నేటి సిద్ధార్థుడు-6

0
4

[box type=’note’ fontsize=’16’] బాలల కోసం సంచిక ప్రత్యేకంగా అందిస్తున్న సీరియల్ సమ్మెట ఉమాదేవి రచించిన “నేటి సిద్ధార్థుడు”. ఇది ఆరవ, చివరి భాగం. [/box]

19

[dropcap]”సో[/dropcap]దరీ..! నిన్న నేను ఆ రీతిగా మాట్లాడినందుకు పెద్దలు నాపై కోపగించుకున్నారా..? రాకుమారుని అతి జోక్యమేమిటని నిరసించినారా..?

“లేదు సిద్దార్థా! నీ మాటలు విన్నాక తండ్రిగారు చాలా ఆలోచనలో పడిపోయారు. చిన్నవాడివయినా నీ పరిశీలనా శక్తి అమోఘము సుమా! అంటూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. సమస్య ఎదురవ్వగానే నీవు కుంగిపోలేదు. దాని నుండి పారిపోలేదు. ఎవర్నీ నిందించలేదు. వాటి పరిష్కారంపై దృష్టి పెడుతున్నావు. ఇది మంచి పరిణామాం. నీలో నాకు బాగా నచ్చిన మరొక విషయం ఏమంటే.. నీ ఆలోచనలను ధైర్యంగా పైకి చెబుతున్నావు. కేవలం తండ్రిగారి ముందే కాక మంత్రివర్యుల, ఇతర పెద్దల ముందు మాట్లాడి తగిన సలహాలు తీసుకుంటున్నావు. అందరినీ బాధ్యతల వైపుకు మళ్లిస్తున్నావు అందుకు నిన్ను ప్రశంసించకుండా ఉండలేను సిద్ధార్థా. మొదటిసారి ప్రజలమధ్యకు వెళ్లి నీ పటాటోపాన్ని, నీ రాచరిక వైభోగాన్ని ప్రదర్శించకుండా మారువేషంలో వెళ్ళావు. దేశప్రజల గురించి బాధ పడుతున్నావు. కాబోయే రాజ్యాధినేతకు ఇది చాలా అవసరం. ప్రజలకు ఇది మంచి సంకేతం సోదరా..! నీవు అనుకున్నది సాధించుతున్నందుకు సంతోషంగా ఉండు సిద్ధార్థా..!” సోదరుణ్ణి నిరాశ పరచకుండా మాట్లాడింది వాసంతిక.

“ఏమి సంతోషం సోదరి? అసలు నా మనసు ఎంత పరితాపానికి గురయ్యిందో ఎలా చెప్పను నీకు.”

“దేని గురించి ఇంత వ్యాకులత సోదరా!”

“నా పర్యటనలో అతి ముఖ్యమయిన ఘట్టం మరణించిన మనిషిని దగ్గరగా చూడడం సోదరీ! రంగయ్యా అనునాతడు ఆకస్మికంగా మరణించాడు. అతని భార్యా బిడ్డల, బంధు మిత్రుల రోదనలు ఇప్పటికీ నా చెవుల మారు మ్రోగుతున్నవి. వారి వేదన చూడలేకపోయాను సోదరీ.”

“బాధపడకు సోదరా.! నీవు కూడా ఆ తధాగతునివోలె అందరి బాధలకు ఖేదపడి విరాగివి కాబోకు. జనన మరణాలు దైవనిర్ణయాలు. మృత్యువు ముందు రాజయినా.. బంటయినా ఒక్కటే.. చేయగలిగినదేముంది?”

“మృత్యువుకు రాజయినా బంటయినా ఒక్కటే. కానీ రాజుకు ప్రజలందరూ బిడ్డలవంటి వారే కదా.”

“అవును. అందులో అనుమానం ఏమున్నది?”

“సోదరీ..! రంగయ్య మరణిస్తే అక్కడ చేరిన వారంతా అతను చనిపోయాడని ఎంత బాధపడుతున్నారో అతని కుటుంబానికి ఒక ఆధారం పోయిందని అంతకు మించి బాధపడుతున్నారు. ఇప్పుడా భార్యా పిల్లల పరిస్థితేమిటి?”

“నిజమే సిద్ధార్థా..! ఇది చాలా దయనీయమయిన విషయమే.”

“ఆత్మబంధువును కోల్పోతే తెచ్చివ్వలేము. కానీ ఆధారాన్ని కోల్పోతే ఆసరా కల్పించలేమా సోదరీ?”

“ఎందుకు కల్పించలేము? తప్పక ఎదో ఒక ఆధారం చూపించవచ్చు.”

“అందుకే సోదరీ.! నేను మన రాజ్య జనాభా ఎంత? వారి వారి ఆర్థిక స్థితిగతులేమిటి? అని ఆరా తీస్తున్నది. రాజు ప్రజలకు ఆపదల సహాయంలో ఏ మాత్రం సహాయం చేయగలడు అన్నది ఆలోచించి అడుగుతున్నాను.”

“సోదరా! నీ మనసు నాకు బాగా అర్థమవుతున్నది. కానీ దీని వలన రాజ్య ప్రజలకు ఎక్కడ ఏమి జరిగినా అన్నిటికీ మాకు రాజు ఉన్నాడులే అన్న భావన కలుగుతుంది కదా!”

“అవును సోదరి. ప్రజలకు ఎక్కడ ఏ ఆపద వచ్చినా మాకు మా రాజు ఉన్నాడు అన్న భరోసా ఉండాలనేదే నా ఆకాంక్ష కూడా.”

“అది నీవు భరోసా అనుకుంటున్నావు. కానీ సిద్ధార్థా..! పడిపోయిన వాడు తనంతట తాను లేచి నిలబడగలగాలి. ఎవరో వచ్చి తనను లేపాలి అన్న ఆలోచన అన్నివేళల మంచిది కాదు.”

