నివేదన

0
2

[box type=’note’ fontsize=’16’] కన్నడంలో మధురాకర్ణమ్ గారు రచించిన ‘సమర్పణె’ అనే కథని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు. [/box]

[dropcap]సూ[/dropcap]ది క్రింద పడ్డా వినిపించేటంత నిశ్శబ్దంగా వుంది ఆ సభ. ఆగ్రా లోని ‘దివానీ ఆమ్’ రాజభవనం గానలోకంలో తేలిపోతూ వుంది. సా… గ… మ… ధ… సా అనే ఆరోహణ, సా… ని… ధ… మ… గ… సా అనే అవరోహణల మధ్య హిందోళ రాగంలో తాన్‌సేన్ తన్మయత్వంతో పాడుతుంటే, అక్బర్ పాదుషావారి తల, దానికనుగుణంగా ఊపుతూ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వుంది. దర్బార్‌లో ఆశీనులైవున్న వారి ప్రవర్తన కూడా ఇందుకు భిన్నంగా లేదు. అయితే మునుపటికంటే, ఈ రోజు సంగీతంలో తాన్‌సేన్ ఓ మెట్టు పైకి వెళ్ళారనే శ్రోతల అభిప్రాయం. ఆయన నేత్రాల నుంచి ఆనందాశ్రువులు రాలుతున్నాయి. కాలాన్నే మార్చిపోయారందరూ. ఆ రోజు తాన్‌సేన్ పాడిన పాటలన్నీ, గురువు యెడ, గురుభక్తి యెడ భక్తి పూర్వకంగా పాడిన పాటలే. సభాసదుల కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. సభ ముగిసింది.

అక్బర్ పాదుషా అపారమైన తన మొచ్చుకోలును తెలియబరుస్తూ, తాన్‌సేన్‌ని, తన ‘దివానీ ఖాస్’కి ఆహ్వనించి, “తాన్‌సేన్… ఈ రోజు మీ గానంలో అతి మాధుర్యాన్ని చవిచాశాను. మిమ్మల్ని మీరే నివేదించుకున్నారు. మీరు పాడిన కృతులన్నీ గురువును స్తుతించుటతోనే జరిగిపోయింది. ఏమిటి ఈ దినపు విశేషత?” ప్రశ్నించారు. తన్మయత్తతతో లీనమైన తాన్‌సేన్, “జహాపనా! పన్నెండు సంవత్సరాల క్రితం, ఇదే రోజున నా గురువర్యులైన హరిదాస్ స్వామి వద్ద శిష్యత్వాన్ని స్వీకరించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ నా గానయానానికి చుక్కాని వారే. వారి జ్ఞాపకాలతో నేను ఉద్వేగ పూరితుడయ్యాను. నా కంఠంలో వారే ఆశీనులై నన్ను పాడించారు. నేను మీ ఎదుట కరతాళ ధ్వనులతోటి ప్రశంసల నందుకుంటున్నానంటే అది, వారు నన్ను దిద్ది తీర్చటంలో పడిన అపార పరిశ్రమయే. హుజూర్ అల్లాంటివారు నాకు గురువుగా లభ్యమవటం నా పూర్వజన్మ సుకృతం” అని చేతులెత్తి నమస్కరించాడు.

కుతూహలం ఎక్కవయింది అక్బర్ పాదుషాకి. “తాన్‌సేన్ మీ గురువుగారు చాలా అద్భుతంగా పాడుతారనుకుంటా” అన్నారు. తాన్‌సేన్ చిరునవ్వుతో “అందుకు సందేహమా జహాపనా, వారి సంగీతం సాగరంలాంటిది. అందుండి చేదుకున్నది నేనో రెండు దోసిళ్లు మాత్రమే. వారి నివేదాత్మకత, సమర్పణాభావం నాకెక్కడిది హుజూర్. వారి సంగీతాన్నొక్కసారి వింటే చాలు, దివి భువికి దిగవచ్చినట్టే. అభ్యాస సమయంలో, వారి గానాన్ని ఆలకిస్తూ మమ్మల్ని మేమే మరచిపోయేవాళ్లం. వారు హెచ్చరించినప్పుడే, దిగివచ్చి స్వరాన్ని ఆలపించేవాళ్లం…” అని తాన్‌సేన్ గురువుగారి గురించి వ్యాఖ్యానిస్తూ వుంటే, ఇంకా ఇంకా వినాలనే తమకమే అక్బర్ పాదుషావారికి. తాన్‌సేన్ తన గురువుగారి కడ చేసిన సంగీత సాధనని చెబుతూ వుంటే, లీనమై వింటున్నాడు పాదుషా.

