Site icon Sanchika

నిర్ణయం

[dropcap]సు[/dropcap]మారు గత సంవత్సర కాలంగా జ్యోతికి భర్త, అత్తమామల ప్రవర్తన పట్ల మెల్లగా కోపం మొదలై చివరికి అసహ్యంగా మారిపోయింది. జ్యోతి రామారావులకు పెళ్ళై ఆరేళ్ళు కావస్తోంది. నాలుగేళ్ళ కూతురు కూడా వుంది.

జ్యోతి తండ్రి తనకున్న రెండు స్థలాల్లో ఒకదాన్ని అమ్మి ఏడు లక్షల కట్నం మిగిలిన మూడు లక్షలు యితర ఖర్చులూ చేసి కాబోయే వియ్యంకులు ఊహించిన దానికన్నా పెళ్ళి చాలా ఘనంగా చేశాడు. రామారావు తల్లి తండ్రులు ఆశాపరులైనా ఊహించిన దానికంటే ఎక్కువే కట్నం, లాంఛనాల రూపంలో లభించేసరికి ఉబ్బితబ్బిబ్బయ్యారు. జ్యోతి మాత్రం తండ్రి తన పెళ్ళి కోసం యింత ఖర్చు పెట్టడం ఏమాత్రం యిష్టపడలేదు. పెళ్ళి కొద్దిరోజులుందనగానే “ఎందుకు నాన్నా, ఇంత ఖర్చు పెడుతున్నావు?” అని వారించినా తండ్రి సీతాపతి “పోనీలేమ్మా! మనకి సొంతిల్లు ఉంది కదా, అదీ కాక రెండు ప్లాటులు నీకోసం ఒకటి, తమ్ముడి కోసం ఒకటి ముందు చూపుతో కొన్నాను. ఎలాగో ప్లాటు రూపంలో నీకు యిచ్చేవాడినే కానీ మీ అమ్మ కూడా ఒక ప్లాటు అమ్మేసి పిల్ల పెళ్ళి కలకాలం గుర్తుండేలా చేయండి అనడంతో సరే అన్నాను పరవాలేదమ్మా.” అన్నాడు.

క్రితం సంవత్సరం సీతాపతి రిటైర్మెంట్ జరుగడం సరిగ్గా దానికి ముందే తమ్ముడు రవికి బేంకులో ప్రొబేషను ఆఫీసరుగా ఉద్యోగం రావడమూ జరిగింది. రిటైర్మెంట్ సందర్భంగా ప్రావిడెంట్ ఫండ్ అన్నీ కలిపి పాతిక లక్షల వరకూ సీతాపతికి ముట్టాయి. కూతురి మీద ప్రేమతో సంక్రాంతి పండుగకి కూతురూ అల్లుడిని పిలిచి పండగ సత్కారాలన్నీ చేశాక బయలుదేరేముందు కూతురి చేతిలో లక్ష రూపాయల చెక్కు సీతాపతి అందజేసాడు. అది చూడగానే రామారావుకి ఆనందం ఆశ్చర్యం రెండూ కలిగాయి. జ్యోతి మాత్రం “వద్దు నాన్నా! నా పెళ్ళికే చాలా ఖర్చు పెట్టేశావు” అంటూ చెక్కు వెనక్కి ఇచ్చేసరికి రామారావు పైకి ఏమీ అనలేక మనసులోనే జ్యోతిని తిట్టుకున్నాడు.

తన పెళ్ళికి వచ్చిన కట్నంతో రామారావు ఓ ప్లాటు కొన్నాడు. అక్కడ ఇల్లు కట్టాలనే ప్రయత్నం చేయాలనుకున్నా డబ్బు లెక్క తేలేసరికి వాయిదా వేశాడు.

మామగారి ఉదారస్వభావం చూశాక ఇల్లు కట్టాలనే నెపంతో పోనీలే ఈ లక్ష పోతేపోయింది ఇంకొంచెం ఎక్కువే లాగాలన్న కోరిక కలిగి తొందరపడి భార్యని అప్పుడు బయటికి తిట్టనందుకు తనని తానే మనసులో అభినందించుకున్నాడు.

