[న్యూరోటెక్నాలజీలో వస్తున్న కొత్త ఆవిష్కరణలతో మానవ హక్కులకి భంగం కలగకుండా చూడాలని ఈ రచనలో వివరిస్తున్నారు శ్రీమతి ఆర్. లక్ష్మి.]
[dropcap]మ[/dropcap]నోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు కార్ల్ మింగ్ సిద్ధాంతం ప్రకారం – ఆలోచన, అనుభూతి, భవిష్యత్తుకు సంబంధించిన అంచనా, గ్రహణశక్తి – ఈ నాలుగు అంశాలూ మనిషి శక్తి సామర్థ్యాలను నిర్దేశిస్తాయి. మనిషి తన చేతనావస్థలోని మెదడు పని తీరును లేదా వ్యవహార శైలిని నిద్రాణస్థితిలోని మెదడు పనితీరు లేదా వ్యవహార శైలితో సమన్వయం చేసుకోగలిగితే చక్కటి సమతౌల్యంతో కూడిన వ్యక్తిత్వం ఏర్పడుతుంది.
మనిషి మెదడులో ఆలోచన అనే ప్రక్రియ అనేక అంచెలలో జరుగుతుంది. మన అంతర్గత ఆలోచనలను మెదడు పనితీరును నిర్దేశించుకునే నిర్ణయించుకునే సహజమైన తీరుతెన్నులను సాంకేతిక పరిజ్ఞానంతో అద్యయనం చేసి విశ్లేషించగల స్థాయికి టెక్నాలజీ చేరడం సంతోషించవలసిన విషయమే గాని, పర్యవసానాలను గురించి కూడా క్షుణ్ణంగా ఆలోచించాలి.
న్యూరోటెక్నాలజీ – వ్యక్తిగత గోప్యత
ఒక పరిశోధకుడు/పరిశీలకుడు ఒక వ్యక్తి యొక్క మెదడు చర్యలను రికార్డు చేయడం ద్వారా అతని ఆలోచనలు/ఫీలింగ్స్‌ని చదవగలడా? బ్రెయిన్ రికార్డింగ్‍ని చదవటం అంత సూటి విధానం కానేకాదు. అప్పటికే సమాచారం అంతా వడపోతలు/అల్గారిథమ్స్ గూడా ప్రయాణించి ఆఖరున మనిషి చదవటానికి అందుబాటులోనికి వస్తుంది.
చిలీ – మొట్టమొదటిగా – న్యూరోసాంకేతికత కారణంగా వ్యక్తిగత గోప్యతకు, తద్వారా మానవహక్కులకు భంగం వాటిల్లగల అవకాశాలను, ముప్పును ప్రస్తావిస్తూ రాజ్యంగంలో మార్పులు చేసింది. అక్కడి ప్రజలకు తమ మేధస్సు, మెదడు పని తీరు, దానికి సంబంధించిన సమాచారం, గోప్యత వంటి అంశాలకు సంబంధించి న్యాయపరమైన రక్షణ ఉంది.
న్యూరో రైట్స్ ఫౌండేషన్ – కొలంబియాకు యూనివర్సిటీ చెందిన న్యూరోసైంటిస్ట్ రాఫెల్ యుస్టే న్యూరోటెక్నాలజీ వలన ఒనగూడగల బహుముఖ ప్రయోజనాలను వక్కాణిస్తూనే మరి కొందరు మేధావులతో కలసి ఈ సంస్థను మానవ హక్కుల పరిరక్షణనూ దృష్టిలో ఉంచుకొని నెలకొల్పి కొనసాగిస్తున్నారు.
సెంటర్ ఫర్ కాగ్నిటివ్ లిబర్డీ అండ్ ఎథిక్స్
ఈ సంస్థ 1999 లోనే ఏర్పడింది. ఒక వ్యక్తి తన మేధస్సు లేదా మెదడును, ఆలోచనలకు సంబంధించి వివిధ రకాలుగా వినియోగించుకోవడానికి గల స్వాతంత్ర్యం ఎవరూ కాదన లేనిది. వ్యక్తి గోప్యత, అటానమీ, హుందా, హార్మోన్ల స్పందనలు మానసిక స్థితికి ప్రభావితం చేయడం మనిషి ప్రమేయం లేకుండానే జరిగే ప్రమాదం ఉంది. ఇటువంటి వాటిని వినియోగించడానికి I.B.C. (International Bioethics Committee) 2019లో ఒక రిపోర్టును ప్రవేశ పెట్టింది. న్యూరోటెక్నాలజీకి సంబంధిచిన ఆవిష్కరణలో/వినియోగంలో నైతిక విలువలు దెబ్బతినకుంటే జాగ్రత్త వహించడానికి కొన్ని సూచనలూ చేసింది.
2023లో యునెస్కో సైతం న్యూరోటెక్నాలజీకి సంబంధించిన నీతినియమాలను గురించిన చర్చలకై ఒక సదస్సును నిర్వహించింది. అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శకాలనూ వెలువరించింది.