నేటి సిద్ధార్థుడు-2

    0
    2

    [box type=’note’ fontsize=’16’] బాలల కోసం సంచిక ప్రత్యేకంగా అందిస్తున్న సీరియల్ సమ్మెట ఉమాదేవి రచించిన “నేటి సిద్ధార్థుడు”. ఇది రెండవ భాగం. [/box]

    4

    [dropcap]ఆ[/dropcap]నంద విహారిణి ఉద్యానవనంలోని విద్యా మందిరంలో ఎప్పటి వలెనే గురువు ముందు కూర్చుని ఉన్నాడు సిద్ధార్థుడు.

    “కుమారా..! అన్ని విద్యలందు మంచి ప్రతిభ పాఠావాలను చూపి గురువుకుతగ్గ శిష్యుడని నాకు పేరు తెస్తున్నావు నాయనా.  అట్లాంటిది ఇప్పుడు ఎందులకు అట్లా మౌన గంభీరంగా కూర్చుని ఉన్నారు..?” జ్ఞానముని అడిగారు

     “గురువర్యా..! మీ బోధనా చాల ఆసక్తికరంగా ఉన్నది. పండిత చర్చలు బహుబాగా జరిగినవి. కానీ సముద్రము గురించి చెప్పువేళ అది అనంత జలరాశి అని, కడ లేనిది అని, ఆ కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడతాయని, వాటి నురుగు పాలవలే ఉంటుందని, ఆ కెరటాల హోరు చాలా పెద్ద శబ్దాన్ని కలుగచేస్తుంటాయని, ఇలా ఎన్ని విధాలుగానో చాల సేపు వర్ణించారు. కానీ సముద్రాన్ని ఒక్కసారి ప్రత్యక్షంగా చూపి అప్పుడు దాని విశిష్టత చెబితే ఆ ప్రత్యక్షానుభవం ద్వారా చాల సులువుగా విషయజ్ఞానం కలుగుతుంది. అప్పుడు ఏ పండితులు మమ్ములను నిలదీయరు కదా.” అని అన్నాడు.

     “కుమారరాజా..! వారు సదాశివ పండితుల మాటలకు చిన్నబుచ్చుకున్నట్లుగా ఉన్నారు. పెద్దలు ఏదయినా అన్నప్పుడు మన మంచికే అని గ్రహించాలి గాని బాధ పడవలదు సుమా..” జ్ఞానముని ఓదార్పుగా అన్నారు

     “లేదు గురువర్యా..! బాధ పడడం లేదు. అందులోని వాస్తవాలను గురించి లోచిస్తున్నాను. పెద్దలు ఊరికే మాట వదలరు కదా..”

     “అయితే ఇప్పుడు మీకు సముద్రం చూడవలెనని ఉన్నదా..! పుత్రా..?”

     “అవును గురువర్యా..! జన సముద్రం చూడవలెనని ఉన్నది.”

    “నా చిన్ననాట మా తండ్రిగారి పూజల సమయమున, వారి జన్మదినముల సమయమున, పండుగలు వేడుకల సమయమున.. ఉత్సవముల సమయమన మాత్రమే ప్రజలను చూసాను. నాకు ప్రజలంటే జయ జయ ద్వనాలు చేసే అనుచరులుగానే తెలుసు. నిజంగా ఎండా, వాన, చలి అనుభవించలేదు. మా తండ్రిగారితో కాకుండా వంటరిగా ప్రజల మధ్యకు వెళ్లవలెనని ఉన్నది.”

    “కుమారా..! మీ కోరిక అనుచితం కాదు కానీ . రాజయిన వాడు ఏనాడూ తగు రక్షణ లేకుండా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళలేడు. శత్రుమూకలు ఏ నిమిషములోనయిన దాడి చేయవచ్చు. అందునా మీరింకా పసివారు. మిమ్ములను వంటరిగా ఏనాడు వదలరు. మీకు నగరసంచారం చేయవలెనని ఉన్న ఎడల తప్పక వెలుదురుగాని అయితే వంటరిగా మాత్రం కాదు. మీ వెంట నేనూ వస్తాను.

    “గురువార్యా..! మేము బయటకు వెళ్ళవలెనన్న మా తండ్రిగారు రధమునో, పల్లకినో ఏర్పాటు చేస్తారు. మందీ మార్బలాన్ని ఏర్పాటుచేస్తారు ఇవేమీ వద్దు. మనం కేవలము అశ్వముఫై కానీ, గుర్రపు బండిఫైనగాని వెల్దాము. అది కూడా మారువేషములో వెళదాము.”

