Site icon Sanchika

నేపథ్య రాగం – నాటకం – దృశ్యం 12

[box type=’note’ fontsize=’16’] యుగ-యుగాల నుండి ఈ సంఘమనే రంగస్థలంపైకి వచ్చి కనబడాలని, వినబడాలని నిరంతరం సంఘర్షణ చేస్తున్న ఒక సన్నని రాగం కథే ఈ ‘నేపథ్య రాగం’.. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]

దృశ్యం-12

[dropcap](ఆ[/dropcap]చార్య వరాహమిహిరుల వారి నివాసంలో గది. సాయం సంధ్య నలువైపులా ఆవరించడంతో, గదిలో నలుచెఱగులా చీకట్లు కమ్ముకుంటున్నాయి. గదిలో ఒకవైపు గవాక్షముంది. గూట్లో వెలిగించి పెట్టిన దీపం కొండెక్కింది. పీటమీద ఉన్న పట్టు ఉత్తరీయం, ఇప్పుడే ఎవరో అన్యమనస్కంగా విసిరిపడేసినట్లు చెదిరి ఉంది. పక్కనే ఉన్న శిరోభూషణం కూడా అలాగే ఉపేక్షిత భావంతో పెట్టినట్లు అనిపిస్తోంది. ఆచార్య వరాహమిహిరుల వారు గదిలో ఒంటరిగా, ఉద్వేగంగా ఉన్నట్లు కానవస్తున్నారు. ఆయన మనసులో నడుస్తున్న అంతర్ద్వందం నాలుగు దిక్కులనుండీ మూసుకొస్తున్న చీకటిలాగే చుట్టుముడుతోంది.)

వరాహమిహిరుడు : (ఆయన అంతరంగంలోని అంతర్ద్వందం శబ్దాలరూపలో బైటకు రాలుతున్నట్లు) మాళవగణాధీశుడైన విక్రమాదిత్యుడి నవరత్నాలలో ఒకడైన వరాహమిహిరుడనే మణి, సూర్యుడు అస్తమించక ముందే ఎలా మసక బారేడు! ఎంతటి ఆవేదన…. ఎంతటి అలసట… ఇన్నాళ్ల తరవాత రాజాస్థానానికి వెళ్లినంత మాత్రాన ఇంతటి అలసట వచ్చిందా? కాదు.. ఇటువంటి వ్యర్థ ప్రశ్నలతో ముఖ్యమైన ఆ యక్ష ప్రశ్నను వెనక్కు నెట్టెయ్యలేను కదా! (బాధగా) స్త్రీ జాతకులను హృదయపూర్వకంగా ప్రశంసించే నేను… ‘బృహత్-జాతక’ గ్రంథ రచయిత నైన వరాహమిహిరుడు అనే నేను, ఈనాడు జీవితంలో స్త్రీకి సంబంధించిన ప్రశ్న దగ్గరకు వచ్చేసరికి మాత్రం చాలా – చాలా సామాన్యుడిని అయిపోయేను. నేను ‘అందరికీ ఆమోదయోగ్యమనే’ ముసుగులో నా వ్యక్తిగత అభిప్రాయం పైన తెరవేసే ప్రయత్నం చేసాను… దానిని దాచేను. (బాధతో, అన్యమనస్కంగా ఎక్కడో కూర్చుంటారు.) ఖనా… నేను స్వయంగా ఇష్టపడిన నా శిష్యురాలు, ఆమె జ్ఞానమనే ఉత్కంఠతకు నేను శాస్త్రమనే వరాన్ని అందించిన వాడిని! కోడలిగా అంగీకరించేను. ఈనాడు ఆమెకు హితం జరిగేలా ఎందుకు బలమైన అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యలేకపోతున్నాను? ఎందుకు?… ఎందువలన? ఇదేదో స్థిరమైన భావం కాకపోవడమా? లేక నా మారువేషమా? అనిశ్చితతా? లేక ఈర్యా? (నిల్చుంటారు. గొంతుకలో దృఢత్వం వస్తుంది) సభలో సదస్యురాలిగా ఆమె నియామకం, నా వంశాన్ని, మిహిర వంశ కీర్తి పతానకను దూర-దూర ప్రదేశాలకు కొనిపోయి రెప రెప లాడిస్తుంది ఓహ్…! (మరుక్షణం నిరాశగా) నవరత్నాలలోని తక్కిన రత్నాల ఆఖరి నిర్ణయం విని కూడా నేనెందుకు అలా తటస్థంగా మౌనంగా ఉండిపోయెను?

