Site icon Sanchika

నిద్ర లేచిన చైతన్యం

[box type=’note’ fontsize=’16’] దీప్తి భద్రావతి కన్నడంలో రాసిన కథని ‘నిద్ర లేచిన చైతన్యం’ అనే పేరిట తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు చందకచర్ల రమేశ బాబు. [/box]

[dropcap]స[/dropcap]న్నగా తుంపర పడి అప్పుడే ఆగిపోయింది. కప్పలు ఇంకా బెకబెకలాడుతూనే ఉన్నాయి. అరుంధతికి ఆ చప్పుళ్ళు సహించరానివై అటూ ఇటూ పొర్లుతూ నిద్ర పోయే ప్రయత్నంలో ఉంది. అప్పుడే ఎవరో తలుపు చిన్నగా తట్టినట్టనిపించింది. ఆ సమయంలో ఇంటికి వచ్చేవారు ఎవరూ లేకపోవడంతో అరుంధతికి వణుకుతో కూడిన భయం, అలాగే ఎవరై ఉంటారా అనే కుతూహలం రెండూ కలిగి గోడ గడియారం వైపు చూసింది. రాత్రి రెండు గంటలు చూపిస్తోందది. చప్పుడు కాస్త ఎక్కువయ్యింది. అది తనతో పాటు భయం తాలూకు సన్నని అలను మోసుకుని వచ్చినట్టనిపించింది. తలుపు తెరిచే ధైర్యం రాలేదు.

మనిషిని మనిషి నమ్మే కాలం అదెప్పుడో కనుమరుగై, సందేహాలే కనిపించే కాలం కాబట్టి అరుంధతి లేచి కూర్చుంది. అప్పుడే నిద్రలోకి జారిన మణివేలు, అదే అరుంధతి మొగుడికి చప్పుడు చికాకుగా అనిపించి “ఎవరో చూడచ్చుకదా” అంటూ అరిచాడు.

తలుపు తీయగానే ఒక స్త్రీ ఆకారం ధడాలని తలుపు తోసుకుని లోపలికి వచ్చింది. అరుంధతి తడబడింది. ఒక్క క్షణం చకితురాలై “ఎవరు ఎవరు” అంటూ గట్టిగా అరిచింది. ఆ ఆకారం అరుంధతి నోటిని మూసి పట్టుకుంది.

“అక్కా! భయపడకు” అంటూ ఇంకా తోసుకుంటూ వచ్చి గట్టిగా ఆమెను పట్టుకుని ఏడవసాగింది.

అరుంధతి ఇంకా బెదిరిపోయింది. ఆమె నుండి వదిలించుకుని హాల్లోని లైట్లన్నీ వేసింది. ఇరవై, ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయి, బాగా చిరిగిపోయిన దుపట్టా, చెక్కుకుపోయిన మోచెయ్యి, ఎరుపురంగుకు తిరిగిన కపోలాలు, చిట్లిపోయి రక్తం జినుగుతున్న పెదాలు. ఎవడో యుద్ధపిపాసి సామ్రాజ్యాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నించిన అన్ని చిహ్నాలూ ఆ అమ్మాయిలో కనిపించాయి. వెలుగులో చూసిన తరువాత కూడా ఆ అమ్మాయి ఎవరో గుర్తు రాలేదు అరుంధతికి. “ఎవరమ్మా నువ్వు” అని అడగాలని అనుకున్నా ఆ అమ్మాయి మొహం చూసి గొంతు పెగల్లేదు.

ఇంతలో ఈ చప్పుడుకు మణివేలుకు మెలకువ వచ్చి మేడమీదినుండి దడదడా క్రిందికి వస్తూ “ఏమయ్యింది” అన్నాడు. అతడిని చూడగానే ఆ అమ్మాయి ఇంకా గట్టిగా ఏడవసాగింది. మణివేలు ఆమె మొహం చూసి, నిర్లిప్తంగా “నువ్వా! ఏమయింది? ఇక్కడికెందుకు వచ్చావు?” అంటూ ఇదంతా మామూలే అన్నట్టు అడిగాడు. అరుంధతి గాబరా పడింది. వేళ కాని వేళలో తన ఇంట్లోకి జొరబడి ఏడవడం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని కంగారుపడసాగింది. కాని మంచివాళ్ళు ఏదో కొంత పాపం చేస్తే సర్దుకుపోయే ఈ లోకం గురించిన మొండి ధైర్యం ఆమెలో ఉంది. ఎవరో కక్షిదారు ఉండవచ్చు అని అనుకుంటార్లే అని తనను తాను సమాధాన పరచుకుంటూ నుంచున్నా, మరుక్షణమే గుర్తుకు వచ్చింది, మణివేలు తన స్నేహితుల్నికాని, కక్షిదారులను కానీ ఇంటికి తీసుకురాడని….. మరి ఒక అమ్మాయి ఈ అవస్థలో… అదీ ఈ టైములో…..?

“ఏంటి ఈ టైములో? ఇంటి దగ్గరికి రాకూడదు అని ఎన్ని సార్లు చెప్పాను?” కొంచెం గడుసు ధ్వనితోనే మణివేలు ఆ అమ్మాయిని అడిగాడు. అరుంధతికి ఆ స్వరం నచ్చలేదు. అతనంతే. ఎప్పుడూ ఏడ్చే ఆడవాళ్ళంటే పడదు అతనికి. “చేతకాదూ పెట్టదు, ఊరికే ఏడవడం అంతే” అని కోపగించుకుంటాడు. తను ఏడిస్తే కూడా అంతే.

“కళ్ళలో నీళ్ళు ఉచితంగా వస్తాయనే కారణంగా అడ్వాంటేజ్ తీసుకోకూడదు. నాకసహ్యం” అంటాడు. తన ఏడుపు ఎండిపోవడానికి అతను పరోక్ష కారణమని అరుంధతికి అప్పుడప్పుడు అనిపిస్తుంది. తనకైతే సరే. ప్రపంచంలోని ఆడవాళ్ళందరి పైన ఇలా జబర్దస్తీ చూపితే ఎలా అని అనుకుంటూ మణివేలు వైపు చూసింది. అతడికి ఈమె చూపు అర్థమయినట్టనిపించలేదు. ఆ అమ్మాయి అలా నుంచుని వెక్కుతూనే ఉంది. అరుంధతికి జాలి అనిపించింది. అమ్మాయిని తనే తీసుకుపోయి సోఫాలో కూర్చోబెట్టి, త్రాగడానికి మంచినీళ్ళిచ్చి, మలాము రాయసాగింది. అంతలో మణివేలుకి నిద్ర మత్తు ఎగిరిపోయి కాస్త స్తిమితపడ్డట్టు అనిపించింది. కానీ మొహంలో ఇంకా అసహనం ఉన్నట్టు అరుంధతికి అనిపించింది. “ఎవరమ్మాయ్ నువ్వు? ఇంతకీ ఏమయ్యింది?” అని అడిగింది. మణివేలు మధ్యలో కలగజేసుకుని “ఈ అమ్మాయి హనుమక్క కూతురు, మధువంతి” అన్నాడు.

