నిన్నటిదాకా శిలనైనా…

1
2

[dropcap]“మీ[/dropcap]రు వెంటనే లేవాలి. ఈ రోజు జరగబోయే మీటింగ్‌కి ఆలస్యం అవుతోంది” ఎవరిదో గొంతు వినబడడంతో ఉలిక్కి  నిద్ర లేచాను. ఒక్కసారి బద్ధకంగా ఒళ్ళు విరిచి చుట్టూ ఉన్న పరిసరాలను చూసాను.

నా ఎదుట ఎవరో అపరిచిత వ్యక్తి నిలుచుని వున్నది. ఆమె వెనకాల కొంచెం దూరంగా ఒక పెద్ద గాజు తలుపు, ఆ తలుపు వెనకనే విశాలమైన ఖాళీ స్థలం, స్థలానికి కొంచెం కుడిపక్కగా చూస్తే ఒక చిన్న సరస్సులాగా ఉంది, ఆ సరస్సును చూస్తే ఒక స్విమ్మింగ్‌పూల్‌ను తలపిస్తోంది, ఇంతక ముందర ఈ ప్రదేశం నాకు పరిచయం ఉన్నట్లుగా నాకు అనిపించడం లేదు.నేను నిదురించిన తల్పం పూర్తిగా శ్వేతవర్ణంలో చంద్రుని ఆకారంలో గుండ్రంగా భూమికి రెండే అడుగులు ఎత్తులో ఉంది.

ఆమె ఎవరా అని నేను ఆలోచిస్తున్నాను, ఆమెను నా జీవితంలో ఇప్పటివరకు చూసింది లేదు. ఆ తల్పం నుండి కిందకి దిగడానికి సిద్ధపడుతూ కాలు నేలపై ఉంచిన నేను ఆ నేలపై ఉన్న చలువరాతిలో అస్పష్టంగా కనిపించిన నా ఆకృతిని గమనించి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాను, ఆ మరుక్షణం ఒక దారుణమైన పొలికేక నా నోటి వెంట వెలువడింది.

 ఆ అరుపుకి అదిరిపడిన ఆమె ఏమి జరిగిందా అని నా మీద చేయ్యవేయ్యడానికి ప్రయత్నించింది. నాకు భూమ్యాకాశాలు ఎకమైపోతున్న భావన కలిగి వెంటనే ఆమె చెయ్యి విదిలించుకొని ఇంకా గట్టిగా అరుస్తూ అక్కడి నుండి దూరంగా పారిపోవడానికి ప్రయత్నించాను. ఆమె నా వెంట పడుతూ ఇంకా కేకలు పెడుతోంది.

 “మేడం, మేడం, అనుపమగారు, మేడం….. మేడం …..” ఆమె పిలుపు నాకు చాలా కర్ణ కఠోరంగా వినిపిస్తోంది.

ఆమెకు దూరంగా పరుగుదీసిన నాకు సరస్సును దాటుకుని కుడివైపు తిరగగానే ఒక తలుపు కనిపించింది. నేను వెంటనే ముందు వెనకా ఆలోచించకుండా అందులోకి ప్రవేశించాను, నా అదృష్టవశాత్తు నేను ప్రవేశించినది బాత్రూము అయ్యింది. గుండెలు చిక్కబట్టుకున్న నేను చాలా పెద్దదిగా ఉన్న ఆ బాత్రూంను నిశితంగా గమనించాను.

బహుశా నేనింకా నిదురిస్తూ కలకంటున్నానేమో అని ఒకసారి నన్ను నేను పరిశీలించుకున్నాను. దూరంగా షవర్ చెయ్యడానికి అనుగుణంగా ఒక చిన్న గది యా బాత్రూంలోనే ఉంది. దానికి కొంచెం ఎడంగా టబ్, ఇంకా రకరకాల కాస్మెటిక్స్ నింపబడి ఉన్న ఒక అల్మర దాని ఎదురుగా గోడ అంతా పరుచుకుని ఉన్న అద్దం దర్శనం ఇచ్చాయి. నన్ను వెంబడించిన స్త్రీ ఇంకా బయట నిలుచుని నేను ఉన్న బాత్రూం తలుపును అదేపనిగా బాదుతోంది. ఒక్కసారి అద్దంలో నా ముఖం చూసిన నేను “నో” అని గట్టిగా అరచి నా చేతికి దొరికిన ఫ్లవర్ వాస్ తీసుకుని అద్దాన్ని పగలగొట్టాను.

