[box type=’note’ fontsize=’16’] ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణిని స్మరించుకుంటూ, వారితో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని వివరిస్తూ, వారి మూడు నవలలని ప్రస్తావిస్తూ, అక్షర నివాళి అర్పిస్తున్నారు మణి వడ్లమాని. [/box]
[dropcap]ఆ[/dropcap]విడ కలం ఓ చైతన్య జలపాతం.
ఆవిడ రచనలు ఓ ప్రభంజనం.
ఆవిడ అక్షరాలు దప్పిక తీర్చే చల్లటి జలాలు.
ఆవిడ స్త్రీ పాత్రలు మధ్య తరగతి మహిళ లో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి అనడానికి ఏ మాత్రం సందేహం లేదు.
ముఖ్యంగా ఆడపిల్లలకి పెళ్లి పిల్లలు, సంసారమే కాకుండా, సమాంతరంగా తనకంటూ తన జీవితాన్ని నడిపించుకోమని చెప్పిన నిశబ్ద మహిళావాది ఆమె.
నిండయిన వ్యక్తిత్వం, మార్దవమైన మాట, సుతిమెత్తని స్వభావం కలబోస్తే అది సులోచనారాణి గారే!
ప్రతి తెలుగు వారి గుండెలలో వెలిగే చిరు దీపం. ఇప్పటికి మారుమూల పల్లెటూరి గ్రామాలలో ఉండే గ్రంథాలయాలలో ఆమె రాసిన నవలలు కొలువుతీరి ఉన్నాయంటే పాఠకులు ఆమెని ఎంతగా అభిమానించారో తలుస్తోంది.
తన రచనా వ్యాసంగంతో రెండు దశాబ్దాలు వరకు అనంత తెలుగుసాహితీప్రపంచాన్ని మకుటంలేని మహారాజ్ఞిగా ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ప్రతిభావంతురాలైన రచయిత్రి సులోచనారాణిగారు!
మొదలు పెడితే చివరివరకూ ఆపకుండా ఏకబిగిని నవల ఆమూలాగ్రం చదివించే శక్తి ఆమె రచనల సొంతం. ఆపై మారుతున్న ప్రజల జీవన విధానాలను అనుసరించి పాత్రలను సృష్టిస్తూ రాసేవారు. ఆమె నవలలు ఎక్కువగా భార్యాభర్తల బంధాలు, కుటుంబ బాంధవ్యాల చుట్టూ తిరుగుతూ ఉండేవి.
ఈ రోజు ఆవిడ భౌతికంగా లేకపోయినా ఆవిడ అక్షరాలు మాత్రం ఎప్పటికి చెరగనివి సజీవమైనవి అని చెప్పుకోవచ్చు
తెలుగు వారంటే గుర్తొచ్చే ఆవకాయ, సకినాలు, గోంగూర, బాపునే కాదు వారి సరసన ఎప్పటికి సులోచన రాణి గారు కూడా ఉన్నారు.
దశాబ్దాల క్రితం, దేశాన్ని, రాష్ట్రాలని విడిచి పెట్టి వెళ్ళిన తెలుగువారికి ఆవిడ పుస్తకాలే ప్రియ నేస్తాలు, పక్కతోడూ అంటే అతిశయోక్తి కానే కాదు.
బయటకు వెళ్ళకుండా ఉత్త ఊహలతో, కలల కల్పనలతో ఓ ప్రపంచాన్ని సృష్టించి, వాస్తవాలకి భిన్నంగా రాస్తున్నారని ఆవిడని అన్నవారు చాలామందే ఉన్నారు.
ఆమె తన కుటుంబ సభ్యులు, బంధువుల మానసిక ప్రవర్తనలను, సంఘర్షణలను చిన్నప్పట్నుంచి చూసి అధ్యయనం చేసి వాటినే తన రచనల్లో ఉపయోగించటం వల్ల పాత్రలు ఎంతో సహజంగా ఉండేవని చెప్పుకుంటారామె.
తన రచనలతో ప్రజల చేత పుస్తకం పట్టేటట్లు చేసారు. ఎంతో మంది ఆవిడని ఆదర్శంగా తీసుకుని రచయితలైనారు.
నిజానికి ఆవిడ రచనలని పూర్తిగా అర్ధం చేసుకుంటే, ఆవిడ ఎక్కువ గా స్త్రీ వైపు ఉన్నట్లే తెలుస్తుంది.
ముఖ్యంగా ఆడవారికి ఎంతో మనోధైర్యం ఇచ్చేలా ఉండే ఆవిడ రచనలు కొన్ని కాలాలు పాటు నిలిచిపోతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు… నిశితంగా పరిశీలిస్తే ఆవిడ రచనలలో స్త్రీ వాదం అంతర్గతంగా ఉంటూనే ఉంది. అందుకే ఆవిడ నిశ్శబ్ద మహిళావాది అయ్యారు.
