నిర్ణయం

47
3

[dropcap]అ[/dropcap]ది 1990 దశకంలో ప్రథమార్థం. సత్తెనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్‍గా పనిచేస్తున్న సుందరం మాష్టారంటే, ఆ ఊర్లో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఉద్యోగ నిర్వహణలో క్రమశిక్షణకు, నిబద్దతకు ఆయన పెట్టింది పేరు. పైగా సుందరం మాష్టారి ఆధ్వర్యంలో ఆ కళాశాల గత మూడేళ్ళనుండి ఇంటర్మీడియట్‍లో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధిస్తూ, రాష్ట్రస్థాయిలోనే ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది.

ఆయన కుటుంబ నేపథ్యం గురించి చెప్పాలంటే ముందుగా ఆయన సతీమణి సీతారత్నం… పెద్దగా చదువుకోలేదు. గృహిణిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, భర్త, పిల్లల బాగోగులను చూసుకోవడంలోనే ఎప్పుడూ తలమునకలై వుంటుంది. ఆ దంపతులకు లేటు వయసులో సంతానప్రాప్తి కలిగింది. రెండు సంవత్సరాల తేడాతో ముచ్చటగా ముగ్గురు ఆడపిల్లలు. పేర్లు సరస్వతి, లక్ష్మి, పార్వతి.

***

ఇక ఆ ముగ్గురి ఆడపిల్లల చిన్నతనంలోకి తొంగిచూద్దాం. తల్లిదండ్రుల ముద్దుమురిపాలతో అపురూపంగా పెరిగారు. చదువు సంధ్యల్లో, ఆటపాటల్లో తోటివారికంటే ఎప్పుడూ ముందంజలో వుండేవారు. వినయ విధేయతలతో, సత్ప్రవర్తనతో అందరి మన్నలను చూరగొన్నారు ఆ అక్కాచెల్లెళ్ళు. ఆ రోజుల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెడ్ మాష్టరుగా పనిచేసేవారు సుందరం మాష్టారు. ఇంటికి రాగానే ముగ్గురు పిల్లలకు పాఠాలు చెపుతూ హోం వర్కు చేయించేవారు. సమయం దొరికినప్పుడల్లా, రామాయణ, భారత, భాగవతాలలోని విశిష్టతలను వర్ణించి చెప్తూ ధర్మ సూక్ష్మాలను బోధిస్తూ, సత్సంస్కారాలతో సద్గుణాలతో వారి మనసులను నింపేవారు. పిల్లల ముందు చదువు చెప్పేందుకు కూర్చున్నప్పుడు, సుందరం మాష్టారు, ఒక తండ్రిగా కాక, ఒక గురువుగారి పాత్రలోనే లీనమయ్యేవారు. పిల్లలు కూడా తమకెదురుగా కూర్చుంది తమ తండ్రే అయినా, ఆ సమయంలో ఒక గురువు గారిని మాత్రమే ఆయనలో చూస్తూ, ఆయన చెప్పింది విని, ఆకళింపు చేసుకునేవారు. అంతటి నిష్ఠతో చదువు కొనసాగించేవారు ఆ గురుశిష్యురాండ్రు.

***

రోజులు, నెలలు, సంవత్సరాలు అలా గడిచిపోతున్నాయ్! ఆ సంవత్సరం ఎమ్‍సెట్‍లో స్టేట్ ర్యాంకు సాధించింది పెద్దమ్మాయి సరస్వతి. గుంటూరు మెడికల్ కాలేజీలో యం.బి.బి.యస్ సీటు సంపాదించింది. అంత పెద్ద చదువు చదివేందుకు ఆర్థిక స్తోమతలేని సుందరం మాష్టారు, అప్పటివరకు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్‍లోంచి అవకాశం ఉన్నంత మేర డబ్బు వెనక్కి తీసుకున్నారు. స్నేహితులు, బంధువుల దగ్గర అప్పులు కూడా చేశారు. అలా సరస్వతి చదువుకు మార్గం సుగమం అయింది.

***

రెండు సంవత్సరాలు గడిచాయి. పెద్దమ్మాయి సరస్వతి యం.బి.బి.యస్ మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆ సంవత్సరమే రెండో అమ్మాయి లక్ష్మి కూడా ఎమ్.సెట్‍లో స్టేట్ ర్యాంక్ సాధించి, గుంటూరు మెడికల్ కాలేజీలో యం.బి.బి.యస్ సీటు సంపాదించింది. అందరూ సంతోషించారు. సుందరం మాష్టారుకి మాత్రం లోలోపల దిగులు మొదలైంది. మొదటి అమ్మాయిని యం.బి.బి.యస్ చదివించడానికే ఇబ్బందిపడుతుంటే, ఇప్పుడు ఈ రెండో అమ్మాయిని కూడా యం.బి.బి.యస్ ఎలా చదివించాలి! ఆ ఆలోచనను లోలోపలే దిగమింగుతూ పైకి గుంభనంగా కనిపిస్తున్నా, సుందరం మాష్టారి అంతరంగంలో అంతర్మథనం జరుగుతుంది. ఆ విషయాన్నే తన ధర్మపత్ని సీతారత్నంతో చర్చించాడు. చివరికి తన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆ ఒక్క ఎకరం వ్యవసాయ భూమిని అమ్మి, రెండో అమ్మాయిని యం.బి.బి.యస్ చదివించేందుకు నిర్ణయించుకున్నాడు సుందరం మాష్టారు. మొత్తానికి ఆ గండం అలా గట్టెక్కింది.

