ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య ప్రొఫెసర్ అనుపమ స్టేజ్ మీద ఉన్న ప్యానెల్ దగ్గర నుండి మైక్ దగ్గరకి వచ్చి ప్రేక్షకులతో మాట్లాడడం ప్రారంభించింది. అదొక పెద్ద ఆడిటోరియం దాదాపుగా వెయ్యి మంది గెస్టులు అక్కడ జరుగుతున్న అంతర్జాతీయ మానసిక శాస్త్రవేత్తల సదస్సుకి హాజరయ్యారు ఆ సందర్భంగా మానసిక రుగ్మతల గురించి ప్రస్తావన జరుగుతోంది. వృత్తి పరంగా డాక్టర్ అయిన అనుపమ మానసిక శాస్త్రంలో అనేకరచనలు చేసారు, అంతే కాకుండా ‘రైసింగ్ స్టార్స్’ అనే సేవా సంస్థ కూడా స్థాపించి, ఎక్కువగా ప్రచారం చెయ్యకుండా తన లక్ష్యం పైన మాత్రమె గురితో ముందుకు సాగుతున్నారు. ఆమె మాట్లాడడంతో ప్రేక్షకులు నిశ్శబ్దం అయ్యారు. ఆ నిశ్శబ్దంలో ఆమె స్వరం గంభీరంగా ప్రతిధ్వనించింది.
“ముందుగా సభాసదులు అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. నేను ఇక్కడికి రావడానికి ముందర ఈ రోజు నిద్ర లేచిన తరువాత ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. దానికీ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయాలకీ సంబంధం ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. అందుకే ఆ విషయం మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను.” ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.
“రాత్రి నాకొక కల వచ్చింది, ఆ కలలో నేనొక అందమైన యువతి లాగ ఉన్నాను, నన్ను ముగ్గురు వ్యక్తులు దారుణంగా మానభంగం చేసి అపస్మారక స్థితిలో ఉన్న నన్ను రోడ్డు పక్కన పొదల్లో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ కల నన్ను ఎంత ప్రభావితం చేసిందంటే నిద్ర లేచిన తరువాత కూడా ఆ యువతి ముఖం నా మనోఫలకంలో ముద్రపడిపోయి నేనే ఆ యువతినేమో అనే భ్రాంతి కలిగేలా చేసింది. బాత్రూం అద్దంలో నా ముఖం నేనే గుర్తుపట్టలేకపోయాను. ఈ కల వెనుక ఒక బలమైన సంఘటన కారణం అని మానసిక శాస్త్రవేత్తను ఐన నేను గ్రహించగలిగాను. ఇప్పటివరకూ ఎవరి దగ్గరా బయటపెట్టని ఈ వాస్తవం ఏభై ఏళ్ల వయసు దాటిన తరువాత మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను. అది ఈరోజు నేను ఇక్కడికి రాబోయే ముందరే నాకు కలగా రావడం బహుశా యాదృచ్ఛికమేమో కానీ దీనివల్ల అందరి ఆలోచనా ధోరణి మంచి కొరకే మారాలని నేను ఆశిస్తున్నాను” ప్రేక్షకుల్లో గుసగుసలు మొదలయ్యాయి. కొద్దిగా గొంతు సవరించుకుని ప్రొఫెసర్ అనుపమ తిరిగి మాట్లాడింది.
“ఇప్పటివరకూ నేను మీ అందరికీ ఒక డాక్టర్ గానే తెలుసు కానీ పాతిక సంవత్సరాల క్రితం నేను కూడా ఒక దురదృష్టకరమైన సంఘటనకు బలయ్యాను. యెస్ అయామే విక్టిమ్ ఆఫ్ ఇన్వాలంటరీ సెక్సువల్ ఇంటర్కోర్స్.” ప్రేక్షకులు అందరూ ఖిన్నులయ్యారు. “నేను డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న కొత్తల్లో ఇది జరిగింది. నేను వివరాల్లోకి వెళ్ళదలచుకోలేదు, ఎందుకంటే ఆ సమయంలో జరిగినదంతా కొన్ని అయాచితమైన సంఘటనల సమాహారం మాత్రమే. ఆ సంఘటన వల్లనే డాక్టర్‌గా ఉన్న నేను మానసిక శాస్త్రం వైపు మళ్ళి అపారమైన పరిశోధనలు చేసాను, నా జ్ఞానాన్ని ఉపయోగకరమైనా రీతిలో అందరితో పంచుకోవడానికి ప్రయత్నించాను. కానీ ఎంత చేసినా ఒక విషయం ఎప్పుడూ నన్ను వెంటాడుతూ ఉండేది.