కొన్ని నవలల తరువాత అది పూర్తిగా కనిపించసాగింది. ఉదాహరణకి సుకుమారి, నీరాజనం, కృష్ణ లోహిత, సౌగంది, మౌనపోరాటం, అర్ధస్థిత లాంటి నవలలో ఎక్కువగా స్త్రీ పాత్రలే కనిపిస్తాయి.
ఆవిడ నవలల గురించి రాయాలంటే ఓ జీవితకాలం సరిపోదు.
మూడు నవలల గురించి స్థూలంగా నా మనసులో మాటలు.
పట్టుదలలు, పంతాలు, ఆశనిరాశలు, కోపతాపాల సజీవ సమ్మేళనమే మీనా నవల.
కుటుంబ కథనాలు నేపథ్యం రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన మన సులోచనారాణి గారు. ఎన్ని సార్లు చదివినా మరల మరల చదవాలనిపించే కథనం.
అయితే ఇందులో గమనించ తగ్గ విషయం, యథార్థాన్ని స్వీకరిస్తూ, ఆమె కుంగిపోకుండా, జీవితంలో ముందుకు సాగిపోవాలని ఉద్దేశంతో మరో పెళ్ళికి అంగీకరిస్తుంది. ఆమెకి పెళ్ళయిన కొన్ని రోజులకే భర్త ఆక్సిడెంట్‌లో చనిపోయాడని తెలిసి ఆమెని పెళ్లి చేసుకున్న అభిజిత్ మీద అమకు గౌరవం రెట్టింపు అవుతుంది. కొన్ని రోజులకి పురిట్లోనే చనిపోయాడన్న బిడ్డ బ్రతికే ఉన్నాడని , దుర్భర దరిద్రం అనుభవిస్తున్నాడని తెలిసి తల్లడిల్లి, ఆ బిడ్డకు దగ్గర అవడం కోసం, అన్నిటిని త్యాగం చేసి ఆ పిల్లాడి దగ్గరకు వెళ్ళిపోతుంది. అప్పటికి ఆ పిల్లాడు తల్లి తన కోసము పడే తపన తెలుసుకొని, మారుటి తండ్రి ప్రేమను అభిమానాన్ని అర్థం చేసుకొని వాళ్ళకు దగ్గరవుతాడు.
ఈ నవలలో ఒక ఆదర్శం కనిపిస్తుంది. భర్త పోతే ఇక జీవితమంతా ఎండిన మోడులా బతకనవసరం లేదని. ఆమెకి ఒక భవిష్యత్తు ఉంటుందని చెప్పకనే చెప్పినట్లుగా ఉంటుంది. అందరు మొగవాళ్ళు చెడ్డవాళ్ళు కాదని అభిజిత్ లాంటి వాళ్ళు కూడా ఉంటారని ఒక పాజిటివ్ డ్రైవ్‌గా నడిపిస్తారు
ఇలా బాధ్యతలను గాలికి వదిలేసిన భర్త రజని మీద కోపం వచ్చినా వివేకం సహనం అంటూ ఆమెని ఆపేస్తుంది. ఉన్నట్లుండి ఒక రోజున రజని – నువ్వూ పిల్లలు నాకు అక్కర్లేదు, నేను సన్యసిస్తున్నాను అని మహర్షితో పాటు అమెరికా వెళ్ళిపోతాడు.
ఎంతో కష్టపడి నిర్మించుకొన్న ప్రపంచం ఫెళఫెళా కూలిపోతుంది. ఆమె ఆశలు, నమ్మకాలు అన్ని వాటి కింద శిధిలమై పోతాయి. దగ్గర బంధువైన సుహాసిని, స్నేహితుడు ప్రభాకర్ల సాయం తో మళ్ళీ మాములు మనిషి అవుతుంది.
మేధ తన ఒంటరి జీవితం మళ్ళీ నిర్మించుకుంటూ ఉంటే లోకులు సూటిపోటి మాటలతో మళ్ళీ పడగొట్టటానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
అప్పుడు పిల్లలిద్దరికి ఒక్కటే మాట చెబుతుంది. మా నాన్న సన్యాసులలో కలిసిపోయాడు. మాకు మా మమ్మీ ఉందని చెప్పండి అని వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.
మహర్షిని నమ్మి వెళ్ళిన భర్త తిరిగి ఇంటికి వస్తాడు. కానీ ఈ మేధ కరిగిపోయి వచ్చారా ఇంటికి, మీ కోసం నే ఎదురు చూస్తున్నాను అనదు. ఈ ఇంటికి అతిథివి మాతమే నువ్వు, ఎప్పుడయితే నన్ను నది మధ్యలో వదిలేసి వెళ్ళావో అప్పటి నుంచి నువ్వు నేను వేరు వేరు. ఒకటి కాదు. ఎప్పటికీ ఈ ఇంటి మనిషివి కాలేవు. ఈ జీవితం నాది, నిర్ణయాలు నావి, నేను పూర్ణ స్వత్రంత్రురాలుని, నాకు బాధ్యతలని మొయ్యడం తెలుసు, కష్టపడటము తెలుసు అని చెప్పేస్తుంది. చేసేదేమీ లేక అతను వెళ్ళిపోతాడు. వెళుతూ ఒకే ఉత్తరం రాస్తాడు. అది చదివిన మేధకి విరక్తి కలుగుతుంది.