అరుంధతికి వెంటనే హనుమక్క ఎవరని స్ఫురించక పోయినా తరువాత గుర్తుకు తెచ్చుకుని “అలాగా” అని కళ్ళు పెద్దవి చేసింది. హనుమక్క గురించి పెద్దగా తెలియకపోయినా ఆమె భద్రావతి పట్టణం చుట్టుపక్కల జేబుదొంగల లీడర్ అని మాత్రం తెలుసు. కనీసం పదిహేను రోజులకోసారైనా ఆమె గురించిన వార్తలు పేపర్లలో వస్తూనే ఉండేవి. బెలగాంలో గొలుసు దొంగతనమైనా, బెంగళూర్లో వ్యానిటీ బ్యాగ్ దొంగతనమైనా, అంతెందుకు రాష్ట్రంలో ఏమూల ఇలాంటి అపరాధాలు జరిగాయి అనగానే పోలీసులు మొదట ఆమె ఇంటి ముందే వచ్చి నిలబడేవారు.

సుమారు యాభై, యాభై అయిదు పిల్లల్ని ఈ వృత్తిలో పెట్టి ఉంచింది. “మేమేమైనా బీదవాళ్ళ సొమ్ము కొట్టేస్తామా” అనేది ఆమె రోజూ వినిపించే వాదన.

అలాంటి హనుమక్కకు ఆప్తరక్షకుడు మణివేలు. ఎవరెవరి కాళ్ళో పట్టుకుని, దుకాణాలలో అలగా పన్లు చేసి ఎలాగో లాయర్ గిరి అయిందనిపించిన మణివేలుకు దేవత లాగా దొరికింది హనుమక్క. ప్లీడరు వృత్తిని ప్రారంభించినప్పుడు ఎవరూ ఇతడిని నమ్మకుండా ఒక్క ఫైలు కూడా లేకుండా ఖాళీగా కూర్చున్న అతడిని నమ్మి మొట్ట మొదటి కేసు ఇచ్చింది ఈ హనుమక్కే. కాబట్టి హనుమక్కను తన పాలిటి దేవతలా భావించాడు మణివేలు. ఆమె అనుచరులు పట్టుబడితే ఎక్కడికైనా వెళ్ళి తనే స్వంత జామీనుపై విడిపించి తెచ్చేవాడు. ఆమె కూడా అలాగే చిన్న కేసా పెద్ద కేసా అని చూడకుండా అతని ఫీజును ఇంటికి తీసుకు వచ్చి ఇచ్చేది. ఈ కథలన్నీ పది పదిహేను సంవత్సరాల క్రితం జరిగినవి. మణివేలు ఇప్పుడు పట్టణంలోని పెద్ద క్రిమినల్ లాయర్‌గా మారినా హనుమక్కను నిర్లక్ష్యం చెయ్యలేదు. ఇలా గౌరవ మర్యాదలు పెరిగాక చిన్నా చితకా కేసులకు తాను పోకుండా తన జూనియర్లను పంపుతాడు. అలాగే హనుమక్క కూడా పెద్ద బాధ్యతలు తీసుకోకుండా తన గ్యాంగ్ కుర్రాళ్ళకి పనులు అప్పజెప్పి తను కృష్ణా రామా అనుకుంటూ భజన మండలికి వెళ్ళసాగింది.

మణివేలు గొంతు తగ్గించి “ఏమయ్యింది” అన్నాడు. ఆమె వెక్కుతూనే “అన్నా మంజు” అంది. మణివేలుకు నెత్తికెక్కింది. “వాడి బైక్ వెనుక కూర్చుని తిరిగావుగా” వాడిగా అడిగాడు. ఆమె “అవునన్నా” అంది. అతడు మళ్ళీ మాట్లాడేంతలో ఆమె “ అన్నా! ప్రేమించాను నిజమే. కానీ వాడు…..” అంటూ మోచేతి గాయాన్ని చూసుకుంటూ మరోసారి వెక్కింది.

“రాత్రిళ్ళు ఆడవాళ్ళు గడప దాటితే ఇంతే మరి” అన్నాడు మణివేలు అచ్చం మగాడిలా.

“మాట్లాడాలి, రమ్మన్నాడు” అంది.

“వాడు రమ్మన్నాడు. నువ్వు వెళ్ళావు. అర్ధరాత్రి పూట మగాళ్ళు మాట్లాడే మాటలేవి అని నీకు తెలియదా?” మణివేలు మాటల్లో బాగా పదును కనిపించింది. అరుంధతికి నచ్చలేదు.

“పడుచు పిల్లతో ఇలాగేనా మాట్లాడేది” అని అనాలనుకుంది.

కానీ తన మాట్లాడేటప్పుడు ఎవరైనా కలగజేసుకుని మాట్లాడితే ఎక్కడలేని కోపం వస్తుంది మణివేలుకి అని తెలిసిన తరువాత మధ్యలో మాట్లాడడమే ఆపేసింది అరుంధతి. అలా సంవత్సరాల కొలదీ ఆగిపోయిన మాట మళ్ళీ బయటికి రావడానికి గొంతు పెగలక జరుగుతున్న సన్నివేశాన్ని చూస్తూ గమ్మునయిపోయింది. కానీ చూడడానికి కాస్త గట్టిగానూ, ఫ్యాషనబల్‌గా కనబడుతున్న అమ్మాయి అసహాయకురాలిగా అతడి ఎదుట దీనంగా కన్నీరు కార్చడం అరుంధతికి జాలిగా అనిపించింది.

“సరే. ఇప్పుడు ఇంటికెళ్ళు. రేపు చూద్దాం.” అంటు మణివేలు లేవబోయాడు. ఆ అమ్మాయి ఉన్నట్టుండి మణివేలు కాళ్ళు పట్టుకుంది. “అన్నా! అమ్మ ఇంట్లోకి రానివ్వడం లేదు. పరువు తీశావు అంటూ తన్ని బయటకు తరిమేసింది.” గొంతు పెగలక వెక్కింది. అరుంధతికి ఇది విచిత్రంగా అనిపించింది. “తనే ఒక దొంగ! ఇలా తన కూతురినే బయటకు గెంటడం, అదీ పరువు పోయింది అని భావించడం….” నమ్మ బుద్ధవలేదు. మణివేలు కూడా అంతే ఆశ్చర్యంతో “అలాగా!” అన్నాడు. “అన్నా! మీరు ఒక మాట అమ్మకు చెప్పండన్నా” అన్నది మళ్ళీ.

