్టికోణంతోనే ఉండమని నేర్పించారు…. అలాంటిది ఈనాడు మీ కన్నులలో మౌన నిరాశ ఎందుకు కనిపిస్తోంది? (కొద్దిక్షణాలు ఆగి) మనం ఏనాడైనా ఆచార్య వరాహ మిహిరుల వారు నన్ను తన శిష్యురాలిగా స్వీకరిస్తారని అనుకున్నామా? లేదా నేను వారింటికి కోడలుగా అడుగుపెడతానని ఊహించామా?
సుబంధు భట్టు : (ఉదాసీనంగా) అది వేరే విషయం.
ఖనా : బాబాయ్! చిన్నతనం నుండీ నేను మీవద్ద ఒక కథ వింటూ వస్తున్నాను… అరుంధతి కధ! అరుంధతికి ఆకాశంలో సప్తర్షి మండలం వద్ద అలౌకికమైన స్థానం లభించలేదా? స్త్రీ అయితే నేం?
సుబంధు భట్టు : (గట్టిగా ఊపిరి విడిచి) లభించింది, నిజమే… కాని ఆమె పతివ్రతా ధర్మం అనే ప్రత్యేక కారణం వలన….. అంతేగాని ఆమె విద్వత్తు వలన కాదు… విద్వత్తు వలన కాదు…..
(తనను తాను సంబాళించుకుంటూ) ఆశ ఉండాలి… కాని ఇదంతా అంత సులభమేమీకాదు!
ఖనా : (మంద్రస్వరంలో) ఇది విని మీకు సంతోషమనిపించడం లేదా?
సుబంధు భట్టు : (ఆర్ద్రమయిన) క్షణకాలమైనా అలా ఆలోచించకు సుమా! ఇదంతా విన్న నాకు ఎలా అనిపించిందో, నీకు తెలియదు! నువ్వు నా తనయవు కాకపోవచ్చు గాని నా మానస పుత్రికవు (స్మృతులలో మునిగిపోతూ) చిన్నప్పటి నుండి నేను నిన్ను ఒకసారి పట్టుకుని – మరోసారి వదిలేసి ఎలా అడుగులు వేయించడం, నడవడం నేర్పించేనో నీకు గుర్తు కూడా ఉండదు. ఊరు నుండి నిన్ను ఇక్కడకు తీసుకు రావడానికి కూడా ఎంత పోట్లాడవలసి వచ్చిందో, నువ్వు ఊహించనుకూడా లేవు! (స్మృతులలోంచి బైటపడి) తెరుచుకున్న కళ్లతో చూసే స్వప్నాలు ఏనాడయినా నిజమవుతాయనుకోగలమా? ఈనాడు నాకన్నా సంతోషించే వారు మరొకరు ఎవరుండగలరు? కాని
ఖనా : కాని?
సుబంధు భట్టు : (ఆలోచనలలో కొట్టుకుపోతూ) నిన్ను రాజసభా సదస్యురాలిగా చూడడం… ప్రస్తుతానికి ఇది సామ్రాట్టులవారి అభిలాష మాత్రమే… రాజాజ్ఞ వెలువడేవరకూ, ఈ ప్రయాణాన్ని… ఈ విషయంలో స్పష్టంగా ఏదీ ఆలోచించలేకపోతున్నాను. ఒక ఆదర్శవంతమైన స్వప్నం అనిపిస్తోంది. కాని తెరిచిన కళ్లతో కలలు కంటూ, యథార్థం ఉనికిని గమనించలేని స్థితిలోనూ లేను. (ఒక్కసారి వాస్తవ స్థితిలోకి వచ్చి) నా ఈ ఊగిసలాటల… సంశయాల కాలిబాటలో నువ్వు నడవొద్దు…. దీని ప్రభావం నీమీద పడకూడదు… చక్కని రాజమార్గం నిన్ను ఆహ్వానిస్తోంది. భగవంతుడు నీ మార్గాన్ని ప్రశస్తము చేయుగాక!
ఖనా : బంధు బాబాయ్!
(సుబంధు భట్టు ఖనా వద్దకు వచ్చి, ఆమె తల పైన ఆశీర్వదిస్తున్నట్లుగా ప్రేమగా చేతితో నిమురుతాడు. ఖనా, ఆర్ద్రత, గర్వంతో బాటు కాస్తంత భయంతో కూడిన భావాల సమ్మేళనంతో ఆయనను నిర్నిమేషంగా చూస్తోంది.)
(సశేషం)