నిర్గుణమఠం – గాణగాపుర యాత్ర

0
2

[ఇటీవల తాను చేసిన గాణుగాపుర యాత్రానుభవాలు వివరిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]క[/dropcap]లబురిగి (గుల్బర్గా) లోని ఒక సాహితీమిత్రుడు ఏర్పాటు చేసిన ఒక ‘లిటరరీ గెట్‌టుగెదర్’లో పాల్గొనడానికి వచ్చాను. ఆయన పేరు శ్రీపాద శ్రీవల్లభ జోషి. ప్రవాసాంధ్రులు కొందరు కలబురిగిలో తెలుగు భాషకు సేవలందిస్తున్నారు. నాకు సెంట్రల్ బస్ స్టేషన్ ఎదురుగా, కపిల్ రెసిడెన్సీలో వసతి కల్పించారు జోషీగారు. పెద్దగా సభ, అధ్యక్షుడు, వక్తలు అంటూ ఏమీ లేదు. ఏడెనిమిది మంది సాహిత్యాభిమానులం ఒక చోట, (జోషి గారింట) చేరి మాట్లాడుకున్నాం అంతే. నేను భర్తృహరి సుభాషితాలను, ఏనుగు లక్ష్మణకవి గారి అనువాదం గురించి చెప్పాను. ఒక మిత్రుడు ‘వృషాధిప శతకం’ గురించి, మరొక మిత్రుడు నన్నెచోడుని ‘కుమారసంభవం’ గురించి.. ఇలా అన్నమాట. చర్చను జోషీగారే సమన్వయం చేశారు.

నేను హైదరాబాదు నుంచి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల పదిన బయలుదేరి గుల్బర్గా చేరుకొన్నాను. సాహిత్యగోష్ఠి సుసంపన్నమైంది. సరే, అక్కడికి 30 కి.మీ, దూరంలో ఉన్న గాణగాపుర క్షేత్రాన్ని దర్శించుకుందామని బయలుదేరాను, మర్నాడు. ప్రతి అరగంటకు ‘తడరహిత’ బస్లు ఉన్నాయని చెప్పారు. అంటే నాన్-స్టాప్ లన్నమాట. నానా స్టాప్‌లు కూడా (ప్యాసెంజరు బస్సులండీ బాబు!) ఉన్నాయట.

కేవలం 40 నిముషాలలోనే ‘తడరహిత’ బస్సు నన్ను గాణగాపురం బస్ స్టాండ్‌లో దింపింది. గురుదత్త మందిరం అక్కడికి చాలా దగ్గర. 200 మీటర్లు ఉంటుందేమో. స్వామివారి ఆలయ గోపురం సమున్నతంగా దర్శన మిచ్చింది. దాని మీద ‘శ్రీ దత్త’ అని కన్నడలో, హిందీలో రాసిన లోహపు శిక్షరాలను ఒక ఫ్రేములో బిగించారు.

లోపలికి ప్రవేశించగానే ఒక అలౌకికమైన అనుభూతి. విశాలమైన ముఖమంటపం, ఎర్రని కళాత్మకమైన స్తంభాలతో అలరారుతుంది. క్యూ లైన్‌లో ప్రవేశించాను, శీఘ్ర, అతిశీఘ్ర లాంటి దర్శనాలేవీ లేవు. అందరికీ ఒకటే క్యూ. ప్రధానాలయం చాలా పురాతనమైనది. నల్లరాతి నిర్మాణం. నాలుగు వైపులా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల విగ్రహాలు కుడ్యాలలో కనువిందు చేస్తున్నాయి. మందిరానికి నలువైపులా స్పెయిన్‌లెస్ స్టీల్‌తో చేసిన కటాంజనాలు (గ్రిల్స్) తళతళ మెరుస్తున్నాయి.

“దత్తాత్రేయ స్వామి మిమ్ములను దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరు ఏకాగ్రత, పరిశుభ్రతను పాటించండి”, “ఈ మందిరం అణువణువున గురుదత్తుడు నిండి యున్నాడు. పరిశుభ్రమైన శరీరంతో, ఆత్మతో గురుపాదుకలను దర్శించండి” అని వ్రాసిన బోర్డులు కనబడ్డాయి.