***

మరో రెండు సంవత్సరాలు గడిచాయి. సుందరం మాష్టారు ఉద్యోగ విరమణ చేశారు. పెద్దమ్మాయి సరస్వతి యం.బి.బి.యస్ అయిదవ సంవత్సరంలో అడుగుపెట్టింది. అలాగే రెండో అమ్మాయి లక్ష్మి యం.బి.బి.యస్ మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆ సంవత్సరమే… మూడో అమ్మాయి పార్వతి కూడా, ఎంసెట్‍లో స్టేట్ ర్యాంకు సాధించి, గుంటూరు మెడికల్ కాలేజీలో యం.బి.బి.యస్ సీటు సంపాదించింది. ఊరు ఊరంతా సుందరం మాష్టారు దంపతులను పొగడ్తలతో ముంచెత్తింది. ముగ్గురమ్మాయిలను బాగా చదివించడమే కాకుండా ఎంతో ప్రతిష్ఠాత్మకమైన, కష్టతరమైన డాక్టర్ కోర్సులు చదివిస్తున్నారు. అక్కాచెల్లెళ్ళు ముగ్గురూ డాక్టర్లు కాబోతున్నారు. ఆ అక్కాచెల్లెళ్ళ శక్తి సామర్థ్యాలను గురించి, సుందరం మాష్టారుగారి మార్గదర్శకం గురించి, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు కథలు కథలుగా చెప్పుకున్నారు.

అలాంటి అరుదైన ఘనతను ఓ పండుగలా జరుపుకుంది సుందరం మాష్టారి కుటుంబం.

***

ఆ రోజు చీకటి అలుముకుంటుంటే సుందరం మాష్టారు గుండెల్లో గుబులు గూడు కట్టుకుంటుంది. పడుకుంటే పక్క కుదరడం లేదు. నిద్రపట్టడం లేదు. మూడో అమ్మాయికి కూడా యం.బి.బి.యస్ సీటొచ్చినందుకు అపరిమితమైన ఆనందం ఒకవైపు… ఇప్పటికే ఇద్దరమ్మాయిలను యం.బి.బి.యస్ చదివించటానికి పడరాని పాట్లు పడుతుంటే, ఇప్పుడు మూడో అమ్మాయిని కూడా యం.బి.బి.యస్ ఎలా చదివించాలి… అనే తీర్చతరం కాని దిగులు…. మరోవైపు…

అనందం, దిగులు…. రెండింటి మధ్య సుందరం మాష్టారు గారి ఆలోచనలు, గాలిలో పెట్టిన దీపశిఖలా కొట్టుమిట్టాడుతున్నాయి. ఏమీ పాలుపోవడం లేదు. అప్పుడే సీతారత్నం అక్కడికి వచ్చింది.

“ఏంటండీ! ఇంకా నిద్రపోలేదా!”

“లేదు…. సీతారత్నం! మనసేం బాగోలేదు!”

“నాకు తెలుసండీ! మీ అర్థాంగిని! మీ ఆలోచనలను నేను అర్థం చేసుకోలేనా! ఇప్పటికే ఇద్దరమ్మాయిలను యం.బి.బి.యస్ చదివించడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పుడు మూడో అమ్మాయిని కూడా యం.బి.బి.యస్ ఎలా చదివించాలి! అనే కదా మీ దిగులు!”

అప్పుడే మంచినీళ్ళ కూజాను పెట్టేందుకు అమ్మవాళ్ళ గదిలోకి రాబోయిన పార్వతి, అమ్మానాన్నలు తన గురించే ఏదో మాట్లాడుకుంటున్నారని గ్రహించి, అక్కడే నక్కి, వాళ్ళ మాటలు వినసాగింది.

“అవును సీతారత్నం! నాకు ఏ దారీ కనిపించడం లేదు! నీకేమైనా కనిపిస్తుందా!”

“నేనూ ఈ విషయమై ఉదయం నుండే విరామం లేకుండా ఆలోచిస్తూనే ఉన్నానండి! మీరొప్పుకుంటే… ఒకే ఒక మార్గం ఉంది మనముందు!”

“ఏంటది సీతారత్నం! త్వరగా చెప్పు!”