“సరే సోదరి లేచాకయినా పడిపోయిన వ్యక్తికి, గాయపడిన వ్యక్తికీ ఒక ఆసరా కావాలి కదా!”

 “సరే ఆసరా వరకయితే పరవాలేదు.”

“మొదట అసహాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ఇలా ఆదుకోవడానికి ఒక అవసరం అవుతుంది. ఆ తరువాత ఆదుకోవడం రాజు బాధ్యత అవుతుంది. ఆ తరువాత ప్రతిదానికి అసలు రాజు ఎందుకు ఆదుకోడు..? అన్న అసహనం రాజుపై వ్యక్తమౌతుంది. చివరకు ప్రతి చిన్నదానికి రాజుపై తిరగబడడం కూడా అలవాటు అవుతుంది..”

సిద్ధార్థుడు వాసంతిక మాటలకు విస్మయపడి చూసాడు.

“అవును సిద్ధార్థా..! నీవు పసివాడివిగా ఉన్నప్పుడు తండ్రిగారు పరిపాలనా విషయాలలో తలమునకలుగా ఉండేవారు. నేను నేను విద్యాభ్యాసం గావిస్తూనే పితామహునితో ఎన్నో రాజకీయ చారిత్రక, సామాజిక విషయాలపై చర్చలు జరుపుతుండేదాన్ని. నా ఆలోచన ధోరణిపై పితామహుల వారి ప్రభావం చాలా ఉన్నది.”

“అవును సోదరి నాకును పితామహులు బాగా గుర్తున్నారు.”

“సరే ఇక అసలు విషయానికి వద్దాం సోదరీ! అవసరం ఉన్నవారికల్లా సహాయం చేయడం వల్ల ప్రజలు సహాయాలు అందుకోవడానికి అలవాటు పడిపోతారు అంటావా? అలాగని ప్రభుత్వం నుండి ప్రజలకు అందాల్సిన సహాయలను నిలిపివేస్తామా?”

“ఎంత మాత్రం నిలిపివేయము సోదరా! ఉదాహరణకు ఆ రంగయ్యనే తీసుకో. అతని కుటుంబానికి ఆధారమయిన రంగయ్య చనిపోయినందుకు జీవితాంతం రంగయ్య కుటుంబాన్ని పోషించే బాధ్యత ప్రభుత్వామే తీసుకోకుండా ఆ కుటుంబంలో ఒకరు ఆ కుటుంబ బాధ్యత తీసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. అతని భార్యకో అతని సోదరునికో ప్రభుత్వ కొలువులో చేరడానికి ఏర్పాట్లు చేయడం సబబు.”

“హమ్మయ్య నాకు కావాల్సింది కూడా అదే సోదరీ.”

“ఒకసారి తండ్రిగారితో మాట్లాడి ఆ ఏర్పాట్లు చేద్దాం. మరి త్వరగా నీ మందిరానికి వెళ్లి కాస్సేపు విశ్రమించు సిద్దార్థా.”

20

మరునాటి ఉదయం ఆంతరంగిక సమావేశానికి ముందుగా రాణి మాలినీదేవి నుండి తన అంతఃపురానికి రావాల్సిందిగా వాసంతికకు జ్ఞానముని గురువుకు ఆదేశాలు అందాయి..

“అమ్మా..! అకస్మాత్తుగా నన్నూ గురువుగారిని కూడ రమ్మని ఎందులకో వర్తమానం పంపారట..” ఆందోళనగా అడిగింది వాసంతిక.

“అవునమ్మా! గత కొంతకాలంగా నీ సోదరుడు సిద్ధార్ధుని గురించి మనసు చాలా వ్యాకులంగా ఉన్నది. దానికి తగ్గట్టుగా సిద్ధార్థుడు విద్యాభ్యాస సమయమున రాజ్యపర్యటన చేస్తాను అన్నాడు. సరే అందులో ఆందోళన పడవలసిందేమి లేదు అని పంపాము. కానీ సిద్దార్ధుడు అందరివంటివాడు కాదు. చాలా సున్నితమయిన మనస్తత్వం కలవాడు. చాలా ఆలోచనాపరుడు కూడా. ఇప్పుడు ఈ పర్యటనలో తన మనసును కలచివేసే కొన్ని దృశ్యాలను చూసాడని తెలిసింది. దానికి కుమారుని ప్రతిస్పందన ఎలా ఉన్నది తల్లీ? నీతో సోదరుడు మనసువిప్పి మాట్లాడినాడా? ఏమంటున్నాడు?”

“మాట్లాడాడు అమ్మా..! తానూ విన్నవీ కన్నవీ ఒక్కొక్కటిగా చెబుతున్నాడు. ముఖ్యంగా తనను బాగా కదిలించింది ఏమంటే తానూ చాల దగ్గరగా ఒక మరణించిన వ్యక్తిని అతని గురించి దుఃఖిస్తున్న కుటుంబాన్ని చూశాడట. అతని గురించే నిన్న నాతో చాలాసేపు మాట్లాడాడు.”

“అవునా, ఏమంటున్నాడమ్మా?”

“చాలా బాధపడుతున్నాడు. ఈ మృత్యువు ఏమిటి..? ఇలా ప్రాణాలు పోవడం ఏమిటి, పుట్టిన ప్రతివారు మరణించక తప్పదా? ఇలా ఎన్నో ప్రశ్నలు వేసాడు.”

 “అలా అడిగాడా? నేను భయపడుతున్నంతా జరుగుతున్నదా? ఇదంతా తథాగతుని గాథ వినడం వలన కలిగిన ప్రభావమే.” ఈ మాటలు విన్న జ్ఞానముని వెంటనే మాలినీ దేవిని ఓదారుస్తూ ఇలా అన్నాడు.