స్వామివారికి ‘హారతి’ జరుగుతుందట. అందుకని క్యూ లైన్ 20 నిమిషాలు ఆగింది. ఆ సమయాన్ని నేను దత్తధ్యానంలో గడిపాను. ‘జయ గురుదత్త’, ‘అవధూత చింతన శ్రీ గురు దేవదత్త’ ‘దత్తాత్రేయ మహరాజ్ కీ జయ్ హో’ అని క్యూ లైన్ లోని భక్తులు నినదిస్తున్నారు.

“అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయ, దిగంబరః
స్మర్తుగామీ స్వభక్తానాం ఉద్ధర్తా భవసంకటాత్”

“దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం
ప్రసన్నార్తిహరం వందే స్మర్తుగామీ సనోవతు”

అని స్వామిని ప్రార్థించాను. త్రిమూర్తుల అంశ శ్రీ దత్తప్రభువు. గురూత్తముడు. స్మరించినంతనే వచ్చి దర్శనమిచ్చే యోగిపుంగవుడు. హారతి పూర్తయినట్లుంది. క్యూ మెల్లగా కదలసాగింది.

గాణగాపుర దత్తక్షేత్రంలో గర్భాలయం ఓపన్‍గా ఉండదు. గోడలో ఒక అడుగున్నర ఉన్న కంత ఉంటుంది. తల వంచి చూసి, స్వామిని దర్శించుకోవాలి. స్వామివారి మూడు ముఖాలు పసుపు రంగులో మెరుస్తూ దివ్య దర్శనమిచ్చాయి. వాటి ముందు వారి దివ్యపాదుకలు. నేను వ్రాసిన ‘శ్రీ దత్తగురు పంచరత్నమాల’ అన్న సంస్కృత స్తుతి నుంచి ఒక శ్లోకాన్ని పఠించాను, అక్కడ. త్వరగా కదలమని ఒక అర్చక స్వామి చెప్పడం చేత, స్వామి శ్లోకాలను ప్రశాంతంగా చెప్పుకుందామని బయటకు వచ్చాను.

నిర్గమణద్వారం పక్కనే ఒక ఔదుంబర (మేడి) మహావృక్షపు విశాలమైన కాండం కనిపించింది. ఆ వృక్షాన్నికి హాని చేయకుండా ముఖమంటపాన్ని నిర్మించారు. ఆ కాండపు వ్యాసమే రెండు మీటర్లుంది. నల్లగా చేవ దేరి మెరుస్తూ ఉంది.

ఒక పక్క అభిషేక మంటపం ఉంది. వినాయక నవరాత్రులు కాబట్టి, విఘ్నేశ్వరుని ఒక చోట నిలబెట్టి పూజలు చేస్తున్నారు. అభిషేక మంటపము నుండి మైకులో సుస్వరంగా పురుష సూక్తం వినబడుతున్నది.

“చంద్రమా మనసాజాతః చక్షోః సూర్యో అజాయంత
ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్యాయుర జాయత”

అని విరాట్పురుషుని కీర్తిస్తూ అభిషేకం ఖరుగుతూంది. మైకులో వినబడుతున్న ఆ వేద తరంగ ఘోషలో కాసేపు తన్మయుడినైనాను. ఒక చోట ఒక అరుగు లాంటి దాని మీద కూర్చుని నేను వ్రాసిన శ్లోకాలు పాడుకున్నాను.

“జయంతి శిష్యాను గ్రహ కారకాః
ఆధ్యాత్మవిద్యా సందేహ ధ్వంసినః
పండితా పండిత జ్ఞాన దాయినో
దత్తదేవ సద్గురు పాదపాంసవః”

“అత్రిపుత్ర! గురుదత్తప్రభో! మహాత్మా!
వయంసముద్ధర! కిల్బిషఘోరకూపాత్
ఖండయ! జ్ఞాన ఖడ్గేన తిమిరమ్
విషయ బంధన మోహ రాగేణ జనితమ్.”

