నిర్భయ నిర్ణయం

0
2

[dropcap]”అ[/dropcap]మ్మడూ,

మనకు స్నేహం తెలుసు. క్రోధం తెలుసు. ప్రణయం తెలుసు. కామం తెలుసు. దుఃఖం, సంతోషం తెలుసు. మనిషిగా మనకున్న మానాభిమానాలు తెలుసు.

ఇప్పుడు నేనన్న ప్రతి మాటకూ అక్కడక్కడా కొద్దిగా సారూప్యమున్నా అర్థాలు వేర్వేరుగా ఉన్నయి. అయితే మన జీవన యానాన లోగా ఆ పదాల కన్నా స్థిరమైన అర్థాలు మాత్రమే మిగలాలి. అనునయాలు కుదరవు.

మనం చనువుగా మెలగగలిగిన ప్రతి మనిషినీ స్వంత మనిషనీ, నాకే స్వంతం అవుతారనీ భావించడం పొరపాటు. అసలా దృష్టికోణంతో చూడరాదు. మానవ దృష్టితో అవలోకించాలి. మంచి చెడులను, పరిస్థితులనూ విశ్లేషించుకోవాలి. అప్పుడు మాత్రమే నిర్ణయాల జోలికి పోవాలి.

ఈ మనిషికీ, జీవజాలం మొత్తానికి సహజంగ ఉండే కోరికలు పుడతయి. అయితే మిగిలిన జీవజాలానానికి మనం గమనిస్తూపోతే కొన్ని నియమ నియంత్రణలు కన్పిస్తూ ఉంటయి. ఈ మనిషికిలా కోరికలు పుట్టవు. కనుక మనం వీడిని ఆ జీవజాలంతో పోల్చకూడదు. సరికదా, అలాంటి సామ్యం తేరాదు. అసలీ మనుషుల ప్రేమా, దోమలపైన నాకు బొత్తిగా నమ్మకం లేదు. అది పచ్చి స్వార్థము, దాని ప్రకోపమునూ. విరు  మనతో ఎలాంటి సంబంధం లేకుండా తిరుగాడే వింతజీవాలుగా నాకు అన్పిస్తారు.

కనుక పల్లవీ! నీకో మాట చెప్పాలనిపిస్తుంది. నేనెలాంటివాడ్నో నీకు తెలుసు. మనకు దగ్గరి స్నేహం ఉంది కదా. మరి నేనెందుకు తప్పు చేశాననిపించింది? అది తలన మెదిలాక పిచ్చివాడ్నవుతున్నాను. ఆ రోజు… అదే నాలుగేళ్ళ పున్నమి రాత్రి మనకు అనుకోకుండా దొరికిన నిర్మలమైన ఏకాంతం ఉందే… దానిని నేను ఎన్ని జన్మలకూ మర్చిపోలేకపోతున్నాను. ఆ పారిజాలం చెట్టు, నిలువెత్తు పూలతో గుబురుగా ఉండి నేలపై రాలుతున్న సమయాన నా మదిలో ఎంత కోరిక ఉన్నా ఆ స్థితికి దారితీసిన సందర్భం ఏమిటో నాకు ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. నన్ను ఏ మోహపాశం వివశుణ్ణి చేసి కన్ను కప్పిందో, మరేం జరిగిందో రతీ మన్మథులు ఎందుకు మనపై పూలబాణాలు వేసి రెచ్చగొట్టారో కాని, అప్పటిదాకా నీలో నిద్రాణంగా ఉన్న కోరిక బుసలు కొట్టినట్టు నాకన్పించింది. అయినా నన్ను నేను సముదాయించుకొన్నా. కుదర్లేదు. రగిలెను కోర్కెను సంపూర్తిగా తీర్చుకోవాలనే ఉసి, కసి ఉత్పన్నమైంది. అది నా వివేకాన్ని జయించింది. బలిమిన కలిశాము. నీ స్థితేమిటో నాకు తెలియలేదు. కానీ నువ్వు నాకు సానుకూలంగా స్పందిస్తున్నావనుకొన్నాను. నిజం చెబుతున్నాను. ఆ కలయికన నీలోనూ అంత ఆవేగం నాకు కన్పించింది. మన రెండు శరీరాల పని తీరాకా కూడా విడిపోవాలన్న ధ్యాసన లేను. ఆ మధురానుభూతిని ఇచ్చిన రాత్రిని నేను మర్చిపోలేకపోతున్నాను. నా కోరికకు వసంత రాత్రది. మనసులకు కాళరాత్రని ఇప్పుడనిపిస్తుంది. నిన్ను పూర్తిగా గమనిస్తూ, నీ నగ్న శరీరాన ఉన్న అన్నీ అందాలనూ తాకి తనివితీరా ఆస్వాదించుతూ నిన్ను అలరిస్తున్నానన్న భ్రమతో కలిసాను. మనుషుల మనస్సుల అనురాగం వెల్లువై జలపాతంలా గట్లు తెంపుకుంటున్న తెంపరితనాన నిర్భయంగా కలిసిన రాత్రి అది.