“లేదు తల్లీ.! మీరలా భావించకండీ. సరిగ్గా మీకు కలిగిన అనుమానమే నాకునూ కలిగింది. తన పర్యటన చివరలో సిద్ధార్థుడు ఒక చెట్టుకింద ఆసీనులను దీర్ఘాలోచనలోపడి మౌనం వహించారు. అప్పుడు నేను కూడా ఇదంతా తథాగతుని గాథ ప్రభావమే. ఇప్పుడు ఈ సిద్ధార్థుడు ఏమి చేయనున్నాడో అని చాలా భయపడ్డాను. అదే అనుమానం అతని ముందు వెలిబుచ్చాను. అప్పుడు రాకుమారుల వారు ఏమన్నారో తెలుసా తల్లీ!”

“గురువర్యా! నా ప్రజల స్థితిగతులు చూసి మనసు చలించి నాకును చాలా వైరాగ్యం కలుగుతున్నది. నిజంగానే ఈ దుఃఖానికి మూలం కోరికలే. కోరికలను పరిత్యజించాలి” అని కూడా అనిపిస్తున్నది. కాని రాచకుటుంబంలో పుట్టి, ప్రజలకు భాద్యత వహించవలసిన నేను, తల్లిదండ్రులకు పుత్రునిగా ప్రేమను అందించాల్సిన నేను, ఇలా వైరాగ్యం పెంచుకుంటూ నా బాధ్యతలను విస్మరించరాదు కదా గురువర్యా..! అందుకే నా కర్తవ్యం గురించి ఆలోచనలో పడ్డాను అని చెప్పాడమ్మా. సిద్ధార్థుడు కర్తవ్య పరాయణుడు. కాబట్టి మీరు చింతించాల్సిన పనిలేదు. అతను చేయదలుచుకున్న పనులకు సహకరించడమే ఇప్పుడు మనం చేయవలసింది” అని జ్ఞానముని అన్నాడు.

గురువుగారి మాటలు విన్న రాణీ మాలినీదేవికి మనసులోని భయమూ బాధా అంతా ఒకసారిగా మటు మాయమయిపోయి కొత్త ఉత్సహాం వచ్చింది.

“అవును గురువర్యా! మేము కూడా కుమారుని పనులకు చేదోడుగా ఉంటాము” అన్నది. వాసంతిక నిన్నటి రాత్రి తనకు సిద్ధార్థునికి మధ్యన రంగయ్య గురించి జరిగిన సంభాషణ మొత్తం వివరించింది.

సిద్ధార్థుడు కోరినట్లుగానే రంగయ్య కుటుంబానికి అండగా ఉందాం. ఇక నుండి ఎవరింటనయినా మరణం సంభవించి ఆధారం కోల్పోతే వారికి కావలసిన ప్రభుత్వ సహాయం అందించి ఒక ఆధారం కలిపిద్దాం. ఈ విషయం మీ తడ్రిగారిని ఒప్పించే బాధ్యత నాది” అన్నది మాలినీదేవి. వాసంతిక సంతోషంగా నవ్వింది.

“ఇక సిద్ధార్థునితో ముచ్చటించుటకు పెద్దలు సమావేశం అయిన మందిరానికి వెళదామా?” అన్నది అందరూ కలసి సమావేశ మందిరానికి బయలుదేరారు.

21

“కుమారా రాజా వారు వచ్చేసరికి మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సిద్దార్థుడు ఇప్పుడిప్పుడే లోకం చూస్తున్న బాలుడు. వారి మాటలు, ఆలోచనలు మీకు ఏమయినా అభ్యంతరకరముగా ఉన్నాయా? నిజానికి ప్రజల అవసరాలను గమనిస్తూ పరిపాలనలో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ పోవడం చాలా అవసరం. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వలన, నిరంతరం సరిహద్దుల వద్ద రక్షణ పట్ల దృష్టిపెట్టడం వలన, పరిపాలనలో కొంత అలక్ష్యమో, ఉదాసీనతో జరిగినట్లు నాకనిపిస్తుంది. అందువలన కుమారుని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని పరిపాలనా సంస్కరణలు చేయవచ్చునేమో… పెద్దలూ, పండితులూ, మంత్రులూ ఆలోచన చేయమని నా సలహా” శశాంకవర్మ అన్నాడు.

“మహారాజా..! కాలం ఒక ప్రవాహం. కొత్త నీటిని మోసుకువస్తుంది. మనం దానిని ఆహ్వానించాల్సిందే ఆమోదించాల్సిందే” సేనాని అన్నాడు.

“ఏ విషయమయిన మనము చెప్పడం కన్నా స్వీయానుభవాల ద్వారా గ్రహించడం మంచిది. అందునా కుమారులవారు ఉత్సాహపరులు విషయగ్రహణమన్న ఆసక్తి కలవారు” మంత్రి అంటుండగానే.. సిద్ధార్థుడు, రాణీమాలినీదేవి జ్ఞానముని, వాసంతిక సభాప్రాంగణంలోకి అడుగు పెట్టారు. అందరూ లేచి అభివాదాలు చేశారు.

“ఇక సభ ప్రారంభిద్దామా?” అని ఒక మంత్రి అన్నారు.

“ఇవాళ సిద్దార్ధులవారు ఏమి చెప్పబోతున్నారు?” ప్రధానమంత్రి అడిగారు చాలా ఆసక్తిగా ఉన్నఅతని స్వరంలోని అంతరార్థం అర్థం కాక.

“మహారాజా! వేగులవారు వచ్చి ఉన్నారు.” భటులు వచ్చి చెప్పారు

“ప్రవేశ పెట్టుము” అన్నారు మహారాజు. ఇద్దరు వేగులు వచ్చి నమస్కరించారు.

“చెప్పండి ఏమిటి సంగతి?

“శృంగవరంలో ఒక వ్యక్తి కంసాలి దగ్గరకు రాజకుమారుని ఆభరణాలు పోలిన ఆభరణాలు అమ్మడానికి వచ్చాడట. పైగా రాకుమారులవారే స్వయంగా ఇచ్చారని చెప్పారట. దానితో అతనిని బంధించి నిజ నిరూపణకు ఆ నగలను వేగులవారికి పంపారు. వారు మా వద్దకు వచ్చారు. అవి రాకుమారుని నగల వలెనే ఉన్నాయి. మహారాజా..!”