మొదటి శ్లోకానికి స్ఫూర్తి బాణభట్టులవారు రాసిన కాదంబరి కావ్యంలోని తొలి అశ్లోకం. కావ్యమంతా గద్యమైనా, ఆయన ప్రార్థనా శ్లోకాన్ని ఛందోబద్ధంగా రాశారు. ‘బాణోచ్ఛిష్టం జగత్ సర్వం’ అని నానుడి. ఆయన పరమేశ్వరుని ఇలా ప్రస్తుతించాడు:

“జయంతి బాణాసుర మౌళిలాలితాః
దశాస్య చూడామణి చక్రు చుంబినః
దిశాదిశాధీశ శిఖాంత శాయినో
భవచ్ఛిద్ర త్ర్యంబక పాదపాంసవః”

ఆ మహకవినే నా శ్లోకంలో అనుకరించాను. దానికి గర్వపడుతున్నాను. ఇద్దరు దంపతులు వచ్చి నా వద్ద కూర్చున్నారు. వారు తెలుగు వారట. వారిది కాకినాడట. ఆయన నన్ను ఇలా అడిగాడు.

“అయ్యా! మీరు సంస్కృతంలో దత్తస్వామి మీద చక్కని శ్లోకాలు వ్రాశారు. అద్భుతంగా పాడారు. తెలుగులో ఏదైనా పద్యం వ్రాసి ఉంటే వినిపించండి”

అంతకంటే కావలసిన దేముంటుంది? ‘న గురోరధికమ్’ అన్న నా ఖండికలో నుంచి ఒక సీసపద్యాన్ని ‘కల్యాణి’లో ఆలపించాను. ఆ ఖండిక నా ‘చంపకాలోచనమ్’ అన్న ఖండకావ్యం లోనిది. అందులోని పద్యాలను బ్రహ్మశ్రీ రామడుగు వేంకటేశ్వరశర్మగారు (విశ్రాంత ఆచార్యులు, ప్రాచ్యకళాశాల, భీమవరం) ఎంతో మెచ్చుకున్నారు. ఆయన నాకు గురుతుల్యులు. ధన్యోహం!

సీ.:
సూక్ష్మమ్మునైనట్టి శుద్ధరూపము దాల్చి
యెవ్వండు వెలుగొందు దివ్వెవోలె
భావమాత్రము చేత భవమెల్ల సృష్టించు
నెవ్వండు నేర్పించు నియమపధము
లేని దానిని నమ్మి లేమి గ్రుండెడివారి
నెవ్వండు నభయంబు నిచ్చి బ్రోచు
పరమార్థమును దెల్పి పరమాత్మ తత్వంబు
నెవ్వండు బోధించు నేర్పుగాను
తే.గీ.:
మహిత గురువర్యుడతడిపో మర్మవిదుడు
కనగ వేదాంతి, నిత్యవతీ కాంతిపథము
మోక్షపథ దర్శి, యాతడే రక్షకుండు
గురుని నమ్మిన బాయు దాగున్న వెతలు”

ఆ దంపతులు చాలా సంతోషించి నా పేరడిగారు. ‘దత్తశర్మ’ అని చెబితే ఆశ్చర్యపోయారు. నేనిలా చెప్పాను.

“1957 నాటి సంగతి ఆర్యా! మా అమ్మకు, మా రెండో అక్క తర్వాత దాదాపు పది సంవత్సరాలు పిల్లలు కలగలేదట. మా అమ్మా నాన్న, ఇద్దరు అక్కలు గాణగాపురం వచ్చి, ఇక్కడి సత్రంలో విడిది చేశారట. మా అమ్మ రోజూ భీమామరజా సంగమంలో స్నానం చేసి దత్తప్రభువును మండలం పాటు (40 రోజులు) సేవించిందట. మా నాన్న మందిరంలో దత్తాత్రేయ మహిమలను ప్రవచనాలు చెప్పారట. ఇంటికి తిరిగి వచ్చిన మూడు నెలలకే నేను అమ్మ కడుపులో పడ్డాను. అందుకే నాకు ‘నరసింహ దత్తశర్మ’ అని పేరు పెట్టుకొన్నారట”.

వారితోపాటు ‘ప్రసాదాలయ’ కు వెళ్లాను. క్యూ మొదట్లోనే ఆకుపచ్చని బాదం ఆకు దొన్నెను ఒకాయన భక్తుల కందిస్తున్నారు. లోపల కూర్చొని తినే విధానం లేదు. ఆ దొన్నెలో ఒక పెద్ద గరిటెడు పులగం, దానిలోనికి కొంచెం పచ్చిపులుసు, రెండు చెంచాల సాతాళించిన శనగలు వేసి ఇస్తున్నారు. మంటపంలో మన ఇచ్ఛ వచ్చిన చోట కూర్చుని తిని, దొన్నెను డస్ట్‌బిన్‍లో  పడవేసి, ఒక వైపు వరుసగా ఉన్న మంచినీటి కుళాయిల వద్ద చేయి కడుక్కొని, గొలుసుతో బంధించిన స్టీలు గ్లాసుతో నీళ్లు తాగడమే. గొలుసుతో కట్టకపోతే ఆ స్టీలు గ్లాసును ఎత్తుకుపోయే భక్తులు ఉన్నారన్న మాట!

