కాజాల్లాంటి బాజాలు-99: నిప్పు

3
2

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]మా[/dropcap] చుట్టాలమ్మాయి నిప్పు నిన్న ఆన్‌లైన్‌లో ఒక డ్రెస్ తెప్పించుకుంది. పేరు తప్పు చెప్పానేమో ననుకుంటున్నారా… లేదండీ.. దానికి వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పేరే అది. నిప్పులా మండుతూ అందర్నీ కాల్చేస్తూ బతకాలనే ఉద్దేశంతో వాళ్ళు దానికా పేరు పెట్టేరు (అలాగే చెప్పేరు వాళ్ళు అప్పుడు నాకు మరి). ఎవరైనా నలుగురూ బాగుండాలని పిల్లలకి శాంతి, కరుణలాంటి పేర్లు పెట్టుకుంటారు. కానీ వీళ్ళదంతా అదో రకం. అందుకని కూతురికి ‘నిప్పు’ అని పేరు పెట్టి అగ్గిపెట్టి అవసరం లేకుండా అందరినీ కాల్చెయ్యమనే అభిప్రాయాన్ని వాళ్ళమ్మాయిలో పెట్టేసేరు.

చాలామందికి వాళ్ళ అమ్మానాన్నా పెట్టే పేర్లు నచ్చక పెద్దయేక గింజుకుంటారు.. లేకపోతే కామ్‌గా మార్చేసుకుంటారు. కానీ ఈ నిప్పు మటుకు వాళ్ళు తనకా పేరు పెట్టినందుకు ఎంతో సంతోషపడిపోయింది. మిగిలినవాటి మాట ఎలా ఉన్నా డబ్బులు ఖర్చు పెట్టడంలో మటుకు తన పేరుని సార్థకం చేసుకుంటుంది. అస్సలు ఆలోచన లేకుండా తాటాకు మంట పెట్టినట్టే డబ్బుని ఖర్చు పెట్టేస్తుంటుంది.

ఇవాళ పొద్దున్నే ఒక టాప్ తీసుకొచ్చి చూపించింది నాకు. ఆ నిప్పు ఏకంగా అయిదువేలు పెట్టి కొందిట ఆ టాప్‌ని. దాన్ని చూడగానే నాకు కడుపులోంచి బాధ వచ్చేసింది. డబ్బూ పోయి శనీ పట్టడం అంటే ఇదేనేమో అనిపించింది. ఐదువేలూ పోసి కొన్న ఆ టాప్ అనే డ్రెస్ వెలిసిపోయిన రంగులో ఉంది. దానికి తోడు మధ్యమధ్యలో ఓ పువ్వులాగానూ లేదు, ఆకులాగానూ లేదు.. అవేంటో మచ్చల్లాంటి డిజైన్లు. అవి కూడా ఒక పధ్ధతీ పాడూ లేకుండా ఒక మచ్చ భుజం దగ్గరుంటే ఇంకో మచ్చ నడుం దగ్గరుంది. అది కనక ఎవరైనా వేసుకుంటే చిన్నప్పుడు అక్క గౌనుని చెల్లి వేసుకుంటే ఉన్నట్టు భుజాలు దిగిపోయి, అంతా వేళ్ళాడిపోతూ ఉంటుంది. పైగా అదేమిటో అస్సలు నీట్‌గా లేకుండా అంతా నలిపేసినట్టు నలిగిపోయుంది ఆ టాప్. అది వేసుకుని అద్దంలో అటు తిప్పుకునీ, ఇటు తిప్పుకునీ మురిసిపోతున్న నిప్పుని చూస్తుంటే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో! అదేదో ప్రపంచసుందరిలాగా ఫీలైపోతూ నా దగ్గరకొచ్చి “ఎలా ఉందాంటీ…” అనడిగింది.

నాకు ఏవనాలో తెలీలేదు. మనసులో అనుకుంటున్న మాట చెపితే ఇంకేదైనా ఉందా! అయినా ఊరుకోలేక “ఎంతే ఇదీ!” అనడిగేను.

