నేపథ్య రాగం – నాటకం – దృశ్యం 5

0
2

[box type=’note’ fontsize=’16’] యుగ-యుగాల నుండి ఈ సంఘమనే రంగస్థలంపైకి వచ్చి కనబడాలని, వినబడాలని నిరంతరం సంఘర్షణ చేస్తున్న ఒక సన్నని రాగం కథే ఈ ‘నేపథ్య రాగం’.. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]

దృశ్యం-5

[dropcap](ఖ[/dropcap]నా రంగస్థలంపైన ప్రతిమలాగ నిల్చుంది. అప్పుడే మేధతోబాటు తల్లి కూడా ప్రవేశం. మంగళవాయిద్యాలు పార్శ్వ సంగీతంగా వినిపిస్తూండగా, తల్లి వివాహంలో వేసే చీర నొకదానిని తెచ్చి ఖనా భుజాలపై నుండి వేస్తుంది. మేధ దూరం నుండి చూస్తూ నిల్చుంది. తల్లి ఖనా నుదుటను బొట్టు పెడుతుంది. అటుపైన ప్రేమనిండిన చూపులతో చూస్తుంటే, ఖనా ముడుచుకు పోయినట్లు అనిపిస్తుంది. మేధ వారిద్దరినీ ఆనందంతో బాటు ఆశ్చర్యంగా కూడా చూస్తుంది. ప్రసన్న వదనంతో తల్లి మేధ వద్దకు తిరిగి వస్తుంది. ఇద్దరూ ఆనందిస్తూ ఖనాను దూరం నుండి చూస్తూంటారు.

ఎదుటి నుండి పృథు యశస్సు ప్రవేశం. అతడు తన చేతిని చాపి, ఖనా చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు. వివాహ విధిని ప్రతిబింబించేలా వరుడు, అంటే పృథుయశస్సు సంస్కృత శ్లోకాన్ని ఒక దానిని స్వరంతో పఠిస్తాడు. ఇది వధూవరుల పరస్పర ప్రేమ బంధాన్ని సూచించే మంత్రం. దీనిని ‘సమంజన’ మంత్రం అంటారు.)

పృథు యశస్సు :

“ఓం సమంజ్ఞంతు విశ్వేదేవాః సమాపోహృదయానినౌ॥

సమ్మాతరిశ్వా సం ధాతా సము దేష్ట్రీ దధాతునౌ” (పారస్కర గుహ్య సూత్రం 1.4.14)

(పృథు యశస్సు ఖనా చేతిని పట్టుకుని, శ్లోకం చదువుతూ, ఆమె నడుముపై చేతినుంచి, రంగస్థలంపైన గుండ్రంగా తిరుగుతాడు. తల్లి మేధ వంక చిలిపిగా చూస్తూ, ఖనా – పృథుయశస్సుల ఏకాంతంకి భంగం వాటిల్లకుండా అక్కడినుండి మెల్లగా తప్పుకుందామని సూచిస్తుంది. వారిద్దరినీ చూస్తూ వీరిద్దరి నిష్క్రమణ! పృథుయశస్సు, ఖనా రంగస్థలం మధ్యలో భగవంతునికి నమస్కరిస్తున్న ముద్రలో నిల్చొని ఉండగా, వారిపైన పుష్ప వర్షం కురుస్తుంది. వారు ఈ నమస్కారముద్రలో ఉండగా, నేపథ్యంలో వివాహం జరిగిందన్న సూచనగా మంత్రోచ్చారణ వినిపిస్తుంది. ఈ శ్లోకం వధూవరులు సుఖసౌభాగ్యాలను, సమృద్ధిని, మంచి ఆరోగ్యాన్ని పొందమన్న ఆశీర్వాదం –

“ఓం ఆపః శివాః శివతమాః శాంతాః

శాంతతమాస్తాస్తే కృణ్వంతు భేషజమ్। (పారస్కర గుహ్య సూత్రం 1.8.5)

అటుపైన పృథుయశస్సు ఖనాను తన బాహువులతో చుట్టి రంగస్థలం మధ్యలో ఒక స్థానంలో కూర్చోబెడతాడు.)

పృథు : (గొంతుకలో ప్రసన్నత స్పష్టంగా, మృదువుగా తెలిసేటట్లు) నిన్ను జీవిత సహచరిగా ఇలా చూస్తుంటే ఒక్కసారిగా నమ్మకం కుదరటం లేదు సుమా!

ఖనా : (గొంతుకలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూండగా) మనోసహచరిని కూడా అవాలని నా అభీష్టం.

పృథు : నిన్ను చూసిననాటి నుండి ఒక అద్భుతమైన ఆకర్షణ నన్ను చుట్టుముడుతూ వచ్చింది… ఆకర్షణ అనే ఈ సుడిగుండాలు కూడా … ఒకసారి చుట్టు ముట్టాయంటే మరి అందులోనుండి లేవడానికి అవకాశమే ఇయ్యవు.