ఒక మంచి సందర్భం చూసి “జ్యోతీ మనం ప్లాటు కొని చాలా కాలమైపోయింది. ఈ అద్దె కొంపలో ఎంత కాలం ఉంటాము. నేను ఎంతో కొంత తంటాలుపడి నాలుగైదు లక్షలు తీసుకుని రాగలను, కానీ రెండు అంతస్తులు కాకపోయినా కనీసం ఒక అంతస్తు కట్టాలంటే ఆ డబ్బు ఏమూలకి. మరొక పది లక్షల వరకైనా కావలసి వస్తుంది. మీ నాన్నని అడగకూడదూ? అప్పుగానే” అన్నాడు. ఆ మాటలు వినగానే జ్యోతికి ఆశ్చర్యమూ కోపమూ ఒకేసారి కలిగాయి. “మా నాన్న దగ్గర అన్ని డబ్బులు ఎక్కడ వున్నాయండీ” అంది.

“అదేమిటి, రిటైర్మెంట్ సందర్భంగా పాతిక లక్షలు వచ్చాయిగా మీనాన్నగారికి. అప్పుగానైనా ఓ పది లక్షలు సర్దమను” అన్నాడు. జ్యోతి “అవి ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్. వాటిని మా నాన్నగారు బేంకులో ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తేనేగా వాటిపై వచ్చే వడ్డీ పెన్షనుకు వేడినీళ్ళకు చన్నీళ్ళలా తోడై ఆయన నెలసరి ఖర్చులకీ మందు మాకులకూ సరిపోయేది? అలాంటప్పుడు ఆ డబ్బులలోంచి పది లక్షలు అప్పుగానైనా మనకు ఎలా యిస్తారు?” అని అడిగింది.

మరో రెండుసార్లు రామారావు ఈ విషయం జ్యోతిని ఆలోచించమన్నా ఆమె అడగనని ఖచ్చితంగా చెప్పడంతో రామారావుకి కూడా ఎలాగైనా డబ్బులు మావగారి దగ్గర నుంచి రాబట్టాలన్న పట్టుదల కూడా పెరుగుతూనే వచ్చింది. భార్య ద్వారా అడిగిస్తే తప్పక మామగారు ఎంతోకొంత డబ్బు యిస్తాడన్న నమ్మకమూ వుంది. మెల్ల మెల్లగా జ్యోతిని మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. తన తల్లీ తండ్రికీ కూడా జ్యోతితో ఈ విషయం గురించి తరుచూ ప్రస్తావించి ఒత్తిడి చేయమని చెప్పాడు. తండ్రిని డబ్బులడగమని జ్యోతికి అన్ని వైపుల నుండి వేధించడం మొదలయింది. రాను రానూ జ్యోతికి ఇంట్లో పరిస్థితి భరించడమూ కష్టమవసాగింది. ఒకరోజు జ్యోతి తన స్నేహితురాలు లతను కలిసి మనసులో బాధను చెప్పుకుందామని బయలుదేరింది.

దారిలో తమ ఇంట్లో పాచిపని చేసే రాజమ్మని తన కూతురితో సహా చూడగానే జ్యోతి “రాజమ్మా! నిన్నా యివేళా మా ఇంట్లో పనికి రాలేదు. ఏమయ్యింది? నీ మొబైల్‌కి ఫోన్ చేసినా తీసి మాట్లాడలేదు.” అని అడిగింది.

జ్యోతి మాటవిన్న రాజమ్మ తన కూతుర్ని చూపిస్తూ “చూడండమ్మా దీన్ని ఎట్టా కొట్టినాడో దీని మొగుడు.” అంటూ కంట నీరు పెట్టుకుంది. అసలు ఏమయింది అని జ్యోతి అడగగానే దీని పెళ్ళి జరిగిన దగ్గర నుంచి నా గుడిస మీద ఆడి కన్ను పడిందమ్మా.. దాన్ని అమ్మి ఆ డబ్బు ఇమ్మంటాడు. నేను అమ్మడానికి ఒప్పుకోవట్లేదని తాగి రోజూ దీని మీద చెయ్యి కూడా చేసుకుంటున్నాడు.”అంటూ బాధపడింది. “ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు? డాక్టరు దగ్గరకా?” అని జ్యోతి అడగగానే “లేదమ్మా పోలీసు రిపోర్టు ఇవ్వడానికి కమ్మా” అంది. ఆ మాట వినగానే జ్యోతి కొంచెం సేపు ఆలోచించి “రాజమ్మా, పద నేనూ నీతో వస్తాను.” అంది.

Exit mobile version