***

“బాబు ఇలా రా అమ్మా” దూరంగా ఉన్న వెయిటర్‌ను ఉద్దేశించి పిలిచింది సంధ్య.

ఆమె ఎదురుగా ఉన్న ఆమె స్నేహితురాలు ఆమెనే ఆశ్చర్యంగా గమనిస్తోంది. అది వర్షాకాలం. అప్పుడు సమయం రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు అయ్యింది. తన స్నేహితురాలితో కలసి వీకెండ్ డిన్నర్ చెయ్యడానికి రెస్టారెంట్‌కి వచ్చింది సంధ్య.

“మనం ఇక్కడికి వచ్చి రెండు గంటల పైనే అయ్యింది. ఇంకా ఎక్కువ సేపు ఉంటె బిల్ తడిసి మోపెడౌతుందేమో” సంధ్యను ఉద్దేశించి ఆమె స్నేహితురాలు అంది.

“చెప్పండి మేడం ఇంకా ఏమి కావాలి. మెయిన్ కోర్స్ చెప్పమంటారా” వినయంగా వారిని అడిగాడు వెయిటర్.

“నో నో నో నో ఇంకా కొంచెం సేపు ఆగాలి. ఈ లోపు ఇందాకా తెచ్చినవే మళ్ళీ తీసుకురండి” అతనితో అని స్నేహితురాలి వంక చూసింది సంధ్య. నమ్మలేనట్లుగా ఆమె వంకే చూస్తున్న వెయిటర్‌ని ఉద్దేశించి“ఏంటి ఇంకా నిలుచున్నారు తీసుకురండి త్వరగా తీసుకురండి. ఆలస్యం అయితే మళ్ళీ క్యాబ్స్ దొరకవ్” ఆమె అలా అనడంతో అక్కడినుంచి కదిలాడు.

కొంచెం ముందరికి వెళ్లి స్నేహితురాలి వంక చూసి “పరవాలేదా” అన్నట్లుగా ఆమెకు సైగ చేసాడు. కళ్ళతోనే ఆమె భరోసా ఇవ్వడంతో అక్కడి నుంచి ఆర్డర్ తీసుకురావడానికి వెళ్ళాడు.

 “అవును చెప్తున్నాను కదా మధ్యలో డ్రింక్ అయిపోవడం వల్ల బ్రేక్ వచ్చింది”

“సరే చెప్పు చెప్పు నీదే ఆలస్యం” అన్నది స్నేహితురాలు.

 “నువ్వు నమ్మవ్ కానీ నాకు నిజంగా ఈ కల వచ్చింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది ఎంతో రియలిస్టిక్ గా అనిపించింది. అదొక పెద్ద హాల్ లాగా ఉంది. మొత్తం చీకటిగా ఉన్న ఆ ప్రదేశం కేవలం ఒక్క చిన్న బల్బ్ వెలుగు మీద మాత్రమే ఆధారపడి ఉంది. అక్కడ మనుషులను గుర్తుపట్టడానికి వీలు లేకుండా అందరి ముఖాల మీద చీకటి కమ్ముకుని వుంది.

సినిమాల్లో చూపించినట్లుగా అక్కడ కూర్చుని ఏదో ఒక లోకంలో తేలిపోతున్నట్లు ఒకరితో ఒకరు సంబంధం లేనట్లుగా అలా శూన్యంలోకి చూస్తూ కూర్చుని ఉన్నారు. నేను కూడా వాళ్ళతో పాటే కొంచెం దూరంగా ఎత్తుగా  ఉన్న రౌండ్  టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాను. ఎవరో నా ముందర ఉన్న చైర్లో కూర్చుని నాకు ఏదో విషయం చెప్తున్నారు. వారు చెప్తున్నది నేను శ్రద్ధగా వింటూ కూర్చున్నాను. నా ముందర కూర్చున్నది ఒక నలభై సంవత్సరాల వ్యక్తిగా నేను ఆనవాలు కట్టగాలిగాను, అంతకు మించి ఆమె స్త్రీనా లేదా పురుషుడా నాకు సరిగ్గా గుర్తు లేదు.