ఖనా : (నిల్చుంటూ) కాని మీరు మాత్రం…

పృథు : (జ్ఞాపకాలలో మునిగిపోతూ) నువ్వు నాన్నగారి అధ్యయన ప్రదేశపు గదిలో కూర్చుని ఏవో జటిలమైన అంశాల చిక్కు ప్రశ్నలకు సమాధానాలు వెతకటంలో పూర్తిగా మునిగిపోయిన దృశ్యాన్ని నేను ఎలా మరవగలను?….. నేను మేడమీద నిల్చుని ఎంత సేపు నిన్నే చూస్తూ నిల్చుండిపోయానో చెప్పలేను. మరి నువ్వు? అధ్యయనంలో గాఢంగా మునిగి పోయిన నీకు ఆ గదిగాని, అక్కడ నిన్ను చూస్తున్న నేనుగాని ఉన్నాం అన్న ధ్యాసే లేదు. నేను అక్కడ కొచ్చి ఆగి చూసేను…. కాని నువ్వు మాత్రం లెక్కలు గుణించడాలలో ఏకాగ్రతతో తల్లీనమయిపోయి కూర్చున్నావు. గుణించడాలు, లెక్కలు అయేక నీ కళ్లలో పొడచూపిన చిరునవ్వుల కాంతిని ఎవరయినా ఎలా మరవగలరు?

ఖనా : (కాస్తంత కంగారుగా, కొంచెం సంకోచిస్తూ) మీరు అక్కడ ఏం…..

పృథు : (తన జ్ఞాపకాలలోనే మునిగిపోయి ) అంతేనా? ఒకనాడు… మీ సుబంధు బాబాయి గృహానికి వచ్చాను… నీవు వంటశాలలో ఉన్నావు… క్షీరపాకాన్ని వండుతూ… నైవేద్యానికని ఆ క్షీరపాకాన్ని తీసుకుని వస్తూ నువ్వు ఎదుట పడ్డావు చూడు?… ఓహ్… (దగ్గరకు వచ్చి) నీ లలాటం పైన స్వేదకణాలు మంచుబిందువులలాగ మెరుస్తూ కనిపించేయి…. (ఖనా చెంపలను నిమురుతూ) నిప్పు కణాల వేడికి నీ కపోలాలు తళతళలాడుతున్నాయి. ఐతే నీ చూపులలో కానవచ్చిన చల్లదనాన్ని ఎన్నడైనా మరవగలనా?

ఖనా : (వణుకుతున్న కంఠంతో) ఇదంతా ఎప్పుడు జరిగింది?

పృథు : (ఖనాను ప్రేమగా ఆలింగనంలో బంధిస్తూ) ఇవన్నీ నా జ్ఞాపకాల సంపదలు! ఆ సమయంలో నీకెలా తెలుస్తుంది?

(ఖనా తనను తాను నెమ్మదిగా విడిపించుకుని రెండడుగులు ముందుకు వేస్తుంది.)

ఖనా : ఎంత విచిత్రం… నమ్మకం కలగటం లేదు… ఒకటి-రెండు సార్లు జ్యోతిష్యానికి సంబంధించిన చర్చలయితే మీతో జరిగేయి… అయితే మీకు నాపట్ల ఇలాంటి భావం ఉందని ఊహల్లో కూడా భావించలేదు!

పృథు : (నవ్వుతూ) ఏం నేనంత శుష్కమైన వాడిలా… జడపదార్థంలా అనిపిస్తానా?

ఖనా : (ఆలోచనలలో మునిగిపోయి) తెలియని భయమేదో నాలో ఉండేది… ఏ ఆచార్య వరాహమిహిరుల వారి నొక్కసారి దర్శించుకుందామని కలలు కనేదానినో, ఆయనకే ఈనాడు మామగారిగా పాదాభివందనం చేస్తూ, అద్భుతమైన అనుభూతిని పొందేను! అత్యద్భుతం!… అందులో ఏముందో తెలియదు…. కాస్తంత గర్వం… కొంచెం భయం… ఏదో చెప్పలేను! ఇంతటి విద్వాంసుల వంశంలో అడుగుపెట్టిన నన్ను చూసుకుని నేనే ఆశ్చర్యపోతున్నాను.

పృథు : అలా మాట్లాడతావేం?…. నీవంటి విదుషీమణి… ఒకొక్కసారి నాకే అర్థం కావటం లేదు, నీముఖంపైని ఈ వర్చస్సు సౌందర్యం వలన వచ్చిందా లేక విద్వత్తు వలనా అని! దానితోబాటే ఏదో ఆలోచన కలిగి ఖిన్నుడిని కూడా అవుతూ….