“అదేనండి! మీ పూర్వీకుల ఆస్తి ఒక ఎకరం పొలం రెండు సంవత్సరాల క్రితం పిల్లల చదువుల కోసం అమ్మేశారు!”

“అవును!”

“ఇప్పుడు మన ఇంటిని కూడా అమ్మేద్దాం! పిల్లల్ని చదివించుకుందాం!”

“ఏంటి సీతారత్నం నువ్ అనేది! మన ఇంటిని అమ్మేయడమా! అలా అమ్మితే మనం ఎక్కడ తలదాచుకోవాలి!”

“దాందేముందండి! వేరే ఒక ఇంటిని అద్దెకు తీసుకుందాం! వింటుంటే బాధగా వుంది కదూ! అలా బాధపడాల్సిన అవసరం లేదండీ! మనం మన ఇంటిని అమ్మేది మన పిల్లల చదువుకోసమే కదా!”

“ఎందుకో మన ఇంటిని అమ్మేందుకు నా మనసు అంగీకరించడం లేదు సీతారత్నం! మన ఇంట్లో మనం ఉంటే…. ఆ సౌలభ్యమే వేరు! ముగ్గురు ఆడపిల్లల తల్లిదండ్రులం మనం…. ఇలా మా పూర్వీకులు ద్వారా సంక్రమించిన ఈ ఒక్క ఇంటిని కూడా అమ్మేసుకుంటే… నలుగురిలో పలచన అవుతాం కదా!”

“అలా మీరు ఏ నలుగురు గురించి ఆలోచిస్తున్నారో… ఆ నలుగురు ఇప్పుడు మన పిల్లలను చదివించేందుకు, మనకు సహాయపడేందుకు ముందుకు వస్తారా? రానే… రారు….! వాళ్ళు ఆర్చేవారు కాదు! తీర్చేవారు కాదు! మరి… అలాంటి ఆ నలుగురి కోసం మనం ఆలోచించాలా? మన బాధలు మనవి… మన సమస్యలు మనవి… వాటిని అధిగమించేందుకు మన ఆలోచనలు మనకుండాలి!… అంతే!… ఏమంటారు?”

“అనడానికేముంది! నువ్వు చెప్పింది కూడా యథార్థమే అనుకో! మన ముందు మరో మార్గం లేనప్పుడు, నువ్వు చెప్పిందే శరణ్యం! సరే! అలాగే చేద్దాం!!”

“అయినా మనకేంటండీ! మన పిల్లలు కాబోయే డాక్టర్లు! డాక్టర్లు దేవుళ్ళతో సమానమంటారు! మరి, ఆ దేవుళ్ళ కోసమే కదా… మన ఇంటిని అమ్ముతున్నాం! మీరు ధైర్యంగా వుండండి! అంతా మంచే జరుగుతుంది!”

“అవును సీతారత్నం! మన పిల్లలు డాక్టర్లు! ఎంతోమందికి ప్రాణదానం చేస్తారు! భవిష్యత్తులో మనకెంతో పేరు ప్రతిష్ఠలు తెస్తారు! గొప్పగా ఎదుగుతారు! ఇంతకంటే మంచి ఇళ్ళు, వాళ్ళూ కొనుక్కుంటారు!”

“సరే! ఇక ఆలోచనలను కట్టిపెట్టి హాయిగా నిద్రపోండి!” అంది సీతారత్నం.

అప్పుడే పార్వతి వచ్చి, మంచినీళ్ళ కూజాను వాళ్ళ గదిలో పెట్టి, తన గదిలోకి వెళ్ళింది.

***

పార్వతి పక్కమీద వాలింది కాని, నిద్ర దరిదాపుల్లో లేదు. అప్పటివరకు తాను విన్న అమ్మా, నాన్నల మధ్య సాగిన సంభాషణ, తన చెవుల్లో పునరావృతం అవుతూనే వుంది. పిల్లలను పెద్ద చదువులు చదివించాలంటే…. కేవలం పిల్లల తెలివితేటలు మాత్రమే సరిపోవు. అందుకు తగినంత ఆర్థిక స్తోమత కూడా వుండాల్సిందే!…. అని పార్వతికి అవగతమైంది. అది లేకపోతే, ఎన్నో తెలివితేటలున్న వారు, ఎంతో శక్తిసామర్థ్యాలున్నవారు కూడా, ఈ పోటీ ప్రపంచంలో నిలబడలేక, అశక్తులై వెనకబడిపోతున్నారు. అలాంటి మట్టిలో మాణిక్యాలు ఎంతోమంది ఎదుగూ బొదుగూ లేకుండా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు, జీవనం సాగిస్తున్నారు. అంచనాకు అందని ఆ యువశక్తి అలా నిరుపయోగంగా మిగిలిపోవాల్సిందేనా? ఈ పరిస్థితులు మారేదెన్నడు? అసలు మారతామా?… అలా సమాధానం దొరకని ప్రశ్నలతో… ఎక్కడెక్కడికో వెళుతున్న తన ఆలోచనలకు… తాత్కాలికంగా అడ్డుకట్టవేసి, తన పరిస్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది పార్వతి.