    “కుమారా.! మీ కోరికను మీ తండ్రిగారికి తెలియచేస్తాను. వారి అనుమతి తీసుకుందాము.”

    “చిన్న సవరణ గురుదేవా..! తండ్రిగారికి తెలియపరుద్దాము. కానీ వారు అనుమతించినా, అనుమతించకున్నా నేను ప్రజల మధ్యకు వెళ్లితీరుతాను.”

    “రాజ్యం అంటే కేవలము ప్రదేశము, ప్రభుత్వమే కాదు ప్రజలు అని మీరు ఏనాడో చెప్పారు. ఇప్పుడు సదానంద గురువుగారు కూడా గుర్తు చేశారు. మరి ఆ ప్రజలను నేను తప్పక కలవాలికదా..! వారు ఉన్న ప్రదేశాలను నేను పర్యటించాలి కదా” సిద్ధార్ధుని గొంతులో స్థిరమయిన నిర్ణయం ధ్వనించింది.

    “సరే కుమారా..! ఇక విశ్రమించండి. మంచిరోజు చూసుకుని బయలుదేరుదాము..”

     “గురువర్యా.! మంచి పనులు సంకల్పించినప్పుడు ముహూర్తంతో పని లేదు. చెడుపనులను ఏ ముహూర్తములోనూ తలపెట్టరాదు అని మీరే కదా సెలవిచ్చారు..”

    జ్ఞానముని చిరునవ్వుతో “సరే. ఇక మీరు మందిరమున కేగి కాస్సేపు నిదురించండి. అతి త్వరలో మనము చేయబోవు సంచారమునకు సిద్దముకండి..”

    * * *

    విషయమంతా సిద్దార్ధుని సోదరి వాసంతికకి కూడా తెలిసి తన తమ్ముడు నగరసంచారం చేయు విషయము గురించి ఆలోచనలో పడింది. వాసంతిక చాల తెలివయినదని శశాంక మహారాజుకు చాలా నమ్మకము. అంతే కాదు చాల చిన్నతనంలోనే చురుకుగా విద్యలెన్నో అభ్యసించిందామె. అంతేకాకా పెద్దలంటే ఎంతో వినయం ఉన్న అమ్మాయి. సిద్దార్థునకు కూడా తన అక్క దగ్గర చాల చనువు. తానూ గ్రామ పర్యటనచేయ దలుచుకున్న విషయము తానే అక్కతో ప్రస్తావించాడు. వాసంతిక తమ్ముని మనోగతమంతా చాల ఓపికగా విన్నది.

     “సోదరా..! నీ కోరిక అసమంజసమయినదేమీ కాదు కదా..! అటువంటప్పుడు తండ్రిగారికి ఎరుక పరుచుటలో తప్పేమున్నది.? రాజుగాని, రాచ కుటుంబంగాని ఏ పనిచేసినా దానీ ప్రభావం ఎక్కడో ఒక చోట ప్రజలమీదా, దేశంమీద పడుతుందని గురువుగారు చెబుతుంటారు. నీవు ఇలా నగరసంచారం చేస్తున్న విషయము మన తండ్రిగారికంటే ముందు శత్రువులకు తెలిస్తే అది మనకు మన క్షేమానికి మంచిది కాదు. అందువలన తప్పకుండా తల్లిదండ్రుల అనుమతితో నీ కోరిక తీర్చుకొనుము.” అని హితవు పలికింది. అతనిని ఎక్కడా నిరాశపరుచకుండా పలు జాగ్రత్తలు, సలహాలు చెప్పింది.

    5

     శశాంకవర్మ మహారాజు, మాలినిదేవి పూజలు ముగించుకుని రాచమందిరానికి చేరుకున్నారు. వేగులవారు రాజుగారి కోసం ఎదురు చూస్తున్నారు. రాజు సింహాసనం మీద ఆసీనుడయినాడు.

    ప్రతీరోజు కుమార రాజావారి విద్యాభ్యసము గురించి అతని దినచర్యల గురించి రాజుగారికి ఎప్పటికప్పుడు తెలుపుటకు కొంతమంది వేగులవారిని ఆయన నియమించుకున్నారు. అందులోని వ్యక్తులే గుణాధీశుడు, గోపాలుడు.

    “రాజా..! కుమారరాజా వారి గురించి ఒక ముఖ్యమయిన సమాచారం ఇచ్చుటకు మీ బంటు గుణాధీశుడు సిద్ధంగా ఉన్నాడు.” గోపాలుడు అన్నాడు. రాజుగారు చెప్పమని చేయిఊపారు.

