Site icon Sanchika

నిత్య

[నందిరాజు పద్మలత జయరాం గారు రచించిన ‘నిత్య’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]‘ఇ[/dropcap]క నుంచీ ఫుల్ వీక్ హాజరవ్వాల్సిందే’ అని మెయిల్స్ రావడంతో దాదాపు రెండేళ్ల నుంచీ నిదానంగా నడుస్తున్న మా సాప్ట్‌వేర్ వాళ్లకి బ్రతుకు మళ్ళీ ఎక్స్‌ప్రెస్ పరుగులందుకున్నట్లుంది. ఇహ బుద్ధిగా ఆఫీస్‌కి వెళ్లాల్సిందే! తప్పదు!

ఆఫీసులో నా డెస్క్, టౌన్ హాల్ మీటింగ్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్, కొన్ని కొత్త ముఖాలు.. మళ్ళీ క్రొత్తగా ఆఫీసుకి వెళ్తున్న అనుభూతి ఓ వారం పాటు ఉంది. చాలానే వచ్చాయి మార్పులు. గత రెండేళ్లలో చాలామందిని కంపెనీ ఫైర్ చేసిందనీ విన్నాక, నేను కాస్త ముందు జాగ్రత్తపడి రూబీ, పైథాన్ లాంటి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ నేర్చుకున్నాను కాబట్టి కొంత, గత పదేళ్లుగా ఇదే కంపెనీలో పాతుకుపోయాను కనుక కొంత బ్రతికిపోయాను. అదృష్టవశాత్తూ, నా బెస్టీ నిత్య కూడా మా ఫ్లోర్ లోనే ఉంది కనుక నాకు కాస్త రిలీఫ్.

నిత్య డేటా ఆర్కిటెక్ట్. తనూ, నేను బాగా దోస్తులం. దాదాపు ఇద్దరం ఒకేసారి ఈ కంపెనీలో చేరాం. వయసులో తను నా కన్నా ఐదేళ్లు చిన్నది. డేటా మోడలింగ్, విజుయలైజేషన్, స్ట్రక్చర్స్ పైన స్పెషలైజేషన్ చేసింది. తెలివిగలది. కంపెనీలో తన పొజిషన్ వేరే అయినా ఒకరికొకరం తోడున్నాం కనుక, నాకు ఈ రెండో ఇన్నింగ్స్ బాగానే ఉంది.

“ఎందుకో నీలో అప్పటి చురుకుదనం, చైతన్యం లోపించాయి. ఏమైంది నిత్యా..?”

“ఏం లేదే.. బాగానే ఉన్నాగా!”

“నో.. ఐ స్నిఫ్ సంథింగ్. రెండేళ్ల క్రితం నిత్య చాలా చలాకీగా ఉండేది. ముఖంలో వెలుగుండేది. ఇప్పుడవి లేవు.”

నా వ్యాఖ్యకి ఆమె ముఖంలో మరింత దిగులు ఛాయలు అలముకున్నాయి.

“చెప్పాలనుకుంటే చెప్పు. చెప్పద్దు అనుకుంటే కూడా చెప్పు. తీర్చగలనా అనేది ప్రక్కన పెట్టు,

పంచుకుంటే కనీసం నీ మనసు తేలికవుతుంది.” నిత్య భుజం తట్టి, నా వింగ్‌కి వెళ్ళిపోయాను.

నిత్యకి ఒక పాప. భర్త సాకేత్ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. పాపని చూసుకోవడానికి అప్పట్లో ఆయా ఉండేది. ప్రస్తుతం పాపని బళ్ళో చేర్చారు. కష్టాలుండేంత జీవితమైతే కాదే అనుకుంటూ పని చేసుకుంటూ ఉంటే, నిత్య నుంచీ మెసేజ్, ‘కాసేపు మాట్లాడుకుందాం, ఓ గంట ఆలశ్యంగా ఇంటికెళ్ళడం కుదురుతుందా అదితీ’ అంటూ. ఓకే అని జవాబిచ్చాను.

***

“నేనింక ఈ రెండు పడవల్లో ప్రయాణం చేయలేనేమో అదితీ..! ఇల్లు చూసుకోవడం, ఉద్యోగం రెండూ నా వల్ల అయ్యేట్లు లేదు. ప్చ్… ఆర్థికంగా ఎవరి మీదా ఆధారపడడం ఇష్టం ఉండని నాకు ఉద్యోగం ఒక ప్యాషన్. తప్పదేమో, మానేయవలసి వచ్చేటట్లుంది.” ఉబుకుతున్న కన్నీటిని తుడుచుకుంది నిత్య.