ఒక వ్యక్తికి అటువంటి ఆలోచన ఎందుకు కలుగుతుంది. నేను చదివిన అనేకానేక గ్రంధాల నుండీ గడించిన జ్ఞానం నుండి నాకు అర్థం అయ్యిన విషయం ఏంటంటే ‘రేప్ అనేది ఒక సామాజిక రుగ్మతా కాదు, మానసిక బలహీనతా కాదు. ఇట్స్ ఏ రా ఆక్ట్ ఆఫ్ ఏన్ అండర్ డెవలప్డ్ స్పీసీస్’.దురదృష్టవశాత్తు దీనిని మనం సమాజానికి ఆపాదించి పరిష్కారమార్గాల కోసం అన్వేషిస్తున్నాం. వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే శాస్త్రాన్ని క్షుణ్ణంగా గ్రహించిన వారికి ఈ జాడ్యానికి పరిష్కారం దొరుకుతుంది అని తెలియకపోదు. డాక్టర్‌నైన నేను వ్యాధి లక్షణాన్ని పసిగట్టి అది మళ్ళీ తిరగబెట్టకుండా చర్యలు తీసుకోవడానికి వ్యాధి సోకిన తరువాత పరిష్కారం వెతకడానికి బదులు వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం మేలని గ్రహించాను.
వ్యాధికి చికిత్స మనం కనిపెట్ట గలిగినప్పుడు సోకకుండా చర్యలు కూడా మనం శాస్త్రపరంగా కనిపెట్టగలం అనేది ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అంశం. అప్పుడే నా మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. ఆ సంఘటన జరిగిన ఐదు సంవత్సరాల తరువాత నేను అంతకాలం గడించిన ధనం అంతటితో కలిపి ‘రైసింగ్ స్టార్స్ ఫౌండేషన్’ స్థాపించాను. అందులో జేరిన మొట్టమొదటి సభ్యుడు, ఇంకా చెప్పాలంటే నేను జేర్చిన సభ్యుడు మరెవరో కాదు ఈ స్టేజ్ పానెల్ సభ్యుడైన నా భర్త మిస్టర్ విక్రం. ఈ విషయం ఇప్పటివరకూ ఆయనకి కూడా తెలీదు. ఐదు సంవత్సరాలు ఆయనకే తెలీకుండా ఆయనతో చనువుగా ఉంటూ ఆయనని ఒప్పించి మా సంస్థలో చేర్పించాను. ఆ తరువాత కాలానుగుణంగా మా వివాహం జరిగింది. ఇంక నా భర్త ఇందులో ఎలా సభ్యుడయ్యాడు ఆయన చేసిన నేరం ఏంటి ఇలాంటి వివరాలు ఎవరికివారు వ్యక్తిగతంగా తెలుసుకుని అవి మనం చేస్తున్న ఈ బృహత్తరమైన కార్యానికి ఏ విధంగా అయినా ఉపయోగపడతాయా లేదా ఆలోచించుకోవల్సిందిగా నేను కోరుతున్నాను.
నాకు సంబంధించినంత వరకూ ఒక సంఘటన జరిగిన తరువాత బాధితుడికి చేయూతనందించడం ఎంత ముఖ్యమో అదే విధంగా ఇటువంటి సంఘటనలు పునారావృతం కాకుండా కారణాలని అన్వేషించి చికిత్స చెయ్యడం కూడా అంతే ముఖ్యం. శాస్త్రవేత్తను అయిన నేను సమాజం మేలుకోరి ‘రేప్’ అనే ఈ దురదృష్టకరమైన సంఘటనలో బాధితునికన్నా బాధ్యుడికి చికిత్స ఎక్కువ అవసరం అని గ్రహించి మా ఫౌండేషన్ ద్వారా దేశవిదేశాల్లో శాస్త్రపరమైన పరిశోధనలు నిర్వహిస్తూ దీన్ని సమూలంగా నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను.
అంటే అటువంటే ఆలోచననే రాకుండా ఉండేలా చెయ్యాలన్నది నా అభిమతం, దేర్ ఇస్ నథింగ్ దట్ సైన్స్ కాంట్ డూ. అదే నిజమైన శాస్త్రవేత్త సమాజానికి ఇచ్చే బహుమతి అని నా అభిప్రాయం. ఎందుకంటే అనాగరికతతో మొదలైన మనిషి చరిత్ర నిరంతరం పురోగమిస్తూనే ఉంది. శాస్త్రపరమైన పురోగమనానికి హద్దులు లేవు.ఇది శాస్త్రవేత్తలకు ఒక జటిలమైన సమస్య, దీనిని ఎలా ఎదుర్కోవాలి అని ఎవరికి వారు విజ్ఞతతో ఆలోచించుకోవాలి. నాకీ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవ తీసుకుంటున్నాను.” ఆమె ప్రసంగం ముగించిన వెంటనే ఆ ఆడిటోరియం మొత్తం ప్రేక్షకుల హర్షధ్వానాలతో దద్దరిల్లిపోయింది. తాము స్టేజ్ మీద ఉన్నాం అనే విషయం మర్చిపోయి పరుగుపరుగున ఆమె దగ్గరకు వచ్చి ఆమె భర్త విక్రం ఆమెను కౌగలించుకుని కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యాడు.
