Site icon Sanchika

నిమిత్తమాత్రులు

[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన హాస్యకథల పోటీకి పొన్నాడ సత్యప్రకాశరావు పంపిన హాస్య కథ “నిమిత్తమాత్రులు”. మనసు మొద్దుబారితేనే కానీ; మనసుని రాయిగా చేసుకొంటేగానీ బ్రతకలేని పరిస్థితిలో నిమిత్తమాత్రులుగా ఎలా బ్రతకాలో చెప్తున్నారు రచయిత. [/box]

[dropcap]”ఊఁ,[/dropcap] చెప్పండీ! ఏమిటీ ప్రాబ్లెం” అన్నాడు డాక్టరు, ఎదురుగుండా కూర్చున్న సుబ్బారావుతో. సుబ్బారావు నోరు విప్పబోయాడు.

“ఎప్పుడూ నీరసంగా ఉంటుందంటున్నారండీ. కాళ్ళూ చేతులు లాగేస్తున్నాయంటారు” చెప్పింది కామాక్షి, సుబ్బారావు భార్య.

“ఆకలి ఎలా ఉంది? బీపీలు, షుగర్‌లు, కారాలు, మిరియాలు ఏవైనా ఉన్నాయా?” అని ఘట్టిగా నవ్వాడు డాక్టర్.

లోపల ఉన్న నర్సమ్మ మూతి ముడిచింది అసహనంగా. బీపీ, షుగర్ అన్నప్పుడల్లా ‘కారాలు మిరియాలు’ అని జేర్చి అదో జోక్‌లా భావించి ఆ డాక్టర్ నవ్వడం ఆమె చేరినప్పటి నుంచి చూస్తూనే ఉంది.

“నయం! అలాంటివేవీ ఇంకా రాలేదండీ” అంది కామాక్షి.

“ఏం అవీ రావాలా ఏంటీ?” అని మళ్ళీ నవ్వాడు. నవ్వి, “ఏమయ్యా, అసలు నీ సమస్య ఏమిటో నువ్వు చెప్పకుండా ఉంటే ఎలా? మీ ఆవిడకి వైద్యం చేస్తే నీకు తగ్గుతుందా? నువ్వు చెప్పు” అని మళ్ళీ నవ్వాడు.

తన జబ్బును వివరించి, ఇటీవలెనే చేయించుకొన్న రక్తపరీక్ష రిపోర్టుని ముందు పెట్టాడు సుబ్బారావు. ఆ లేబరేటరీ పేరు చూడగానే మొహం చిట్లించి, “వాళ్ళు సరిగ్గా టెస్టులు చెయ్యడం లేదండీ… నేను వ్రాసిస్తాను. ఇదిగో ఈ లేబ్‌లో చేయించండి. తొందర లేదు. ఓ పది రోజులు ఈ మందులు వాడి గుణం కనబడకపోతే ఈ లేబ్‍లో ఈ టెస్టులు చేయించుకొని కలవండి” అన్నాడు.

“మరేం పరవాలేదాండీ?” అడిగింది కామాక్షి.

“నో ప్రాబ్లెం… మీవారు చాలా ఒత్తిడికి గురి అవుతున్నారు. ఆఫీసు పనులు, పిల్లల బాధ్యతలు వగైరాలు ఉంటూనే ఉంటాయి… బాగా సెన్సిటివ్‌గా ఉంటే ఇదిగో ఇలాంటి సమస్యలు వస్తాయి. వంట్లో రోగం ఉండదు, ఉత్సాహమూ ఉండదు. మీ వారి చేత ఓ పది రోజులు సెలవు పెట్టించి ఏ పనులు చెప్పకుండా కేవలం విశ్రాంతి తీసుకోనివ్వండి. అన్నీ చక్కబడతాయి… ఎంజాయ్! సుబ్బారావు! ఎంజాయ్! ఎందుకయినా మంచిది, ఆ లేబ్‌లో టెస్టులు చేయించుకొని రిపోర్టుతో కలవండి” అని పంపించేశాడు.

***

“అంతా మోసం! ఈ లేబ్ రిపోర్ట్ బాగోలేదట. పోనీ ఆరు నెలల క్రితం అయితే ఓకే! మొన్ననే కదా చేయించుకొన్నాను. ఆ లేబ్ వాడు కమీషన్ ఇచ్చుండడు. మళ్ళీ అన్నీ టెస్ట్‌లు అంటే ఎలా?” అని ఎగరసాగాడు సుబ్బారావు ఇంటికి రాగానే.