ఉన్న ఆ ఒక్క ఇంటిని అమ్మి నా చదువు కొనసాగించాలా? అమ్మా నాన్నలను నిరాశ్రయులను చేసి నేను చదవాలా? వాళ్లని ఇబ్బందుల పాలుజేసి చదివిన చదువు నాకు వంటపడుతుందా? అది న్యాయమేనా? ధర్మమేనా? పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అమ్మా, నాన్నలు ఇప్పటివరకు చేసిన త్యాగాలు సరిపోవన్నట్లు, ఇంకా త్యాగాలు చేయాలా? వాళ్ళ పరిస్థితిని తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది.

మరి ఈ విషయంలో నేనేమైనా చేయగలనా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి!…. అనుకుంటూ దీర్ఘాలోచనలలో నిమగ్నమైన పార్వతికి, తెల్లవారుఘాముకి కాస్త కునుకుపట్టింది. కలతనిద్రలోనే కలలు మొదలయ్యాయి. ఆ కలల్లో పార్వతి సమస్యకు ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో! వేచి చూడాలి మరి!!

***

తెల్లారింది. పార్వతి ముఖం పీక్కుపోయింది. కళ్ళు ఉబ్బి ఎర్రబారాయి. హాల్లో వున్న సోఫాలో నీరసంగా కూర్చుని ఉన్న పార్వతిని చూసిన తల్లి సీతారత్నం….

“ఏంటమ్మా అలా వున్నావ్? రాత్రి నిద్రపోలేదా?” అని అడిగింది.

“ఏవేవో ఆలోచనలతో నిద్రపట్టలేదమ్మా!!”

“అంతలేసి ఆలోచనలు నీకేంటమ్మా! ఇప్పుడేమైందని?”

“నేనొకసారి నీతో, నాన్నతో మాట్లాడాలి!”

“అలాగే! నాన్నని కూడా పిలుస్తానుండు!”

లోపలికెళ్ళిన సీతారత్నం సుందరం మాష్టారుని తోడ్కొని వచ్చింది. ఇద్దరూ పార్వతికి ఎదురుగా కూర్చున్నారు. “అమ్మా! నాన్న! ఇప్పుడు నేనొక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. ధైర్యంగా వినండి! గాబరాపడవద్దు!!”

“ముఖ్యమైన విషయమా!! ఫరవాలేదు చెప్పమ్మా!!”

ఇద్దరూ ఒకేసారి కుతూహలంగా అడిగారు.

“నేను యం.బి.బి.యస్ చదవకూడదని నిర్ణయించుకున్నాను!!” అని గంభీరంగా చెప్పింది పార్వతి.

ఆ మాటలు విన్న సుందరం మాష్టారుకి, సీతారత్నంకి గుండె ఆగినంత పనైంది. ఇది కలా నిజమా అని తేల్చుకోలేకపోతున్నారు వారిద్దరూ. అయినా అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం పార్వతికి ఇప్పుడెందుకొచ్చింది! ఏ మాట్లాడాలో తేల్చుకోలేని సుందరం మాష్టారు, ఆశ్చర్యపోతూ…

“అదేంటమ్మా! అంత మాటన్నావేంటి!!” అన్నారు. అంతే ఆశ్చర్యంగా… “ఏంటమ్మా! అలాంటి నిర్ణయం తీసుకోవడమేంటి!!” అని అడిగింది సీతారత్నం.

“వివరంగా చెప్తాను వినండి!… యం.బి.బి.యస్ చదవడమనేది కష్టతరం మాత్రమే కాదు… ఖర్చుతో కూడినది కూడా! ఫీజులు కూడా ఎక్కువే! పైగా… ఐదు సంవత్సరాలు చదవాలి…. ఆ తరువాత ఒక సంవత్సరం హౌస్ సర్జన్‍గా పనిచేయాలి. అప్పుడు వస్తుంది యం.బి.బి.యస్ డిగ్రీ. అంటే… ఏ విఘ్నాలు లేకపోతే, యం.బి.బి.యస్ డిగ్రీ పొందడానికి ఆరు సంవత్సరాలు పడుతుంది. పోనీ, యం.బి.బి.యస్‍తో సరిపెట్టుకుందామంటే ఈ రోజుల్లో కేవలం ఒక్క యం.బి.బి.యస్‍కు అంతగా విలువ ఉండడం లేదు. విధిగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం మరో రెండేళ్ళు చదివి, ఏ యండి అనో, యం యస్ అనో అనిపించుకోవాలి. అంటే మొత్తంగా డాక్టరు కోర్సు అంటే ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ కాలం చదువులోనే గడపాలి. హౌస్ సర్జన్, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసే సమయాల్లో ప్రభుత్వం నుండి కొంత ఆర్థిక సహాయం అందేమాట నిజం!

