నేపథ్య రాగం – నాటకం – దృశ్యం 6

0
2

[box type=’note’ fontsize=’16’] యుగ-యుగాల నుండి ఈ సంఘమనే రంగస్థలంపైకి వచ్చి కనబడాలని, వినబడాలని నిరంతరం సంఘర్షణ చేస్తున్న ఒక సన్నని రాగం కథే ఈ ‘నేపథ్య రాగం’.. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]

దృశ్యం-6

[dropcap](మా[/dropcap]ళవ గణాధిపతి చంద్రగుప్త విక్రమాదిత్యుని రాజ సభాగృహం. ఈ రాజాస్థానం ఆనాటి వైభవాన్ని ప్రతిబింబిస్తోంది. ఆయన తన ‘నవరత్నాల’తో సభలో కొలువు దీరవలసిన సమయం అది. సభాగృహంలో అప్పటికే నవరత్నాలలో ఒకరైన క్షపణుకుడు ఆసీనుడై తక్కిన నవరత్నాలకై ప్రతీక్షిస్తున్నాడు. అదే సమయంలో నవరత్నాలలో మరొకరైన వరరుచి ప్రవేశం.)

క్షపణకుడు : (ఉత్సాహం నిండిన గొంతుతో) రండి – రండి! శాస్త్రవేత్తలయిన వరరుచి గారు, బహుశా ఈ మధ్య ప్రాకృత భాషలో మరొక గ్రంథం రచించడంలో తమ సమయాన్ని బాగా వెచ్చిస్తున్నట్లున్నారు… ఉదయం క్షిప్రా నదీతీరాన మిమ్మల్ని కలిసే భాగ్యం కలగలేదు.

వరరుచి : (చిరునవ్వుతో) నిజమే న్యాయశాస్త్ర కోవిదులైన క్షపణకులవారూ! ఒకొక్కసారి అలాగ కూడా జరుగుతూ ఉంటుంది.

క్షపణకుడు : అలా అంటే ఎలా?

వరరుచి : (హాస్యంగా) అదే, వెళ్లినా కలవలేక పోవడం!

క్షపణకుడు : (నవ్వేసి) మాటను దాటవేస్తున్నారు. రత్నవరేణ్యా!… బహుశా ఏదో గుప్తసాధనలో మునిగినట్లున్నారు.

(మరొక రత్నమైన ఘటకర్పరుడి ప్రవేశం)

ఘటకర్పరుడు : (స్వగతం) నేను అనవసరంగా ఆందోళన పడ్డాను. ఇక్కడ రాజాస్థానంలో చూస్తే సదస్యులు ఇంకా వేంచెయ్యనేలేదు. (బైటికి) మాళవ గణాధిపతి విక్రమాదిత్యుల వారి రత్న-ద్వయానికి ఘటకర్షరుడు అభివాదం చేస్తున్నాడు.

వరరుచి : (ఉత్సాహంగా) రండి రండి ఘటఖర్పర రత్నవర్యా! మీ ఆగమనం వలన సభకు ప్రాణమొస్తుంది!

క్షపణకుడు : (వరరుచితో కాస్తంత వ్యంగ్యంగా) లేని పక్షంలో ఇక్కడ రహస్యపు నీడ ఏదో పరుచుకున్నట్లుంది!

ఘటఖర్పరుడు : (వరరుచితో) ఉజ్జయిని ప్రాణ-రక్షకుడు రత్నవరేణ్యుడైన ధన్వంతరి కదా… మరి నామీదెందుకు నింద మోపడమో?

వరరుచి : (క్షపణకుడి వ్యంగ్యాన్ని అర్థం చేసుకుని, తనని తను సంబాళించుకుంటూ) సజీవంగా ఉండే ప్రాణాలను నిర్జీవం కాకుండా రక్షించేది, కవిత్వం…. ఆ కవిత్వం మీద ఆధిపత్యం మీదేగా!

ఘటఖర్పరుడు : ఆధిపత్యం ఉండొచ్చుగాక! కాని ఏకాధిపత్యం అయితే లేదు.