మంటపంలో కొన్ని చోట్ల జుట్టు విరబోసుకొని ఊగుతూ, “సామీ దత్తా! వద్దు! నన్ను వదిలెయ్యి” అని అరుస్తున్న దయ్యాలు పట్టిన ఆడవారు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న మానసిక వికలాంగులూ నాకు కనిపించారు. మూడు రోజులు స్వామికి సేవ చేస్తే మానసిక రోగాలు నయమైతాయని భక్తలలో ప్రగాఢ విశ్వాసం.

అక్కడనుంచి శ్రీ గణపతి సచ్చిదానందస్వామి వారి ఆశ్రమానికి ఆటోలో బయలుదేరాను. అది ఒక కిలోమీటరు ఉంది. అక్కడ ప్రత్యేకత మరకత గణపతి మందిరం. మరకతశిలతో చెక్కిన విఘ్ననాథుని దర్శించుకొని, భీమానది ఒడ్డుకు చేరాను. వాతావరణం ఆహ్లాదంగా, చల్లగా ఉంది. ఉదయం వర్షం కురిసిందేమో నేలంతా చిత్తడిగా ఉంది. నది నిండుగా ప్రవహిస్తూంది. గాఢమైన గోధుమరంగు నీళ్లు నురగలు కక్కుతూ, ఒడ్డును ఒరుసుకుంటూ ప్రవహిస్తున్నాయి. భీమ, అమరజ అన్న రెండు నదులు అక్కడ సంగమిస్తాయి. స్నాన ఘట్టం పూర్తిగా మునిగింది. నీటిలో దిగి, ఆ పవిత్ర జలాన్ని శిరస్సుపై ప్రోక్షించుకొని, పైకి జవచ్చి, శాఖోపశాఖలుగా విస్తరించిన ఒక రావి చెట్టు క్రింది బండ మీద కూర్చున్నాను. దాని ఆకులు చేసే గలగల శబ్దాలు కూడ ‘జయగురు దత్త, జయగురుదత్త’ అంటున్నట్లు నాకనిపించింది. మెయిన్ రోడ్డు లోని షాపులకు, లాడ్జిలకు, హోటళ్లకు దత్తస్వామి పేరు కలిసి వచ్చేలా పెట్టుకొన్నారు. దత్తం భజే గురుదత్తం భజే!

గాణగాపురంలోని ఈ సంగమ స్థలి ఒడ్డునే స్వామివారు ఆత్మజ్ఞానాన్ని పొందారని ప్రతీతి. దీనిని శ్రీ క్షేత్ర గాణగాపురమనీ, దేవలగాణగాపురమనీ అంటారు. నరక చతుర్దశి నాడు ఇక్కడ నదిలో స్నానం చేస్తే అష్టతీర్థ స్నానఫలం దక్కుతుందని భక్తులు నమ్ముతారు.

ఈ క్షేత్రాన్ని నిర్గుణమఠం అనీ, స్వామివారి పాదుకలను నిర్గుణపాదుకలనీ అంటారు. నది ఒడ్డున మరో ఔదుంబర మహా వృక్షం ఉంది. నదికి కొంచెం దూరంలో విభూతి పర్వతం ఉంది. పరశురాముడు అక్కడ తపస్సు చేశాడని, ఆ కొండ నుండి విభూతి వెలువడేదనీ ప్రతీతి.

ఈ క్షేత్రం కలబురిగి (గుల్బర్గా) జిల్లాలో అఫ్‌జల్‌పూర్ తాలూకాలో ఉంది. నది ఒడ్డున ఉన్న ఔదుంబర వృక్షం కింద పరివ్రాజక శ్రేష్ఠులైన నృసింహ సరస్వతీ తీర్ధ స్వాముల వారు అనుష్టానం చేసుకోనేవారట.

ఇక్కడి నుంచి 80 కిలోమీటర్ల దూరంలోనే అక్కల్‍కోట్ మహరాజ్ వారి మందిరం ఉంది.