“అందరూ అలాగే ఉన్నారు! మీరు ఊరికే ఎగిరిపోకండి. సెన్సిటివ్‌గా ఉండొద్దన్నారుగా డాక్టర్ గారు” అంది కామాక్షి.

“ఎలా ఉండమంటావు? ఆఫీసులో నా చేత అంత పనీ చేయించుకొని ప్రమోషన్లు, అవార్డ్‌లు ఇంకొకరికిస్తారు. మొన్న రిజిస్ట్రార్ ఆఫీసు కెడితే డబ్బు తీసుకొని కూడా పని చెయ్యడం లేదు… రేపు, మాపు అని తిప్పిస్తున్నారు” ఎగరసాగాడు సుబ్బారావు.

“ఇదిగో ఇలా కారాలు మిరియాలు నూరితే, బీపీలు, షుగర్‌లు కూడా వచ్చేస్తాయట. నా మాట విని ఇలా కూర్చోండి” అని మంగళసూత్రం కళ్ళకద్దుకొని మొగుడిని కుర్చీలో కూర్చోపెట్టి ఫాన్ వేసింది కామాక్షి.

“ఇదిగో రేపటి నుంచీ ఓ పది రోజులు ఆఫీసుకు లీవు పెట్టండి! చక్కగా టీవీ చూస్తూనో, ఓ పేపర్ లేదా ఓ సినిమా, ఓ పుస్తకం లేదా అలా వాకింగ్‌లకి వెడుతూ ఓ పది రోజులు గడపండి. అన్నీ సర్దుకుంటాయి. ఇదిగో, ఈ సీరియల్ చూడండి. చాలా బాగుంటుంది. ఎంతసేపూ ఆఫీసు లేదా ఇంటిపని, పిల్లల పనులు చేస్తూ ఉంటే అలానే ఉంటుంది” అని టీవీ పెట్టింది కామాక్షి.

పాపం! డాక్టర్ చెప్పినట్లు సుబ్బారావు చాలా సెన్సిటివ్ మనిషి. తన బాధ్యతలేవో తను నెరవేర్చుకోవటం తప్ప, ఇతర విషయాల జోలికి పోడు. ముక్కుసూటి మనిషి, లౌక్యం తెలియదు. పోనీ ఉల్లాసపడడానికి సిగరెట్లు, మందు కాదు కదా, సినిమాలు, షికార్లు కూడా లేవు. దానితో తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతున్నాడు. ‘ఒత్తిడి’ అతడి బుర్రలో గూడేమిటీ, ఏడంతస్తుల మేడనే కట్టేసింది.

“ఏమిటీ సీరియల్?” అన్నాడు సుబ్బారావు.

“నా కోడలు – నా ఇష్టం అండీ, చాలా బాగుంటుంది” అన్నది కామాక్షి.

875వ ఎపిసోడ్ అని చూసి, “అబ్బా, చాలా రోజులబట్టీ వస్తున్నట్లుంది. ఏమిటీ కథా” అన్నాడు. టైటిల్ సాంగ్ వస్తోంది.

“అదిగో ఆ అబ్బాయి హీరో… ఇదిగో ఈ ఇద్దరికీ లేకలేక పుడతాడు. ఇంజనీరును చేస్తారు. ఆ అబ్బాయికి పెళ్ళి చేయాలని ఇదిగో ఆ అమ్మాయిని చూడడానికి వస్తారు” అంది కామాక్షి టీవీ వైపే చూస్తూ.

“అదేంటీ! మూడేళ్ళుగా వస్తోంది కదా! ఇప్పటివరకూ ఇంతేనా అయ్యింది” అని అడుగుదామనుకొన్నాడు. కాని బార్య, సీరియస్‌గా చూస్తూ ఉండడంతో ఊరుకున్నాడు. సీరియల్ మొదలైంది.

“రండి రండి వర్జ్యం వచ్చేస్తోంది! తొందరగా అమ్మాయిని తీసుకురండమ్మా” అంటూ పెళ్ళివారితో వచ్చిన పేరయ్య తెగ హడావిడి చేసేస్తున్నాడు.