అయితే ఆ వ్యక్తి స్వరంలో ఏదో ఒక గాంభీర్యం అంతకన్నా ఎక్కువగా ముగ్ధత్వం వినిపించింది. కొంతసమయం ప్రసంగం తరువాత  ఆ స్వరం నాతో అన్నది ‘నీలో సంతృప్తి దాగి ఉన్నది. నువ్వు ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చావ్’. అప్పటివరకు నేను గమనించలేదు కానీ ఆ ప్రశ్న ఎదుర్కోనగానే ఆ ప్రదేశంలో మంద్రస్థాయిలో రిథమిక్‌గా వినిపిస్తున్న ఒక మ్యూజిక్ నా దృష్టిని ఆకర్షించింది.

ఆ తరువాత అక్కడ ఉన్న వారు అందరూ దానితోపాటుగా తలలు ఊపుతూ ఉండడం నేను గమనించాను. కానీ ఆ సంగీతం తప్పితే అక్కడ ఇంకేమీ వినిపించడం లేదు. అందరి పెదాలు కదులుతున్నాయి తప్పితే వారినోటి నుండి మాటలు బయటకు వస్తున్నట్లు అనిపించడం లేదు. వారు చెప్తున్నది ఎవరికైతే వినిపించాలి అనుకుంటున్నారో వారికి మాత్రమే వినిపిస్తున్నట్లుగా ఉన్నాయి.

అప్పుడు నేను వారి ప్రశ్నకు సమాధానం కోసం ఆలోచించాను

‘ఈ ప్రదేశంలో నాకు ప్రశాంతత లభిస్తుంది. మీరందరూ ఎందుకు వస్తున్నారో నేను కూడా అందుకే వస్తున్నాను. ఐనా ఇక్కడ కూడా మనుషులు మాట్లాడతారు అని నేను అనుకోలేదు. మీరు చెప్తున్నది నాకు కేవలం వినడం మాత్రమే ఇష్టం అండ్ మోస్ట్‌లీ ఇక్కడ మ్యూజిక్ చాలా బాగుంటుంది’ నేను ఆ వ్యక్తికి జవాబిచ్చాను.

‘సరే నీకు భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉందా?’ అతని స్వరాన్ని బట్టి ఇప్పుడు అతడు నాకు మగవాడుగా అర్థం అయ్యాడు. నేను అతనికి అవునని కానీ కాదని కానేఎ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అతడు తన ముందర కొన్ని కార్డ్స్ నా ముందుకు తోసాడు అవి ఒక విధమైన దొంతరలో పెర్చబడ్డాయి.

‘వీటిలో ఒక రెండు కార్డులు తీసి నాకు కనబడే విధంగా ఉంచు.’ అతడు అడిగాడు. నాకు కొంచెం తమాషాగా అనిపించి అతడిని ఏడిపించడానికి ‘ఎందుకు కార్డులు తియ్యకుండా నా భవిష్యత్తు చెప్పలేరా?’ అతడు ఆ మాటలకు కొద్దిగా కూడా స్పందించలేదు.

‘మీ అమ్మను నువ్వు చాలా మిస్ అవుతున్నావ్. ఉద్యోగం చేస్తూ నీ జీవితం ఎంతో  సంతోషంగా ఉన్నప్పటికీ ఏదో ఒక వెలితిగా ఉంది. అవునా?’

‘మా అమ్మ గురించి మీకెలా తెలుసా ఐనా భవిష్యత్తు చెప్తాను అని గతం గురించి ఎందుకు వివరిస్తున్నారు.’ అతడు  ఏమీ మాట్లాడలేదు.

‘నువ్వు ఈ రోజు ఒక పెద్ద దుర్ఘటనలో మరణించబోతున్నావ్’ అక్కడ కొద్దిగా ఉన్న వెలుతురు ఇంకా మసకబారినట్లు ఉంది.

