[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘నిఘంటువు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ప[/dropcap]దాలు శబ్దాలెన్నో
కొత్త కొత్తగా జతగట్టే మైదానం
సాంకేతిక యుగంలో ప్రపంచ అక్షరమాల
మారిన అర్థాలతో వాడుక మాటలన్నీ
బహుళార్థక ప్రయోజన యోచనలో
శబ్దించే మౌనం నిఘంటువు
మేధ తపన కురిసిన చెమట వాన
నిఘంటువు
మాటల మూటను విప్పి హూందాగా
ముగ్గులోకి దింపే కొత్త ప్రక్రియ
మాటలు కొన్ని పేజీల్లో భద్రం
మరికొన్ని మన గుండెల్లో
భాష పొదిగిన పదాలు
శబ్దాలు మోసే అర్థాలు బహు తీపి
మాట్లాడే చెట్టు రెక్కలుగా
భాషా సాహిత్యాల బతికించే మనిషి కళ
యాక్సెషన్‌లో నిలబడి గెలిచే మొబైల్ డిక్షనరీ