ఖనా :  (ఆశ్చర్యంగా) ఖిన్నులవటమా? ఎందుకు?

పృథు : వివాహానికి తొందర పెట్టి నిన్ను అన్యాయం చెయ్యలేదు కదా అన్న ఆలోచనతో!

ఖనా : అర్థం కాలేదు.

పృథు : వచ్చేనెల నేను నగరాన్ని విడిచి వెళ్లాలి!

ఖనా : నాకు తెలుసు! అది రాజాజ్ఞ కదా!

పృథు : ఔను, వివాహమయ్యాక కూడా నీతో చాలా కొద్ది సమయాన్నే గడపగలను… కాలానికి సరిహద్దు నిర్ధారించబడే ఉంటుంది. క్షణాల సంఖ్యను పెంచలేను కదా!

ఖనా : (తనలో తనే మునిగిపోయినట్లు) కాలానికి ఉన్న క్షణాలను మనమేం పెంచగలం? ఈ జీవితకాలంలో దానిని అర్థం చేసుకోగలగటమే చాలా గొప్ప విషయం! (గంభీరంగా) కాని, స్వామీ! మీరొక మహత్తరమైన లక్ష్యంతో నగరం విడిచి వెళ్తున్నారన్న మాట నాకెంతో గర్వకారణం!

పృథు : నాకు తెలుసు… అంతా సవ్యంగా అనుకున్న రీతిలో పూర్తి అయితే, ఒక మహత్తరమైన పని చేసినట్లు అవుతుంది! చరణాద్రిలో ఆధునికమైన వేధశాలనొకదానిని నిర్మించడం, మన మహారాజు గారికి ఒక కీర్తి – స్తంభంగా నిలిచిపోతుంది. నిజానికి సమయం, గ్రహ-నక్షత్రాలను గురించి అధ్యయనం చెయ్యడానికి ఎన్ని వీలయితే అన్ని వేధశాలలను నిర్మించగలిగితే అంత మంచిది!

ఖనా : మిమ్మల్ని ఆయన సోదర సమానంగా చూసుకుంటారని విన్నాను. అందుకే కదా, ఇందరు జ్యోతిష్యులుండగా, ఈ కార్యనిర్వహణకు ఆయన మిమ్మల్ని ఎంచుకున్నది.

పృథు : అది నిజమే కాని…

ఖనా : కాని?

పృథు : ఈ కార్యంతో బాటు మరొక బాధ్యత కూడా నాకు అప్పగించడం జరిగింది. ఒక్కొక్కసారి అదే ముఖ్యమైన కార్యం అనీ, ఈ వేధశాల నిర్మాణం అన్నది కేవలం ఒక మిష మాత్రమేనని నాకు అనిపిస్తుంది.

ఖనా : మీరంటున్న దేమిటి?

పృథు : నిజం చెప్తున్నాను ఖనా! నా మనసులో ఉన్న ఈ శంకను నేను ఎవరిముందూ ప్రకటించలేదు. ఈ విషయమై ఆఖరికి నాన్నగారితో కూడా చర్చించలేదు కాని…

ఖనా : (ధైర్యం కోల్పోతున్నట్లుగా) స్పష్టంగా చెప్పండి!

పృథు : (గంభీరమైన కంఠంతో) వేగులు అందించిన సమాచారం ప్రకారం అక్కడే ఉన్న ఏదో ఒక గ్రామంలో మాళవగణ నాయకుల వారి తమ్ముడు, మునుపటి మాళవగణనాయకుడూ, అంటే భర్తృహరి ఉన్నారని తెలిసింది. ఆయనను ఎలాగైనా తిరిగి రమ్మని విన్నవించుకోవాలి. ఆయనను ఒప్పించలేని పక్షంలో ఆయనకు అక్కడే తగినన్ని సదుపాయాలను సమకూర్చడం అన్నది కూడా నా ప్రయాణ ముఖ్యోద్దేశ్యం.

ఖనా : ఆయన గురించి విన్నాను; కాని మహరాజు, భర్తృహరి రాజ్యాన్ని వదులుకుని సన్యాసం ఎందుకు తీసుకున్నారన్నది మాత్రం అర్థం కాలేదు.

పృథు : ఆయన తన రాణి, పింగళను అమితంగా ప్రేమించేవారు. కాని, ఒకనాడు ఆయనకు, రాణిగారు తనని కాక వేరెవ్వరినో ప్రేమిస్తోంది అని తెలియడంతో ఆయనకు…. ప్రపంచం మీదే విరక్తి కలిగింది.

ఖనా : (బాధగా) అయ్యో!

