నేపథ్య రాగం – నాటకం – దృశ్యం 9

1
2

[box type=’note’ fontsize=’16’] యుగ-యుగాల నుండి ఈ సంఘమనే రంగస్థలంపైకి వచ్చి కనబడాలని, వినబడాలని నిరంతరం సంఘర్షణ చేస్తున్న ఒక సన్నని రాగం కథే ఈ ‘నేపథ్య రాగం’.. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]

దృశ్యం-9

[dropcap](సం[/dropcap]ధ్యా సమయం. విక్రమాదిత్యుని రాజమందిరం. ఒక వంక అందంగా అలంకరించబడిన పీఠం ఉంది. ఎదురుగా నగిషీలు చెక్కిన చెక్క ఉయ్యాల! గోడపైన రత్న ఖచితమైన దర్పణం కనిపిస్తోంది. ప్రతీహారి దీపాన్ని వెలిగించి తీసుకురావడంతో అంతవరకూ చీకటిగా ఉన్న ఆ ప్రదేశం అంతటా కాంతిపరుచుకుంటుంది. అదే సమయంలో రెండవ వైపు నుండి విక్రమాదిత్యుడు – మహాదేవి కలిసి ప్రవేశిస్తారు.)

మహాదేవి : (ఎంతో ఆనందోత్సాహాలతో ప్రసన్నంగా) సంధ్యా సమయంలో విశాలాకాశం కింద కాసేపు విహారించకపోతే, ఏదో కొఱత ఏర్పడినట్లుంటుంది.

విక్రమాదిత్యుడు : (ఆలోచనల్లో మునిగినట్లు) అంతేకదా!

మహాదేవి : (దెబ్బతిన్న స్వరంలో) అంత అన్యమనస్కంగా అంటున్నారేం?

విక్రమాదిత్యుడు : అలాటిదేమీ లేదు… సరే మీరు చెప్పండి మహారాణీ! మీ మూడో ఝాము ఎలా గడిచింది? ఎలా అనిపించింది?

(కూర్చుంటాడు)

మహాదేవి : (వినోదంగా) నా మూడో ఝామా?

(మెడను ‘కాదు’ అన్నట్లు తిప్పి, దగ్గరే గోడకున్న దర్పణంలో తనని తాను చూసుకుంటూ) బహుశా ఇప్పుడే నా మూడో ఝాము…

(వెనక్కు తిరిగి విక్రమాదిత్యుని వంక చూస్తుంది.)

విక్రమార్కుడు : (ఖిన్నుడయినట్లున్న ముఖంమీద చిరునవ్వును తెచ్చుకుని) నా ఉద్దేశ్యం, మీ మందిరంలో ఖనాతో మీరు కలవడం, సంభాషించడం ఎలా అనిపించింది అని!

(మహాదేవి ఆసీనురాలవుతుంది.)

మహాదేవి : మేధావి… అధ్యయనం చేసింది… చక్కని ఆలోచనలు… స్వతంత్ర భావాలు…

(ఏదో ఆలోచిస్తూ ఉంటుంది.)

విక్రమాదిత్యుడు : (వాక్యాన్ని పూర్తి చెయ్యాలని ప్రయత్నిస్తూ) అంతర్దృష్టి కలది!

మహాదేవి : ఆమెను కలవడం చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇలాంటి చర్చలు జరుగుతూ ఉండాలనే అనుకుంటున్నాను.

(ప్రశ్నార్థకంగా విక్రమార్కుని వంక చూస్తుంది.)

విక్రమాదిత్యుడు : (చిరునవ్వుతో) నాకు తెలుసు మహారాణీ! ఆమె చురుకుదనం మీమీద తప్పక ప్రభావం చూపుతుందనే అనుకున్నాను.

(మహాదేవి విక్రమార్కుడిని నిశితంగా పరిశీలిస్తూ)

మహాదేవి : (ప్రసన్న స్వరంతో) మీరు అలా భావించేరా?

విక్రమాదిత్యుడు : అందుకే ఆ యువ ప్రతిభ విక్రమాదిత్యుని రాజసభ శోభను మరింత ఇనుమడింపజేయాలని నిర్ణయించుకున్నాము.

మహాదేవి :- (ఆశ్చర్యంగా) మహారాజా…..

విక్రమాదిత్యుడు : (తన పలుకులను జాగ్రత్తగా సంబాళించుకుంటూ) అంటే మా అభిప్రాయం ఆమె సభాసదులలో ఒకరిగా… ఖనాదేవి సభాసదురాలిగా దేశానికి సహకారం అందించాలని!