(క్షపణకుడి వంక తిరిగి, అభినయిస్తున్నట్లు) ఓ న్యాయవిదుడైన క్షపణకుడా! న్యాయం జరిపించండి. ఈనాడు ప్రజల నాలుకలపైన మహాకవి కాళిదాసు నిల్చిపోయాడు… ఆయన ఉజ్జయినిలో ఉన్నా, కాశ్మీరం ఉన్నా… నిజానికి ఎక్కడున్నా వేదికకు కేంద్ర బిందువు ఆయనే! అదీ ఏకాధిపత్యం అంటే…

క్షపణకుడు : (నవ్వుతూ) ఈనాడు మీరు ఇంత శీఘ్రంగా పరాజయాన్ని స్వీకరించేసారు?

(నాటకీయ ధోరణిలో) ఒక్క యమకాలంకరంతో ఒక మహాగ్రంథాన్నే పూర్తిగా రచించిన ఆ ఘటఖర్పకుల వారి నోటనేనా నేనీమాట వింటున్నది? అంతేనా? ఇంకెవరైనా ఇటువంటి మహాగ్రంథాన్ని వ్రాసి చూపిస్తే ‘నేను నా ఇంటినుండి, అలా వ్రాసిన వారి ఇంటి వరకూ ఓటికుండలో నీరు నింపి తీసుకువెళ్తానని’ పందెం కాసిన వారేనా ఈనాడు ఇలా మాట్లాడుతున్నది?

ఘటఖర్పరుడు : (గొంతుకలో కొద్దిపాటి నిరాశ ధ్వనిస్తూండగా) ఈ మాటలకేముంది? ఏమీ లేదు! సాఫల్యతకు గీటురాయి కీర్తి! కాని ఆ కీర్తి మాత్రం అదృష్టవంతులకే లభ్యం!

వరరుచి : (ఘటఖర్పరుడి నిరాశను తగ్గించేందుకు ప్రయత్నిస్తూ) కాని మీరు…

ఘటఖర్పరుడు : (గంభీరంగా) అవన్నీ గడచి పోయిన విషయాలు. నేను, వాస్తవం – ఊహ అనే ద్వంద్వవైఖరుల కందకం నుండి బైటకు వచ్చేసేను. ఈనాడు దేశానికి విజ్ఞానపరమైన తెలివి తేటలతో బాటు, కొత్త – కొత్త విషయాలను కనుక్కోవడం కూడా అంతే ముఖ్యం!

వరరుచి : అందులో మాత్రం మీరేమీ వెనకకు ఉండిపోలేదు కదా! దేశంలో నలుమూలలా జరిగే శాస్త్రీయ పరిశోధనలన్నీ మీ మార్గదర్శకత్వంలోనే అవుతాయి కదా! మీ ఇంట, బానల్లో తగరం ధాతువుల నిలవలు నానాటికీ పెరుగుతున్నాయని విన్నాను. (నవ్వుతూ) ఘటఖర్పర రత్నశ్రేష్ఠ!…. ఈ ఘటములంటే మీకెందుకో అంత ప్రత్యేకమైన ప్రేమ……!

(మరొక రత్నమైన ధన్వంతరి ప్రవేశం)

క్షపణకుడు : ఆయుర్వేదంలో తిరుగులేని పండితుడు, జ్ఞాని, నవరత్నాలలో ఒకరైన ధన్వంతరిగారు కూడా వేంచేసేరు. ఆరోగ్యానికి మారుపేరైన ఈయననే అడిగి సందేహ నివృత్తి చేసుకుందాం – ఆరోగ్యానికి యధార్ధం హెచ్చు లాభాన్ని చేకూరుస్తుందా లేక ఊహల వలన మనం ఎక్కువ లాభపడతామా అని!

ధన్వంతరి : ఈనాడు మాళవ రాజ్యగణాధీశుడు ఏమైనా ఆలస్యంగా వస్తారన్న సమాచారం అందిందా? ఆయన సభారత్నాలు ఇన్ని వినోద ప్రసంగాలు చేస్తున్నారు?

క్షపణకుడు : (వినమ్రంగా) క్షమించండి మహాత్మా! మాళవగణాధీశులలో వరిష్టులైన రత్నవర్యునితో పరిహాస మాడటం మా అభిమతం ఎంత మాత్రం కాదు!

