[box type=’note’ fontsize=’16’] యుగ-యుగాల నుండి ఈ సంఘమనే రంగస్థలంపైకి వచ్చి కనబడాలని, వినబడాలని నిరంతరం సంఘర్షణ చేస్తున్న ఒక సన్నని రాగం కథే ఈ ‘నేపథ్య రాగం’.. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]
దృశ్యం-4
[dropcap](సు[/dropcap]బంధు భట్టు గృహం. పువ్వులు-లతలు చెక్కిన కట్టెతో చేసిన స్తంభాలు ద్వారం పైన, లావుగా ఉండే గొలుసులు తగిలించి ఉన్నాయి. గదిలో కొన్ని గ్రంథాలు చెల్లాచెదరుగా పడివున్నాయి. ఒకటి రెండు పుస్తకాలయితే సగం సగం తెరిచి, మర్చిపోయినట్లు పడున్నాయి. చింతాక్రాంతుడయిన సుబంధు భట్టు ఉద్రేకానికి లోనయినట్లు అటు-ఇటు పచార్లు చేస్తూండగా, ఖనా చేతిలో ఒక పాత్ర పట్టుకుని ప్రవేశిస్తుంది.)
ఖనా : ఫలరసం… తాగండి….
(సుబంధు భట్టును ఏదో తనలో తనే తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు చూసి) మీరు… నిరంతరం సాహితీ రసంలోనే మునిగిపోయి ఉంటారు.
భట్టు : (కాస్తంత ఉలికిపడి) అక్కడ పెట్టు..
(తిరిగి ఆలోచనల్లో మునిగిపోతాడు)
ఖనా : పెట్టేస్తే అలా ఉండిపోతుంది. ముందు తాగెయ్యండి. లేకపోతే రుచి మారి, తాగితే వికార పెడుతుంది. (అంటూ వెళ్తూండగా)
సుబంధుభట్టు :- ఇలా వచ్చి కాస్త కూర్చో ఇక్కడ!
(ఖనా ఆయన వంక తిరిగి చూస్తుంది. ఏదో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు)
ఖనా :- (ఆలోచనలో మునిగినట్లు, మెల్లిగా) వంటిల్లు సర్దుకోవాలి! ఎక్కడి వక్కడ పడున్నాయి.
సుబంధు భట్టు :- (కంఠంలో ఒక నిశ్చయానికి వచ్చినట్లున్న భావంతో) ఉహూ! ముందు కూర్చో….. ఇక నీతోనే చర్చించాల్సిన సమయం!
ఖనా : మీరు కంగారుగా ఉద్రేకంగా కనిపిస్తున్నారెందుకు?
భట్టు : (దూరంగా ఏదో పాత జ్ఞాపకాలలోకి మునిగినట్లు) ఈనాడు గతించిన నా అన్నగారుంటే….. బహుశా… బహుశా ఈ పరిస్థితిలో ఉండి ఉండేవాడిని కాదేమో!
ఖనా : (భయపడుతూ) ఎటువంటి పరిస్థితి?
భట్టు : (తనలో తాను మునిగిపోయి) అక్కడ వదినగారికి ఎంత నచ్చచెప్పి నిన్ను ఇక్కడ ఉజ్జయినికి తేగలిగేను! నిన్ను ముందుకు నడిపించే బాధ్యతతో బాటు కర్తవ్యం కూడా నాదే…… (ఖనా వంక చూస్తూ) మనస్ఫూర్తిగా నా కోరికా అదే… అందులో ఏం సందేహం లేదు… అటుపైన….
ఖనా : అటుపైన ఏమిటి బాబాయ్?
భట్టు : అటుపైన (ఖనాని చూస్తూ) నీ అసామాన్యమైన వ్యక్తిత్వం!
ఖనా: (ఉక్కిరి బిక్కిరి అయి) నావల్ల తప్పేమైనా జరిగిందా?
భట్టు : నీ వలన తప్పేమీ కాలేదు. నా వలనేమైనా తప్పు జరిగిపోకూడదు!
(దగ్గరకొచ్చి ఖనా భుజాలు పట్టుకుని కూర్చోబెట్టగానే)
ఖనా : బాబాయ్! నాకు కంగారుగా ఉంది. ఏమయిందో స్పష్టంగా చెప్పండి బాబాయ్!
భట్టు : నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకునేందుకు నామీద భారం ఉంచారు.
ఖనా : ఐతే?
భట్టు : జీవితాంతం ఉండే వివాహాన్ని మించిన బాధ్యత మరేమీ ఉండదు.
ఖనా : (ఉలిక్కిపడి) వివాహమా! కాని… (లేచి నిల్చుంటుంది)
భట్టు : ఆచార్య వరాహ మిహిరుల వారు ఖ్యాతి పొందిన తమ కుమారుడైన పృథు యశస్సు వివాహం గురించి ప్రస్తావిస్తూ వర్తమానం పంపేరు.