ఎప్పుడది మనస్సున మెదిలినా నేను ఊగిపోతాను. ఆ క్షణాలలో బాహ్య ప్రపంచం నాకు గుర్తుకు రాదు. పిచ్చెత్తినట్టనిపిస్తుంది.

స్నేహంగా మెలిగేప్పుడు, అంతకు ముందు మనం చనువుగానే ఉన్నాం. నీకూ తెలుసు. ఇద్దరం అరమరికలు లేక కలిసే తిరిగాం కదా. ఊరి చెరువు గట్టున ఒకరి వెంట ఒకరం సొక్కిందాకా పరుగులు తీశాం. సొక్కాక నీళ్ళలోకి దుమికి ఈదులాడాం. ఒకరినొకరం వీపునానుకొని కలలు కన్నాం. ఇదిగో, నీకు గుర్తుందా! నీ ఓణీ వైపు ఆశగా కాంక్షగా చూసిన చూపు, అది గమనించిన నిన్నెంత మెలిపెట్టాయో తెలుసు. నీ ముఖాన అది స్పష్టంగా కనిపిమ్చింది. సిగ్గుపడ్డాను. నేను మామూలు మనిషనన్న ధ్యాస నన్ను వదల్లేదు. కానీ ఎన్నడూ హద్దు దాటలేదు. చింతక్రింద ఊయలలో నువ్వు ఊగుతూ కాలు బెసికి అకస్మాత్తుగా జారినప్పుడు, నిస్సహాయంగా కేకలు పెడుతూ క్రిందకి ఒరుగుతున్నప్పుడు నిన్ను చూస్తు కూర్చున్నవాడిని లేచి పరుగున నీ దాపుకు వచ్చి ఊగుతున్న ఉయ్యాల చెక్క తగిలితే మొఖం పగులుతుందని తెల్సినా ఒడుపుగా ఆపి పూర్తిగా నిన్ను నా వైపు వాల్చుకున్నప్పుడు నేను కిందపడి నీకు మట్టైనా అంటకుండా పొదివి పట్టుకొన్నప్పుడు నీ శరీరమంతా నా బాహువులలోనే ఉంది కదా. అయినా గీత దాటలేదు.

మరి ఆ రాత్రి? అదేమో ఇప్పటికీ అంతుపట్టదు. ఆ మర్నాడు నుంచీ మనస్సు నిండా వేదన. జీరగా తెలీని సంతోషం. నేనోసారి వీధిన వస్తున్న. ఎండాకాలం. ఒంటిగంట అవుతుంది. ఎండ తీక్షణత కన్నూ, మిన్నూ కానకుండా ఉంది. అలాంటప్పుడు కొంచెం దూరం ముందు ఓ నడికారు ఆడమనిషి, తనతో తొమ్మిది, పదేళ్ళ పోరడు. కొడుకో, మనమడో తెలియదు. నడుస్తూన్నారు. నడుస్తునే వాణ్ణి దగ్గరకు తీసుకుని చీర చెరుగును అతని నెత్తిన నిండా కప్పి, దగ్గరలో ఉన్న చెట్టు నీడకు తీసుకెళ్ళి అతన్ని పూర్తిగా పొదివి పట్టుకుని ‘దాహమౌతోందిరా చిన్నా?’ అని కనుక్కుని చంకన వేలాడుతున్న సొరకాయ బుర్రలోంచి మంచినీరు త్రాగించి, అతగాని బాగోగుల్ని చూస్తూ వానికి ఎండ తగలకుండా నిలుచుంది. వాడు సేద తీరిందాకా అక్కుననే ఉంచుకొని అతన్ని నిండా తనలో దాచుకుంది. అందులో అంతులేని అనురాగం, చిన్నవాని పట్ల అనురక్తీ కన్పించాకా అన్పించింది – ఆడమనిషి ఆడదే కాదు, ఈ సృష్టిని ఆడతనం పంచుతు అందర్నీ అక్కున చేర్చుకొని నిత్యం కాసే కన్నతల్లి అని. అట్లాగే చూస్తుండిపోయా. ఆ దృశ్యం నా మనస్సున ముద్రలా పడింది.