ధన్వంతరి : సరే వినండి… ఆరోగ్యం అంటే సమతౌల్యం …. పంచభూతాల సమ్మేళనం – సమతౌల్యం… వాత-పిత్త కఫాలనే త్రిదోషాల మధ్య సమతౌల్యం. పృథ్వీ నుండి ఆకాశానికి, ఆకాశం నుండి పృథ్వీవరకూ నిరంతర ఆరోహ – అవరోహణలు యదార్థం – ఊహాలు. ఈ యదార్థం – ఊహల నడుమ కూడా సమతౌల్యం ఉండాలి. యధార్థాన్ని ఔషధులతో ఉపచారం చెయ్యవచ్చు. కాని అప్పుడప్పుడు మనస్సులో ప్రాణాల సంచారం కేవలం కల్పనల వలన, స్వప్నాల వలనే సాధ్యం. అయితే, అక్కడ కూడా అదే సమతౌల్యత… (పార్శ్వ భాగం నుండి ద్వారపాలకుడి కంఠం గట్టిగా వినిపించడంతో అందరూ ఆశీసునులై సావధాన చిత్తులై మాళవగణాధిపతికై నిరీక్షిస్తుంటారు!)

ద్వారపాలకుడు : (పార్శ్వంలో) “పరమ భట్టారక, ఆయుష్మంత, సాహసాంక మాళవగణాధిపతి చంద్రగుప్త విక్రమాదిత్యులవారు విజయం చేస్తున్నారహో! “

(విక్రమాదిత్యుని ప్రవేశం. వదనంపైన విరక్తితో కూడిన బాధ కానవస్తోంది! అందరూ లేచి నిల్చుని ఆయనకు అభివాదం చేస్తారు. వారిని ఆశీనులు కమ్మని సైగ చేసి, ఆయన తన సింహాసనం వైపుగా అడుగులు వేస్తాడు. ఆయన నవరత్నాలలోని వారు ఆశీసునులవుతారు గాని, విక్రమాదిత్యుడు మాత్రం సింహాసనం అధిరోహించక వెను తిరిగి అటూ ఇటూ పచార్లు చేస్తూంటారు.)

విక్రమాదిత్యుడు : (ధన్వంతరి వద్ద ఆగి) క్షమించాలి… మీరంతా నాకై నిరీక్షిస్తూ ఉండిపోయారు కదా… ఏం చెయ్యను?…. ఈనాడు మనస్సు స్థిరంగా లేదు (కాస్తంత ముందుకొచ్చి) మహాకాళేశ్వరుడి హారతిని దర్శించుకుని, మరల క్షిప్రానదీ తీరానికి వెళ్లాను. ఒంటరిగా బాధపడటానికి కూడా ఎవరూ అవకాశం ఇవ్వరు. చుట్టూ మనుషులు చుట్టు ముట్టి ఉంటారు ఎల్లవేళలా.

వరరుచి : మహారాజా! ఏదైనా ప్రత్యేకమైన చింత వెంటాడుతోందా?

క్షపణకుడు : సేవ చేసుకునే అదృష్టాన్ని కలగజెయ్యండి మహారాజా!

విక్రమాదిత్యుడు : (ధన్వంతరి వంక చూస్తూ) మీరేమీ అనరా?

ధన్వంతరి : (గంభీరమైన గొంతుకతో) మీరు వేంచేయడానికి ముందు ఇదే చర్చ నడుస్తోంది. ముందుగా మనం ఆలోచించవలసినది సమస్య నిరుత్సాహమా లేక క్లేశమా అని! మీరు మానసికంగా నిరుత్సాహులయినారా లేక ఏదైనా విషయం వలన బాధననుభవిస్తున్నారా? అన్నది గమనించాలి మహారాజా!

విక్రమాదిత్యుడు : (తనను తాను అదుపు చేసుకుంటూ) ఈ మాటల వలన ఏం ప్రయోజనం?…. శాసన భారాన్ని వహించే వ్యక్తికి, తన వ్యక్తిగత మనోదశలను గురించి ఆలోచించడం, అతనికి మొదటి ప్రాథమిక అంశం కాదు. కానేరదు. (తిరిగి వచ్చి సింహాసనంపైన ఆశీసునుడవుతాడు.) గౌడ ప్రదేశంలో ఎడతెరిపి లేని వర్షాల వలన నాలుగు వైపులా త్రాహి-త్రాహి మంటున్నారు ప్రజలు. అన్ని విధాలయిన ప్రయత్నాలకూ గండి పడుతోంది. ధన నష్టంతోబాటు అపార జన నష్టమూ వాటిల్లుతోంది. పునరావాస ప్రయత్నాలన్నీ దాదాపు నిష్ఫలమే అవుతున్నాయి! ఇదేం గ్రహస్థితి? ఇదేం నక్షత్రాల – కలయికో అర్థం కావటం లేదు! (హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు) ఆచార్య వరాహ మిహిరుల వారు వేంచేయలేదా? ఆయన ఇన్నాళ్లుగా ఎందుకు రాలేదో?

