Site icon Sanchika

నిజాయితీ

[బాలబాలికల కోసం ‘నిజాయితీ’ అనే చిన్న కథని అందిస్తున్నారు శ్రీమతి సత్యగౌరి మోగంటి.]

[dropcap]అ[/dropcap]దొక ప్రభుత్వ పాఠశాల. ఉదయం 8.40 అవుతోంది.

పిల్లలందరూ హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ స్కూలు ఆవరణలోకి వస్తున్నారు. ఉపాధ్యాయులు హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు.

డ్రిల్ మాస్టారు తరగతి గదులను పర్యవేక్షిస్తున్నారు. ఇంకా అసెంబ్లీకి మొదటి గంట కొట్టలేదు.

అక్కడ సోషల్ స్టడీస్ ఉపాధ్యాయిని పార్వతి ఆఫీసు రూం ముందు నిలబడి లోపలకు వచ్చే విద్యార్థినీ విద్యార్థుల నందరినీ గమనిస్తోంది.

ఆరోజు పాఠశాల అసెంబ్లీ విశేషాలు చెప్పే టీమ్ కోసం కాబోలు ఎదురు చూస్తోంది.

ఇంతలో ఆరో తరగతి చదివే ఒక బాబు పేరు మహేష్, చేతిలో ఏదో బరువైన బ్యాగ్ పట్టుకుని హడావుడిగా లోపలకు వస్తున్నాడు. భుజాన స్కూలు బ్యాగ్ ఉంది.

ఆ బాబును చూస్తూ.. ఏమిటా అని ఆలోచిస్తుంటే దగ్గరకు వచ్చి “హెచ్.ఎమ్ సార్ ఇంకా రాలేదా మేడమ్ గారు?” అనడిగాడు.

“లేదురా ఈరోజు మధ్యాహ్నం వస్తారనుకుంటా.. ఏం సెలవు కావాలా?” అని అడిగింది పార్వతి వాడికేసి చూస్తూ.

“కాదు.. కాదు మేడమ్” అన్నాడు ఆమె వైపు సందేహంగా చూస్తూ.

“మరేం కావాలిరా?” అంది పార్వతి నవ్వుతూ.

“మరే.. మరే.. మేడమ్ నేను స్కూలుకు వస్తుంటే రోడ్డు మీద ఈ బ్యాగ్ దొరికింది. అటూ ఇటూ చూశాను. ఎవరూ కనబడలేదు మేడమ్” అంటూ మళ్లీ తానే “బ్యాగ్‌లో ఏముందోనని జిప్ తీసి చూసాను..” అని భయం భయంగా చూస్తూ, “అందులో ఏవో అప్లికేషన్లు, చాలా డబ్బు కనిపించింది మేడమ్. నేను లెక్కపెట్టలేదు” అన్నాడు.

వాడిని చూసి ఆ ఉపాధ్యాయిని ముచ్చటపడుతూ “ముందు లోపలికి రా” అంటూ ఆఫీస్ రూంలోకి తీసుకెళ్లి, కూర్చుని బాగ్ తీసి పరిశీలనగా చూసింది.

ఆ అప్లికేషనలు ఏవో పొలాలకు లోన్లకు సంబంధించినవి. ఈ పక్క ఊరేలా ఉంది అనుకుంది. అందులో ఫోన్ నెంబరు, పేరు అన్నీ ఉన్నాయి. డబ్బు కూడా 30 వేల రూపాయలున్నాయి.

కళ్లు చెమరుస్తుండగా వాడి తలమీద చెయ్యి వేసి, సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ మాటలు కూడదీసుకుని “నాన్నా నీ నిజాయితీయే నీకు శ్రీరామరక్ష. ఆ డబ్బు ఇంట్లో ఇవ్వకుండా ఇక్కడికే ఎందుకు తెచ్చావమ్మా?” అని అడిగిందా టీచరమ్మ.

“మీరు బయట ఏం దొరికినా హెడ్ మాస్టారికి ఇవ్వాలని చెప్పారు కదా. మళ్లీ పరుల సొమ్ము పాము వంటిది అన్నారు కదా మీరు. పాపం ఈ డబ్బు ఏ అవసరం కోసమో తెచ్చుకునుంటారు కదండి. అందుకే ఇక్కడకి తెచ్చా” అన్నాడు మహేష్ ఎంతో అమాయకంగా.

“అంతే కాదు మేడమ్, మా అన్నయ్యను కాలేజీలో చేర్పించడానికి మా నాన్న 5 వేలు అప్పు తెస్తే దాన్ని ఎవరో బస్‌లో కొట్టేశారండి. అన్న చదువు ఆలస్యం అయింది. ఆ అప్పు ఇంకా తీరనేలేదు” అన్నాడు ఏడుపు గొంతుతో.

“అందుకే ఇలా ఎవ్వరికీ జరగకూడదని ఇక్కడకు తెచ్చాను మేడమ్”అన్నాడు.

ఆ పసివాడి నిజాయితీకి ఆమె మనసు ఉప్పొంగిపోయింది.

‘దేశంలో పాలకులు, ఉద్యోగస్థులు, అధికారులు – అందరూ ఇలా ఉంటే భారతదేశం ఎలా ఉండేదో కదా’ అనుకునుకుంటూ.. “సరేలేరా నేను ఆ బాగ్ దాచి హెచ్.ఎమ్. సర్‌కి ఇస్తాను. నువ్వు అసెంబ్లీకి పద” అంది పార్వతి, బాగ్ బీరువాలో దాచడానికి లేస్తూ.

‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్న మాటలు గుర్తుకొచ్చి అప్రయత్నంగా ఆనందబాష్పాలు కనుల నుండి కారాయి ఆమెకు.

Exit mobile version