కాని పదవీ విరమణ తరువాత పెన్షన్ పైనే ఆధారపడి జీవించే మీరు, అంతంత మాత్రపు ఆర్థిక నేపధ్యం ఉన్న మీరు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముచ్చటగా ముగ్గురు కూతుర్లను, అన్ని సంవత్సరాల పాటు డాక్టర్ కోర్సులు చదివించడం ఎంత కష్టమో, నేను అర్థం చేసుకోగలను. ఇప్పటికే కనాకష్టంగా ఇద్దరక్కయ్యలను యం.బి.బి.యస్ చదివిస్తున్నారు. ఇక వాళ్ళకు తోడు, నేను కూడా తయారైతే మీ వెతలు వర్ణనాతీతం. అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను. ఇద్దరక్కయ్యలను యం.బి.బి.యస్ చదివిద్దాం. ఆ తరువాత యండి కాని యం యస్ కాని చదివిద్దాం!… నేను మాత్రం… బీఫార్మసీ… చదువుకుందామనుకుంటున్నాను… ఎందుకంటే, ఆ కోర్సు చదివితే నాలుగు సంవత్సరాలకే డిగ్రీ చేతికి వస్తుంది. ఆ డిగ్రీతో ఏ మందుల కంపెనీలోనో ఉద్యోగం వస్తుంది.

ఆ వచ్చే జీతంతో నేను మీ కష్టాలలో పాలు పంచుకుంటాను. మీకు అండగా ఉంటాను. అదీగాక, బీఫార్మసీకి యం.బి.బి.యస్ అంత ఫీజులుండవు. చాలా తక్కువగా వుంటాయ్! ఆ డిగ్రీ పొందడానికి యం.బి.బి.యస్ అంత శ్రమ చేయక్కర్లేదు. అందుకే బీఫార్మసీ చదువుతూనే ప్రతిరోజు కొన్నిగంటలు చిన్నపిల్లలకు మన ఇంటివద్దే ట్యూషన్స్ చెప్పి, నెలా నెలా కొంత సంపాదించి మీ చేతుల్లో పెడతాను. ఆ విధంగా మిమ్మల్ని ఆర్థికంగా కొంతవరకు ఆదుకుంటాను. ఇద్దరక్కయ్యలను బాగా చదివిద్దాం. ఈ విషయంలో మరోమాట లేదు. నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి మీరు నాకు అడ్డుచెప్పకండి!” అంటూ ఆవేశపూరితంగా చెప్పి, రెండు చేతులను జోడించి తల్లిదండ్రులకు నమస్కరించింది పార్వతి.

సుందరం మాష్టారికి, సీతారత్నంకి, పార్వతి మాట్లాడుతుంటే ఆదిపరాశక్తి తమకు కర్తవ్యబోధన చేస్తున్నట్లనిపించింది. అందుకే పార్వతి మాటలకు అడ్డు చెప్పలేకపోయారు. అంత చిన్నవయసులో కుటుంబం గురించి అంతగా ఆలోచించింది పార్వతి. ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్న పార్వతిని చూస్తుంటే, కళ్ళ వెనక వున్న నీటి సరస్సులు పొంగి పొర్లాయి ఆ ఇద్దరి దంపతులకు. అలా ఏడుస్తూనే పార్వతిని కౌగలించుకుని ఉండిపోయారు.

***

విషయం తెలుసుకున్న సరస్వతి, లక్ష్మి హుటాహుటీన సత్తెనపల్లి వచ్చారు. పార్వతి మనసు మార్చి యం.బి.బి.యస్ చదివించేందుకు ఒప్పించడానికి వాళ్ళు చేసిన హితబోధలు, చెవిటి వాడి చెవులో శంఖం ఊదినట్లే అయ్యాయి. వారు చేసిన విశ్వప్రయత్నాలు విఫలయత్నాలుగానే మిగిలిపోయాయి. అక్కడంతా నిశ్శబ్దం తాండవించింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, పార్వతి…

“ఇంకో విషయం నాన్నా! నేను గుంటూరు ఫార్మసీ కాలేజీలో చేరతాను. ఇక్కడ ఇంటిని ఎంతో కొంతకు తెలిసిన వాళ్ళకు అద్దెకు ఇద్దాం! గుంటూరులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుందాం! అక్కడ అందరం కలిసే వుందాం! అక్కయ్యలిద్దరూ, మనతోనే వుంటూ చదువుకుంటారు. అలా హాస్టల్ ఖర్చులు కూడా కలిసొస్తాయి.

