మనదైన వ్యక్తిత్వ వికాస గ్రంథం ‘నేర్పుగా జీవించడం ఎలా!’

1
3

[dropcap]యు[/dropcap]వభారతి వారి పుస్తకాలు – చక్కని సాహిత్యాన్ని అందిస్తూనే, జీవన విలువలు నేర్పుతాయి. అటువంటి పుస్తకాలలో ఒకటి ఎర్రాప్రగడ రామకృష్ణ సృజించిన ‘నేర్పుగా జీవించడం ఎలా!’. చిన్న పుస్తకమైనా, అత్యంత ప్రభావవంతమైనది. యువభారతి వారి ఇతర గ్రంథాల వలే ఇది కూడా పాఠకులకు మనసుపై మంచి ముద్రని వేస్తుంది. ఈ గ్రంథం యువభారతి వారి 197వ ప్రచురణ. 21 వ్యాసాలున్న ఈ పుస్తకం మంచి జీవితానికి చక్కని మార్గం చూపుతుంది.

మన పురాణేతిహాసాలలోని పాత్రల ద్వారా, భగవద్గీత ద్వారా, రామాయణ భారతాల ద్వారా ఏం నేర్చుకోవచ్చో, ఎటువంటి సద్గుణాలు అలవర్చుకోవచ్చో, విపత్కర పరిస్థితులను ఎలా తట్టుకోవచ్చో తెలిపే వ్యాసం ‘ప్రాచీన వాఙ్మయంలో వ్యక్తిత్వ వికాసం’.

వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకునేందుకు గొప్ప ప్రేరణ శ్రీకృష్ణుడని చెబుతుంది ‘మోటివేటర్ పాత్రలో శ్రీకృష్ణుడు’ అనే వ్యాసం. మనిషి ఎన్నో సందర్భాలలో చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో పడతాడనీ, అప్పుడు శ్రీకృష్ణుడు బోధించిన పాఠాలు మనకు దారి చూపుతాయని ఈ వ్యాసం చెబుతుంది. శ్రీకృష్ణుడి నుంచి ఎలా స్ఫూర్తి పొందాలో తెలియజేస్తుంది.

మనిషి ప్రవర్తనకి మూలాలు అతను గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ఏర్పడతాయని ‘లోపలి గాయాల ప్రభావం’ అనే వ్యాసం తెలుపుతుంది. పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతంగా జన్మించాలంటే – తల్లి కాబోతున్న మహిళని ప్రేమగా చూడాలని, ఆదరించాలని ఈ వ్యాసం చెబుతుంది. ఇందుకు ఉదాహరణగా ప్రహ్లాదుడు కడుపులో ఉన్నప్పుడు అతని తల్లి లీలావతి ప్రవర్తనను చూపుతుంది. గర్భస్థ దశలో తల్లి ఎంత ప్రశాంతంగా ఉంటే, జన్మించే పిల్లలలో అంత సానూకుల దృక్పథం అలవడుతుందని చెబుతుంది.

ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస గ్రంథం కాబట్టి, ‘అతడు’ సినిమాలోని ఒక సన్నివేశాన్ని ఉదహరిస్తూ ప్రారంభమవుతుంది ‘ప్రహ్లాదుడి కథ’ అనే వ్యాసం. తల్లిదండ్రుల నుంచి పిల్లలు మంచీ చెడూ ఎలా నేర్చుకుంటారో ఈ వ్యాసం చెబుతుంది. రాక్షస పుత్రుడైన ప్రహ్లాదుడు తల్లి నుంచి హరిభక్తి అలవర్చుకున్న వైనాన్ని మరోసారి గుర్తు చేస్తూ ఎన్నో శాస్త్రీయ అంశాలను ప్రస్తావిస్తుందీ వ్యాసం.

‘నేను’, ‘నాది’ అనే అహంకారాన్ని వదులుకోవడమే యజ్ఞమని అంటుంది ‘ఏదీ మనది కానిదే!’ వ్యాసం. అహంకార మమకారాదులను ఆహుతి చేసే ఒక మహోన్నత త్యాగభావనని శ్రీకృష్ణుడు బోధించాడని ఈ వ్యాసం చెబుతుంది.