“సిద్ధార్థా..! ఏమిటిది నీవు ఎవరికయినా నగలు ఇచ్చావా నాయనా.?”

“అవును తండ్రీ.! అకాల వర్షానికి ఇల్లూ కూలిపోయి, పంట నాశనమయి ప్రజలు చాల ఇబ్బందులు పడుతున్నారు. మీ నుండి తక్షణ సహాయం అందేలోపు నేను పర్యటించిన శృంగవరపు ప్రాంత రైతులకు కనీస అవసరాల కోసం కొంత ద్రవ్యాన్ని సమకూర్చాలనుకున్నాను. నా వద్ద ఉన్న బంగారునగలను ఇచ్చి గుణాధీశుడ్ని, గోపాలున్నీ పంపాను. వారు ఆ పనిని మరొకరికి అప్పజెప్పి నన్నుగా అనుసరించుట వలన జరిగిన పొరపాటు అయి ఉంటుంది. తరువాత నేను రాచమందిరానికి తిరిగి రావడం, మీరు అప్పుడే సామాన్య జనజీవనం దెబ్బతిన్న చోట సహాయం అందించే ఏర్పాట్లు చేస్తుండడంతో నేను సంతుష్టుడనయ్యాను” సిద్ధార్థుడు వినయంగా చెప్పాడు.

“చాలా సంతోష నాయనా..! సత్వరం ఏదయినా సహాయం చెయ్యాలన్న నీ మంచి మనసుకు అభినందనలు” సాకేతముని మెచ్చుకున్నారు.

“ఆ మాధవయ్యను శిక్షించకండి. అవి రాకుమారుని నగలు అని అవి స్వయంగా వారే ఇచ్చారని తెలిపి వారిని విడిచి పెట్టండి” అని వేగుల వారిని పంపేసారు మంత్రులు.

“ఇక మీరు మాకు వెల్లడి చేయాలనుకుంటున్న మీ పర్యటన తదుపరి విషయాలు వినుటకు వేచి ఉన్నాం” అన్నారు మిగతా సభ్యులు.

“నేను వెళ్తున్నదారిలో ఒక చిన్నారి మధుర ఫలముల కొరకు ఏడుస్తున్నది. ఆ పాప తల్లేమో అనారోగ్యంగా ఉన్న తన పాపకు పండ్లు కొనిపెట్టలేని స్థితిలో ఉన్నది. అందుకు ఆమె ఎంతో బాధపడుతున్నది. తన కూతురు నష్టజాతకురాలని తిట్టుకుంటున్నది.”

“కుమార రాజావారు మరీ ఇంత సున్నిత మనస్కులయితే ఎలా?” రాఘవుడు అనే మంత్రి అన్నాడు.

“అనారోగ్యంగా ఉన్నప్పుడు రకకరకాల కోరికలు పుడుతూ ఉంటాయి” షణ్ముఖుడు అన్నాడు.

“పిల్లలు ఏదయినా కోరరానిది కోరినప్పుడు అది ఇవ్వలేకపోతే ఆ తల్లి బాధపడడం సహజం” సాకేతముని అన్నారు.

“నేను కేవలం ఆ ఒక్క తల్లి గురించో… ఆ ఒక్క పాప గురించో మాత్రేమే బాధపడడం లేదు. అసలు ఏ వస్తువయినా కొనలేని పరిస్థితిగాని, ఇవ్వలేని పరిస్థితిగాని ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తున్నాను?” అన్నాడు సిద్ధార్థుడు.

“ఏదయినా ఒక వస్తువు కొరతగా ఉన్నప్పుడు దాన్నికొనలేము సోదరా!” వాసంతిక అన్నది.

“లేదు. కొరత కాదు సోదరి. అక్కడ అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఫలములను ఆ తల్లి కొనలేకపోయింది. ఏడుస్తున్న పాపకు ఇవ్వలేక పోయింది. ఆ ఫలములు చాలా ఖరీదు అన్నది. అసలు ఏ వస్తువులయినా సామాన్య ప్రజలు కొనలేంత ఖరీదు ఎందుకవుతాయి?”

“ఆ వస్తువుల ఉత్పత్తో సరఫరానో తక్కువగా వున్నపుడు ఆ వస్తువులు అంతగా లభ్యంకావు. లేదా కొన్ని వస్తువులు లభ్యం అయినా చాల ఖరీదు ఎక్కువగా ఉంటాయి.”

“అవును సోదరి…! నేను అదే అడుగుతున్నాను. ప్రజలకు పండ్లు అవసరం అయినప్పుడు అవి అందుకు కొరత వస్తువులు అయినాయి? ఫలములు విరివిగా ఎందుకు పండించడం లేదు. దారంతా ఎన్నో వృక్షజాతులు కనపడ్డాయి. వాటి స్థానే మనం మన రాజ్యంలోని పిల్లందరికీ అవసరమయిన ఫలాలను ఎందుకు పండించుకోలేక పోతున్నాము? నేను చూసినంత మేరా మన వ్యయవసాయంలో వాణిజ్యపంటలే ఎందుకు ఎక్కువయినాయి? మన రాజ్య ప్రజలకు ఏమి అవసరమో అవి పండించుకోవాలి గాని మనకు వాణిజ్యం ద్వారా వచ్చే రాబడి కోసం ఇతర పంటలు పండించుకుంటే… మన బిడ్డలకు ఆహారం కరువయి పోవడం లేదా? ఒకవేళ సామాన్య రైతు ఆ పంటలను పండించ లేకపోతే రాజ్యం ఆ బాధ్యత ఎందుకు తీసుకోకూడదు?” సిద్ధార్ధుని మాటలకు మంత్రివర్గం ఆలోచనలోపడ్డారు.

“వాణిజ్య పంటల్లో ఏ పంటలను మనం తగ్గించగలము కుమారా?” రాఘవుడు అడిగాడు.