మరో విషయం నాన్నా! మీరు ఏ ప్రైవేటు స్కూల్లోనో టీచరుగా పనిచేయండి! కాదనకుంటే ఇంటిపట్టునే ఉంటూ నాలాగా మీరూ పిల్లలకు ట్యూషన్ చెప్పండి! అలా కొంత సంపాదించండి! నా మటుకు నేను, ఒక ప్రక్కన బాగా చదువుకుంటూ, ఇంటి పనుల్లో అమ్మకు సాయం చేస్తూ, ట్యూషన్లు చెప్పుకుంటూ ఇద్దరక్కయ్యలకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. వాళ్ళ చదువులు, నిరాటంకంగా, నిర్విఘ్నంగా కొనసాగించేందుకు, నేనూ, నాతోపాటు మీరూ, శాయశక్తులా ప్రయత్నం చేద్దాం!” అంటూ దిశా నిర్దేశం చేసింది పార్వతి. అలా యావత్ కుటుంబ పరిస్థితిని తన ఆధీనంలోకి తెచ్చుకుంది పార్వతి.

తల్లిదండ్రులకు కాని, అక్కయ్యలకు కాని మాట్లాడేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు పార్వతి. మౌనం దాల్చడం మినహా, పార్వతికి మరింకెలాంటి సలహాలు ఇవ్వడానికి, సాహసం చేయలేకపోయారు వాళ్ళంతా… తమకిష్టమున్నా లేకపోయినా చివరికి వాళ్ళంతా పార్వతి చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలనే సమిష్టి నిర్ణయానికి వచ్చారు.

***

కాని ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది… పార్వతి యొక్క త్యాగనిరతి. అటు కష్టాల్లో వున్న తల్లిదండ్రులను ఆదుకోడానికి, ఇటు అక్కయ్యలను పై చదువులు చదివించడానికి, తన భవిష్యత్తును ఫణంగా పెట్టిన పార్వతిని అభినందించాల్సిందే! హేట్స్ ఆఫ్ టూ యూ పార్వతి!!

***

కాలచక్రం గిర్రున తిరిగింది. నాలుగు సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. సరస్వతి యం.డి. పూర్తిచేసింది. లక్ష్మి హౌస్ సర్జన్ పూర్తి చేసి యం.యస్. చదవడానికి తయారవుతుంది. పార్వతి గోల్డ్ మెడల్ సాధించి బిఫార్మసీ డిగ్రీ పూర్తిచేసింది. అన్నీ పార్వతి నిర్ణయం ప్రకారమే జరిగిపోతున్నాయి.

***

దేశంలోనే పేరుగాంచిన విశ్వం ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అనే మందుల కంపెనీ గుంటూరులోనే ఉంది. ఆ కంపెనీ, బిఫార్మసీ డిగ్రీని ఆ సంవత్సరమే పూర్తిచేసిన వారిని, జూనియర్ గ్రేడ్‍లో ఉద్యోగాల్లో తీసుకునేందుకు దరఖాస్తులు పంపవలసినదిగా కోరింది. పార్వతి కూడా తన దరఖాస్తును పంపింది. అందులోని వివరాలతో సంతృప్తి చెందిన కంపెనీ హెచ్.ఆర్.డిపార్టుమెంటు, ఇంటర్వ్యూకి రమ్మని పార్వతికి ఉత్తరం పంపింది. ఇంటర్వ్యూ జరగడం, పార్వతి ఆ ఉద్యోగానికి ఎంపిక కావడం, అన్నీ చకచకా జరిగిపోయాయి. ఓ మంచిరోజు చూసుకుని, తల్లిదండ్రుల ఆశీస్సులతో ఉద్యోగంలో చేరింది పార్వతి.

***

ఆ రోజు ఇంటర్వ్యూ కమిటీలో విశ్వం ఫార్మాస్యూటికల్స్ ఛైర్మన్, ‘శ్రీ సుగుణాకరం’ గారు కూడా ఉన్నారు. పార్వతి సుందరం మాష్టారి మూడో కూతురని తెలుసుకుని చాలా సంతోషించాడు. ఎందుకంటే, ఆ సుందరం మాష్టారే తనకు ఎలిమెంటరీ స్కూల్లో క్లాస్ టీచర్. ఆ రోజుల్లోనే తన అభ్యున్నతికి బీజం నాటారు సుందరం మాష్టారు.

సుగుణాకరం సుందరం మాష్టారిని కలిసి చాలా రోజులైంది. కాదు… కాదు… సంవత్సరాలైంది. ఇప్పుడు తనను ఇంత ఉన్నత స్థితిలో చూస్తే, సుందరం మాష్టారు ఎంతో సంతోషిస్తారు. రేపోసారి సుందరం మాష్టారిని కలుద్దామనుకున్నాడు సుగుణాకరం.