ఒకనాడు నువ్వే అన్నావు. ఎందుకన్నావో తెల్వదు. కానీ ఆ మాట నాకెప్పుడూ గుర్తుంటుంది. మగవాడనే జీవి ఎంత దుస్సాధ్యమైన స్వార్థచింతన కలవాడో తెలుసా? నేను కావాలి, వయస్సునున్న అందం, శరీరమూ కావాలి. వానితో ఉంటూ వానికి ఒకర్నో ఇద్దర్నో పిల్లలనూ కనాలి. వాళ్ళను జాగ్రత్తగా అతనిపై ఏ భారమూ పడనీయకుండా సాకి సంభాళించాలి. వారి ఎదుగుదలన చదువులూ ఆరోగ్యం గట్రా చూసుకోవాలి. వాడు సంపాదిస్తున్నా, నేను ఇంటెడు చాకిరీ చేస్తున్నా, నేను వేరే ఓ ఉద్యోగం చేయాలి. అతను గర్వంగా చెప్పుకుని తిరిగేందుకు నా సంపాదనతో కలిగిన హోదా కావాలి. అంతటితో ఆగక సతీసావిత్రిలా అతన్ని రక్షిస్తూ పోవాలి. సతీ తులసిలా అతని అడుగులకు మడుగులొత్తుతూ అతనికి అనుకూలంగా మెలగాలి. భర్తే దైవంగా పూజించుకున్నా అంతటి వినయంగా ఒద్దికగా ఉండగలగాలి. అని చెబుతున్నప్పుడు నీ పెదాలు వణికినయి. మొఖం కందగడ్డలా అయింది.

అంటే మొగ పుట్టుకకీ, ఆడ పుట్టుకకీ ఇంత విపరీతమైన, కరుకైన వ్యత్యాసం.

ఇది నిజమే అయినా – నిజమేనా? అనిపిస్తుంది. కళ్ళ ముందు జరుగుతున్న కనలేని మగమహారాజులకు ఇది ఎన్నడూ నిజం కాదు.

సమాజాన చాలా కాలం నుంచీ, అంటే మాతృస్వామ్యం అంతరించిన నాటి నుంచీ జరుగుతున్న నిజం..

కానీ పల్లవీ! ఒకరినొకరు విడిపోలేనంత ప్రేమ, అందున వ్యామోహం, వ్యాకులత మన మధ్యన పెనవేసుకున్న అనుబంధ బంధం నన్ను నిలువనీయదు. మనస్సున నీ రూపు వదలదు. మనస్సు మాత్రం చెదురుతది. నా ముందున్న ఏ పనీ కదలదు. అదో రకమైన స్తబ్ధత. తల నుంచి ఈ తెర తొలగేంతవరకు నిద్రాహారాలుండవు. ఎక్కువమంది నాలాంటి మగాళ్ళు తమ విధి నిర్వహణాన దినాన కొంతసేపు అలసట లేకుండా కూర్చుని, సుఖాన్ని అనుభవిస్తు చింతాకంట కష్టాన్ని కూడా భరించక చెమట చినుకు శరీరం నుండి బయట పడకుండా చేసే కష్టానికి కొన్ని వేల నుంచి లక్ష దాకా అతి సులువుగా చేతికందే డబ్బు, పిలవగానే ఎదుటనుండే నౌకర్లు, చాకర్లు. పచ్చని జీవితం. అందున సూచనప్రాయంగా కలిగే అలసట. ఈ లోపు శరిరానికి సేదదీరే పదార్థాలు, పండ్ల రసాలు, హార్లిక్సులూ, సాయంత్రం కాగానే ఖరీదైన వైన్‌లు.

ఆడ పుట్టుక అలాంటిది కాదే.

న్యాయానికి ఈ సృష్టిన ఆడది మగాడి చేతన చిక్కిన మైనపు బొమ్మ. గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పు, ఇది నిజం కాదా? ఎవరికేమనిపించినా ఇది జరుగుతున్న నిజం.