“ప్రజల జీవనానికి హానిని కలుగ జేసే పొగాకు పంటను తగ్గించవచ్చు. కేవలము రాజ వంశస్తులకోసం ఉన్నత వర్గాలకోసం తయారవుతున్న పట్టు వస్త్రాలకు అవసరమయిన పట్టు పురుగులను పెంచే మలబారు చెట్ల పెంపకాన్ని తగ్గించవచ్చు.”

“అంతే కాదు. దారి పొడుగునా పచ్చగా పెరిగిన రకరకాల వృక్ష జాతులు కనపడ్డాయి. వాటి స్థానంలో పండ్లమొక్కలు నాటలేమా అన్నది యోచించాలి. ఇందుకుగాను అసలు మన రాజ్యంలో మనకున్న పంట భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? అందులో ఆహారపు పంటలు ఎంత వరకు పండిస్తున్నారు? వాణిజ్య పంటలు ఎంత పండిస్తున్నారు? ఖచ్చితమయిన వివరాలు తక్షణం సేకరించి వ్యవసాయ నియంత్రణ కూటమిని ఒకదాన్ని వేసి పంటల విధానంలో కావాల్సిన మార్పులు చేయగలగాలి.”

“అంతేకాదు పర్యటన ముగిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా కురిసిన వర్షాలకు రైతులు చాలా యిబ్బందులు పడ్డారు. ప్రజలకు అన్నం పెట్టే రైతు ఆపదల పాలయితే ఆ నష్టం రాజ్యం మీద కూడా పడుతుందని గురువుగారు తరుచూ చెబుతుంటారు. అందువలన ఎప్పుడయినా రైతులకు ఆపద కలిగితే అదే కేవలం వారికి సంబంధించిందిగా మాత్రమే భావింపక మన జాతికి మొత్తం కలిగిన ఆపదగా భావించి చర్యలు తీసుకుంటారని ఆశిస్తునున్నాను. ఇదీ నా విన్నపము” సిద్దార్థుడు అందరికీ నమస్కరించి తన మాటలను విరమించాడు.

22

మరుసటి రోజుసమావేశం ప్రారంభమయి రాచకుటుంబంతో పాటుగా ప్రధాన మంత్రి, సేనాని ఇతర మంత్రులు, సాకేతముని, జ్ఞానముని మొదలగు గురువులు ఆసీనులయినారు.

“సాధారణంగా రాజు కాగోరు వారు తాము అనుభవింపబోయే భోగభాగ్యాల గురించో తాము ఆక్రమించాలనుకుంటున్న రాజ్యాల గురించో ఆలోచిస్తారు. కానీ సిద్ధార్థుడు తన ప్రజల ఆర్థిక సామాజిక జీవితాన్ని అవగాహనా చేసుకోవడానికి ప్రయత్నించడం చాల సంతోషంగా ఉన్నది. మీరంతా కూడా తానూ చెబుతున్న విషయాలను విని వారిని ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉన్నది” అన్నారు శశాంకవర్మ మహారాజు.

“నిజానికి సిద్ధార్ధుని పర్యటాననుభవాలన్నీ ఆలోచనాత్మకంగా ఉన్నాయి తండ్రిగారు. సోదరుడు చిన్న వయసులోనే మన రాజ్య పరిస్థితులను చక్కగా అవగాహనా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అది అభినందించ వలసిన విషయం” వాసంతిక అన్నది.

“నీవు కూడా అంతకంతకూ చక్కటి సలహాలను ఇస్తున్నావు కుమారి. తాతగారి శిక్షణలో నీకు చక్కని రాజకీయ పరిశీలన అలవాటు అయ్యింది. ఇక నాకు నిశ్చింత. భావి మహీధరరాజ్యం ఎలా ఉంటుందో ఏమయిపోతుందో అన్న భయం లేదు. వయసుకు మించిన ఆలోచనతో నా సంతానం ముందుకు వెళ్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది” శశాంకవర్మ అన్నాడు.

“ఇందుకు కారణం వీరిద్దరికీ విద్య నేర్పిన మన గురువులను కూడా అభినందించవలె, సత్కరించవలె” అన్నది రాణీ మాలినీదేవి.

సిద్ధార్థుడు లేచి అందరికీ ప్రణామాలు చేసి తన సంభాషణ ప్రారంభించాడు. “ప్రస్తుతం ఉన్న మన విద్య విషయంలో నాకు కొన్ని సందేహాలున్నవి గురువర్యా! మన రాజ్యంలో ఇప్పుడు అనేక విద్యాలయాలు వెలసినాయని, అందులో అందరికీ విద్య నేర్పడానికి తగిన ఏర్పాట్లు జరిగినాయని తెలుసుకున్నాం. ఇక విద్యా విధానం ఎట్లా అమలు అవుతున్నదో కూడా అడిగి తెలుసుకున్నాం.”

“ఎట్లా ఉన్నది కుమారా?

“నా పర్యటనలో నారాయణ అను చిన్నవాడు నన్ను అన్నా… అని పిలిచి వాని చదువు ముచ్చట్లు ఎన్నో చెప్పినాడు. నిర్ణీత సమయానికి విద్యాశాలకు వెళ్లి గంటలకొద్దీ కూర్చుని గురువులు చెప్పినది విని వల్లే వేయవలెనని, పరీక్షించినప్పుడలా వ్రాసి చూపవలెనని చెప్పినాడు. వెంటనే కొందరు తల్లిదండ్రులను కలుసుకుని ఇట్టి విధానం గురించి చర్చించాను. వారిలో కొందరు తల్లిదండ్రులు విద్యార్థులు విద్యా ముగించుకుని బయటకు వచ్చాకా వారి జీవితానికి ఇది ఏ విధంగానూ అక్కరకు రావడంలేదు అని చెప్పారు.”