“నిత్యా.. ఏంటోయ్? నిరాశలో పడుతున్నావు. మన క్రమబద్ధ జీవితం ఈ కోవిడ్ వల్ల గాడి తప్పింది. మళ్ళీ స్ట్రీమ్‌లైన్ అయ్యాక, ఈ ఇబ్బంది అస్సలు ఉండదు. తొందరపడి నిర్ణయం తీసుకోకు. చెప్పు.. ఏమైందీ? సాకేత్‌తో ఏమీ ప్రాబ్లెమ్ లేదు కదా?”

ఒక్క నిమిషం మౌనంగా ఉన్నాక మనసు విప్పింది నిత్య. గతంలో సాకేత్, నిత్య ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ, పసిపిల్లని ఆయా దగ్గర వదిలి వచ్చినా బాగానే కాపురం చేసుకున్నారు. ఈ రెండు మూడేళ్ళ గ్యాప్‌లో మామగారు మరణించడం, అత్తగారు ఇక్కడికే వచ్చి వీళ్ళతోనే ఉండడంతో మొదలయ్యాయి ఇబ్బందులు.

“నాకు నేనే విచిత్రంగా అనిపిస్తున్నాను అదితీ! అత్తయ్యగారంటే నాకు చాలా గౌరవం. అమ్మ కిచ్చినంత గౌరవం ఇస్తాను. కనీసం అలా అనుకుంటున్నాను. కానీ, ఆవిడే కాదు, సాకేత్ కూడా, నేను ఆవిడ మాట వినడం లేదని, అస్సలు గౌరవించడం లేదని అనుకుంటున్నారు. నాకు పాపని పెంచడం రాదట. ఇంటి పనులు సక్రమంగా చెయ్యనట. మా వాళ్ళు సంస్కారం నేర్పలేదట. అందుకే, అతిథి మర్యాదలు తెలియవట. చాలా బాధనిపిస్తోంది అదితీ! నిజమేనేమో, నాకు మల్టీ టాస్కింగ్ రావట్లేదేమో! పెళ్లయిన క్రొత్తల్లోనూ, పాప పుట్టిన తర్వాత రెండేళ్ళూ సాకేత్‍కి విపరీతంగా నచ్చిన నా టాలెంట్ ఇప్పుడెందుకు నచ్చడం లేదో తెలియదు. నేనేది చేసి పెట్టినా అత్తయ్యగారికి నచ్చదు. చేయకపోతే కోపం. మీకు నచ్చేలా చేస్తాను, నేర్పండి అంటే ‘ఆ మాత్రం నేర్పకుండా మీ వాళ్లెలా పెంచారు?’ అని సాధింపు.” ఉబుకుతున్న కన్నీళ్ళని ఆపుకుంటోంది నిత్య.

“మీ పెళ్ళయ్యి ఐదారేళ్లవుతోంది కదా, నీకు అప్పుడూ ఉంది జాబ్. వాళ్లకి అప్పుడు కన్పించని లోటుపాట్లు ఇప్పుడెందుకు కనిపిస్తున్నాయి? ఉద్యోగస్థురాలు కావాలనే కదా, సాకేత్ నిన్ను పెళ్లి చేసుకుంది!”

“కోవిడ్ సమయంలో నేను వర్క్ ఫ్రం హోమ్ కదా. అప్పుడే మామగారు పోవడం, అత్తయ్య ఇక్కడికి రావడం జరిగింది. మావయ్య పోయారన్న దిగులు, ఒంటరిదాన్ని అన్న డిప్రెషన్‌లో పడిపోయారావిడ. పసిపిల్లలాగా చూసుకునేవాళ్ళం. ఆవిడతోనే ఎక్కువ సేపు గడిపేవాళ్ళం. అప్పట్లో ఎప్పుడైనా ఏదో చిన్న మాట పట్టింపులు తప్ప పెద్దగా ఇబ్బందుల్లేవు. ఆఫీసు, ఇల్లు రెండింటినీ బాగానే చూసుకుంటూ, అందరినీ అటెండ్ అవగలిగాను. కానీ, ఇప్పుడు అలా ఎలా చేయగలను అదితీ? సాకేత్‌కి కూడా అర్థం కావడం లేదు. ఇంట్లో ఉన్న ముగ్గురం ఎడ మొహం, పెడ మొహంగా ఉండడం నాకసలు నచ్చట్లా..! పాప కూడా ఎఫెక్ట్ అవుతోంది. అందుకే..”