పలకరింపులయ్యాక, కూర్చున్నారు అందరూ. ఫలహారాలు వచ్చేయి… అమ్మాయిని తీసుకొచ్చారు….

అమ్మాయిని చూశాడు అబ్బాయి. అబ్బాయితో ఆరుగురు వచ్చారు. వాళ్ళందరూ కూడా అమ్మాయిని చూశారు. అందరి మొహాలలో తృప్తి తొణికిసలాడింది.

అలాగే అబ్బాయిని చూసింది అమ్మాయి… వాళ్ళ ఇంటివాళ్ళు, ప్రక్క ఇంటి వాళ్ళు కూడా చూశారు. అంటే కెమెరా యాంగిల్ అలాగే తిరుగుతోంది.

సరే, నచ్చిందనుకొన్నారు… ఇంతలో బ్రేక్! తరువాత వాళ్ళూ వాళ్ళూ మాట్లాడుకొంటున్నారు! బ్రేక్… పెళ్ళిపందిరి! పెళ్ళి అయ్యింది. అందరూ అక్షింతలు వేశారు. అమ్మాయి తండ్రి కళ్ళు చెమర్చాయి, తల్లి కన్నీళ్ళు తుడుచుకొంది. అమ్మాయి అన్నయ్య బరువుగా నిట్టూర్చాడు. వదిన ఆనందబాష్పాలు రాల్చింది. అమ్మమ్మ వీల్ చెయిర్‌లో శాలువా కప్పుకొని కూర్చుని కళ్ళ జోడు తీసి మరీ కళ్ళు తుడుచుకొంది… ఇంకా వాళ్ళ పనిమనిషి, బట్టలుతికే మనిషి, వాచ్‌మేన్… ఒక్కొక్కళ్ళ భావోద్వేగాలను పట్టుకొని సవివరంగా చూపిస్తోంది కెమెరా. ఆడపెళ్ళివాళ్ల ‘ఉద్వేగాలు’ అయిపోయాక, మగపెళ్ళివారి ‘హావభావాల’ను పట్టుకోవడానికి వారి వైపు వెళ్ళింది కెమెరా!

అసలే తిక్కతిక్కగా ఉన్న సుబ్బారావు, “ఏంటే ఇదీ…” అన్నాడు పెళ్ళాంతో.

“అబ్బ! అసలు ఆ అత్తగారు కట్టిన చీర చూడండి. ఆ బోర్డర్ మరీ పెద్దదీ కాదు చిన్నదీ కాదు… అలాంటి చీర కోసం ఎప్పటి నుంచో తిరుగుతున్నాను. వీళ్ళకి ఎలా దొరుకుతాయో! పెట్టి పుట్టారు. దేనికైనా రాసి పెట్టుండాలిట” కామాక్షి నిట్టూర్చింది భారంగా.  ఆ జీడిపాకం సీరియల్ ఎన్ని సంవత్సరాలైనా సాగుతుంది కథ, కథనం వగైరాల గురించి ఆలోచించని కామాక్షులున్నంత వరకూ. వాటి గురించి ఆలోచించి చూడలేకపోయిన సుబ్బరావు బుర్ర గోక్కుంటూ వెళ్ళిపోయి పడుకొన్నాడు. నిద్ర పట్టలేదు. గంట తర్వాత మరో రెండు సీరియల్స్ చూశాక, భర్త దగ్గరకు వచ్చింది కామాక్షి.

“ఏం నచ్చలేదా, పోనీ రేపు తుంటరి సురేష్ నటించిన ‘కాల్చేస్తా’ సినిమాకు వెడదాం. కామెడీ సినిమా. మీరు రిలాక్స్ అవ్వొచ్చు” అంది.

మర్నాడు దానికి వెళ్ళారు. కామెడీ హీరో ‘కాల్చేస్తా’ అంటూంటాడు అస్తమాను, ఏదో జేబులోంచి తీస్తూ. అతను తీసేది సెల్. ఆ సెల్ లోంచి ఓ కాల్ చెయ్యడం అన్నది అతని ఉద్దేశం అయితే ‘కాల్చేస్తా’, ‘కాల్చేస్తా’ అన్న మాటలు విన్న ఓ పోలీసు ఈ సురేష్ ఎప్పుడు ఎవరిని కాలుస్తాడా… కాల్చిన వెంటనే పట్టేసుకొని ఎస్.ఐ. ప్రమోషన్ కొట్టేద్దామని ప్లాన్‌లు వేస్తూంటాడు. సురేష్ కాల్చేస్తూనే ఉంటాడు. ఎవరినైనా కాలుస్తాడేమోనని తిరుగుతూంటాడు పోలీస్. అదీ కథ.