    “మహారాజా..!మొన్న జరిగిన మన ప్రతిభా పాటవ పరీక్షల అనంతరం రాకుమారులవారి మనసు చాలా చిన్నబుచ్చుకున్నది ప్రభూ.! సిద్ధార్థులవారు ఎప్పటివలే ఉత్సహంగా కాక దీర్ఘాలోచనలో మునిగి తేలుతున్నారు. సదానంద పండితులవారు సామాన్యుని జీవితమూ మీరేరుగుదురా..? ఏనాడయినా ప్రజల మధ్యకు వెళ్ళారా..? అని అడగడాన్ని సిద్దార్ధులవారు ఒక సవాలుగా స్వీకరించినట్లు కనపడుతున్నది..” గుణాధీశుడు చెప్తుంటే మహారాజు ఆశ్చర్యంగా వింటున్నారు.

     ఆనాడే ఆ సదానంద పండితుని శిక్షింపవలే నన్నంనంత కోపము వచ్చింది శశాంకవర్మకు. మా రాకుమారులవారినే తప్పుపడతారా..? అని ఆగ్రహం వెళ్ళగక్కబోయి శాస్త్రచర్చలు జరుగునప్పుడు ఒక రకమయిన తీవ్రత తప్పదని నిగ్రహించుకున్నారు. ఇప్పుడు గుణాధీశుడు ఇంకా ఏమి చెబుతాడా అని ఆందోళనగా ముందుకువంగి వినసాగారు రాజా వారు. గుణాధీశుడు కొనసాగించాడు..

     “గురువర్యా ..! సిద్ధార్థుల వారు ఇవ్వాళ.. విద్య గరపడం అంటే కేవలం నిరంతర గ్రంథపఠనం మౌన అధ్యయనం మాత్రమే కాదు, మనం నగర సంచారం చేద్దాము..” అని గురువుగారిని అడిగారు. ప్రస్తుతం సిద్ధార్థులవారు ఉన్నమానసిక స్థితిలో మనం ఆపినా ఆగరని గ్రహించిన గురువుగారు సిద్దార్థ రాకుమారులవారితో సరే అనినారు. జ్ఞానముని వర్యులు నగరసంచారం కొరకు మీ అనుమతి కొరకు వేచివున్నారు. రహస్యంగా రామన్న పంతులును మీ వద్దకు పంపనున్నారు. రాకుమారులు వారు ఇప్పటిదాకా మమ్ములను తోటమాలీలనే అనుకుంటున్నారు. ఎప్పటివలే సిద్ధార్థుల వారికి తెలియకుండా విషయం మీకు చేరవేయుటకు వచ్చినాము..” విషయమంతా వివరించారు వెళ్లిపోయారు. గుణాధీశుడు, గోపాలుడు.

    శశాంకవర్మ దీర్ఘాలోచనలో పడిపోయారు.

     “సిద్ధార్థుడు నగరసంచారమో, గ్రామాసంచారమో చేసివచ్చినంతనే కలుగు ఉపద్రవమేమున్నది..?” అని ఆలోచనలోపడ్డాడు. అత్యవసర మంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. తగిన సలహా చెప్పమని కోరుతూ విషయాన్ని మంత్రులతో చర్చించారు.

    “దానిదేమున్నది రాకుమారుని రాక గురించి ముందుగానే ప్రజలకు తెలియపరుద్దాము రాజా!”అని ఒక మంత్రి అన్నారు.

     “వద్దు. ప్రజలు రాకుమారుణ్ణి చూడాలని వారితో మాట్లాడాలని అమితమయిన ఆసక్తి చూపి గుమిగూడి వారిని ఇబ్బంది పెట్టె అవకాశం ఉన్నది.”

    “అవును. రాకుమారునికి కోపం తెప్పించిన వారమౌతాము.”

    “భావి మహీధరపుర రాజుకు ఈ పర్యటన చాలా అవసరం. కానీ కుమారుల వారు ఎలా ప్రతిస్పందిస్తారో అది కూడా యోచించి పంపడం మంచిది..” అని మరొక మంత్రి అన్నారు

    “రాకుమారులు వయసులో చిన్నవారే గాని తెలివితేటలలో చినవారేమీ కాదు. తగిన జాగ్రత్తలు తీసుకుని పంపవచ్చును..” అని ఒక మంత్రి అన్నారు.

