[box type=’note’ fontsize=’16’] “సినిమాలో మెచ్చుకోతగ్గ విషయాలూ ఉన్నాయి, కూడనివి కూడా” అంటూ ‘నీతిశాస్త్ర’ అనే లఘు చిత్రాన్ని సమీక్షిస్తున్నారు పరేష్. ఎన్. దోషి. [/box]
తాపసీ పన్ను పింక్, షబానా చిత్రాల ద్వారా ఒక రకమైన ఇమేజ్‌ని మరచిపోలేకుండా చేసింది. అలాంటి మరో పాత్రే ఈ “నీతిశాస్త్ర”అనే లఘు చిత్రంలో పోషిస్తుంది.
మొదటి షాట్ ఇంటిలోపలినుంచి బయటి వసారాని గాజు కిటికీల గుండా చూపిస్తుంది. బయట గాలికి ఊగుతున్న విండ్ చైంస్ చప్పుడు కూడా వినిపిస్తున్నది. చైనీయుల నమ్మకం ప్రకారం విండ్ చైంస్ శుభ సూచకాలు. కానీ లోపల ఎలాంటి వాతావరణం నెలకొని వుందో ఆ వెంటనే చూపబడుతుంది. ముందు సిలూవెట్‌లో అక్కా తమ్ముళ్ళ నీడలు కుస్తీ పడుతుంటాయి. కాసేపటికి ముఖాలపై వెలుతురు పడి వారిని రోషనీ (తాపసీ పన్ను), రవి (విక్కీ అరోరా) లుగా పోల్చుకుంటాము. ఆ వెంటనే వచ్చే సీన్ బయట వాళ్ళ తల్లి శవం, చుట్టూ తెల్ల వస్త్రాలలో స్త్రీలు, వరండాలో వర్షంలో నిలుచున్న మగవాళ్ళు. అంతిమ సంస్కారానికి కొడుకు గాని సోదరుడు గానీ వుంటే పిలవమంటాడు బ్రాహ్మణుడు. మిగతా వారు రవి ఎక్కడా అని గొణుక్కుంటూ వుంటే, రోషనీ అంటుంది కొడుకు లేడు, నేను చేస్తాను అంతిమ సంస్కారాలు అని. అప్పుడొస్తాడు రవి, వర్షంలో తడుస్తూ. లోపలికెళ్ళి తను గెలుచుకుంటున్న మెడల్సు, ఫొటోలూ చూస్తుంటాడు. వెనక నుంచి వచ్చి రోషనీ అతని తల మీద కుర్చీ తో మోదుతుంది. ఈ ఫైట్లు సినిమా మొత్తం విస్తరించి వుంటాయి.
రోషనీ తల్లిని అడుగుతుంది, మహాభారత యుధ్ధంలో అర్జునుడు ఎందుకు సంశయిస్తాడూ అని. ఆ కాలానికి ధర్మమే ప్రధానం, కాబట్టి ధర్మం కోసమే యుధ్ధం చేయాలి, ఎదుట ఎవరున్నా సరే అని కృష్ణుడు బోధించినట్టు చెబుతూ, ఇప్పుడు కాలం మారింది కాబట్టి అయినవాళ్ళను కాపాడుకోవడానికి ఎలాంటి పని చేయాల్సొచినా తప్పు లేదంటుంది. తర్వాతి షాట్ లో తమ్ముడితో కుస్తీ పడుతున్న రోషనీ చేతుల్లో చిక్కిన రవి మెడ, కిలుక్కు మన్న శబ్దం.
సినిమాలో మెచ్చుకోతగ్గ విషయాలూ ఉన్నాయి, కూడనివి కూడా. విండ్ చైంస్ బయట, సంఘర్షణ లోపలా అన్న సీన్ అందంగా వుంది. చాలా చోట్ల క్లుప్తత వుంది. అసలు ఆ రేప్ సీన్‌ను ఎగర గొట్టడం, పోలీసులకు తన మొబైల్ చూపించడం లాంటివి. కానీ ఆ ఫైట్ సీన్లు మాత్రం విస్తారంగా వున్నాయి, అనవసరంగా. ఆడవాళ్ళకు ఆత్మ రక్షణ కోసం కుంగ్ ఫూ నేర్చుకోవడం గురించి రోషనీ ఆలొచించడం బాగుంది. కాని తన తమ్ముడు తప్పుదారిలో వెళ్తున్న విషయం గమనించి కూడా తల్లితో చెప్పడం మినహా మరేమీ చెయ్యదు. తల్లి కూడా కొడుకును వెనకేసుకు రావడం సమాజంలో జరుగుతున్నవాటికి ఒక కారణంగా అర్థం చేసుకోవచ్చు. రవి మెడ క్లిక్కుమనడం అన్నది అతని హత్యను సూచిస్తే అది సమాధానం కూడా కాదు. అలా ఎంతమందిని చంపుతారు? మళ్ళీ అదొక అపరాధం కాదా? మనుషుల్లోని ఆలోచనల్లో మౌలికమైన మార్పు రావాలి కదా. ఈ సినిమా అలాంటి మార్పు తెచ్చేదిగా మాత్రం లేదు. అందుకే మొత్తంగా దీన్ని మంచి చిత్రం అనడానికి మనసు రావడం లేదు.
కపిల్ వర్మ దీనికి కథా, దర్శకత్వం, చాయాగ్రహణమూ చేశాడు. చాయాగ్రహణంలో వంక పెట్టడానికి లేదు, కొంత అనవసరంగా అందంగా చూపించడం చేశాడన్న మాట తప్ప. కథా, దర్శకత్వం మాత్రం ప్రాథమిక స్థాయిలో వున్నాయి. తాపసీ నటన బాగున్నా, ఆ పాత్ర పరిమితులే ఆమె పరిమితులయ్యాయి.