“సర్లే. చెప్తాను. నువ్వు ఇప్పుడు మొదట గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్ళి అడ్మిట్ అయి కేస్ వెయ్యి.” అంటూ ఐదు వందల రెండు నోట్లు ఆమె చేతిలో పెట్టాడు. ఆమె “వద్దన్నా. అమ్మకు ఫోన్ చెయ్యండి. ప్లీజ్” అంటూ బ్రతిమలాడ సాగింది. చివరికి అటూ ఇటూ అలోచిస్తూ, చిటపటలాడుతూనే మణివేలు నంబర్ నొక్కాడు. అమ్మాయి ఊరడిల్లినట్టయి బయలుదేరింది. అరుంధతికి భయమేసింది. “అలాక్కాదు. అర్ధరాత్రి ఇంటికొచ్చిన అమ్మాయిని ఇలా ఒంటరిగా పంపెయ్యడమా? మీరు వెళ్ళి దింపేసి రావచ్చుకదా” భయపడుతూనే అంది.

“వీళ్ళు నీలాంటి ఆడవాళ్ళు కాదులే. వీళ్ళ పనులు మొదలయ్యేదే అర్ధరాత్రి తరువాత. కదూ?” అంటూ అమ్మాయికేసి చూశాడు. ఆ అమ్మాయి మొహం వివర్ణమయ్యింది. అరుంధతివైపు చూస్తూ “అవును” అన్నట్టు తలాడించింది. అలా అనేటప్పుడు ఆ అమ్మాయి కళ్ళలోనుంచి సోఫా పైకి రాలిన నీటి చుక్కను అరుంధతి గమనించింది. మణివేలు కంటబడలేదు.

వారం గడిచింది. మణివేలుని అడిగినా అతడినుండి సమాధానం రాలేదు. బదులుగా “రేప్ కేసులో నీకెందుకంత ఆసక్తి” అన్నాడు. అతడెప్పుడూ అంతే: ఇద్దరి మధ్య దూరం ఉంచి అనుమానిస్తూ బ్రతుకుతాడు. అన్ని సంబంధాలనూ శరీర స్థాయిలోనే ఊహించుకుంటాడు. మొదట్లో తనకు చాలా అసహ్యంగా అనిపించేది. తనకు ముందు అనిపించిన తన మీది ప్రేమయొక్క పొసెసివ్‌నెస్, తరువాత కాలంలో తనను గుప్పిట్లో ఉంచుకునే ఉపాయం అని అర్థమవసాగింది అరుంధతికి. అతడలా దూరంగా పెట్టి మాట్లాడడం వలన తనకేర్పడిన కంఫర్ట్ జోన్ ముందు ఆప్యాయంగా అనిపించినా, రాను రాను ఒంటరిదాన్ని చేసి బేలతనాన్ని సృష్టించినట్టనిపించింది.

ఇద్దరి నడుమ ఎన్ని గోడలు అనిపించి మనస్సు కుంగిపోతుంది. కానీ అన్ని దాంపత్య జీవితాలు ఇలాగేనేమో అనిపించి మనస్సుకు నెమ్మది అనిపిస్తుంది. ఉత్త వీపులు మాత్రం మాట్లాడుకునే ఇలాంటి సంబంధాలు ఎందుకు కొనసాగిస్తారో అని ఆలోచించి ఆలోచించి అరుంధతి విసిగిపోయింది. ఈ నిశ్శబ్ద జీవితం నుండి వెళ్ళిపోవాలి అని అనేక సార్లు అనుకుంది. కానీ ఎక్కడికని వెళ్ళేది? జవాబు దొరకకపోవడంతో జీవితం యాంత్రికంగా సాగిపోతోంది.

మళ్ళీ అదో రోజు మధ్యాహ్నం తలుపు తట్టిన చప్పుడు. వెళ్ళి చూస్తే మధువంతితో పాటు వాళ్ళమ్మ హనుమక్క కనిపించారు. ఇద్దరూ తలుపువైపే నిరీక్షణగా చూస్తున్నారు. అరుంధతి గాబరాపడింది. వీళ్ళు ఇంటికి మాటిమాటికీ ఇలా రావడం, అదీ మణివేలు లేనప్పుడు అని ఆలోచిస్తూ ఉండగానే “నేను హనుమక్కని అమ్మా” అన్నదామె. చేతులు జోడించింది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే లక్షణమైన రూపం ఆమెది. పరకాయించి చూడకపోతే మధువంతి అక్కేమో అనిపించే ఉత్సాహం కనిపించింది మొహంలో. అరుంధతికి చిన్నగా తలనొప్పి మొదలయింది.

“ఇంత లక్షణంగా కనిపించే ఈమె దొంగతనం చేస్తుందా” అనుకుంటూ “లోపలికి రండి” అన్నది. “వద్దులే అమ్మా. మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళ ఇంట్లోకి రాకూడదు.” అన్న హనుమక్క మాటలకి అరుంధతికి నవ్వొచ్చింది.

“ఆ ఏముందిలేమ్మా. ఈ ఆస్తి, అంతస్తూ, ఇల్లూ భూమి అన్నీ మీలాంటివాళ్ళ దయే” అని అనాలనిపించినా, అనకుండా “ఆయన లేరు. ఆఫీసులో దొరుకుతారేమో” అంది.

“అన్న కోర్టులోనూ కనిపించలేదు, ఆఫీసులోనూ…. అందుకే” అంటూ తను తెచ్చిన పూలు, పళ్ళు కొన్నినోట్లు టేబల్ పైన పెట్టింది హనుమక్క. ఉన్నట్టుండి వలవలా ఏడవసాగింది. బలవంతంగా ఇద్దరినీ లోపలికి తీసుకొచ్చి కూర్చోమంది అరుంధతి. వాళ్ళిద్దరూ దీనంగా ఇంటి మూలలో కూర్చున్నారు. “చూడక్కా! ఇది ఎలాంటి పని చేసిందో” అంటూ పెద్దగా ఏడవసాగింది హనుమక్క. ఇప్పుడు మధువంతి కూడా వాళ్ళమ్మతో పాటు ఏడవసాగింది. అరుంధతి సముదాయిస్తున్నట్టుగా “ఇప్పుడేమయ్యింది?” అన్నది. “నా మొగుడి వైపు వాళ్ళు నా వైపు వాళ్ళూ అంతా మొహానికి ఉమ్మేస్తున్నారు. ఆడపిల్లని పెట్టుకుని బిజినెస్ చేస్తున్నాను అంటున్నారక్కా” హనుమక్క వెక్కింది. అరుంధతికి ఆశ్చర్యమేసింది. “దొంగలకూ పరువు మర్యాదలుంటాయా” అని.