***

మరుసటిరోజు ఉదయమే సుందరం మాష్టారి ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కాడు సుగుణాకరం. స్వయంగా సుందరం మాష్టారే వచ్చి, తలుపులు తెరిచారు.

“నమస్కారం సార్!” వినయంగా చెప్పాడు సుగుణాకరం.

“నమస్కారం బాబూ! ఎవరు కావాలి?” అడిగారు సుందరం మాష్టారు.

“సార్! నన్ను గుర్తుపట్టలేదా! సుగుణాకరాన్ని! నేను ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు మీరే నా క్లాస్ టీచర్!”

“ఆ! ఆ! ఇప్పుడు గుర్తొచ్చింది! ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదా! వెంటనే గుర్తుపట్తలేకపోయాను! అన్నట్లు ఇంతకాలానికి నా గురించి ఎలా తెలుసుకోగలిగారు!!”

“ప్రస్తుతం నేను విశ్వం ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి ఛైర్మన్‍ని! వాస్తవానికి ఆ కంపెనీ వ్యవస్థాపకుడిని కూడా నేనే సార్! మీలాంటి పెద్దల ఆశీస్సుల వల్ల, భగవంతుడి దయవల్ల, ఆ కంపెనీ దేశ విదేశాల్లో వ్యాపారం చేస్తూ సుమారు వెయ్యి కోట్ల టర్నోవర్ సాధించింది. మొత్తం ఆరువేలమంది దాకా మా కంపెనీలో వివిధ హోదాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.

ఈ మధ్యనే మీ మూడో అమ్మాయి పార్వతి మా కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వచ్చింది. సెలెక్ట్ అయింది. ఉద్యోగంలో చేరింది కూడా! అప్పుడే పార్వతి ద్వారా మీ గురించి తెలుసుకున్నాను. వెంటనే మిమ్మల్ని కలవాలనిపించింది. అందుకే ఇప్పుడిలా వచ్చి మిమ్మల్ని కలుసుకున్నాను!”

అంతా విన్న సుందరం మాష్టారు…. “చాలా సంతోషం బాబూ!” అంటూ ఆప్యాయంగా… సుగుణాకరం భుజం తట్టారు.

అప్పుడే అక్కడికి వచ్చిన సీతారత్నంకి, సుగుణాకరాన్ని పరిచయం చేశారు సుందరం మాష్టారు. వాళ్ళిద్దరికీ పాదాభివందనం చేసి, పుష్పగుచ్చాలను అందించి, ఒక పండ్ల బుట్టను టీపాయ్ మీద పెట్టించాడు సుగుణాకరం.

“ఇప్పుడెందుకు బాబూ ఇవన్నీ!”

“ఏదో నా తృప్తికోసం సార్! మీలాంటి పెద్దవారిని, పైగా గురువుగారిని కలిసేందుకు వచ్చేటప్పుడు ఉత్త చేతుల్తో రాకూడదు కదా సార్!”

ముగ్గురూ కూర్చుని మాట్లాడుకుంటూ, తేనీరు సేవించారు.

“సార్! నాదో చిన్న విన్నపం!”

“ఏంటి బాబూ!!”

“మీ అమ్మాయి పార్వతిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేను నిశితంగా గమనించాను. తానొక జీనియస్. భవిష్యత్తులో, ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించగల శక్తి సామర్థ్యాలు తనలో నాకు ప్రస్ఫుటంగా కనిపించాయి. అలాంటి మేధోసంపత్తి కలిగిన మీ అమ్మాయిని, మీరొప్పుకుంటే మా కంపెనీ తరపున అమెరికా పంపించి, ఎం.ఫార్మసీ (అక్కడ ఎం.ఎస్. ఫార్మసీ) చదివిస్తాము. ఆ తరువాత పిహెచ్‍డి కూడా చేయిస్తాము. మొత్తం చదువు మూడు సంవత్సరాల్లో పూర్తవుతుంది. అమెరికాలోని ఓ పేరు మోసిన విశ్వవిద్యాలయంలో చదివిస్తాము. అందుకయ్యే ఖర్చులన్నీ మా కంపెనీయే భరిస్తుంది. దయచేసి మీరు కాదనకుండా, ఒప్పుకుంటే వెంటనే పార్వతిని అమెరికా పంపే ఏర్పాట్లు చేయిస్తాను! ప్లీజ్ సార్! ఓ.కే చెప్పండి!!”….. బ్రతిమాలుతున్నట్లు అడిగాడు సుగుణాకరం.

మొహమాటం ఎక్కువగా ఉండే సుందరం మాష్టారు…. “ఎందుకు బాబూ! మీకంత ఖర్చు!” అన్నారు.