(గొంతుక గంభీరమవుతుంది)

ఏమిటి ఈ తటస్థంగా ఉండడం? తటస్థత అంటే? నిర్లిప్తంగా ఎవరూ ఉండలేరు. మనసు అడుగుపొరల్లో ఎక్కడో బంధింపబడే ఉంటారు. మనల్ని కట్టి ఉంచే ఆ సూత్రం ఏదో? సంస్కారమా? విలువలా? ఆచారాలా? వాటినే మనం సాంప్రదాయం అంటున్నామా? మస్తిష్కంతో మనం సిద్ధాంతాలను రచించినా, హృదయం మాత్రం కేవలం సంస్కారాలతోనే కట్టుబడి ఉంటుంది. (కరుణ నిండిన స్వరంతో) సూర్యుడు ఆత్మ; చంద్రుడు మనస్సు… సూర్య సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్న సమయంలో, కేవలం సూర్యుని ప్రకాశం పైనే జీవించే చంద్రుడు…. మనస్సు… ఏదో ఒకనాడు సూర్యుడు ఇంత భారమవుతాడని అర్థం చేసుకోలేకపోయేను. మనస్సు ఆత్మకన్న బలవత్తరమైనది! ఆత్మకంటేనా?

(గొంతుకలో ఆత్మగ్లాని ధ్వనిస్తుండగా) ఇప్పుడు ఖనా ఎదుటకి ఏ ముఖం పెట్టుకు వెళ్లగలను? ఆత్మకు కాంతినిచ్చే సూర్యుడిగానా లేక అస్థిర చిత్తమైన చంద్రునిగానా? గురువుగానా లేక మరొకరి కీర్తికి భయపడే, శంకిస్తూ ఉండే సభాసదస్యుని గానా? (కొద్దిక్షణాలు ఆత్మగ్లానిలో మరింత లోతుగా మునిగిపోయి) స్వదేశాన్ని విదేశంతో కలపగలిగే ఉదారమనస్కుడైన మిహిరవంశానికి చెందిన ఆదిత్యదాసుని దేదీప్యమానమైన కులసూర్యుడైన ఆచార్య మిహిరుడు ఈనాడు తన దృష్టిలో తానే ప్రాతః కాలంనాటి మణిగిపోయిన దీపంలా మిగిలిపోయాడు.

(అదే సమయంలో ఖనా, చేతిలో కాంతులు వెదజల్లుతున్న దీపంతో ప్రవేశిస్తుంది. ఆ దీపకాంతుల వలన గది అంతటా ప్రకాశవంతమవుతుంది.)

ఖనా : (ఆశ్చర్యంగా) మీరు ఎప్పుడు వచ్చేరు మామయ్యగారూ? మీ వచ్చిన అలికిడే తెలియలేదు. ఇలా అంధకారంలో ఎందుకు కూర్చున్నారు? ఎవరికైనా సేవకురాలికి చెప్పవలసింది, మీరు వచ్చేరని!.

(క్షణం సేపు ఆచార్య వరాహులవారు ఏ సమాధానమూ ఎందుకు ఇవ్వటం లేదని పరీక్షగా చూస్తుంది.)

తులసి కోట వద్ద దీపం పెట్టడానికి వెళ్తున్నాను…. ఉండండి ముందు ఇక్కడే…

వరాహమిహిరుడు : (స్వగతం) దీపం ఉంచినా ఏం… వెలుతురు నీ మీదేగా పడుతోంది. ఇప్పుడు నేను కేవలం నీడను మాత్రమే! (రంగస్థలంపైన ఖనా వెలుతురు పడే స్థానంలో ఉంది. వరాహమిహిరుడు మాత్రం కాస్త చీకటి ప్రదేశంలో! ఆమె దృష్టి గూట్లో ఉన్న కొండెక్కిన దీపంపైన పడటంతో తన దీపాన్ని తీసుకువెళ్లి అక్కడ ఆరిన దీపాన్ని వెలిగిస్తుంది. అటుపైన తన చేతిలో దీపాన్ని కూడా అక్కడే ఉంచుతుంది.)

ఖనా : (ఆందోళన నిండిన స్వరంలో) మీరేదో చాలా బాధపడుతున్నట్లు కానవస్తున్నారు. ఎప్పుడు వచ్చారు? ముందు మంచినీరు తేనా?

(ఆచార్య వరాహమిహిరులవారు ఆమెను కూర్చోమని సైగ చేస్తారు.)

రాజాస్థానం నుండి వచ్చారు కదా! ఇంటినుండి ఉదయాన్నే వెళ్లారు కదా…. ముందు… (ఆచార్యుల వారు ఆగమని సైగ చేస్తాడు.)