తలబొప్పి కట్టింది సుబ్బారావుకి. “ఇదేం సినిమానే” అంటూ వచ్చేశాడు.  సెలవు పెట్టి ఇంట్లోనే ఉండడంతో బోర్ కొట్టేస్తోంది. పిల్లల దగ్గరకు వెడదామా అనుకొంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ అమెరికాలోనే ఉన్నారు. పెళ్ళిళ్ళయిపోయాయి, పిల్లలు కూడాను. రోజూ ఏదో టైములో ఐపాడ్‌లో మాట్లాడుతూనే ఉంటారు. “హా! తాత్” అంటూ మనవడూ! అదే ఇండియాలో వుంటే వెళ్ళివచ్చేవాడు. అమెరికా అంత సులువుగా వెళ్ళలేడు. పెద్ద ఆసక్తి కూడా లేదు. సాహిత్యం వైపు  మరలుదామనుకొని ప్రముఖ వారపత్రికలు కొన్నాడు. అందులో ఒత్తిడి సమస్యల మీద – ఓ డాక్టర్‌తో పాఠకుల సమస్యలకు సమాధానాలు ఉన్నాయి. ఆసక్తిగా చదవసాగాడు సుబ్బారావు. ఒక పాఠకుడు దాదాపుగా, తన సమస్యనే ప్రస్తావించాడు. అందుకా డాక్టరు సమాధానం చెబుతూ ఒత్తిడి నివారణకు అనేక సూచనలు చేస్తూ, శృంగారం కూడా ఓ ప్రముఖ సాధనం అని చెప్పాడు. రొటీన్‌గా చూస్తే, రొటీన్‌గానే ఉంటుంది. మనసులో యవ్వనాన్ని నింపుకొని క్రొత్తగా చిలిపిగా ప్రవర్తిస్తే సంసారం రక్తి కడుతుంది, రిలీఫ్ వస్తూందటూ – ‘మీ ఆవిడ ఏ వంటగదిలోనూ పనిలో ఉన్నప్పుడు – ఏం చేస్తున్నావు డార్లింగ్! సాయం చెయ్యమంటావా అంటూ వెనక నుంచి ఆవిడ నడుం చుట్టూ చేతులు వేయండి… తెగ సంతోషపడిపోయి ప్రేమను కుమ్మరిస్తుంది’…, అలాగే మనం రోజూ చేసే పనిలోనే నవ్యతను చూడవచ్చు… అంటూ సలహా ఇచ్చాడు.  పేజీలు తిరగేశాడు… రెండు కథలు కూడా చదివాడు. కాలేజీ రోజులలో దొంగచాటుగా చదివిన పుస్తకాలు గుర్తొచ్చాయి. ఇదేమిటి, సకుటుంబ వారపత్రికలన్నారు… బహుశా ‘ఒత్తిడి’ని తగ్గించే ప్రయత్నమేమోనని సరిపెట్టుకొన్నాడు.

మరునాడు ఉదయం పది గంటలయ్యింది. శ్రీమతి వంటగదిలో పనిలో ఉంది. నిన్న చదివిన డాక్టరు సలహాలు, కథలు గుర్తుకొచ్చాయి. మనసుకి హుషారొచ్చింది కూడా. తనకింకా ఏభై అయిదేళ్ళే కదా అనుకొన్నాడు. వంటింట్లో శ్రీమతి పైనున్న గూడులోంచి ఏదో డబ్బా తియ్యడం కోసం రెండు చేతులు పైకెత్తింది. ఆ దృశ్యం సుబ్బారావులో చలనం కలిగించింది. ఆమె పై డబ్బా అందుకోబోయేంతలో వెనుక నుంచి రెండు చేతులతో నడుంని చుట్టేశాడు. ‘డియర్’ అందామనుకొన్నాడు. కానీ…

“అయ్యయ్యో! ఇదేం చోద్యమండీ! ఇదసలే మడి చీర! ఇంకా దీపం పెట్టుకోలేదు. మీకేమయినా పిచ్చి పట్టిందా? ఏం తోచకపోతే సెలవు కాన్సిల్ చేసుకొని ఆఫీసుకే పొండి” అని కామాక్షి గట్టిగా దులిపేసరికి బిక్కచచ్చిపోయాడు సుబ్బారావు.