“ఇక కొందరు విద్యార్థులు రోజల్లా ఒకే దగ్గర కూర్చుని నేర్చుకునే ఈ పద్దతికి విసిగిపోతున్నాం అని చెప్పినారు.”

“అంటే విజ్ఙాన సముపార్జన కోసం ఈ విద్యావిధానం రూపొందించిన పెద్దలు మూర్ఖులందురా కుమారా?” రాజు చాలా కోపంగా అన్నారు.

“లేదు తండ్రి..! విద్యార్థులు విజ్ఞాన సముపార్జనంతో పాటు జీవనము గడుచు విద్య కూడా నేర్వవలెనని నాకు అనిపించింది. రోజల్లా ఒకే దగ్గర కూర్చుని కొన్నేళ్ళపాటు వారు వల్లే వేస్తున్న శాస్త్ర విషయములు వారి జీవితానికి ఎంతవరకు పనికివస్తున్నాయో ఆలోచించమంటున్నాను. విదార్థులకు శాస్త్ర విషయములతో పాటు ఒకపూట ఏదయినా వృత్తి విద్యలను నేర్పితే అది వారి జీవితాలకు మంచి ఆధారం అవుతుంది. విద్య ముగిసే సమయానికి వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో బయటకు వస్తారు. విద్య విధానంలో ఈ రకమయిన మార్పులు సత్వరమే అవసరం అనిపిస్తున్నది.”

“కుమారా! శాస్త్రం బోధించే గురువులే మనకు పరిమితంగా ఉన్నారు. ఇక వృత్తి విద్యలు నేర్పు గురువులు ఎక్కడ దొరుకుతారు?” సాకేతముని అడిగాడు.

 “గురువర్యా..! అక్షరజ్ఞానమొక్కటే విద్య కాదు. మనకు తెలియని విషయము తెలియ జెప్పే ప్రతీ వారు గురువులే అని మీరే కదా చెప్తుంటారు. అట్టి విషయ జ్ఞానం కలిగిన వారినందరినీ అక్షర జ్ఞానంతో పనిలేకుండా వృత్తివిద్యా గురువులుగా నియమించుకోవచ్చు కదా!”

సిద్ధార్ధుని మాటలకూ సాకేతముని నివ్వెరపోయి చూసారు..

“సొదరుడు చెప్పింది ఎంతో సమంజసం ఉన్నది. మనం పండితులని కొలిచే వారు అస్త్ర, శస్త్ర, శాస్త్ర విద్యలలో ఆరి తేరి ఉండవచ్చు కానీ సామాన్య జీవనానికి అవసరమయిన పని ముట్లు యంత్రాల తయారీ, వ్యవసాయిక పారిశ్రామిక వస్తూత్పత్తి వీటి గురించిన అవగాహనా ఉండక పోవచ్చు. ఇందులో వారిని తప్పు పట్టేదేమీ లేదు. అలాగే సామాన్యులవలె కనపడు వారు ఇట్టి విద్యలలో… నైపుణ్యం సంపాదించినవారు అయి ఉండవచ్చు.”

“విద్య ముగించుకుని బయటకు వచ్చేవాడు బతుకు భయంతో ముడుచుకుపోకుండా ఉండాలి. భవిష్యత్తు గురించిన గొప్ప ఆత్మవిశ్వాసంతో బయటకు రాగలగాలి అంటే సిద్ధార్థుడు చెప్పిన వృత్తివిద్యల శిక్షణ చాలా అవసరం గురువర్యా!” వాసంతిక తమ్ముని భావాలను బలపరచింది.

“చెప్పినది ఇద్దరు చిన్నవారన్న అభిజాత్యం మనం వదులుకుని మనం ఆలోచిస్తే వీరిరువురూ మంచి ఆచరణ యోగ్యమయిన విషయాలను చెప్పారు. ముందు ముందు మన రాజ్యాభివృద్దికి చేపట్టే కార్యక్రమాలకు మనకు క్రియాశీలురయినా యువకులు కావాలి. అట్టి వారిని మనమే తయారు చేసుకోవాలనుంటే మన విద్యలో వృత్తి విద్యలను ప్రవేశపెట్టుట చాలా అవసరాం మహారాజా” షణ్ముఖుడు అను మంత్రి అన్నారు.

“మంత్రులారా కుమారుడు చెబుతున్న విషయాలను ఆచరణలో ఎట్లా ఉంటాయో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. ఇందుకు కొందరు పెద్దలతో కూటమిని నియమించి సత్వర నివేదికలు కోరుదాము” మహారాజు అన్నారు. అంతటితో సభ ముగిసింది.

23

రాచమందిరంలో జరుగుతున్నా అంతరంగిక సమావేశానికి వచ్చిన మంత్రులు పండితులు రాకుమారుని కోసం ఎదురు చూస్తూ వారిలో వారే రహస్యంగా ముచ్చటించుకుంటున్నారు.

“సిద్ధార్ధుని పర్యటన అనంతరం రాణీ మాలినీదేవి తథాగతుని తల్లిదండ్రులయిన మాయదేవి శుద్దోధనుల స్థితే తమకు ఎదురవబోతున్నదా? తమకు పుత్ర వియోగము కలగబోతున్నాదా? అని ఎంతో భయపడినారు. ముఖ్యంగా ఆ తల్లి మాలీనిదేవి పడ్డ సంఘర్షణ అంతా ఇంతా కాదు.”

“అవును సుమా! నేను సిద్ధార్థుడు దేనికయినా అసహనానికి గురయి ఏదయినా విపరీతంగా ప్రవర్తించబోడు కదా అని కూడా అనుమానపడ్డాను. కానీ యువరాజు కడు ఆలోచనాపరుడని అర్థమయి చాల సంతోషంగా ఉన్నది.”

“చిన్నదయినా వాసంతిక కూడా చాలా అనుభజ్ఞురాలివలె సముచితమయిన సలహాలిస్తున్నది. ఇది చాలా అభినందననీయం.”