సృష్టి లోని సమస్తమూ భగవంతునికి చెందినదని, దానికి ఆయనే అధినేత అని తెలియజేస్తుంది ‘అసలు నిజం’ వ్యాసం. తనకి కావలసినది ఎంతో మనిషి తెలుసుకోవాల్సిన అవసరాన్ని చాటుతుందీ వ్యాసం. అది తెలుసుకుంటే మనిషికి జీవితంలో అసంతృప్తి ఉండదు.

నేటి కాలంలో ఎవరూ పెద్దగా ఆలోచించని అంశం – ‘విజయమా? విలువలా’ అనేది. ఎలాగైనా నెగ్గాలి అనే తపనలో విలువలని వదిలేస్తున్నారు. అయితే ఐన్‍స్టీన్ చెప్పినా, మహాత్మా గాంధీ చెప్పినా సిధ్ధి కన్నా సాధనాలు ముఖ్యం అని అందరూ గ్రహించాలి. విలువలతో కూడిన విజయం నేటి అవసరం అంటుందీ వ్యాసం.

‘తెలియడం అంటే ఏమిటి?’ అనేది గొప్ప వ్యాసం. ఎవరికి వారు వేసుకుని జవాబు రాబట్టుకోవాల్సిన ప్రశ్న. మంత్రం అంటే ఏమిటో వివరిస్తుందీ వ్యాసం.  To know that we known what we know and that we don’t know what we don’t know is the knowledge అనే గొప్ప సూక్తితో ముగుస్తుందీ వ్యాసం.

హిరణ్యకశిపుడి భార్య లీలావతి ఎంతటి నేర్పు కలదో ఒక వ్యాసం చెబుతుంది. భర్తతో నేర్పుగా నారాయణ జపం చేయించిన వైనం, ఆ సమయంలో ఆమె గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు హరినామాలు ఆలకించడం ఈ వ్యాసం వివరిస్తుంది. ఇంకా ఈ వ్యాసంలో ఆధునికులను ఆకట్టుకునేందుకు సందర్భోచితంగా ‘సతీ లీలావతి’ సినిమా ప్రస్తావన తెస్తారు రచయిత.

నిజమైన విజయమేదో చెబుతుంది ‘గెలుపు’ వ్యాసం. యుద్ధమంటే ఏమిటో, నిత్య జీవితంలో సమస్యలపై మనం జరిపే పోరాటం కూడా యుద్ధమేనని చెబుతుంది. యుద్ధాలను గెలవాలంటే ఆయుధాలే అక్కరలేదంటూ ముగుస్తుందీ వ్యాసం.

కాలం కలిసొచ్చి యాధృచ్ఛికంగా పేరు ప్రతిష్ఠలు లభించడం-కొన్నిసార్లు అనుకోకుండా కొందరికి ఘనత దక్కడం జరుగుతుంది. అలాంటప్పుడు వినమ్రతని కోల్పోకూడదని, మనిషి కుదురుగా ఉండాలని ‘అనుకోకుండా’ అనే వ్యాసం చెబుతుంది. సందర్భోచితంగా అన్నమయ్య కీర్తనని ఉదహరించడం బావుంది.

ఆధ్యాత్మికతకి మొదటి బడి అమ్మ ఒడి! అమ్మానాన్నల దగ్గర నుంచే పిల్లలు ఆధ్యాత్మికతకి సంబంధించి -‘అ, ఆ’లు నేర్చుకుంటారనీ, పిల్లలకు నేర్పదలచుకుంటే ముందు తల్లిదండ్రులు సాధన చేయాలని ‘అనుకరణ’ అనే వ్యాసం చెబుతుంది. తల్లిదండ్రులు, గురువులే కాదు, సంఘంలో కాస్త మంచి పేరున్నవాళ్ళు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతుంది.

భారతీయ వాఙ్మయం విస్తారంగా చర్చించిన అంశం ఏమిటో ‘తపస్సు అంటే ఏమిటి?’ అనే వ్యాసం చెబుతుంది. తపస్సు అంటే ఏమిటో వివరిస్తుంది. తపస్సు ఫలితాలు ఎలా ఉంటాయో చెబుతుంది. ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’లో మాజీ రాష్ట్రపతి డా. అబ్దుల్ కలామ్ చెప్పిన దివ్యాగ్ని అనే భావనను మరింత విశదీకరిస్తుందీ వ్యాసం. మహావతార్ బాబాజీ గురించి, లాహిరీ మహాశయుల గురించి ప్రస్తావిస్తుందీ వ్యాసం.