“అంటే, మీ అత్తగారేమైనా నీ మీద చెప్తున్నారా?”

“ఏమో తెలియదు. నిజానికి సాకేత్ అలా విని నమ్మేసే మనిషి కాదనే నా అభిప్రాయం. అలా అని ఆవిడేదో నన్ను ఆరళ్ళు పెడుతున్నారని అనలేను. వాళ్ళు నా వలన సంతోషంగా మాత్రం లేరు అదితీ. అందుకే, ‘ఎందుకొచ్చిన ఉద్యోగం మానేస్తే పోలా’ అనిపిస్తోంది.”

“వద్దోద్దు.. మాసేయద్దు. దేనికైనా ఉంటుంది పరిష్కారం.” నిత్యకి సర్ది చెప్పి ఇంకేవో ఆఫీస్ విషయాలు మాట్లాడుకుని ఇద్దరం ఇళ్లకు బయల్దేరాం.

***

“రండి ఆంటీ..!, అమ్మని తీసుకొచ్చినందుకు థాంక్యూ సాకేత్..!”

మా స్ఫూర్తి పుట్టినరోజుకి పిలిచాను నిత్య కుటుంబాన్ని. పెద్దగా అతిథులెవరూ లేరు, పిల్లల స్నేహితులు తప్ప. బార్బీ బొమ్మలా ఉంది నిత్య కూతురు ఆముక్త మాల్యద. మా పెద్దమ్మాయి స్పందన, చిన్నమ్మాయి స్ఫూర్తి దాన్ని తీసికెళ్ళారు ఆడించడానికి.

మా అత్తగారు నిత్య అత్తగారిని ప్రేమగా పలకరించి ప్రక్కనే కూర్చోబెట్టుకున్నారు.

“ఏమిటోనండీ, ఇవాళ రేపు పిల్లలకి ఎక్కడలేని ఆపసోపాలు. మొగుడికి, ఒక్క పిల్లకీ వంట చేసి పెట్టడానికి తెగ కష్ట పడిపోతూ ఉంటారు. మనం ఎన్ని పనులు చేసే వాళ్ళం? పెళ్లిళ్లు, పేరంటాలు. పండుగలకు వచ్చి పోయే చుట్టపక్కాలకి, కిరోసిన్ పంపు స్టవ్వుల మీద వంటలు చేసి పెట్టడం, బావి నీళ్లు చేది పోయడం, మోపెడు బట్టలుతకడం, డబ్బాలు కట్టిచ్చి పిల్లలని బళ్ళకీ, మగవాళ్ళని ఆఫీసులకి పంపడం.. గిరగిరా తిరుగుతూనే చక్కపెట్టేవాళ్ళం.”

వచ్చిన వాళ్లకి స్నాక్స్ అందిస్తూ, నిత్య అత్తగారి మాటలు నేనూ, నిత్యా వింటున్నామన్న సంగతి ఆవిడకు తెలుసో, తెలియదో మరి.

“నిజమే మీరన్నది. కానీ, వీళ్ళనీ తప్పు పట్టలేమండీ! కాలం మారింది. అప్పట్లో, మన వాళ్ళు ఉద్యోగమో, వ్యాపారమో చేసినా ఇంటికి వచ్చాక ఇంటి గురించే ఆలోచించేవాళ్ళు. పిల్లలు కూడా ఏది వండి పెడితే అది తిని వెళ్లిపోయేవాళ్లు. చుట్టాలొస్తే అవసరమైనవన్నీ మగాళ్ల సమకూర్చేవాళ్ళు. మన పని వాళ్లకి వండి పెట్టడమే! ఇప్పట్లా ఇన్ని చానళ్ళు, మొబైల్ ఫోన్లు లేవు గనుక అందరూ ఒకేసారి భోజనాలు ముగించేవాళ్ళు. మనకి కునుకు తీయడానికో, ఏ పత్రికో చదవడానికో కాస్త వీలు కుదిరేది. ఎంచక్కా పిల్లా జెల్లలతో సినిమాలకి, పార్కులకి వెళ్లే వాళ్ళం. చుట్టాల ఇళ్లకెళ్లి హాయిగా పది రోజులు గడపగలిగే వాళ్ళం. ఇప్పుడలా కాదే! మా అదితిని చూస్తే, నాకు భలే బాధేస్తుందండీ! ఆఫీసులకి మైళ్ళ కొద్దీ అంచెలంచెల ప్రయాణం, ఇంటికి వచ్చాక కూడా అటెండ్ అవ్వాల్సిన కాల్స్, ఏవో టార్గెట్స్, ప్రాజెక్ట్ డెలివెరీలు అంటూ విపరీతమైన ఒత్తిళ్లు. ఇక పిల్లల్ని చదివించడం, స్పెషల్ కోచింగులకి పంపడం, వాళ్ళ టీచర్స్‌తో మాట్లాడడం, మమ్మల్ని చూసుకోవడం.. పాపం పిచ్చిది ఇంటా, బయటా కూడా అష్టావధానం చేస్తుంది. నిజం చెప్పాలంటే, వీళ్ళకి సంపాదించే శక్తి ఉందే తప్ప జీవితాన్ని అనుభవించే తీరికే లేదండి.” మా అత్తగారు అంటున్నారు.