ఖనా : (మరింత ఉలిక్కిపడి) ఆచార్య వరాహమిహిరుల వారా? (కొద్ది క్షణాలపాటు రంగస్థలంపైన నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది. తిరిగి ఆలోచనల్లో కొట్టుకు పోతున్న ఖనా మంద్రస్వరంలో) వివాహం!
భట్టు : (ఖనా ఉలిక్కిపడటం, ఆలోచనలలో మునిగి పోవడంతో కాస్తంత సంశయిస్తూ) ఇందులో ఆశ్చర్య పోవడానికేముంది? ఎలాగా వివాహం చేసుకోవాలిగా!
ఖనా : (ఓడినట్లున్న భావంతో) కాని నేను మాత్రం ఉజ్జయినికి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని వచ్చాను. – (ఆలోచనల్లో మునిగిపోయి రెండు అడుగులు ముందుకి, రెండడుగులు వెనక్కి వేస్తూ, హఠాత్తుగా వెనక్కి తిరుగుతుంది. సుబంధు భట్టు ఆమెను చూస్తూ ఆమె మనసులో చెలరేగుతున్న భావాలను, ఊగిసలాటను గమనిస్తూంటాడు. తన గొంతును సంబాళించుకున్న ఖనా) ఆ స్వప్నం నిజమయింది. ఆచార్యుల వారు నన్ను వారి శిష్యురాలిగా స్వీకరించారు.
భట్టు : అదే ఆ ఆచార్యుల వారు ఇప్పుడు తమ కోడలిగా చేసుకోవాలనుకుంటున్నారు.
ఖనా : (మునిగిపోతున్నట్లున్న స్వరంలో) మరి నా అధ్యయనం? ఇదంతా ఇలా సగంలోనే వదిలెయ్యాలా? మీరు అలా జరగనిస్తారా?
(సుబంధు భట్టుకి సరిగ్గా ఎదురుగా నిలబడి దృఢమైన గొంతుకతో) మీకు ఇదంతా సమ్మతమేనా?
భట్టు : (పక్కకు వైదొలగుతూ)…. నేను… నేను అందుకే అంత కలవరపడుతున్నాను. అందరు వ్యతిరేకించినా, ఎదిరించి, సహించి మరీ నిన్ను జ్యోతిష్యంలో ఉన్నత విద్యను చదివించడానికి… ఇక్కడకు ఉజ్జయినీ తీసుకువచ్చాను. కాని, సంఘటనలు ఇంత త్వరగా ఇంత వేగంగా మారిపోతాయని మాత్రం ఊహించలేదు.
(పరిస్థితుల వలన సుబంధు భట్టు ఇలా వశం తప్పినట్లు మాట్లాడుతూ ఉంటే, ఖనాలో కాస్తంత భావుకత, ఉద్రేకాలు కలగలిసినట్లు)
ఖనా : (ఉద్రేకంతో) కాని బాబాయ్, ఇంత తొందరేం వచ్చింది?
భట్టు : అదీ ఒక సమస్యే! వివాహం శీఘ్రంగా చేసుకోవాలని వరుడు మహా ఆతృతగా ఉన్నాడు.
ఖనా : (ధైర్యం కోల్పోయినట్లు) కాని, వద్దు అని చెప్పడం మీ చేతుల్లోనేగా ఉంది!
భట్టు : అది చాలా సులభమే! కాని వివాహం చెయ్యాలి చేసుకోవాలనుకున్నప్పుడు, ఇంతకన్న మంచి సంబంధం మరేం…
ఖనా : (మాట మధ్యలోనే) వివాహం అంత అనివార్యమా?
భట్టు : (కొన్ని క్షణాలు ఆగి ఆలోచించి) అనివార్యం కాకపోయినా, అవసరం మాత్రం అనుకోవాలి.
ఖనా : (గొంతుకలో వ్యాకులపాటు ఉన్నా, కోమలంగానే) బంధు బాబాయ్! మీరు నాకెంతో ఇష్టమైన బాబాయ్! బంధువు కూడా! మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా?
(సుబంధు భట్టు ఆగి ఆమె వంక తేరపారి చూడటంతో ఖనా తన మాటను ముందుకు కొనసాగిస్తూ) పిన్ని మరణం తరవాత… ఆవిడతో సాహచర్యం కొద్ది నెలలు మాత్రమే కదా! కాని మరోసారి అలా ఎందుకు ఆలోచించలేదు?
భట్టు : మీ పిన్ని ఈ ఇంటితో ఎంత మమేకం అయిందంటే, మరొకరితో ఈ ఇంటిని పంచుకోవాలి అన్న కోరికే కలగలేదు. (భావుకతలో కొట్టుకుపోతూ) ఆవిడ నా గ్రంథాలను – పత్రాలను ఎంత చక్కగా కూర్చిందంటే, శేష జీవితం వాటి ఆలంబనతోనే గడిచిపోతుంది. (సంబాళించుకుని) కాని ప్రపంచం… ఈ ప్రపంచం పురుషుల ప్రపంచం అమ్మా!….