గాణగాపురంలో శ్రీ నృసింహ సరస్వతులవారు 20 సంవత్సరాలు పైగా గడిపారు. ఇక్కడి నిర్గుణపాదుకలు వారివే.

“మీ బుద్ధిని, వివేకమును మీ మనస్సులను క్షాళనం చేసుకోడానికి ఉపయోగించండి” అన్నారు స్వామి.

శృంగేరి మఠ గురుపరంపరకు చెందిన క్రమంలో శివుడు – విష్ణువు – బహ్మ – వశిష్ఠుడు – పరాశరుడు – వ్యాసుడు – శుకుడు – గౌడపాదుడు – గోవిందాచార్యుడు – శంకరాచార్యులు – విశ్వరూపాచార్యులు – నిత్యబోధనాచార్యులు – సింహగిరి ఈశ్వర తీర్థులు – నరసింహతీర్థులు – విద్యాతీర్థులు – విద్యారణ్యులు – మలయానంద సరస్వతి – దేవతేంద్ర, యాదవేంద్ర సరస్వతులు, కృష్ణసరస్వతి – నృసింహసరస్వతి ఉంటారు.

శ్రీ నృసింహ సరస్వతులవారికి ఎంతో మంది శిష్యులు ప్రశిష్యులు! వారి పేర్లన్నీ ‘గురుచరిత్ర’ లో ఉన్నాయి. ‘గురుచరిత్ర’ను గాణగాపురములోగాని, పిఠాపురంలోగాని, కురుమగడ్డ క్షేత్రంలో గాని పారాయణము చేస్తే శ్రేష్ఠమని అంటారు. స్వామి జీవిత కాలం శక 1300 నుండి 1380 వరకు అని తెలుస్తున్నది. గురుచరిత్రలోని 11వ అధ్యాయము నుండి నృసింహ సరస్వతుల వారి చరిత్ర వస్తుంది. గాణగాపుర క్షేత్రాన్ని ‘భూలోక కల్పవృక్ష’మని అంటారు. ధ్యాన, జ్ఞాన, భక్తి యోగములకు అది నెలవు.

***

సాయంత్రం, గుల్బర్గాలో అత్యంత ప్రసిద్ధి చెందిన ‘శరణబసవేశ్వర’ దేవస్థానాన్ని సందర్శించాను. దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో ఉంది బసవప్ప మందిరం. దాని వైభవాన్ని వర్ణించనలవి కాదు.

ప్రధాన ద్వారం ముందు ఇరువైపులా రెండు పెద్ద శ్వేత గజాలున్నాయి. అవి పాలరాతితో చెక్కబడినాయి. వాటి కాళ్లకు తగిలించిన గొలుసులను కూడ ఆ శిల్పి ఎవరో సహజంగా చెక్కాడు.

లోపల కళ్లు చెదిరే పెద్ద పెద్ద షాండిలియర్లు ఉన్నాయి. ఈ మందిరాన్ని 1887-88లో నిర్మించారు. శరణ బసవేశ్వరస్వామి లింగాయత మతానికి చెందిన గొప్ప ఆధ్యాత్మిక గురువు. 18వ శతాబ్దానికి చెందిన యోగి. ఆయన బోధనలు ‘దాసోహ’ ‘కాయక’. దాసోహ అంటే ఇవ్వడమే గడించడం (Giving is yearning). ‘కాయక’ కర్మసిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళే పక్రియ. నిష్కామకర్మను శరణబసవేశ్వర స్వామి బోధించాడు.