నేను ఏమి చెయ్యాలో తెలియక అతను ఎలా ఉంటాడో తెలుసుకోవాలని కుతూహలంతో నేను కూర్చున్న టేబుల్ మీదకు వేళ్ళాడుతున్న ఒక చిన్న లైట్‌ను అతను ముఖం మీదకు ప్రసరింపజేయ్యడానికి ప్రయత్నించాను. కానీ ఎంత ప్రయత్నించిన నాకు అతని ముఖం పెదవుల వరకు తప్పా ఎక్కువ దూరం కనిపించలేదు. ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కాలేదు. లైట్‌ను ఇంకొంచెం ముందుకు తోయ్యడానికి ప్రయత్నించి విఫలమై ఆ ప్రయత్నం విరమించుకున్నాను. కానీ చూసినంతలో ఆతనిని నేను సరిగ్గానే ఆనవాలు కట్టగాలిగాను.

అతడి రూపం నా మదిలో ముద్రింపబడింది. కానీ అతని మాటలే నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. వెంటనే నేను అతని చెప్పిన విషయం అతడిని తిరిగి ప్రశ్నించాలి అతడి వైపు చూసాను. నన్ను ఆశ్చర్యంలోకి ముంచెత్తుతూ అతడు నా ముందు నుండి అదృశ్యం అయ్యాడు. నాకే ఏమీ అర్థం కాలేదు. ఒక్కసారిగా నాకు మెళకువ వచ్చి చూస్తే ఇంట్లో బెడ్ మీద పడుకుని ఉన్నాను. టైం ఎయిట్ తర్టీ అవ్వడంతో లేచి రెడీ అయ్యి హడావిడిగా ఆఫీసుకు చేరుకున్నాను.’ సంధ్య చెప్పడం పూర్తి చేసింది.

ఈ మాటలు సమయంలో ఆమె వెయిటర్ తీసుకు వచ్చిన డ్రింక్‌ను కూడా పూర్తి చేసింది. తన చెప్పినదంతా ప్రశాంతంగా విన్న ఆమె స్నేహితురాలు ఒక్కసారి గట్టిగా అవలించి ‘హా అయ్యిందా మేడం మీ కథ. చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంది ఎవరైనా పత్రికల వాళ్లకి పంపించు మంచి రెమ్యునరేషన్ ఇస్తారు, సైడ్ ఇన్కంగా పనికొస్తుంది’ నవ్వుతూ అంది.

‘జోక్ కాదు బేబీ నీకు అస్సలు ఆ సిట్యువేషన్ అర్థం కావడం లేదు. ఆ సెట్టింగ్, ఆ మనుషులు ఆ ప్రశాంతత అందులో వచ్చే మ్యూజిక్ అంతా ఏదో ఫాంటసీలా ఉంది. అస్సలు ఆ వ్యక్తికి నా గురించి ఎలా తెలిసింది. నిజంగా నేను ఈ రోజు చచ్చిపోతానా. అతడు కార్డ్స్ కూడా చూడకుండా నా గురించి ఎలా చెప్పాడు బహుశా అతడు దేవుడంటవా’ కుతూహలంగా అడిగింది సంధ్య.

 ‘నాకెందుకో దేవుడు కాదు అనిపిస్తోంది. మే బీ చనిపోయిన మీ డాడ్ ఆ రూపంలో నీకు కలలో కనిపించి నువ్వు కలకాలం క్షేమంగా ఉండాలి  నిన్ను హెచ్చరించడానికి అలా చెప్పి ఉండచ్చు మీ నాన్నకు నీ గురించి పూర్తిగా తెలిసే ఛాన్స్ ఉంది కదా. అందులోనూ ఆయన అంటే నీకు చాలా ఇష్టం కదా. కనుక అయా వ్యక్తి ఆయనే ఎందుకు కాకూడదు.’ తను కూడా అంతే కుతూహలంగా సంధ్య వైపు చూస్తూ చెప్పింది ఆమె

‘నిజమేనంటావా..?’ ఇంకా ఆసక్తిగా అడిగింది.

కొంచెం సేపు ఇద్దరూ నిశ్శబ్దంగా ఉన్న తరువాత సంధ్య స్నేహితురాలు ఫక్కున నవ్వింది, అలా నవ్వుతూనే ‘ లేకపోతే ఏమిటే అర్ధరాత్రి దాకా వంటరిగా మేలుకుని ఉంది పిచ్చి పిచ్చి సినిమాలు సీరియల్స్ చూస్తూ ఉంటే ఇలాంటి కలలే వస్తాయి. నేనేదో నీ ఫాంటసీ నీ కొంచెం ఎక్స్టెండ్ చెయ్యడానికి ట్రై చేస్తే నువ్వు దాన్ని కూడా నువ్వు నిజం అని నమ్మేస్తున్నావ్. నీకు పైత్యం బాగా ఎక్కువైంది. వెంటనే ఆనంద్‌కి ఫోన్ చెయ్యి.’ స్నేహితురాలుగా మందలించింది ఆమె.