ఖనా : నేను ఎంచుకున్న జ్ఞానమార్గంలో స్త్రీ-పురుష భేదం ఎందుకుండాలి?
భట్టు : భేదం వ్యక్తిత్వంలోకాదు, దృష్టిలో ఉంది. ఈ సమాజం నిన్ను ఒక వ్యక్తిలా చూడాలా లేక యువతిలాగ చూడాలా అన్నది నువ్వు ఏనాటికీ నిర్ణయించలేవు.
ఖనా : (దుఃఖంతో) అంటే ఆచార్యులవారు నన్ను ఒక కోడలిగానే చూసేరా?
భట్టు : బహుశా కాదని నేననుకుంటున్నాను… ఆయన ముందుగా నీ విద్వత్తును చూసి ప్రభావితం అయేరు. (కాస్తంత చిరునవ్వుతో) అయితే, ఆయన పుత్రుడు పృథుయశస్సు విషయంలో మాత్రం ఇదీ అని నిశ్చయంగా నేనేమీ చెప్పలేను.
(కొద్ది క్షణాలు ఆగి, ఒక్కొక్క మాట ఆగి ఆగి పలుకుతూ) ఈ మధ్య అతడు మూడు-నాలుగు సార్లు మన ఇంటికి రావడం, ఏదో కాకతాళీయం అనిపించలేదు.
ఖనా : కాని, మీరు నాతోటి ఏమీ అనలేదే!
భట్టు : (కూర్చుంటూ) వెంటనే ఇలాంటి విషయాలను గురించి ధ్యాస ఎక్కడ పెట్టగలను?….. నా మనసు ఇటువంటి విషయాలను ఎక్కడ పట్టించుకుంటుంది చెప్పు…. నీకు నా గురించి తెలుసుకదా!
ఖనా : (నిస్సహాయంగా, దు:ఖంతో కూడిన కంఠం) అయినా, మీరు మాత్రం నేను అధ్యయనాన్ని సగంలోనే వదిలేసి, ఈ బంధాన్ని స్వీకరించడానినే బలపరుస్తున్నారా… వివాహం చేసుకోవాలా?
భట్టు : (ఆర్ద్రమైన గొంతుకతో) అలా ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా? అర్ధం చేసుకో… నువ్వు జ్ఞానమనే గంగోత్రిలోకి అడుగు పెట్టబోతున్నావు…. నేను ఆచార్యుల వారిని… వారి పరివారాన్ని బాగా ఎరుగుదును. వారి కులంలో విద్యావంతులైన స్త్రీలకు ఏమీ కొదువలేదు. అక్కడ వారికి తగినంత గౌరవమూ ఉంది. నీ అధ్యయనం నీ ఇష్టాలు ఆగృహంలో ప్రవేశించాక వాడిపోవు!
ఖనా: ఒకవేళ ఈ విషయాన్ని ఇక్కడే ఆపేస్తే?
భట్టు : ఆపెయ్యడం అన్నది ప్రశ్నకి సమాధానం కాదు. దీని వలన విషయాలను మనం మరింత చిక్కుల్లో పడేస్తాం. (దృఢమైన గొంతుకతో) ఒక్కమాట మాత్రం గుర్తుంచుకో! ఈనాడు నేను నీతో ఈ విషయాన్ని చర్చిస్తున్నావంటే ఇలాటి అవకాశం మళ్లీ రాదని మాత్రం తెలుసుకో!
ఖనా : (మంద్రంగా, తనకి తనే బోధపర్చుకుంటున్న ధోరణిలో) బహుశా, మీరు చెప్తున్నది సత్యమే!
భట్టు : పూర్తిగా నిశ్చయించుకుని… మనస్ఫూర్తిగా చెప్పు.
(ఖనా తిరిగి చూస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు.)
నీకు అర్థం కాదు, బాధ్యతల పర్వతం నాముందు ఉంది. అన్నిటికన్నా ముందు మన ఊరు వెళ్లి వదినగారిని తీసుకురావాలి. ఎన్ని సంబరాలు… ఎన్ని సంబరాలు… ఎన్నిటిని జాగ్రత్తగా ఏర్పాటు చెయ్యాలి… ఇవన్నీ ఒక్కరివల్ల ఏమవుతుంది? (స్వగతంలో, కాస్త ఉదాసీనంగా) ఇదిగో ఇలాంటి క్షణాల్లోనే ఒంటరితనం బరువుగా మారినట్లు అనిపిస్తుంది.
(సుబంధు భట్టు అక్కడినుండి నిష్క్రమణ. ఖనా ఏకాగ్ర చిత్తంతో వెళ్తున్న ఆయననే చూస్తూంటుంది. ఆమె రంగస్థలం మధ్యభాగంలో ఉంది.)
ఖనా : (దృఢంగా, నిర్ణయించుకున్న స్వరంతో) వివాహం! ఔను వివాహమే!
(బొమ్మలా నిల్చుండగా తెర)
(సశేషం)