“నా మొగుడు పోయాక నా అత్తవారింట్లోంచి గెంటేసారక్కా. చంకలోని పాప ఇది. పన్లోకి వెళ్తే వెంటబడే మేస్త్రీలు. అలాంటిదాన్ని కాకూడదని రోడ్డు పైన పడితే తీసుకు పోయి అన్నం పెట్టినామె చెయ్యమన్న పనే చేశానక్కా. నా బ్రతుకు వీధిన పడింది కానీ ఇదైనా బాగుపడాలి అనుకుంటే ఇదేమో ఇలా చేసుకుని కూచుంది.” అంటూనే పక్కనున్న మధువంతి వీపు వంచి రెండు గుద్దింది హనుమక్క. ఆ గుద్దుల్లో తను ఇన్ని రోజులు అనుభవించిన బాధలు, అవమానాలు, ఇప్పటి నిరాశ అన్నీ ఉన్నట్టు అరుంధతికి అనిపించింది.

“పెరిగిన పిల్లల పైన అలా చెయ్యి చేసుకోకూడదు. ఇప్పటికైనా ఏం మించిపోలేదు. వాడ్ని ఒప్పించి పెళ్ళి చేసేస్తే సరి” అంటూ తనకు తోచిన సలహా ఇచ్చింది. “అయ్యో అక్కా! నేను అలానే అనుకున్నాను. అందుకే వాడింటికెళ్ళి కాళ్ళు పట్టుకుని వేడుకున్నాను. కానీ వాడేమన్నాడో తెలుసా ‘కలిసి పడుకున్నవాళ్ళందరినీ పెళ్ళి చేసుకుంటూ పోతామా’ అన్నాడు. అక్కడే ఉన్న వాళ్ళమ్మ ‘దొంగ ముండా! కూతుర్ని ఉసిగొలిపి నా కొడుకును బుట్టలో వేసుకోవాలని చూస్తావా’ అంది. నేను దొంగతనాలు చేస్తానని ఒప్పుకుంటానక్కా. కానీ ఇలాంటి నీతిమాలిన పనులు చెయ్యను.” అంది. అరుంధతికి జాలి వేసింది. “పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది కదా” అన్నది. “అదేమో దాఖలు అయ్యిందక్కా. కానీ ఇన్ని రోజులైనా వాడ్ని స్టేషన్‌కి తీసుకురాలేదు. ఇంట్లోనే ఉన్నా అదేదో అబ్స్కాండో ఏమో రాసేసుకుంటున్నారు. అడిగితే ‘మీ లాంటి దొంగలకి పెద్దింటి పిల్లలే దొరకుతారు కదా ప్రేమించడానికి? నువ్వు ముసల్దానివైపోయావు. ఇప్పుడు నీ కూతుర్ని అడ్డం పెట్టుకుని ఈ నాటకాలాడుతున్నావు’ అంటూ మాట్లాడతారు. నాకైతే చచ్చిపోవాలి అనిపిస్తోందక్కా” అంటూ హనుమక్క కొంగుతో మొహం కప్పుకుని ఏడవసాగింది.

అరుంధతి ఇప్పుడు మధువంతి మొహానికేసి చూడసాగింది. తనేదో ఘోరమైన తప్పు చేసినట్లు ఆమె శూన్యంలోకి చూస్తోంది. చెంపల మీద ఇంకా గీరుడు గాయం గుర్తులు కనిపించాయి. మెడ ఒక వైపు వాచినట్టు అనిపించింది. ఏడ్చి ఏడ్చి కళ్ళు గుంతలు పడ్డాయి. ఎండిన పెదాలు. సరిగ్గా దువ్వకుండా చింపిరిగా కనిపిస్తూన్న జుట్టు, ముడుతలు పడిన చూడీదార్. తను ఆ రోజు రాత్రి చూసిన మధువంతి ఈమేనా అనేటట్టు అనిపించింది అరుంధతికి. అయ్యో! ఇంతేనా ఆడ జన్మ…. అనిపించింది. అరుంధతి హృదయం ద్రవించింది. ఆ అమ్మాయి తల నిమరాలనిపించింది. “ఈ పిల్లేమీ తక్కువది కాదు. వాడి వెంట ఇక ఇకలు పక పకలతో ఊరంతా తిరిగింది. అదో దాని డ్రెస్సో! ఈ లెవెల్ వాళ్ళంతా అంతే” మణివేలు ఎవరితోనో మధువంతి గురించి చెప్పడం విన్న అరుంధతికి అది గుర్తుకొచ్చి జాలేసింది. “మరి ముందు దారేది? మణివేలుతో మాట్లాడాలా?” అని అడిగింది హనుమక్కని.

“అవునక్కా! ఎలాగైనా వాడ్ని పెళ్ళికి ఒప్పించమనండి. తాళి అంటూ దీని మెళ్ళో పడ్తే అంతే చాలు. పరువు దక్కుతుంది.” అనింది హనుమక్క. ఆమె మాటలు నిజమే అనిపించినా దాంతోపాటే దిగులు కూడా కలిగింది అరుంధతికి “పెళ్ళైనాక హింసిస్తే?” అంది. “అదేముందక్కా. అది ఓర్చుకోవచ్చు. చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు బల్లాల్లా గుచ్చుకుంటున్నాయి” అనే ఆమె మాటలు అరుంధతికి కూడా నిజమనిపించాయి. “సరేలే. ఆయనతో మాట్లాడతాను.” అంటూ వాళ్ళను సాగనంపింది అరుంధతి.