 తనే మళ్ళీ అంది ‘ఇప్పటికే పదకొండు కావొస్తోంది ఇంకా ఎక్కువ టైం ఉంటే ఈ పబ్ వాళ్ళు కూడా మూసేస్తారు. సో త్వరగా బయట పడితే మంచిది.’ ఇంతలో ఆమె ఫోన్ రింగ్ అయ్యింది.

తను ప్లే చేసిన జోక్‌కి నవ్వాలో ఏడవాలో తెలియక అయోమయంగా తన వైపు చూస్తోంది సంధ్య. తన ఫోన్ వైపు చూడగానే స్నేహితురాలు ముఖం వివర్ణం అయ్యింది. అవతలి వైపు నుండి స్వరం కొద్దిగా గట్టిగానే ఉంది.

‘హే బేబ్ ఎక్కడున్నావ్.’

‘యా వరుణ్ నేనిక్కడ హాన్గోవర్ పబ్ లో ఉన్నాను. సంధ్య కంపెనీ కోసం రమ్మంటే వచ్చాను.’

‘ఒకే బేబ్ నేనిప్పుడు మియాపూర్‌లో ఉన్నాను ఒక టెన్ మినిట్స్‌లో అక్కడుంటాను. యు హావ్ టూ కం విత్ మీ, మనం ఒక చోటకి వెళ్ళాలి. చాలా అర్జెంట్.’

 ‘కాదు వరుణ్ ఇక్కడ సంధ్య వంటరిగా ఉంది.’ అని కొంచెం మెల్లిగా వరుణ్ కి మాత్రమే వినిపించే విధంగా ‘ఐ థింక్ షీ హ్యాడ్ టూ మచ్. సో ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తా.’

‘నథింగ్ డూయింగ్. ఆమెకు కాబ్ బుక్ చెయ్యి ఇప్పుడేమీ మరీ ఎక్కువ టైం అవ్వలేదుగా.’ ఈ మాటలు సంధ్యకు వినిపించాయి. ఆమె ఏమీ మాట్లాడకుండా ‘ ఎవరు వరుణా కాల్ డిస్కనెక్ట్ చెయ్యి’ అని చెప్పి ఆమె దగ్గర ఫోన్ తీసుకుని. అందులో కాల్ డిస్కనెక్ట్ చేసి మెసేజ్ చేసింది.

 ‘యు గో బేబీ. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మైసెల్ఫ్.  వరుణ్ నీ ఫియాన్స్ కదా ఏమి ఇంపార్టెంట్ పని ఉందో ఏంటో నో ప్రాబ్లం, ఐ విల్ గెట్ ఏ క్యాబ్. ఇప్పుడేమీ మరీ ఎక్కువ టైం అవ్వలేదుగా’ ఆమె వరుణ్ ఫోన్లో అన్న మాటలు స్నేహితురాలికి వినిపించింది ఇద్దరూ చిన్నగా నవ్వుకున్నారు. అక్కడితో వాళ్ళిద్దరూ ఆ పబ్ నుండి బయటకి వచ్చి కింద రోడ్ మీద ఎదురు చూస్తున్నారు.

అన్నట్లుగానే పది నిమిషాలలో వరుణ్ వచ్చి సంధ్యను పలకరించి తన స్నేహితురాలిని తన కార్‌లో తీసుకువెళ్ళిపోయాడు. సంధ్య తన మొబైల్ ఫోన్లో అప్లికేషన్ ఉపయోగించి ఒక కాబ్ బుక్ చేసుకుంది అది ఎవరో కొత్త సర్వీస్ ప్రొవైడర్ అనుకుంటా రావడానికి కనీసం నలభై నిమిషాలు పడుతుంది అని చూపించింది.