‘లింగాయత’ అనేది శైవమతములోని ఒక శాఖ. గర్భాలయంలో స్వామివారి సమాధి ఉంది. మందిరానికి కొంచెం దూరంలో ఒక పెద్ద సరస్సు ఉంది. శరణబసవ కల్ట్ కర్నాటక లోని ఈశాన్య ప్రాంతంలో ప్రబలంగా ఉంది. దీనికి లక్షల సంఖ్యలో అనుయాయులున్నారు. అఖిలభారతశైవాగమ కేంద్రానికి ఇది ఒక శాఖ. మతాలకు అతీతంగా అందరూ బసవేశ్వరుని కొలుస్తారు. ఆయనను ఆప్యాయంగా ‘బసవప్ప’ అని పిలుచుకుంటారు. ప్రతి సంవత్సరం స్వామివారి జాతర, రథయాత్ర వైభవంగా జరుపుతారు. ఆయన ధరించిన వస్త్రాలను (ప్రసాద బట్టలు అంటారు) వెండి పళ్ళేలలో భక్తులకు ప్రదర్శిస్తారు. ఆయన, శివలింగానికి ఉపయోగించిన చందనపు తొడుగును (అంగ కరడిగె) కూడ భక్తులు దర్శిస్తారు. రైతులు తాము పండించిన ధాన్యంలో కొంత భాగాన్ని, దేవస్థానానికి సమర్పిస్తారు. ప్రతి రోజు రెండు పూటలా భక్తులకు అన్నదానం జరుగుతుంది. ఆ రోజు రాత్రి నేనూ స్వామి వారి ప్రసాదం తిన్నాను. జొన్నరొట్టె (చాలా మృదువుగా ఉంది), పలచని కూటు, కొంచెం ముతక బియ్యంతో వండిన అన్నం, అలసందల కూర, మజ్జిగ. చాలా బాగుంది.

శరణబసవప్ప స్వామి గొప్ప బోధకుడు, వేదాంతి. మందిర స్తంభాల మీద, కుడ్యాల మీద మన పురాణేతిహాసాలకు చెందిన ఘట్టాలను చెక్కారు. దీనిని బట్టి ఇది హిందూ మతంలోని భాగమే అని స్పష్టం అవుతుంది.

మందిరం ఇరవై నాలుగు గంటలూ తెరిచి ఉండటం విశేషం. బసవప్పస్వామి ‘కూడలసంగమ’ అనే గ్రామంలో ఒక శైవాగమ పాఠశాలలో చదువుకొన్నారు. అది లాకులిశ – పాశుపత సిద్ధాంతానికి చెందిన విద్యావిధానం. గంగాంబికె అన్న ఆమెను అయన వివాహం చేసుకున్నారు.

మందిర నిర్మాణంలో హిందూ మొగల్ శిల్పరీతులు కనబడతాయి. సర్పాలు చుట్టుకున్న రీతులలో ఇస్లామిక్ నిర్మాణశైలి దర్శనమిస్తుంది. శరణబసవేశ్వర, గంగాంబికె అమ్మల సజీవ శిల్పాలు అద్భుతం. మందిరంలో ఒక చోట స్వామి వారి లైఫ్ సైజ్ విగ్రహం, అది సజీవమా అని మనల్ను భ్రమింప చేస్తుంది. గరుత్మంతుడు, చిలుకలు, ఏనుగులు, రకరకాల పుష్పములు కుడ్యములలో చెక్కారు. హైదరాబాదు నిజాం నవాబుగారు కూడ శరణబసవేశ్వరుని గౌరవించారని అంటారు.

సభామంటపం (దీన్నే ప్రదక్షిణ పథం అంటారు) ఒక నిర్మాణాద్భుతం. స్తంభాల మీద నెమళ్ళను సజీవంగా చెక్కారు. ప్రధానమందిరంలో బంగారు రేకులు తాపడం చేసిన పైకప్పు, పాండిలియర్స్, ప్రముఖ రాజకీయ నాయకులు మందిరాన్ని దర్శించిన చిత్రాలు అద్భుతంగా ఉంటాయి.

గుల్బర్గా నగరంలో తప్పక చూడవలసినది ఈ శరణబసవేశ్వర దేవస్థానం.

***

మర్నాడు ఉదయం 10.40 కి శతాబ్దిలో బయలుదేరి మధ్యాహ్నం 2.03కి సికింద్రాబాద్ చేరుకొని, రేతిఫైల్ బస్ స్టేషన్‍లో మా 1V నం. బస్ ఎక్కి, వనస్థలిపురం చేరుకున్నాను.

‘దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా
ఔదుంబరా ఔదుంబరా నృసింహసరస్వతి ఔదుంబరా!’

‘గాణగాపూర్ రోడ్’ రైల్వే స్టేషన్ కూడ ఉంది. హుసేన్‍సాగర్ ఎక్స్‌ప్రెస్ అక్కడ ఆగుతుంది. అక్కడ నుంచి ఆటోలు, బస్‌లు ఉంటాయి. ‘శతాబ్ది’ లో కలబురిగికి 3గం 40ని. ప్రయాణం!

దత్తభక్తులు వీలు చూసుకొని వెళ్లిరండి మరి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here