అరుంధతి చెప్పడమైతే సులభంగానే చెప్పేసింది మాట్లాడతానని. కానీ మణివేలు తనతో దీని గురించి మాట్లాడడానికి ఇష్టపడతాడా అన్నది ఆమెకు సందేహంగానే ఉండింది. రోజంతా కలిపి ఏ ఒకటో రెండోమాటలు దొర్లుతాయి వారిరువురి మధ్య అనే విషయం గుర్తుకొచ్చి ముల్లు గుచ్చుకున్నట్టయింది. పెళ్ళైనాక, రోజులు గడిచే కొద్దీ వివాహ బంధం గట్టి పడుతుంది అనే నమ్మకం ఆమెకు ఎప్పుడో పోయింది. పెళ్ళి రోజే పూటుగా తాగొచ్చి, తనకూ ఆమెకూ సంబంధమే లేనట్టు బయటికి వెళ్ళిపోయిన క్షణం నుంచీ ఆమెకు మౌనమే శరణమయ్యింది. ఇంత మాత్రానికి ఈయన పెళ్ళి చేసుకుందెందుకు? ఇంటి పనికా, పక్కలోనే అన్నీకానిచ్చే తన అమ్మను చూసుకోవడానికా, లేదా పేద ఇంటి పిల్లను పెళ్ళి చేసుకుని ఉద్ధరించాను అని డప్పు కొట్టుకోవడానికా.. ఆమె ఆలోచించి ఆలోచించి అలసిపోయింది. ఇలా ఉన్నా ఆమె నోటినుంఛి ఎలాంటి ప్రశ్నలూ బయటికి వచ్చేవి కావు. అతను ఇంటికొస్తే చాలు ఆమె గుండెల్లో రైళ్ళు పరిగెత్తేవి. భయపెట్టే అతడి ఆకారం, ఎర్రటి కళ్ళు, వంకర నవ్వు, అకారణంగా కూచున్నా నుంచున్నా నోటినుండి రాలే తిట్లూ… వీలైనంత అతడి కంటపడకుండా తిరిగేది అరుంధతి. ఎప్పుడైనా కిటికీలోంచి బయటికి చూసింది కనిపిస్తే చాలు, కాల్చేలా అతడు చూసే చూపులకు తనకు రక్తస్రావమైనట్టుగా అనిపించేది. అలాగని అతను పగలు కానీ,రాత్రి కానీ దైహికంగా హింసించలేదు. కానీ ఆమెను చూసినప్పుడల్లా “నిన్ను చూస్తే ఈ జన్మకు కాదు గదా వచ్చే జన్మక్కూడా కావాలని అనిపించదు” అనేవాడు. ఆమె అప్పుడప్పుడు అద్దం ముందు నుంచుని తన విప్పారిన కళ్ళనీ, లావు పెదాల్నీ, సన్నటి దేహాన్ని చూసుకునేది. “నాలో ఏం తక్కువ?” అని అడగాలనిపించేది. “కానీ ఎవరిని అడగాలి?” అన్నదానికి జవాబు లేదు. పెదాల దాకా వచ్చిన మాటలను మ్రింగేసేది. అలా ఆమె వద్ద మిగిలిపోయిన మాటలు గోడలయ్యాయి. చుట్టూరా వ్యాపించి ఒక భవనంలా మారాయే తప్ప ప్రశ్నలుగా బయటికి రాలేదు. అలా బయటికి వస్తే తను అలా కట్టుకున్న కోటగోడ బ్రద్దలవుతుందేమో అనే భయంతోనే బ్రతకసాగింది. మంచానికే అతుక్కు పోయిన ముసల్ది కూడా ఉన్నన్నాళ్ళూ “థూ గొడ్డు ముండా! నీ వల్ల మా వంశమే నిలిచిపోయింది” అని దెప్పి పొడుస్తూనే ఉండేది. అప్పుడంతా ఆమెకు తమ ఇద్దరి నడుమ ఉన్న శుష్క సంబంధాన్ని గురించి చెప్పాలనిపించేది. కానీ తన కొడుకును గురించిన మాటలను ముసల్ది నమ్ముతుందనిపించలేదు. ముసిల్దాని మాట పడిపోయాక మౌనంతో తన చుట్టూ ఒక మహలును నిర్మించుకుంది అరుంధతి. అలా మౌనమే హితవుగా అనిపించసాగింది. అతడి మాటలు కానీ, నవ్వు కానీ తనదనిపించకుండా పోయింది. అదీ కాకుండా రోజూ తనకు పాలు పోసే పాలామె “నీ మొగుడికి పైన ఆడది పడినా ఏమీ అనిపించదా?” అంటూ కిసుక్కున నవ్వినప్పుడు, తను ఎవరో అనామకుడితో బతుకుతున్నాను అనే భావన బలపడసాగింది. అతడు తన యజమాని అని, తను అతడి క్రింద పనిచేసే పనిమనిషి అని అనిపించసాగింది. పుట్టింటి కారే పైకప్పు, అమ్మ చినిగిన లంగా, తమ్ముడి అతుకుల చడ్డీ, మొగుడు వదిలేసి పంచన చేరి తన చిరిగి పోయిన బ్రానే పిన్నీసు పెట్టుకున తొడుక్కుంటూ గుడ్లలో నీళ్ళు కుక్కుకునే అక్క వీళ్లందరూ గుర్తుకు వచ్చి అతడినుండి విడిపోయే అవకాశం గురించి అమెను ఆలోచించనివ్వలేదు. తిని తొడుక్కోవడానికి కొదవ లేదు. కారు, బంగళా, చూసి ఏడ్చేవాళ్ళకు కావలసిన సౌకర్యాలు అన్నీ తనకు ఉండగా బ్రతికిన నాల్రోజులూ ఎక్కడ ఉంటే ఏంటి, ఎలా ఉంటే ఏంటి ఎలాగోలా బ్రతికేస్తే అయింది అనే నిర్లిప్త భావన పాతికేళ్ళ వయస్సులో పుట్టి ఈ నలభై ఐదేళ్ళ వయసులో పాతుకుపోయింది.

మణివేలు ఆ రోజు అలసి పోయి ఇంటికొచ్చాడు. అలా వచ్చాడంటే ఇక పడుకోవడానికి వెళ్తాడని తెలుసుకున్న అరుంధతి “హనుమక్క దాని కూతురు వచ్చారు ఈ రోజు” అని చెప్పింది. అలా ఏ రకమైన క్లూ ఇవ్వకుండా చెప్పేసరికి వేడి కాఫీ ఒంటి మీద ఒలికినట్టు ఎగిరిపడ్డ మణివేలు “ఎందుకట? ఇక్కడికి రాకు అని చెప్పి పంపు. అలాంటి వాళ్ళను ఎంటర్‌టైన్ చేయద్దు అని నీకెన్ని సార్లు చెప్పాలి?” అంటూ కోప్పడ్డాడు. అరుంధతికి బాధేసింది. హనుమక్క ఇచ్చిన డబ్బును తెచ్చిచ్చింది. “ఇంతే ఇచ్చిందా?” అన్నాడు. అరుంధతి మాట్లాడలేదు.

బదులుగా “కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు పట్టించుకోలేదట కదా?” అంది. “దొంగదాని కూతురు….. అదీ గాక ఇదే రాత్రి వాడితో పాటు వెళ్ళింది… ఎలా అరెస్ట్ చేస్తారు? వీళ్ళ వృత్తే అది” అంటూ ఏమీ ఆసక్తి లేనివాడిలా మాట్లాడాడు. అరుంధతికి అతడి ఈ ప్రవర్తన నచ్చలేదు. హనుమక్క గురించి అందరితో “హనుమక్క లాంటి నిజాయితీగల ఆడదాన్ని నేను చూడలేదు. కేసు అయిపోగానే ఎక్కడ ఉన్నా ఫీస్ పంపించేస్తుంది.” అని చెప్పిన మణివేలు ఇతడేనా అనిపించి అతడి వైపు గుచ్చి చూసింది. “అరెస్టేమీ అక్కరలేదట. ఆ అబ్బాయి పెళ్ళి చేసుకుంటే చాలు అంటోంది” అరుంధతి చెప్పాలనుకున్నవన్నీ గబగబా చెప్పేసింది. అతడు నవ్వసాగాడు. అలాగే ఇన్నేళ్ళకు తన ఎదుట నిలబడి ఇంత గట్టిగా మాట్లాడిన అరుంధతిని కొస చూపుతో చూశాడు. “వాడు దీన్ని పెళ్ళి చేసుకోవడమా? వాడికిది ఎన్నోదో? వాడి తండ్రికి సొసైటీలో మంచి పేరుంది. పైసలున్నాయి. అదీ కాకుండా మన జిల్లా మంత్రిగారు వీళ్ల సంబంధీకుడు. ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు” తన చేతిలో ఏమీ లేనట్టు మాట్లాడాడు. అతని మాటల్లోని ‘ఎవ్వరూ ఏమీ’ అనేది అరుంధతికి వింతగా అనిపించింది. మొట్టమొదటిసారిగా తనకంటే పన్నెండేళ్ళు పెద్దవాడైన మణివేలు పిరికి వెధవ అనిపించింది. “మరి ఆ అమ్మాయి గతి …..” ఆమెకు తెలియకుండానే గొంతులో గట్టిదనం వినిపించింది. మణివేలు గమనించకుండా “వాడు దులిపేసుకున్నట్టే ఇదీ దులిపేసుకుంటే సరి.” పక్కా వ్యాపారిలా మాట్లాడాడు.