“ఐదువేలండీ.. డిస్కౌంట్‌లో కనక ఐదువేల కొచ్చింది.. మామూలుగా అయితే ఏడువేలు తెల్సా!” అంది గొప్పగా.

పైగా “ఇది చూసి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలాంటిదే కొనుక్కుంటామంటున్నారండీ.. వచ్చేవారంలో వచ్చే మా ఫ్రెండ్స్ మీట్‌కి అందరం ఇలాంటివే వేసుకు రావాలని డిసైడైపోయేం. అక్కడంత స్టాకుందో లేదో చూడాలివాళ” అంది.

నా తల్లే… ఇదే అనుకున్నాను.. దీని ఫ్రెండ్స్ కూడా ఇలాంటివాళ్ళే నన్నమాట. వీళ్ళందరికీ వేలంటే రూపాయిల్లా కాక ఉల్లిపాయల్లా కనిపిస్తున్నాయేమో ననిపించింది. మా చిన్నప్పటి విషయం నేనిక్కడ తేను.. అప్పటి రోజులు వేరు. కానీ మా పిల్లల చిన్నప్పటి ఖరీదులతో పోల్చుకున్నా ఒక్క టాప్‌కి ఐదువేలు పొయ్యడం ఎక్కువే అనిపించింది నాకు. పోనీ అదేమైనా అందంగా ఉందా అంటే అదీ లేదు. సరిగ్గా చెప్పాలంటే మా చిన్నప్పుడు బాగా మాసిపోయి, ఇంక ఉతికినా మురికిపోని బట్టని చూసినప్పుడు ‘అలుగ్గుడ్డ’లా ఉంది అనేవారు. సరిగ్గా అలాగే ఉందా టాప్. కానీ ఆ మాట పైకంటే ఈ నిప్పు నన్నెక్కడ కాల్చేస్తుందోనని భయపడ్డాను. ఆలోచించగా ఆలోచించగా నిప్పుని మనం దేన్నైనా కాల్చడానికి ఎలా ఉపయోగిస్తామో అలాగే కమ్మటి వంట చెయ్యడానికి కూడా ఉపయోగిస్తాము కదా.. అందుకని ఈ నిప్పుని నాకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలా అని ఆలోచిస్తుంటే అద్భుతమైన అవిడియా వచ్చింది.

వెంటనే “అవునా అమ్మాయ్.. అయితే స్టాక్ లేదనే బెంగ అక్కర్లేదు. మా అమ్మాయికి పంపుదామని నిన్ననే ఓ పదిరంగుల్లోవి ఆర్డరిచ్చేను, సరిగ్గా ఇలాంటివే. అవి నీకిచ్చేస్తాను.. ఇంతకీ ఎంతమందుంటారు నీ ఫ్రెండ్స్!” అనడిగేను. వెంటనే ఆ నిప్పు ఎగిరి గంతేసినంత పని చేసింది. “ఓహ్.. ఆంటీ.. మీరెంత మంచివారూ.. మేం ఎనమండుగురమే.. కానీ కొంతమంది వాళ్ల కజిన్స్‌ని కూడా తీసుకొస్తారు.. మొత్తం పదీ మాకే ఇచ్చెయ్యండి ఆంటీ.. డబ్బు కావాలంటే నేను ఇప్పుడే మొత్తం ఇచ్చేస్తాను. తర్వాత మా ఫ్రెండ్స్ దగ్గిర కలెక్ట్ చేసుకుంటాను. మీ అమ్మాయికి మళ్ళీ తెప్పించుకుందురుగాని..ప్లీజ్..” అంది బతిమాలుతూ..