పది రోజుల సెలవులు గడిచిపోయాయి. మందులు ఏమీ పనిచేయలేదు. ఈసారి ఆ డాక్టర్ చెప్పిన లేబ్‌కే వెళ్ళి టెస్ట్‌లు చేయించుకొన్నాడు. పెద్దగా తేడా ఏమీ లేదు.

“ఏం లెదు సుబ్బారావు! నథింగ్ టు వర్రీ… బీ హ్యాపీ. ఏ విషయాన్నీ సీరియస్‌గా తీసుకోకండి. లైట్‌గా తీసుకోవాలి… లైట్‍గా ఉండాలి. ఈ మందులు ఇంకో నెల వాడి రండి. చూద్దాం… లేదంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపుతాను” అన్నాడు డాక్టర్.

ఆ డాక్టర్ రిపోర్ట్, మందుల చీటి బయట విసిరేసి వచ్చేశాడు సుబ్బారావు.

***

ఆ రాత్రి సుబ్బారావుకి ఎంతకీ నిద్ర పట్టలేదు. తన సమస్య – తన స్వభావం, మనసు, ఆలోచనల్లోనే ఉంది అని అర్థమవుతోంది. కాని ‘లైట్’గా తీసుకోవడం అనేది సాధ్యపడటం లేదు. చుట్టూ జరిగే అనర్థాలని చూస్తూ ఎటువంటి స్పందన లేకుండా ఉండడం ఎలా? సుబ్బారావుకి చిట్కా వైద్యాలు చాలా తెలుసు. ఆయుర్వేదం అంటే అభిమానం. గతంలో ఆయుర్వేదానికి సంబంధించిన పుస్తకాలు చాలా కొన్నాడు. ఈ ఇంగ్లీషు మందులతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి… మనసు ప్రశాంతంగా ఉండేటందుకు ఎన్నో మూలికలున్నాయి… వాటిని వాడుదాం అని నిర్ణయించుకొని పడుకొన్నాడు.

***

మరునాడు  ఉదయమే గతంలో తాను సేకరించిన చిట్కా వైద్యాల పుస్తకాలన్నింటినీ బయటకు తీశాడు. మరికొన్ని పుస్తకాలను సంపాదించాడు. ఎటుఅంటి దుష్పలితాలను ఇవ్వని చూర్ణాలను, లేహ్యాలను స్వయంగా చేసుకోగలిగే స్థాయికి ఎదిగాడు. అతని చిట్కాలు మంచి ఫలితాలు ఇవ్వడం మొదలవ్వడంతో స్నేహితులు, బంధువులు సంప్రదించసాగారు, పేరు కూడా రాసాగింది.

***

ఆ రోజు ఆ ఆశ్రమ ప్రాంగణం అంతా హడావిడిగా ఉంది. అన్ని రకాల మానసిక సమస్యలు, సైకోసొమాటిక్ డిసార్డర్స్ అంటారే… వాటి నుంది  బయటపడేలా చేసే ‘నిమిత్తమాత్రలు’ అనే మందుని మార్కెట్‌లో విడుదల చేస్తున్నారు. ఆ సందర్భంగా ‘ఓ’ టీవీ రిపోర్టర్ మాట్లాడుతూ… “ఈ మహత్తర ఆయుర్వేద మందును కనుగొన్నది ఓ సాధారణ ఉద్యోగి. తాను వైద్యుడిని కానని సవినయంగా మనవి చేస్తూ ఎంతో మందికి అనేక రుగ్మతల నుండి ముక్తి ప్రసాదిస్తున్న ఈ డాక్టరు కాని డాక్టర్ శ్రీ సుబ్బారావు గారితో ఇంటర్వ్యు ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం” అని ప్రకటించాడు.