“అయాం సారీ అనుపమా. అసలు నేను…”
“ష్…” అనుపమ తన భర్త భుజం తడుతూ నిశ్శబ్దంగా ఉండమని సూచించింది. ఇంతలో పత్రికావిలేఖరులు ఆమెను చుట్టుముట్టారు.
***
“ఎందుకు ఇలా పొదల పక్కకి తీసుకొచ్చి ఆపావు, రోడ్డు మీదకు పోనీ,” ఆటో ఆపి తన వైపు చూస్తున్న డ్రైవర్ తో కొంచెం బింకంగా అంది సంధ్య. ఆమెకు నిమిషనిమిషానికీ భయం అధికం అవుతోంది. ఒకపక్క ఏదో ఒక క్షణంలో మద్యం మత్తువల్ల తాను అపస్మారకలోకి జారుకుంటానేమో అని అనిపిస్తోంది, అప్పుడు ఇంక తనను ఏమి చేసినా తనకి జ్ఞాపకం ఉండే అవకాశం లేదు. ఆటో డ్రైవర్ ఇంకా ఆమె వైపే మత్తుగా చూస్తున్నాడు.
“నిన్నే మాట్లాడవేం..” ఇంకా కోపంగా అరిచింది సంధ్య.
అతడు నెమ్మదిగా తన కుడిచెయ్యి ఎత్తడం ప్రారంభించాడు. ఆమెకు నరాలు తెగిపోతున్న భావన కలిగింది. ఈ రోజుతో తన జీవితం నాశనం అవ్వడం ఖాయం అనే నిర్ణయానికి వచ్చేసింది ఆమె.ఈ క్షణంలో ఎవరైనా తన స్థితిని గమనించి తనకి సహాయం చేస్తే బాగుండును అనిపించింది. అతడు తన మీద చెయ్యవెయ్యడానికి ప్రయత్నిస్తే అతనిమీద చల్లడానికి తన జీన్స్ పాకెట్లో ఉన్న పెప్పర్ స్ప్రేను ఒక్కసారి తడిమిచూసుకుంది. మెల్లిగా చెయ్యి ఎత్తిన అతను తన కుడిచేతి చిటికెన వేలు ఆమెకు చూపించాడు. ఆమెకు ఒక్కక్షణం ఏమి జరిగిందో ఆమెకు అర్థం కాక అతని చర్యకు ఆశ్చర్యపోయింది. ఆ తరువాత నవ్వుతున్న అతని ముఖాన్ని చూసిన తరువాత అతను టాయిలెట్ వెళ్ళడానికి అక్కడ ఆపాడు అన్న విషయం అర్థం చేసుకుంది.
“ఏమీ లేదు మేడం ఇందాకా కొద్దిగా విస్కీలో సోడా ఎక్కువ కలుపుకున్నాను. అందుకే బాగా అర్జెంట్ రోడ్డు మీద అయితే బాగోదు అని ఇలా పక్కగా పొదల దగ్గర ఆపాను,” అని చెప్పి ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి దూరంగా పొదల్లోకి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది సంధ్య. ఆటోలో నుండి బయటకి దిగి అక్కడకి దూరంలో ఉన్న రోడ్డు వైపు చూసింది, తమను ఇంతవరకూ అనుసరించిన ఫార్ట్యూనర్ రోడ్డుమీద ముందుకు వెళ్లడం ఆమె గమనించిది. ఈ లోపల ఆటో డ్రైవర్ తన పని పూర్తి చేసుకుని వచ్చి తిరిగి ఆటోని రోడ్డు మీదకి పోనిచ్చాడు.
“నేను ఎక్కడుంటానో మీకెలా తెలుసు?” అడిగింది సంధ్య.
“మీరు ఎక్కడుంటారోనే, మీరు ఏమి చేస్తుంటారో, మీరు ఇప్పుడు ఎక్కడి నుండి ఏమి చేసి వస్తున్నారో,ఏ సమయంలో ఎక్కడికి వెళ్తారో కూడా నాకు తెలుసు. మీ గురించే కాదు ఆ కాలనీలో ఉన్న అందరి గురించీ నాకు తెలుసు.” చెప్పాడు డ్రైవర్.