“తప్పదు కదండీ, ఇద్దరూ ఉద్యోగాలు చేయకపోతే, పిల్లల చదువులు, తీసుకున్న లోన్ల బాకీలు తీర్చాలిగా మరి. ఆడవాళ్లు అన్నీ సమర్థించుకోవాలి.” నిత్య అత్తగారు అన్నారు.

“నిజమే అనుకోండి. అప్పట్లో కలివిడి కాపురాలు. మనం నలుగురిలో ఒకరిగా పుట్టాం. తలా ఓ పనీ చేసుకుంటూ కాస్తో కూస్తో చదువుకుని పెళ్లి చేసుకుని బాధ్యతలు నెరవేర్చాం. ఇప్పటి వాళ్లకి, మన పిల్లలయినా సరే, పెళ్లయ్యేవరకూ పుట్టింట పనులు చేయడం, నలుగురితో సర్దుకుపోవడం, పంచుకునే అవకాశమూ లేదు, అవసరమూ లేదు. అందుకే, అదితి వద్దు వద్దు అంటున్నా, నాకు చేతనైన పనులు నేను చేస్తాను. కూరలు తరిగి పెట్టడం, ఇద్దరాడపిల్లలు కదా, వాళ్లకి జడలేయడం, బడి నుంచి రాగానే తినడానికేదో చేసివ్వడం, బట్టలు మడత పెట్టడం ఇలాంటివి. అలసిపోయి ఇంటికొచ్చిన మన వాళ్లకి ఓ కప్పు కాఫీ చేసిస్తే ఎంత సంతోషిస్తారో కదా..!”

“చేసి చేసి ఉన్నాం. ఇంకా ఎక్కడ చేస్తాం ఆ చాకిరి? మీ సంగతేమో గానీ, నాకసలు ఆరోగ్యం బావుండడం లేదు. ఇప్పుడైనా కాస్త విశ్రాంతిగా ఉండాలని మనకనిపించదా చెప్పండి?”

“నా వరకు నాకు విశ్రాంతి అంటేనే చచ్చేంత భయం. మరీ మంచాన పడే పరిస్థితి రానంతవరకూ, చేతనయిన పనులు చేయకపోతే మనకు మనమే బరువైపోతామేమో అనిపిస్తుందండీ. వయసుతో పాటు అనారోగ్యం తప్పదు. ఎవరికైనా చెప్పుకున్నా, సానుభూతి చూపిస్తారేమో గానీ పంచుకోలేరు కాదా! వాళ్లకి మనతో అవసరం ఉండేలా చేసుకుంటేనే, ఈ వయసులో మనశ్శాంతిగా బ్రతకగలం.”

మా అత్తగారి మాటలకి నిత్య అత్తగారు సమాధానం ఏం చెప్పారో వినిపించలేదు నాకు. కబుర్లు చెప్పుకుంటూ, ఆముక్త ముద్దు మాటలు వింటూ భోం చేశాక. నిత్య వాళ్ళు వెళ్లిపోయారు.

***

“అదితీ! ఈ రోజు మా అత్తయ్య ఏం చెప్పారో ఏమో, సాకేత్ కూడా నాకు నవ్వుతూ పాప పనిలో సాయం చేశారు! ఆవిడే బ్రేక్‍౬ఫాస్ట్ కోసం పిండి పులిహోర చేశారు. మీ ఆంటీ ఎఫెక్ట్ అనుకుంటా. వస్తావా! షేర్ చేసుకుందాం” లంచ్ టైంలో వీడియో కాల్ చేసి అడిగిన నిత్య ముఖంలో మళ్ళీ పాత కళ కన్పించింది నాకు. మా అత్తగారికి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంటూ కేబిన్‌లో నుంచీ బయటికి వచ్చాను.

Exit mobile version