    “సిద్ధార్థుడు యుద్ధ విద్యలందు కూడా ఆరి తేరి ఉన్నారు. ఇలా నగరసంచారం చేయుట కూడా వారికి ఒక విద్యాభ్యాసం వంటిదే.! ఇది వారికి ఉపకరిస్తుంది. తప్పకుండా పంపవచ్చును..” అని మరొక మంత్రి సలహా ఇచ్చారు. రాజు అందరికీ ధన్యవాదాలు తెలిపి అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని ముగించారు.

    6

     అక్క వాసంతిక సలహా మేరకు తల్లి మాలినిదేవి, తండ్రి శశాంక వర్మలకు విషయం తెలియ పరిచాడు సిద్ధార్థుడు. ముందు తల్లి మాలినీదేవి కొంత అభ్యంతర పెట్టినా తరువాత.. వాసంతిక, జ్ఞానముని గురువుగారు చెప్పిన మీదట కుమారుని సంచారానికి అనుమతి తెలిపినది. “కుమారా..! నీవు బయలుదేరునప్పుడు నీకు కొన్ని సూచనలు చేస్తాను ఆలకించు. ప్రపంచాన్ని తొలిసారి చూస్తున్నప్పుడు నీకు ఎన్నో భావోగ్వేదాలు కలుగుతాయి. త్వరపడి ప్రజలముందు ఏమీ మాట్లాడకు.” అని చెప్పాడు శశాంక వర్మ

    “నాయనా..! ఎండా, వానా, చలి వంటి ఇక్కట్లు ఎరుగని వాడివి. ఒక్క సారిగా బయటకు వెళ్తున్నావు. ఆరోగ్యంలో మార్పువస్తే వెంటనే తిరిగి వచ్చేసేయి. కావలిస్తే మరల వెల్దువుగాని. ఆహారం విషయంలో ఆచి తూచి స్వీకరించు.” అని తల్లి చెప్పింది.

    “వయసులోనూ. అనుభవంలోనూ చిన్నవాడివి. గురువుగారు చెప్పినట్లు నడుచుకో తమ్ముడూ..!” అని వాసంతిక చెప్పింది “

     “సరే సోదరి..!” అన్నాడు.

    “సరే కుమారా..! ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుందాము. మనం మొత్తము మూడురోజులు నగరాలలో, పల్లెలలో సంచరిద్దాము. మీరు వెంట వెంటనే ఏ విషయం మిత్రులతోగాని పండితులతోగాని భటులతోగాని చర్చింపకండి. మూడురోజుల అనంతరం అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము సరేనా..?” అని జ్ఞానముని అన్నారు.

    “లేదు గురువర్యా..! మన పర్యటన మూడురోజులు కాదు గురువుగారు ఏడురోజులు.” అన్నాడు సిద్దార్థుడు. తప్పదు అన్నట్లుగా సరే అన్నారు గురువు గారు.

     “అంతేకాదు మనము ఏ సమయములోనయినా ఎక్కడైకయినా వెళ్ళవచ్చు ఈ సమయములో మాత్రమే వెళ్లాలని నా మీద ఆంక్షలు వద్దు.” అని చెప్పాడు సిధార్థుడు.

     “సరే..!” అన్నారు గురువు గారు.

     * * *

     ఆ రాత్రి సిద్దార్థుడు కలత నిద్దురపోయాడు అతని మనసు పరి పరివిధాలా పోతున్నది. ఇంత కాలము రాచమందిరంలో సకల సౌభాగ్యాలు అనుభవిస్తూ కాలం గడిపాడు. తాను కను సైగ చేస్తే చాలు అడిగినదల్లా తెచ్చి పెట్టే పరివారం తనకున్నది. తాను తిరగదలుచుకుంటే అద్భుతమయిన ఉద్యావనమున్నది. తాను అడగకుండానే రకరకాలా ఆహార పానీయాలు అమర్చిపెడతారు. ఖరీదయిన పట్టువస్త్రాలకు, నగలకు లోటు లేదు. కానీ తానూ తన సోదరి కలిసి ఆడుకోవాలంటే పరిచారికలతోనో ఆడుకోవాలి. తోటలో విహరించాలంటే భటులతోనో పరివారం తోను విహరించాలి. కోవెలకు వెళ్లాలంటే తల్లిదండ్రులతోనే వెళ్ళాలి. మనసు ఏదో మార్పును కోరుకుంటుంది. సౌకర్యాలకంటే స్వతంత్రత.. పరివారం కంటే ఏకాంతత కావాలని అనిపిస్తున్నది.