“యమునా తటిని సుందరనగరం బృందావనం. వేకువనే, కోడి కూతకు మునుపే గురువుగారి తోటి యమునకు వెళ్లే వాళ్లం. అక్కడే స్నానం, అక్కడే ప్రథమ రాగాలాపన. చలిలో, వణుకుతూనే ఆలాపన… గురువుగారు తమ సంధ్యావందనం, ఆరాధ్యదైవమైన కృష్ణభగవానుని పూజ పూర్తి అయ్యేవరకూ మా రాగ – గాత్ర శుద్ధి నడుస్తూనే వుండేది. అనంతరమే అభ్యాసం. కాలాతీతమైనా, స్వరం… తానంలో లీనమై పోయేవాళ్లం. గురువుగారి వాత్సల్యం అందరి మీద సమానంగా ఉండేది. శిష్యుల మధ్య ఎల్లాంటి మనఃస్పర్థలూ ఉండేవి కావు. స్వచ్ఛంగా ఉండేవి అందరి మనసులూ. అందరూ సంగీత జ్ఞానాని కోసమే ఆరాటపడుతూండేవాళ్లమే. సాధన, కఠిన పరిశ్రమే మాది. గురువుగారి కృష్ణ కీర్తనలను వినడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. ఆయనంటే పడని వారు కూడా మారు వేషాల్లో వచ్చి కూర్చుని విని ఆనందించి వెళ్లిపోయేవాళ్లు. ఆయన పాడుతూంటే ఆ కృష్ణ భగవానుడే సాక్షాత్ ఎదురుగా వచ్చి నిల్చినట్లుండేది… అలా…” తాన్‌సేన్ వారి వర్ణనకు అడ్డులేకపోయే, అక్బర్ బాద్‌షా మధ్యలో కలుగజేసుకోక పోయినట్లయితే. “తాన్‌సేన్ మీ గురువుగారిని ఓసారి ఇక్కడికి ఆగ్రాకు ఆహ్వనించవచ్చు గదా! బంగారు మేనాలో, అసంఖ్యాక ఆభరణాలతో, కానుకలతో ఆయనను సత్కరించి…” అంటూ తాన్‍సేన్ ముఖాన్ని చూసాడు బాదుషా. చిరునవ్వుతో అన్నాడు తాన్‌సేన్ “అల్లాంటికి వాటికెల్లా వారు లొంగరు ప్రభూ” అంటూ మాట మార్చటానికి ప్రయత్నించాడు. ఊహు అక్బర్‌కు అదే ధ్యానమయినట్లు “మేం ఆయన గానామృతాన్ని ఆస్వాదించటమెలా? తాన్‌సేన్”  అక్బర్ మాటల్లో ఆతురత ధ్వనించింది.

“ఖావంద్… ఆప్…” అని ఆశ్చర్యంతో… ప్రశ్నార్థకంగా తన్ను చూసినప్పుడు అక్బర్… “అవును తాన్‌సేన్ అవును… నీ రాగాలాపనలోనే ఇంతటి మాధ్యుర్యమున్నప్పుడు… ఆయన నీకు విద్య నేర్పించినవారు… వారి కంఠమాధుర్యం… వారి కంఠమాధుర్యాన్ని చవి చూడాలని చాలా తమకంగా ఉన్నా తాన్‌సేన్. ఇది నా కోరిక, ఒక్కసారి వారిని ఆగ్రాకు పిలిపించలేవా… ” అతడి కంఠస్వరంలో ప్రాధేయత ధ్వనించింది.

“లేదు జహాపనా, వారు బృందావనం విడిచి ఎక్కడికీ రారు. వారు ఎవరి కోసమూ పాడరు. వారి నివేదన అంతా తన ఆరాద్య దైవమైన కృష్ణ భగవానుడికే.” అని నిరాశజనితమైన జవాబు తాన్‌సేన్ నుండి.

“రాజుగా ఆజ్ఞాపిస్తే…” గంభీరమయింది అక్బర్ కంఠం.