“అందరికీ నమస్కారం. నేనూ మీలో చాలామంది వలె ‘నిద్రలేమి’, ‘కీళ్ళనొప్పులు’, ‘గ్యాస్’, ‘బీపీ’, ‘షుగర్’ వంటి సమస్యలతో బాధపడినవాడినే. రైతు బజార్ వద్ద కన్నా, నిత్యావసర వస్తువుల దుకాణాల వద్ద కన్నా, ‘బంగారు నగల’, ‘ఎలెక్ట్రానిక్ వస్తువు’లను అమ్మే షాపులలోనే ఎక్కువంది కొనుగోలుదార్లు ఉంటున్నారు. ‘ఫ్యాషన్ ప్రపంచం’ కిటకిటలాడిపోతోంది. అంటే ప్రజలు ‘మౌలికమైన’ అంశాలను పట్టించుకోకుండా ‘మెరుగులపై’ దృష్టి పెడుతున్నారన్న మాట. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా మరు నిముషం మనకి తెలిసిపోతోంది టీవీల ద్వారా, నెట్ ద్వారా. కానీ, మనకు తెలుస్తున్నది ఏమిటి? …వార్తలన్నీ అనర్థాలనే మోసుకొస్తున్నాయి. అంటే ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా, ఏదైనా జరగొచ్చు. అంటే ‘అభద్రతా భావం’ అందరిలోనూ నెలకొని ఉంది. మనవాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. ‘ఎలా వున్నారో’ అనే  బెంగ. ‘పోటీ ధోరణి’ చిన్న పెద్దా లేకుండా అందరినీ బెంబేలెత్తిస్తోంది. ఏతావాతా చెప్పాలంటే అందరూ ఒత్తిడి సమస్య బారినపడి రోగాల పాలవుతున్నారు. ఒత్తిడి నుంచి విముక్తి కలిగించే మాధ్యమాలు చాలానే ఉన్నాయి. కానీ ప్రయోజనం శూన్యం. అందరిలోనూ అసంతృప్తే… అభద్రతే. ‘ఏమవుతోంది?’, ‘ఎటు పోతున్నాం?’, ‘ఏం జరగబోతోంది?’, ‘రేపు ఎలా ఉంటుందో’ అనే ఆలోచన అందరినీ తొలిచివేస్తోంది. సున్నిత మనస్కులు తట్టుకోలేకపోతున్నారు. మనసు మొద్దుబారితేనే కానీ; మనసుని రాయిగా చేసుకొంటేగానీ బ్రతకలేని పరిస్థితి. సెన్సిటివ్‌గా ఉండకుండా, ఆలోచించకుండా ఉంటేనే గాని మనుగడ అసాధ్యం… నిజానికి గీతాకారుడు ఎప్పుడో చెప్పాడు నీవు ‘నిమిత్తమాత్రుడ’వని. అది అలవరచుకోవాలి. అటువంటి మందును నేను తయారుచేశాను. ప్రయోగాలు మంచి ఫలితాలనే ఇచ్చాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ ‘నిమిత్తమాత్ర’లను అతి తక్కువ ధరలో అందరికీ అందించడమే నా ఉద్దేశం” అని ప్రకటించారు సుబ్బారావు గారు.

“ఈ మాత్రల ద్వారా మీరు ‘నిమిత్తమాత్రులు’గా బ్రతకగలుగుతారు. ఏం జరిగినా మీలో భయానక ఆలోచనలు, బెంగలు కలగవు” అని ముక్తాయింపుగా చెప్పగానే, “నాకో డబ్బా…”, “నాకు రెండు డబ్బాలు…”, “నాకు…”, “నాకు…” అంటూ జనం ఎగబడ్డారు.

“కంగారు పడకండి. శ్రీశైలం అడవుల నుంచి తెప్పించిన మూలికలతో తయారు చేసిన గుళికలు అందరికీ ఇస్తాను. నో ప్రాబ్లెమ్…” అంటున్నాడు సుబ్బారావు.

***

“నో ప్రాబ్లెమ్… నో ప్రాబ్లెమ్…” అంటూ మంచం మీద పడుకొని కలవరిస్తున్న సుబ్బారావుని చూసి ఉలిక్కిపడి లేచింది కామాక్షి.

“అయ్యో! ఈయనని ఏ మానసిక వైద్యుల దగ్గరకి తీసుకువెళ్ళాలా?” అనే ఆలోచనలో, బెంగలో పడింది కామాక్షి.

Exit mobile version