ఘటఖర్పరుడు : బహుశా మాళవ గణాధీశులవారు తమ చింతలలో మునిగిపోవటం వలన, మీరే ఆయనకి ఒక బృహద్ అనువాద కార్యాన్ని చేసే భారాన్ని అప్పజెప్పిన విషయం పరాకున పడినట్లున్నారు. ఆయన ఎక్కడో ఏకాంతంలో తన పనిని పూర్తి చేస్తున్నట్లున్నారు.

విక్రమాదిత్యుడు :- (ఏదో పొగొట్టుకున్న భావంతో) అనువాద కార్యం!

ఘటఖరరుడు :-ఫారస దేశ నరేషుడి కోరిక మేరకు ఆచార్య వరాహమిహిరుల వారిని పంచతంత్రాన్ని పహలవీ భాషలో అనువదించమని అభ్యర్థించడం జరిగింది కదా మహారాజా!

(విక్రమాదిత్యుడు ఆగి, ఘటఖర్పరుని వంక చూస్తూ జ్ఞాపకం చేసుకునేందుకు గట్టిగా ప్రయత్నించి)

విక్రమాదిత్యుడు : ఔను…. అదే జరుగుతూ ఉండి ఉంటుంది…. నిస్సందేహంగా ఆయన ఏదైనా పనిని చేతిలోకి తీసుకుంటే, అది ఆయనకు ఏకాగ్ర సాధనంగానే మారుతుంది. ఆయనను ధృవీకరించినట్లు అవుతుంది. అందుకే ఏ విషయ సంబంధ క్షేత్రంలోకి ప్రవేశించినా, దానిలో శిఖరాగ్రానికి చేరుకుని చూపిస్తారాయన! (ఏదో గూఢాలోచనలో మునిగి) మనసులో ఒక ఆలోచన వస్తోంది…. (కాస్తంత ఆగి, తిరిగి) ఆచార్య వరాహమిహిరుల వారినే అడగనా… ప్రకృతి తత్త్వాలలో ఈ ఉత్పాతాలేమిటి అని? గ్రహాల మధ్య ఎలాంటి యుద్ధం ఆరంభమయింది? జలమే జీవితం కదా! మరి ఏ నక్షత్రాలు అదే జలాన్ని వినాశన మనే ఎత్తైన తీరానికి నెట్టేస్తున్నాయి?

ధన్వంతరి : ఆయన ఊరు కాపిత్థకం ఇక్కడి నుండి పెద్ద హెచ్చు దూరం కాదుగా మహారాజా! మాళవ గణాధిపతుల వారు కావాలంటే ఆయనను ఈనాడే ఇక్కడికి….

(విక్రమాదిత్యుడు ఆగమన్నట్లు చేతితో సైగ చేసి)

విక్రమాదిత్యుడు : గౌడప్రదేశానికి సంబంధించిన విస్తృతమైన సమాచారంతో నిన్నరాత్రే చేరుకున్నారు. యథార్థ సామగ్రిని కూడా కొంత తెచ్చుకువచ్చారు. ముందుగా మీరందరూ ఈ విషయాలపైన మీరు మీ-మీ ప్రత్యేక వ్యాఖ్యలను ఇవ్వవలసిందిగా నేను కోరుకున్నాను!

(విక్రమాదిత్యుడు రంగస్థలంపై నుండి నిష్క్రమణ! నవరత్నాలు కూడా ఆయన ఇలా భిన్నవదనుడై వెళ్లడం చూసి లేచి నిల్చుంటారు. ఒకరినొకరు గంభీరంగా చూసుకుని, వారూ నిష్క్రమిస్తారు. మాళవ గణాధీశుల వారి ఉదాసీనత చుట్టూ ఉన్న వాతావరణం అంతటిపైనా పడుతుంది.)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here