మహారాజుగారికి మీతో ఏదైనా ప్రత్యేకమైన విషయాన్ని గురించి సంప్రదించవలసి వచ్చిందా….. సుబంధు బాబాయ్ మీరేదో విషయం…. అంటే ఆస్థానంలో నన్ను నియమించడం గురించి… ఆ విషయమేనా? (బైట మెరుపులు – ఉరుములు. గాలివాన వచ్చే సూచనలు! ఆచార్య వరాహమిహిరుడు ఖనా వంక ఆశ్చర్యంగా, ఈమెకు అన్ని విషయాలు తెలుసే అన్నట్లు చూస్తారు.)

వరాహమిహిరుడు : నువ్వు సుబంధు భట్టు గృహానికి వెళ్ళావా? (కాస్త ఉదాసీన భావంతో) మంచిదేలే!

ఖనా : ఆస్థాన సదస్యులు ఏమని నిర్ణయించారు?

వరాహమిహిరుడు : (ప్రశ్నను తట్టుకోలేక) మెరుపులు మెరుస్తూ, మేఘాలు కమ్ముకొస్తున్నాయి. చూడబోతే వర్షం పడేటట్లు ఉంది.

ఖనా: ఆషాఢం అప్పుడే ఎక్కడ? ఇంకా పూర్వాషాఢ కదా! బహుశా మేఘాలు చెదిరి పోతాయి. ఆస్థానంలో నా గురించి ఏం నిర్ణయించారు మామయ్యగారూ?

వరాహమిహిరుడు : నిర్ణయం జరిగిపోయింది.

ఖనా : నవరత్నాలకు, నన్ను సదస్యురాలిగా నియమించడం పట్ల ఏవిధమైన ఆక్షేపణ లేదుకదా? వరాహమిహిరుడు :- (అలసట నిండిన స్వరంతో) లేదు.

ఖనా : నేను రాజాస్థానంలో ప్రవేశించడం వారికి సమ్మతమేనా?

వరాహమిహిరుడు : ఔను.

ఖనా : (ఆశ్చర్యం – ఉత్సాహం నిండిన స్వరంతో) ఔనా?

వరాహమిహిరుడు : కాని…..

ఖనా : కాని?

వరాహమిహిరుడు : విక్రమాదిత్యుని నవరత్నాలకు ఆస్థానంలో నాలుకలేని స్త్రీ – సదస్యురాలు కావాలి.

ఖనా : అంటే?

వరాహమిహిరుడు : (గొంతుకలో పశ్చాత్తాపము, బాధ, ఆత్మగ్లాని ధ్వనిస్తూ ఉండగా ఖనా వంక చూడకనే) స్త్రీ గనక సభలో సదస్యురాలిగా ఉండాలంటే, ముందు ఆమె జిహ్వను ఖండించాలని వారు అభిప్రాయపడ్డారు!

(దుఃఖం – బాధ చుట్టు ముడుతు ఉండగా నిష్క్రమిస్తారు. ఉరుములు, మెరుపుల భయంకర ధ్వనులతో భయపెట్టే వాతావరణం. కొద్ది క్షణాల పాటు ఖనా స్తబ్దుగా నిలబడి పోతుంది. ఆకాశం వంక చూస్తుంది.)

ఖనా : (కరుణ కూడిన మందహాసంతో స్వగతం) స్త్రీ సదస్యురాలు…. మామయ్యగారూ! మీరు అనవసరంగా చింతిస్తున్నారు. శ్రావణం… కాదు… కాదు ఆషాఢం కన్న ముందు కమ్ముకొచ్చిన మేఘాలివి. కురవవు. ఆషాఢం ఇంకా ప్రవేశించలేదు… కేవలం ఇది నేపథ్యం మాత్రమే… ఇది ప్రకటమవడానికి, తెరముందుకు రావడానికి సమయం పడుతుంది…. కల్పాంతం… ఎన్నోయుగాలు…!! (దీపం ఎత్తుతుంది. ఆకాశం వంక దీపాన్ని ఎత్తి చూపిస్తుంది ఆకాశాన్ని చూస్తున్న దానిలా)

శ్రావణం ఎక్కడ, ఇంకా ఆషాఢమే రాలేదు… ఇది పూర్వాషాఢ… ఇదికేవలం నేపథ్యం… నేపథ్యం అంతే! (ఖనా రంగస్థలం మీద ఒక వైపు కేవలం బొమ్మలా నిల్చుండిపోతుంది.)

(సశేషం)

Exit mobile version