[స్వాతీ శ్రీపాద గారు రచించిన ‘నిశ్శబ్ద వీధుల్లో..’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]ఉ[/dropcap]దయ సంధ్యా సాయం వెలుగులూ కలగలిపి నేసిన
మెత్తని కలనేత పట్టు వస్త్రం మడతల్లో మొహం అద్దుకున్నప్పుడు
ఆనందోద్వేగాలతో ఉబికి వచ్చిన కన్నీళ్ళలో తడిసి
అదృశ్యంగా హృదయం లయతప్పింది.
ఎన్ని సార్లో లెఖ్కపెట్టలేదు గాని
నన్ను నేను కవనచిత్రాల వెనకా, నా స్వప్నాల వీధుల్లోనూ
ఎంతలా ఒదిగి దాచుకున్నా
సుడిగాలిలా వచ్చి నీ ఉనికి
నడివీధిలో నిలబెట్టి
ఆలోచనల్ను తడుముతూ
గాయపడిన గుండె నిమిరి
ఉప్పునీటి సముద్రాలుగా మిగిలిన గాయాలను
కడిగి ఓదార్చలేదు?
ఎన్ని యుగాల ఎదురు చూపిది
వెలుగునీడల మధ్య నన్ను నేను అన్వేషించుకుంటూ
రాత్రీ పగలూ నిరంతరం రెప్పవాల్చని సమయాల్లో
ఆత్మను చుట్టే సిన అనుబంధం
మాట్లు మాటలై ప్రవహిస్తే
విస్తుపోయి చూస్తూనే ఉన్నాను.
జ్ఞాపకాల పొగల్లో ఎరుపెక్కి మండుతున్న మనసు
పూసే ఎర్ర గన్నేరు పూ రెక్కల్లో
తడబడుతున్న అక్షరాలు
పియానో మెట్ల మీద సాగిలపడి
రాత్రిని కాల్చేస్తున దృశ్యం.
రాత్రి తుఫానులో విరిగిన కొమ్మలు కత్తిరించి
కరిగిన పాదులు సరిచేసుకుంటూ
గులాబీ ఉనికిని సవరించుకునే నేల ఇది.