[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘నిషిద్ధ కర్మలు’ అనే రచనని అందిస్తున్నాము.]
[dropcap]ని[/dropcap]త్య జీబ్వితంలో శ్వాస తీసుకోవడం, గుండె కొట్టుకోవడం, కనురెప్పలు రెప్పవేయడం వంటి కర్మలు అసంకల్పితంగా ఉంటాయి. ఆకలి తీర్చుకోవడానికి భోజనం చేయడం, దాహం తీర్చుకోవడానికి నీరు త్రాగడం, మూత్ర విసర్జన చేయడం, నిద్రపోవడం మొదలైన కర్మలు జీవితాన్ని నిలబెట్టడానికి అవసరం. వీటి వలన మానవాళికి ఎలాంటి మంచి – చెడు జరగవు. కొన్ని నిత్య-కర్మలు గ్రంథాలచే నిర్దేశించబడ్డాయి, ఉదాహరణకు దేవతలకు నమస్కరించడం, ఆచారబద్ధమైన ఆరాధన, స్తోత్ర పఠన, నైవేద్యం సమర్పించడం మరియు జపం. వాటిని అమలు చేయడం సమగ్ర ప్రయోజనాలను నిర్ధారించదు, కానీ వాటిని అమలు చేయకపోవడం ఖచ్చితంగా హానికరం.
కర్మాచరణలో వర్ణాశ్రమ ధర్మముల ప్రకారము ఎవరికి ఎట్టి కర్మలు విధివిహితములో అవియే సత్కర్మలు. అటుల కానివి నిషిద్ధకర్మలు. అటువంటి నిషిద్ధకర్మలు ఏంటో తెలుసుకోవడం అవసరం. శాస్త్రం మానవాళికి నిషిద్ధ కర్మలు అంటూ కొన్నింటినీ విధించింది. వీటిని మానవాళి ఎట్టి పరిస్థితిలోనైనా విడవాల్సిందేనని స్పష్టం చేసింది. శాస్త్ర ఉల్లంఘన జరిగి మానవాళి వీటిని గనక ఆచరిస్తే అధోగతి పాలు కావడం తధ్యం అని స్పష్టంగా హెచ్చరించింది. సుర్యాభిముఖంగా మూత్రవిసర్జన, మలవిసర్జన, ఉమ్మటం, పళ్ళు తోమటం చేయరాదు. ఇవి పంచ మహాపాతకాలలోకి వస్తాయి. స్నానం నగ్నంగా చేయరాదు. ఒక వస్త్రం చుట్టుకుని చేయాలి. స్నానం పూర్తయ్యాక మాత్రమే ఆ వస్త్రం త్యజించాలి. దిగంబరంగ స్నానం చేస్తే అది వరుణిడి పట్ల అపచారం, శరీరం పిశాచగ్రస్తం అవుతుంది అని శాస్త్రం చెబుతోంది. ఆహారం బట్టే మన మమసు ప్రవర్తిస్తూ వుంటుంది కాబట్టి సాత్వికాహారం తీసుకోవడం తప్పనిసరి. నిత్యజీవితంలో రజో తమో గుణ సంబంధిత ఆహారాన్ని పూర్తిగా త్యజించాలి. ఎందుకంటే పతంజలి యోగ సూత్రాల ప్రకారం ఆహారం బట్టి మనస్సు, మనస్సు బట్టి ఆలోచనలు, ఆలోచనల బట్టే ప్రవర్తన, ప్రవర్తన బట్టే మన కర్మలు ఆధారపడి వుంటాయి. ఆఖరుకు ఈ కర్మ ఫలమే మన అనుభవం లోకి వస్తుంది.
ఇక ఇతర నిషిద్ధ కర్మల గురించి క్లుప్తంగా:
శ్రాద్ధకర్మ చేసే రోజు మాత్రమే ఉత్తరాభిముఖంగా కూర్చుని భోజనం చేయాలి. ధర్మపత్ని జీవించి ఉండగా పురుషుడు పరస్త్రీ సంగమం చేయరాదు. లేకపోతే రౌరవాది నరకాలు ప్రాప్తిస్తాయి. ఈశ్వర నిర్మాల్యం కాలితో తొక్కరాదు. అలా చేస్తే ఈ జన్మలో చేసుకున్న పుణ్యంతో పాటు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం కూడా నశిస్తుంది. స్త్రీలు జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగరాదు. ఇలా స్త్రీలు చేస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అశుభం.
మన ఆలోచనలు, ప్రవర్తన సక్రమంగా ఉన్నాయో లేదో తరచి చూసుకోవడం ఎంతో అవసరం. మన ఆలోచనలు మనకు తెలియకపోవచ్చు కానీ లోకేశుడికి తెలియకుండా వుండదు కదా.
మానవ జీవితం సక్రమంగా సాగాలంటే పవిత్ర భావాలను అలవరచుకోవాలి. అట్లే జీవితమంతా కేవలం లౌకిక సంబంధమైన కర్మలకే అంకితం చేయకూడదు. కలుపు మొక్కలను తీసివేసినట్లు చెడ్డ ఆలోచనలను, చెడ్డ పనులను చేయడం త్యజించాలి, సాధ్యమైనంతగా మంచి పనులే చెస్తుండాలి. మన మనస్సనే నేలలో మంచి పంట విత్తనాలనే నాటాలి. అప్పుడే ఆశించిన ఫలాన్ని అందుకోగలం. అందుకు నిషిద్ధ కర్మలను పూర్తిగా త్యజించడం అవసరం. ప్రతిచోటా మనను దిగజార్చి, లక్ష్యానికి దూరం చేసే విషయాలను, విషంలాగా త్యజించడమే నిషిద్ధకర్మల వెనుక ఉద్దేశం.