నాకెప్పుడూ ఇది మనస్సున మెదులుతుంటుంది. రౌతు గుర్రంపై స్వారీ చేస్తూ వేగం కోసం అదిలిస్తుంటాడు. అదేమో నురగలు కక్కుతూ పరుగెడుతుంటుంది. రౌతు తన అక్కర తీరాక వేసే గడ్డి పరకల కోసం, పిడికెడు దాణా కోసం – నోటనున్న ఇనుప కళ్ళాలను కొరుకుతూ పరిగెడుతూనే ఉంటుంది.

అలాంటిదా మీ బ్రతుకు? ఆ రోజు నువ్వు అన్న మాటలు మరిచిపోను. పాణిగ్రహణం, పెండ్లి అని, అదో అత్యంత పవిత్రమైన కార్యమనీ, మంచి సమాజానికి అది తప్ప మరో మార్గం లేదనీ హితవు చెప్పినట్టు చెప్పి, నమ్మించి దాంట్లో ఇరుక్కొన్నాక అసలు మేమేమిటో గుర్తు రాదు. ఆ ఊబిన దిగబడిపోతూనే ఉంటాం. శ్వాస ఆడక చచ్చిందాకా. నా భావన మీకు ఎలా అన్పించినా జరుగుతున్నది యథార్థం కదా అని నేను నేల గీతలు గీస్తూ కొద్ది సేఆగి తలెత్తి బ్రతుకుకు ఓ గమ్యం ఉంటుందనీ, దాన్ని చేరుకోగలమనీ పెళ్ళికి ముందు అనుకొన్నా మిగిలేది ఏమీ ఉండదు. ఒక్కొక్కటి మా కళ్ళెదుటే అదృశ్యం అయిపోతుంటయి. నిస్సహాయంగా చూసే చూపు మాత్రం మిగులుతది. అలాంటి స్థితిన మన మధ్య అనుబంధ బంధం మిగిలేనా? మనుషులుగా చలామణీ అవుతున్న మన మధ్యన గొప్ప బంధమేమిటో తెలుసా? ‘మనీ’. మన మధ్యన ఉందనుకొంటున్న స్నేహం, ఆత్మీయత ఈ ‘మనీ’యే. దీని మధ్య లాభనష్టాలు, బేరీజులు, తద్వారా మిగిలే మంచీ చెడులు, మనిషి గమనానికి ఇది పునాది.

పెండ్లి.

ఇది మనిషికి అందమైన ఆనందాన్నిచ్చే మాట. దీని తర్వాత ఇద్దరి మనస్సులు కల్సినా, కలవకున్న శరీరాలు మాత్రం కలిసే సేద తీర్చుకుంటాయి. అంతా తృప్తే. అదే జీవితం అనుకొనేట్టు భ్రమ. ఇలా ఎందుకంటున్నానంటే మా అమ్మకు నాన్నతో వివాహమైన తర్వాత నన్ను కన్నది. నా చెల్లెలు, అన్న, మేనత్త, మరదలు, పిన్నమ్మ, వీరంతా పెళ్ళి చేసుకున్నవారే. వారి జీవితాలు ఎలా మారాయో నేను చూశాను. ఇందులో చాలా మంది ఈ చిక్కుముడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించి వారు చేసిన ఏ ప్రయత్నమూ ఫలించక ఎంత నిర్వేదంగా మునిగిపోయారో తెలుసు. కొందరు చనిపోయారు కూడా. నన్ను కన్నతల్లి చివరకు ఎలాగైందో నేను చూశాను. ఈ సంసార చక్రం ఆమెను చుట్టి పడేసి నలిపేసింది. చివరి నిమిషం వరకు ఈ ఊబి నుంచి బయటపడలేకపోయింది. వివాహబంధమంటే నాకు భయం. ఒంటరితనాన  నేను నేను లాగా చివరి శ్వాస వరకు బ్రతకాలని ఉంది. నువ్వంటే నా మనస్సున స్పందన ఉంది కనుక నీకూ ఇష్టమైతే నీతో సహజీవనం చేద్దామనే భావన. అంతే. ఈ సహజీవనాన అన్యోన్యత తప్ప ఒకరిపై ఒకరికి హక్కులుండవు. నీకు పిల్లల్ని కనను అని ఈలోగా అన్నప్పుడు నువ్వేమన్నావో నాకు గుర్తుంది. అలా అయితే పల్లవీ, నేను మరొకర్ని పెళ్ళాడతాను. నాకు జీవితాంతం తోడు కావాలి. దాంపత్యానికి గుర్తుగా పిల్లలు కావాలి అన్నాడు.

