నిర్ణయం

0
2

[dropcap]”అ[/dropcap]మ్మా! తాతయ్యొచ్చారు” వరండాలో కూర్చుని చదువుకుంటున్న పదేళ్ల శీను లోపలికి వినిపించేట్లు గట్టిగా పిలిచాడు.

వందన వంటింట్లోంచి చేతులు చీర కొంగుతో తుడుచుకుంటూ, గేటు తీసుకుని లోపలికి వస్తున్న రాఘవ శర్మ గారిని చూసి “రండి మామయ్య గారూ” అంటూ నవ్వుతూ ఆహ్వానించింది.

“ఏరా, బాగా చదువుకుంటున్నావా, తమ్ముడేడి?” అంటూ పలకరించారు శర్మ గారూ శీనుని. “పక్కింట్లో వున్నాడు తాతగారు” అని మళ్ళీ చదువులో పడ్డాడు శీను.

“కూర్చోండి, మీ అబ్బాయి వచ్చేస్తారు. ఇక్కడే కొట్టుకి వెళ్లారు” అంది వందన మంచి నీళ్లిస్తూ.

“వసుధ వాళ్ళు ఎలా ఉన్నారు మామయ్య గారూ”

“బాగానే వున్నారమ్మా, రాత్రి చాలా సేపు మాట్లాడింది” అన్నారు శర్మ గారు.

అంతలో రమణ రానే వచ్చాడు. “ఎంత సేపయింది బాబాయ్ వచ్చి?” అన్నాడు.

“ఇప్పుడేరా” అన్నారు.

వంటింట్లో కాఫీ కలుపుతూ వందన ‘రాత్రే ఫోన్ చేసి మామయ్య గారు రేపు పదింటికి వస్తాను. మీతో మాట్లాడాలి అన్నారు. పక్క సందు లోనే వుంటారు. ఈ మధ్యే నాలుగు నెలల క్రితం భార్య పోయింది. తన భర్తకు సొంత బాబాయి. ఆయనకు ఒక్కతే కూతురు. వసుధ. అమెరికాలో భర్త, పిల్లలతో ఉంటోంది. అక్కడికి రమ్మంటే ఈయనకు ఇష్టం ఉండదు. వాళ్ళు రాలేరు. ఇది చాలా మంది ఇళ్లలో ఉండే సమస్యే! ఏం మాట్లాడాలనుకున్నారో తమతో’ అనుకుంటూ కాఫీ తెచ్చి ఇచ్చి తనూ కూర్చుంది.

“పిన్ని పోయాక నేనిక్కడ ఉండలేకపోతున్నానురా రమణా. హైదరాబాద్‌లో మా అక్క కొడుకు వాసుదేవ పెట్టిన ఆశ్రమానికి వెళ్ళిపోదామనుకుంటున్నాను. మా అక్కయ్య, మా చిన్నాన్న కొడుకు రంగన్నాధం అందులోనే చేరారుట. బాగా కాలక్షేపమవుతోందిట. ఎవరి గది వాళ్ళకే. డాక్టర్ వారం వారం వచ్చి చూస్తాడుట. అందరూ నాలా డబ్భయి ఏళ్ళు దాటిన వాళ్లే. సత్కాలక్షేపం. నలుగురు చేరి మంచి విషయాలు చర్చించుకుంటూ ఉంటారుట. మా అక్క రమ్మంటోంది. వాడూ నాకు అక్కడ బాగుంటుందంటున్నాడు. వెళ్ళిపోతాను” అన్నారు శర్మ గారు.

రమణ ముఖంలో కొంచెం బాధ కనిపించింది. బాబాయే అయినా తండ్రితో సమానం తనకి. అలాగే చూస్తారు కూడా!

వందన “ఇక్కడ మా దగ్గర ఉండకూడదా మామయ్య గారూ, మాకు మాత్రం ఎవరున్నారు?” అంది.

“అలా కాదమ్మా, మీరు నలుగురు పొద్దున వెళ్లిన వాళ్ళు సాయంత్రానికి వస్తారు. ఈ వయసులోనే కష్ట పడాలి. పడుతున్నారు. పక్క సందులో నా ఇంట్లో వున్నా, ఇక్కడ వున్నా నాకు ఒంటరితనమే! ఎన్నాళ్లిలా! అక్కడ అంతా నా వయసు వాళ్లే! ముఖ్యంగా మా అక్క ఉంది, మేనల్లుడే నడుపుతున్నాడు. నేనూ కాస్త ఆశ్రమ నిర్వహణలో సాయం చేయచ్చు, నాకూ తోస్తుంది. నా పెన్షన్ నాకుంది నెల నెలా కట్టటానికి. నాకేదైనా అయితే మనవాళ్లే కాబట్టి మీకు, వసుధకి వెంటనే కబురు చేస్తారు. నాకు ఇది అన్ని విధాలా నచ్చింది.”

రమణ, వందన ఏం మాట్లాడలేదు.

“మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఈ అద్దె ఇల్లు ఖాళీ చేసి, ఇక నుంచి నా ఇంట్లో ఉండండి. నాకేం అద్దె వద్దు. మీవి చిన్న ఉద్యోగాలు. ఇద్దరు పిల్లల్ని చదివించాలి. అద్దె డబ్బు ఆ విధంగా పిల్లల చదువుకు దాచుకోండి. అయితే, ఒకపని చెయ్యాలి మీరు. మా ఇంటి పక్కన ఉన్న మాపెద్ద ఖాళీ స్థలం బాగు చేయించి, దానికో గేటు పెట్టించాలి. మన కాలనీలో వాళ్ళు ఉదయం, సాయంత్రం నడకకి ఎంతో దూరంలో ఉన్న పార్కుకి వెళుతున్నారు. మీ పిన్ని కూడా, డాక్టర్ తప్పకుండా నడవాలంటే, ఆ పార్కుకే వెళ్ళేది. దగ్గరలో ఏదైనా మైదానం ఉంటే బాగుండేదని ఎప్పుడూ అంటూ ఉండేది. ఈ రోజుల్లో నడక అనేది పిల్లలకి, పెద్దలకి అందరికీ అవసరం. పెద్దలకి మరీను!ఉదయం ఐదు నుంచి ఎనిమిదింటి వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిదింటి వరకు గేటు తీసి ఉంచే పని మీరు చెయ్యాలి. పిల్లలు మధ్యలో ఆడుకోవటానికి, నడిచేవాళ్ళు చుట్టు నడవటానికి తగిన విధంగా కావలసిన ఏర్పాట్లు చెయ్యాలి. నడిచే వాళ్లకు ఇబ్బంది లేకుండా నాలుగు రోజుల కోసారి మనింట్లో నీళ్లతో మనిషిని పెట్టి తడపటం వంటివి చెయ్యాలి. అక్కడక్కడా నాలుగు సిమెంట్ అరుగులు కూడా పెట్టించాలి. దీనికోసం అయ్యే ఖర్చు నేనిస్తాను. ఇది ఎప్పటికి ఈ చుట్టుపక్కల వారందరికీ ఉపయోగ పడేట్లు ఉండాలి. ఇవన్నీ నువ్వు చేయగలవా రమణా? ఇల్లు ఇచ్చి బాబాయ్ ఇంత పని పెట్టాడు అనుకుంటావా” అన్నారు శర్మ గారు.

“బాబాయ్, మీరింత మంచి పని చుట్టు పక్కల వారికి ఉపయోగపడే విధంగా చేస్తానంటుంటే నేనెలా చేయకుండా వుంటాను? దీని పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. అన్ని సవ్యంగా చేస్తాను. అందులో వేప చెట్టు అలాగే ఉంచేద్దాం. నడిచే వాళ్లకు కాస్త నీడగా ఉంటుంది. దాని కింద సిమెంట్ అరుగు పెట్టిద్దాం” అన్నాడు రమణ ఉత్సాహంగా. వందన “నేనూ సాయం చేస్తా మామయ్యగారు” అంది.

“అయితే, నేను రెండు నెలల్లో వెళ్ళిపోదామనుకుంటున్నాను. ఈ లోపల పూర్తి చేద్దాం. మీరు కూడా మీ ఇంటి వాళ్లకు వచ్చే నెల ఖాళీ చేస్తామని చెప్పెయ్యండి. అక్కడికి వచ్చేద్దురు గాని” అన్నారు శర్మ గారు. ఆ రోజు అక్కడే భోజనం చేసి సాయంత్రం వరకు ఉండి తన ఇంటికి వెళ్ళిపోయారు.

“ఎంత మంచి ఆలోచన! ఎంత గొప్ప నిర్ణయం! అంత స్థలాన్ని ప్రజల కోసం ఉదారంగా ఉపయోగించటం! బాబాయ్ ఆలోచనలన్నీ ఎప్పుడూ గొప్పగా ఉంటాయి. వసుధక్కతో కూడా మాట్లాడి వుంటారు దీని గురించి. బాబాయ్ ఎక్కడ ఉంటే అక్కడ చైతన్యం ఉంటుంది. వృద్ధాశ్రమంలోనూ పెద్దవాళ్లలో ఉత్సాహన్ని జాగృతం చేస్తారు. బాబాయ్ అప్పజెప్పిన పని చేయటంలో నాకూ తృప్తి ఉంటుంది. ప్రస్తుతానికి ఇంటద్దె బాధ కూడా తప్పించారు బాబాయి” అన్నాడు రమణ వందనతో.

రమణ పనులు ప్రారంభించాడు. స్థలం శుభ్రం చేయించాడు. గేటు పెట్టించాడు. సిమెంట్ అరుగులు అక్కడక్కడా పెట్టించాడు. శర్మ గారింట్లోకి మారిపోయారు. వీధిలో పెద్దలందరిని పిలిచి బాబాయ్ చేత ప్రారంభోత్సవం చేయించాడు. అందరూ రాఘవ శర్మ గారిని గొప్ప నిర్ణయమని మెచ్చుకున్నారు. ఊళ్ళో బ్యాంకు పనులు వగైరాలు రమణ సాయంతో పూర్తి చేసుకుని శర్మగారు తన ఇంట్లో సామానంత వాళ్ళకే వదిలి హైదరాబాద్ వెళ్లిపోయారు.

శర్మ గారి ఇంటి పక్క ఖాళీ స్థలం ఇప్పుడు ఉదయం, సాయంత్రం పిల్లల ఆటలతో పెద్ద వాళ్ళ ఉత్సాహపు నడకతో కళకళలాడుతోంది. ఎవ్వరికి నడక కోసం దూరంగా ఉన్న పార్కుకి నడవాల్సిన పని లేదిప్పుడు.

వందన, రమణలు కూడా సాయంత్రాలు వాళ్ళతో చేరి ఆరోగ్యపు నడకను ఆనందంగా సాగిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here