నిశ్శబ్ద పయనం

2
2

[dropcap]కా[/dropcap]లం నవ్వుతోంది,
మనిషి ప్రవర్తనకు-
కాలం దుఃఖిస్తోంది
మనిషి వేసే నిందకు..!

కాలం తికమక పడుతోంది..
అర్ధంకాని మనిషి వాదనకు!!

అందలాలెక్కితే అంతా తాను,
అధః పాతాళానికి మాత్రం బాధ్యుణ్ణి తాను కాను…
ఆ పాపం కాలానిదే!!

ఎదుటి మనిషి మాటలు,
కాలం చెల్లిన నాణేలు,
తాను చేసే సోత్కర్ష మాత్రం,
సమయస్ఫూర్తి సూక్తులు!!

ప్రత్యర్థికి నష్టం వాటిల్లితే-
అది కాలం చెప్పిన సమాధానం,
తాను నష్టపోతే మాత్రం,
అది కలసి రాని కాలం!!

భిన్న రకాల చేష్టలతో,
విభిన్న మనస్తత్వాలతో..
మనిషి ఆడే నాటకాలకు,
కాలాన్ని ఒక సాకుగా చూపడమే-
అర్థం కాని వింత ప్రక్రియ!!

కాలవాహినిలో మనిషి పయనమే,
మనిషి ముందున్న కర్తవ్యం,
మనిషి వేసే విభిన్న వేషాలకు,
నిశ్శబ్ద నిరంతర పయనమే-
కాలమిచ్చే సమాధానం!!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here