“ఇందులో మీరనుకున్నట్లు అంత శ్రమ లేదు. అంత ఖర్చు లేదు! అయినా, మా కంపెనీకి ఆ ఖర్చు ఒక లెక్కలోది కాదు… పైగా తను పై చదువులు చదువుకుని, తిరిగి ఇండియా వచ్చిన తరువాత అమెరికాలో చదివిన చదువుల సారాన్ని మా కంపెనీకే ఉపయోగపెడుతుంది పార్వతి. తద్వారా మా కంపెనీయే కదా లాభపడుతుంది. ఇది నిజం… ఇంకో విషయం… ఈ విధంగా నేను పార్వతికి సహాయపడడం…. నేను మీకిచ్చే గురుదక్షిణగా భావించండి సార్! అలా మిమ్మల్ని గౌరవించుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించండి మాష్టారూ!” అంటూ ప్రాధేయపడ్డాడు సుగుణాకరం.

శిష్యుడి ఉన్నతికి, ఔన్నత్యానికి, ఔదార్యానికి ముగ్ధులైన సుందరం మాష్టారు, తన అంగీకారాన్ని తెలియజేశారు.

“సరే బాబూ! అంతా మీ ఇష్టం!!”

“చాలా సంతోషం మాష్టారు!” అంటూ తృప్తిగా వెనుదిరిగాడు సుగుణాకరం.

వెళ్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి….

“ఆ… మాష్టారూ! పార్వతికివ్వాల్సిన నెలసరి జీతం, మీ బ్యాంకు ఖాతాలో ప్రతినెలా మా కంపెనీ జమచేస్తుంది!” అని చెప్తూ నిష్ర్కమించాడు సుగుణాకరం.

పార్వతిని ఆ విధంగా అదృష్టదేవత వరించినందుకు సంబరపడిపోయారు సుందరం మాష్టారు, సీతారత్నం. వెంటనే ఆ శుభవార్తను, సరస్వతి, లక్ష్మి, పార్వతులకు తెలియజేశారు. అ కుటుంబ సభ్యుల ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి.

***

కాలగమనంలో మరో మూడేళ్ళు గతంలోకి జారిపోయాయి.

ఇక్కడ….

యం.డి. పూర్తిచేసిన సరస్వతి హైదరాబాద్ లోని ఒక ప్రముఖ కార్పోరేట్ హాస్పిటల్‍లో మంచి జీతంతో పెద్ద ఉద్యోగం చేస్తుంది. అలాగే లక్ష్మి కూడా యం.యస్. పూర్తిచేసి, బెంగుళూరులోని ఒక ప్రఖ్యాత కార్పోరేట్‍ హాస్పిటల్‍లో, మంచి జీతంతో, పెద్ద ఉద్యోగంలో చేరింది. సుందరం మాష్టారు దంపతులు, హైదరాబాద్‍లో ఉంటున్న పెద్ద కుమార్తె ఇంట్లో కొద్దిరోజులు, బెంగుళూరులో ఉంటున్న రెండో కుమార్తె ఇంట్లో కొన్నిరోజులు గడుపుతూ, ప్రశాంత జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

అక్కడ…

అమెరికాలో పార్వతి, ఫార్మసీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, డాక్టరేట్ కూడా సంపాదించింది. పార్వతి శక్తి సామర్థ్యాలను మెచ్చిన ఆ విశ్వవిద్యాలయ యాజమాన్యం తమ విశ్వవిద్యాలయంలోనే పార్వతికి మంచి జీతంతో పెద్ద ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. ఆ కోవలోనే అమెరికాలోని అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలు పార్వతిని తమ కంపెనీల్లో పెద్ద జీతంతో ఉద్యోగం చేయవలసిందిగా ఆఫర్లు పంపాయి. పార్వతి వాటన్నింటిని తృణప్రాయంగా తిరస్కరించింది.

***

కుమారి పార్వతిగా అమెరికా వెళ్ళిన పార్వతి, డాక్టర్ పార్వతిగా ఇండియాకి తిరిగి వచ్చింది. తనపై నమ్మకంతో అమెరికాకు పంపించి, పెద్ద చదువులు చదివించిన విశ్వం ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి మరీ ముఖ్యంగా ఛైర్మన్ సుగుణాకరం గారికి కృతజ్ఞతలు చెప్పి, తిరిగి తన విధుల్లో చేరింది పార్వతి. తాను అమెరికాలో చదివి సముపార్జించిన జ్జానామృతాన్ని, విశ్వం ఫార్మాస్యూటికల్స్ కంపెనీ అభివృద్ది కోసమే వినియోగిస్తూ, ఆ కంపెనీ అభ్యున్నతికి పాటుపడాలని కంకణం కట్టుకుంది పార్వతి.

అలా అనుకుంటూ తనకు కేటాయించిన క్యాబిన్ దగ్గరకు వెళ్ళిన పార్వతి, క్యాబిన్ ముందు వున్న నేమ్ బోర్డులో, తన పేరుకు దిగువన ‘డైరెక్టర్’ అని వుండటం చూసి నిర్ఘాంతపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here