“రాకుమారుడు ఇప్పుడిప్పుడే కౌమార దశనుండి బయట పడుతున్నవారు. అనుభవ శూన్యుడు. అతని అభిప్రాయాలకు ఎంతవరకు విలువ ఇవ్వవచ్చో కూడా మనం ఆలోచించుకోవాలి.”

“అదేమీ కాదు సిద్ధార్ధుని ఆలోచనా తీరు చూస్తుంటే వారి తాతగారు ఫణీంద్రవర్మగారు గుర్తుకువస్తున్నారు. విత్తు ఒకటి అయితే చెట్టు ఒకటి అవుతుందా, వారి తాతగారి ఆలోచనా ధోరణి వలె వీరిది కూడా అభ్యుదయ బాట.”

“ఈవేళ మరి కుమారరాజా వారు ఇంకా ఏమి చెప్పనున్నారో.?”

 ఇట్లా అందరూ అనుకుంటుండగానే రాజు, రాణిలతో పాటుగా సిద్ధార్ధుడు వాసంతిక విచ్చేసారు. అభివాదాలు పలకరింపుల తరువాత..

“తండ్రిగారు! ఒక విషయము మీ దృష్టికి వచ్చిందో రాలేదోగాని నా పర్యటనలో నాకు అమితమయిన బాధను కలిగించిన మరొక ముఖ్యమయిన విషయమును మీకు నివేదిస్తాను.

“అదేమిటో చెప్పు సిద్దార్థా!”

“రాజ్యంలో ఉన్న మన ప్రజలెందరో వారందరికీ సరిపడ వైద్యులు లేకపోవడం ఎంత దురదృష్టకరం? విద్య, వైద్యం ఎప్పుడూ సంపన్నులకే కాదు అందరికీ అందుబాటులో ఉండాలి. కానీ అట్లా జరగడంలేదు.”

“అదేమిటి? మహీధరపురమున ప్రజలకు సరియయైన వైద్య సేవలు లేవా? వైద్యాచారులందరూ ఏమి చేస్తున్నారు?”

రాఘవుడు అను మంత్రి లేచి… “మహారాజా నిజానికి వైద్యులు చాలా మందే ఉన్నారు. కానీ మనం గమనించనిది ఏమంటే జనాభా బాగా పెరిగిపోయింది… అకాల వర్షాలు అమితమయిన ఎండలు, వంటి పకృతి వైపరీత్యాల వలన అనుకోని ప్రమాదాలవలన రోగాల పెరిగిపోయాయి. రోగుల సంఖ్యా పెరిగిపోయింది. అందు వలన సంభవించిన పరిస్థితి ఇది.”

“మరి దీనిని ముందుగా ఎందుకు అంచనా వేయలేదు. ఇప్పటికిప్పుడు మనం చేయవలసిన పనులేమిటి?”

“మహారాజా, వైద్యులు ఉన్న చోటల్లా వైద్యాలయాలు నెలకొల్పడానికి సరిపడా భవనాలు లేవు…”

“అత్యవసరంగా కొన్ని భవనాలు నిర్మించడానికి ఏర్పాట్లు చేయగలరా?”

“మంత్రివర్యా!నాకు ఒక సందేహం ఉన్నది. ప్రతీ మండలములలో మహారాజు పర్యటనకు అవసరమయిన విశ్రాంతి భవనాలు ఉన్నాయి కదా! వాటిలో ఎన్ని గదులు ఉంటాయి?”

“దాదాపు ముప్పయి గదులకు పైగా ఉంటాయి కుమారా!”

“ఎప్పుడో ఏడాదికి మూడు నాలుగు సార్లు వెళ్లి ఉండే రాజుకు, రాచకుటుంబానికి అయిదు గదులు ఉంచి అన్నిటినీ వైద్యాలయాలుగా మార్చేయవచ్చు. ఏమంటారు తండ్రీ..?”

 శశాంకవర్మ అంగీకారంగా తల ఊపారు.

 “గదులు సరే మరి వైద్యులు?” సచికేతుడు అడిగాడు

“ప్రస్తుతం వైద్య కళాశాలలో వైద్యవిద్య చదువుతున్న వారి విద్య పూర్తి అవ్వడానికి మరో పదినెలలు పడుతుంది. ఈలోగా స్థానికంగా అందుబాటులో ఉన్న వైద్యులను అన్ని చోట్లకు సంచరించే ఏర్పాట్లు చేయవచ్చునేమో” వాసంతిక అన్నది.

“ఇక ముందు ముందు వైద్య కళాశాలల సంఖ్య కూడా పెంచాలి” అని మళ్ళీ అన్నది.

“అవును తల్లీ..!” అని జ్ఞానముని అన్నారు.

“తండ్రిగారు నాకొక సందేహం. నా సోదరి వాసంతిక.. ఏది చెప్పినా ఎంతో ఆలోచించి ఎంతో చక్కని సలహాలు ఇస్తున్నది. తాను చక్కని విద్యాలనెన్నో చురుకుగా అభ్యసించింది కూడా. అన్ని విషయాలలోనూ ఏ విధంగానూ తానూ మొగవారికి తీసిపోని తెలివితేటలను ప్రదర్శిస్తున్నది. అంటే ఆడవాళ్లు అన్నిటా చక్కగా రాణించగలరనే కదా!”

“అవును నాయనా..! ఆడపిల్లంటే మన ఇంటి మహాలక్ష్ములు” సాకేతముని అన్నారు

“గురువర్యా మరి మన రాజ్యంలో కొన్ని చోట్ల ఆడపిల్లంటే ఎందుకంత చిన్నచూపు చూస్తున్నారు. ఆడపిల్ల పుట్టగానే అయ్యో ఆడపిల్ల పుట్టిందే అని ఎందుకు ఏడుస్తున్నారు.?

“అవును నాయనా లోకరీతి అలాగే ఉన్నది. ఆడపిల్ల అంటే పెరిగి పెద్దయి తానూ ఒక ఇంటికి వెళుతుందని అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో? అని తల్లిదండ్రులు కలత పడుతుంటారు” సచికేతుడు అన్నాడు.