“స్త్రీ ప్రేమించే హృదయాన్ని కించపరిచి, నిర్లక్ష్యం చేసి వెళ్ళిన పురుషుడు తిరిగి వస్తే స్త్రీ అతన్ని క్షమించాలా? అవసరం లేదు? నేను క్షమించను”అని అనుకుంటూ ఒంటరిగా నడచుకుంటూ వెళ్ళిపోతుంది.
ఇది కూడా ఒక మేలుకొలుపు లాంటింది. ఆడవాళ్ళకి కష్టాలు వస్తే క్రుంగిపోకుండా ఒంటరిగా, ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలి. సమస్యలను తామే పరిష్కరించుకోవాలి అనే కోణంలో రాసిన నవల.
ఆవిడ తన నవలలో అనేక జీవితాలను, వాళ్ళ మధ్య సంఘర్షణలు, సంఘటనలను, ఎన్నో జీవితానుభావాలను, వ్యక్తిత్వాలను, బలహీనతలను విశ్లేషిస్తూ అత్యంత సహజంగా రాసారు.
ఇక ఆవిడతో నాకు కొంత వ్యక్తిగతమైన సాన్నిహిత్యం ఏర్పడింది. ఆవిడని బహుశా 1975,76 ప్రాంతాలలో చూసాను. వారి దగ్గర బంధువులయిన వాళ్ళింట్లో ఉండేవాళ్ళము. అప్పుడు చిన్నతనం, భయం బెరుకుతో మాట్లాడలేకపోయాను. ఆ తరువాత చాల కాలం తరువాత 2011లో కేంద్ర సాహిత్య ఎకాడమి, లేఖిని సాహితీ సంస్థ ఏర్పాటు చేసిన అఖిల భారత మహిళా రచయిత్రుల సమావేశంలో కలిసాను. తరువాత లేఖిని సభ్యురాలిగా పలుమార్లు సులోచన రాణిగారిని కలవడం జరిగింది. అందుకు లేఖిని అధ్యక్షురాలు శ్రీమతి వాసా ప్రభావతి గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.
నా కధల సంపుటిని వారికి అందచేసి ఆశీస్సులు అందుకోవడానికి నేను, మరో రచయిత్రి సుందరీ నాగమణి కలిసి వారింటికి వెళ్ళినప్పుడు ఆవిడ మమ్మల్ని ఆదరించిన తీరు, ఎన్నో విషయాలను మాతో పంచుకున్న ఆవిడ ఆత్మీయత వర్ణనాతీతం. అప్పుడు మాలో కలిగిన ఆనందం చెప్పలేనిది. ఒక రకంగా ఆవిడ భక్తులం అని చెప్పవచ్చు. అయితే ఆవిడ ఆత్మ సౌందర్యం యెంత గొప్పదంటే తను నవలలకే మహారాణి అని లోకమంతా కీర్తించినా ఆవిడ మాత్రం అది ఏ మాత్రం పట్టకుండా నేలమీదే ఉండేవారు.
ఆవిడ ఒక్కటే చెప్పారు మీ వంతుగా, నిస్సహాయులకి, పిల్లలకి వృద్ధులకి సేవ చేయండి అని. అది ఆవిడ వట్టి మాటగా చెప్పలేదు, తను ఆచరిస్తూ చెప్పారు. అది ఆవిడ గొప్పతనం.
ఎంత రాసినా ఊట బావి లోంచి ఊరినట్లుగా ఆవిడ గురించి రాస్తూనే ఉండాలనిపిస్తుంది.
ఆవిడ మన మధ్య లేకపోయినా ఆవిడ ఓ అనంతం…
చివరగా ఆవిడ ఒక పుస్తకంలో అంకితమిచ్చిన మాటలనే ఇక్కడ పొందుపరుస్తున్నాను
“ఏ పంచ భూతాల వల్ల నాకు దివ్యమైన చైతన్య స్ఫూర్తి గల జీవితం ప్రసాదింపబడిందో, తిరిగి ఆ చల్లటి ఒడిలోకి వెళ్ళిపోతానో, ఆ మహాద్భుత నిరంతర చైతన్య సృష్టికి, ప్రేమతో, కృతజ్ఞతతో హృదయాంతరంగ అక్షరాంజలి”అన్న వారి మాటలు ఎంతో స్ఫూర్తి దాయకం.
మేడం… ఎప్పటికి మీరు మాకు ఆరాధ్యులే , మా స్మృతి పథంలో చిరస్థాయిగా నిలిచే ఉంటారు.
***
మణి వడ్లమాని