మిగిలిన కాల్ క్యాబ్స్ అన్నీ కూడా చాలా బిజీగా ఉన్నాయి అందులోనూ ఇప్పుటివరకూ వర్షం కురవడం వల్ల అంత సులభంగా క్యాబ్స్ అందుబాటులో లేవు. ఇంక గత్యంతరం లేక నలభై నిమిషాలు రోడ్ మీద వెయిట్ చెయ్యడానికే నిర్ణయించుకుంది సంధ్య. అసహనంగా తన వాచీ చూసుకుంటే అది పదకొండు గంటల పది నిమిషాలు చూపింది. తన మొబైల్‌లో ఆ క్యాబ్ ను లైవ్ ట్రాక్ చూపిస్తోంది. అదింకా పదిహేను కిలోమీటర్లు దూరంలో ఉంది అని ఆమె తెలుసుకుంది. విసుగ్గా తన ఎదర రోడ్ మీద పడి ఉన్న కూల్ డ్రింక్ క్యాన్‌ను తన్నింది.

ఆ క్యాబ్ వాడు ఎంతసేపటికి వస్తాడో అని ఆలోచిస్తూ చిన్నగా తనకు నచ్చిన ఇంగ్లీష్ పాటలు పాడుకుంటోంది. మద్యం ఎక్కువగా సేవించడం వలన ఆమెకు కొంచెం మగతగా ఉంది, అయినా కూడా ఆమె నిలకడగానే అడుగులు వేస్తోంది. ఆమెకు ఇలా అర్ధరాత్రి సమయంలో తిరగడం, పార్టీలకి వెళ్లడం కొత్తేమీ కాకపోయినా ఈరోజు ఏదో చెప్పరాని భయం ఆమెను వెంటాడుతోంది. బహుశా ఈ రోజు తెల్లవారు జామున తనకు వచ్చిన కలే అందుకు కారణం ఏమో. తను ఇలా పలురకాలుగా ఆలోచిస్తూ ఉండగా తన చేతిలోని సెల్ ఫోన్ రింగ్ అయ్యింది. అది కాల్ క్యాబ్స్ వాడి నుండి వస్తోంది అని తన సెల్ లో ఇన్స్టాల్ చెయ్యబడిన ఒక అప్లికేషన్ సూచిస్తోంది.

“హలో మేడం నేను కాల్ క్యాబ్స్ నుండి మాట్లాడుతున్నాను,”

“చెప్పండి, ఎక్కడున్నారు?”

“వెరీ సారీ మేడం, అది చెప్దామనే కాల్ చేసాను అనుకోకుండా మా క్యాబ్ టైర్ పంక్చర్ అయ్యింది. ఇక్కడ దగ్గరలో మెకానిక్ కూడా ఎవరూ కనపడడం లేదు. అందుకే మీరు వేరొక ట్రాన్స్పోర్ట్ చూసుకోండి మేడం” ఆ క్యాబ్ డ్రైవర్ నిదానంగా తన నిస్సహాయతను తెలియచేసాడు.

“అయ్యో ఇప్పుడెలా మీరే ఏదైనా దగ్గరలో కార్స్ ఏవైనా ఉంటే చెప్పండి, ఇక్కడ నాకు ఎటువంటి క్యాబ్స్ కానీ ఆటోలు కానీ కనపడడం లేదు” ఆ క్యాబ్ వ్యక్తిని అభ్యర్ధించింది సంధ్య.

“వీలైతే చూస్తాను మేడం, నా మొబైల్ లో బ్యాటరీ తక్కువగా ఉంది” అని అతను అనేలోపే ఫోన్ డిస్కనెక్ట్ అయ్యింది.

ఎప్పుడైనా సరే అన్ని ఉపద్రవాలు ఒకేసారి కట్టకట్టుకోచ్చి మనమీద పడుతూ ఉంటాయి. సంధ్య మనసులో అనుకుంది. ఆమెకు చాలా చిరాకుగా ఉంది. సమయం ఎక్కువయ్యే కొద్దీ ఇంక క్యాబ్స్ దొరకవేమో అని భయం ఎక్కువ అవుతోంది తాను ఉండే వివేకానంద్ నగర అక్కడ నుండి దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది. తన కలలో తాను ఈరోజు మరణించబోతోంది అని ఆ  వ్యక్తి చెప్పాడు, అంటే అర్థం కొంపతీసి ఈ పదిహేను కిలోమీటర్లు కాలి నడక నడిచి తను చచ్చిపోదు కదా? తన ఆలోచనకు తనకే నవ్వొచ్చింది.

