[dropcap]నృ[/dropcap]త్యకళాశాలలో సరిగా శ్రద్ధ పెట్టలేక పోయిందని టీచర్ కోప్పడితే ఉక్రోషంతో బయటికొచ్చిన నాయికకి రోడ్ మీద అడ్డదిడ్డంగా ఒక డప్పుకి నాట్యం చేస్తున్న కథానాయకుడు ఆ అమ్మాయిని ఆకర్షించటం ఆ వయసు లక్షణం. ఎవరికైనా యౌవనంలో తాము ఇష్టపడ్డ వ్యక్తి ఏం చేసినా ఆదర్శంగా కనిపించటం సహజమే! ఇక్కడ కూడా అదే జరిగి… నాయకుడి ఆకర్షణలో పడ్డ నాయిక అతనికి చదువు పట్ల ఉన్న మక్కువ.. అంకిత భావం… అతని టీచర్‌కి అతని పట్ల అభిమానం తెలుసుకుని మరింత అభిమానం పెంచుకుంటుంది. అది ఎంతవరకు అంటే… జీవితంలో ప్రతిదాన్ని ఒక లెక్క ప్రకారం చూసే తండ్రిని ఒప్పించి అతన్ని తెచ్చి తమ మేడమీద గది అద్దెకిప్పించేటంత!!
ఇది…. తల్లిదండ్రుల డబ్బుతో చదువుకుంటూ… ఆవారాల్లాగా తిరుగుతూ ప్రేమ పేరు చెప్పి వృథా కాలయాపన చేసే యువకులకి వారి బాధ్యతని తెలియ చేసే ఒక కోణం!
ఇంట్లో వాళ్ళు తనకి పెళ్ళిసంబంధాలు చూస్తున్నప్పుడు… తనకి అతని పట్ల కల ఇష్టాన్ని… అతనితో వచ్చెయ్యటానికి సిద్ధపడ్డ తన సాహసాన్ని కాదని… తన చదువు పూర్తిచెయ్యటం అనేది… తనకి ఆమెతో ఉన్న ప్రేమ ఎంత ముఖ్యమో అంత ముఖ్యమైనదని నాయకుడు తేల్చి చెప్పగానే… ఇక తల్లిదండ్రుల నిర్ణయాన్ని ఆమోదించి వాళ్ళు కుదిర్చిన వరుడితో తలవంచి తాళి కట్టించుకుని అతనితో కలిసి ఇష్టపూర్వకంగా జీవితం ప్రారంభిస్తుంది.
ఇది….. అనుకున్న ప్రకారం జీవితం నడవనప్పుడు… వయసు ఆకర్షణ అనే విషయాన్ని వదిలేసి,….. తన పెళ్ళి చెయ్యటం అనే కుటుంబ బాధ్యత నెరవేర్చటానికి తల్లిదండ్రుల పట్ల గౌరవంతో వారికి అవకాశం ఇచ్చి… ఏదో త్యాగం చేశాననో… లేక ఏదో పోగొట్టుకున్నాననే భావంతో ఆత్మహత్య చేసుకోవటమనే విపరీత నిర్ణయం తీసుకోకుండా కాలం నిర్ణయించిన ప్రకారం జీవితాన్ని పునర్నిర్వచించుకోవటం… నాయిక చూపిన పరిణతి. నేటి యువతరం ఇలా ఆలోచించుకోగలిగితే… ఆత్మహత్యలు… హత్యలు (తమ పిల్లని తమకి కాకుండా చేశాడని ఆమె ప్రియుణ్ణి చంపటం) తగ్గుతాయి అని తెలియచెప్పే కోణం!
కానీ అంత ప్రాధాన్యత ఇచ్చి.. తన స్నేహితురాలిని కూడా వదులుకుని పూర్తి చేసిన చదువుని తృణప్రాయంగా వదిలి మద్యానికి బానిస అవటం చూస్తే ఒక వ్యక్తి (నాయిక) పట్ల ఉన్నది కేవలం ఆకర్షణ కాదు… అంతకంటే ఎక్కువగా ఆ వ్యక్తితో కలిసి జీవించాలనే బలమైన కోరికని తెలియచేస్తుంది. ఇంట్లోనించి వెళ్ళిపోదాం అని నాయిక సూచించినప్పుడు…. ప్రేమతో పాటు చదువు పూర్తి చెయ్యటం కూడా తనకు ప్రధానం అనే పరిణతి ప్రదర్శించిన వ్యక్తి బేలగా మారటం… సినిమా తదుపరి భాగంలో నాయిక తన పరిణతి ప్రదర్శించటానికి ఉపయోగపడింది.
నాయకుడి పతనం అతని గురువు ద్వారా తెలుసుకుని… అతన్ని సంస్కరించటానికి భర్త సహాయం తీసుకోవటంలో నాయిక చూపించిన బాధ్యత, ఔన్నత్యం చక్కగా చూపించారు. మాటలతో అడుగడుగునా ఆమెని ప్రలోభపరచటానికి ప్రయత్నించటం… ఆమె భర్త వినేట్లు తమ పాత స్నేహాన్ని గుర్తు చేసే సంఘటనలు ప్రస్తావించటం… అన్నీ చూస్తూ.. వింటూ కూడా నాయిక భర్త ఒక రకమైన జాలితో నాయకుడి immaturity ని భరించి…. చివరికి…. ఎందుకు తను అతని ఆగడాలని అప్పటివరకు భరించాడో…. చెప్పేసరికి నాయకుడిలో వచ్చే మార్పు… కథ బలంగా తయారుచెయ్యటంలో కనిపిస్తుంది.
అంటే నాయక-నాయికల మధ్యలో ఉద్భవించే ప్రతి ప్రేమ సంఘటన… వివాహానికి దారి తియ్యకపోయినా… దాని కోసం కక్ష పెంచుకోవలసిన అవసరం లేకుండా.. దాన్ని వేరే కోణంలోనించి ఆలోచించి వారి మధ్యలోనే.. వారితోనే కలిసి ఆరోగ్యవంతమైన స్నేహాన్ని నిర్మించుకుని హుందాగా బ్రతకచ్చు అని తెలియచెప్పిన సినిమా ఇది.
ఇందులో ఎవరూ ఎవరినీ మోసం చెయ్యరు. స్పష్టంగా విషయ వివరణ చేసి.. అపార్థాలకి తావు లేకుండా నిజాయితీగా హుందాగా ఒక చోటే బ్రతకచ్చు అన్న కోణం చూపించిన విధానం…. ఆవేశంతో తప్పటడుగులు వేసే యువతకి ఉపయోగపడే అంశం!