Site icon Sanchika

నిర్మోహం

[dropcap]తి[/dropcap]రిగి తిరిగి వచ్చే ఋతువులవే
అయినా ప్రశ్నించవు
ఎపుడూ వసంతమే ఎందుకుండదనీ
శిశిరం ఎందుకు వస్తోందనీ
అడగనే అడగవు
ఏ క్షణానా వణకవు
ఏ అస్థిరతైనా తొణకవు
ఎవరిపైనా నిందవేయవు

మొగ్గ తొడిగి
పూలు పూసి
పరిమళభరితమైన నీడనో
కాయలనో ఇచ్చి
ఏ కొంచెం కృతజ్ఞతనూ కోరుకోక
ఏ సన్మానాలనూ ఆశించక
నిలిచిపోతావలా

ఎన్ని రంగుల చిత్రాలు
ఎన్ని పసందైన రుచులు
ఎన్ని కోమల భావనలు
ఎన్ని వైవిధ్యపు ఇంద్ర ధనువులు

హేమంతపు చల్లదనమైనా
గ్రీష్మపు మహోగ్ర తాపమైనా
వర్షమైనా వడగళ్ళైనా
చలించని యేరులా
పచ్చని కొండలా
నిశ్శబ్దపు యోగిలా
ఋతువుకొక వైచిత్రితో
తడవకొక రంగుల పూవై
తనివారని రసభరితపు ఫలమై
వెన్నెలలో రెల్లులా శోభిల్లుతూ
నిలవడమే నీకుతెలుసు

మరి మనుషులమైన మేమో?

Exit mobile version