ఇంతలో దూరంగా ఒక ఆటో ఆశాకిరణంలా రావడం ఆమెకు కనిపించి ఆమె ఊపిరి పీల్చుకుంది. తను చెయ్యి కూడా అడ్డుపెట్టకుండా ఆ ఆటో సరాసరి తానా ముందర వచ్చి ఆగింది. ఆ డ్రైవర్ చూడ్డానికి యువకుడిలాగే ఉన్నాడు.

“రండి మేడం వివేకానంద నగరే కదా మీరు వెళ్ళాల్సింది?” ఆటో డ్రైవర్ అడిగాడు.

ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. తను అడక్కుండానే తన ముందర ఆపి తను వెళ్లబోయే అడ్రెస్ కూడా చెప్పాడు, ఆమెకు ఎందుకో అనుమానం కలిగింది కానీ ఈ సమయంలో ఆమె దగ్గర వేరే మార్గం లేదు. ఈ ఒక్క ఆటోను కూడా వదులుకుంటే మళ్ళీ ఇంకా ఆటోలు వస్తాయనే నమ్మకమే లేదు, ఇక బస్సుల సంగతి తెలిసినదే కదా. కొంచెం అనుమానంగానే ఆమె ఆటో ఎక్కింది.

“టెన్షన్ పడకండి మేడం మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు. నేను కూడా ఉండేది వివేకానంద్ నగర్ లోనే, అందుకే మిమ్మల్ని గుర్తు పట్టి వంటరిగా ఉన్నారని అడిగాను.” అతను మాట్లాడుతుంటే ఆల్కహాల్ వాసన వస్తోంది చూస్తుంటే అతను కూడా మద్యం సేవించినట్లు అనిపిస్తోంది.

అతను అన్న మాటలకి ఆమెలో టెన్షన్ ఇంకా ఎక్కువ అయ్యింది. తను ఎక్కడుంటుందో కూడా ఇతను తెలుసుకున్నాడు. ఆమెకు నిమిషనిమిషానికీ భయం ఎక్కువ అవుతోంది. తన స్నేహితురాలు చెప్పకుండా అనవసరంగా ఇంత రాత్రివరకూ ఆ పబ్‌లో ఉన్నానని ఆమె ఇప్పుడు పశ్చాత్తాప పడుతోంది. ఇంకా తాము సిటీలోకి ప్రవేశించలేదు, ఆటో నెమ్మదిగా కదులుతోంది, ప్రదేశం మొతం నిర్జనమైనదిగా ఉంది. వర్షం వెలిసి వాతావరణం చల్లగా ఉన్నా ఆమెకు చెమటలు పట్టడం ప్రారంభించాయి. తనని త్వరగా తన అపార్ట్మెంట్‌కి చేర్చమని ఆ దేవుడిని వేడుకుంది.

ఇంతలో ఆ ఆటో సైడ్ మిర్రర్ నుండి ఒక ఫార్ట్యూనర్ వెహికిల్ తమని అనుసరిస్తూ ఉండడం ఆమె గమనించింది. ఆ కారు కిటికీలో నుండి ఇద్దరు యువకులు తలలు బయటకి పెట్టి చూస్తూ ఉండడం కూడా ఆమె కంటపడింది. ఆమె మనసు ఎందుకో కీడు శంకించింది. నగరంలో అర్ధరాత్రి వంటరి మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి ఆమె పేపర్లో కథలు కథలుగా చదివింది. ఈ సమయంలో ఏమి జరిగినా కానీ తనను ఎవరూ కాపాడలేరేమో అని ఆమెకు అనిపించింది, ఇలా రకరకాల ఆలోచనలతో తన మెదడు మొద్దుబారిపోయింది.

ఒకచోటికి వచ్చేసరికి ఆటో అతను రోడ్డు పక్కగా ఉన్న చిన్నదారిలోకి తీసుకువచ్చి ఆటో పొదలదగ్గర ఆపాడు. అతని చర్యలతో సంధ్య నిశ్చేష్టురాలయ్యింది. బెరుకుగా అతని వంక చూసింది.

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here