     “ఏ అనుభవాలు అయితే తనకు లేవు అని సదానంద పండితులవారు అన్నారో ఆ ప్రత్యక్ష అనుభవాలను పొందాలి. ఎండలో తిరుగలేవు, వానలో తడువలేవు, మట్టినేలపై తిరుగలేవు.. అంటూ పెంచిన పెంపకం ఇంకానా..? ఉహూ రాజు.. ఎప్పుడు అంతఃపుర వాసిగా ఉండరాదు. రాజు, ప్రజల మనిషిగా ఉండాలి. అందుకు ఇప్పటి నుండే ప్రజల మధ్య తిరగాలి” అని స్థిరంగా అనుకున్నాక హాయిగా నిద్రపట్టింది.

    7

    పర్యటన ప్రారంభమయింది. ఉదయం నాలుగుగంటల సమయంలో బ్రహ్మకాల పుణ్య గడియలలో మహీధరపుర రాకుమారుడు కోటి ఆలోచనలతో కోట దాటాడు. గురువర్యుల అశ్వంతో పాటుగా రాకుమారుని అశ్వం వేగంగా దౌడు తీసింది. చల్లనిగాలి సిద్ధార్ధుని చెంపలను తాకి స్వాగతం చెప్పింది.

    ఆకాశం అరుణార్ణవాలు పులుముకుని ఆహ్లదాన్ని కలుగచేస్తున్నది. పూబంతిలాంటి సూరీడు పురివిప్పిన నెమలిలా తన కిరణాలను విస్తరించగా ఆ సూర్యోదయపు చిత్రాన్ని అచ్చెరువున చూసాడు.

     మల్లెలు, మందారాలు తెలుసుగాని మంచు బిందువులను దాల్చి మెరుస్తున్న గడ్డిపూల అందాలను చూడలేదు. అడగకుండానే అమృత సమాన పానీయాలను పొందేవాడే గాని, గల గల పారుతున్న యేటి వంపుల పాలనురగలు తెలియదు. పక్షుల కిల కిల రవాలు తెలుసునుగాని, ఆకాశంలో వాటి గమనాలా విన్యాసాలు ఎపుడూ గమనించలేదు.

     ఎత్తయిన కోటగోడలు తెలుసు గాని నింగినంటే నీలి కొండలు తెలియదు. సిద్ధార్థుడు ఇంకా చాలా చూసాడు. పైరు పచ్చని నేలపయినా నీటి కోసం రెక్కలార్చుకుంటూ తెలి కొంగలను చూసాడు. గోమాత కడ పాలు గ్రోలుతున్న లేగదూడలను మురిపమారా చూసాడు.

     ముక్కున కరుచుకు వచ్చిన ఆహారాన్ని పసి పిట్టలకు అందిస్తున్న గువ్వలను, ఆహారానికై బిరా బిరా నడిచి వెళ్తున్న తువ్వాయిలను చూసాడు. గణ గణమని మోగుతున్న గుడిగంటల సవ్వడులు విన్నాడు. కొత్త బంగారులోకపు అందాలన్నీ విప్పారిన నేత్రాలతో చూశాడు.

     పొలాలకు సాగుతున్న కర్షక జీవులను, నగరాలకు వెళ్తున్న వ్యాపారులను తమ పనులపయి తాము చక చకా తరలి వెళ్తున్న జనాన్ని అబ్బురంగా చూస్తున్నాడు. దారంతా సిద్ధార్ధుణ్ణి, జ్ఞానముని గురువును చూసిన జనం ఎదో వ్యాపారం కోసం వచ్చిన మరో నగరవాసులు అని అనుకుంటున్నారు.

     ఇలా కొన్ని మైళ్లు ప్రయాణం చేయగానే అతనికి.. దాహం వేయసాగింది. ఙానముని అశ్వాన్ని ఆపి తన శిష్యుని దాహాన్ని గుర్తెరిగి వెంట తెచ్చుకున్న నీటినిఅందించాడు. ఆ చల్లని నీరు అమృతంలా అనిపించింది సిద్ధార్థునకు.

    “రాకుమారా ఈ ఫలములు ఆరగించండి.” అంటూ కొన్ని పండ్లు అందించాడు. తానూ వద్దంటే గురువుగారు కూడా తినడం ఆపేస్తారని సిద్ధార్థుడు కొని ఫలాలను ఆరగించాడు. ఇద్దరూ గ్రామాలు దాటి ఒక నగరంలోకి ప్రవేశించారు.

    (ఇంకా ఉంది)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here