“ అంటే?…”

“అంటే ఏంటి. మగపిల్లలు ఎలా క్యాజువల్‌గా తీసుకుంటారో అమ్మాయిలు కూడా అలానే తీసుకుంటే సరిపాయె. సమస్యే ఉండదు. తిరిగినన్నాళ్ళూ తిరిగి తరువాత శీలమూ, మర్యాదా అంటే ఏం చెయ్యలేం. అదీగాకుండా ఈ కేసు గవర్నమెంట్ ప్లీడర్ దగ్గరుంది. నేనేం చెయ్యలేను. నువ్వు కూడా ఇలాంటి అధిక ప్రసంగపు పనులేం చెయ్యక్కరలేదు.” అంటూ ముసుగు తన్ని పడుకుండి పోయాడు.

దాంతర్వాత రెండు రోజులకు హనుమక్క కూతురితో పాటు మళ్ళీ వచ్చింది. ఏదైనా మంచి వార్త వినవచ్చేమో అనే ఆత్రత మొహంలో కనిపించింది పాపం. కానీ, అరుంధతి మొహంలోని నిర్లిప్త ఛాయలు చూశాక జరిగింది తెలిసిపోయింది. “సాక్ష్యాలన్నీ నీ కూతురికి వ్యతిరేకంగా ఉన్నాయట హనుమక్కా” అరుంధతి తనే మొదలుపెట్టింది. “అక్కా! సత్యప్రమాణంగానే నేను ఆ అబ్బాయిని ఇష్టపడ్డానక్కా. పెళ్ళి చేసుకుంటానని అన్న తరువాతే వెంట తిరిగాను.” అంటూ వెక్కింది. అరుంధతికి ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. ఊరకుండిపోయింది. తల్లీ కూతుళ్ళిద్దరూ కొంతసేపటికి తేరుకున్నారు.

అరుంధతి మెదడు మాత్రం ముందేం చెయ్యాలో ఆలోచించసాగింది. “ఒక పని చెయ్యి. పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా కూర్చో. పనవుతుంది” అని సలహా ఇచ్చింది. ఆ క్షణంలో తను లాయర్ పెళ్ళాం అనిపించినా, అది బయట కనిపించడానికి మాత్రమే అనే నిజాన్ని గ్రహించి మనస్సు మళ్ళీ ముడుచుకుంది. దానికి మధువంతి

“అలా చేస్తే తను ఇక నాకు దొరకనే దొరకడు కదక్కా?” అనింది. ఆ అమ్మాయి కళ్ళల్లో ఆ అబ్బాయిని క్షమించేంత ప్రేమ కనిపించి అరుంధతికి ఆ అమ్మాయి పైన జాలి వేసింది. దాంతోపాటు అమ్మాయిలు ఇలాంటి మెత్తటి స్వభావం వల్లనే జన్మంతా ఏడవడం అని జుగుప్స కూడా కలిగింది. “చెప్పలేం. బెదిరి పోయి రానూ వచ్చు.” అంటూ ఆశ పెట్టింది. “అలాగా అక్కా” అంటూ మధువంతి సంబరపడింది. వాళ్ళమ్మ కూడా.

రాత్రి ఇంటికి రాగానే మణివేలు మండిపడ్డాడు. “నీకెందుకు అధికప్రసంగం?” అని అరిచాడు. అరుంధతి గాబరాగా

“ఎందుకు? ఏమయింది?” అని అడిగింది. “ఇంకేం కావాలి? నువ్వేదో వాళ్ళను స్టేషన్ ముందు కూర్చోమని చెప్పావట కదా!… పోలీసులు ఆ అబ్బాయిని లాక్కొచ్చారు. ఇప్పుడు చూడు. ఎం.ఎల్.ఏ నుండి ఛోటా నాయకుల వరకు అందరిదీ ఫోన్ నాకు. మనక్కావాలా ఇది?” అని అరవసాగాడు. అరుంధతికి మనస్సులో సంతోషంగా ఉంది. తనేమో సాధించినట్టు అనిపించి గట్టిగా ఈల వెయ్యాలనిపించింది. కాని పైకి మాత్రం “ అలాగా?” అని ఏమీ తెలియనట్టు అంది. “ఇలాంటి వాట్లో ఇక నువ్వు తల దూర్చవద్దు. ఇన్నాళ్ళూ ఏదో పోనిలే పాపం అనుకున్నాను కానీ ఈ రోజు మాత్రం నీది అతిగా అనిపిస్తోంది. ఇదే ఆఖరు…” అంటూ హెచ్చరించాడు. మొట్టమొదటి సారిగా అతడికి తన గురించి భయం మొదలైనట్టు అనిపించింది అరుంధతికి. కానీ ఇదివరకట్లా తనను తిట్టకుండా ఓడిపోయిన సైనికుడిలా లేచి వెళ్ళిపోవడం మాత్రం అయ్యో అనిపించింది. ఆ రాత్రి అరుంధతికి విపరీతమైన ఆకలి అనిపించి కడుపునిండా తినింది. తరువాత ఎక్కడ లేని నిద్ర ముంచుకు వచ్చినట్టయ్యి, పడి నిద్రపోయింది. కలలో ముక్కలైన రెక్కల్ని తను మళ్ళీ భుజాలకు కట్టుకుని పైకెగరినట్టు… హనుమక్క, ఆమె కూతురు ఆకాశంలో కలిసినట్టు,… ముగ్గురూ కలిసి గ్రద్దపైన పడి చంపినట్టూ…… ఇలా.

ఈ సారి మధువంతి ఒక్కతే వచ్చింది. “రెండే రోజుల్లో వాడు బయటికి వచ్చేశాడక్కా! నా వైపు గవర్నమెంట్ ప్లీడరు వాడి జామీను అర్జీకి ఆక్షేపణ కూడా వెయ్యలేదు” అంటూ క్రింద కూర్చుంది. మణివేలు మాటల్లో వాడు బయటికి ఖాయంగా వస్తాడని అనిపించినా ఇంత తొందరగా వచ్చేస్తాడని అనుకోలేదు అరుంధతి. నిరాసక్తంగా మధుమతివైపు చూసింది. మధుమతి కళ్ళలో “తరువాత ఏం చేద్దాం?” అనే ప్రశ్న కనిపించింది. అరుంధతికి మణివేలుపైన ఎక్కడలేని కోపం వచ్చింది. ఎదుటి లాయర్‌కి ఒక్కమాట చెప్పొచ్చు కదా అనిపించింది. కాని అతడికి ఈ కేసుపై ఏ మాత్రం ఆసక్తి లేదని గుర్తుకొచ్చి, అతడెందుకు చెప్తాడు అని సమాధానపరచుకుంది.