“అలా చేస్తే, వారు తమ ప్రాణాలనైనా అర్పిస్తారే తప్ప, కృష్ణుడి ముందు తప్ప ఇంకెవరి ముందు పాడరు జహాపనా”

ఓ రెండు క్షణాలు వారిద్దరి మధ్యా మౌనం రాజ్యం చేసింది. క్లిష్ట పరిస్థితి ఏర్పడింది తాన్‌సేన్ కిప్పుడు… “మా కోసం… వారికో విశేషమైన వినతిని…”

“హుజూర్, ఎన్నో ఏళ్ళుగా వారి వద్ద శిష్యరికం చేసిన మాకు వారి స్వభావం, ఇష్టాఇష్టాలు, కోపతాపాల పరిచయం అనుభవైకవేద్యమే. వారెంతటి శాంతమూర్తులో అంతే స్వాభిమానం కలవారు. ఇప్పటి దాకా వారు నియమాన్ని తప్పలేదు. అందుకొఱకు అక్కడే వారు ఆశ్రమాన్ని నిర్మించుకొన్నారు. ఏమైనా అంటే వారికి తెల్సింది రెండే – ఒకటి దైవారాధన, రెండు శిష్యులకు విద్యాదానం. వజ్ర వైఢ్యూర్యాలు, రాజమర్యాదలు ఇవన్నీ వారికి తృణప్రాయం. అందుకే మిమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నా” అని నివేదించుకున్నాడు తాన్‌సేన్.

అయితే అక్బర్‌లో సంగీత దాహం ఎక్కువవుతూనే వస్తోంది. అది శమనమయ్యే సూచనలు గోచరించటం లేదు.

“వేరే దారేదైనా ఉండాలి కదా తాన్‌సేన్” అని తాన్‌సేన్ వైపు తీక్షణంగా చూశాడు. తాన్‌సేన్ ధీర్ఘంగా ఆలోచించి, భయంతో కూడిన వినయంతో ఇలా అన్నాడు.

“ఒకే ఒక దారి వుంది ప్రభూ – వేకువనే లేచి, వారి ఆశ్రమానికి వెళ్లి, కృష్ణ పూజాసమయంలో వారి సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. అయితే…”

“అయితే…” అడిగాడు పాదుషా ఆదుర్దాగా.

“మీ రాచకార్యాల మధ్య తమకి తీరిక ఎక్కడిది ప్రభూ.”

“తీరిక… కల్పించుకుంటాం. నా కోర్కె నిమిష నిమిషానికీ ప్రబలమయిపోతున్నది తాన్‌సేన్. ప్రయాణానికి ఏర్పాటు చేయించు శీఘ్రంగా… అయితే ఈ విషయం మననిద్దరికీ తప్ప ఎవ్వరికీ తెలియరాదు. గోప్యంగా వుంచాలి.”

అంటూనే నిష్క్రమించారు పాదుషా. ఓ దీర్ఘమైన నిట్టూర్పును వదిలాడు తాన్‌సేన్. తన గురువు గారిని గురించి తాను గొప్పగా చెప్పినదే తప్పయిపోయింది అనుకున్నాడు. అయితే చేయగలిగిందేమీ లేదు. అంతా చేయి జారిపోయింది. ఇప్పుడు బాదుషావారికి బృందావన దర్శనం చేయించక తప్పింది కాదు.

బృందావనం ఆగ్రా నుంచి ఎక్కువ దూరమేమి లేదు. ప్రయాణం అజ్ఞాతంగానే ప్రారంభమయింది. వాహనాల నధిరోహించక, సామాన్య అశ్వారోహుల వలె వెళ్ళారు పాదుషా తాన్‌సేన్ వెంటరాగా. సామాన్య పౌరుల వేషాలలోనే ఇద్దరూ వేకువనే ఆశ్రమాన్ని చేరడానికి బయలుదేరారు. ప్రకృతి నిశ్శబ్దంగా వుంది. ఆశ్రమ సమీపాన జింకలు, కుందేళ్లు, మరి ఇతర ప్రాణులన్నీ నిరాటంకంగా విహరిస్తున్నాయి. యమునా నదీ తరంగాల సవ్వడి వినటానికి హాయిగా వుంది. ఆశ్రమవాసులప్పుడే అటూ ఇటూ తిరుగుతున్నారు, పూజకు సిద్ధమవుతున్నట్లుగా. ఎప్పుడూ లేని సంతసం అక్బర్ ముఖంలో. జనసమూహం అంతగా లేదు. అప్పటికప్పుడే ఆశీనులైన వారి మధ్య, అక్కడ పరచిన చాపలపై ఇద్దరూ కూర్చున్నారు. చలి కోసం కప్పుకున్నట్టుగా, తమ శాలువాలని శరీరం నిండా కప్పుకున్నారు. రెండు కన్నులను మాత్రం మినహాయించి.