పెండ్లి శారీరక ఉన్మత్తత తగ్గించుకొనేందుకు కాదు… అంటే…

నువ్వు కుటుంబ స్థితిని కాదనుకొంటువుననవు. నాకది కావాలి. స్నేహితులుగా మెలగాలి అనగానే స్నేహానికి ముడి ఉండదు అన్నాను.

మా శాంత తెలుసు కదా. దానికి ఇప్పుదు ముప్ఫై రెండేళ్ళు. మంచి ఉద్యోగం చేసుకుంటుంది. మగాడిలా డ్రెస్ వేసుకుంటుంది. అందరితో స్నేహంగా మెలగుతుంది. మిత్రులుగా ఎవరు కన్పించినా స్వచ్ఛంగా నవ్వుతుంది. ఆకలనిపిస్తే ఏ హోటల్ కన్పిస్తే దాని వైపు వెళుతుంది. ఆఫీసు ముగిసాకా ఇంటికెళుతూ దానికిష్టమైన పళ్ళూ, ఓ రెండు మ్యాగజైన్లు కొనుక్కుని వెళుతుంది. శుభ్రంగా స్నానం చేసి ఆ పళ్ళు తిని, ఫ్రిజ్ నున్న పాలో, మజ్జిగో త్రాగి నిద్ర వచ్చిందాక మ్యాగజైన్ చదివి కళ్ళు మూసుకుంటుంది.  పెళ్ళి అని కానీ, మగ స్నేహాలను కానీ మాట్లాడదు. అలా మాట్లాడేవారి దరిదాపులకు పోదు. ‘ఇలా ఎలా ఉంటుంది’ అనుకొంటారు దాని చుట్టూ ఉన్నవారు. ఒకవేళ ఎవరైనా ‘ఇలా ఎంత కాలమే, జీవితం విన్నది. సగం అయిపోవచ్చింది’ అని మందలించబోతే – ‘నేనింతే, మీరు భరిస్తున్న జీవితం నాకొద్దు. Please leave me alone.’ అని వెళ్ళిపోతుంది. మరో సంగతి, నువ్వు పెండ్లి అన్నప్పుడు నేను కొంత డిస్ట్రబ్ అయి దానికి ఫోన్ చేశాను.

“ఏంటీ?” అన్నది. విషయం చెప్పాను.

“వాడి చావు వాడ్ని చావమను” అంది కటువుగా. కొద్ది సేపాగి, “సొంత వ్యక్తిత్వాలుంటే ఈ బంధాలు కుదరవు. నీపై నీకు అభద్రతా భావం లేకుంటే చాలు. కుటుంబం, సంసారం అనుకుంటే నీ శక్తి, యుక్తి, సంపాదన, తెలివితేటలు మొత్తంగా ఆ భావనే సొంతం చేసుకుంటుంది. నీకుగా అప్పటిదాకా ఉందనుకుంటున్న నీ వ్యక్తిత్వం కనిపించకుండా పోతుంది. ఇగో పిచ్చీ! నాకర్థమైంది ఇక్కడ ఒక్కటే. మనం మనంగా మిగలాలి. ఆ భావన ఉంటే నీపై ఏ నీడా పడదు. మన సమాజాన మొగుళ్ళను వదిలేసిన వాళ్ళూ, పెళ్ళాలను వదిలేసినవాళ్ళూ, భర్తను పోగొట్టుకొన్నవాళ్ళూ, భార్యను కోల్పోయినవాళ్ళూ, మోసగించినవాళ్ళు ఈ వ్యూహాన పడి అనాథలుగా మిగిలినవాళ్ళూ వీళ్ళంతా దుఃఖభాజనులే కదా.

అసలు కుటుంబం, సంసారం అంటే చివరి శ్వాస దాకా నిలవగలిగిన ఏ కాంక్షా లేని స్నేహమా?

నువ్వేమిటో నీకు తెలుసు.

నిటారుగా నిలబడాలనుకొని నిలుచొని తిరిగి ఊగిసలాటకు లోనవ్వకు. అది నీ వ్యక్తిత్వపు బలహీనతగా నిలబడతది.

నెను చెప్పింది నీ కర్థమైందనుకుంటా. ఇంక ఫోన్ పెట్టేయ్” అని కట్ చేసింది.

ఓ క్షణం ఆగి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా నడిచాను. ఆ నడకన స్తబ్ధత లేదు. ఉత్సాహం ఉంది. స్పష్టత ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here