“ఎంత జల్సాగా తిరుగుతున్నాడో అక్కా!” మధుమతి వెక్కుతూ అంది. ఆమె వెక్కిళ్ళు తనను ముంచి పోయిన వాడికి వదిలే తర్పణంలా అనిపించింది. “వాడు నిన్ను పెళ్ళి చేసుకుంటాడు అనే విషయం మర్చిపో” అరుంధతి చెప్పాలా వద్దా అని సంశయిస్తూనే చెప్పింది. మధుమతి వెక్కుతూనే “ఆ నమ్మకం ఎప్పుడో పోయిందక్కా” అంది.

తను ఆశించని బ్రతుకును అనివార్యంగా అంగీకరించాల్సిన సందిగ్ధ పరిస్థితి. “సాయంత్రం రా. ఏమైనా చేయచ్చేమో ఆలోచిస్తాను” అంది. నలభయ్యైదవ ఏట తన మెదడు మొదటి సారి మెల్లగా ఆలోచించసాగింది. ఏమైనా చేసి తీరాలని పట్టుదల వచ్చింది. సాయంత్రం గడచి మరుసటి రోజు ఉదయానిక్కూడా ఏ దారీ కనిపించలేదు. తట్టిన ఆలోచనలు కూడ ముందుకు సాగకుండా సగంలోనే ఆగిపోయాయి.

మధుమతి కూడా మూడు దినాలైనా రాలేదు. అరుంధతి కంగారు పడసాగింది. ఆ అమ్మాయికే ఏదైనా దారి చూపు దేవుడా అని ప్రార్థిస్తూ గడిపింది. నాలుగవ రోజు సాయంత్రం మధుమతి వస్తూ దిగులును మోసుకుని తెచ్చింది. కానీ ఆమె మొహంలో తను మొదటి రోజు చూసిన దుఃఖం కానీ, బేలతనం కానీ కనిపించలేదు. కొద్దిగా కోపం కనిపించింది.

“అమ్మను పోలీసులు లాక్కెళ్ళారక్కా! ” అంది. “ఎందుకు? ఏమయ్యింది? మళ్ళీ ఏమైనా….?” అంది ఆశ్చర్యంగా అరుంధతి.

“లేదక్కా. అమ్మ ఆ పన్లు మానేసి సంవత్సరం పైనే అయింది. ఇప్పుడు ఇంట్లోనే కుట్టు పనులు చేసుకుంటుంది.” అంది. “మరి…” అనే అరుంధతి ప్రశ్నకు మణివేలు అనాసక్తే కారణమని స్ఫురించింది. “పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాం కదా. అందుకే ఆ ముండా కొడుకులు…”  అంటూ మధుమతి తిడుతూంటే “ఎందుకు అనవసరంగా ఆడవాళ్ళను తిడతావు ? పిరికి సన్నాసులకు పుట్టినవాళ్ళు అను” అంటూ అరుంధతి నవ్వింది. ఆమె మాటలు విన్న మధుమతికి కూడా విపరీతంగా నవ్వొచ్చింది. ఇద్దరూ జోరుగా నవ్వుతూ ఒకరినొకరు అర్థం చేసుకోసాగారు.

“ఒక పని చేద్దాం. మహిళా సంఘాలకు వెళ్ళొద్దాం. వాళ్ళే ఏమైనా చెయ్యగలరు.” అన్ని దారులూ మూసుకున్నాయనుకున్నప్పుడు ఎక్కణ్ణుంచో కనిపించే చిన్న ద్వారం గుండా అరుంధతికి వేర్వేరు ఆలోచనలు రాసాగాయి. “నువ్వెలా చెప్తే అలా చేద్దాం అక్కా. ఆ లమ్డీకొడుకును మాత్రం ఊరకే వదలద్దు.” మధువంతిలో ఉత్సాహం కనిపించింది. “మళ్ళీ ఆడాళ్ళనే తిట్టావు నువ్వు” అరుంధతి కనుబొమ్మలెగరేసి అడిగింది.

 “దొంగనా కొడుకు. ఇప్పుడు సరిపోయిందా” మధువంతి ఇంకో రకంగా తిట్టింది.

“అరుంధతి మేడమ్ గారూ! మీరు మణివేలుగారి భార్యను అంటున్నారు. మరి మీకు ఇలాంటి వాళ్ళతో సంబంధమేమిటి ? సర్లెండి.. ఇప్పుడు మీరు చెప్పింది నిజమే అనుకున్నా నాకేమో ఈ పిల్ల పైనే అనుమానం. హనుమక్క కూతురని అంటున్నారు. ఈ పిల్లో, దాని డ్రెస్సో… ఆడపిల్లలు ఎలా ఉండాలో అలా ఉంటేనే అందం కదండీ. లేదంటే ఇదిగో ఇలాగే అవాంతారం వచ్చి పడుతుంది. ఈ పిల్ల ఆ అబ్బాయితో ఎందుకు వెళ్ళింది అని మనం ఆలోచించాలి కదా? మంచి కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లలు ఇలా వెళ్తారా చెప్పండి. దీని గురించి మీరు కలగజేసుకోక పోవడమే మంచిది అని నా అభిప్రాయం. ఏదైనా జినైన్ కేసుంటే చెప్పండి, మేము కూడా మా వంతు సాయపడతాం. ఇలాంటి కేసులు ఎంతైనా అంతే. డబ్బుకోసం ఏమైనా చేస్తారు వీళ్ళు. ఇలాంటి కేసు మా దగ్గరికి రోజుకోటి వస్తుంటుంది.” మహిళా సంఘం అధ్యక్షురాలి మాటలు వింటుంటే అరుంధతికి కోపం నెత్తికెక్కింది.

“థూ! నీ ఆడజన్మ కింత…. దేనికీ మీదంటూ ఒక నిర్ణయం ఉండదు… దానికో సంఘం ఎందుకో? వెళ్ళమ్మా. వెళ్ళి మీ ఆయన వీపు తోము…” అని తిట్టాలనుకుంది. కానీ ఈమెకు మణివేలు పరిచయం ఉందని గుర్తుకొచ్చి తన పైన తానే విసుక్కుంటూ, బయటికి వచ్చింది. అక్కడ మధువంతి కనిపించలేదు. “ఛ. వినిపించుకుందేమో” అనిపించింది. ఏమీ కాలేదన్నట్టుగా తన వెంటే వచ్చి నిలుచున్న ఆ అధ్యక్షురాలి చెంప పగలగొట్టి “బలాత్కారం చేయించుకోవడానిక్కూడా అంతస్తు కావాలా?” అని నిలదీయాలనిపించింది. కానీ అర్హత లేనివాళ్ళను కొట్టడం వల్ల నవ్వులపాలు కావడమే అనిపించి అక్కడనుంచి వచ్చేసింది.