“అదే ఎలా తెలుసు అని. ఎందుకు తెలుసుకున్నారు అని.” ఆమె కుతూహలంతో అడిగింది.
“ఒకరకంగా చెప్పాలంటే అది నా హాబీ. ఇంకొక రకంగా నా వంతు సమాజసేవ అనుకోండి. అందరి గురించీ వివరాలు సేకరించి నా నోట్ బుక్‌లో రాసుకుంటూ ఉంటాను.” చెప్పాడు అతను.ఆమె ఆశ్చర్యం రెట్టింపయ్యింది. అతని మాటలని బట్టి అతను చదువుకున్న వాడిలాగ ఆమెకు అనిపించింది.
“మీరు చదువుకున్నట్లు అనిపిస్తున్నారు. మరి ఆటో నడుపుతున్నారు ఎండుకు?” అడిగింది.
“ఇది నా సొంత ఆటో మేడం. నేనొక గ్రాడ్యుయేట్‌ని. నాకు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం ఇష్టం లేదు అందుకే నేను సంపాదించిన డబ్బులతో ఈ ఆటో కొనుక్కుని రోజూ కేవలం నాలుగు గంటలు మాత్రమే నడుపుతాను. మిగిలిన సమయంలో ఐ లైక్ టో స్టడీ పీపుల్.” మాట్లాడే కొద్దీ ఆమెకు ఆసక్తి అధికం కాసాగింది.
“ఎందుకు ఇంత స్లోగా నడుపుతున్నారు.” అతని నెమ్మదిగా నడుపుతూ ఉండడం గమనించి అడిగింది సంధ్య.
“అంటే ఎదర మియాపూర్ క్రాస్ రోడ్స్ దగ్గర పోలీసులు ఉంటారు మేడం. అసలే డ్రింక్ చేసి ఉన్నాను కదా పట్టుకుంటే మళ్ళీ అదొక బాధ అని.” చెప్పాడు అతను. ఇంతలో తమని క్రాస్ చేసుకుని వెళ్ళిన ఫార్ట్యూనర్ ఆమెకు కనిపించింది. ఒక్కసారి ఆ డ్రైవర్ తో ఆ కార్ దగ్గర ఆపమని కేకవేసింది. ఆందోళనగా బ్రేక్ వేసాడు ఆటో డ్రైవర్.
ఆ కారులో వైట్ టీ షర్ట్, జులపాలతో దిగాలుగా ఉన్న ఒక యువకుడిని ఆమె గుర్తు పట్టి అతని దగ్గరకు వెళ్ళింది.
“హే నువ్వా. నేనింకా ఎవరో అనుకున్నానే.” సంధ్య అన్నది.
“సంధ్య నువ్వేంటి ఇక్కడ?” ఆ యువకుడు తనని గుర్తుపట్టినట్లుగా అడిగాడు.
“నా విషయం పక్కన పెట్టు నువ్వేంటి మీ ఫ్రెండ్స్ తో ఇందాకటి నుండి మా ఆటోని ఫాలో అవుతున్నావ్. నాకెంత భయం వేసిందో తెలుసా.” అని చెప్పి ఇందాక తను ఆటో సైడ్ మిర్రర్ నుండి అతని స్నేహితులని చూడడం అనుమానించడం, రౌడీలు అనుకుని భయపడడం ఇదంతా చెప్పింది. విషయం తెలుసుకుని అతడు తన స్నేహితులని పిలిచి ఆమెకు పరిచయం చేసాడు.
“అదా ఏమీ లేదు మాకు కొంచెం డోస్ ఎక్కువైంది. ఇందాక ఆ ఆటో డ్రైవర్ మేము తాగిన బార్ లోనే తాగాడు. అతని వెనకే వెళ్తే పోలీసులు అతడిని పట్టుకుంటే మేము వెనక్కి జంప్ ఐపోదాం అని చెప్పి మెల్లిమెల్లిగా వెనకే అనుసరిస్తూ వస్తున్నాం” విషయం తెలుసుకున్న సంధ్య తన అనుభవాన్ని అందరితో పంచుకుని ఆ ఆటో డ్రైవర్‌ని కూడా దగ్గరకి పిలిచి తన భయం అపోహలూ అందరికీ వివరించింది. అందరూ మద్యం మత్తులో తాము చేసిన పనికి తామే పగలబడి నవ్వుకున్నారు. అప్పుడే వారు తాగిన మద్యం ప్రభావం తగ్గడం ప్రారంభించింది.
అందరూ ఒక్కసారి, “తాగుబోతులూ జిందాబాద్..,” అని గట్టిగా అరిచి నవ్వుకున్నారు.