“అది కాదు మంత్రిగారు! పితృకర్మలను కొడుకే ఆచరించాలని. తలకొరివి కొడుకే పెట్టాలని పుత్రుడు పున్నామ నరకాన్ని తప్పిస్తాడని, మనవారి నమ్మకం కదా. అందుకే అందరూ పుత్ర సంతానాన్ని కోరుకుంటారు. అంతవరకూ బాగానే ఉన్నది కానీ ఆడపిల్ల పుట్టిందని బాధపడడం ఆడవారిని బాధపెట్టడం మాత్రం చాలా హేయమయిన విషయం. దీనిని అందరూ నిరసించాలి. దీనికి సంకేతాలు ప్రభుత్వం నుండే వెళ్ళాలి…” వాసంతిక దృఢంగా అన్నది.

24

“పెద్దలారా ఇప్పటిదాకా సిద్ధార్థుడు మీతో రకరకాల విషయాలను ముచ్చటించాడు. మీరంతా చాలా ఓపికగా విని అందులో సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచిస్తున్నారు. కాలం చాలా వేగంగా మారిపోతున్నది. యువరాజు ఆలోచనలు చాల అభ్యుదయంగా ఉన్నాయి. వాటిని మనము ఆచరించాలంటే అధికారులు అతని మాటలను ఆదేశాలుగా తీసుకోవాలన్నా ఈ రాచ వ్యవస్థలో యువరాజుకు ఒక హోదా అవసరం…”

“కానీ భావి మహీధరపుర రాజు ప్రజలకు తొలుత ఒక మంత్రిగానో సేనానానిగానో పరిచయం అవ్వడం ఎందుకు? అందుకే రానున్న వైశాఖ పుర్ణిమ నాడు యువరాజును రాజుగా పట్టాభిషక్తుని చేద్దామన్న నిర్ణయానికి వచ్చాను. కొంతకాలం నేను అతనికి గౌరవ సలహాదారునిగా ఉండి ఆ తరువాత హాయిగా తీర్థయాత్రలకు వెళ్ళి వస్తూనో పుస్తకపఠనం చేస్తూనో కాలం గడిపేస్తాను.”

రాజు మాటలకు ఒక్కసారిగా నివ్వెరపోయారు. రాజు సర్వ స్వతంత్రుడు అతని మాటలకు అభ్యంతర పెట్టడానికి ఎవరూ సాహాసించలేదు. కొంత అయోమయముగానే చప్పట్లు కొట్టి ఆమోదం తెలిపారు. అందరూ సిద్ధార్ధునికి కరచాలనం చేసి అభినదించాలని ముందుకు వచ్చారు.

అంతలో సిద్ధార్థుడు లేచి నుంచున్నాడు. “తండ్రిగారు మీరు నా మీద చూపుతున్న అవ్యాజ ప్రేమకు, నమ్మకానికి మీకు, నా తల్లి మాలినీదేవికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పరిపాలనను మా వంటి యువతకు అప్పజెప్పుదామన్న నిర్ణయం తప్పనిసరి అనుకుంటే మాత్రం నాదొక సలహా…”

“సృష్టికి మూలం అమ్మ. స్త్రీలు గౌరవించబడాలి ఆదరించబడాలి. కానీ మనం స్త్రీలను పుస్తకాలలో పూజిస్తూ… మాట్లల్లో పొగుడుతూ… ఆచరణలో మాత్రం మగవారి తరువాతి స్థానమే ఇస్తున్నాం. మీరు కూడా అదే పొరపాటు చేయరాదు. నాకంటే పెద్దయిన సోదరి వాసంతిక మంచి విద్యావంతురాలు. ఆలోచనాపరురాలు ఉండగా నాకు పట్టం కడుతానని అనడం బాగోలేదు. స్త్రీలకూ సముచిత రీతిని ప్రాధాన్యత నివ్వడం మన దగ్గరనుండే ప్రారంభించి… సోదరి వాసంతికను ఈ మహిధరపుర భావి సామ్రాజ్ఞిని చేద్దాం. స్త్రీలను గౌరవించడం… ఆమెకు అన్నిటా సమాన హోదా ఇవ్వడం, అన్ని విద్యలందు ఆమెను నేర్పరిని చేయడం మన రాచనగరునుండే ప్రారంభిద్దాం.”

సిద్ధార్ధుని మాటలకూ వాసంతిక అమితమయిన విస్మయానికి గురయింది. ఆ సభామందిరం చప్పట్లతో మారుమ్రోగిపోయింది.

“కానీ సిద్ధార్థా! సోదరికి తగిన సంబంధం చూసి వివాహం జరిపించాలి కదా! రాచపదవి నొసగి ఇక్కడే ఉంచేస్తే ఎట్లా?” అడిగాడు శశాంకవర్మ.

“సోదరికి వివాహం నిశ్చయం జరిగినప్పుడు వరుడు ఇక్కడే ఉంటానంటాడా…? లేక మన సోదరే మరొక రాజ్యనికి పట్టమహిషిగా వెళ్తుందా…? అన్నది అప్పుడు ఆలోచిద్దాం తండ్రీ. సోదరికి పట్టం కట్టడంవలన మనం తన సేవలు ఉపయోగించుకున్న వారమౌతాము. ప్రజలకు మహిళలకు సమానస్థాయి ఇవ్వడం గురించిన సందేశం ఇచ్చిన వారమౌతాము.”

“మరి నీ సంగతి ఏమిటి సిద్దార్థా..?” రాణీ మాలినీదేవి అడిగింది.

“ఈ అక్కకు ప్రియమయిన తమ్ముణ్ణి. ఆమెకు పరిపాలనలో సహాయంగా యువ ప్రధానిగా ఉంటాను” సంతోషంగా చెప్పాడు సిద్ధార్థుడు.

శశాంకవర్మ ఆనందంగా సిద్దార్ధుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here