“అలాగేనమ్మా.. డబ్బుకి తొందరేముందిలే.. నువ్వెక్కడికి వెడతావ్… నేనెక్కడికి వెడతాను. కొరియర్ రాగానే చెప్తాను..” అంటూ ఇంట్లో కొచ్చీరాగానే వాచ్‌మెన్ చేత పైన పెట్టిన పెద్ద సూట్ కేస్ దింపించేను. అల్లప్పుడెప్పుడో మా అమ్మాయి వచ్చి వెడుతూ కొన్ని పాత టాప్స్ ఇక్కడ వదిలేసి ఎవరికైనా ఇమ్మని చెప్పి వెళ్ళిపోయింది. వాటిలో కాస్త బాగున్నవి ఓ ఎనిమిదిదాకా కనిపించేయి. అవి తీసేను.. వేడి వేడి నీళ్ళలో ఓ కప్పుడు చాకలిసోడా, అరకప్పుడు బోరిక్ పౌడరూ వేసి అన్ని రంగులూ ఉన్న ఆ టాప్స్‌ని వాటిలో పడేసేను. ఓ రెండుగంటలు పోయేక తీసి చూద్దును కదా.. ఒకదాని రంగు ఇంకోదానికి అంటుకుపోయి, ఏదే రంగో తెలీకుండా బైట పడ్డాయి. అంతే కాకుండా ఓ రంగు మీద ఇంకో రంగు పడి అక్కడక్కడ మచ్చల్లా కనిపిస్తున్నాయి. వెంటనే వాటిని వాషింగ్ మెషిన్‌లో వేసి ఉతికేసేను. బైట పడేటప్పటికి అవి ఏ రంగో, ఏ డిజైనో తెలీకుండా బైట కొచ్చేయి. ఒక్కొక్కదాన్ని విడిగా తీసి, చేతుల మధ్య బాగా నలిపేసి, అలా నలిగినట్లే పరుపుకింద పెట్టేసేను. రెండ్రోజులయేక పైకి తీస్తే అవన్నీ ఏ రంగులో తెలీకుండా, ఏ డిజైనో అర్థం కాకుండా, నలిగిపోయిన చోట మడతలు పడిపోయి అచ్చం నిప్పు కొన్న టాప్‌లా బైట పడ్డాయి. వెంటనే అన్నిట్నీ చక్కగా అట్టపెట్టెలో పాక్ చేసి నిప్పుని పిల్చి, అప్పుడే పెట్టెలోంచి తీసినట్టు తీసి, కొరియర్ వచ్చిందంటూ చేతిలో పెట్టేను.

వాటిని చూసి నిప్పు ఎగిరి గంతులేసింది. తను కొనుక్కున్నదానికన్నా కూడా ఇవి బ్రహ్మాండంగా ఉన్నాయంటూ మెచ్చుకుంది. వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఎనిమిది టాప్స్‌కీ మొత్తం నలభైవేలు కాష్ తెచ్చి చేతిలో పెట్టింది.

ఆ డబ్బులు అందుకుంటుంటే నాకు చేతులు వణికేయి. ఏదో తప్పు చేస్తున్న ఫీలింగ్.

“డిస్కౌంట్‌లో ఒక్కొక్కటీ నాలుగువేలకే వచ్చిందమ్మా..” అంటూ ఎనిమిదివేలు వెనక్కిచ్చేసేను.

ఆ పిల్ల వెళ్ళేక వెంటనే వదినకి ఫోన్ చేసేను.

“వదినా, నీ సావాసంతో నేను ఎలా తయారయ్యేనో చూడు.” అంటూ విషయమంతా చెప్పేను.

సంగతంతా విన్న వదిన ఫక్కున నవ్వేసింది.

“అయిందేదో అయిపోయింది. ఇంతకీ ఆ డబ్బుతో ఏం చేద్దామనుకుంటున్నావ్” అనడిగింది.

“అదే.. అదేదో ఊళ్ళో నీకు తెలిసినవాళ్ళు గిరిజన పిల్లల చదువుకోసం స్కూలు నడుపుతున్నారన్నావు కదా.. వాళ్లకి అందిస్తావేమోనని నిన్ను అడుగుదామని చేసేను..”

“వెరీ గుడ్.. తప్పకుండా అందిస్తాను. సాయంత్రం అటు వేపొస్తాను. అప్పుడు తీసుకుంటాను.” అంటూ ఫోన్ పెట్టేసింది.

“డబ్బు ఉండడం గొప్ప కాదు దానిని సవ్యంగా ఎలా ఖర్చు పెట్టాలో తెలియడం గొప్ప” అని మా నాన్నగారు చెప్పే మాట గుర్తుకొచ్చింది.

మనసంతా తేలికైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here