తాన్‌సేన్ గురువైన హరిదాస్ గారు వయోవృద్ధులైయున్నారు. అయినా మఖంలో తేజస్సు మూర్తీభవించి వుంది. అనుశ్రుతంగా వస్తున్న ఆశ్రమ నియమాల అనుసారంగా కృష్ణ పూజా కార్యక్రమం ప్రారంభమయింది. గురువుల సూక్ష్మ దృష్టికి, ప్రేమ, భక్తి, ఆశ్రువులతో నిండిన కళ్లు రెండు గోచరించినై. తన ప్రియశిష్యుణ్ణి గుర్తించడానికి ఆ రెండు కళ్లు చాలు. అయితే తన్ను కలువక, అందరి మధ్య ఎందుకు కూర్చున్నాడో తెలియక ఆశ్చర్యం వేసిన గురువులకు, తన ప్రక్కనే రాజఠీవి తోటి కూర్చున్న తీరు, దుస్తుల మరుగున నడుములో దోపుకున్న కత్తి గోచరించి, ఆతడెవరైనదీ గురువుగారికి తెలిసిపోయింది. చిన్నగా నవ్వి, సంగీతం వినడానికి ఇక్కడికి వచ్చిన వారందరూ కృష్ణ భక్తులే అని అనుకొని, అహిర్ భైరవీ రాగాన్ని అందుకున్నారు, శిష్యుని రాకను విస్మరిస్తూ.

నాదలహరి అలలు అలలుగా ప్రవహిస్తూ ఉంటే భక్తులందరూ తన్మయత్వంతో ఊగిపోతున్నారు. పాదుషావారు తమ ఉనికినే తాము మరచిపోయారు. యమునా తోటలో గోపికలతో గూడి కృష్ణడు నాట్యమాడుతున్నట్టే అందరి భావన. తమను తాము మరచిపోయి ఏవో లోకాల్లో విహరిస్తున్నారందరూ. తాన్‌సేన్, పాదుషావారూ అందుకు భిన్నంగా లేరు. ఎంతో కాలం తర్వాత గురువుగారి సంగీతాన్ని ఆలకిస్తూ ఉంటే ఆనందశ్రువులు పొంగిపోర్లాయి. అక్బర్ పాదుషా విషయం చెప్పనక్కరేలేదు. “అల్ బేలా… సజనా ఆయో ఆయోరే” అని పాట సాగుతూంటే, నియంత్రణకు సాధ్యంకాక, అక్బర్ పాదుషా “సుభానల్లా… క్యా బాత్ హై” అని పైకి అనేయటంతో, తాన్‌సేన్ ఈ లోకంలోకి వచ్చాడు. సమ్మోహక తోటి రాగంతో ముక్తాయింపుకు వచ్చనప్పుడు “అయ్యో! అప్పుడే ముగిసిందా” అని నిరాశపడ్డారందరూ. అక్కణ్ణుంచి లేచి వెళ్లిపోవటానికి మనసొప్పటం లేదు. అయితే వెళ్లక తప్పింది కాదు. వెళ్లలేక వెళ్లలేక ఇద్దరూ లేచి వెళ్లారు.

అశ్వాలు పరుగెత్తుతున్నాయి. గురుదేవుల సంగీతం వాళ్ల చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తునే వుంది. అక్బర్ అన్నాడు “నీవన్నది అక్షరాలా నిజం తాన్‌సేన్. వారి సంగీతం ముందు నీ సంగీతం రసహీనమే. పిండేసిన చెరుకుపిప్పి లాంటిదే.”

ధన్యతా భావంతో అన్నాడు తాన్‌సేన్, “నేనిదివరలో మీకు విన్నవించుకున్నా కదా హుజూర్ – వారు నా గురువులు. నేనింకా వారి శిష్యుణ్ణేనని.” అంటూ గురుదేవులను మనసారా స్మరించుకున్నాడు. నిరాశాభావంతో అక్బర్ “మేము నీకేం తక్కువ చేశాము తాన్‌సేన్? మీ గురుదేవుల భావ తీవ్రత సంపూర్ణత మీకెందుకబ్బ లేదు” అడిగాడు. చిరునవ్వుతో సమాధాన మిచ్చాడు తాన్‌సేన్ “ప్రభూ నా సంగీత నివేదన నా ప్రభువుకి – అంటే మీకు, అయితే గురువుగారి నివేదన జగత్ప్రభువైన ఆ కృష్ణునకి.”

అజ్ఞానపు పొర వదిలింది పాదుషా వారికి.

కన్నడ మూలం: మధురాకర్ణమ్

అనువాదం: కల్లూరు జానకిరామరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here