‘చేత వెన్న ముద్ద’ వ్యాసం ‘ముత్యాలముగ్గు’ సినిమాలోని డైలాగ్‍తో మొదలవడం విశేషం. నిజంగా మనకేం కావాలో మనం ఎలా తెలుసుకోవాలో ఈ వ్యాసం సూచిస్తుంది.

‘గురువు-శిష్యులు’ గొప్ప వ్యాసం. అసలైన గురువుగా ఎలా ఉండాలో, ఒక శిష్యుడిగా ఎలా ఒదిగి ఉండాలో ఈ వ్యాసం చెబుతుంది. విశ్వాసమే ఆధ్యాత్మికతకి పునాది అని గుర్తు చేస్తుంది.

తెలుగు భాషలోని సొగసును, సోయగాన్ని తీపిని గమనించాలంటే ఎలాంటి వాళ్ళ పలుకులు వినాలో ‘మాట తిరగేయడం అంటే ఏమిటి?’ వ్యాసం తెలుపుతుంది. మాటతీరు బాగుపడడానికి ఆచార్య వ్యవహారాలకి సంబంధం ఉందని ఈ వ్యాసం ఉదాహరణలతో చెబుతుంది.

‘లౌక్యం అంటే ఏమిటి?’ వ్యాసం విజయా సంస్థకు ఆస్థాన రచయితగా ఉన్న పింగళి నాగేంద్రరావు గారి ఉదంతంతో ప్రారంభమతుంది. ఆయన లౌక్యంతో ఓ కేంటిన్ మేనేజర్ ఉద్యోగం ఎలా కాపాడారో చెబుతుంది. అసలైన లౌక్యుడు ఎవరో ఈ వ్యాసం చెబుతుంది.

ఈ ప్రపంచంలోని సుఖాలను, భోగాలను త్యాగబుద్ధితో అనుభవించాలనే ఈశావాస్య ఉపనిషత్ బోధనని చిన్న కథ ద్వారా చెప్పి ఆలోచింపజేస్తుంది ‘జీవన్ముక్తుడు’ వ్యాసం.

ఈ సృష్టి లేదా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, సరిగ్గా ఉపయోగించుకోవడానికి మనిషికి భగవంతుడు అందించిన ‘మాన్యువల్’ వేదవాఙ్మయమని చెబుతుంది ‘విజ్ఞాన వాఙ్మయం’ వ్యాసం. జటిలమైన వేదాంత రహస్యాలు సామాన్యులకు సైతం అర్థం అయ్యేందుకు ఉపమానాల సాయంతోనూ, కథల రూపంలోని వాటిని సులభతరం చేయాలని ఆదిశంకరాచార్యులు సూచించారని చెబుతుంది. భారతీయ వాఙ్మయాన్ని చదువుకోవలసిన పద్ధతిలో చదువుకుంటే – ఈ సృష్టిని అర్థం చేసుకోవడం మనకు సాధ్యమవుతుందని తెలియజేస్తుంది.

సత్యాసత్యాల మధ్య, ధర్మాధర్మాల మధ్య నిశ్చలంగా నిలబడి ఎలా ఒడుపుగా జీవించాలో ‘నేర్పుగా జీవించడం ఎలా?’ వ్యాసం తెలుపుతుంది.

ఆలోచనల భారం ఎంత ప్రమాదకరమో మరో వ్యాసం తెలుపుతుంది.

చిన్న చిన్న వ్యాసాలలో అద్భుతమైన సారాన్ని ఇమిడ్చి – అక్కడక్కడ సినిమాల ప్రస్తావన తెస్తూ – నేటి తరం పాఠకులని చదివింపజేస్తుందీ పుస్తకం.

***

నేర్పుగా జీవించడం ఎలా!
రచన: ఎర్రాప్రగడ రామకృష్ణ
ప్రచురణ: యువభారతి
పుటలు: 80
వెల: ₹ 100/-
ప్రతులకు:
యువభారతి,
తెలంగాణ సారస్వత పరిషత్ భవనములు
తిలక్ రోడ్, హైదరాబాద్ 500001.
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా చౌరస్తా, హైదరాబాద్. 91-9000413413, 040-24652387

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here