మహాదేవి : (తేలికగా ఊపిరి పీల్చుకుని, అటుపైన ప్రసన్నంగా) మహారాజుల వారిలో చక్రవర్తి సామ్రాట్టుకు ఉండవలసిన గుణాలన్నీ నాకు గోచరమవుతున్నాయి – ఒక్క ఝాము సమయంలోనే ఇంతటి చారిత్రిక నిర్ణయాన్ని తీసేసుకున్నారు!

విక్రమాదిత్యుడు : అహాఁ! అదేం కాదు. గౌడదేశ క్షత్రపుని హత్య జరిగిన తరవాత నుండి ఈ ఆలోచన మనసును చుట్టుముడుతూనే ఉంది.

మహాదేవి :- ఈ నిర్ణయం నిజంగానే చారిత్రక నిర్ణయమే అవుతుంది. మీరు ఈ ఆలోచనను ఎవరితోనైనా పంచుకున్నారా? అంటే నా అభిమతం సభాసదులెవరితోనైనా….

విక్రమాదిత్యుడు : ఆచార్య వరాహమిహిరుల వారి వద్ద కేవలం ప్రస్తావించడం జరిగింది అంతే! కాని రాజసభలో నవరత్నాలతో చర్చించాలి.

(కాస్త ఆగి ఇటు-అటూ పచార్లు చేస్తూంటాడు) నిర్ణయం అద్భుతమైనదే… వివాహితురాలు, జ్ఞానమార్గంలో ముందుకు పోయే ఒక మహిళను ఎవరు ఎంత స్వాగతించి సభాసదురాలిగా స్వీకరిస్తారో తెలియదు.

మహాదేవి : అందులోనూ పెద్ద వయస్సున్న స్త్రీ కూడా కాదు…

(విక్రమాదిత్యుడు మహాదేవి కళ్లను చదివే ప్రయత్నం చేస్తూండగా, మహాదేవి తనను తాను నిగ్రహిచుకుంటూ)

ఈరీతిలో ఏ స్త్రీనైనా స్వాగతించగలగడం అన్నది సర్వసాధారణమైన విషయమేమీ కాదు!

విక్రమాదిత్యుడు : (ఆలోచనలలో మునిగిపోతూ) ఊఁ!… అధికార కేంద్రంలో ఒక యువతి! అదీ తన మేథో ప్రతిభ ఆధారంగా….!

మహాదేవి :- మీ మనసులోనైతే ద్వైదీ భావం ఏమాత్రం లేదుకదా?

విక్రమాదిత్యుడు : (మహాదేవి కళ్లలోకి లోతుగా చూస్తూ) ఎంతమాత్రమూ లేదు మహారాణీ!

మహాదేవి :- ఐతే మీరు నిశ్చింతగా ఉండాలి!

(అప్పుడే ప్రతీహారి ప్రవేశం)

ప్రతీహారి : క్షమించాలి మహారాజా… చరణాద్రి దూత మిమ్మల్ని కలవడానికి నిరీక్షిస్తున్నారు. వారిని రేపు రమ్మని ఆదేశమా మహారాజా?

విక్రమాదిత్యుడు : (స్వగతం) అయ్యో! ఈ దూత భోజన విరామ సమయం నుండి నిరీక్షిస్తున్నట్లునాడు. నాకేమయింది?

(ప్రతీహారితో) లేదు లేదు, ఇప్పుడే అతను తెచ్చిన సందేశాన్ని వినాలి. (మహాదేవితో) వెళ్లోస్తా మహారాణీ!

(విక్రమాదిత్యుడు, ప్రతీహారిల నిష్క్రమణ)

మహాదేవి : (విక్రమాదిత్యుడు నిష్క్రమించిన దిశగా చూస్తూ) వెళ్లండి మహారాజా! కాని మీ అడుగులు కూడా పూర్తి నమ్మకంతో ముందుకు పడటంలేదు మహారాజా! మీ మనసు కూడా ద్వంద్వంతో ఊగిసలాడుతోంది.

(ప్రేక్షకుల వంక చూస్తూ ఆలోచిస్తున్న ధోరణిలో) మీ ద్వైదీ భావానికి కారణం, ఖనా పట్ల మీ హృదయంలో దాగి ఉన్న ఆకర్షణ కాదు కద!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here