మణివేలు రాత్రి ఫుల్లుగా బిగించే వచ్చాడు. మండిపడ్డాడు ఆమె పైన. తెలుగులో ఆడవాళ్ళను ఎన్ని రకాలుగా తిట్టొచ్చో అన్ని తిట్లు అతడి నోటనుండి బయటకు వచ్చాయి. “నాకు తెలీకడుగుతా. తెచ్చి పడేసింది తిని కూచోడానికేమయ్యింది నీకు? సమాజాన్ని ఉద్ధరించడానికి బయలుదేరింది మహాతల్లి…. అదెవతో వాడెవడితోనో తన దూల తీర్చుకోవడానికి వెళ్తే, దాని వెనుక గజ్జెలు కట్టుకుని తిరుగుతోంది” అంటు అసహ్యకరమైన పదాలన్నీ గుప్పించాడు. అరుంధతికి డోకు వచ్చినట్లయ్యింది. అతడితో ఎదురు వాదనకు దిగలేని తన అసమర్థతను తిట్టుకుంది. “చూడు. ఈ కేసు ఎక్కడికి వెళ్ళినా నిలవదు. ఆ అబ్బాయి వైపు వాళ్ళు చాలా బలవంతులు. అదీ కాకుండా ఆ అమ్మాయి తనే వీడి వెంట బైకులో వెళ్ళిందనడానికి సాక్షాలున్నాయి. ఊరికే నోరు మూసుకుని ఇంకెవరినైనా పెళ్ళి చేసుకోమని చెప్పు. నువ్విలా దాని వెంట తిరిగావనుకో. బయటికి గెంటేస్తాను. హుషార్…” అంటూ వేలు చూపిస్తూ కళ్ళు చిన్నవిగా చేసి బెదిరించాడు. “అంటే మీకేమీ అనిపించట్లేదా? అదే మనకొక అమ్మాయుంటే….” అరుంధతికి తెలియకుండానే మాట బయటకొచ్చింది. అతడు అవాక్కయ్యాడు. గత పాతిక సంవత్సరాలుగా తన ఎదుట నిలబడి మాట్లాడానికే భయపడేది ఈ రోజు హఠాత్తుగా ఇలా వాదించడం చూసి అతడికి ఆశ్చర్యం వేసింది. ఆమె తన నపుంసకత్వాన్ని ఎత్తి చూపుతుందేమో అనిపించింది. కానీ అతడు తగ్గలేదు. “ఆ అదొక్కటే తక్కువ నీకు!”  ఆమె మనస్సుకు నాటేటట్టుగా అన్నాడు. అరుంధతి చిన్నగా నవ్వింది. దానికి అవమానమైనట్టనిపించి కొంచెం తగ్గు గొంతులో “అదీగాక నాకేమైనా ఎందుకనిపించాలి? నాకు నా కూతురైనా ఒకటే. ఇంకెవరైనా ఒకటే…. ఈ ఆడాళ్ళ రాతే ఇంత. దూల తీర్చుకోవడానికి వెళతారు. తరువాత పెద్ద మనుషుల్లాగా గోల పెడతారు” సిగ్గూ ఎగ్గూ లేకుండా అన్నాడు. ‘పిల్లలు లేకుండా పోయింది ఒకందుకు మంచిదే’ అనిపించింది అరుంధతికి. ఇక మాటలు పొడిగించలేదు.

చూస్తూ చూస్తూ నెలల దొర్లిపోయాయి. అరుంధతి పట్టు వదలకుండా మధువంతితో సబ్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి ఇలా ఉత్తరాలు రాయించింది. బదుళ్ళు వచ్చాయి కానీ వాట్లో అవే పస లేని వరసలు. “తనిఖీ కొనసాగుతోంది. ” అని. ఈ మధ్య మణివేలు ఆ అబ్బాయి తరఫు వాళ్ళకు ఒత్తాసుగా నిలబడి డబ్బులు తీసుకుని మధువంతి కేసు వీగిపోయేటట్లు ఏర్పాట్లు చేసుకున్నాడని హనుమక్కే వచ్చి చెప్పింది. అదీగాక ఆ అబ్బాయికి పెళ్ళి నిశ్చయమయిందని చెప్పింది. అరుంధతి, హనుమక్క ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి, విషయం చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. “అయ్యో! ఏదో కుర్రతనం కదమ్మా! చేసుంటాడు. వాడి వెంట వెళ్ళడానికి దీనికి బుద్ధుండాలి కదా! ఆడదానికి లేని సిగ్గు మగవాడికుంటుందా? అదీ కాకుండా ఇలా డబ్బున్న వాళ్ళ వెంట పడడం వీళ్ళలాంటి వాళ్ళకు మామూలేలేమ్మా!” అంటూ వీళ్ళ మొహానికి కొట్టినట్టు చెప్పేసరికి, హనుమక్క తల తిరిగి పడిపోయింది.

తరువాత మధువంతి ఇక రాలేదు. ఆమె ఇంటివైపుకు అరుంధతి వెళ్ళినా కనిపించలేదు. హనుమక్క కూడా చేతులు జోడించి “అమ్మా! ఇలాంటి చోట్లకి మీలాంటి వాళ్ళు రాకూడదు. మీ వారికి తెలిస్తే….” అంటూ తన భయాన్ని కనబరచింది. అరుంధతి ఈ మధ్య మణివేలుతో భోజనం, నీళ్ళు లాంటి పొడి మాటలను కూడా పూర్తిగా ఆపేసింది. ఎలాగైనా ఈ కేసును గెలవాలనే మకురు గుర్రం ఆమె పైన సవారీ చేయసాగింది.

ఇదంతా జరిగి కొన్ని రోజులయ్యుండాలంతే. ఒక రోజు మణివేలు గుర్రుమంటూనే వచ్చాడు. మొహంలో కనిపించేది కోపమో, ఓటమో అరుంధతికి అర్థం కాలేదు. వచ్చీ రాగానే “హనుమక్క ఆ అబ్బాయిని చంపేసింది. దాని వైపు వాదించేదానివి కదా. ఇప్పుడు పోలీసులకు అదేం చెప్తావో చెప్పుకో” అంటూ గర్జించి బయటకు తరిమేశాడు. అరుంధతికి మొట్టమొదటి సారిగా భయం వేయలేదు.

~

కన్నడ మూలం : దీప్తి భద్రావతి

అనువాదం: చందకచర్ల రమేశ బాబు

Exit mobile version