పృథు : నువ్వూ నాతో రాగలిగితే ఎంత బాగుండేదో కదా! కాని ఎలా సాధ్యపడగలదులే!

ఖనా : మీరు బాధపడకండి… మీరు మీకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చుకుని క్షేమంగా తిరిగి రాగలరు…. ఇక్కడ కుటుంబంతో ఉంటూ గురువర్యుల సేవ చేసుకోగలగడం నా అదృష్టం అనుకుంటాను.

పృథు : ఇప్పుడు ఆయన గురువర్యులే కాదు, మామగారు కూడా అని మర్చిపోతున్నావు. నిజానికిప్పుడు ఆయన నీకు ముందు మామగారే!

ఖనా : (తనని తాను సంబాళించుకుంటూ) యదార్థమేకదా… నిజం! మామగారే!

పృథు : (బాధతో కూడిన ఆశ్చర్యంతో) ఇప్పుడు నువ్వు ఏ లోకంలో మునిగిపోయేవు…… వియోగపు నీడతో చుట్టుముట్టిన ఇదేం కలయిక మనది…..

ఖనా : (పృథుయశస్సును బాధనుండి పైకి పడవెయ్యటానికి ప్రయత్నిస్తూ) వియోగం ఉంటేనే కలయిక కూడా పూర్ణమనిపించుకుంటుంది. వియోగంలో, సంయోగం ప్రతిధ్వనిస్తుంది… ప్రతిధ్వని అని తెలియకుండా!

పృథు : (హాస్యంగా) నీకెలా తెలుసు?

ఖనా : (గంభీరంగా) యోగ ముద్రలను గమనిస్తే ప్రతి ముద్రక్రియలోనూ, ప్రతిక్రియ తప్పక ఉంటుంది. ముందు వైపుకు ఎంత వంగితే, వెనకకు కూడా అంత వంగితేగాని, యోగముద్రల సాధన పూర్తికాదు!

పృథు : (హాస్యాన్ని మరింత కొనసాగిస్తూ) ఈ జ్యోతిష్యురాలికి యోగముద్రలలో కూడా అభిరుచి బాగానే ఉందే!

(పృథు యశస్సు చేతులు ఖనాను చుట్టుకుంటాయి. అప్పటి వరకూ తాను యోగక్రియలను గురించి చెప్తున్న మాటలను మర్చిపోయి, పృథు యశస్సు మాటలలో దాగిన మర్మాన్ని, అతడి అభిప్రాయాన్ని అర్థం చేసుకుని, ఖనా ఒక్కసారి మేల్కొన్నట్లు చేతనావస్థలోకి వస్తుంది.)

మా యోగినికి సంయోగ ముద్రలలో ఏపాటి జ్ఞానం ఉందో!

(ఖనాను తన బాహువులతో పట్టుకుని తన దగ్గరకు… అతి సమీపానికి తెచ్చుకుని, ఆమె చుబుకాన్ని పట్టుకుని ముఖాన్ని పైకెత్తుతాడు)

ఆహా! జ్ఞానంతో నిండినది ఈ అక్షయ సౌందర్యం!

(ఖనా కళ్లు మూతలు పడతాయి. ఆమె తన చుబుకం పైనుండి ఆతని చేతిని తీసి, కాస్త వెనక్కు వెళ్లడంతో పృథు యశస్సు ఆమెను తన హృదయానికి చేరువగా చేర్చుకుంటాడు. )

అమాయకమైన నీ ఉఛ్వాస-నిశ్వాసాలు ఏం చెప్తున్నాయో తెలుసా…

(ఖనా ముకుళించుకు పోతుంది. తనని తాను దూరంగా నిల బెట్టుకోవడంతో, పృథు ఆమెను వెళ్లకుండా ఆపాలని ఆమె భుజం పట్టి ఆపుతాడు).

ఇంతటి సుదీర్ఘమైన తపస్సుకు ప్రసాదాన్ని పెట్టవా దేవీ…?

(ఖనా నెమ్మదిగా కరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఏదో ఆకర్షణకు లోనయినట్లు, ఆమె పృథువైపు అడుగు వేస్తుంది. పృథు యశస్సు ఖనా నడుము చుట్టూ చెయ్యివేసి, రెండో చేత్తో ఆమె చేతిని పట్టుకుని లోపలికి పదమన్నట్లు సైగ చేస్తాడు.)

ఈ శ్వాసతో ఏకమవాలని, ఎప్పటి నుండి ఈ ప్రాణాలు కొట్టుకుంటున్నాయో తెలుసా?

(ఇద్దరూ ఒకరి మోహంలో రెండవ వారు సమ్మోహితులయినట్లు, ఒకరినొకరు ప్రేమపూర్వకంగా చూసుకుంటూ రంగస్థలం పైనుండి నిష్క్రమిస్తారు.)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here